top of page
 
శ్రీశ్రీశ్రీ సత్యదేవ శతకము
(తే.గీ.)

1*(తే. గీతులు)

శ్రీరమాపతి! మాగతి నీవె యనుచు-

విశ్వసించియుంటిమి, భువి’విశ్వరూప!

చిత్తగింపుము-మామొర చిద్విలాస!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

2*

నీప్రసాద మహిమ చేత నిఖిల ఫలము

శ్రేయమగుబాట జీవించు చేతనంబు నిచ్చి రక్షించు పుడమిని నిత్య సేవ్య!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

3*

నీదు వ్రతమాచరింపగ నిష్ఠ నొసగు!

సారసాక్ష నారదనుత! సమతధాత!

సాగె శతక లహరి పద్య సాహితిగను-

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

4*ఆ. వె.

శ్రీరమేశ! నీదు కరుణాకటాక్షమే

ఆర్తులగని నిత్యమాదుకొనగ

నీప్రసాద మహిమనేమని వర్ణింతు-

సహన సత్వ మొసగు సత్యదేవ!

5*

సూర్య రశ్మిచేత చుక్కవెల్గులమించె-

చందమామ గురిసె చంద్రికలను

నీదు దయయు గలుగ నిత్య సంతోషముల్

సహన సత్వ మొసగు సత్యదేవ!

6*

నీదు భక్తియాత్మ నిజతత్వమూహింప

నిండుగుండె వెలుగు దండి గుణము

బుద్ధి సూర్య రశ్మి-వృద్ధి సౌష్ఠవ సిద్ధి!

సహన సత్వ మొసగు సత్యదేవ!

7*

క్షేత్ర సామి! జన్మ సేద్యంబు నీలీల

చెలగు తాత్వికంబు చేతనాంశ!

జఢతమాని ప్రకృతి జలధరించును చాల!

సహనసత్వమొసగు సత్యదేవ!

8*

జలమునీవె-పంట జవసత్వములు నీవె!

పంచభూత ప్రకృతి పాత్ర జన్మ-

విత్తి నూర్చు పుణ్య విత్తంబు నీసొమ్ము!

సహన సత్వ మొసగు సత్యదేవ!

9*తే.గీ.

స్వార్థ రహిత భక్తిని గొల్చు సత్యవ్రతుల-

మెచ్చి, భారంబు మోసేవు! మేలుగూర్చి-

బ్రోవ వచ్చేవు-ఇచ్చేవు మోక్ష పదము!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

10*

స్వార్థ గుణ పరిత్యాగంబు, సత్య వ్రతము

ఆత్మ సంతృప్తి నిడు పరమాత్మ – నేడు

తపము కన్న దానమె మిన్న-తరచి చూడ!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

11*

మాటకును సత్యమే ప్రాణమంద్రు, లేఖ-

సాగు ప్రాణము వ్రాయసగాని వ్రాలుఁ

సత్యమును లేక నమ్మిక సాగునెట్లు?

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

12*

పుడమి సత్యమహింసచే పుష్టినొందు,

బ్రతుకు హింసకాశ్రయమైన, పతనమొందు

తత్వమెరుగ పౌరాణిక సత్యమిదియె!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

13*ఆ. వె.

నీతి కష్టమయ్యె! నిర్వేద పడి, నీతి-

పరులు, నీరుగారి బ్రతుకు నీడ్వ-

నీ పరీక్ష భక్తినోప శక్తిని గూర్చు!

సహన సత్వమొసగు సత్యదేవ!

14*

వేషబాషగొప్ప,వేయేల?నీతియు-చులకనయ్యె,జగతి చోద్యముగను- సాగె,నేడు నీతి శాస్త్రమాపదలందె!

సహన సత్వమొసగు సత్యదేవ!

15*

కలుష పరిసరాల కల్తివస్తుల సంత,

నకిలిదేది-దెలియ నాణ్యమేది?

చూడగానె దెల్పు సూత్రసూచకులేరి?

సహన సత్వమొసగు సత్యదేవ!

16*

విశ్వసింపకున్న విద్వేషమెదురగు-

రాజి పడని బ్రతుకు రాహ లేదు!

