top of page

శ్రీ శ్రీశైలవాస శతకము

1*

శ్రీ పరబ్రహ్మ! పరమాత్మ! చిన్మయేశ!

శ్రీహరి ప్రియహృదయేశ! సిరులదాత!

శ్రీవిరించి పూజితపాద! శివనగేశ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

2*

ఏదియౌనన్న కాదన్న నేదినిజమొ?

ఏదియనుకున్న జరిగేది-ఏదొయదియె-

నీదు నాననతి కదలించు నిహము పరము!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

3*

గౌరి శంకర-కైలాస గంగ వరద!

కాలగమన గమ్య గరళ కంఠ!

చంద్ర శేఖర కరుణా సాంద్ర! సదయ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

4*

ఆగమవినుత!నటరాజ!నాగభూష!

పరమపావన గాత్ర! ప్రమదనాథ!

నందివాహన! సచ్చిదానంద మూర్తి!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

5*

పాలనేత్ర!నీలగళ కపాల మాలి!

జలధి గంభీర! భువి బోల శంకరుండ!

సాంబ! విశ్వమానవధర్మ కర్మసాక్షి!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

6*

యోగి యోగేశ్వరేశ్వరా యోగనాథ!

కాల కాలేశ్వరేశ్వరా-కాలరుద్ర!

శివ! శివా సకలేశ్వర! శ్రీద! శుభద!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

7*

అగ్రిమ!సురేంద్రపూజిత! అగ్ని నేత్ర!

అచ్యుతార్చిత! అనిమేశ! అనుపమేమ!

అపర! అపశోక! అభిగమ్య! అమరవినుత!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

8*

ఉమసతీశ!విశ్వేశ!ఉరగహార!

ఉర్వి భక్త భృంగ! దనుజ గర్వభంగ!

కామభంజన! సజ్జనోంకార దీప!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

9*

మల్లికార్జున! మహదేవ! మహితశూలి!

భక్తి దాత జగత్ప్రాణ శక్తి దాత!

రాజరాజేశ! ఎముడాల పూజ్య చరిత!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

10*

ఓదననొసగి వేదనబాపు ఓషదొసగి!

కూర్చుమోర్పునేర్పును మదికూర్మిపేర్మి!

స్వాస్థ్య జీవన సరణని సాకు మమ్ము!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

11*

దుష్ట దక్ష క్రతు ధ్వంసి- శిష్ట రక్ష-

లోకకల్యాణ కారక! లోకనాథ!

జీవకారుణ్య గుణధామ! దివ్య తేజ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

12*

గిరిశ!గిరిధన్వ!గిరివాస!గౌరినాథ!

క్రూరదానవ సంహార! కువలయేశ?

చంద్రశేఖర! శంకర! శర్వ! భర్గ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

13*

నీళ్లు మారేడు దళములు నీదుపూజ-

ద్రవ్యములు-నిచ్చి దలచు నరులు-

తగిన నైవేద్యమిడుదురు-తలొకరుచిని-

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

14*

ఆత్మ బంధు నీనిరాడంబరత్వ-

అర్చనలు-సేవలును సాగు ఆలయముల-

నొక్కపొద్దులు నీచుట్టు నొనరు భక్తి!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

15*

ఎంత తృప్తియో-నెమ్మది నెంత నిష్ఠ-

పూర్ణ విశ్వాసగుణ దీక్ష! పులకరింత!

జన్న జన్మ భారము దిగి జవము గలుగు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

16*

మార్పు కాలానుగుణ తీర్పు మహిని నేదె!

మంచికొఱవడితె-చెడుగు మార్గ గతులు!

పళ్ళమొక్కముండ్లునుజేయు- పళ్ళరక్ష!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

17*

గతము మేలగు-వచ్చెడు కాలఘటన-

తెలియరానిది-ఈక్షణం దేల్చ సులువు!

