top of page

వాసుదేవశతకము

(ఆ.వె.)
1*
శ్రీ రమణి మనస్సరోరుహాంతరచర!
విశ్వమంగళకర! విష్ణుదేవ!
భక్తవత్సల! పరబ్రహ్మ! గీతాచార్య!
వావిలాల వాస! వాసుదేవ!

2*
నీదు కృపయుగల్గ నిఖిలంబు సమకూరు
దు:ఖఝరులు తరుగు దురితదూర!
నిశ్చలాత్మవెల్గు నీవిశ్వరూపంబు,
వావిలాలవాస! వాసుదేవ!
3*
కలను వెలిని నీదు కరుణామృతము గ్రోలి
కాంక్షదీర భక్తి కవితలల్లి
నీదులీలలెన్న నిత్యసంతోషంబు
వావిలాలవాస! వాసుదేవ!
4*
కల్మికాలమందు కల్లనిజంబనీ
కొంటెమనసు భక్తి కొల్లబోవు
కానికాలమందు కలవరించును నిన్నె
వావిలాలవాస! వాసుదేవ!
5*
బాల్యమందు నీదు భక్తి కథలు వింటి
గుడికి బడికి నడచి గురువునరసి
కాంక్షదీర నిన్ను గాంచ యత్నించితీ
వావిలాలవాస! వాసుదేవ!
 
6*
కోర్కెలిచ్చిబ్రోవు గోపాలనీలీల
నికషయయ్యె! బ్రతుకు తికమకయ్యె!
నూరువాడ వేయినోరుల పొగడంగ
వావిలాలవాస! వాసుదేవ!
7*
కనులపండుగ నినుగనినంత సద్భక్తి
భజనసేయ చెవుల పండుగేను
మనసుకింపు సొంపు మాధవా నీపాట
వావిలాలవాస! వాసుదేవ!
8*
మంచి మార్గమునకు మళ్ళించు నీసేవ
మానవాళిసేవ మరొకపేరు
గాగ జీవితంబు గడచి పోవుచునుండె
వావిలాలవాస! వాసుదేవ!
9*
విశ్వరూపు జూచి విస్తుబోయె నరుడు
నాత్మవెలుగ దు:ఖమంతరించె!
విస్తరించె బ్రహ్మవిద్య భారతమంత
వావిలాలవాస! వాసుదేవ!
10*
భక్తినీవె విశ్వ బ్రహ్మ మోదమునీవె!
భారతీయ తత్వభావమీవె!
బాషకందనట్టి బ్రహ్మాండమును నీవె!
వావిలాలవాస వాసుదేవ!
11*
విశ్వమీవె! జనులవిశ్వాసమును నీవె!
సృష్టి లయమునడుమ తుష్టినొసగు,
సుస్థిరాభివృద్ధి సూత్రధారివి నీవె!
వావిలాలవాస వాసుదేవ!
12*
జగతినాటకంబు జరుగుదోవ ప్రగతి
స్థితియు నీవె! ధర్మ గతియు నీవె!
విష్ణమూర్తివి నిను వివరింప శక్యమే?
వావిలాలవాస వాసుదేవ!
13*
సరసిజాక్ష! కృష్ణ! సజ్జనమందార!
సకలభువన జీవ సద్విచార!
దురిత తిమిరదూర!దుర్జనసంహార!
వావిలాలవాస వాసుదేవ!
14*
మురళిగాన లోల!మురహరి!గోపాల!
కుబ్జ వరద!కృష్ణ!రక్మిణీశ!
ముక్తినొసగు బ్రహ్మ! మురిపాల జనపాల!
వావిలాలవాస వాసుదేవ!
15*
నీల మోహనాంగ!నీరూపు వర్ణించి
చింతనంబు సేయ చిత్తశుద్ధి,
నీప్రసాద మహిమ, నిరుపమానము కృష్ణ!
వావిలాలవాస వాసుదేవ!
