
శరణాగతి ప్రథమభాగము
1*(ప్రారంభము)
శ్రీనృసింహదేవు శ్రితజన మందార!
కోటి సూర్య తేజ!కోట అంచ-
నిలయ! నిన్ను దలతు నిలవేల్పుగాగొల్తు!
స్వామి కొడవటంచవాస శరణు!
2*
తల్లి దండ్రి గురువు లతిథి యాత్మీయుల-
పుడమి దైవ సముల పూని నిష్ఠ
పూజజేసి మ్రొక్కి పులకింతు భక్తితో
స్వామి కొడవటంచవాస శరణు!
3*
కర్మ సాక్షి! పుడమి కల్మశహరియనన్
శతసహస్ర కిరణ సామ్య గతుల
నలరు సూర్యు దలతు నారోగ్య ధాతగన్
స్వామి కొడవటంచవాస శరణు!
4*
లౌకికంబు పార లౌకికంబుగ భక్తి
పథము పావనంబు, భక్తి భావ-
ఝరులు మదిని పొంగు, జగతి కళ్యాణమై
స్వామి కొడవటంచవాస శరణు!
5*
తల్ల దండ్రులందు, తదితరబులయందు
లౌకికంబు భక్తి లబ్ధి గూర్చు
దేశ భక్తి గూర్చు దేవుని దరిజేర్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
6*
పారలౌకికంబు పరమాత్మ భావనా-
యుక్తమైన బ్రతుకు, యుర్వి జన్మ!
జన్మ గడచి యాత్మ జనుముక్తి తీరంబు!
స్వామి కొడవటంచవాస శరణు!
7*
ఇంపు గూర్చు, జనుల యిహపర సుఖవాంఛ
బాట లందు భక్తి భావఝరుల-
యిహము వీడి పరము నిపొందు యోచనల్
స్వామి కొడవటంచవాస శరణు!
8*
మనుజు లందు మనసు మాట కర్మల శుద్ధి
మాయదొలగ జేయు మార్గ గతులు
మనసు-మనసు గలుపు మాధవు లీలలు!
స్వామి కొడవటంచవాస శరణు!
9*
నరుని నిల్పు కొఱకె, నారాయణోక్తమై
గీత సాగె, ప్రశ్నకే జవాబు-
నెఱుగ నీతి రీతి నిత్య పారాయణమ్
స్వామి కొడవటంచవాస శరణు!
10*
గీతమార్చె బ్రహ్మగీత-శ్రీహరి భక్తి
క్రీడి మార్చె యుద్ధ క్రీడ సాగె!
విశ్వరూపు జూచు విద్యయయ్యెను గీత!
స్వామి కొడవటంచవాస శరణు!
11*
యోగములను భక్తియోగంబు నిహజన్మ
సుళువుగా తరించు సూత్రమనగ-
యోగి నరుడు సమత యోగంబు సాధించె
స్వామి కొడవటంచ వాస శరణు!
12*
నరుని నరుని గలుపు నారాయణుని భక్తి
నాక లోకమునకు నావసాగె!
చూడ భక్తినావ చుక్కాని పుణ్యమే!
స్వామి కొడవటంచ వాస శరణు!
*
13*
స్వామిగీతసాగె శతకగీతిగనాడె
అంకితంబు జేయ, జంకి తిరుగ
వ్రాయబూని గీత మాతను ప్రార్థింతు!
స్వామి కొడవటంచ వాస శరణు!
14*
దివ్య గీతబోధ దినము పఠింపగా
మింగుడు బడనట్టి సంగతిగను
చర్ఛజేయ గలుగు సంశయ వారణ!
స్వామి కొడవటంచ వాసశరణు!
15*
సుమతి శతకరీతి సమతయోగము గీతి
మ్రోగుచుండె భజన సాగుచుండె!
భూరి శబ్ధయాత్ర పూర్వక సందడుల్
స్వామి కొడవటంచ వాస శరణు!
*
16*
మాట పనియు పాట మనసు శుద్ధినిగల్గు
జానపదులు వినగ చదివి చెప్పు
విజ్ఞ బోధ గీత విశ్వశాంతిని గూర్చు!