కానికాలవృష్టి-కరువులోనతివృష్టి!

సహన సత్వమొసగు సత్యదేవ!

17*తే.గీ.

మనసు పొరలందు నెలకొన్న మాయతెరలు

దాచు వర్తన, స్వార్థంబు, దయయులేని-

మాయికుని విశ్వసించు నమాయికుండు!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

18*

కానికాలమందు కరువు కాటగలుపు-

మంచి వంచించి, కపటంబునెంచి సాగు-

మోసకారి-యమాయకు ముంచి పోవు!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

19*ఆ. వె.

కానికాలమందు కరువు పడగలెత్తు

కరువు తోడ మోసకారి యెత్తు-

చెడగ గోడదెబ్బ-చెంపదెబ్బకుతోడు!

సహన సత్వమొసగు సత్యదేవ!

20*

రైతు-ఆశ కోర్కె రౌతుగా నురుకుల-

పరుగులెత్తు-కృషిని పంటనూర్చు!

గిట్టుబాటు ధరకు’గీపెట్టియరచును’

సహన సత్వమొసగు సత్యదేవ!

21*ఆ.వె

సోమరి నరులంత సోమకా సురులైరి

చదువులమ్ము సంత సాగు బడుల

ఫలము కాగితాల బలమువెంటనె సుమీ!

సహన సత్వమొగు సత్యదేవ!

22*ఆ. వె.

కొన్న చదువు నమ్ముకొన్న పదవి వేట

అమ్ముకొన్న చదువు సొమ్ము-అప్పు-

తీర్చు కొఱకు కష్టమోర్చ జీవనబాట!

సహన సత్వమొసగు సత్యదేవ!

23*ఆ. వె.

బ్రతుక లేక, నితరు బలిదానమును గోరు-

దుష్ట బుద్ధి నణచి శిష్టు జేసి-

వసుధ నిల్పి బ్రోచు-వామన మూర్తివీ

సహన సత్వమొసగు సత్యదేవ!

24*ఆ. వె.

కలిమి బలిమి వెంట, కనక కశ్యపులైరి!

నీదుపేరదోచు నీతి సాగె!

తెలివి కొలది బ్రతుకు నిలువు దోపిడియయ్యె!

సహన సత్వమొసగు సత్యదేవ!

25*తే.గీ.

అన్నపూర్ణ భారతమాత అన్యదేశి-

యనక తిండియు మర్యాదలన్నిగూర్చె!

సౌష్ఠవాభివృద్ధికి కీర్తి సాక్షి చరిత!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

26*తే. గీ.

ప్రజలు చైతన్యవంతులై ప్రగతి బాట-

నడువ నేర్చుట, నీభక్తి నలరి పడవ-

నెక్కుట చరిత్ర, మేల్గూర్చె పెక్కు విధుల!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

27*తే.గీ.

బ్రతుకు బరువుతో పాటుగా పరువు బరువు

దాన గుణమొప్ప మోసిరి, తాతలంత-

బాని సత్వంబు మరచి నీ భక్తిమనిరి!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

28*తే.గీ.

పేరు కోసము స్వార్థంబు పెంపుమీర-

పోటి, పరువు కోసమె గెల్పు-నోటమిగను,

నేత పోరాటమారాటమే గణింప!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

29*తే.గీ.

అన్నగత జీవులు నరులు, అన్నదాన-

ఫలము గొప్పదటన్న సద్భక్తి దారి-

అందరొక్కటై సాగింత్రు జన్మయాత్ర!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

30*ఆ. వె.

ఖలుడమాయక నరు-కవ్వించి యూరకే

దు‌:ఖమందుముంచు, దుడుకు మూక!

కోర్కె దీర్చ – కొంప కొల్లేరు జేయును

సహన సత్వమొసగు సత్యదేవ!

31*ఆ. వె

అక్రమ హామితో దురాక్రమణకుబూను

అపరపైడి నేత్రులు పరభూమి-

నాక్రమించిరి, వరహావతారుడ రమ్ము!

సహన సత్వమొసగు సత్యదేవ!

32*ఆ. వె.