16*
ఖాది సంస్థ గుడికి గావించెప్రహరినీ,
భజనసాగె భక్తిభావమెసగె!
నీదు ప్రక్కశివుని నిలయంబు వెలుగొందె!
వావిలాలవాస వాసుదేవ!
17*
నీతి ధర్మపాల నినుజేరి పూజించు
తలపుగలుగ తనువు పులకరించు!
భాషకందనట్టి భావంబు చిగురించు!
వావిలాలవాస వాసుదేవ!
18*
మదిని భక్తిభావ మదియేమొ కదలాడు,
నాట వెలదియాడు మాటవరుస!
పట్టుబడదు శబ్ధ పరమార్థమదియేమొ!
వావిలాలవాస వాసుదేవ!
19*
పార్వతి సుతు దలచి ప్రారంభమునుజేసి
మనసు చిత్తు ప్రతిగ మరల దిద్ధి!
కవిపరంపర నుతిగావించి రచియింతు,
వావిలాలవాస వాసుదేవ!
20*
తల్లిదండ్రి గురవు లెల్లరు దీవింప,
కవితజెప్పబూని కలలు గంటి
కవిని జేసినన్ను కరుణింప వదియేమి?
వావిలాలవాస వాసుదేవ!
21*
దేశిచందమందు దెల్పుచందము బాష
కందరాని భావచందనాలు
పరిమళింప భక్తి ప్రతిఫలింపగజేతు
వావిలాలవాస వాసుదేవ!
22*
సుకవిగాను ధర్మసూక్ష్మంబు దెలియను
కుకవి నిందజేయు కృతులబోను
సభనుమెప్పుబొందు సరసంబులాడను
వావిలాలవాస వాసుదేవ!
23*
ఉభయతారకమగు ఊహసేయగలేను
ప్రౌఢరచన జేయు పటిమ లేదు
ముగ్దభక్తి దెల్పి మురిపింపజూతును
వావిలాలవాస వాసుదేవ!
24*
లౌకికమ్ము పారలౌకికమ్ము దెలిసి
ప్రస్తుతింపలేను ప్రస్తుతంబు
వాస్తవంబు దెల్పు ప్రస్తావనలుజేతు
వావిలాలవాస వాసుదేవ!
25*
కవితజెప్పగలిగి కలిమిలేములబడి
కథలు జెప్పి తాత కదలిపోయె
బ్రతుకుదెరువువెంట బరుగెత్తె తండ్రియు
వావిలాలవాస వాసుదేవ!
26*
తరతరాల కీర్తి తరచి చూడగ నేమి
తదితరాల బ్రతుకు తరుముచుండ
మనసు మూగవోయి మౌనమ్ము దాల్చెను
వావిలాలవాస వాసుదేవ!
27*
చిత్రముగను నీదు చిత్రపటంబుగా
చిత్తముండె దాని చింతగప్పె
చింతదొలుగ భక్తి చింతన గలిగించు
వావిలాలవాస వాసుదేవ!
28*
కదలు నీట వస్తుగాంచు యత్నంబిదీ
కన్నుగాననిగతి కవిత సాగె
శతకరచన సాగు పథకంబు కుదరదు
వావిలాలవాస వాసుదేవ!
29*
వేదవేద్య! నిన్ను వేనోళ్ళ కీర్తింతు
విశ్వరూప! నీదువింతలీల,
ఆది శేషమైన అర్థంబు నూహింతు!
వావిలాలవాస వాసుదేవ!
30*
విధివి నీవె!దివ్యవేదాంతములు నీవె!
విద్యలందు బ్రహ్మ విద్యనీవె!
ఆదిశక్తి నీవె! అఖిలాత్ముడవునీవె!
వావిలాలవాస వాసుదేవ!
31*
అంతరాత్మ నీవె! అఖిలాండ కోటిబ్ర
హ్మాండబాండ నాయకుడవు నీవె!
అండపిండ ప్రకృతి కండదండయునీవె!