స్వామి కొడవటంచ వాస శరణు!
17*
మనసు పాదునాటు మంచియోచన మొక్క
పూచి కాచి ఫలము తూచి యిచ్చు!
మనసు లేని చోట మంచిమాటయు లేదు!
స్వామి కొడవటంచ వాస శరణు!
*
18*
మనసు లేని పనుల మర్యాద లోపించు
శ్రద్ధలేని పనుల వృద్ధి లేదు!
ఇచ్ఛలేని పనులు మెచ్చరు లోకులున్
స్వామి కొడవటంచ వాస శరణు!
19*
మనసుటద్దమందు మాయ ధూళియు గప్పి
గ్రుడ్డిగొట్టు నిష్ఠ దుడిచివేయ
సద్దుజేయుచు నరిషడ్వర్గమును బోవు!
స్వామి కొడవటంచ వాస శరణు!
20*
మనసులేని మనిషి మట్టి శిలను బోలు
మంచిలేని మనసు మాయధినుసు!
మాయతెరల నాత్మ మర్మంబు తెలియదు!
స్వామి కొడవటంచ వాస శరణు!
21*
తనకుమల్లె నితరు దలచు సజ్జనుడిలన్
ఇతరు బాధలెంచి హితవు గూర్చు
నితరు వేరు జేసి నివసింత్రు దుర్జనుల్
స్వామి కొడవటంచవాస శరణు!
22*
శ్రద్ధలేక,జనుల వృద్ధియు గల్గదు-
శ్రద్ధ లేక చిత్త శుద్ది లేదు
శ్రద్ధ లేకభక్తి సాగుట వట్టిదీ
స్వామి కొడవటంచవాస శరణు!
23*
మనసు శుద్ది వెంట మానవత్వపు సిద్ధి-
మాట శుద్ధి గూర్చు మంచి కీర్తి!
కర్మ శుద్ధి గలుగ ధర్మ కర్త ప్రసిద్ధి!
స్వామి కొడవటంచవాస శరణు!
24*
భక్తి శ్రద్ధ గలుగ భావసౌష్ఠవ వృద్ధి
మానవత్వ పరిధి మసలు వాడె
తగిన గట్టిమేలు, తలపెట్టు యోగ్యుడు!
స్వామి కొడవటంచవాస శరణు!
25*
పరులకుపకరించు పనులందు తృప్తియు
క్షేమమెసగు జనుల సేవలందు!
కానరావు మదిని గర్వమాపేక్షయున్
స్వామి కొడవటంచవాస శరణు!
26*
గట్టిమేలు బూను పట్టుదలకు తోడు
భయము భక్తి శ్రద్ధ నయము గూర్చు!
నాది నీదియనని నడవడి జయమిచ్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
27*
విధిగ పూర్వ జన్మ విషయవాసన వీడ-
కున్న, మదిని వీడ కుండు మాయ~
తెరలుగాగ నరుని తెలివిని హరియించు!
స్వామి కొడవటంచవాస శరణు!
28*
క్రీడి వరదు కృపను, గీతార్థ సారంబు-
భారతాన వెలసె, భాగ్య గరిమ!
విషయ వాసనవిడు, వివరంబు ప్రాప్తించె!
స్వామి కొడవటంచవాస శరణు!
29*
పుడమి సత్యమనగ, భూతహితవు గాగ
నిర్వచించి, మునులు నీతి శాస్త్ర-
నిధులు గూర్చిరి, జననియమ నిష్ఠలు సాగ!
స్వామి కొడవటంచవాస శరణు!
30*
వివిధ ధర్మ గతులు-వివరించు పౌరాణి-
కోద్యమంబు సాగె, కోర్కె వీడి-
భూత దయను బూను-బుద్ధబోధలు సాగె!
స్వామి కొడవటంచవాస శరణు!
31*
సత్య ధర్మ తత్వ సహిత ధర్మ వ్యాధు
బోధ, కౌశికుండు బొందె ముదము
భూతహితవె, సత్య భూరి నిర్వచనంబు!
