
శ్రీ శ్రీ శ్రీ తిరుపతీశ శతకము
(ఆ.వె.)
1*
శ్రీనివాస నీదు చిద్రూప దర్శనం
చింతమాన్పిగూర్చు చిత్తశాంతి!
కిల్బిషహరమగు చికిత్స సుస్థిర భక్తి!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
2*
శ్రీరమేశ! నీదు చింతనామృత పాన
మత్తులోనె చింత మరచి జనులు-
భక్తి సహస్రనామ భజన సాగింతురు-
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
3*
చిత్త శుద్ధి మ్రొక్కి శ్రీనివాసాయని
కన్నులారనిన్నుగాంచు వేళ-
నడ్డుకొనెడు తెరలునానంద బాష్ఫముల్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
4*
భిన్నజాతి మతాల విభిన్నదారి
గమ్యమీవె యోచన తారతమ్యమీవె!
ధర్మవృత్తకేంద్రపు దత్తబిందువు నీవె!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
5* తే. గీ.
రాజ్యకాంక్షచే కలహించు రాజులలుగ-
రక్తబంధములు తెగె-రగిలె పగలు!
ధర్మజుడు గెల్చె రారాజు ధరణిగూలె!
తిరుణహరిసత్యమును బ్రోవు తిరుపతీశ!
6*తే. గీ.
విత్త కాంక్షలుడిగె, చిత్తచింతలుడిగె-
ఈగ కన్న మిన్నగు తేనెటీగ యనగ-
క్రొత్త బ్రతుకు తెట్టెనుబెట్ట కొండకెక్కె!
తిరుణహరి సత్యమునుబ్రోవు తిరుపతీశ!
7*తే.గీ.
నిన్న నేడు రేపటి సృష్టి నియమకాల-
కర్త కర్మ క్రియ రచన కల్పములకు-
బ్రహ్మవీవె! సుస్తితిగూర్చు భర్తవీవె!
తిరుణహరి సత్యమునుబ్రోవు తిరుపతీశ!
8*తే.గీ.
నీదు రూపసందర్శనమిచ్చు ముదము-
నామభజనచేకూర్చును నయము జయము!
నీదు భావన జీవన నిష్ఠ యశము!
తిరుణహరి సత్యమునుబ్రోవు తిరుపతీశ!
9*తే.గీ.
సప్తగిరులెక్కివత్తురు సంతసమున
బారులునుదీరి నిలుతురు భక్తి గరిమ!
యిసుకవేసినరాలని వసుధ జనులు!
తిరుణహరి సత్యమునుబ్రోవు తిరుపతీశ!
10*ఆ.వె.
చిక్కనీయదు నిను చిత్తచాంచల్యము,
చెప్పనీయదు మది చెత్త బుద్ధి-
నీదు కరుణలేక నేదిసాధ్యము భువీ
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
11*
మంచి గనియు వినియు మంచి మాటలనాడి
మంచిజేయుమన్న మాట వినక-
మోసమాయెననుచు మొరబెట్టుకొందుము!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
12*
నమ్మికొలువ గలవు నవవిధ భక్తి మా
ర్గములు, నిన్ను జేర్చు గమనగతులు!
వేయిరూపులందు వేడ్క గూర్తువు శౌరి!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
13*
ఆత్మ రక్షణార్థమభ్యసించెడు విద్య-
చిత్తకామ్యకర్మ విత్తఫలమె!
విశ్వశాంతి, బ్రహ్మ విద్యకే సాధ్యము!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
14*
భక్తితో సమైక్య భావబంధము గల్గు-
నాత్మ తృప్తియు పరమాత్మ ప్రాప్తి –
గలుగు ననియు మునులు గమనిక జేసిరి!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
15*
జనుల పాప పుణ్య సంపద, తగుజన్మ-
సంచితార్థ ఫలము, సాగుబుద్ధి-
కర్మననుసరించు కాలానుగుణముగా
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
16*
బాల్యమందు పూజ భజన యవ్వనమందు
వృద్ధ దశను తపము సిద్ధి బొంద-
శక్తిమేర భక్తి సంసారి కొనసాగు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
17*
మనిషి మేధ నీదు మహిమ విశ్లేషించె-
శ్రేష్ఠజీవి గాన శేషశాయి!
