top of page

వాసుదేవశతకము-2

(ఆ.వె.)

1*(ప్రారంభము)

శ్రీశ! మురళి లోల! చిత్రంబు నీలీల!

నికషలందు భక్తు నిలిపి, కీర్తి

వెలయ దరియుజేర్చి, వేడ్కసాగింతువు!

వావిలాల వాస వాసుదేవ!

2*

ఊరి సొమ్ము నీవు! ఉమ్మడియాస్తిగా

నీదు మందిరంబు నిచ్చు శాంతి

ఉత్సవాన నేట ఊరటబొందేము!

వావిలాలవాస వాసుదేవ!

3*

శక్తి యుక్తి భుక్తి, సాధన లౌకికమ్

సాగుచుండె, జన్మసాగుదాక!

భక్తి సాధన గన పారలౌకికమగున్

వావిలాలవాస వాసుదేవ!

4*

తరతరాల వన్నె తరగని దేవళమ్

గ్రామ మధ్యమందు కాంతులీను, నిత్యనూత్నశోభ నిచ్చునీ గోపురమ్

వావిలాలవాస వాసుదేవ!

5*

గొడుగులేల? వేణుగోపాల నీవుండ,

ఎండ, వాన, చలియు, నెంత?వలయు

కోర్కెదీర్ప వెంట గోవింద నీయండ!

వావిలాలవాస వాసుదేవ!

6*

ప్రజలు మెచ్చ ఖాది ప్రహరీని నిర్మించె

నాడె, నేడు నిధులునడిగి పొంది

పురజనంబు వసతి పునరుద్ధరించిరి!

వావిలాలవాస వాసుదేవ!

7*

వరుస భజనలు శనివారసాయంత్రముల్

సాగె, ఖాదిరామ సదన పోటి

కల్గె భక్తినిష్ఠ వెల్గెవేదాంతముల్

వావిలాలవాస వాసుదేవ!

8*

దక్షిణాన నీవు దాపు గా ప్రాపుగా

ఉత్తరాన హరుడునుండె, జనుల

యిచ్ఛ భక్తి భావమింపుగూర్పగహెచ్చె!

వావిలాలవాస వాసుదేవ!

*

9*

ఇష్టమైన గోకులాష్టమి శివరాత్రి

యుత్సవములు సాగె నూరువాడ

లెల్ల దీపపంక్తి, వెల్గుల నవరాత్రి

వావిలాలవాస వాసుదేవ!

*

10*

కలిగె బతుకుదెరువు ఖాదిరాముని దయ

ఖద్దరు పరిశ్రమ వికాసమందె!

వాయు పుత్రు రక్ష వాసిగాంచిరి జనుల్

వావిలాలవాస వాసుదేవ!

11* పర్వదినము, పరగ ప్రజలు నూరేగించి

విఘ్నరాజు నంపు వేడ్కలందు

నూరువాడ నిండు నూతనోత్సాహముల్

వావిలాలవాస వాసుదేవ!

12*

మొదట మారుతి గుడి, మోదంబు గూర్పగా

వెలసె రామునిగుడి వేడ్క మీర!

సాగె భజన, ప్రజకు సమకూరె సుఖశాంతి

వావిలాలవాస వాసుదేవ!

13*

కాలమైన, కానికాలమైనను వర్ష-

కాంక్షదీరె, పండె కలలపంట!

ఖాదిరామచంద్ర కళ్యాణ జాతరల్

వావిలాలవాస వాసుదేవ!

14*

సహనశీల గుణము, చదువు సంస్కారముల్

సజ్జనాళి మైత్రి, సత్యవ్రతము

కన్నవారు, గురులు, కాంక్షించు దీవెనల్

వావిలాలవాస వాసుదేవ!

15*

నిన్ను వీడి రాని, నిరతదర్శన కాంక్ష-

తల్లి దండ్రి జన్మ తరలు నిచ్ఛ!

తండ్రికి నెరవేరె – తల్లియు వెంటుండె!

వావిలాలవాస వాసుదేవ!