జరుగనున్నదే జరుగును జగతి నెపుడు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

18*

చెడ్డ విషసమమగునర చేష్టలందు-

కర్మజెఱచు కార్య కర్త జెఱచు-

క్రియల దౌష్ట్యమై ధరనపకీర్తిబెంచు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

19*

చెత్త వాదాలను- వివాద విత్త గడన-

సేయు దారియు కంటకం-చేప్పలేని-

విషమ సామస్యలకు నిధి-విధము దోచు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

20*

ఈప్సితార్థద!ఈశాన! నిత్య భక్తి-

దోవ నిశ్చల-తత్వంబు దోచునట్లు-

సాగ జేయుమానందాబ్ధి! సామి శరణు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

21*

సత్యము-నహింస సిద్ధాంత సాధనముల

గాంచె సంయమన విధుల గాంధియిజము!

స్వేచ్ఛ స్వాతంత్య్ర దేశమైజెందెకీర్తి!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

22*

నిరశన వ్రతమును మౌనదీక్ష నిరత తపము

గదియు గదిమార్చినట్లుగ కదిలె ఖైది-

సహనమేదెచ్చె కొండంత సంతసంబు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

23*

ద్విశతి పరపాలనాపీడ దీనబతుకు

బానిసలు భారతీయులై భారముగను-

కాలముదొరలించిరి, తమగలుమ లందె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

24*

ఇనుప కండరములునుక్కు యెదలుగలిగి

భక్తి శ్రద్ధలు దృఢదీక్ష భద్రగతుల-

కలుగు నవమానములుసైచి-కదలినారు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

25*

మిగుల శిథిల నిర్ధన రాజ్యమిచ్చి పరులు

వెనకకొదిగిరి-నడిరాత్రి వెలిగె రవియు!

కవియుగాంచికీర్తింగా కలతదొలగె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

26*

స్వేచ్ఛ-స్వాతంత్య్ర సప్తతి సేమపూర్వ

కముగ పలుకరించె-కరొన-కాటుదాక!

టీక కొఱకువేచియు చూచె-నేకభిగిన!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

27*

మారి నష్టంబు కష్టమై మానవాళి

కట్టడినిసాగె నీభక్తి కట్టడట్లు- నిష్ఠ నొసగియు-శుచి శుభ్ర నీతి నడుపు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

28*

సంద్రగర్భంబు శోధించి చవవులకొఱకు

గెలికి- వైరసార్జించియు- కిమ్మనకను-

చూచు లవణాసురులబాధ- చోద్యమాయె! !

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

29*

కరడు గట్టిన భావజ కావరాలు

దుర్దురాక్రమణ-స్వార్థ దుగ్ధ విడక-

ఐక్యరాజ్య సమితివిధి నధిగమించె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

30*

మేరు గిధన్వ-త్రిపురారి! మేలుగూర్ప-

దయను నారాయణాస్త్ర ధారివగుచు-

భగ్నమొనరించు కారోన బాధమాన్పు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

31* మొక్కుబడి దీరు నీచక్కి మోదమెసగు-

మరుపు వరమగు గతమెల్ల మాయగలియు

ఏకముగనాత్మ మురిసేటి ముగ్ధ భక్తి!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

32*

ఏట కోటంచ యాత్రలు నూటనొక్క

నారికేలసమర్పణ నడవి వంట-

తోటవిడిది సహృదయంపు-పోటిబాట!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

33*

కోరి శేషాద్రి వెంకన్న గొలిచి- నిండు

భక్తి భద్రాద్రి రామయ్య భజనసల్పి-

పొంగు భక్తబృందము పొసగుయాత్ర!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

34*

మనుజు జీవనసంబంధ మార్గ ములను-

చిత్తశుద్ధి పూర్వక నిష్ఠ చెలగునట్లు-

సహజ శాంతినిగూర్చు సత్సంగ బోధ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

35*

లుబ్ధ తత్వంబులిహలోక లబ్ధిదలచు-

భక్తి వితరణ పరలోక పరమ సుఖము!