దానవతను ద్రోసి మానవతనుబెంచె!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
18*
ఏడు కొండలెక్కి, ఏడేడు జన్మల-
కర్మ ఫలమునీకె కాన్కజేసి-
పరమ పదము గోరు భక్తి సమూహముల్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
19*
ఉర్వి కొండలేడు ఊర్థ్వలోకాలంచు-
తెల్పుచుందురు, యిలవేల్పువనుచు-
వివిధ శ్రమలకోర్చి విశ్రమింతురు గుడిన్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
20*
స్నానమాడి మ్రొక్కు సామిపుష్కరిణిలో
మునిగి తేల లేదు ముందు జన్మ-
యనుచు, భక్తులు ఘనయాత్ర సాగింతురు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
21*
వేడ్కనెంతసేపు వేచినా దర్శన-
బారు జరుగు పెద్ద పామువలెను!
సాగు భక్తి భావ సంస్కృతి రజ్జువై
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
22*
మ్రొక్కు మరచి టికెటుదక్కు సంతోషాన-
పొంగి కృంగు భక్తి పోటియందు-
యితరపాలన జన హితవుగా శాసించు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
23*
కలిమి లేమి నిన్నె కలవరింతురు భక్తి-
కల్ల నిజములెన్ని కలలుగంద్రు!
నిద్రరానివేళ నినదింత్రు నీసూక్తి!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
24*
మనిషి మారి మంచి మార్గ గామియుగాగ
దూరమగును, దురిత దుష్టదారి!
మంచి కేంద్రముగను, మతవృత్తమే మేలు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
25*
పశువు నుండి వేరు పరచు మేధనొసంగి-
శుచి శుభ్రతలు నేర్పి, సూక్తి నడిపి-
నరులతీర్చి దిద్దు, నారాయణుడవీవు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
26*
మనసు నిల్పు కృషినిమరగిన మేధస్సు-
బుద్ధి త్రికరణాల శుద్ధి నాత్మ-
తనువు ధనువు వంచి తరలిపోవ యశస్సు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
27*
మతపునాదులరయ మంచికి పాదులే
నీతులొకటె-జాతి రీతి తార-
తమ్యగతులదారి గమ్యంబు నొక్కడే!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
28*
ఎన్ని శాస్త్ర గతులు? ఎన్నిపురాణముల్?
దేహ దేహితత్వ గేహనిధులు!
ఎచట వెలసె? నచట వేంకటేశ్వర నీవు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
29*
శ్రద్ధ గలిగి, భక్తి సాగియు నినునమ్మి-
బ్రతుకు వారి సుగతి భద్రమంద్రు!
భక్తి యోగమందె, బహుసుళువుగ ముక్తి!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
30*
పాప భీతి ఫలము పావన జీవనమ్
నియమ నిష్ఠ భయము నయము నిచ్చు!
సహన శీలగుణము సమయజ్ఞతే ఘనమ్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
31*
నీతి నియమ నిష్ఠ నిర్భయ సాధనమ్
భక్తి బాట నీతి పథముబోల్చు-
వాస్తవంబుసౌష్ఠవాభివృద్ధి ఘనము!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
32*
వదరు మాటలితరు బెదరగొట్టదు భక్తి-
వాదులాటవీడి వాస్తవంబు-
నీదు సూక్తివెంట నిజభక్తి నిశ్చలమ్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
33*
కాలమితిని నిద్ర కమ్మని భోజనమ్
చెమటలూరు శ్రమయు చేవబెంచు!
నీదు సేవ తృప్తి నిచ్చి సేదనుదీర్చు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
34*
బ్రతుకు పోరు గెలువ బ్రమవీడి మనవలె-
యుక్తి భుక్తి శక్తియుక్త భక్తి-
భజన రుజచికిత్స ప్రజలపాలిట వరమ్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
35*
ఇంటిలో పితరులు ఇహలోక దైవముల్
గుడిని నీవు! బడిని గురువు వేల్పు!