16*

మానవాళిరక్ష మార్గనిర్ధేశ్యంబు

నీదుగాధ బతుకునీదసుళువు

శ్రేష్ఠమానవతయు శ్రీనాథ నీబిక్ష!

వావిలాలవాస వాసుదేవ!

17*

ప్రాప్తిగలిగినంత తృప్తి పడగ నేర్పు

ఊరు సానుభూతినూరడించి

బతికి చెడిన ఇంటి బాధలు మరపించు!

వావిలాలవాస వాసుదేవ!

18*

పేరు పేరు నూరు పేరుల దశరూప

ధారివైన మూలదైవమీవె!

దండ గూర్చు పూలదారమొక్కటెకదా!

వావిలాలవాస వాసుదేవ!

19*

చెప్పజాలనన్ని చెట్టువిభాగముల్

తల్లివేరు చేత తళుకులీను

నీదు గుణమె వస్తునిగ్గుదేల్చును కదా!

వావిలాలవాస వాసుదేవ!

20*

శతసహస్రనామ సంకీర్తనల్ గుణ-

గణములెన్ను కథలు గలిగి వెలుగు

భాగవతము భక్తి భావప్రబంధము!

వావిలాలవాస వాసుదేవ!

21*

తృప్తిలేని జన్మ తూర్పార బట్టగా

తాలు వేరుబడగ తాల్మి యాత్మ!

తరచి చూడకున్న తరియింప సాధ్యమా!

వావిలాలవాస! వాసుదేవ!

22*

చీకటున్న వెలుగు చింతలో సంతసమ్

వెలయు ముళ్ళ పువ్వు విలువ దెలియు

బాధ లేనిది సుఖ భావంబు పుట్టునా?

వావిలాలవాస! వాసుదేవ!

23*

బ్రతుకు నీతి ధర్మ బద్ధమై గడచిన

రక్తి పిదప మది విరక్తి మెచ్చు!

భక్తి భద్రమగుచు – ముక్తిమార్గము దోచు

వావిలాలవాస! వాసుదేవ!

24*

సహజ తత్వశోభ సందడి మదినాత్మ

దివ్వె వెలుగు, వలయ దీప్తి యందు!

నీదు రూపు గాంచు నిజభక్తి మార్గమున్

వావిలాలవాస! వాసుదేవ!

25*

సహజ నిష్ఠగూర్చు సదనంబు నీగుడి

వెలుగు దివ్వె-మ్రోగు వేదవాక్కు!

భజన కీర్తన ఘన భక్తిని గలగించు!

వావిలాలవాస! వాసుదేవ!

26*

నిష్ఠ గలుగ నీదు నిర్గుణోపాసన

సాగు! మూర్తి పూజ సగుణ మనగ!

మూఢ భక్తి పల్లె మురియు కొల్పులు సాగు!

వావిలాలవాస వాసుదేవ!

27*

సామరస్యపూర్ణ సంసారవాహిణి

సాగు భక్తినావ సాధుజనుల-

రేయి భవలు ముక్తి రేవుజేర్చు విధులు!

వావిలాలవాస వాసుదేవ!

28*

మూఢ భక్తియాత్మ గూఢమెర్గుటకేగ

ఆత్మ దెలియ మాయలంతరించు!

మనసు నిల్పకున్న మరి యాత్మ దోచదు!

వావిలాలవాస వాసుదేవ!

29*

బలము వరముబొంది బ్రహ్మాదులు మునుపె

రక్తి పిదప భక్తి రాహగనిరి!

రక్తి తనువుముదము భక్తి బమ్మముదము!

వావిలాలవాస వాసుదేవ!

30*

భక్తి సహజదీక్ష బ్రహ్మంబునూహింత్రు

భ్రాంతి వీడి నిశ్చలాత్మ గాంచి

మనసు నిల్పు క్రియల మననంబు జేసేరు!

వావిలాలవాస వాసుదేవ!