స్వామి కొడవటంచవాస శరణు!
32*
పుడమి భూత భయము, గూర్చు నసత్యము
సకల భూత హితవె సత్యమనగ-
సుఖము గూర్చు ధర్మ సూక్ష్మంబు దీపించె!
స్వామి కొడవటంచవాస శరణు!
33*
మేటి ధర్మ విధులె, మేధావి వర్తన-
వన్నె వాసిగాంచు వాస్తవాలు!
సర్వ జనుల సుఖము సాగించు యత్నముల్
స్వామి కొడవటంచవాస శరణు!
34*
భీతి వలదు, దురిత భీతి గావలె, పాప-
ప్రీతి వలదు, పుణ్య ప్రీతి మేలు!
దైవభీతి, దురిత దారులు మూయును!
స్వామి కొడవటంచవాస శరణు!
35*
ఇరుగు పొరుగుమేలు హితవు పరోపకా
రంపు పుణ్య ఫలము, రాకపోక-
నింపు గూర్చు, నాత్మ కిహపర సుఖమిచ్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
36*
సేవ,దాస్య భక్తి, దేవదేవుడు మెచ్చు
సఖ్యభక్తి సాగు సామిదోవ!
పుణ్య వర్తనంబె, పుడమి కీర్తిని గూర్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
37*
పాప భీతి చనక, ప్రజకు రక్షణ లేదు-
పుణ్య ప్రీతి మనక ముక్తి లేదు!
విధుల దీక్ష, భక్తి విశ్వాసముల సాక్షి!
స్వామి కొడవటంచవాస శరణు!
38*
సత్ప్రవర్తన భగవత్ప్రసాదము గాగ,
నియమ నిష్ఠ విధుల నిలచు శ్రద్ధ!
వసుధ జనుల కీర్తి, వన్నె వాసిని గూర్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
39*
భక్తి గలుగుదారి పాపభీతియు గల్గు-
దానిచేత, హింసదారిమారు!
పుణ్య ప్రీతి, దైవమున్నచోటుకు జేర్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
40*
నిత్య కర్మలందు నిర్భయమేమేలు
భయము భక్తి వేరు, బహువిధాల-
దైవ భీతి, భక్తిదారి శ్రద్ధను గూర్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
41*
పాటిదప్పు మాట, పనినీళ్ళ మూటయే-
మంచి చెడుల నెంచి, మనసు నిలిపి-
మంచి బెంచు రీతి, సంచరించుటె మేలు!
స్వామి కొడవటంచవాస శరణు!
42*
ఎంచి చూడ తనువు పంభూతాత్మకమ్
ప్రకృతి భాగమయ్యె, ప్రాణి సృష్టి!
బాహిరంతరముల ప్రకృతి చోద్యము కదా!
స్వామి కొడవటంచవాస శరణు!
43*
సుస్థితిగను ప్రకృతి-సూత్రధారుడ వీవు
భర్త గాగ, సృష్టి కర్త బ్రహ్మ!
పరమ శివుడు హర్త! ప్రళయ తాండవమాడు!
స్వామి కొడవటంచవాస శరణు
44*
ప్రకృతి వస్తు తనువు, పంచీకరణజెందు-
పొందు ఫలము నాత్మ క్రొత్త తనువు-జన్మజన్మ సాగు జతపడు పుణ్యంబు!
స్వామి కొడవటంచవాస శరణు!
45*
అండ పిండ సృష్టి బ్రహ్మాండ పరిపుష్టి
లభ్ది గూర్చు బ్రహ్మ లయము శివుడు!
పుడమి ప్రకృతి సొంపు పురుషోత్తము సొమ్ము!
స్వామి కొడవటంచవాస శరణు!
46*
కంటి కానని క్రిమి, కరిరాజులోనాత్మ
తత్వమొకటె, జూడ తనువు వేరు!
బాహిరంతరాల బరగు ప్రకృతి వేరు!
స్వామి కొడవటంచవాస శరణు!