పరగ పుడమితల్లి ప్రత్యక్ష దైవముల్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
36*
జాతి తర్క రహిత-జాగృతి వాదాల-
కాల చక్ర గమన కాంతినొందు!
నీతిధర్మ పరిధి నిర్ధేశ్య సాధన!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
37*
భ్రమలు వీడి భక్తి భావసామ్యత గల్గి
పూజ్యగురు పితరులఋణం పుడమి దీర్ప!
బ్రతుకవలయునీదు భక్తిచేయూతగా
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
38*
ఆశకంతులేదు-అఖిలమ్ముసొంతమై
నంత తెగదు నంతకంతబెరుగు!
పాశమగుచు-యముని పాశమ్ము జతపడున్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
39*
వాదుజేయ – వాది ప్రతివాది వాదించు
రాత్రిపగలు జను పరస్పరంబు!
సాక్షి వెంట కర్మ సాక్షి సంధ్యలుసాగు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
40*
అవనియందు బ్రతుకుటద్దమందు ముఖము
యుద్దమందు జయము నూహయట్లు-
నుభయ పక్షములకు కుడియెడమై తోచు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
41*
లలిత కళలుమదిని లాలించు తల్లిగా
మిగత కళలు గూర్చు మిగుల తృప్తి!
శాస్త్ర సూత్రగతులు శాసించు ఏలికల్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
42*
చపల బుద్ధి – జన్మసాఫల్యతయులేక
సాగుచుండు బ్రతుకు సాగుదాక!
తెరువు జూడ బావి తెగినబొక్కెన బోలు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
43*
కరువు బరువు కన్న పరువు బరువు మిన్న-
బలము గోలుపోవు బ్రతుకు దెరువు-
వృత్తి వేరు చిత్తవృత్తివేరై సాగు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
44*
నింగిజారునీరు నిండుకాలువబారు
నదులసాగు కడలినావిరగుచు-
మబ్బుసాగి కురియు, దుబ్బలు పండించు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
45*
ఉరుము-మెరుపు-పిడుగు ఊరంత జడివాన-
ఉప్పెనయుతుఫాను-ఊరు దిబ్బ!
యిసుకమేట వేసి, విసిగించు పలుమారు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
46*
పత్తిరైతు,తెల్లపసిడికై రుణపడి,
చావబూను, నాశచావబోదు-
బుద్ధిమాటజెప్ప బుడ్డోడుకోపించు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
47*
పత్తి – దూది- నూలు’బట్ట దుస్తులరంగు
రింగు ఘనత రైతు మ్రింగుగాని-
బ్రతుకునిలవ కొంత బట్వాడ జేయడు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
48*
తల్లికోడి గ్రుడ్లు తట్టబెట్టగ నామ్లె
టైనవెన్ని? పొదుగవైవ బ్రతికి
బయటపడినవెన్ని పాడుచీ గ్రుడ్లెన్ని?
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
49*
మంచి మైత్రి గలుగ మనుగడ దీపించు
మాయ మైత్రి గలుగ మనసుకోత!
మాయమైత్రికన్న మంచి శత్రువుమేలు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
50*
సర్కసాడి మిగుల కర్కషు మెప్పింత్రు-
బేరమాడలేరు బేలలనగ-
విత్త దృష్టికన్న చెత్తదృష్టియు మిన్న!
తిరుణ హరిని బ్రోవు తిరుపతీశ!
51*
గొట్టెకాయరాలఁ గొట్ట కష్టముగాని
దెబ్బకొక్కపండు దుబ్బబడదె!
పక్వమైన బుద్ధి ఫలసాయమందించు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
52*
డబ్బులున్నచోట,గబ్బుసహింతురు
డబ్బగొట్టి యున్న డబ్బులూడ్చి-
దుబ్బుగాడటంచు దూరమై పోదురు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
53*
మద్య, ధూమ పానమత్తు చిత్తడిదిర్గు-
జాలవిడిన బొంగరాల వరుస!