చట్టము కలవారి చుట్టమైతే భక్తి

పట్టము గలవారి పట్టుగొమ్మ!

కనగ వినగ, నాటి కనక కశ్యపనీతి!

సహన సత్వమొసగు సత్యదేవ!

33*తే.గీ.

చదువు లక్ష్య సమస్యల చక్కజేయు

తగు పరిష్కారములుజూపు, తరచిచూడ!

దివ్వె గోరంత – కొండంత తేజమిచ్చు!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

34*ఆ.వె.

నీతిలేక బ్రతుకు నిస్తేజమై-కూటి

విద్యవెంట లోభి విధుల తంట!

పంచుకొనెడు తిండి పచన దశను పోటి!

సహన సత్వమొసగు సత్యదేవ!

35*ఆ. వె.

పంచు గుణము భూప్రపంచాన మృగ్యమై

నేర్చు విద్య దోచు నేర్పుగలుగ-

దొంగ వెంట దొరయు దొడ్డిదారిని దూరె!

సహన సత్వమొసగు సత్యదేవ!

36*ఆ. వె.

ఒప్పు కోరు తప్పునొప్పుగా నెంతురు

కీడునెంచి మేలు క్రియల సాగు-

మనెడు నీతి వినరు’ మానవత’ గనరు!

సహన సత్వమొసగు సత్యదేవ!

37*ఆ. వె.

నరనరాల విషము, నరకమీ కలికాల

పుడమి కల్తి వస్తు పూర్ణ కథల-

సాక్షి నీవె! నీ పరీక్షలుపేక్షలే!

సహన సత్వమొసగు సత్యదేవ!

38*ఆ. వె.

లోపదారి వెంట లోకదాడిని బూని,

వివిధ పాత్రలందు వీలువెంట-

రాలు గాయి-పరశురామ ప్రీతిని జూపు!

సహన సత్వమొసగు సత్యదేవ!

39*ఆ. వె.

పడ్డవాడె మంచి-ప్రతిభ సాధించేను

అనుభవమ్ము గూర్చి అవని నిలుచు!

పడని చెడ్డ వాడు – పడితెలేవడు భువిన్

సహన సత్వమొసగు సత్యదేవ!

40*ఆ. వె.

కుంటినియురికించి, గూనినెత్తియు జూపి-

గ్రుడ్డి వెక్కిరించు, కుబ్జుమొట్టు-

మూగను వదిరించు-మూర్ఖ క్రీడలు సాగె!

సహన సత్వమొసగు సత్యదేవ!

41*తే. గీ.

బాధ గాధల నీదుచు, బాధ్యతలను

మోయు సంసారిక నీతి మొరటు గాగ

కట్టుబాటును మరచిన-కలదె నీతి?

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

42*తే. గీ.

అందరొక్కటై,యొక్కని-అణచుటేల?

ఒక్కడందరి బ్రతికించు యోధులేరి?

ఎందరొకటైతె నొక్కడు ఎదగ గలిగె!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

43*తే. గీ.

చిత్త శుద్ధిని మేలైన సిరుల వృద్ధి,

దయయు దాక్షిణ్యమునుసాగు దారి జయము

పుడమి నిష్కామ కర్మంబు బూన, శాంతి!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

44*తే. గీ.

ప్రతిభచే శ్రద్ధ – శ్రద్ధచే భక్తి వృద్ధి

పూను ధైర్యంబు కొనసాగు పుణ్యకర్మ!

నీతి నిస్వార్థమునుగూర్ప నిత్య శాంతి!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

45*ఆ. వె.

కాలమొక్కతీరు గడపగా తాబేలు,

ముడుచుకొన్నయట్లు ముందు వెనక

ఫికరు లేని బ్రతుకె, ప్రీతి గూర్చును నేడు!

సహన సత్వమొసగు సత్యదేవ!

46*ఆ. వె.

బాల భవిత యనక బాధ్యత విడనాడి

అగ్నితొ చెలగాట మాడు బ్రతుకు-

చేయిగాలి రక్ష చేపట్టు విధమగు!

సహన సత్వమొసగు సత్యదేవ!

47*ఆ. వె.