47*
పుట్టి పెరుగు జీవి, గిట్టి విరిగి, తర్గు-
విధిగ ముడుచుకొంచు, విస్తరించు!
సకల విశ్వహేల! సర్వోపగతు లీల!
స్వామి కొడవటంచవాస శరణు!
48*
జలధి యావిరియగు, జలధరమున దాగు
చల్లగాలి దాకి జల్లు గురియు!
జలధి జేరు నట్లు జగతి జీవుల సృష్టి!
స్వామి కొడవటంచవాస శరణు!
49*
జలధిలో తుఫాను, జతగ భూకంపముల్
వ్యోమముల్క, పిడుగు తోధ్వనించు! ప్రళయ తాండవశివు పదఘట్టనల్, సడుల్-
స్వామి కొడవటంచవాస శరణు!
50*
కడలి బడబాగ్ని, కానలో దావాగ్ని,
కడ్పున జఠరాగ్ని, కామదహను-
చిచ్ఛు కంటి సెగలు చిందేయు నర్తనల్
స్వామి కొడవటంచవాస శరణు!
51*
మోడు చిగురు టాకు మొక్కవిరియు మొగ్గ,
పూవుదేనెటీగ, తూగు పుష్టి
పుప్పొడి పరమేష్ఠి పూర్ణసృష్టికి నిగ్గు!
స్వామి కొడవటంచవాస శరణు!
52*
ఏడ్పుతోనె బుట్టి, ఏడ్పుతోనె గిట్టి
తెగని యేడ్పు బ్రతుకు దెరువు వెంట-
రాక పోక నాత్మ రాగిల్లు నేడ్పులన్
స్వామి కొడవటంచవాస శరణు!
53*
మొదట కోర్కె పిదప మొదలగు శోకంబు-
కోర్కె వెంట కోటి కోర్కెలెగయు!
శోక జలధి బ్రతుకు సోలిపోవును తుదన్
స్వామి కొడవటంచవాస శరణు!
54*
శోకమణచ,కోర్కెలేక బ్రతకనేర్చి,
యాత్మ దరచి ముక్తి నరయు కొఱకె,
భక్తియోగమయ్యె బహుసులభమగుదారి!
స్వామి కొడవటంచవాస శరణు!
56*
జాగృతమగునాత్మ జన్మ క్రొత్తది గాగ
జన్మయాత్ర ప్రాత జగతియందు-
ప్రాతరోత మరల ప్రభవించుటే వింత!
స్వామి కొడవటంచవాస శరణు!
57*
గర్వమున్న,నాశ సర్వస్వమైరీలు,
దారమట్లు బ్రతుకు దారి వెంట-
చుట్టుకొను తెగక, గిట్టు దాకను సాగు!
స్వామి కొడవటంచవాస శరణు!
58*
గర్వ రహిత బ్రతుకు సర్వస్వమును పుణ్య
సంచితార్థమెసగ సంచరించు!
తరలునాత్మ జన్మ తరియించు మరుజన్మ!
స్వామి కొడవటంచవాస శరణు!
59*
జన్మ జన్మ లందు జతపడు పుణ్యంపు
నిధియె, జన్మ రహిత విధియు ముక్తి!
ముక్తినాత్మ బ్రహ్మ మోదంబు బొందును!
స్వామి కొడవటంచవాస శరణు!
60*
ఆత్మ నెఱిగి, పరమాత్మ శోధన సాగు-
దీక్ష బూని మది నపేక్ష మాని-
గీత ననుసరింప – జీవి గమ్యమెరుగు!
స్వామి కొడవటంచవాస శరణు!
61*
కలిమి లేమి జబ్బు కలిగించు తబ్బిబ్బు
జబ్బు మాన్ప డబ్బు జబ్బు గూర్చు!
బ్రతుకు భీతి డబ్బు బంధించు హేతువు!
స్వామి కొడవటంచవాస శరణు!
62*
డబ్బు దర్ఫమున్న డాయుజనంబులన్
కాకపట్టెడు పలుగాకి మూక!
డబ్బులూడ, డాబు దర్ఫంబు డుబ్బగు!