తిరిగి చితికి చేరి త్రిప్పిరి తనవారి!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
54*
ధూమ పానమందు దూరియు పొగచూరి
యుసురు గోలుపోవు’ – దూర దృష్టి-
లేని వారు, హామి లేని వారే కదా!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
55*
మాట నిలుపనట్టి, మనసు లేని గుణము
తారు మారు జేయు తాత్వికంబు!
మాయికుండు తా నమాయకు వంచించు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
56*
అల్లనాటి పూర్వులల్పసంతోషులై
ఎండమావి బ్రతుకు కొండ దరిని-
గడపి వరద నాటి గానాలు జేసిరి!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
57*
సోమరైన నరుడు, సోమకాసురుడగు-
చెమటనోడ్చనట్టి చెడుగు జేరి-
గొడుగు బట్టి, యితర గొడవలో తలదూర్చు!
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
58*
కళలయందు,తెలుగు కళలు సజీవముల్
కల్పనాకృతులుననల్ప సిరులు!
కాల గతిని కళలు, శిలలైన శిల్పముల్
తిరుణహరిని బ్రోవు తిరుపతీశ!
59*
ఊహ శాస్త్ర గతులునుర్విప్రయోగముల్
వాస్తవంబులయ్యె, వాస్తు వనగ-
భూమి శాస్త్రమనగ, బుణ్యాదులేర్పడెన్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
60*
ఆస్తి- నాస్తి, నరులకారాటమే జాస్తి
సతము మతము చింత సతమతంబు!
సంపదలనునింప శాస్త్రమూహలదేలె!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
61*
ఇంటర్నెటు రంగు లింటింటి సిడిమెట్టి,
నెట్టు వర్కుపేర నేర్పు జూప – సహజ ప్రకృతి టీవి సమ్ముఖమున నిల్చె!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
62*
భరత మునుల గుప్త భావార్థములు, శాస్త్ర
యోగ్యుడడుగ సత్యమొప్పు విజ్ఞ-
గతులు దాచి దనుజ మతిజెడ నుడివిరీ!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
63*
రాక పోక సాగు రాకెటేర్బస్సులు-
గ్రహపు గృహము జేర్చు గగన బాట!
చోద్య శాస్త్ర శోభనోద్యమంబులు సాగె!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
64*
ఊహజేయు, ప్రశ్నలూహించి యడుగగా
తగుజవాబు గోరు తపన బెంచి-
గొప్ప శాస్త్రముడులు, విప్పడు మేథావి!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
65*
శాస్త్రముద్భవించెసారూప్య ప్రశ్నలన్,
తగుజవాబు గీత తత్త్వబోధ!
శాంతినుద్ధరించె సమతాదియోగముల్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
66*
ఊహ వలదటన్న ఉనికేది నీలీల-
లడిగి దెలియ నరుడు లబ్ధిబొందు!
లోభ మోహమణచ లోకకళ్యాణమే!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
67*
గెలువకున్న తొండి గేలిమానుట మేలు!
తెలువకున్ననడుగు తెగువ మేలు!
మనుగడ చెడు మరచి మైత్రిసాగుట మేలు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
68*
కలము గళములొప్ప కవిగాయకులు నేడు-
వ్రాతకైతలందు రాణకెక్కి
భక్తి రక్తి కవిత ప్రజల మెప్పించిరి!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
69*
పాలు పెరుగు తోడు పడగ దాంపత్యముల్
సాగుచుండె జీవ సాగరాన-
నాత్మ వెన్నతోడు-నాత్మీయ మన్ననల్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
70*
మనసు గల్గ దోషి మన్నింప భావించు
తగిన సేవ గల్గ తగవు మాన్పు!
నీతి సూక్తి జనుల-నిస్వార్థ భక్తియే!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
71*
పరులకుపకరించు పనులందు పుణ్యమున్
పరుల పీడనంబె పాపమనగ!