వావిలాలవాస! వాసుదేవ!
32*
నిత్య సత్యమీవె! నిఖిలచరాచర-
జీవహేతుభూత జీవమీవ!
ఆస్తినాస్తి నీవె! అచ్యుతుండవు నీవె!
వావిలాలవాస! వాసుదేవ!
33*
కలిమి లేములబాట కలడులేడను మాట
నయ జయాపజయము నరుల కొసగు
విధివిధానఘటన వెలయు ధర్మము నీవె!
వావిలాలవాస! వాసుదేవ!
34*
కుజనసుజన హృదయకుసుమ సీమల దిర్గు
భ్రమర మీవె! ప్రేమ భావమీవె!
ప్రణవనాదమీవె! బ్రహ్మమోదము నీవె!
వావిలాలవాస! వాసుదేవ!
35*
వివిధ ధర్మసూత్ర విశ్వాసగుణమీవె!
శిష్టరక్ష, దుష్టశిక్ష జేయ-
నుద్భవించి సృష్టి నుద్ధరింతువునీవె!
వావిలాలవాస! వాసుదేవ!
36*
జీససూ రహీము శివగురుగోవింద
దమ్మగతుల జనుల సమ్మతముల
గల పరోపకార గణ్యపుణ్యమునీవె!
వావిలాలవాస! వాసుదేవ!
37*
రాజు పేద బ్రతుకు రాహలో పటుధర్మ
సూక్మ మీవె! నటన సూత్రధారి!
పాత్రధారి యాత్మ-పరమాత్మ గతినీవె!
వావిలాలవాస! వాసుదేవ!
38*
వేదమునుల హృదయ వేదికపై వెల్గు
భక్తి-ప్రణవ నాదబ్రహ్మ వీవె!
జీవిప్రణయభావ దివ్యతత్వము నీదె!
వావిలాలవాస! వాసుదేవ!
39*
ఋషులుమెచ్చు పుణ్యపురుషులు నీతత్వ
మందె లీనమవగ మదినికోరి
విశ్వజీవశ్రేష్ఠ విఖ్యాతి గాంతురు!
వావిలాలవాస!వాసుదేవ!
40*
ఉద్భవింతువు యుగయుగముల ధర్మంబు,
సత్యమార్గమందు సాగు కొఱకు
జగతి నీదు లీల జరుగును గోపాల!
వావిలాలవాస వాసుదేవ!
41*
కడలిజొచ్చి సోమకాసురు వధియించి
వేదనిధులు దెచ్చి విధికి నిచ్చి
చేపరూపమందు చెన్నుమీరిన శౌరి!
వావిలాలవాస! వాసుదేవ!
42*
కూర్మరూపమెత్తి కులగిరి మోసియు
అమృతమిడగ సురలు – అమరులైరి!
అసురమాయలణచి యవనిగాచిన హరి!
వావిలాలవాస! వాసుదేవ!
43*
భూమినుద్ధరింప భూరివరాహమై
కోరనెత్తి జీవకోటి బ్రోచి!
పసిడికంటియసురు పరిమార్చితివిప్రభో!
వావిలాలవాస! వాసుదేవ!
44*
బాల భక్తుని దయపాలించగ హిరణ్య
కశిపు ద్రుంచి జనుల కనికరింప-
ఉగ్రనారసింహ రూపు దాల్చిన సామి!
వావిలాలవాస! వాసుదేవ!
45*
అడిగిమూటరెండు అడుగులనంతట
స్ఫూర్తిమెరయ నిండి మూర్థమందు
అడుగునిడియు బలిని యడచిన వామన!
వావిలాలవాస! వాసుదేవ!
46*
క్రూరనృపుల ద్రుంచి కోర్కదీరగ తండ్రి
యాత్మశాంతి తర్పణముల పేర!
పుడమి ధర్మరక్ష బూనిన భృగురామ!
వావిలాలవాస! వాసుదేవ!
47*
రావణాంతక!రఘురామ పరంధామ!
