
శ్రీమద్ ఇల్లందకుట శతకము
(తే.గీ.)
1*
శ్రీలు జిందు పురాణముల్ జీవ నదులు
శ్రేష్ఠ భారతుల చరిత్ర శ్రేయ నిధులు!
సౌష్ఠవాభివృద్ధిని గాంచె సామ్య గతుల
స్వామి యిల్లందకుంట శ్రీరామ శరణు!
2*
మంచి యనపుణ్యమందురు, మనుజు చెడ్డ
పాపమందురు, సద్భక్తి బాటవెంట,
మంచి బెంచి పోషించుటే మనుజు నీతి!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
3*
నీతి గౌరవంబును బెంచి, నీది నాది
యనెడు జంజాటమును మాన్పి మనసు నిల్పి
మాయ తెర జీల్చగ, పరమాత్మ నెలవు!
స్వామి యిల్లందకుంట శ్రీరామ శరణు!
4*
అనుభవజ్ఞాన,విజ్ఞానమనగ-సైన్సు!
ఆత్మ దర్శనమే జ్ఞాన మనెడుతత్వ-
సారమునుదెల్పు, మునివాక్కు శాంతి కొఱకు!
స్వామి యిల్లందకుంట శ్రీరామ శరణు!
5*
మంచియాచారమే కీర్తి మార్గమయ్యె!
జీవ కారుణ్యమే నీతి తేజమయ్యె!
నీతిపుణ్యాదిపై భక్తి నిష్ఠ వెలసె!
స్వామి యిల్లందకుంట శ్రీరామ శరణు!
6*
శక్తి యక్తుల, నీతియే చేవ గూర్చు!
భక్తి ముక్తుల దోవలో, బలము గూర్చు!
నీతి యిహపసుఖశాంతి,నిచ్చు రీతి!
స్వామి యిల్లందకుంట శ్రీరామ శరణు!
7*
నిఖిల జాతుల సరిదూచు నీతిశాస్త్ర-
సూచియై భక్తి విశ్వాస సూత్ర ముండు!
తూచు పుణ్యాధికము గూర్చు తుదకు ముక్తి!
స్వామి యిల్లందకుంట శ్రీరామ శరణు!
8*
నిగ్గు దేలిన నీతియే నికష గాగ-
మానవాళి సాగెను, దైవ మార్గమందు!
నేటికిని నీతి, విధియె నిర్ధేశ్యమయ్యె!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
9*
పేద గొప్ప బేధము లేక – వేద గతుల
పెద్ధలందరు జేసిన హద్ధులోనె-
తరచి చూడగా, నీతియే తాండవించు!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
10*
నీతి ధర్మంబు గల్గిన మేటి జాతి-
దయయు దాక్షిణ్యముదయింప, ధన్య జన్మ!
నీతిలేకను – ఏమున్న-నేమి ఫలము!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
11*
మంచి కథలందు నీతియే, మసలు చుండు
మంచి క్రియలందు నీతియే మాట-బాట,
మంచి తార్కాణములు నీతి నెంచి చూపు!
స్వామి యిల్లందకుంట శ్రీరామ శరణు!
12*
నీతి నియమబద్ధము గాక నిలువదెందు!
ఆడి తప్పు సోమరిమాట లందు శుద్ధి
గలుగునెటు నీతిరహితమై గంతులేయు!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
13*
మంచి చెడులెంచి నరజాతి సంచరించి-
శ్రేష్ఠడను పేరు సార్థక చేష్ట సాగి-
చేరి దీనుల సేవ జేయవలయు!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
14*
పశువు నుండియు నరువేరు పరచి చూపు
నీతి నియమజీవన రీతి, నిజమెఱుంగ-
దైవ సేవ, ప్రజాసేవ దనరు నీతి!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
15*
ఆత్మ నీతి ధర్మము, శాశ్వతంబు గాగ-
భ్రాంతి చేత తాత్కాలికమ్, భౌతికంబు!
పారలౌకిక సాధన భక్తి బాట!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
16*
భౌతిక సుఖదు:ఖము నీదు- భక్తుడైన
మైత్రి భక్తి సాగును, పరమాత్మ వెదకు-
జగతి పుణ్య సాధన చేత జయము బొందు!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
17*
దైవ ప్రేమలో, జగమంత దడిసి యెదుగు!