సకల శాస్త్ర సార సంగ్రహ మీవాక్కు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
72*
పరుల సేవ, నీదు పదముజేరగదోవ
తరతరాల నాత్మ తత్వమెరుగ-
నంటులేని బ్రతుకు నంటవాటంకముల్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
73*
స్వార్థరహితుడగు,సమర్థుడు నిరుపేద-
యైన నమ్మరు కట! వైనమేమి?
విశ్వసింత్రు ధనికు విహితరహితుడైన!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
74*
మానవత్వ పరిధి-మనుటెల్ల మర్యాద
మనుజు గొప్పధనము, మాటవెంట-
జన్మ గొప్ప బ్రతుకు జనుతీరు తెన్నులన్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
75*
పనస పండు జూడ పైనెంత గరుకైన
లోన నధికతీపితొనల యట్లు!
గరుకుదనములోనె గలుగు మార్దవప్రేమ!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
76*
నలుగురొక్కటగుచు,నగుబాటు జేయగా
జూచుచుంద్రు నయము గూర్చు పనుల-
కలిసిరారిదేమి? కలిమాయకాలమే!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
77*
కఠినబుద్ధి ప్రేమ, ఘటనసహించునా
హింసబొగడి పరమహంస తెగడు!
దుష్టబుద్ధికెపుడు దూరముండుట మేలు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
78*
సైన్సుబోల్చ చవుల నైస్క్రీంల పుల్లయే-
తత్వ బోధరుచుల దగుసమోస! సదసద్వివేక చతురత చదువాట!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
79*
గడన కొలది కీర్తి గలుగు తాత్కాలికమ్
కీర్తి గడన, దాన క్రియల వెంట-
బ్రతుకు గడుపు నిత్య బాట సామాజికమ్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
80*
భూత చరిత గన్న పూత చర్ఛలు విన్న
వర్తమాన నరుని వర్తనమ్ము!
భవిత ధనము చుట్టె భ్రమణంబు సాగించె!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
81*
తోలు బొమ్మలాట బోలు జీవితబాట
సూత్రధారివీవె! పాత్రధారి-
కీలుబొమ్మ నీదు క్రీడయే సర్వమున్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
82*
శాపమిడిరి మునులు జయ విజయులునూరు
మిత్ర జన్మలనక మిగుల దరిని
శత్రులైరి మూడు జన్మల కడతేర-
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
83*
శ్రీ వరాహ నారసింహరూపులనెత్తి
కనక నేత్రు కనక కశ్యపులను-
గాసిజేసి మోక్ష గాముల జేసితో!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
84*
దాశరథిగబుట్టి దశకంఠుతో కుంభ-
కర్ణుగూల్చియు మది కరుణజూపి-
మరల గల్గు జన్మ మార్గమ్ము జూపితో!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
85*
ద్వాపర శిశుపాల దంతవక్త్రులుగాగ
రయముజేసి జన్మత్రయములందు-శాపముడిపి జయవిజయులను గాచితో!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
86*
చింత దీర్చిగాచు శ్రీకృష్ణ పరబ్రహ్మ-
గీత ధాత! క్రీడి కీర్తిధాత!
నీదులీలలెన్న నెంతవాడను తండ్రి!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
87*
పిల్లిజాతి బుట్టె భీకర వ్యాఘ్రంబు
జాతి మెచ్చెజాతీయ ప్రఖ్యాతి హెచ్చె!
శత్రువయ్యె దాని చర్మసౌందర్యమే!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
88*
కుమతులందు దిర్గి కుమ్మరిపురుగట్లు-
బురద నంటనీక పుడమి బ్రతుకు-
దారి జూపి భక్తి దారినీదరి జేర్చు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
89*
తప్పులొప్పులెరిగి తర్కించి-తాళిమి
గోలుపోతి, గొప్పపోక బోవు-
మనసు ద్రిప్పి సంయమనము నేర్పించుమా!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
90*
పుడమినాక్రమించు పూర్వబుద్ధిని వీడి-
గుండెనాక్రమించు గుట్టెరింగి-
అప్పులిచ్చి విశ్వమంత పాలించేరు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
91*
వెన్నెల నిశి, గోపి వెన్నలరుచి వేణు-
గానశ్రోత, గోవు కన్ను చెమరె!