స్వార్థ రహిత బుద్ధి – సంతాన ఘనవృద్ధి

చదువు సంసృతి యెద సమత బుద్ధి-

లేక బ్రతుక గలరె? రేపటి పౌరులు!

సహన సత్వమొసగు సత్యదేవ!

48*ఆ. వె.

మిగుల కీర్తి ధనము-మిగిలించు జనులేగ

మిగులునేది? కొండ యిసుక గాగ-

గృహము పేర కొండ గొప్పరూపము దాల్చు!

సహన సత్వమొసగు సత్యదేవ!

49*ఆ. వె.

వృత్తి పనులు బోయె, వృత్తి విద్యలుబోయె!

కైకిలయ్యె-నేటి కైటి బ్రతుకు!

పాత విద్య యవిటి పాత్ర చేతి దివిటి!

సహన సత్వమొసగు సత్యదేవ!

50*ఆ. వె.

ఊత బ్రతుకు దెరువు జూపని చదువులు

పోవు దోవ నీతి-పోవుటేల?

నేటి విద్య-వెంట- మేటియై ధరజెల్లు!

సహన సత్వమొసగు సత్యదేవ!

51*

చేతగానివేళ చేయూత నిచ్చెడు

వాడె, పోటిగెలువ వాదులాడు

బల్లిదుండు డబ్బుజల్లి యిద్ధరిమించు!

సహన సత్వమొసగు సత్యదేవ!

52*

దయయుమాని,డబ్బు దస్కంబు సమకూర్చు

కుర్చి పోటి కలిమి గూర్చు – తోటి

నిస్సహాయ జనుల తస్సదియ్యగ జూచు!

సహన సత్వమొసగు సత్యదేవ!

53*

కొంతయు వెనకేయు కొట్లాట సరిపోయె

పుణ్యకాలమేగె, పూని జనుల

కెంతొ-కొంత జేయు పంతంబు చల్లారె!

సహన సత్వమొసగు సత్యదేవ!

54*

మీదివారు వినరు, క్రిందివారుగనరు-

మధ్య వారిమేలు మిధ్యయనగ-

కొమ్ముపోటి కాళ్ళ-దుమ్మగు దూడలు!

సహన సత్వమొసగు సత్యదేవ!

55*

నింగి మిణుగురాట నేల వెలుగుమూట,

నడిమి తరగతి సరి నడక జూట!-

రాజకీయమొకటె రంగులీనెడు చోట!

సహన సత్వమొసగు సత్యదేవ!

56*

అవని బుట్టు జనులు ఆరుద్ర పురుగులై

కాలగతిని, సోకు గలిగి-నలిగి,

రంగు వెలయుదాక రాణించు సయ్యాట!

సహన సత్వమొసగు సత్యదేవ!

57*

ప్రజల మేలుగోరు ప్రభుతయే తొలిరక్ష-

ఆత్మరక్ష-పిదప నంతరంగ-

భక్తిమార్గమున పారలౌకిక రక్ష!

సహన సత్వమొసగు సత్యదేవ!

58*

ప్రభుత సేవకులను-ప్రైవేటుగా దిట్టు

కొలువు దొరికి నాక కొంటె బుద్ధి-

ప్రభుత మేలటంచు ప్రైవేటు దిట్టెను!

సహన సత్వమొసగు సత్యదేవ!

59*

వెనక రాజు-రంగు వెలసి బంటుగ మారె!

తెగిన మేలగు-బరిదెగిన కీడు!

వెనక గోతి-ముందు వెఱపించు నూతులు

సహన సత్వమొసగు సత్యదేవ!

60*

రాని మాతృబాష-‘రాబిటు టారుటా

యిస్సు’ -కళ్ళుమూసి లెస్స పిల్లి-

పాలుద్రాగుమాట-పరబాష మరఘోష!

సహన సత్వమొసగు సత్యదేవ!

61*

ఊసుబోక జదువు, ఉన్నత విద్యలో

మాతృబాషలొదిగె, మారు మూల!

కుమ్ములాటసాగె – కూటి విద్యలగోల!

సహన సత్వమొసగు సత్యదేవ!