భక్తి దారిలో ప్రజలంత, శక్తి కొలది-
నీతి ధర్మంబు నీడలో నిలువ నెంత్రు!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
18*
దైవ సందేశమున గల్గు, ధర్మ సూత్ర-
గతులు సాగెడు మతముల గలుగు ఫలము!
నీతి ధర్మ వృక్షమె! నిజమెఱుంగ-
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
19*
నీతి,దేహాత్మలకు నిచ్చు, నిత్యముదము!
ధర్మ మాధ్మాత్మికము, నీతి దారి భక్తి-
నావ పయనించు, దానిలో నాత్మ ముక్తి!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
20*
నీతి పరులు శాశ్వత కీర్తి నిచ్ఛ గొంద్రు!
నీతి ధర్మావగాహన రీతి, సూక్ష్మ-
మెఱుగగా, గీతయే బుద్ధి మెఱుగు దిద్ధు!
స్వామి యిల్లందకుంట శ్రీ రామ శరణు!
21*
చంద్రు నద్దానగను రామచంద్ర యనుచు
మంత్రి మారాము మాన్పించె మాత మురిసె!
భ్రమయె గాక, నతడు నీబావమరిది!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
22*
కన్న తల్లి లాలనయు కైకమ్మ జోల
ముద్దు లాలి సుమిత్రయు మురిపె మలర
ముగ్గు రమ్మల పోషణ నిగ్గు దేల్చె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
23*
శ్రేష్ఠ విజ్ఞాన విద్య వశిష్ఠ గురుడు
వీర విద్య విశ్వామిత్ర గురుని వరము!
మానవాదర్శ కీర్తి సామ్రాట్టు వనగ!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
24*
వినయ శీలివై మది సంయమనము వెలయ
ప్రేమ శక్తివై ప్రాణుల ప్రేరణొసగి
సామ్య వాదవిశిష్ఠతన్ చాటినావు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
25*
భరత శత్రుఘ్నులును గొల్వ, భక్తి దారి-
చేరి సౌమిత్రి నీసేవ జేయ-మిమ్ము,
అవని ఆదర్శ సోదరు లనిరి జనులు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
26*
వేగిరముగ విశ్వామిత్ర యాగ రక్ష- జేయ
దశరథాత్మజులె యజేయు లనుచు-
పెద్ధ కొడుకు నిమ్మనె-మునీ పెంపు మీర!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
27*
భరత శత్రుఘ్నులను బంప పరగ లక్ష్య-
మునకు తగదని కోపించె మునియు-రాజు
నిన్ను సౌమిత్రితోబంపె నీరసించె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
28*
యతి ననుసరించి జని రాతి నాతి జేయ-
దురిత హరమయ్యె నీపాద ధూళి మహిమ!
గౌతముడహల్య గాంచియు గారవించె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
29*
విష్ణు తేజంబు తమలోన విస్తరింప-
వరుసనేడవ విష్ణువై వసుధ బ్రోవ-
కోరి గురు దిద్ధితీర్చె లోకోత్తరముగ!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
30*
విధిగ విశ్వామిత్రుని యాజ్ఞ విహిత యజ్ఞ-
రక్ష లోక కళ్యాణమే-రాక్షసాళి,
ద్రుంచి ధర్మ సంస్థాపన నెంచి జరిగె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
31*
తండ్రి మాట నిల్పి తగు కర్తవ్య విధుల-
నిర్వహించు ధీరోదాత్త నిష్ఠ వెలయ-
సాధు సజ్జన రక్షకై సాగినావు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
32*
దుష్ట రాకాసి తాటక దూరమయ్యె!