ప్రకృతి పులకరించె, పలకరించె ధరణి!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
92*
చెట్టుమీదికాయ, చేర్చు సముద్రపు-
టుప్పులోన రుచుల నూరజేయు-
పచ్చడట్లు నీదు భక్తిరసమునొప్పు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
93*
తగిన రుచియుపుట్ట దగినమోతాదును,
తప్పుకొలత గుప్పు నుప్పు విషము!
పాత్రకొలది భక్తిపరుల రసజ్ఞత!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
94*
కాసు కాశపడివికాసమ్ముగోల్పోక-
దాచుకొనక, జనుల దోచుకొనక-
దాస్య భక్తిపరుడు భాసిల్లు నీత్రోవ!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
95*
వరదన సిరివచ్చి వాగున బోవును-
ప్రాప్తలేశమునకు, పరగతృప్తి-
పొందునరుడె, పుడమి బొందునానందమున్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
96*
శ్రీశ! శ్రీ ద! శ్రీ నిథీశ! భక్తియెసిరి-
సంపదనుచు దలచు, సద్వివేక-
భక్తుడెపుడు-లేమి బాధదలంపడు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
97*
పదములొత్తు దేవి పద్మావతీ, వెల్ల-
చామరమలివేలు, చందనంబు
ప్రీతితోడ బంపు బీబినాంచారియున్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
98*
సత్యదాసునేలు,సామినీచరణాలె-
శరణు,కరుణజూపు,తిరుణహరిని- బుట్టి నీదుభక్తి మెట్టితి పుడమినీ!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
99*
చిన్ననాటి భక్తి చింతన నీకృప-
మాతృనాల్క నన్నమయ్యపాట!
విన్నపాలలాలి, వినియుంటి నీదయన్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
100*
ఆడువారు,ఆటలాడువారు, మాట-
లాడువారు, నవ్వలాట భక్తి-
పాడువారును, గొని యాడువారలె కదా!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
101*( సంపూర్ణం)
మంగళకర!వేణుమాథవా!మాకెల్ల-
మంగళమ్ముగూర్చు-మంగ పతివి!
మంగళాంగ! శతకమర్పించి వేడెదన్
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
102*
ఎన్ని శాస్త్ర గతులు-వెలయు సిద్ధాంతాలు-
సర్వ ధర్మ కర్మ సాక్షి నీవు!
దాపరికము లేదు – దాపు ప్రాపును నీవె!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
103*
తృప్తి కొఱకుదెల్పు తృష్ణయేకృతిగాగ-
శ్రద్ధ భక్తి నొసగు శక్తి నీవె! శిలయె శిల్పమగును – చిత్తంబు సృతిగాగ!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
104*
సహనశీల గుణము-సంయమనము గూర్చు
సామి నీదు కవిత సాగువేళ-
వ్రాసి చదువ-శ్రీనివాస నీధ్యాసయే!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
105*
ఆత్మనెఱిగియు పరమాత్మ నిన్నువెదకు-
సమయమందు గీత సందడించు! లోకవిధము మదిని లోభమ్మునకు నీడ్చు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
106*
నేను నాది యనగ-నేర, నరక దృష్టి-
తారతమ్య గతులె తలొక తీరు!
మానవతకు నేకమార్గంబు నీభక్తి!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
107*
స్వార్థరహిత విద్య, సంస్కార గుణవృద్ధి!
సాగవలయు, విశ్వశాంతి యజ్ఞ-
సాధనముగ, భక్తి సాగుమార్గము జూపు!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!
108*
శుభము నీదు శతకమభయంబు దయసేయు
శుభము, చదువరులకు శ్రోతలకును-
శుభము, భక్తి సూక్తి సుగతిప్రసాదము!
తిరుణహరి ని బ్రోవు తిరుపతీశ!