
(ఆ.వె.)
1*
శ్రీనివాస నీదు చిద్రూప దర్శనమ్
చిత్త చింతలకు చికిత్స యనగ!
చింతనౌషదమ్ము సేవింతు నీభక్తి!
ఎర్ర గట్టు వాస ఎంకటేశ! (వెంకటేశ)
2*
కనులజూతమన్న కన్నీరు తెరవేయు
కర్ణ భేరి నితర కలరవాలు
వినగలేను నీదు విభవకీర్తన గీతి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
3*
విష్ణు వీవె! శైవ విశ్వనాథుడవీవె!
బ్రహ్మ జనక! బ్రోవు భవవినాశ!
వివిధ జీవుల హృదయ వివరంబులను నీవె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
4*
శివుని హృదియె నీవు, నీహృదియె శివుడు
తెలుగు తిక్కనార్యు తేజమీవె!
అరసి చూడ హరిహర నాథుడవు నీవె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
5*
దనుజ శిక్ష జేయు దయగల తందడ్రివి
ధర్మ రక్షజేయు కర్మసాక్షి!
అవనినుద్ధరించు నవతారమూర్తివి!
ఎర్రగట్టు వాస!ఎంకటేశ!
6*
నిత్య విధుల దలచి-నినుభక్తి నర్చింతు,
సత్య గతుల సాగి సన్నుతింతు!
శతక రచన సాగ సతతమ్ము ప్రార్థింతు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
7*
వరుస శబ్దమందు వక్రోక్తి ధ్వనియింప,
కవిత వెలయజేయు కవిని గాను,
సత్యగతుల సాగు సాహిత్యమూహింతు,
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
8*
నమ్మికొలుచు భక్తి, నవవిధమ్ములుగాగ
యిహపరసుఖ శాంతి నిడగరమ్ము!
నరుని చిత్తవృత్తి – నానా విధము సాగ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
9*
పూలు పత్రి జలము పూజ సామాగ్రిగా, సాగు పేద భక్తి సార్థకముగ,
సహనబుద్ధి జేతు సహస్రనామార్చనల్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
10*
విశ్వ సామరస్య విజ్ఞానమే నేడు
సేదదీర్చు శాస్త్ర సాధనమ్ము!
నిత్య నూతనార్థ నిధి, గీతవలెసాగు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
11*
నిలిచె భారతుండు నీగీత మహిమచే
సమర శూరుడయ్యె-సత్య మెఱిగి
సాగె భారత రథ సారథ్యమును నీదె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
12*
దురిత నాశ! మనిషి దుడుకులు సవరించు
భక్తి బాట నడుపు, భావిబ్రతుకు
సంతసమ్ము గూర్చి సాయుజ్య మిప్పించు
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
13*
ఏడులోకములకు, ఏడుగడవు నీవు
ఏడుకొండల నిలవేల్పు వీవు!
ఎక్కివచ్చు జనుల మ్రొక్కు గైకొను దేవ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
14*
పాప బుద్ధి మాన్పి – భక్తి భావననిల్పి
కోపతాపమణచి, కోర్కె దీర్చి,
పరమపదమొసంగు పద్మావతీపతి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
15*
అలకదీర్ప జేరు, అలమేలు మంగమ్మ
వాదున మురిపించు, ఆది లక్ష్మి!
నారి నారి మధ్య, నారాయణుడ వీవు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
16*
విశ్వశాంతి యజ్ఞ విధులు నీసేవలు!
దీన జన వికాస దివ్య తేజ!