నీచసుబాహు నశింప మారీచు దరుమ-
యాగ విధులు సాంగోపాంగముగను ముగిసె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
33*
జనకు పిలుపున మునివెంట జనియు, సీత-
యుల్లముప్పొంగ నవలీల విల్లు విరిచి-
పెళ్ళియాడిన ఘట్టంబు ప్రేమమయము!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
34*
తమ్ములకు సీత చెల్లెండ్రు తగుగ పెళ్ళి
జేసి, వేడ్కనయోధ్యకు చేరి-
విస్మయంబుగూర్చిన శౌరి! వేదవేద్య!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
35*
తిమిరహర! నన్ను రక్షించు తిరుణహరిని-
సత్యనారాయణుడను సత్సంగ విధుల-
జన్మ తరియింప జేయుమో జానకీశ-
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
36*
భాగవత నవమస్కంధ భావ పఠన-
మానవత నిల్పు దేదీప్యమాన కీర్తి-
దశమ మందు కృష్ణుకథ దనరుచుండు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
37*
త్యాగమూర్తి నీ సమధర్మ తత్వసూక్తి-
చేతలను జూపి నృపలోక చెత్త బుద్ధి-
దులిపి సంస్కరించిన దేవ!దురిత దూర!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
38*
తరతరాలకు మీగడ తరక వలెను-
తమరి యవతారముల దీప్తి తళుకు లీను-
ఆపదలు బాపి సంపదలందజేయు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
39*
ధర్మ రహితాత్ముల బరువు తాళలేక-
ధరణి మొరవెట్టు ధర్మ సంస్థాపనార్థ –
మవతరింతువు సుజనాభ సవరణముగ!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
40*
క్రౌంచ పక్షుల గనిముని కవిత వెడలె-
కరుణమయ్యెను, నీకావ్య గాన ఝరుల-
కడలి దాటిన బ్రతుకు సంగ్రామమయ్యె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
41*
కామమోహిత పక్షుల కథయు ముగిసె-
కిల్బిషమునంటి కిరాతుడు కీర్తిబాసె!
కరుణముప్పొంగె, వాల్మీకి కవిత వెడలె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
42*
జరుగనున్నదే జరుగును జగతి, కాల-
గమన కార్యక్రమము సాగు కలియుగాన!
వానికై చింతనొందుట వట్టి భ్రమయె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
43*
వసుధ మాటదప్పని రఘువంశ కీర్తి-
కైక కోరిక నెరవేర్చ – కానలకును
తమ్ముడును సీత వెన్నంట దరలినావు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
44*
మాట జవదాటవని తండ్రి మనసు క్రుంగె!
వననివాసంబు పదునాల్గు వత్సరాలు-
బ్రహ్మచర్య నిరాడంబరంపు బ్రతుకు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
45*
భరతుడును నందిగ్రామంబు బాటబట్టె!
గుహుడు గోదారి దాటించె-గొప్ప భక్తి-
పాదములు గడ్గి కీర్తించె ఫలము బొందె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
46*
భరతుడంపిన థశరథ మరణవార్త-
రామగిరి దు:ఖమునదిగె! రాముడనెడు-
మాట జానపదులనోట మారుమ్రోగు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
47*
తలము మార్చియు మానేరు దరిని దాటి
పాదమును మోపగా రామభద్ర శిలయు-
నేడు పుణ్య స్థలము తీర్థ వేడుకలకు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
48*
నాటి-వారధి సూచి, మానేటిమీద-
రామ భద్ర వంతెన దాటు రాక-పోక,
దారి వావిలాలకు కీర్తి దక్కనిమ్ము!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
49*
మేటి యిల్లంద పల్కుల తోటి తండ్రి-
దినము, వారాదు లజరిపి స్థిమిత పడిన-
చెట్టు మూలంబునను జూపు మొట్టు గలదు!
50*
అందఱికి నందుబాటు నిల్లంద కుంట-
జమ్మికుంట రైలాగెడు జాగపొంట-
దారి సాగిన నీక్షేత్ర దర్శనంబు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
51*
తీర్థమున పుణ్యమగు జన్మ సార్థకముగ
క్షేత్రమైయొప్పు జనుల సంక్షేమ మొసగు
కామితముదీర చెల్లింపు కాన్క ముడుపు
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
52*
నేటి కేటేట జాతర నేమనిష్ఠ-
గలుగ నపరభద్రాద్రియై గనెనుకీర్తి-
వెలయు బ్రహ్మరథోత్సవ వేడ్క లలర!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
53*
తమరి కళ్యాణ తలువాలు-తరలివచ్చు
గగనదారి భద్రాద్రి గరుఢ పక్షి-
గోపురము జేర్చు-విశ్వాసమొప్పుచుండు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
54*
తాత రంగయ జెల్లించె రథపు రూక-
ముడుపు జెల్లించి యిలు జేరి ముక్తినొందె!