సుంత గుదరదు-రెంటికీ వింత- ఇదియె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

36*

ఆదుకొనుమయ్య ఆర్థిక మాంద్య మాపి-చేదుకొనవయ్య ఈతిని చేవనొసగి-

పంట పండించి ఇంటింటి బతుకు నిల్పు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

37*

ఆకలినినిదీర్చి కరువుననాదరించి-సాదుకొనుమయ్య! సంసృతి సంస్కృతులను-

కట్టడిని నిల్పి-కారోన కలత బాపు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

38*

చేరి సరిహద్ధు జొరబడి-చేటొనర్చి-

రెచ్చగొట్టిముట్టడి కొండ ముచ్ఛు బుద్ధి-

బరిదెగింపుల భరతమ్ము బట్టనిమ్ము!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

39*

జాగలోటు జనాభయు చాలబరువె!

గిల్లి గజ్జ చర్చిత మేది? కీలకాంశ- సాధనములేవి? హుళ్ళక్కి-శస్త్ర పటిమ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

40*

తానె శాశ్వత ప్రభవుగా తపన మొదట-

పిదప దుడుకుదురాక్రమ విధపు వాదు-

భూగృహాలుగట్టుకు నుండు బుద్ధి పటిమ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

41*

నూరసత్యాలు-జల్లగా నూరు చెలిమ-

బతుకు-మున్నూరు రుజలకు నతుకు-

వెసన ధూళిదుమారమే-వెసగ ముంచు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

42*

రక్త పోటు మందుకు సైడె పెక్టు బాధ-

తారుమారగు- తెరపియూ తలొక తీరు-

పద్ధు కుదరక పోయెనా పెద్దఖర్చు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

43*

బతికి నన్నాళ్ళు వైద్యసేవలకు దిరిగి-

చితికి నన్నాళ్ళు నార్థిక చిత్తు బొత్తు!

నిన్ను జేరుదాకను మదినిలువదెందు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

44*

గోటి గాయాన-తగిలేది గొట్టు దెబ్బ-

రోతబుట్టించు బతుకు కరోన దిబ్బ!

కలిసి జీవింప టీకయే కలుగయుగాన-

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

45*

కూడి సాగుపనులటీక గొప్ప మేలు-

బడియు విజ్ఞాన మటుబెట్టి బతుక మేలు!

పోవు ప్రాణంబు ముఖ్యము-పొసగ రక్ష!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

46*

భద్రమౌ భక్తి బాట-నిర్భయముగూర్చు-

టీక నిబ్బరమొసగు, మదికిని-విధులు-

సాగుదోవ ప్రశాంతిని జరుగు పనులు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

47*

శాంతి గలుగక బతుకు విభ్రాంతి మయమె!

సందియము నడుగడుగున – జంపు మనుజు-

చిత్రవధగాగ-బతుకున సేమమేది?

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

48*

కమ్మగాతింటె బతుకున కలలపంట-

పస్తు గడిపినా నారోగ్య భద్రతొసగు!

ప్రస్తుతిన్ నీదు నామాళి పఠనమేలు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

49*

విద్య సేద్యాల సత్యమే విహితమనగ-

వైద్యమున పథ్యమె తగునివారణయ్యె!

పసరు వైద్యసాధన సాగె-పాత వింత!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

50*

ఏది ఏమైన మానవ వేదికలను-

సగటు ఆయువు సగమయ్యె! జననమరణ-

కాల చక్రంబు సవరించు-కరుణకిరణ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

51*

నల్ల మల దివ్వె-క్షేత్రమై-నదియు కృష్ణ-కుడికిబారగ-నీభక్తి-కూడలయ్యె!

శ్రీనగము,తీర్థము-, జీవసిరులనొసగె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

52*

శిఖర దర్శన మాత్రాన జీవి జన్మ-

రహిత ముక్తిగాంచె,జనులు పాహియనగ-

ఎంత వింత జీవన్ముక్తి యెదుట నిలిచె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

53*

తారకాసుర బాధలు తాళలేక

పుడమి మొరబెట్టె-తగునట్టి పుత్రుగనగ-

అదియె గౌరికళ్యాణపునాదియయ్యె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

54*

కామదహనము,పార్వతీ కామ్య ఫలము-

నీదు కళ్యాణ వైభవంనింపుగూర్చె!

