
వాసుదేవశతకము-3
(తే.గీ.)
1*(ప్రారంభము)
శ్రీశ!శ్రీకృష్ణ పరబ్రహ్మ! చిద్విలాస!
శ్రీద! శ్రీధర! పరమేశ! శేషశాయి!
శ్రీహృషీకేశ! విశ్వేశ! శ్రేయ! శ్రేష్ఠ!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
2*
క్రీడి వరద! నీ నామసంకీర్తనంబు శుభము
లాభము, నీపూజ సుఖము శాంతి!
నీదు చరణాలె శరణంటి నీరజాక్ష!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
3*
కనుల కదలాడు నీరూపు కరుణ కిరణ!
కనులు మూసిన తెరచిన కాంతులీను!
గుండె గుడిజేసి నినుభక్తి గొలుతు నేను!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
4*
భక్తి నీమహిమ వచించు భజన పాట!
పదిలమయ్యెను మదిలోన బాల్యమందె!
శరణు గోవింద! మాధవా! చక్రధారి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
5*
బాల్యమున నిను దర్శించి, భక్తి మ్రొక్కి-
యాటపాటల తిరుగాడు నాటి యాది!
చెదిరి పోనట్టి ముద్రగా చెన్ను మీరె!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
6*
బ్రతుకు బాటను నడవగా బాగనేర్పు-
గురుల బోధలు విద్యలై బుద్ధి గూర్ప~
భక్తి బాటయు కొనసాగె, బడికి-గుడికి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
7*
వయసుతో బుద్ధి గాంచిన వన్నె వాసి-
బాష భావంబు వెలయించు పటిమ జేసి
శతకమర్పించితిని నాడె శౌరి నీకు!
వావిలాలనివాస శ్రీవాసుదేవ!
8*
రాక పోకల నీదివ్య రక్ష కథలు!
రాత్రి బడినీదు గుడి మ్రోగె రాగ ఝరులు!
సహన బుద్ధిని సమకూర్చె, శాంతి ధామ!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
9*
వింటి గుడిగంట, బడిగంట వెంట పరుగు-
ప్రాథమిక విద్య సాధన పథకమయ్యె!
పూత పౌరాణికాల చేయూత గలిగె!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
10*
గీత బోధించె నంబియు క్రీడినైతి
తేట గీతోక్తి సవరింపు తెల్పె తాత-
తండ్రి వివరించె వైష్ణవ తత్వ-మహిమ!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
11*
వింత గొల్పెడు నీదివ్య విశ్వరూపు
చిగురు చిత్తంబు బంధించె, చిత్రముగను
భక్తి భావంబు వికసించె బ్రహ్మ జనక!
వావాలాల నివాస శ్రీ వాసుదేవ!
12*
బడిని బాష గురువు గూర్చె పద్య పటిమ-
గుండె నీభక్తి సడిచేసె కొండ ధారి!
చరణ యుగళిపై పూవైతి శరణువేడి!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
13*
సాధు సజ్జన మందార! సరసిజాక్ష!
ధర్మ రక్షక! నిష్కామ కర్మ యోగి!
దేవ! బలరామ సోదర! దీనబంధు!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
14*
భక్తి – విభ్రాంతి తొలగింప, పాపపుణ్య-
మనగ దెల్పె నాచార్యుండు, మరలమరల-
నాత్మ తత్వంబు గీతా నినాదమయ్యె!
వావిలాల నివాస శ్రీవాసు దేవ!
15*
తుచ్ఛ వాంఛ వీడగ మది దు:ఖమేది?
చెలగు నీభక్తి విశ్వాస చేత నాంశ-
నాత్మ తత్వంబు దరచగా నలరు ముదము!
వావిలాల నివాస శ్రీవాసు దేవ!
16*
ఎందరేమన్న కర్తవ్యమెంచి నీదు-
భక్తి బలముచే పొరుగూరి బంధు జనుల-
చక్కి జేరితినుద్యోగ సాధకునిగ!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
17*
కర్మ మర్మంబు దెలిపిన ధర్మ మూర్తి!
కర్మ ఫలసమర్పణ గొని కాంక్ష దీర్చు!
చతుర వాక్పరిపాలనా చక్రవర్తి!
వావాలాల నివాస శ్రీవాసు దేవ!