 

31*

భక్తి ననుకరింప బాహ్య వేశములేల

లాభమేమి భక్తి లౌకికముల

పట్టు బడదు – నాత్మ గుట్టు దెలియుట మేలు!

వావిలాలవాస వాసుదేవ!

32*

పరమ పదమె పుడమి భక్తి ప్రయోజనమ్

లౌకికాన పుణ్య లభ్ది గలుగ

భక్తి యోగసిద్ధి పారలౌకిక దృష్టి

వావిలాలవాస వాసుదేవ!

33*

భక్తి రక్తి హృదయ భావపరంపరల్

శక్తి యుక్తి పుడమి సకలగతులు

నీదు దయయు లేక నిప్పచ్ఛరంబులే!

వావిలాలవాస వాసుదేవ!

34*

నీదు భక్తి గలుగ నిస్వార్థ గుణమొప్పు

రాజ పేద లొక్కరకపు టూహ

నిహము మరచి పరము నింక కాంక్షింతురు!

వావిలాలవాస వాసుదేవ!

35*

ప్రజలు పేద గొప్ప భావంబు విడనాడి

యాత్మ దృష్టి నేకయాత్రికులుగ

భక్తిదారి సామ్య భావంబు పొందేరు

వావిలాలవాస వాసుదేవ!

36*

స్వార్థబుద్ధి నిష్ఠ సాగింపనేరదు

నొనర తోటివారి నోర్వకుండు

నిజము నెఱుగుదాక నీభక్తి సాగదు?

వావిలాలవాస వాసుదేవ!

37*

జయవిజయులు మూడు జన్మలే దూరమై

తల్లడిల్లిరి శత్రు తత్వమునకు-

శాప హేతువెంత సాధించి వేదించె!

వావిలాలవాస వాసుదేవ!

*

38*

కనక కశ్యపు వరగర్వ కారణమెంత

బాధగూర్చె? కొడుకు బద్ధ శత్రు-

వయ్యె! నీదు మహిమ వాదించి హింసించె!

వావిలాలవాస వాసుదేవ!

39*

బ్రహ్మవంశ చంద్ర! భార్గవ రాముడా!

క్షాత్రతేజ రామచంద్ర! యదుకు-

లేశ, కృష్ణ నీదు లీల దెల్యగలేము!

వావిలాలవాస వాసుదేవ!

40*

దేశకాల పాత్ర తేజంబు వెలయించు

దేవదేవ! మరల నెందుబుట్టి

నేటియార్త జనుల నేరీతి గాచేవొ!

వావిలాలవాస వాసుదేవ!

41*

వైశ్యులందు గాంధి విశ్యశాంతి యహింస

సామ్యవాద బాట సాగె-సత్య-

ఆగ్రహంబు బూని – ఆర్జించెఫలితమ్ము

వావిలాలవాస వాసుదేవ!

42*

కులము మతము నాడు గూర్చె సమైక్యత

చీలికయ్యె నేడు చిత్తవృత్తి

లోపమేమిగల్గె? లోకుల నడవడిన్

వావిలాలవాస వాసుదేవ!

43*

బ్రతుకు దెరువు కొరకె భక్తి వేషము దాల్చి

విత్తమునకు బ్రహ్మ విద్య జెప్పి

భ్రాంతిసాగుయాత్ర శాంతి హుళక్కియే!

వావిలాలవాస వాసుదేవ!

44*

సమయమమ్మి డబ్బు సర్వస్వముగ జీవ

యాత్ర సాగు బ్రతుకు యాంత్రికంబు,

వాదపటిమ భక్తి సాధన స్వార్థమే!

వావిలాలవాస వాసుదేవ!

45*

నీతి ధర్మ విద్య నిస్తేజమై పొట్ట

కూటి విద్య లందు పోటి మీరె!

విత్త గడన నీతి విలువలు దిగజారె!

వావిలాలవాస వాసుదేవ!

46*

కలిగె కృతమునుండి కలిదాక పరిణామ

క్రమము మానవీయ కలిమి యాశ

పాశమయ్యె పుడమి పాపభీతియు దరిగె!