స్వామి కొడవటంచవాస శరణు!
63*
ఇచ్చి పుచ్చు కొనుటె యిహలోక మరియాద-
అప్పు దీర్చు వాడె యధికుడంద్రు!
పప్పు కూడు దినుచు గొప్పగా జీవించు!
స్వామి కొడవటంచవాస శరణు!
64*
జన్మ తీర్థయాత్ర జాత్ర జాగరణలున్
గుడిని గుండెనున్న గుడిని దైవ-
సన్నిధిగను కోర్కె సాగు నాత్మ తనువు
స్వామి కొడవటంచవాస శరణు!
65*
ఇచ్చి పుచ్చు కొనుచు యిద్ధరు కలహింత్రు!
మధ్య వర్తి వీపు మద్దెలట్లు-
మ్రోగు, నేక పక్ష రోదన రోలుదీ!
స్వామి కొడవటంచవాస శరణు!
66*
ఆశ దోషమనదు, అవకాశము విడదు-
దొరికినంత, దండుకొనగ నేర్చు!
అతిశయించు, మది దురాశ దు:ఖము గూర్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
67*
ఆశ విడని నటకు, లవకాశవాదులు-
తెగువ జూపుచు బరిదెగియు తమకె, అన్నిగావలెనని, ఆరాటపడుచుంద్రు!
స్వామి కొడవటంచవాస శరణు!
68*
తెగెడు దాక లాగ తెగువ సేమము గాదు
తేగమనని సేవ తెరువు వృధయె!
తృప్తి లేక భక్తి, ముక్తి చింతనలేదు!
స్వామి కొడవటంచవాస శరణు!
69*
ఆశరీలు దారమట్లు లాగిన వచ్చు
తెంపు గలుగుదాక, తెరపి లేక-
నాప్తి జెందు మిగుల ప్రాప్తికై జీవించు!
స్వామి కొడవటంచవాస శరణు!
70*
నేటిదాక చరిత, రేపటి జ్యోతిషం
వర్తమాన జనుల వర్తనంబు!
రూపుదాల్చు, రేపు రూపమస్ఫష్టము!
స్వామి కొడవటంచవాస శరణు!
71*
పండితుండు, మరొక పండితు నిందించు
బాట నెదురు రాగ పడియు మ్రొక్కి
పామరుండు విధిగ పండితు గొనియాడు!
స్వామి కొడవటంచవాస శరణు!
72*
పండిత కవియు కవిపండితులకు విద్య
గురుడు శాస్త్ర పటిమ గూర్చు తీరు-
వేరు, సహజకవులు, వేరు-తలంపగన్
స్వామి కొడవటంచవాస శరణు!
73*
సహజ పాండితి గను సహనంబు వెయిపుట్లు
ఏక కాలమందె నేర్చి కూర్చు-
నూర్చు కవిత పంట గూర్చి, గురు చివాట్లు!
స్వామి కొడవటంచవాస శరణు!
74*
యాచకుండు,మరొక యాచకుని తిట్టు!
పాపమేమి? ఇట్టి శాపమేమి!
కీర్తి ధనము గూర్చు క్రియలందు పోటియే
స్వామి కొడవటంచవాస శరణు!
75*
శ్రామికుండు తోటి శ్రామికు మేల్గోరు
కార్మికుండుమెచ్చు, కార్మికులను,
బోధకుండు సాటి బోధకు బాధించు!
స్వామి కొడవటంచవాస శరణు!
76*
మనసు గల్గకున్న, మరుజన్మయనుబాధ!
మనసు గల్గ నిహపుమాట పోటు!
సున్నితాత్ము బ్రతుకు, సన్నిధి వైష్ణవమ్
స్వామి కొడవటంచవాస శరణు!
77*
మూసవీడి విషయమూహించు చందంబు
నడచు కావ్యము, హరిణాంక చూఢ,
వక్రతను శోభ, వస్తు ప్రబంధంబు!
స్వామి కొడవటంచవాస శరణు!