18*
దేవకీ పుత్ర!కంసారి! దివ్యగాత్ర!
కలుష కాళీయ మర్ధన! కమల నయన!
క్రూర దానవ సంహార! కుబ్జ వరద!
వావిలాల నివాస శ్రీవాసు దేవ!
19*
జీవ జీవన కారణ! దేవదేవ!
విష్ణు రోచిష్ణ! జిష్ణ! సహిష్ణ! కృష్ణ-
విభుడ, విశ్వశాంతాకార! విజయ మిత్ర!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
20*
విశ్వ మోహన! స్ఫురద్రూప! వేదవేద్య!
వేద వాగర్థముల మ్రోగు నాద బ్రహ్మ!
చేతనాంశ విహార! కుచేల వరద!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
21*
బ్రహ్మ! విష్ణు! మహేశ్వర! భవవినాశ!
గోప! గోవర్ధనోద్ధార! గోకులేశ!
రాజనీతిదురంధర! రాజపూజ్య!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
22*
కామ క్రోధాదులణగించు, కర్మయోగి!
సహన, సంయమన, వరద, జ్ఞాన యోగి!
కాలచక్రంబు ద్రిప్పెడు, కర్మ సాక్షి!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
23*
గోపికా చిత్త సంచార! గోపి కృష్ణ!
శోక నాశక! నందయశోద కృష్ణ!
భువిని సుఖశాంతి సమకూర్చు భుజగ శయన!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
24*
సత్య ధర్మ పరాక్రమ! సాధు వినుత!
దుష్ట దానవ సంహార! దురిత దూర!
శిష్ట రక్షక! గోవింద! శ్రీముకుంద!
వావిలాల నివాస శ్రీవాసు దేవ!
25*
నీతి నియమ పరాయణ, నిత్య సేవ్య!
జీవ జీవనాధార రాజీవ నేత్ర!
ఇష్ట కామ్యార్థ ఫలధాత! సృష్టి భర్త!
వావిలాలనివాస శ్రీవాసుదేవ!
26*
భక్తగణ భాగవతులింటి పాలకుండ-
కఠిన మతులను సవరించు కామజనక!
నిండు బ్రతుకును దయసేయు కొండధారి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
27*
వెంకటయ్య సీతమ్మల వేడ్క సుతుడ!
సత్య నారాయణుడ భక్తి శతక కృతుల-
మూడు భాగంబు లర్పింతు మ్రొక్కు దీర!
వావిలాల నివాస శ్రీవాసు దేవ!
28*
గీత నిత్య పారాయణ గీతమయ్యె!
ముఖ్యమగు భావపూర్ణముల్ ముదము గూర్ప-
అర్థ తాత్పర్య సమత యోగమ్ము దెలిసె!
వావిలాల నివాస శ్రీ వాసు దేవ!
29*
ధర్మ జయ శబ్ధముల మధ్య ధర్మమునకె-
జయమ-సూచించె భవగీత! నయము గూర్చె!
నీతి ధర్మ రీతుల నవనీతమనగ!
వావిలాలనివాస శ్రీ వాసుదేవ!
30*
భక్తి శతక కృతుల మూడు భాగములుగ
మూడు నవరత్న హారముల్ ముక్తి దములు-
గాగ దీవించి ధరియించు కమలనయన!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
31*
బడలి శోకాబ్ధి సుడివడు భక్త జనుల
నావ సాగించి దరిజేర్చు నావికుడవు
నిన్ను నమ్మిన బ్రతుకెల్ల నిర్భయంబు!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
32*
భరత ధాత్రి పుణ్య ప్రదము భక్తి మయము
పుణ్య తీర్థముల్ క్షేత్రముల్ పుష్కలములు
విశ్వ జనసుఖముగను దీవించు మునులు
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
33*
భరత సంతతి కారోగ్య భాగ్య మొసగు-
గ్రంథ పఠన సత్సంగమల్ గలుగ జేసి
సాధు, సామాజికుల భక్తి సాగనిమ్ము!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
34*
పుడమి కళ్యాణ గుణ పరిపూర్ణ! సదయ!
పుణ్య దాయక! గీతార్థ బోధ గురుడ!