వావిలాలవాస వాసుదేవ!

47*

నేను నాది నీవు నీదను తలపున

మనది మనము మాట మరచె నరుడు

బేధభావమెసగ ఖేదమ్ము నొందెను!

వావిలాలవాస వాసుదేవ!

48*

దురిత భీతి హింస దూరనీయని రీతి

నీతిమార్గమందు నిలుపరమ్ము!

విశ్వరూప గీత విశ్వాసమును గూర్చు!

వావిలాలవాస వాసుదేవ!

49*

బాష భావమెవరి బతుకున సొంతము

పంచభూత విశ్వ సంచయమున

శాస్త్రవిద్యలెవరి సాధన సంపద!

వావిలాలవాస వాసుదేవ!

50*

విరిగి పెరుగు విశ్వ విస్తార ప్రకృతిని

చేతన జఢమనెడు చెరిసగంబు

జరుగు సృష్టి నీదె! జగతిచేతన మీవె!

వావిలాలవాస వాసుదేవ!

51*

కరువు దీర్ప వివిధ క్రతువులు, బ్రతుకును

దరికిజేర్చ భక్తిదారి వెలసె!

బ్రమను దీర్ప నాత్మ బ్రహ్మమోదము గల్గె!

వావిలాలవాస వాసుదేవ!

52*

గరుడ గమన! కుబ్జ వరద! నారద నుత!

హింసమాన్ప రమ్ము కంసవైరి!

వేణుగానలోల! వినవేల మాగోల!

వావిలాలవాస వాసుదేవ!

53*

దానగుణము నిచ్చి ధరణినాకలి దీర్చి,

భక్తి నికష ముక్తి పథమొసంగి!

పున్నెపంట నూర్చు పురుషోత్త ముడవీవు!

వావిలాలవాస వాసుదేవ!

54*

మంచిజనుల బెంచి – వంచకులను వంచి

నీతివిలువ గాచు గీతగురుడ!

విశ్వరూపు జూపి – విశ్వాసమును గూర్చు!

వావిలాలవాస వాసుదేవ!

55*

కిల్బిషాత్ములు, కించిత బుద్ధులై

విశ్వరూపు గనక, విధుల – జనక!

కామ్యకర్మకేళి, కలహింపసాగిరి!

వావిలాలవాస వాసుదేవ!

*

56*

గీతవినక కామ్య కేళిదేలుచు, ఖేద

జలధి మునిగి మరల జన్మనెత్తి

సజ్జనాళి గేళి సల్పుచుందురు ఖలుల్

వావిలాలవాస వాసుదేవ!

*

57*

ఖలుడమాయకు గని కవ్వించు కిల్బిష

మాయతెరలు గమ్మి మనుగడంత

బురదజల్లుకొనెడు బుద్ధివీడకసాగు!

వావిలాలవాస వాసుదేవ!

*

58*

నటక భక్తి జూపి నవ్వించు కపటియై

సంచరించు మంచి సాగనీక

మాయికాళి వారి మార్చు భారము నీదె!

వావిలాలవాస వాసుదేవ!

59*

విశ్వమేక గృహమె విశ్వాసముదయింప

నీతి మార్గగతుల గీతసాగు!

గీతదాటు-బ్రహ్మగీతమార్చుము దేవ!

వావిలాలవాస వాసుదేవ!

60*

ఊసుబోక జనుల ఉసురుబోసుకొనెడు

కొంటెఖలుడు చాడికోరునమ్మి

నమ్ముకొన్నవారి నట్టేట ముంచేను!

వావిలాలవాస వాసుదేవ!

61*

జన్మబుద్బుదంబు జగతి మాయల బడి

వీడనట్టి కోర్కె వేడ్కలందు

దూరి క్రొత్తవింత దు:ఖంబు జెందేము!

వావిలాలవాస వాసుదేవ!

62*

దు:ఖ హేతు కోర్కె దునియావిహారముల్

బుద్ధనీతి మరచు యుద్ధనీతి

మెచ్చు వారు గట్టిమేలు దలంతురే!