కొమరు జననము భువిసదా-క్రూరహరము!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

55*

మల్లె పూపూజ నర్పించ-మాత జేరె-

తగుగ భ్రమరాంభికగ వచ్చె తనయులలర!

సాగె సంసృతి – సంస్కృతి – సాక్షి వీవె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

56*

గణము లెగుర ప్రమదనాథ గణము పొగడ-

కొమర సామి వినాయకుల్ కొమరులందు-

పరగ మీప్రదక్షణ-గణపతిగ నిల్పె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

57*

ముందె మీచుట్టు దిరిగెను మూషికంబు

వెంట దిరుగాడ-లోకాలు వేడుకొనగ-

నికష గెల్చెను-శిఖితేజి నిన్ను మొక్కె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

58*

దివిని భువి శివగణపతి తేజమెసగె!

సాగె శివసైన్యమధినేత స్కంధుడలరె!

వరుస విజయాలె తమయింటి వాస్తవాలు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

59*

భువిని మానవతాధర్మ బుద్ధి వెలసె!

సత్య ధర్మ ప్రవచనాలు నిత్యమయ్యె!

జనులు నీభక్తి చవిజూచు నిష్ఠ గలిగె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

60*

మానవులు దానవులు భక్తి మహిమ గనిరి!

జీవి జీవిని నీయున్కి దివ్య దీప్తి- పుడమి నేకాత్మ భావమై పుణ్యమెసగె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

61*

ఉదది ధరిసైకతపు లింగ మూర్తి గొలిచె-

హనుమ కాశిలింగముదెచ్చె గగనదారి-

రామ రక్షణ రామేశ్వరంబు వెలసె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

62*

బ్రహ్మ హత్యదోషము దొల్గె-ప్రభుడు రామ

చంద్రుడు నయోధ్య-దరలె పుష్ఫకమునందు

భరతునగ్నిప్ర వేశంపు ఘట్టమాగె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

63*

మాటదప్పని రామయ-మాట వినని

భరతు  పట్టుదలయుసాగె బాధ్యతగను!

హనుమ సరిదిద్దు భారమై యలరె భక్తి!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

64*

ద్వాదశ జ్యోతి – లింగాలు-దనరు భరత-

ఖండమున పదునెన్మిది గలిగె-శక్తి

పీఠములు-జనభక్తి సంప్రీతినొసగె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

65*

త్యాగమేనిండె-దానతపము సాగె

దాత తాపసిసమమయ్యె-ధరణి భరత-

సంస్కృతిని భక్తి యోగంబు చాలసుళువు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

66*

స్వార్థ పూర్ణము కలిమాయ-ఆర్థికంబె

మించె రాజకీయ సమాజ మిగతగతుల-

పాతికయె మంచి చెడ్డముప్పాతికయ్యె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

67*

ప్రజలె రాజులై కాలము పగను బట్టె-

పాలనయుమారెను-నమాయకాళి-

మంచి పుట్టినెక్కియు దైవీయ మార్గమరసె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

68*

క్రూర శక్తులు కలిజేరి కోరసాచె!

మాయకుడు పొగడబడెను-మంచివాడు-

సగటు జీవశ్చవములాగ సాగుచుండె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

69*

జాతి సంస్కృతి కవచమై జగతి దరచె!

నీతి సంసృతి శాంతికై నిన్ను వెదకె!

ధర్మ మార్గ పరిధి భక్తి దారి వెలసె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

70*

వేదమే నీతి బోధక వేదికయ్యె!

క్రియల పౌరాణిక నీతి కీర్తి గాంచె!

వ్యక్తి గతముగ స్వేచ్ఛ సద్భక్తి వెలసె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

71*

తపము జేయు శంకరగురు తలను గోరె

క్షుద్ర శక్తి శిష్యుని నుతిముద్ర నృహరి-

వచ్చి వాని తల- ద్రుంచె-మెచ్చె గురుడు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

72*

మొదట సాక్షి గణపతికి మోకరిల్లి-

ఇష్టకామేశ్వరికి మొక్కి-నిండు భక్తి

కదలి భ్రమరాంభికను గొలువ కలుగు ఫలము!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

73*

కరుణగను మల్లికార్జున కదనజయము

రాజలోకము గోరె! శివాజి దేవి-

చంద్రహాసము గొని కీర్తి సాంద్రుడయ్యె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

74*

ధర్మ సంరక్షణకు బూనె! ధరణి దిరుగు

ధర్మధేనువు నడిపించు దారి సాగె!

