top of page
శ్రీ యాదాద్రి నరసింహ శతకము
(తే.గీ.)

1*

శ్రీ రమానాథ! విశ్వేశ! చిత్ర సింహ!

సకల లోకాలు పాలించు శాంతమూర్తి!

కరుణ జూపియు మముబ్రోవు కంజనేత్ర!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

2*

విశ్వరూప! విశ్వంభర! విష్ణుదేవ!

సర్వ సిద్దిప్రదాయక! స్తంభ జాయ!

ఆదరించి రక్షించు ప్రహ్లాదవరద!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

3*

శ్రీ సుదర్శన నరహరి వాసుదేవ!

భక్తవత్సల పరబ్రహ్మ! పద్మనాభ!

వైద్యనారాయణా వేదవేద్య! శౌరి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

4*

దీనజనబాంధవా! హరిదివ్యతేజ!

నిఖిలభక్తజనరక్షక! నీరజాక్ష!

ధర్మమునునిల్పు శ్రీచక్ర దారి! విష్ణు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

5*

మంచి పుణ్యము, చెడుపాపమగును భువిని,

చెడునుదొలగించి దీనుల సేదదీర్చు!

భద్రతా భావమును గూర్చు రౌద్ర మూర్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

6*

నాటిదేవదానవయుద్ధ నాటకంబు –

మంచిచెడు పాత్ర లనుజర్గు మరొకపేర –

దర్శకుడ వీవె! తుద కాత్మ దారి ముక్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

7*

మంచివర్తన విలువేది? మానవాళి-

-చెడుసమర్థన కలికాల చేష్ట సాగె,

మంచి వాదన దారిద్య్ర మార్గమాయె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

8*

ధర్మ సంస్థాపక! దశావతారమూర్తి!

శిష్ట మైత్రి భక్తిని మెచ్చు, దుష్టవైరి!

భక్తియోగుల దరిజేర్చు ముక్తిదాత!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

9*

బాల్యమునభక్తితోనెడ్ల బండి బాట,

వచ్చిగొలిచిరి తలిదండ్రి వారివెంట,

కొడవటంచకు ప్రతియేట గొలువ వస్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

10

బాల్య మేగినా కొలదినీభక్తిగుదిరె –

యువతమెదిలినాకొలదినీ యునికి దెలిసె!

ప్రేరణయుగూర్చె నీదివ్యప్రేమశక్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

11*

ఆత్మతత్వంబు దెల్పిమమ్మాదరిoచు!

అంతరాత్మలోనీరూపు నరయదెలుపు!

భక్తిదారిలో నానంద బ్రహ్మమొసగు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు![

12*

పశువునుండివేరగు ధర్మబాటనడిపి~

మంచిమర్యాద జీవితం మాకొసంగి-

మానవత్వంబుదీపింప మమ్ము బ్రోవు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

13*

నూత్నకణసృష్టిచే దొల్గుమృతకణాలు!

బాల్య యవ్వన జరలదేహాలుమారు ~

దేహములు, జన్మలీ యాత్మ గేహగతులు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

14*

కొడుకు తనశత్రు భక్తుడై కోరికొలువ!

గురులదూషించె కసిపుండు క్రూరుడయ్యె!

పెక్కు శిక్షల హింసించె నొక్క కొడుకు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

15*

బాలప్రహ్లాదు హరిభక్తి బాపలేక –

క్రోధి కసిపుండు మిక్కిలి కోపగించె!

తననె పూజింప శాసించె తమరి గుడుల!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

16*

నిఖిల లోకాలు గాలించె నిన్నుగనక –

విసిగి, వేసారె, నామాట వినుమటంచు,

పుత్ర వాత్సల్యమున తండ్రి బుజ్జగించె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

17*

కొడుకు మార్చగ, పలుమారునోపి జెప్పు-

తండ్రిమార్చగా తనయుని తత్వబోధ!

ఎవరిమాటలువారివే ఎవరువినరు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

18*

లేని హరికయి స్మరణేల? తనయ!

గురువుకే నామమునుబెట్ట గొప్పతనమ?

తండ్రిమాటపాటింపని తనయుడేల!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

19*

శత్రు భక్తుడు పుత్రునిసైపలేక –

నంతకంతకు క్రోధంబు నధికమయ్యె!