వావిలాలవాస వాసుదేవ!

63*

కలిమి లేములింత, కలియబడి పోరగా

కొండెగానిపోటు కొంత చేటు!

తరతరాల మధ్య తరగతి మిధ్యయే

వావిలాలవాస వాసుదేవ!

64*

సొమ్ము కొఱకు సాగు దొమ్మిపోరు బ్రతుకు

ధనము-హోద గొప్పతనముగాగ

డబ్బలేని బ్రతుకు డుబ్బుకు కొరగాదు!

వావిలాలవాస వాసుదేవ!

65*

విద్యలంగడిని విక్రయింపగ గొప్ప,

తెలివి మధ్య రాత్రి తెల్లవారె!

బ్రతుకు వేగమందె ప్రాణవాయువు దర్గె!

వావిలాలవాస వాసుదేవ!

66*

కులముబోయె,డబ్బు కూడిక ఖర్చులన్

గుణము బోయె, డబ్బు గణన సాగె!

మనసులేనివాడె మరియాద గెల్చెను!

వావిలాలవాస వాసుదేవ!

67*

నీతి లేనివాడు కోతికంటెను పాడు

రీతిలేని నీతి నేతిబీర!

పేరుగొప్ప బతుకు ఊరుదిబ్బగ మారె!

వావిలాలవాస వాసుదేవ!

*

68*

పాలు విరిగి పోవ పనికివచ్చును జున్ను

మనసు విరిగి పోగ-మనిషి శిలగ-

పనికివచ్చు, వెట్టి పనులందు యంత్రమై!

వావిలాలవాస వాసుదేవ!

*

69*

ధనమె మిన్న గుణము ధరలోన గనరాదు

దేనికోసమింత దేవులాట!

దుష్ట చింతన తుద దురితంబె వెన్నంటె!

వావిలాలవాస వాసుదేవ!

70*

ప్రాణమొకటె తీపి దానికోరి ధనము

మిగతవేవి? మిగిలె మిక్కిలిగను!

దోచు-దాచు ధనమె దోబూచులాడించె!

వావిలాలవాస వాసుదేవ!

71*

నిస్సహాయు కోర్టు నిందలో జిక్కించి

తరతరాలు దోచె తర్కపటిమ

మిగతవేవి? పుడమి మిక్కిలి మక్కువల్

వావిలాలవాస వాసుదేవ!

72*

మానసిక నికషకు, మార్కులు వేయగా

తర్క వాద పటిమ తస్సదియ్య!

కస్సు బుస్సు లాడు కంసమామలు జూడు!

వావిలాలవాస వాసుదేవ!

73*

మొదటె కోతి, కల్లు-ముల్లు నిప్పునబడె

తేలుకాటు బాధ, తెగువ మీరె-

నన్నరీతి ఖలుడు నడిపె యవ్వారముల్

వావిలాలవాస వాసుదేవ!

74*

తెగువ మేలగు బరిదెగిన కీడును గూర్చు!

తెలిసి దెలియని పని దెచ్చు ముప్పు!

తెంపి ముడువ కురుచ, తేపతేపకు మదిన్.

వావిలాలవాస వాసుదేవ!

75*

ఏమి వింత! కలిని ఏలుచుండె ధనము

నీతిమూలబడిన రీతులందు!

అమ్ముకోని దేది? అమ్మప్రేమయు దప్ప!

వావిలాలవాస వాసుదేవ!

76*

కల్మశాలపుట్ట కలికాలమున ధర

నొంటికాలిమీద గుంటు ధర్మ

ధేనువంద్రు, నడుచు ధర్మంబు పాతీకే!

వావిలాలవాస వాసుదేవ!

77*

కలికి రూప! పుడమి కలుషంబు హరియించు

తురగమెక్కి కలిని తరిమికొట్టి-

కఠినబుద్ధి మార్చి కరుణించు భక్తులన్

వావిలాలవాస వాసుదేవ!