పుణ్యమే నిధిగ చరిత పుటలు నిండె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

75*

భరత కీర్తిహంసియు నింగి ప్రజ్వలింప-

చెడును చెండాడె! మంచికి చేవనొసగె!

శాంతిదాయక దైవీయ సాధనముల!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

76*

నడుచు చరితలో నీకృప-నయము జయము-

ముందు జాగరూకతయేగ-మందుమాకు!

లోక కళ్యాణమొనరించు లోకనాథ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

77*

పళ్ళమొక్క గూల్చియు చుట్టు ముళ్ళు నాటి

పంట గాపాడుకొనలేక! పరితపించు-

భువి యభద్రతా భావన-బుగులు మాన్పు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

78*

వమ్ము సేయుము పరకూటి కుమ్ములాట-

సొంత కష్టార్జితము పర సొమ్ముబాట-

తరచ వారువీరుగ శిక్ష తారుమారు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

79*

చెడుగు వారించి సమదృష్టి చెలగనిమ్ము!

మంచితనము- పనులనాచరించనిమ్ము!

వెసన విషకాటు దప్పించి వెసను బ్రోవు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

80*

ధనము లేక దానముజేయు దారి-వృధయె!

దాతగాక నిహపుణ్యంబు దరికిరాదు!

చిత్త శుద్ధిగల్గించి మదిభక్తి చేవనొసగు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

81*

వెండి – కొండదేవర!చతుర్వేద మూర్తి!

భక్త జనపోషక! విశేష- వరద! సుఖము

శాంతియే నిత్య సంపద-కాంతిపదము!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

82*

ప్రభువు- కోరిక ప్రజమేలు-భక్తి ముక్తి-

కళ్ళుగోరునంధుడు కుంటి-కాళ్ళు గోరు-

మూగవక్తయై పేరొందు మురిపెమడుగు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

83*

నేడు వైద్యనారారాయణు నికష -రుజగ

దేల్చు-నౌషద గుణమగు-దెప్పరిలగ-

దారి దొర్కు మరొక్కటి దగులు వరకు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

84*

చిత్త భక్తి- స్వస్థత-తను శిథిలమాపి-

జీవ శక్తి నిండగ మది చేతనాత్మ-

వెలయ జేయుము-పరమేశ! వేల్పు-వేల్పు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

85*

అల్లొ పతియె నయమాకస్మికాలయందు-

దీర్ఘ రుజకు నాయుర్వేద ధినుసు మందు-

కీలకౌషధాలు-కీలెరుగు వాతలె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

86*

తెల్ప కష్టమె-చిటికేసి-దెగులుమాన్పు-

ప్రతిభ తిరుగబెట్టని రుజపట్ల-పొసగు-

దాని కై ధృవీకరణలు- దారిమూయు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

87*

అంతదాక-తదితరముల్-సొంత ఖర్చు!

ప్రభుత ధనసాయమందని పద్దులగును!

కలుగు కలిమాయ కనువిప్పు-కలుష ప్రకృతి!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

88*

ఊపిరులనూది జీవాళి నుర్వివృద్ధి-

జేయు నదినీవె! సేవల చేవగూర్చి-

కలిమి బలిమి తెలివినిచ్చు-కర్తవీవె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

89*

నీవు చేయించునదిజర్గు-నిక్కముగను-

జరుగనున్నదియె! భువి జరుగ కున్న-

నీవు మాన్పించునదిగాగ-నెంచు జగతి!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

90*

చీమ గుట్టిన నోర్చియు చిదురుకొనక-

దారికడ్డుదొల్గడు మాయదారి నరుడు-

పైగ వెనువెంట నలిపేయు పగను బొందు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

91*

బాల్య యాదిగా నిల్చేవి పాలరుచులె!