తానె కడతేర్చగాబూనె తండ్రి కడకు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

20*

సోదరాంతకుడరియని క్రోధమొంది-

మన్నుమిన్నులు శోధించి, మడిసెననుచు-

మాటవినని పుత్రునిమార్చు బాటవెదికె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

21*

మాట పట్టింపులాత్మీయ బాట గనవు,

కపటి- వరగర్వి-కశిపుండు కఠినమతియు,

తనకు నవమానమనియెంచె, తనయు భక్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

22*

విధిగ తనపూజ బోధింప వినని వాని

లేకలేక గల్గిన సంతు నేకపుత్రు!

శత్రుసమునిగా నెంచెను శత్రు భక్తు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

23*

పైమెరుంగులకే భ్రమ పడెడువారు,

తేల్చి జెప్పినా లోగుట్టు దెలియ లేరు!

అహమె తమగొప్పగా నెంత్రు, అహరహంబు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

24*

భక్తి రహితుడై ప్రహ్లాదు బాధ పెట్టు,

వానియింట జన్మించి దైవాస్త్ర మట్లు-

నిత్యవేదన గలిగించె నీదు భక్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

25*

చెక్కు చెదరక బెదరక పెక్కు శిక్ష,

లోర్చు పుత్రు మార్చదగు నాలోచనొకటి,

గలుగ హరిజూపుమని యడ్గె కశిపుడపుడు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

26*

అంతటనునిండె హరియనంతనిలయు,

డిందుగలడందులేడను సందియంబు-

లేదు, హరిభక్తి యునులేక లేదు ముక్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

27*

ఎదురుపడి రాడు నీహరీ-వెదక వృధయె!

డింభకా హరిజూపు మీకంబమందు,

జూపకున్నజంపెదనని కోపగించె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

28*

బుద్ధి నశియింప నీతత్వ బోధ వినునె?

దాపు కంబంబు జూపగా దైత్యుడంత!

పెద్ధ గదమోదె, దిక్కులు పిక్కటిల్ల!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

29*

ఒక్క పెట్టున స్తంభంబు ముక్కలయ్యె!

నురుముమెరుపుల లోకాలు నులికి పడగ-

నుర్వి నుద్భవించితివహో! ఉగ్రమూర్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

30*

ఘోర వరగర్వి, తనమది గోరినట్లు –

దునుమదగు రూపు దాల్చిన దురితదూర!

నీచు జీల్చి ప్రహ్లాదుని గాచి నావు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

31*

వేగ భీకరాద్భుతరూపు వెడలిరాగ,

పారజూచియు కశిపుండు పారిపోయె

పిరికి దరిమి జంపితివహోబిలముజొచ్చి

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

32*

బాలమొదలు బ్రహ్మాదులు భయముజెంద

నుగ్రరూపంబు గనలేక నుపశమింప

జేయప్రార్థింప లక్షివేంచేసె నంత!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

33*

జీవశక్తివి-పరమేశ! దివ్యతేజ!

కనకనేత్రుడు కశిపుండు గనిరి ముక్తి,

పిదప నీ ద్వార పాలన విధిని గొనిరి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

34*

చావు దప్పించుకొనజూచె కావు మనక!

వరము కొలది రూపమునెత్తి, వానిద్రుంచి,

యుగ్రమూర్తివై తిరిగితో – ఉర్వినంత!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

35*

శ్రీ మహాలక్ష్మి నరసింహ చిన్మయేశ!

సాదరమున వెలయగోరె యాదమునియు!

శాంతమూర్తివై నెలకొన్న సాధు హృదయ!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

36*

పుట్టు ప్రతి జీవి – పుడమితాగిట్టుకొఱకె!

ఆత్మ గృహములీ దేహాలు నంతరించు!

రక్తి వీడినాత్మకె జన్మరహితముక్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

37*

ఖలుడు దైవమెట్లగు – పాపి కావరమున,

తనకె గుడిపూజలని చాటె తనయువిడక,

పెక్కు శిక్షలపాల్జేసె, కడకు మడిసె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

38*

మరణభయమొక్కటే వాని మనసు దొలిచె!

శత్రు శేషంబుగా పుత్రు జంపనెంచె,

కొడుకు కోసమైనను నిన్ను గొలువడాయె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

39*

చెడుగు దైత్యుల నిర్జించి చేటుబాపి,

మంచివారల మన్నించు మాధవుండ!

మానవ చికిత్సాభిమతమె మహిత భక్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

40*

వేడ్కగూర్తువు సద్భక్తి వేడుకొనగ,

వేదనలు బాపి బ్రోతువు సేద దీర్చి!