78*

విశ్వ రూపు జూడ విశ్వాస రహితమౌ

కడు జనాభ నిండె! కలినిబుట్టి

తగిన విధుల గీత తాత్పర్యమందించు!

వావిలాలవాస వాసుదేవ!

79*

నీతి బాటలింత నిష్టూరమాయని

నీరుగారు భక్తి నిష్ఠపరుల-

దారిమారునేమొ? దామోదరా బ్రోవు!

వావిలాలవాస వాసుదేవ!

80*

మంచి బరువు, చెడ్డ మరి తేలికేగాని,

సాగు మంచిఫలమె శాశ్వతంబు!

మంచి పేరు కీర్తి మార్గమే శ్రేష్ఠము!

వావిలాలవాస వాసుదేవ!

81*

చట్ట పరిధి కలిమి చట్రమేర్పడ, ప్రభుత

పట్టుగొమ్మ జేసి గుట్టుగాను

డబ్బు గూర్చు వారు పబ్బంబు గడిపేరు!

వావిలాలవాస వాసుదేవ!

82*

మంచి పేర చెడ్డ మరియాద బొందగా

సంఘ సేవకులది కొంగ జపమె!

చేష్టలుడిగియాడు చేపల వేటను!

వావిలాలవాస వాసుదేవ!

83*

ప్రీతిగొల్పు శుద్ధి, పిడికెడు మెతుకులు

క్షుధను దీర్చు, రుచియు సుధను మించు!

లక్షలున్న – తినగ లవణమన్నమె కదా!

వావిలాలవాస వాసుదేవ!

84*

బ్రతుకు మాయలందుఁబడి, ఎదురీదగా

నలసిసొలసి పోవు నరులు వేడ-

చేదుకొనగ భక్తి చేయూత నందించు!

వావిలాలవాస వాసుదేవ!

85*

జనన మరణ యాత్ర జన్మమంతయు జాత్ర

పుణ్య నిధిని గూర్చు పుడమి జన్మ!

వెడలు నాత్మ ముక్తి వెచ్ఛంబు పుణ్యమే!

వావిలాలవాస వాసుదేవ!

86*

అమ్మగూడ నేడు అంగడి వస్తువై

ప్రీతి గర్భమొసగ, బిడ్డ గనగ-

నద్దె గొనుచు బతుకు దిద్దునాగరికతల్

వావిలాలవాస వాసుదేవ!

87*

సంతు బెంచి, పెళ్ళి తంతు మార్కెటు పాట

వరుని క్రయము జేసి వధువునంపె!

వరుస వచ్చె చెడ్డ వార్తలే అత్తింట!

వావిలాలవాస వాసుదేవ!

88*

విత్తమూల జగతి వీరవిహారముల్

చదువు పదవులందు సాగె నీతి-

పదును దప్పి చేరె పాతలోహపు గదిన్!

వావిలాలవాస వాసుదేవ!

89*

ఉన్ననాటి బతుకు ఉత్సాహపూరితం

వెసనమంటుకొన్న వెసనశించు!

లోప గుణమె వైరి లోనికి దారియౌ!

వావిలాలవాస వాసుదేవ!

90*

రాచమాయికుండు రాకాసియైపోయె

నేడమాయికులనుఏడిపించె!

గోలబతుకు నూతి గోతుల నడుమాగె!

వావిలాలవాస వాసుదేవ!

91*

కులము మతము, మంచి గుర్తులు అలనాడు

ఐకమత్యనిధులు, నైతికములు

పారలౌకిక సుఖ ప్రాప్తి బుణ్యాదులున్

వావిలాలవాస వాసుదేవ!

92*

చేతలందు మంచి చెడ్డలుండగ, మంచి

ప్రీతి మరియు చెడ్డ భీతి గలిగి

బ్రతుకు దారి తృప్తి భావింప వీలగున్

వావిలాలవాస వాసుదేవ!

93*

పరశు రామప్రీతి పరగర్వ దహనమే

సాధు జనుల రక్ష సాగు దీక్ష!

బ్రహ్మ తేజమొప్పు, భార్గవ రాముడా!