పౌత్రునిగ కృతి నర్పింతు ప్రజలు మెచ్చ!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
55*
వావిలాల ఖాదిని నిన్ను వరుస మ్రొక్కు
వెంకటయ్య సీతమ్మల వేడ్క సుతుడ-
జన్మ ధన్యమై నీసేవ జరిగె గతము!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
56*
స్థలపురాణమైతిహ్యముల్, జనులనాల్క-
లందె సద్భక్తి-విశ్వాస లబ్ధి తృప్తి-
గలుగ, నిస్వార్థ గుణ వృద్ధిగాంచు భవిత!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
57*
దండ కారణ్య రాకాశి దండు గూల్ప-
వచ్చి వనవాసము గడుప వలసె – దీక్ష
సాగె సౌమిత్రి మీసేవ సఫలుడయ్యె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
58*
అడవి నున్నయయోధ్యయే – అవనిజాత
సాక్షిగా తుదముట్టెను రాక్షసాళి!
దుష్టమతిమారె, నరజాతి శ్రేష్ఠమయ్యె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
59*
శిష్ఠ నరజాతి రక్షణ సీతచెఱయు
సాకుగా జయవిజయుల శాపముక్తి!
పాఠ గుణపాఠముగ కథ ప్రజల బ్రోచె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
60*
చుప్పనాతి ముక్కు చెవులు జూపు గర్వ-
ఖర్వమొనరించె లక్ష్మన్న గాని-తమరి
సూచనయె సోదరుని చేష్ట-సూత్రధారి!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
61*
దురితమూకలు హతమయ్యె, భరత జాతి
ధర్మ పథవికాసము జర్గె కర్మక్రియల-
మానవత్వంబు దీపించె, కాననమున!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
62*
శూర్పనఖ సాకు సంగ్రామ సూత్రమయ్యె!
రావణుని చేష్ట పతనమారంభమయ్యె!
నిద్రయే కుంభకర్ణ దారిద్ర్యమయ్యె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
63*
వీరనారి సవరకాంత విసిగి గురుని
యానతిని వేచె, దర్శించి యాత్మ మురియ
భక్తి సాయుజ్యమును గోరె! బ్రహ్మ జనక!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
64*
ఆత్మ తన్మయత్వపు సేవ నలరి శబరి-
భక్తి నర్పించె రుచిచూచి పండ్లు-నీవు
నిష్టముగ నారగించితో ఇనకలేశ!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
65 *
శబరి బహునాళ్ళ కోరిక, శక్తియుడిగి-
కడకు కన్నీటి తెరగాంచె, కాంక్ష దీర-
తృప్తిగా మ్రొక్కి కైవల్య ప్రాప్తి నొందె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
66*
హనుమ గుర్తించితివి కంఠహార చిహ్న
ముగను, పూర్వ యాదిని భక్తి మురిసె – బంటు
గాగ, దాసానదాసుడై గాంచె కీర్తి!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
67*
మారుతియు గల్పె సుగ్రీవు మైత్రి-వాలి
పీడ విరగడయ్యె, జనసంప్రీతి-నీతి
దూతలైరి వానరులంత దుడుకు మాని!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
68*
దుష్ట ఖరదూషణాదుల దునిమి నంత
శాంతి చే యరణ్యములు సంక్రాంతులయ్యె!
ఋష్యమూకము దీపించె ఋషుల చేత-
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
69*
సీత వెదకంగ వానర సేన గదిలె-
ప్రభువు గాగొల్చిరి నిను కబంధ దూర!
హనుమ కే యానుమాలిచ్చి పంపినావు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
70*
లంకలో ప్రమదావని – లక్ష్మి సీత-
గాంచె హనుమ నీముద్రిక కాన్క జేసి-
మణిని సందేశమునుగొని మరలి వచ్చె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
71*
కడలిపై సేతువునుగట్టి కదలి పోయి
రావణాదుల తెగటార్చి, రక్ష రక్ష!!