వేడ్క నిన్ను భక్తి వేడుకొందుము దేవ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
17*
తేప తేపకు గన, నాపదమ్రొక్కులన్
వడ్డికాసు గూర్చ వరుస వచ్చి,
తీరుబడిగ జేయు తీర్థయాత్రగ నెంత్రు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
18*
పాపి కౌరవుండు పడతిని సభకీడ్చి,
వలువలూడ్చువేళ, బిలిచి మ్రొక్క,
వలువలిచ్చి, నీతి విలువ బెంచిన తండ్రి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
19*
సంధిమాట – గాక సంగ్రామమే బాట
ధర్మజునకె జయము, ధరణిగాగ-
నాశమొందిరంత నరరూప రాక్షసుల్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
20*
పాండవేయ ధర్మ పక్షపాతివి నీవు,
ధర్మపక్షపాతి ధర్మజుండు
అవని ధర్మ రక్షకవతరించిన దేవ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
21*
ధర్మనీతి నియమ కర్మయోగివి నీవు
సమరమున విరామ సమయమందు,
గుఱ్ఱములకు నిడవె గుగ్గిళ్ళు ప్రేమతో
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
22*
రాజిలేని దుష్టరాజలోకము నెల్ల,
సమరమందు జావ, సద్గతొసగు,
కృష్ష్ణుడనగ, యుద్ధ తృష్ణబాపిన తండ్రి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
23*
తల్లి సీతమాంబ, తండ్రి వెంకన్న, మా-
యూరు వావిలాల, పేరు-వ్రతము
నాడు నిడిన సత్యనారాయణ స్వామి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
24*
కరుణ కిరణ తిరుణ హరివంశమున బుట్టి
ముక్తవరము విజయ ముడిని బడగ,
బ్రతుకు సాగె, నీదు భక్తి తరించగన్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
25*
చిత్రమయ్యె నేనె చిత్తరువుగ మారి
శిల్ప రూపు గందు చిత్తచోర!
వాస్తవాకృతిగన వాంఛించు నామది!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
26*
మూగ మదిని, మురళిరాగాల ప్రతిధ్వని
దవ్వగాగ విందు,చెవిని మువ్వరవళి
సాగె కవిత నావ-శతకసాగర దోవ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ
27*
కనుల విందు, నీదు కమనీయ రూపమున్
చెవుల విందు, భజన చెక్కసడులు,
వేడ్కదోచు వెన్న, వ్రేపల్లె వెన్నెలల్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
28*
లోకనీతి కథలు గోవింద గీతముల్
భాగవతుల మహిమ, భక్తి సుధలు-
శిష్ట రక్ష దుష్ట శిక్షప్రతీకలున్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
29*
చవితి చంద్ర దోష సవరణార్థమునింద,
సాగి మణిని, భామమణిని,
గొనగ, కయ్యమంత గొప్ప నెయ్యముగాదె?
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
30*
అష్ట భార్యలు మది కష్టపెట్టగ చెంచు-
లక్ష్మి వలపు గొనవె? లక్ష్యమెఱుగ-
గర్వభంగ గతులు గల్పింతు వంతటన్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
31*
భక్తి నైక్యభావ బంధమ్ము సమకూర్చు,
ముదమునిచ్చు, తృప్తి, ముక్తి నిచ్చు!
నిఖిలజనుల సేవ! నీసేవ గాసాగు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
32*
కర్త వీవె! విశ్వకర్మ యోగివి నీవె!
భర్త వీవె, సృష్టి హర్తవీవె!
యుగయుగాల ధర్మముద్ధరించునదీవె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
33*
భారతాత్మ తత్వ భావసిద్ధాంతముల్
బహుపురాణవేద బ్రహ్మ నుడుల,
సారమయ్యె గీత-సంసారి కెదురీత!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
34*
భారతునకు దెల్పు – భాగవద్గీతలో, చూపినట్టి విశ్వరూపు, బోధ,
భారతీయ జనప్రబోధ గీతమునయ్యె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
35*
మానవాళి సేవ-మాధవా నీసేవ!
పరులకుపకరించు పనుల దోవ,
పుణ్యమార్గమనిరి – పూర్వపౌరాణికుల్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
36*
తరతరాల నరులు, తరియించు మార్గముల్
పుణ్యగతులు, శాస్త్ర పుటలు నిండె!