ధర్మ దేవతా ప్రతిరూప! ధనుజ వైరి!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
35*
కపట, పూతన, ధేనుకా, శకట, బకుల-
ద్రుంచితివి బాల్యమున కంసు దునిమి తల్లి
దండ్రి చెఱవిడిపించిన, ధర్మమూర్తి!
వావిలాలనివాస శ్రీవాసు దేవ!
36*
శిష్ట జనపాల! యదుకుల శ్రేష్ఠ! కృష్ణ!
రాజనీతి శాస్త్ర పురాణపురుష!
కష్టములుదీర్చి – గూర్చుమభీష్ట సిద్ధి!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
37*
సత్య శివసుందరాకార! సత్వమొసగు!
బ్రహ్మ శివకేశవా! భక్తి భావమిమ్ము-
మూడుమూర్తుల మురిపించు ముక్తి ధాత!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
38*
పుండరీకాక్ష!పండరి పాండురంగ!
పార్థ సారథి! పాండవ పక్ష పాతి!
వాసవాది సురార్చిత! వసుమతీశ!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
39*
మహిత వేదాలు గాచిన మత్స్య రూప!
కూర్మి కులగిరి మోసిన కూర్మ రూప!
క్రోధి కనకాక్షు ద్రుంచిన క్రోఢరూప!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
40*
శ్రీశ!ప్రహ్లాద వరద! నృసింహదేవ!
పాపి కార్తవీర్యాంతక! పరశురామ!
పుణ్య గుణనిధి – రామసౌజన్యమూర్తి!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
41*
మల్లయోధ గురు బలరామావతార
దుర్జనాళి దౌష్ట్యము మాన్పి యర్జునునకు
విపుల గీతార్థమిచ్చిన విశ్వరూప!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
42*
బుద్ధ రూపంబు దాల్చిన బుద్ధి ధాత!
భూత దయదెల్పితో శాక్య బుద్ధ దేవ!
కట్టడిని జేయ నరుదెంచు కలికి రూప!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
43*
సుధను సురలకు, గీతను సుజనులకును
నయముగను గూర్చు హరిహర నాథ కృష్ణ!
పృథ్వి మొరలాలకించిన పుణ్యమూర్తి!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
44*
అవని ధర్మంబు నిలబెట్ట నవతరించు
శతసహస్ర రూపుల వెల్గు శాంతి ధాత!
ప్రీతి వర్ధన! ఘనశిఖి పించ మౌళి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
45*
పూర్ణ భక్తి శ్రద్ధయు పౌనపుణ్య ఫలము!
పుణ్య ధననిల్వకై యాత్మ పుడమి బుట్టు-
భక్తి జీవుల కైవల్య పదము జేర్చు-
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
46*
ఇహపు కోర్కె కోరల మధ్య నిముడలేక-
నరయు చుందురు నీరూపు నహరహంబు!
పరము సాధింప నీభక్తి పథము గంద్రు!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
47*
గోప! గోపతి! గోహిత! గోపి కృష్ణ!
గోకులేశ! గోవింద! గోలోక వాస!
గోపికాజనోద్ధారక! గోవిహార!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
48*
మాధవా!మధుసూదనా!మధురనామ!
మధుర కవిజన మందార! మధురనాథ!
మధుర వేణుగానవిలోల! మధుర వచన!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
49*
సర్వతోముఖ!సర్వజ్ఞ!శర్వ హృదయ!
విశ్వ వాగీశ్వరేశ్వరా! వినుత చరిత!
గీత ధాత! జగద్గురు! క్రీడి వరద!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
50*
సుఖద! సాధు సజ్జన భక్త సులభ! సుముఖ!
సకల శూరజనేశ్వర! సమతయోగి!
పుణ్య శ్రవణ- కీర్తన భక్తి పూర్ణ సదన!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
51*
నీల గగన సదృశ దేహ! నీల వరద!
నరుడ! నారాయణాముని నామ రూప!
శౌరి! దామోదరా! రవి చంద్ర నయన!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
52*
భక్త వత్సల! శ్రీవత్స వక్ష! విష్ణు!
ధర్మ సంస్థాపనా చక్రధారి కృష్ణ!