అనెడు రాకాసులను గాంచి యభయమిడిన-
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
72*
లంక జనుల దీవించియు లబ్ధి గాగ-
రాజుగా విభీషణు నిల్పి రక్ష జేసి-
భరతు గాపాడ నయోధ్య తరలినావు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
73*
పుష్ఫకము సాగె హనుమయే స్ఫూర్తిగాగ
పురము జేరియు కర్తవ్య పూర్ణ విధుల
అంబరమునంటె సజ్జన సంబరాలు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
74*
భక్తి హనుమ విభీషణుల్ ప్రస్తుతింప-
జరిగె పట్టాభిషేకంబు జగతి మురిసె!
వరుస పాలన వేలసంవత్సరాలు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
75*
వాజపేయాశ్వమేధాది వరుస యజ్ఞ-
యాగములు, నీతి ధర్మప్రయోగ శాల-
మానవాళికామోద్యమౌ మార్గమొదవె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
76*
ఉడుత సాయము, తమదీవెనోక్తి వెలసె-
జీవులన్నిటనేకాత్మ భావ పటిమ!
రాజ్యమున తరతమబేధ రహిత నీతి!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
77*
రాజ్య పాలన గన ప్రజా రంజకంబు!
సామ్య ధర్మంబు, విద్య సంస్కారమిచ్చి-
ప్రజల బ్రతుకు సాగించిన ప్రభుడ వీవు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
78*
ప్రజలు కలగన్న బంగారు పంటబండె!
నేల జలనిధి పూర్ణమై నింగి వంగె!
ప్రకృతి సోయగాలను నీతి ప్రతిఫలించె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
79*
నేటి జనయాదిగా నీదు మేటిరాజ్య-
వైభవ-స్వేచ్ఛ-సందర్భ వాక్యమయ్యె!
హద్ధు మీరని-స్వాతంత్ర్య పద్దు నడత!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
80*
దుష్ట సంహార దురిత విదూర శౌరి!
రావణానుజ నుత! యతిరాజ వినుత!
తమరి నామమే – ఇహ జన్మ తారకంబు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
81*
శత్రు సోదరుల్ సహితము మిత్రులైరి
భిన్నమేకత్వమై రాజు పేద మురిసె!
జనుల వాక్యమే కర్తవ్యమన్న ప్రభుడ!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
82*
రాజు పేదల సమధర్మ రక్ష వెలయ-
తిరుగ వ్రాసిన సమకాల తీర్పు-మార్పు
సర్వధర్మ సమత్వమై శాంతి వెలసె
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
83*
సూర్య చంద్ర వంశాలకు స్ఫూర్తి నీవె!
వెలసె దధిమీగడగ గీత వెన్న దేలె!
భక్తి నవనీతులను దెల్పె భాగవతము!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
84*
నీతి నియమ రీతులకు మధ్య నిలువు గీత,
బుద్ధి, తనువుసౌష్ఠవవృద్ధి పుణ్య చరిత!
వేద వైజ్ఞానికోత్తమ! విశ్వనేత!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
85*
జన్మ వేరు సురాసుర జగతి-మిగత,
జీవరాశుల మంచియే దివ్య జయము!
చెడుగులకుగల్గె రయము విశేషగతుల!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
86*
దేవ దానవ సంగ్రామ భావజములె-
నాడు నేడు, పోటి స్వార్థమేడుగడగ!
మంచి చెడుబుద్ధులకు పోరు మరల మరల!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
87*
కలవు లేవని వాదించి ఖాళి మెదడు
దుష్ట శక్తుల భ్రమలోన దూరి నిండు!
భక్తి దారి భద్రము మేధ భ్రాంతి విడుచు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
88*
ధ్యానముననీవు లేకున్న దారిమారు
మనసు కల్మశమై మంచి మరచి సాగు!
ఖాళి లేకుండ నీయాది గలుగ మేలు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
89*
మంచి యుపకారి-పరుల పీడించు చెడుగు,
పుణ్యమే మంచి – చెడుపాప పూర్వకంబు!
సకల శాస్త్రాలు బోధించు సారమిదియె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
90*
మంచి వాడమాయకుడంద్రు-మాట వరుస-
చెడుగు చెలరేగు మాయిక చేష్టలందు!