పూర్ణమానవతను పుణికిపుచ్చు
కొనియు ధర్మమము నెలకొల్పు తారకనామ!
వావిలాలవాస! వాసుదేవ!
48*
రాజనీతి గీత రాజిల్ల నాదర్శ
ధర్మమూర్తి కృష్ణ! ధరణి మార్గ
దర్శివైతివిల సుదర్శన చక్రివై!
వావిలాలవాస! వాసుదేవ!
49*
వెఱ్ఱితలలు వేయు వెలితి బుద్ధుల మూఢ-
నమ్మకాలువంచి నయము జయము
లొసగుబోధ భూమి పొసగ జేసిన బుద్ధ!
వావిలాలవాస వాసుదేవ!
50*
బ్రతుకు దెరువు భయము బలపడి యవినీతి
పరులచేత ప్రజలు పరితపింప
కలికి రూపమెత్తి కలుషంబు హరియించు!
వావిలాలవాస వాసుదేవ!
51*
అవనిధర్మ రక్షకవతార దశకంబు
దానవాళి శిక్ష దారిసాగె
మానవాళికొఱకె మాధవా నీలీల!
వావిలాల వాసు దేవ!
52*
మాయిక నరరూపమందెదానవలీల
మాయరహిత నరులమాయకులుగ
నీదు మాయదెలిసి నిష్ఠబూనుటమేలు!
వావిలాల వాస వాసు దేవ!
53*
నరులు నరకులైన నరలోకమేమగు
నరకమైన మరల నవతరించి
రథమునడిపి నరుల రక్షింపగారమ్ము!
వావిలాల వాస వాసుదేవ!
54*
శిక్ష వలెనె నీపరీక్షసాగెను భక్తి
జటిలనికషయయ్యె జగతి బ్రతుకు
రథమునడిపి నరుల రక్షింపగారమ్ము!
వావిలాల వాస వాసుదేవ!
55*
కల్తిచేత నీతి కబలింపబడుచుండె!
వెలితి చేత బుద్ధి వెలుగ దాయె!
రక్తమైన కల్తియుక్తమేకదనేడు!
వావిలాలవాస! వాసుదేవ!
56*
స్ఫూర్తినిచ్చు కథలు పుణ్యపురాణముల్
గొప్పదనమునంత గోలుపోయి
ధనమునిచ్చు నీతి దాపురించె జగతి!
వావిలాలవాస! వాసుదేవ!
57*
కడలినింపు నదుల కలికల్మశముబారె
త్రాగునీటకల్తి తాండవించె!
వాగువానిబుద్ధి వాగ్దేవి మరచెనో
వావిలాలవాస! వాసుదేవ!
58*
చిన్ననాడు మన్ను దిన్న నోటను విశ్వ
వన్నె చిన్నెలు గని వాస్తవంబు
తల్లిదెలిసె సృష్టి తత్వంబు నీచేత
వావిలాలవాస! వాసుదేవ!
59*
విశ్వరూపుజూచి విస్తుబోయె నరుడు
హృదయ దుర్బలత్వముడిగి లేచి
పోరుసల్పె ధర్మపోరాటమునగెల్చె!
వావిలాలవాస! వాసుదేవ!
60*
పూని విషపు పాలు పూరించి పూతన,
శకట, ధేనుక, బక, శత్రుమూక!
చిటికెలోన జచ్చె శిశువు నీవైయుండ!
వావిలాలవాస! వాసుదేవ!
61*
కక్షబూని యసుర పక్షపాతులుమాయ
దారి యుద్ధతంత్రదక్షులగుచు-
దాడిసేయ వారి దండించితివి ప్రభూ!
వావిలాల వాస వాసుదేవ!
62*
రామ!భార్గవ బలరామ!సంగరభీమ!
రాక్షసాంతక! జనరక్షకుండ!
విశ్వరూప! నరులవిశ్వాస గుణదీప!
వావిలాల వాస వాసుదేవ!