కంస చాణూర మర్ధన! హింసదూర!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
53*
జన్మ మృత్యు జరా జాఢ్య జంకు మాన్పి
ప్రజల మళ్ళించి, నీభక్తి బాట జేర్చి
ముక్తి మోదమ్ము గలిగించు రుక్మినీశ!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
54*
పాల ద్రోణి లో గ్రహతార పథము వెలయు
సూత్ర గతి శాస్త్ర విజ్ఞాన సుధయె సైన్సు!
దాని శోధింప గడచెను తరతరాలు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
55*
చపల చిత్తంబు కదలాడు జలము వలెను
అడుగు గనరాదు నిశ్చల మైన మనసు
జూడ చిత్రపటము బోలు చుండు జగతి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
56*
సంచితార్థ సుకృత జన్మ సార్థకముగ
జన్మ రాహిత్యమైయాత్మ జాగృతముగ
జీవి నినుజేరుటే ముక్తి దివ్య సృష్టి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
57*
కూడు గూడు గుడ్డయు నీదు కూర్మి పేర్మి
తోడు నీడ కీర్తియు సిరి కేడుగడగ!
గడచు నాటక దర్శక! గరుడ గమన!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
58*
తలచినది జరుగదు నీదు దయయు లేక
జరుగ నున్నది తుద ధర్మ జయము గాన-
నీదు కృప జగన్నాటక నియతి జరుగు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
59*
నీదు నిర్ధేశ్యమీ జన్మ నికష భక్తి!
ఫలిత గుణ పుణ్యమున ముక్తి పదమటంచు-
ప్రకృతి బడి గీత బోధన, ప్రగతి నీదె!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
60*
కలలు నిజమగు నీదయ గలిగె నేని-
రాతి నాతియై వర్తించు జాతి గెలుచు
మూడు మూర్తుల నీసృష్టి ముదము గూర్చు
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
61*
ఆపద మ్రొక్కి ప్రార్థింప నాదుకొనుము
సంపదల మర్చిపోవ మన్నించి జనుల
సకల సంకటములు బాపు వేంకటేశ!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
62*
మాయ తెర మదినాత్మయు డాయలేము
ఆత్మలో నిన్ను నరయుటకలవి గాదు
మనసు గాని వారికి యాత్మ మార్గమీవె!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
63*
మాయ తెరనుండి వీక్షించు మార్గ మేది?
శిలగ దోచు మానవ గుండె శ్రేష్ఠతేమి?
ఆత్మ దర్శించుటేరీతి యదుకులేశ!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
64*
ఆత్మ సంతబెట్టియు నమ్ము నాధునికుల
అర్థ-పర్యాయ పదమేమి? యదియు సరుకె!
బుద్భుదము జీవన శబ్ధమద్భుతంబు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
65*
స్వార్థమొక్కటే యాత్మను సంత గొనియు
మతము మార్చి తనమత సమ్మతము గూర్చు
గమ్యమొకటైన మత తారతమ్యమేల?
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
66*
స్వార్థ విషవృక్షమే జనుల్-సరసజేర,
నరక కూపాన విసరేయు నడత గూర్చు!
దాని పెరికి వేయగా గీత దారి మేలు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
67*
మనసునిండిన దేశీయ మాత ప్రేమ!
ఇతర మాతలు మన్నించు నింపు గూర్చ-
విశ్వ జాతి బేధము లెట్లు విస్తరించె!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
68*
భ్రాంతి దీరగ యోచించు బలము గీత!
శాంతి గోరగ జనసేవ సాగు రీతి-
ముక్తి తీరమునకు జేర్చు భక్తి నావ!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
69*
మనుజు గొప్ప-తేగముగల్గు మార్గమందె!
నలుగు రొకటైన సేవయే నయము జయము!
పదుగురొకటైన దానమే భక్తి ముక్తి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
70*
బడలి శోకాబ్ధి సుడివడు భక్త జనులు-
కాని కాలంబు నెదురీద గలుగు మేలు!
నిన్ను నమ్మిన బ్రతుకంగ నిర్భయంబు!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
71*
నీతి నియమ నిష్ఠయు, భక్తి నిండు గుండె
శోక రహిత జీవనమిచ్చు లోకమందు
జీవి చిత్తశాంతియె భావి విశ్వశాంతి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
72*
బుద్ధి సూక్ష్మత, సూనృతం, భూత హితవు
సత్య లోక ప్రసాదమై శాంతి గూర్చు!