62*

సమయమమ్ము యాత్ర సాగె యాంత్రికముగా

బ్రతుకు దొమ్మియుద్ధ పటిమ వెంట-

కూడబెట్టు దిగులు-కూటి దిగులు మించె!

సహన సత్వమొసగు సత్యదేవ!

63*

కలిగె కృతమునుండి, కలిదాక, పరిణామ-

క్రమము, విజ్ఞతగను కథల దయయె!

విస్తరించె, మానవీయ విజ్ఞానమై!

సహన సత్వమొసగు సత్యదేవ!

64*

ప్రీతి , శుద్ధి గలుగు పిడికెడు మెతుకులు-

క్షుధితు నాల్క తృప్తి, సుధలు గురియు!

లవణమన్నమె, దిను-లక్షాధికారియు!

సహన సత్వమొసగు సత్యదేవ!

65*

మంచి బెంచు భక్తి మార్గంబు శాశ్వత

తృప్తి గూర్చు, లేశ ప్రాప్త ధనమె! మంచి మాట పనుల మానవీయత మదిన్

సహన సత్వమొసగు సత్యదేవ!

66*

ఆర్త జనులు మదిని యాపద మ్రొక్కులఁ

గోరుచుంద్రు, పుడమి క్రొత్తబ్రతుకు

సాగిపోవ మదిని సంపద మరుపులున్

సహన సత్వమొసగు సత్యదేవ!

67*

వరుస కథలయందు వ్రతమహిమ వినియు

శ్రద్ధ గలుగ నీ ప్రసాద మొంది

బ్రతుకు తేలికపడి బాధలు మరిచేరు

సహన సత్వమొసగు సత్యదేవ!

68*

మాట దప్పి వ్రతము మాని వాయిదా వేయు

భక్తజనులు సాగు బ్రతుకు బాట

విధిగవ్రతము జేయు నికషగల్పించేవు!

సహనసత్వమొసగు సత్యదేవ!

69*

భారతీయ దివ్య భావమాత్మీయతా!

వారసత్వగుణమె వసుధ జాతి

కౌతుకంబు విశ్వ కౌటుంబ దర్పణమ్

సహన సత్వమొసగు సత్యదేవ!

70*

నీతి ధర్మ పథము, నీస్తేజమగువేళ

రీతి నుద్ధరింప గీతమ్రోగె-

అవనినుద్ధరింప నవతరింతువునీవె!

సహన సత్వమొసగు సత్యదేవ!

71*

ఒప్పుకొనరు కలిని – తప్పు నొప్పుగనెంత్రు

గట్టిమేలును దల పెట్టలేరు

వ్రతములందు, మానవతయె దీపించదా!

సహన సత్వమొసగు సత్యదేవ!

72*

తప్పు దెలిసి మాయ దరచి యాత్మదెలిసి-

బ్రతుకు లోతు గన్న భక్తి నిలుచు!

భక్తి దారి యాత్మ ముక్తిమార్గము గాంచు!

సహన సత్వమొసగు సత్యదేవ!

73*

నీతి గుణమె పేద నిండుదనమగును

దయయె, ధనిక కీర్తి దనరు గుణము!

కలసి బ్రతుక సుఖము కలహింప కష్టమున్

సహన సత్వమొసగు సత్యదేవ!

74*

మనుజు మనుజు గలుపు, మాధవా! నీభక్తి-

నాత్మనేక భావమలరు వ్రతము-

తరిగి పోవ జేయు, తరతమ బేధముల్

సహన సత్వమొసగు సత్యదేవ!

75*

నీదు నోము నోచు నెలయె కార్తీకంబు

పున్నమిదినమందు పూజనోము!

నయము, జయము గూర్చు-నమ్మిన వారికిన్

సహన సత్వమొసగు సత్యదేవ!

________________

***రామకథ ప్రస్తుతి ఆటవెలదులు***

76*

రామ జననమయ్యె! రామాయణము సాగె

రామ నవమి పెళ్ళి రమ్యమయ్యె!

నాల్గు పాదములను నడయాడుధర్మమై

సహన సత్వమొసగు సత్యదేవ!