78*
కవితయందు వస్తుకాంతి జిల్గుల వలన్
చందమున్న, నంద చందమున్న-
భావపరిమళంబు, బాటింప లెస్సగున్
స్వామి కొడవటంచవాస శరణు!
79*
పండితులను గెల్వ దండిదాతలు, మొండి-
పోటి కవిత, పిదప బోల్చి చదువు-
చోట, నోటిదురద, చోద్యంబు జనులకున్
స్వామి కొడవటంచవాస శరణు!
80*
అల్ప పదము,భావమతిశయింపగ వ్రాయు
రచన సాగె, పచన రసము లూరె!
వచనమందు, పద్య రచనలందున రుచుల్
స్వామి కొడవటంచవాస శరణు!
81*
పరుల గొప్పకీసు పడువారలే గాని
పోటి పడరు, తోటి ప్రోత్సహించు-
పద్య కవులు లేరు, ప్రజలె ప్రభువు లైన
స్వామి కొడవటంచవాస శరణు!
82*
ధనిక కవిని జేరి, ధరపండితుడు మెచ్చు!
కవియె ధాతగాగ కల్గు కీర్తి
పూచి కాచు చెట్టు పుణ్యంబునకు మెట్టు!
స్వామి కొడవటంచవాస శరణు!
83*
రేయి తమ్మి జిక్కి వేచి రోదించెడు-
తుమ్మెదకెటుగల్గె దుర్భలంబు!
కఱ్ఱదొలుచు ముక్కు కరుకుదనము మరచె!
స్వామి కొడవటంచవాస శరణు!
84*
ప్రొద్ధు గడచు, తెగిన బొక్కెన బడునూతి-
దాని దీయ పాద తలపు గరిగె!
గాక పడిన శ్రమయు, కాలంబు వృధకదా!
స్వామి కొడవటంచవాస శరణు!
85*
ఆడ బిడ్డ గలుగ నడవి వెన్నెలయంద్రు-
కొడుకు గల్గ, పసిడి కొండ యంద్రు!
కోడలడవి గాగ, కొడుకు వెన్నెల రేడు!
స్వామి కొడవటంచవాస శరణు!
86*
మోసమేమి జేసె మోదుగు పూవులు
దోవ దోస పువ్వు దోషమేమి?
ముల్లె మూటవెంట మల్లెపువ్వుదె కీర్తి!
స్వామి కొడవటంచవాస శరణు!
87*
జార చోర కళలు, జడియు సంసారిని,
విటుల, వెసనపరుల, విందుగాగ-
జగతి, ఎయ్డ్సు వైరి జడిపించె వారినీ!
స్వామి కొడవటంచవాస శరణు!
88*
పూని కాల రాయు, బొమ్మ తనది, కాలు-
తగిలి నట్టు, మనసు తల్లడిల్లు!
తరచిచూడ గాంచు, తనలోని మనుజుని!
స్వామి కొడవటంచవాస శరణు!
89*
చిన్న దీపమునకె చీకటంతయు దొల్గు-
తాత్వికంబు గల్గ నాత్మ వెలుగు!
నయజయంబు భక్తి నాధ్యాత్మికము గల్గు!
స్వామి కొడవటంచవాస శరణు!
90*
తెట్టె విడని తేటి, తేనె వీడక జచ్చు!
పట్టు పురుగు నుచ్ఛు బన్నిచచ్ఛు!
కామి తృప్తి పడక, కన్నీట బడిజచ్చు!
స్వామి కొడవటంచవాస శరణు!
91*
తేటి సంతు తెట్టె, తేనెలోబడి చచ్చు!
పట్టు పురుగు సంతు పదిల పడదు!
పెంట ఈగ సంతు పెంపొందు చంపగన్
స్వామి కొడవటంచవాస శరణు!
92*
పండుగన్న నోటబడవు పదార్థముల్
పొట్ట నింప వలయు పొద్ధుమాపు!
అనుభవించు సుఖము లందించు ముదమును!
స్వామి కొడవటంచవాస శరణు!
93*
ఫలములేని తిండి, ఫలహార మందురు!