63*
సృష్టికర్త లోక సుస్థిర స్థితి భర్త
ప్రళయకారక శివ! ప్రకృతి హర్త!
మూడుమూర్తులందు మురిపించు పరబ్రహ్మ!
వావిలాల వాస వాసుదేవ!
64*
కర్తవీవె! కర్మకారకక్రియలందు
సకలధర్మ కర్మ సాక్షినీవె!
శక్తి యుక్తి రక్తి భక్తి ముక్తులు నీవె!
వావిలాల వాస వాసుదేవ!
65*
చిన్ని కృష్ణ నీవు వెన్నదొంగవటంచు
తగవుజేసిరంట తల్లిజూప!
ఖిన్నులైరి యింట నిన్ను బంధించియు
వావిలాలవాస! వాసుదేవ!
66*
చిలిపి రాచక్రీడ సలుపబిల్చితివని
కొంటె గోపికాళి కొండియములు
నీలినిందలయ్యె! నీలమోహనరూప!
వావిలాలవాస! వాసుదేవ!
67*
చీరలెత్తి పొన్నచెట్టున నీవుండ
చేతులెత్తి మ్రొక్కు చెలులు కాత్మ
గోప్యమిచ్చి బ్రోచు గోపాలనందన!
వావిలాలవాస! వాసుదేవ!
68*
జన్మసార్థకంబు-జన్మరాహిత్యంబు
భాగవతము జనుల భాగ్యగరిమ!
భక్తిమూలమెరుగు బ్రహ్మవిద్యయెగీత!
వావిలాలవాస! వాసుదేవ!
69*
సరసమాయశోద సరసనె గోపికల్
సిగ్గుమాలి సంజ్ఞ సేయటేల?
ఆత్మగోప్యము పరమాత్మ నీకే తెలుసు!
వావిలాలవాస! వాసుదేవ!
70*
బాల్యమందె ప్రణయభావంబు యవ్వన
మందు రాజనీతి మార్గవిధులు!
ప్రణవనాదసడుల పాంచజన్యముమ్రోగె!
వావిలాలవాస! వాసుదేవ!
71*
చెప్పరాని యాత్మ చేతనంబును బాల్య
చేష్టజూపి భక్తిచేత వెలుగ
గోకులంబు ముక్తి దోవసాగెనునాడు
వావిలాలవాస వాసుదేవ!
72*
గొడుగు బట్టినట్టు గోవర్ధనమునెత్తి
గోకులంబు గాచి కొంటెయింద్రు
మందలించి పనుల మందగాచిన తండ్రి!
వావిలాలవాస వాసుదేవ!
73*
ముష్టికువధియించి దుష్టచాణూరుని
దునిమి కంసుగూల్చిమునులు జనులు
పొగడ కన్నవారి బ్రోచిన కంసారి!
వావిలాలవాస వాసుదేవ!
74*
అష్ట పత్నులందు నతివ రుక్మిణిలక్ష్మి
యనగ పుడమివెలిగె యదుకులంబు
నిన్నుగన్నగరిమ, నిఖిలకీర్తినిగాంచె!
వావిలాలవాస వాసుదేవ!
75*
మురళిగాన యమున మునిగితేలెను రాధ
ప్రణయ రాగసుధను పరవశించె!
మధురభక్తి ఝరుల మనిరిగోపికలెల్ల!
వావిలాలవాస వాసుదేవ!
76*
పిడికెడటుకులిచ్చి పేదకుచేలుడు
గాంచె నిహపరసుఖ కామ్యసిద్ధి!
కోరనట్టి నిధులు కొంగున ముడివడె!
వావిలాలవాస! వాసుదేవ!
77*
దురభిమాన ఖలులు ధుర్యోధనాదులు
తెగిరి యుద్ధమందు తెరువు గనక
నీదు మాటవినక నీల్గిరి వ్యర్థులై
వావిలాలవాస! వాసుదేవ!