మాయ దయ్యాన్ని సృష్టించు మహిమ నీదె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
91*
జగతి శోధింపు విజ్ఞాన ప్రగతి దోవ!
జ్ఞానమాత్మదీప్తినిగాంచి ఘనతకెక్కు-
నుభయ సారాంశముల చేత శుభము గలుగు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
92*
నీదు భక్తి మానవనీతి నిగ్గు దేల్చు!
నీదు సేవ-మానవ సేవ బేధమనక ఫలము నిచ్చు!
పుణ్యముగూర్చు, భక్తి-ముక్తి!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
93*
నీదు కళ్యాణమును గని నియమ నిష్ఠ-
నీదు కథవిని, వినిపించి-నీతిధర్మ-
మాచరించుట తగుమేలు మానవులకు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
94*
ఉన్నదే పుష్టి మనుజుల కుర్వియందు-
నీవు గలవన్నసంతృప్తి నిచ్చు భక్తి-
చిత్త శుద్ధిని గలిగించు చివరిదాక!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
95*
ఊక దంపుడు మానితే ఊర్థ్వ దృష్టి-
మానవాళికే సాధ్యము మహిని ముక్తి-
ఇతర జీవ జన్మలు నరజాతి యందె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
96*
తారకము నీదు నామమై తమరి యాగ-
అశ్వమాత్మీయులను గల్పె విశ్వ మెఱుగ-
క్షితిజ సీతమ్మ పుత్రులు కీర్తి ధనులు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
97*
పాటబాడిరి లవకశుల్ పరవశించి-
సీత లేదన్న నల్గిరి చివరి దశను-
తల్లి దండ్రి దెల్సియు – భక్తి దాసులైరి!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
98*
విశ్వసించని యోచన-విధిని మరచు-
వింత పోకడ విచ్ఛల విడిని బ్రతుకు
అంకుశములేని మదగజ మంకు కలిని!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
99*
పుణ్యమార్జించు దారియే పుడమి గీత-
బోధ విజ్ఞాన శోధన మేధ పదును-
ప్రాణశక్తి జీవనలీల-ప్రభుడ వీవె!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
100*
భక్తి నావిక! మముజేర్చు ముక్తి పదము!
విశ్వశాంతి గోరని దెల్ల నశ్వరంబె!
నమ్మకము లేని బుద్ధికి నాణ్యతేది!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
101*
ధరణి పాతికే స్వచ్ఛత ధర్మ కర్మ
కడమ కాలుష్యమే నిండె-కలియుగాన!
మూఢ నమ్మకాలు-అవిద్య మూలకములు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
102*
మంచి మూలమై బాషించు మంచి గురువు-
గురియు కుదరగా భాసించు గుర్తు బాష-
తెలుగు సారుపేరున స నా తిరుణహరిని!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
103*
ఇచ్చి చేకొను మర్యాద హితవు గూర్చు
విత్తులో మఱ్ఱి దాగినవిధము నీవు
నాత్మలో వెల్గుచుందువు – అహరహంబు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
104*
మంచి – చెడుమాయ పోరు రామాయణంబు
ధరణి భారతయుద్ధము ధర్మ జయము
భాగవతమాత్మ-పరమాత్మ భాగమనును!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
105*
క్షత్రియత్వంబు దీపింప శత్రు నణచి
మానవత్వంబు చిగురింప మహిని నడచి-
తిండి రక్షణ గల్పించు తీర్పు నీది!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
106*
భారతీయ కటుంబాల బ్రతుకు దివ్వె-
జారి చల్లాచెదరుగా దూరె-కలిని
ప్రాణ బంధు మిత్రుత్వంబు పదిల పరచు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
107*
మంగళము ముఖపుస్తక మాన్యులకును-
మంగళము భక్తి సత్సంగ సభ్యులకును-
మంగళము భారత కీర్తి మార్గములకు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!
108*
శుభము నవవిధ సద్భక్తి సూక్తములకు
శుభము-సమత, మానవతకు సుఖము శాంతి
శుభము శతకపాఠకులకు శుభయశంబు!
స్వామి ఇల్లందకుంట శ్రీరామ శరణు!