వావిలాలవాస వాసుదేవ!

94*

ఆదుకొనుము,వేగ నాదర్శమానవ

మూర్తి వగుచు ధర్మ ముద్ధరింప-

రమ్ము దయను జూపు రామచంద్రప్రభో!

వావిలాలవాస వాసుదేవ!

95*

తనువుతోడ బోవు తగలాటకాలపై

మోజు తగ్గదాయె! మోక్షమడుగ

తోచదాయె నాత్మ తో వెల్గు నీరూపు

వావిలాలవాస వాసుదేవ!

96*

విశ్వమిమిడిపోవు వివరంబు నీగీత

భక్తి ముక్తి గూర్చు, బ్రహ్మవిద్య!

జనులనోము పంట జన్మరాహిత్యము!

వావిలాలవాస వాసుదేవ!

*

97*

భారతీయ తత్వ భావమాధ్యాత్మిక-

సాంప్రదాయమయ్యె! వారసత్వ-

కౌతుకంబు విశ్వ కౌటుంబ జీవనమ్

వావిలాలవాస వాసుదేవ!

*

98*

పూర్వపరము జన్మ పుణ్యంబు సమకూర్చు

యోగములను భక్తి యోగమొకటె-

సులభమనియు మునులు సూచించి యుండిరి

వావిలాలవాస వాసుదేవ!

99*

పూర్వచరితకెక్కె పుణ్యోపకారముల్

మంచి-నీతిధర్మ-మానవతగ

సూక్ష్మమందు గలుగు మోక్ష విచారముల్

వావిలాలవాస వాసుదేవ!

100*

ఆత్మ తత్వ విజ్ఞతందరొక్కటిజేయు

జనన మరణమాత్మ జాగృతంబు!

గీతసూక్తులందు గీలించితివి తండ్రి!

వావిలాలవాస వాసుదేవ!

101*(సంపూర్ణం)

బ్రహ్మ సృష్టి తత్త్వ భావార్థ సంక్లిష్ట

వివరణంబు గీత విస్తరించె,

మాతవలెను, మరల-మరల దెల్పిన తీరు!

వావిలాలవాస వాసుదేవ!

102*

దేశ కాల పాత్రదేల్చివ్యవహరింప

గలుగు బుద్ధి యాత్మ గలుమ కడనె

నిల్చిపోవు-గీత నిర్ధేశ్యయోచన!

వావిలాలవాస వాసుదేవ!

103*

నీతి కట్టుబాటు రీతినాటిన మది

ముసురు సందియాలు విసురు ప్రశ్న!

పలు సమస్యలకును-పరుసవేదియె గీత!

వావిలాలవాస వాసుదేవ!

104*

కలుగు మేలు కీడు, కలిమిలేముల యందు

కీడునెంచి మేలు క్రియలు బూని,

నీదుభారమన్న నిఖిలంబు సమకూరు!

వావిలాలవాస వాసుదేవ!

105*

బ్రతుకు భక్తి వెంట పరపీడనములేని

పుణ్యమతుకు పడగ, ముందు, వెనక

జన్మఫలము ముక్తి జెందు నర్హతగూర్చు!

వావిలాలవాస వాసుదేవ!

106*

సకల కార్యములను సాగు దయాగుణ

సంచయంబు వెంట మంచి గలుగు!

మంచి గలుగ ముక్తి మార్గంబు దోచును.

వావిలాలవాస వాసుదేవ!

107*

నీదు పూజ చిత్త నిర్మలత్వము గూర్చు

నీదు భక్తి వెలుగు నిశ్చలాత్మ-

నీదు నమ్మకంబు నిఖిల సంతోషంబు!

వావిలాలవాస వాసుదేవ!

108*

శుభము శతక సూక్తి, శుభము లాభమునిచ్చు

భక్తి సుధను గ్రోల, బ్రహ్మముదము!

శుభము శ్రోతలకును, సుకృతార్థ ఫలమిచ్చు!

వావిలాలవాస వాసుదేవ!

 

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page