78*
ధర్మపక్షపాత కర్మయోగమునీది
నీతినియమనిష్ఠ రీతినీది!
భక్త వత్సలుడవు ముక్తిదాతవు కృష్ణ!
వావిలాలవాస! వాసుదేవ!
79*
కరిమొరవిని యామకరి జీల్చి మోక్షంబు
నిడిన దేవదేవ! నిత్య సేవ్య!
పాడు తండ్రి బాపి ప్రహ్లాదు గాచిన
వావిలాలవాస! వాసుదేవ!
80*
దీనబంధు నాకుదిక్కునీవేయని
ప్రస్తుతించి పిలువ వస్త్ర మొసగి
పాపకార్యమాపి పాంచాలి బ్రోచిన
వావిలాలవాస! వాసుదేవ!
81*
క్షేమమిచ్చి బ్రోచు సేత్రసామివినీవె!
ప్రకృతిమాతయొడిని పడినయట్టి
నరునిలోన వెలుగు నారాయణుడవీవె!
వావిలాలవాస వాసుదేవ!
82*
సూర్య రశ్మి చంద్ర సోయగంబును దిద్దె
చుక్కముగ్గు నింగి చెక్కణంబు
నీదు శక్తి జీవ జీవనసంవృద్ధి!
వావిలాలవాస వాసుదేవ!
83*
నేను నాది నీవు నీదనుటాపేక్ష
సహన రహితబుద్ది నహమువృద్ది!
విషయవాసనమతి వీడదు కడదాక!
వావిలాలవాస వాసుదేవ!
84*
మనసునిల్చుదాక మావెంటనంటియు
విశ్వరూపుదెలియ వీలుపడగ
దివ్యదృక్కులిచ్చి దీవించు పరమాత్మ!
వావిలాలవాస వాసుదేవ!
85*
రాజు పేద భక్తి రాహలోనేకమై
సాగవలయు నాత్మ రాకపోక
జన్మగడువ రాజు జన్మించు పేదగా!
వావిలాలవాస వాసుదేవ!
86*
భక్తిలో దయాస్వభావమే కన్పట్టు,
దానధర్మ విధుల దయయె దనరు,
దయయు లేని భక్తి దారి స్ఫురింపదు!
వావిలాలవాస !వాసుదేవ!
87*
కలిగె కృతమునుండి కలిదాక పరిణామ
క్రమము నరుని రూపు గలుగు తీరు
దలపగ నవతార దశకక్రమము తోచు!
వావిలాలవాస! వాసుదేవ!
88*
తినుపదార్థ పోటి విజ్ఞతకై నేటి
కూటి విద్యలెదిగె కులమె ఘనము
గాగ నీతిధర్మ కర్మలు మరుగయ్యె!
వావిలాలవాస! వాసుదేవ!
89*
గుండెదూరిచంపు గుండును గనిపెట్ట
నరుని సృష్టి ఘనత నవత సైన్సు!
మల్లెమొగ్గ గూర్చు మార్గంబు గనదాయె!
వావిలాలవాస! వాసుదేవ!
90*
విశ్వకోటి జీవవిషయాలు వేదోక్తి
శాస్త్ర గతులు తరచు సమయమేది?
క్రొత్తవింత పాత రోతసమంబాయె!
వావిలాలవాస వాసుదేవ!
91*
విశ్వ కోటి జీవవిషయాలు వేదోక్త
శాస్త్రగతులు తరచు సమయమేది?
క్రొత్త వింత పాత రోతసమంబాయె!
వావిలాలవాస వాసుదేవ!
92*
మేధనొసగి జనుల మేల్గోరు గీతోక్తి
హద్ధులోన బ్రతుకు వద్ధటంచు
సాగిపోవ సుఖము శాంతియు కరువాయె!
వావిలాలవాస వాసుదేవ!
93*
పాపపుణ్యమనని పండితపామర
జగతి తీరుతెన్ను జరుగుబాటు
మీదియాకురాల క్రిందాకు నవ్వుటే!