పాడు రుచులజిక్కిన నాల్క పట్టు విడదు!

నీదు నామమే బహుతీపి నిక్కముగను!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

92*

పతన దశలోన కనువిప్పు ఫలమదేమి?

చింతన గుదిరితె-నీధ్యాస చిటికెలోనె-

కృపను బొందగా వీలగు-సఫల నిష్ఠ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

93*

తప్పు దెలిసి పశ్చాత్తాప తప్తుడైతె-

గర్వమునుదొల్గు మదినిల్ప గల్గు నాత్మ-

భక్తి సాధన లీనమౌ-పట్టు దొరుకు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

94*

కాల మాసన్నమైనంక కడకువచ్చు –

మరణ మెంతమంచిదొ వృద్ధ మాట దెలుపు!

మూట కై దూరమగు బంధు మూకలెల్ల!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

95*

దీర్ఘ రోగాల బారిన దిగను బడగ-

దీక్ష సాగదారోగ్యంబు దేలునపుడె-

పుణ్యమార్జించు కొనవీలు-పొసగు విధుల!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

96*

మంచి వైద్యమార్గ గతులె-మనుజుకందు-

బాటులోనుండు-యలవడు పథ్యవిధులు-

వైద్యమందు ధనాశయు – వ్యక్తిగతము!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

97*

మొదట మామూలు వారికి ముగ్ధ భక్తి

సాగును-సగుణో పాసనల్- చట్టపరిధి-

రక్ష శిక్షల న్యాయంపు రంగరింపు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

98*

కాలగతినిల కలిమాయ కలుష ప్రకృతి-

సాను కూలవర్తన సాగు సమయమిదియె!

పరగ ప్రతికూలమైతెనే ప్రభలు రుజలు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

99*

సాగు-అనుకూలమే ప్రేమ సమము మైత్రి-

ఒప్పుగాదిద్ది-తద్ధోష ముప్పు మాన్పు!

గాకశత్రువై- జాతినే గాసిజేయు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

100*

ఎన్ని దెల్సి-దెల్పిన మాటనెవరువినరు-

మాటతోబాటు బాటయు మరొకటంద్రు-

జరుగ నున్నది పెను మార్పు-జగతి తీర్పు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

101*(సంపూర్ణం)

నిత్య కృత్య యాతనసాగు నితర సాయ

మునకు నిరతమెదురుచూపు-ముదిమి గడచు

సంతు సేవలభించుటే స్వర్గమగును!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

102*

దుష్ట కోపంబు విడనాడ దుడుకు మనసు

నొప్పదదియేమొ? తిట్టులొప్పకుండు!

వలయు పదిపుట్ల సహనము, వాస్తవముగ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

103*

త్రికరణ విశుద్ధి సాయమర్థించ వలయు-

గతమము గతమె ఈక్షణ బాధ గడపుకొఱకు

సిద్ధపడిదీవెనలువెట్ట సేవసాగు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

104*

వృద్ధ సేవలు మెరగైన విధముదోచు-

నూత్న టెక్నాలజీసేవ నూటమేలు!

ఊరనూర యువతమారె-నుచిత సేవ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

105*

వృద్ధ వికలాంగ సేవకై పెద్దమనసు

గలిగి- స్వచ్ఛంద సంస్థలు గాంచెకీర్తి-

యువత దాతృత్వమున జనభవిత మారె!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

106*

మంచి తొంబదితొమ్మిది మనుజ జతన-

మందు నొక్కశాతము నీదు మహిమ సాగు!

సదయ! సాగును సంపూర్ణ సత్ఫలంబు!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

107*

మంగళమనంగ పూజిత-లింగ! మల్లి

కార్జున! భ్రమరాంబిక కాంత! భక్త

వరద! లోకకంఠక హర! కరుణ కిరణ!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

108*

శుభము-పఠితలకు శ్రోత కభయ ప్రదము!

శుభము-జరపీడితులకెల్ల సుఖముశాంతి!

శుభము-స్వచ్ఛంద దాతకు-శుభము-శుభము!

వామదేవ! శ్రీశైలనివాస! ఈశ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page