పాప మనగజెల్లె-పరపీడనము భువీ! ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
37*
అక్షరాల భక్తి – అచ్చుగాబడిపోయె,
పదము లందు భక్తి పథము వెలసె!
వాక్యగతిని భక్తి వారధి రూపొందె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
38*
సుజన మైత్రి జన్మ సుకృతంబున గల్గు,
దుర్జనాళి దూరవర్జితంబు,
నీదుభక్తి వెల్గు నిచ్చలచిత్తమున్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
39*
భక్తజనుల ప్రాపు ముక్తిమార్గము జూపు,
రీతిదప్పిపోవ రిక్త మగును,
నిజము నీదుసేవ, నిస్వార్థసేవయే!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
40*
చిత్త రుజగుదుర్చు, చింతనౌషదమంద్రు-
భక్తి విత్తమగును ముక్తి గొనగ!
దీనజనుల సేవ-దివ్యతారకనావ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
41*
నిత్యవిధులు నీతి నియమనిబంధనల్
శాశ్వతమగు కీర్తి సాధకములు
నీదు పేర సాగు నిత్య కర్తవ్యముల్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
42*
మంచిదారి గని మనప్రవక్తలు మత
మంచు దెల్పి, మనిషి – మనిషి జేర్చి-
దయనుజూపి, కాల ధర్మంబు జెందిరి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
43*
మంచి దారి రాక, మారక, మారణ
హోమదారి సాగు-ఘోర ఖలులు-
లోపమెఱిగి, నట్టి లోకవినాశకుల్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
44*
సకల మతములందు సమ్మతమగు నీతి
శాంతి సహన గుణము, సత్యవ్రతము,
మంచిపేరదాగు మాలలో దారమై,
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
45*
బాల్యమందు క్రీడ-భ్రమణంబు జతపడు
యవ్వనంపు మరుపు దవ్వుగాగ,
చరమ దశను భక్తి చర్చింప వీలగు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
46*
త్రివిధ దశల జీవి, శిశుయవ్వన జరలు,
తెరపిలేక సాగు తీరులరయ!
నిన్ను భక్తి గొలువ – నిమిషమ్ము దీరునా?
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
47*
బ్రతుకు సగము మోహపరవశమ్మున సాగె,
మిగత సగము గతము మిడక సాగె!
నిజము భక్తి బ్రతుకు నిత్యనీరాజనమ్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
48*
బుద్ధి దీపదూప పూజ కోవెల మదిన్
మాట మంత్రపుష్ఫమనగ జేయు,
భక్తిభావపూర్ణ బ్రతుకు నైవేద్యముల్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
49*
అన్య శ్రమల చిత్తమారాట పడుగాని,
పుణ్యకర్మలందు బూనుకోదు,
సొంత తారకంబు సుంతభావింపదు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
50*
గడ్డినెంటు గట్టి గజరాజు బంధించు,
రజ్జు సర్ఫభ్రాంతి రాత్రి జడియు!
గురువు కృపయులేక, గురికుదర దందురు,
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
51*
ధర్మ గురుడు గూర్చు ధైర్యము స్థైర్యమున్
మర్మమెఱుగ కరుగు మాయపొరలు
మనసు నిలుపనాత్మ-మరిగోచరించును,
ఎర్ర గట్టువాస! ఎంకటేశ!
52*
ఎందు కింత ప్రేమ ఎదురేగి వత్తువు?
మూఢ భక్తి పిలుపు ముందువినగ-
పప్పు బెల్లపురుచి, యొప్పునైవేద్యమా?
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
53*
అంతరంగ రిపులు – అరిషడువర్గముల్
బాహిరంగ రిపులు బహువిధాలు!
మనసు గెలిచి వాని మర్థింపవీలగున్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
54*
కర్మ వశత గల్గు జన్మ మేదినియందు
ప్రాప్తికొలది బ్రతుకు, పరిఢవిల్లు!