మంచి కొఱకె వెచ్చించాలి మనుజు మేధ!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
73*
మంచి-పెంచినఁబెరిగేటి మనుజ శిశువు!
చెడ్డ తనకుతాఁ బెరిగేటి దొడ్డి గడ్డి
లోభి మరియాదలే వేరు లోకమందు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
74*
తెచ్చెదో?రమ్ము-యిచ్చెదో చేరవత్తు?
పుచ్చు కొనుటొక్కటందరికి పుడమి సుళువు!
లోభి మోహంబు వీడడు లోకమందు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
75*
రాక పోక – రాణించు పరాన్న భుక్కు-
కలిమి నాటి బంధువు లేమి గానరాడు!
లేమి బ్రతుకు బోల్చగ నీరు లేని చెఱువు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
76*
మైత్రి మాయ నాలుక తీపి మాట మాయ-
అవని నవకాశ వాదములావరించె!
సంపదలు గూర్చుటకు సాగె చదువు పదవి!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
77*
మొదట లోభమాపేక్షయై మెదడు దొలుచు-
మేక పులియగు సేవకుఁడేకు మేకు!
గాగ యజమాని కుర్చి తాఁనాక్రమించు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
78*
నరుడు నరకుడైతే ధర నరకమగును!
సవ్యసాచియై సాగిన స్వర్గమగును!
తలపు నాశ్రయించియు గల్గు తత్ఫలంబు!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
79*
ఓటమిని మెట్టుగానెక్కి యోర్పు సాగి-
గమ్యమును జేరు వారిదే ఘనయశంబు!
ధృతిని కృషిజేయు వారికే ధృవము లబ్ధి!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
80*
నవ్వి నట్టిది యగునాప నువ్వు చేను-
పురుగు గొట్టి హెచ్చి చిగుర్చు-పులకరించు
పంట నూర్చగ – ఆసామి పరవశించు!
వావిలాల నివాస శ్రీ వాసుదేవ!
81*
బ్రతుకు నీదు దయదప్పిన బడలి పోవు
రుధిర పోటెత్తు సూచించు రుద్రభూమి!
నీదయా వీక్ష నారోగ్య నికర మొదవు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
82*
మంచిగలవాడె భక్తుడు మనుజులందు
దయను జూపు వైష్ణవ గురు, దాసదాస-
భావమున దీన జనసేవ దీక్ష గొనును!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
83*
హామి యిచ్చిన గల్గును హాయి, యెడద-
హాని గూర్చని భావంబు నలరు చేత-
హామి దీర్చిన మోదంబు నధిగమించు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
84*
మాట శుద్ధి చే మనిషి ధర్మాత్ము డగును
కర్మ శుద్ధిచే ఘనయోగ కార్మికుండు!
మనసు శుద్ధిచే భువిమహాత్ముడగును!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
85*
పరగ పేద కోపము తన పదవి ముప్పు
పేద కోపించినను నేత పదవి ముప్పు
కోపమే ముప్పు తను రక్త పోటు గుప్పు
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
86*
మనసు కర్మకు తోటయై మాట గూర్చు
కర్మననుసరించియు బుద్ధి గలుగ శుద్ధి
మంచి త్రికరణ శుద్ధిగా మనిషి దిద్ధు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
87*
మనసు ప్రేమకు ప్రతిబింబమైన మనిషి
మాట ప్రేమకు బాటయై మంచి సాగు
కర్మ ప్రేమకు సమాంతర కథయె బ్రతుకు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
88*
మంచి మనసు ప్రేమను నాటి మమ్ము గాచి
మంచి పలుకు బడిని గూర్చు, మంచి పనుల
నెంచి జీవింప నేర్పి మన్నించు దేవ!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
89*
ఆత్మ వృత్తాన నిను నిల్పు తాత్వికంబు
దెల్పి కలిమాయ తెరజీల్చు తేజమిమ్ము!
కర్మ నిష్కామ్య విధి ఫలకాన్క గొనుము!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
90*
శుద్ధి బుద్ధి వివేకమ్ము వృద్ధి గాగ
కలుగ జేయుము దయతో త్రికరణ శుద్ధి!