వావిలాలవాస వాసుదేవ!
94*
విశ్వరూపుగాంచు విద్య సైన్సదిగాక
విత్తరూపుగాంచు విద్య సైన్సె!
ధనముపెరిగె పేద తనము పెర్గెను నేడు!
వావిలాలవాస వాసుదేవ!
95*
భక్తియనగ నేమి? భక్తుడెవ్వరు నీతి
బాట దప్పి భక్తి బాటగలదె?
తెలుపు గురుడు భక్తిదేల్చి చెప్పడు కదా!
వావిలాలవాస వాసుదేవ!
96*
జీవరాశి నొక్క జీవాత్మ భావింప
మంచిచెడుల నెట్లు మసలు నరుడు
నీదు నికష బుద్ధి నిల్పడా భక్తుండు?
వావిలాలవాస వాసుదేవ!
97*
మంచివారి పెంచి వంచకులను వంచి
ఈవిగలుగు బ్రతుకు ఠీవి నిమ్ము!
తెగువ గలుగజేసి తేగబుద్ధిని గూర్చు
వావిలాలవాస! వాసుదేవ!
98*
నీలి నింద బ్రతుకు నిలువున ముంచగా
కొండియంబుచేత కొంప మునిగె!
నడచు చరిత నీల్గి నల్గని వారేరి?
వావిలాలవాస! వాసుదేవ!
99*
స్వార్థనీతి లేని సంఘసేవయె మేలు
చాడి నమ్మలేని వాడికొలువు
చేయమేలు బ్రతుకు సేమమై ధరజెల్లు!
వావిలాలవాస! వాసుదేవ!
100*
ముప్పుదప్పునట్టి ముందుజాగ్రత భక్తి!
మందులేని రుజకు మందు భక్తి!
దుష్ట జనులనడుమ దూరనీయదు భక్తి!
వావిలాలవాస! వాసుదేవ!
101*
వేణుగానలోల! వేయేల మముపాల
నీటముంచు భారమింక నీదె!
కలిమి లేమి తృప్తి గలిగించి కడజేర్చు!
వావిలాలవాస వాసుదేవ!
102*
శ్రీశ! వెంకటయ్య సీతమ్మ పుత్రుడ
సత్యదాసుడ గొను శతకమిదిగొ!
దిద్దుకొని సమాస రద్దులు మన్నించు!
వావిలాలవాస వాసుదేవ!
103*
బ్రతుకు గాధ చేదు బాధలీదెను గాని
పచ్చడి రుచిగూర్చె భక్తిబాట!
నావసాగె నడుపు నావికుడవు నీవె!
వావిలాలవాస వాసుదేవ!
104*
బ్రతికి చెడినచోటె భక్తిపూర్ణతగల్గె
కుటిలరాజకీయ కుట్రలందు
నూరుమారె నారునూరుగా నినుజేర!
వావిలాలవాస వాసుదేవ!
105*
ఇష్టమైన బ్రతుకు నిష్ఠ నీభక్తియే
సకల దైవ భక్తి సఖ్యతొసగె!
మూఢనమ్మకంపు మురిపెమ్ము దొలగెను!
వావిలాలవాస వాసుదేవ!
106*
భక్తి పరవశంబు బాల్య వైభవమంత
యవ్వనంబునట్ల నివ్వటిల్లె!
కష్టమందు సుఖము కనుగొంటి గోవింద!
వావిలాలవాస వాసుదేవ!
107*
బాల్య రచన శతక పఠనంబు జేసితి
నేడు మరలమరల నెమ్మదిగను-
సద్గురువులు చదివి సరిదిద్ధ నర్పింతు!
వావిలాలవాస వాసుదేవ!
108*
శతకమర్పణంబు సల్పితీ సన్నిధీ
చదువరులకు శుభము సభకు శుభము
విన్నవార్కి శుభము విశ్వకళ్యాణము!
వావిలాలవాస వాసుదేవ!
 
Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page