77*

రామ రాజ్యమందు రాజిల్లె ప్రకృతి

వత్సరాది రుచుల వసుధ బ్రతుకు!

నెలవు సస్యములకు నెలమూడు వానలున్

సహన సత్వమొసగు సత్యదేవ!

78*

ఆలు మగలకెల్ల ఆదర్శమగు సీత-

రాములనగ నడవి రాజ్యమేలె!

తండ్రియాజ్ఞ తలను దాల్చి పద్నాల్గేండ్లు!

సహన సత్వమొసగు సత్యదేవ!

79*

నార చీర గట్టి, నాతివెంటను రాగ-

రాతినేల నడిచె, రాముడతని

యనుజ లక్ష్మణుండు ననుసరించియు వచ్చె!

సహన సత్వమొసగు సత్యదేవ!

80*

చుప్పనాతి,రాముజూచి సీతనురక్కి

వేయ దుమికె-సైగ జేయ లక్ష్మ-

ణుండు ‘ముక్కుజెవులు-ఖండించి పంపెను!

సహన సత్వమొసగు సత్యదేవ!

81*

ముక్కుగాయపడియు ముఖశోభ దరిగిన

శూర్పనఖయు యుద్ధ సూత్ర గతిగ

దరణిజ చెఱబట్ట, దశకంఠు పురిగొల్పె

సహన సత్వమొసగు సత్యదేవ!

82*

మాయలేడి చర్మమడిగెను, భూజాత-

రామబాణఘాతి రక్కసుండు

అవనిగూలియఱచె, హా లక్ష్మణాయని!

సహన సత్వమొసగు సత్యదేవ!

83*

సూత్రధారి హనుమ! సుగ్రీవుమైత్రికి!

తల్లిగాంచె లంక దగులబెట్టె!

రామరావణ రణ రచన గావించెను

సహన సత్వమొసగు సత్యదేవ!

84*

రాక్షసాళి మడిసె! రావణుండు మడిసె’

అగ్నిచేత పూజలందె సీత!

పుష్ఫకంబయోధ్యపురము జేరగ వచ్చె!

సహన సత్వమొసగు సత్యదేవ!

85*

కట్టె వారధి పడగొట్టె లంకాపతిఁ

దెచ్చెసీత జనుల హెచ్చె ముదము!

వసుధ ప్రకృతిశోభ వత్సరాదినిబోలె!

సహన సత్వమొసగు సత్యదేవ!

86*

సత్య వ్రతముదెల్పి సంస్కరించి జనుల-

గలుగు కోర్కెలిచ్చు కలపవృక్ష-

మైన బ్రహ్మ విష్ణు మహదేవుడవు నీవె!

సహన సత్వమొసగు సత్యదేవ!

87*

చూడముచ్చటైన సుందర రూపంబు

గనినచాలు తృప్తి గలుగుచుండు!

చుట్టు సకల మునులు సురలు ప్రస్తుతి జేయ!

సహన సత్వమొసగు సత్యదేవ!

88*

మాత వలెను గీత మరల మరల దెల్పి

జీవులన్నిటాత్మ దీప్తి జూపి!

సంశయంబు దీర్చు సంరక్షణయు జేసి-

సహన సత్వమొసగు సత్యదేవ!

89*

నయమొసంగు మంచి నైతిక విలువలు-మరలమరల బెంచి మనిషి జేసి-

కలిమిగూర్చి, సృష్టి కడదాక మన్నించు!

సహన సత్వమొసగు సత్యదేవ!

90*

ఇంట- రచ్చగెలుపు, తంటయ్యె బ్రతుకంత-

లోప చిద్రమె రిపులోక దారి!

నీదు భక్తి గలుగ, నిశ్చింత, భద్రత!

సహన సత్వమొసగు సత్యదేవ!

91*

ఎవరి తిండి వారికేర్పడె నీదయ-

బ్రతుకు దారి గలిగె, పరులతిండి-

దోచి తినగ, కలహ దొమ్మి సాగెను నేడు!

సహన సత్వమొసగు సత్యదేవ!

92*

భక్తి గలుగు కూడు, పట్టెడేదైనను-

చెత్తమేనుబెంచు, చెలగు భక్తి-

శుద్ధి గూర్చి, బుద్ధి వృద్ధి-నీదరిజేర్చు!