లోపమును దీర్చు గురు జేర్చు లోక గురుడ!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
91*
జీవి జీవిని వెలుగొందునీదు దీప్తి
నిశ్చలాత్మ దర్శింపగఁ నిల్చునట్టి
చిత్త శుద్ధిని గలిగించు చిద్విలాస!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
92*
జీవ జాతులన్నిట నాత్మ దేవళంబు
వెలయు, నీమూర్తి వెలుగొందు వేడ్క దీర్చు!
ఆత్మ నిను జేరగా భక్తి-యాత్ర ముక్తి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
93*
ఆత్మ శుద్ధికై జన్మ – పుణ్యాత్మ కీర్తి!
పుణ్య సంపద నార్జింప బూను భక్తి!
దారు లేవైన నినుజేరు దరులె ముక్తి!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
94*
మాయ మార్గపు ద్వంద్వముల్ డాయు మదిని
సాగు సమతుల్య భావన – చాల మేలు!
ఇహము వీడగ పరతత్వమింపు గూర్చు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
95*
ద్వంద్వ,మాయకాతీతమౌ దారి నాత్మ-
సాగు, సమదృష్టి భావన సత్వమొసగు!
దాని సాధింప, గీతోక్తి దారి జూపు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
96*
మాయ విడకున్న నాత్మీయ మార్గమేది?
ఆత్మ దెలియక పరమాత్మ నరయుటెట్లు?
గీత దెలిపె నిరాటంక రీతులెల్ల!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
97*
ఆది మధ్యాత రహిత! జీవాత్మ మహిమ-
నరయ నానంద బ్రహ్మమే, యాత్మ తత్వ-
విధుల నాచార్య త్రయ బోధ వినగ దెలియు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
98*
ద్వైతమద్వైతమై రెండు దారులొక్క
గమ్యమును జేరె, మదితార తమ్యమనక
ప్రీతి గావిశిష్టాద్వైత రీతి వెలసె!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
99*
ఆత్మ వృత్తాన వృత్తమై యలరు చున్న
దివ్య పరమాత్మ దీపించు తీరు తెన్ను
సృష్టి జీవులనేకాత్మ, దృష్టి వెలసె!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
100*
పొరలు తెరలుగా మదిలోను పొంచియున్న
మాయ ఛేధింప నీగీత మార్గమయ్యె!
అరచి గీపెట్ట సరిపడు వైరులణగె
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
101*(సంపూర్ణం)
గోపికా మనోహర! నీవి గోప్యగతులు
చిత్త నవనీత చోర! నీ చిత్ర కథలు!
నీదు శతక సూక్తిని గల్గు నిఖిలయశము!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
102*
గట్టిగా వస్తువుల్ బట్టు పట్టుకారు
పట్టుకొన్న చేతిని తాను పట్టనట్లు-
పట్టు దల నాత్మ నిను గనిపెట్ట గలమె!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
103*
జీవ తారక గీతార్థ దివ్య బోధ
తేగ గుణమొప్ప జీవన ధ్యేయ విధుల-
భక్తి విశ్వాసమును గూర్చు ముక్తి ధాత!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
104*
జన్మ నినుజేర్చు బొక్కెన జగతి బావి-
నీటి బిందువై నీభక్తి బాట సాగి
చేర వత్తుము దయజూపి చేదుకొమ్ము!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
105*
నిత్య నీరాజనము నీకు నిండు బ్రతుకు!
వాసవార్చిత శ్రీపాద! దాస పోష!
అంతరాత్మలో వెలుగొందు ఆది దేవ!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
106*
విశ్వరూప! గీతాచార్య! విష్ణు! జిష్ణు!
విశ్వ శాంతి ప్రదాత! కుచేల మిత్ర!
మానవోత్తమ గుణనిధుల్ మాకొసంగు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
107*
నిత్య నిష్కామ కర్మంబు నీదు సేవ!
పాటి దప్పని జీవన పథము సాగ!
మాయదొలగించి మాతప్పు గాయుమయ్య!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!
108*
శుభము నినుజేరి యర్చింప సుఖము శాంతి!
శుభము నీసేవ భక్తుల కభయ ప్రదము!
శుభము శతకపఠన నిత్య శుభకరంబు!
వావిలాల నివాస శ్రీవాసుదేవ!