పంచనరసింహరూపుల ప్రాభవమున!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

51*

నోట పల్కరింతయెగాని నొసట వెక్కి-

రింతయు స్ఫురించు కపటి రీతి మనిషి

వెనక దూషణలొకనాడు వెలుగుజూచు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

52*

పరుల దిట్టుటకలవాటు పడిననోరు

తిట్టు తనవారి నైనను స్థిమిత పడక

సంయమనములేకను సుఖశాంతి లేదు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

53*

ఋష్య శృంగ పుత్రుడు యాద ఋషియు బూని

మారుతినివేడె తగు గుట్ట మార్గమెరిగి

తపముచే నిన్ను మెప్పించె తనివిదీరె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

54*

యాదముని తపస్సుకు మెచ్చి సాదరమున

కోర్కె దీరగా వరమిచ్చి కొండపైన

వెలసియుంటివి ఇహలోకమేలుకొఱకు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

55*

యాదముని పేర యాదాద్రి యాదగిరిగ-

గుట్టగా నామ ప్రఖ్యాత గుడియు వెలిగె!

మూర్తియారాధనా క్షేత్రముగను నిలిచె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

56*

జ్వాల నర్సింహమూర్తిగా జనులు గొలువ

రెండు రాతిపల్కలమధ్య నుండునుగ్ర-

మూర్తిగానిన్ను పూజింత్రు రార్తజనులు!

స్వామినర్సింహ! యాదాద్రిసదన శరణు!

గీ*57

నవగిరీశ్వరా – శ్రీలక్ష్మి నారసింహ!

నిన్ను నమ్మినవారికి నిత్యయశము!

దుష్టశక్తులబాధలు దూర మగును!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

గీ*58

ఉర్వి దుష్టుల ననచగా నుగ్రమూర్తి!

సాదుజనుల రక్షించు ప్రసన్న మూర్తి!

నయముజయమిచ్చు శ్రీలక్ష్మి నాథ బ్రోవు

స్వామి నరసింహయాదాద్రిసదన శరణు!

గీ*59

గంఢబేరుండ నర్సింహ! గావుమనుచు

దేవ దివ్యయోగానంద తేజ యనుచు

పంచమూర్తుల కీర్తింత్రు భక్తజనులు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

గీ*60

గురుడు భృగుని సద్బోధపై గురియుకుదుర,

చక్కగా సహస్రానీక చక్రవర్తి-

మొదట నినుజేరి పూజించె ముక్తినొందె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

61*

నిన్ను సేవింప కష్టముల్ నిమ్మలించు

నిన్ను నమ్మియు ధ్యానింప నిత్యశాంతి

స్వస్థతయు గూర్చు తీర్థ ప్రసాద మహిమ!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

62*

ఎన్నిలీలలు మహిమలు యెన్నికథలు!

ఎంత సందడి-సంబరమెంతశోభ!

లెక్కకునుమించె భక్తుల మ్రొక్కుబడులు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

63*

మెట్లదారి శివాలయమెడమ వైపు

పార్వతీ రామలింగేశ ప్రభుడు వెలసె!

పుష్కరిణికెదురు పవనపుత్ర నెలవు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

64*

పవన పుత్రుడు నీక్షేత్ర పాలకునిగ

పాత క్రొత్త గుడులసాగు భక్తి భజన-

వెలుగు విద్యుత్తు దివ్వెలేవేళనైన!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

65*

భక్త జనపక్ష పాతివై భద్రతొసగి-

దుష్ట బుద్ధుల రౌద్రివై దుడుకుమాన్పి-

దారిజూపించు పూర్ణావతారమూర్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

66*

శాపగ్రస్తులు నినుజేరి సన్నుతింప

ద్వారపాలకులనుబ్రోవ వారియిచ్ఛ

దెలిసి వరమిచ్చి బ్రోచిన దేవదేవ!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

67*

ఏడుజన్మలమైత్రియు యెడముగాగ

మూడుజన్మల శత్రుత్వమునువహింప

బుట్టి లోకకంటకులైరి పుడమి యందు

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

68*

శూర కనకాక్షు, కశిపుల క్రూరమతుల

ఘోర హింసాత్మకుల ద్రుంచి కోర్కె దీర్ప

సాధు సజ్జన లోకాలు సంతసించె

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

69*

ధరణి జుట్టివచ్చియు హింసదారిలోన

కడలిముంచెత్తగా, కనకాక్షు దునుమ –

వేగ నాది వరాహమై వెలసినావు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

70*

నీదు రూపు వీక్షింప, ప్రహ్లాదుడడగ

నట వరాహనృసింహుగా నవతరింప

తేజరిల్లె సింహాద్రియు దేవదేవ!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

71*

విధులు బాధ్యతలును దెల్పి వినయమొప్ప

మనసుగల్గి జీవించాలి మానవాళి

గాక! నరరూప దైత్యులే కలియుగాన!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

72*

రక్తి దుష్కృత బాటలో రయమొనర్చు

భక్తి సుకృత దాయక బాటనడుపు!