పేరు గొప్ప నూరు పెద్ధ దిబ్బ!
క్రొత్త చెట్టు గాచె కొమ్మకో కాయను
స్వామి కొడవటంచవాస శరణు!
94*
మంచి తీపియె, చెడు మధుమేహ- రుజహెచ్చె!
చేదు దిన్న గాని సేమ మొసగె!
చెలగు రోగములకు, చేదౌషదముకదా!
స్వామి కొడవటంచవాస శరణు!
95*
గడచు,వయసు – మనసు గమనించకున్నను-
పెరిగి చిన్న వాడె పెద్ధ గాగ!
తనువు వీడు కోర్కె – తపనసాగును తుదన్
స్వామి కొడవటంచవాస శరణు!
96*
గడచి పోవు బ్రతుకు, కాలంబు గంటలున్
నిలువు దోపిడగును నిమిషములును!
శిథిల దేహమాత్మ, చిగురు తొడుగై విడున్
స్వామి కొడవటంచవాస శరణు!
97*
బాల్య యవ్వన జర, భారంబు దేహంపు-
శిధిల గతుల, గణన చిహ్నములుగ-
మరలి రాని కాల మానంబు దలపించు!
స్వామి కొడవటంచవాస శరణు!
98*
కలిమి లేని బ్రతుకు, గడన పెర్గి తరుగు-
కాలములుమూడు ఋతువులు కరుగునారు!
వత్సరాలు జన్మ వయసుగా బెర్గును!
స్వామి కొడవటంచవాస శరణు!
99*
కాల చక్ర గమనగతి, నాపగాలేము!
కాలమొక్కతీరు గడపవలయు!
ఎండ వాన చలియు వెన్నెల లమవాస్య!
స్వామి కొడవటంచవాస శరణు!
100*
అయిన వేళ బ్రతుకు హర్షంబు వర్షించు!
కాని వేళ గారు కంటి నీరు!
కలిమి లేములెపుడు కావడి కుండలు!
స్వామి కొడవటంచవాస శరణు!
101*
జరుగ నున్నది ధర జరుగక మానదు,
కానిపనులు కానె కావు, పుడమి-
కాల మహిమ దెలియ గలవాడె కలవాడు!
స్వామి కొడవటంచవాస శరణు!
102*
మంచికాలమందు,మార్ధవ జీవనమ్
తీపియూహ సాగు, తిరము గూర్చు!
కఠిన కాలమందు కలతల కాపురం
స్వామి కొడవటంచవాస శరణు!
103*
కాల గతిని గల్గు, కలల విందుల చిందు-
కాల గర్భమందె, గలియు గతము!
గుర్తు లేని బ్రతుకులెర్తు కేకుల పాలు!
స్వామి కొడవటంచవాస శరణు!
104*
ధీరుడైన గడుపు, దినమొక యుగముగా
ధీమ గలుగ, యుగమె దినమటండ్రు!
బ్రతుకు మంచి చెడులు, భావనాతీతముల్
స్వామి కొడవటంచవాస శరణు!
105*
అమర కందుకూరి, అవధానములు వీడి
కాన్క జేసె నూరు గ్రంధములను!
శిలయు శిల్పమయ్యె! శిల్పి దేవునిజేరె!
స్వామి కొడవటంచవాస శరణు!
106*
భువి పరోపకార బుద్ధి పుణ్యమనిరి-
కాల మహిమ నెఱిగి కరుణ గలిగి-
మొప్పె తీర్చి దిద్ధి – మోదంబు గూర్చిరి!
స్వామి కొడవటంచవాస శరణు!
107*
జ్ఞాన నేత్ర మొసగు జాతిపురాణముల్
నీతి విలువ బెంచు రీతి గీత!
భువి పరోపకార పుణ్య నిధానముల్
స్వామి కొడవటంచవాస శరణు!
108*
శుభము మానవతగ, సుకృత ఫలము గూర్చు!
సుజన మైత్రి శుభము సుఖము శాంతి!
సాగు భారతీయ జాతీయతకు శుభమ్
స్వామి కొడవటంచవాస శరణు!!!