తృప్తిలేని నరుడు మృత్యువాలోచించు,
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
55*
తనకుతానె రక్ష – తనువున్ననేగాని,
యొరుల గాచుటెట్లు నోపు భువిని?
తనువు మొదటిదితర-ధర్మసాధనలందు
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
56*
తనువుకాంతి బ్రమలు, తాత్కాలికము చిత్త
శాంతియొకటె గూర్చు శాశ్వతంబు!
నితర ధనములేల? కీర్తిధనము గలుగ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
57*
లేవు కథకు కాళ్ళు, లేవుముంతకు చెవుల్
వెళ్ళలేని శ్రోత, వెదకలేని
కథకులింటికేగ-కథకంచికేకదా!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
58*
సూదిరంధ్రములను – సూత్రంబు మూయగా,
అతుకు బడినయట్లు బ్రతుకు, జగతి!
పూను లోపమొకటి, పూరింపగ నొకటి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
59*
స్వార్థపరుని చదువు, చట్టుబండయె గాక
మెదడు రిత్త పనుల మెదలు తుదకు,
నరుల ముంచిపోవు – నరక లోకములనేల!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
60*
ఏమి మిగిలె? లేమి-నెదురీత జీవితమ్
నెమరు వేయ గతము నేమి గలదు?
ఎవ్వరికినివారె, యమునాపనితీరె!
ఎర్రగట్టు వాస!ఎంకటేశ!
61*
మెప్పుగొప్పలన్ని మేదిని తుప్పలే
కాసులేనిదె – తిరకాసు బ్రతుకు,
చివరిదాకనంటు జిగురింధనము ధనమ్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
62*
ఇర్గు పొర్గుగుట్టు నిటునటు దట్టించు,
కొంప గొడవలెట్టు కొండెగాడు,
అందరొక్కటైన – కొందరి విడదీయు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
63*
అందినంత జుట్టు, అందకుంటే కాళ్ళు
పట్టువాడు దెలియు ప్రజల నాడి,
బ్రహ్మరథము పట్టు బ్రమతొలగనీయడు,
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
64*
పుట్టిదొట్టి పాప మెట్టిదనెడువాని,
పొట్టగొట్టి తుదకు పుట్టిముంచు!
మాయకుండు-మాటకారిగ మారు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
65*
పుణ్యకార్యక్రమము బూనిజేసెడు వారి,
నిందజేయు వారలుంద్రు, పుడమి-
మంచిజేయ తలవంచగా పనియేమి?
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
66*
బ్రతుకు పోరుసల్పి బలహీనపడి నిల్చి
అలసి సొలసి యుండ నలుక దీర్చ,
ఆదరాభిమాన మోదార్పు గావలెన్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
67*
రుచిని దేల్చు నాల్క రుచిమొగ్గలే యభి
రుచిని దేల్చు పల్కు రూఢిగాను,
మనసు రుచిని దేల్చు మరినీదు భక్తియే!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
68*
మంచివాడు సౌఖ్యమందుట, కనుగొని
వంచకుండు సహించగలడె?
తానె దనుజుడగుచు, తారు మారును జేయు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
69*
ఏనుగైన దోమ నేమిజేయును, తొండ
మందు దూరి దోమ చిందులేసి,
చుట్టు పరిసరాల చూర్ణము జేయించు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
70*
మెప్పు నటన లోభి-మెఱిపించి, లాభించు,
వక్రనీతి చక్రమడ్డువేసి,
లాభరహితు జేసి, – లాలించు సజ్జనున్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
71*
కరువుదీర బ్రతుకు దెరువున సత్ఫలమ్
హృదయపూర్వకకృషి ముదము గూర్చు
పట్టి పట్టని కృషి-పరగనిష్ఫలమగున్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
72*
మాట నమ్మకమ్ము-మధ్యవర్తియుగల్గ
సాగును వెవహార సమ్మతాలు!