ముందు వెనక జన్మలపుణ్యమున్న ముక్తి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

73*

నవత వెఱ్ఱితలలు వేయు నడతలెల్ల-

భ్రాంతిగొల్పు, మది సుంతశాంతి నిడవు!

పాత పుత్తడి పెద్దల బాట పుడమి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

74*

జన్మ నిత్యముగాదిది జలధి బుడగ!

ఆత్మ శాశ్వతమౌ జన్మలధిగమించు!

సత్యవ్రతజీవనమె జేర్చు సద్గతులకు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

75*

తెల్ల బియ్యాల పిండితో తెగులు గలుగ-

తౌడు బలవర్థకౌషద దారిసాగె!

నాగరిక పథ్యమీనాటి నాటు సరుకు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

76*

తుష్టి పుష్టి గూర్చని తిండి నిష్ట పడుచు-

దోచు దాచు వారాడుదోబూచులాట!

సాగినంతకాలము సాగు సంత బ్రతుకు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

77*

భోగములు భువి మృగతృష్ణ బోలు రుచులు!

రోజురోజుకు రుజలు పురోగమించు!

భక్తియోగ పూర్వకమైన బ్రతుకు మేలు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

78*

సిరులు జేరు కొబ్బరి నీరు జేరునట్లు-

లేమి క్రిమిమింగినవెలగ సామెతగును!

ధరణి కష్టసుఖాలు

తాత్కాలికములు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

79*

అన్నిగావలె ననుకొన్న సున్న శాంతి!

పరగ నున్నంతలో తృప్తి పడుట మేలు!

భక్తి రహిత జీవన దారి భ్రాంతిమయము!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

80*

తృప్తిమాటేది, సత్ఫలప్రాప్తిలేక?

సుఖముమాటేది, నీధ్యాన సుఖముగాక?

శాంతి మాటేది, భక్తి ప్రశాంతి గాక?

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

81*

రాత్రిపగలమవాస్య పూర్ణమియుగల్గు!

దారి పుష్ఫ, కంటకమగు తారుమారు!

కాలమొకతీరు గడుపగా గలుగు వృద్ధి!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

82*

చెడును వదలక మది నిన్ను చేరుటెట్లు?

ఆశ వీడక నాత్మనిన్నరయుటెట్లు?

చిత్తమెట్లు నిస్వార్థపు చిగురుతొడుగు?

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

83*

ప్రేరణయునీదె సర్వత్ర ప్రేమనీదె!

విశ్వప్రాణశక్తియునీవె! విధివినీవె!

శ్వాస నిశ్వాస భక్తివిశ్వాసమీవె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

84*

ఎన్నిమార్గాలు, గురుదేవులెందరిలను?

ఎన్నిబోధలు, తరియింప నెన్నిగతులు?

కలుగు నన్నియు జేర్చు నీగమ్యమునకు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

85*

చదువు సంస్కారములు గల్గి సాగుభక్తి!

మార్గ శోధన- బోధన-మార్పు-చేర్పు!

తీర్పు నీదగు తుద ముక్తి తీరమునకు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

86*

తాను మారి తదితరులు మార్చు క్రియలు

విశ్వసింతురు లోకులు విషయ చర్ఛ!

సత్యమేనీవుగా భక్తి సాగుచుండు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

87*

సందియము గల్గు సేవలు నిందితములు!

నమ్మకములేని భక్తియు నయము గాదు!

పుణ్యలబ్ధియే లోకుల పూజ-ఫలము!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

88*

స్వార్థపరుల జీవితము నిరర్థకంబు!

పరువు నష్టము-పాపము-పరులసొమ్ము!