సహన సత్వమొసగు సత్యదేవ!

93*

అందరొకటె,ఈవి నందించు కృషియేది!

పంట వంటమాని తంటగూర్చు-

ఆస్తి గోల లేల? ఆత్మ శోధన గల్గ!

సహన సత్వమొసగు సత్యదేవ!

94*

సిరులు గుల్కు పుణ్యశీలంబు గల్గెనా-

అందరొక్క బాటయందు సాగి-

బ్రతికి ధాతలగుచు, భక్తి నిన్ వేడరా!

సహన సత్వమొసగు సత్యదేవ!

95*

వాపు,బలుపు గనక-వర్థిల్లు బ్రతుకున

స్వార్థ గుణుడు, యీవి సాగనీక-

మాయికుడగు ముక్తి మార్గంబు వెదకునా?

సహన సత్వమొసగు సత్యదేవ!

96*

ఆత్మదారి, జీవులన్నియొక్కటే, చేయు-

చేతలందు-మమత చెలగు సమత!

సెక్కులరిజమైతె శ్రేష్ఠమీ నరజాతి!

సహన సత్వమొసగు సత్యదేవ!

97*

ఇల్లు పల్లె పట్నమెల్ల నాత్మీయతా-

భావముప్పతిల్లు భక్తి మహిమ!

నీది నాదియనని నిజబ్రహ్మ భావమే!

సహన సత్వమొసగు సత్యదేవ!

98*తే. గీ.

ఉన్న లేకున్నను, కలిగియున్నయంత

ఊరు నూరంత నీదీక్షనుండు వేళ-

వ్రతముసాగు కులము, మతభేదమును లేదు!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

99*తే. గీ.

మనిషి కారోగ్య మహభాగ్యమాత్మ తృప్తి-

విజ్ఞ మానవ తేజమే విశ్వ శాంతి!

సామ్యవాదమెసగు-నీప్రసాద మహిమ!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

100*

భక్తి పాలకుండను తోడు బ్రహ్మ విద్య!

పెరుగు మీగడ నీగీత నెరుగు దీక్ష!

బ్రతుకు నవనీతమగు – పుణ్యఫలము దోచు!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

101*

బుద్ధి శుద్ధి వివేకంబు, భుక్తి విద్య

పారలౌకికార్థము భక్తి బ్రహ్మ విద్య!

జన్మ దరచు చుక్కానియై జగతి వెలసె!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

102*

త్యాగమూర్తులై భారత తత్వ మునులు-

సంస్కృతిని, సంసృతిని భక్తి సాధనముగ-

యోగవంతంబు జేసిరి, యోగ్యతెసగ!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

103*

తిరుణహరి వంశజుడ, పుణ్య తీర్థ సేవ-

తనివిదీరగా ననుగన్న తల్లిదండ్రి-

నోము నీనామ కరణంబు నోచియుంటి!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

104*

చర్ఛ సదసద్వివేకులు చాలమెచ్చ-

సాగె శతకలహరియు నక్షత్రమాల

భాగ త్రయము నర్పించితి-వాసుదేవ!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

105*

శ్రీ సభాపతి మన్నించె, చిత్తగింప!

వినుడు వినుడంచు వేడితి వినయమొప్ప!

సాటి గురులకు జనులకు-ఛాత్రులకును!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

106*

శతక పఠన సమర్పణ సాగువేళ-

వేదికను వెల్గు సాహితి వేత్తలంత-

పొగడ, పాత్రికేయులు మెచ్చ గొనుము కృతిని!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

107*

నిత్య సత్యమహింసయే నీదు వ్రతము!

మానవత నీప్రసాదమై మహిమ జూపు!

దానమే తపస్సుగ నీదు దారి సాగు!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

108*

శుభము పఠనపాఠకులకు శ్రోతలకును-

శుభము సత్యవ్రతులకెల్ల, శుభము! శుభము!

శుభము భూతహితవు నేర్పు బోధకులకు!

సహన సత్వంబు సమకూర్చు సత్యదేవ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page