మాట దప్పుచోట మధ్యవర్తియు వృధా
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
73*
కలలు,రాత్రి పగలు, కలబోసి గనుటకై
షిప్టు విధులు సాగె, గిప్టు నిద్ర,
చాలదయ్యె సమయపాలన సాగింప!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
74*
పదము పాటయయ్యె-పనిపాటలో పల్లె
ప్రకృతి వికృతులందు పాదు కొనియె!
పల్లె పట్నమయ్యె! పాటతోటను దాగె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
75*
పల్లె జానపదము ప్రత్యేకగానమై,
పట్టణాలమ్రోగె, పల్లెపాట!
నూహరచన భరిత నుల్లాసమును సాగె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
76*
పల్లె పాట శబ్ధ పల్లవంబులు మారి
మృదు మధుర భావ మృత్తికయ్యె!
కంఠమేళ మ్రోగి కమ్మగా వినిపించె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
77*
పల్లె పాట మనసు తెల్లదనము లోన
పాలవెల్లి పొంగె, పలుకుతీపి
వరుస వంతపాట-వారానువర్తనం!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
78*
భక్తి పాట జాన పదమయ్యె దశరూప-
సామిభజన సాగె, లేమి మరచి,
ఆలుమగల బోలెడర్థాలు సడిచేసె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
79*
చేదు ఔషదమ్ము-సేవింప గుణమిచ్చు,
రుజను గూర్చుతీపి వజను బెంచు!
మత్తు సాగనంపు మరుభూమి దారికి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
80*
ఊరు వల్లెలందు నుమ్మడికౌటుంబ
జీవనాలుమారె, చివరిదశను,
చెప్పుకొనెడి కథగ నొప్పెనీనాటికీ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
81*
పూత భరతమాత పున్నె సంతతి జన్మ,
ధన్య మంద్రు-జగతి ధార్మికతను,
పూర్ణమానవతను, పుణికి – పుచ్చుకొనగ!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
82*
వైరికైన బంచు వైదిక విజ్ఞాన,
భావజములకుదధి-భరతజాతి!
ధర్మ గుణము – మాన ధనము, మర్యాదలున్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
83*
జగతి భరత భూమి – జన్మింగోరెడు
మానవుడెటనున్న మాన్యుడతడు!
వాస్తవంబు, నిర్వివాదాంశమై యొప్పు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
84*
ఆది భరతజాతి, యాధ్యత్మికత బంచె
నితరదేశములకు, నిచ్చిపుచ్చు-
కొనెడి రీతి సైన్సు గొనితెచ్చె శాంతికై!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
85*
తీపి వస్తువేది? తీయతేనియగాదు,
ఖంఢ చక్కెర, కలకండగాదు!
పరగ నరులకెల్ల, ప్రాణంబు బహుతీపి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
86*
భక్తి శ్రద్ధ లేని పని పాట నిష్ఫలమ్
నయభయమ్ము లేని జయమదేల?
మనిషి మృగములనని-మరియాద వృధకదా!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
87*
ప్రేమలేని బ్రతుకు బేపారముగ సాగు
మనసు లేని నాడు మనిషి శిలయె!
గుండెలేనివాడు గుదిబండగామారు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
88*
స్వార్థ రహిత కర్మ సాగు సేవల యందు
నీదు భక్తి తోడు నిలిచి నపుడు,
జనులు మెచ్చు దారి జనుటయే క్షేమము!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
89*
వాదు జేయ లిమిటు వరుస హద్దులు లేక
సాధు వాక్కుకెదురు వాద పటిమ!
కప్పగంతుసాగి – కలెగూర గంపగు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
90*
పాప భీతి చెడుగు పనిజేయనీయదు
పుణ్య ప్రీతి మంచి బూని చేయు,
దైవభీతి ధర్మ దారిలో నడిపించు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
91*
నీదు కృపయుగల్గ, నిహబాధలు తొలగు,
కుంటి నడుచు, గ్రుడ్డిజూచు, మూగ
మాటలాడు, ముక్తిమార్గమ్ము చర్చించు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
92*
పాడు బుద్ధి, పరమ పాపి బ్రోవగ నీవె!