ధాతగాబ్రతికిన జన్మ ధన్యమగును!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

89*

పూలు ఫలపత్రములు నీళ్ళు పూజనిధులు

తులసి తీర్థప్రసాదాలు తుష్టిపుష్టి,

స్వస్థతయుగూర్చు నీభక్తి శాంతిప్రదము!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

90*

విశ్వసింపక దెలియదు విశ్వప్రేమ!

ప్రేమబంచుటే యుత్తమపేరు కీర్తి!

స్వార్థ రహితముగావలె స్వార్జితంబు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

91*

నిధులు నాస్తిపాస్తులు వృధా, నీదు భక్తి!

పూర్ణమాధ్యాత్మికంబులే పుణ్యనిధులు!

స్వార్థమునువీడితే దు:ఖసర్వముడుగు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

92*

భక్తిలేకున్న తదితరభక్తి సున్న!

సంతతిని తీర్చిదిద్దక చక్కబడదు!

కన్నవారి ప్రాప్తము జేసుకొన్నఫలము!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

93*

సృష్టి ప్రేమమూలకవృద్ధి స్రష్ట వీవె!

ప్రేమ విశ్వరూపమె సృష్టి ప్రేరణొసగు!

ధనముకన్న నీధ్యాన సాధనము మేలు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

94*

దాచనేర్చినదాదిగా ధరణి నరులు,

దానమే తపమనుమాట దలపరైరి!

దోచువారలు నిన్నైన దోచువారె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

95*

మొదట నీవుపాదంబును మోపినట్టి,

చోట పాతగుడినిగాంచి చోద్యపడుచు

మక్కువగ నిన్నుపూజించిమ్రొక్కుచుంద్రు

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

96*

పిదప విష్ణుకుండము ప్రీతి నందు-

స్నానమాచరింతురు పాప సర్వముడుగ

పూర్ణ బ్రతుకులారోగ్యమై పులకరింప!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

97*

గుండమున విష్ణు చక్రంబునుండు కతన

నీటమునిగితే చాలు పునీతమనుచు-

నమ్ముచుందురు, నీభక్తి సమ్మతమున!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

98*

వసతి గృహసముదాయముల్ వరుసనుండ-

అవసరవస్తు సంతలు-అతథి సేవ!

పరగ విద్య-వైద్యాది యేర్పాట్లుగలవు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

99*

సత్ర నిర్మాణములు నింక – సకలవసతి!

పరగ గుడివిస్తరణ సాగె ప్రభుత నిధుల!

పనులు పూరింప తగురీతి పథకరచన!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

100*

చుట్టు గుడులు గుట్టలు భక్తిజూడదగిన

చోట ఫలపత్రపూజ పూదోటలుండె!

రాకపోక రవాణయే రాత్రి బవలు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

101*

మోదమిచ్చు జయంతి బ్రహ్మోత్సవాలు!

నిత్యకైంకర్యములు, భక్తి నియమనిష్ఠ!

మహిని వైకుంఠమై క్షేత్రమలరు చుండు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

102*

భక్తి పద్యంబువ్రాయుట భాగ్యగరిమ!

తీపి తెలుగు బోధించు తిరుణహరి ని,

సత్యనారాయణుడ దేవ! నిత్య సేవ్య!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

103*

ముందె యర్పించితిననిభక్తి ముప్పదారు

వరుసనారు శతకములు వ్రాయుచుంటి!

విఘ్నదోషాదులెడబాపు విజిత దనుజ!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

104*

చదువ కళ్ళకారోగ్యము మెదడు పదను

గలుగ గ్రంథప్రదర్శనల్ – ఘనతకెక్కె

భక్తి శతక కావ్యము చేత ప్రతిఫలించె!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

105*

ప్రజలె రాజుపోషకులైరి – భక్తి శతక

కవిత వారికోసమె సాగె – భవిత వెలిగె!

వచ్చె డిజిటలచ్చులు ఖర్చులెచ్చె నేడు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

106*

కలుగు బాధలు వ్యాధులు కడకుద్రోసి

పోటి వాద వివాదాల పోరునణచి,

భక్తి నావలో దరిజేరు బ్రతుకు నొసగు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

107*

తప్పులు క్షమార్హము భక్తి నొప్పుకృతుల!

చెఱుకు వంకర బోయిన చెడదు తీపి!

అంకితము నీకె, నిరాటంకముగను!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

108*

శుభము శతకపాఠకులకు సుఖము శాంతి!

శుభము సాధు సజ్జనులను నభయ ప్రదము!

శుభము భారత జాతికి – శుభము శుభము!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు! **’

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page