భక్తి గొలుచువారి బరువు నీదె!
సేదదీర్చి మమ్ము చేదుకో నీదరిన్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
93*
మ్రోడువారె బ్రతుకు-మోదమ్ము దిగజారె,
నిత్య విధుల తనువు నీరసించె!
భక్తి సేదదీర్చు, ముక్తి మార్గము జూపు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
94*
సమయపాలనమ్ము,సాగించు బలమిమ్ము!
భక్తి శ్రద్ధ గలుగు, బ్రతుకు నిచ్చి,
సజ్జనాళి మైత్రి సాగు జీవనమిమ్ము!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
95*
వివిధ భరతశాస్త్ర విజ్ఞానగ్రంధముల్,
దాచుకొన్న దెవరు? దోచిరెవరు?
రాయనేర్చిజాతి దాయనేర్వకపోయె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
96*
యాంత్రికయుగ జీవయాత్ర సాగెను, నేడు
గృహము నుండి గ్రహపు గృహము దాక!
సంక్రమించుజాగ – నాక్రమించగపోటి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
97*
సతిని,సుతునియమ్మె,తానమ్ముడునుబోయె
నాటిరాజు, నేడునాత్మ నొకడు,
సంతబెట్టియమ్మ, సాగె, ననెడు వార్త!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
98*
ఇంటి వేల్పులనగ, పితరులు, గురువులు
గుడిని వేల్పు మరియు పుడమి వేల్పు!
బరువుమోయువారు బలమైన వేల్పులు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
99*
అమృత పండ్లు రెండు, సంసారవృక్షాన-
మంచి గ్రoధపఠన, మంచి మైత్రి,
మిగత విషపు పండ్లు – మింగితే కడగండ్లు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
100*
కళలు మిశ్రశాస్త్ర కంప్యూటరాములు,!
వెబ్బు సైట్లు, చుట్టు డబ్బుఫైట్లు!
నరులముంచి యెత్తె – నడమంత్రపు సిరుల్
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
101*(సంపూర్ణం)
స్వామి నీదు సేవ సౌశీల్యమలవడు
నిత్యభక్తి కారునికత, గూర్చు!
ననెడు మాట పుడమి నక్షరాల నిజము!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
102*
మనిషి మేధ జీవి మనుగడ శాసించె,
దానవతను ద్రోచి మానవతను,
దాల్చి భక్తి గొనగ – దైవము దీవించె!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
103*
బాల్యమందు పూజ భజన యవ్వనమందు
వృద్ధదశను తపము – బుద్ధి జపము!
భక్తి కొలది జేయు బ్రతుకు నీహారతి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
104*
బంధు మిత్రభావబంధమ్ము నిల్పగా,
ప్రాపు నీవె! పుడమి కాపు నీవె!
చట్ట మనసు లోన – దట్టింతు నీభక్తి!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
105*
తాత్వికుండు భక్తి తరియింప, శాశ్వత-
శాంతి వెలయు బ్రతుకు సాగుచుండు!
అద్భుతమగు జన్మ బుద్భుద ప్రాయమే!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
106*
చదువు సందె సుజన-సాన్నిహిత్యము గూర్చు,
దూరమగును నరుని దుష్ట చింత!
తత్వచింతనమ్ము-తరతరాల ధనమ్ము!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
107*
నీదు దర్శనమ్ము నిత్యమోదముగూర్చు,
నీసహస్రనామ నేమ, పూజ,
సత్యవ్రతము భావ సామరస్యము గూర్చు!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!
108*ఫలశ్రుతి*
శుభము,శ్రోతలకును,సుఖశాంతి నొసగుము!
శతకపాఠకులకు సతము శుభము!
శుభముగూర్చు దేవ! సూర్యచంద్ర నయన!
ఎర్రగట్టు వాస! ఎంకటేశ!