top of page
 
సఖ్యభక్తి శతకము
(తే.గీ.)

1*(ప్రారంభము)

శ్రీ తిరుమలేశు కృపచేత చిత్తవృత్తి

దాసదాసాన దాసత్వ దారి సాగె!

సత్యదేవుని వరజన్మ సత్ఫలముగ-

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

2*

తేట తెలఁగాణ బాషావిశేషమేమొ?

తరచి చూడగ, సంస్కృత తత్సమంబు!

తద్భవంబులే గ్రామ్యముల్ తత్వగతులు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

3*

చిన్ననాడుదయించిన చిగురుటూహ-

ప్రణయమై దాస్యభక్తికి పాదుగాగ-

పరిణతిని జెంది తాత్విక ప్రణవమయ్యె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

4*

మంచి చెడు విచక్షణ దేల్చె మానవతయు-

మైత్రి భావంబు మొలకెత్తె, మనసు శుద్ధి

సామి భక్తి, జనకు బోధ సాగె బుద్ధి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

5*

కృష్ణ మైత్రి – కుచేలుని తృష్ణదీర్చె!

కృష్ణ మైత్రి, పార్థుని కృషి ఫలించె!

మధుర భక్తి, మీరాబాయి మార్గమయ్యె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

6*

మైత్రిచేత,శత్రత్వంబు మాయు, పుడమి-

శత్రు మిత్రుగా మార్చుట సాధ్య పడును-

సాధ్య పడకున్న-కలిగించు సత్ఫలంబు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

7*

క్రొత్త కలతచే, మైత్రికి గోడబెట్టి

మిత్ర నిందకు బూనడు మిత్రుడెపుడు!

కర్ణ దుర్యోధనుల మైత్రి గాంచె కీర్తి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

8*

మనసు తలవంచు మైత్రికి మనుజులందు

మాయ వీడగా వాస్తవ మార్గ మొదవు

యెంచి మాటాడి యత్నింప – మంచి గలుగు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

9*

మంచి చేదోడు వాదోడు మానవులకు!

తాను బోయినా మిగిలేది ధరను కీర్తి!

మైత్రి గలిగిన చోటనే మంచి వెలయు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

10*

మంచి చేయూతగా సాగు మైత్రి మేలు!

చెడుగు మైత్రి- తత్కాలికం చేదుబ్రతుకు!

కొంచమైన గుభాళించు మంచి మైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

11*

జన్మపోయినా మిగిలేది జగతి కీర్తి!

మనము పోయినా, మిగిలేది మంచిపేరు!

మంచి మైత్రి సాగిన ధర్మమలరు జగతి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

12*

మంచి యోచన చేగల్గు మంచి మనసు!

మంచి మనసు నినదించు మంచిమాట!

మంచి మనసు, మాటయు గల్గ మైత్రి వెలయు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

13*

మంచియోచనచేగల్గు మంచి కర్మ!

మంచి కర్మ సాధన – ధర్మమార్గమగును!

ధర్మమార్గమె – ఇహపర తారకంబు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

14*

మంచి సాగుట కష్టము-మాట నిలుప-

మనుజు జీవనమార్గంబు-మంచి పరిధి-

కష్టమైనను-మైత్రిచే యిష్టమగును!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

15*

మంచి చెడులెంచి సన్మైత్రి మానవాళి –

చెడును వర్జింపకున్నను చెడును-బ్రతుకు!

మంచినార్జింప సన్మైత్రి మలుపు ద్రిప్పు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

16*

చెడ్డ మిత్రుడు, తనకు తాజేరి-వెళ్ళు!

మంచి మిత్రుడు మది పరీక్షించి మొదట-

నెమ్మదిగ మైత్రి సాగించు నమ్మకమున!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

17*

మంచి’ప్రాణవాయువుబోలు-మలినములను

అగ్ని శుద్ధిగా మండించి – ఆత్మ జూపు!

ఆత్మ పరమాత్మ సంబంధయాత్ర మంచి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

18*

మంచి కథసాగు బ్రతుకుగా- మాధవుండు

మంచి వారిని రక్షింప – వంచకులను,

వంచగా బుట్టి మంచి జూపించి గాచు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

19*

మంచియే,మాధవుని మైత్రి, మనుజ నీతి

మాధవుని మైత్రిచే వెల్గు, మానవతగ!

మానవత, పరస్పరమైత్రి-మనగ జెల్లు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

20*

మంచి లేనియాచారముల్ – మాయమగును

మంచిలేని విచారముల్ మైత్రిగనవు!

మంచి బూనిన, చరితార్థమగును-బ్రతుకు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

21*

మంచి దివ్వెకిందనె చెడ్డ పొంచియున్న

చెడ్డ క్రీనీడ కిందనె చేరి మాయ-

తెరలలో దాగు మంచియు తరతరాలు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

22*

మంచి యోచన, మేధస్సు-మహిని బ్రతుకు

తృప్తి గూర్చును-బ్రతుకు సంతృప్తి వెంట

మంచి త్రికరణ శుద్ధికి మార్గమగును!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

23*

మంచి బాటలో, ఘటియించు మైత్రిమాట

మైత్రి బాటలో నర్తించు మంచి మనసు!

విస్తరించు విశ్వాసమే విశ్వమైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

24*

మంచి సంపాదనకు జన్మ సంచితార్థ-

పుణ్య ఫలము జతపడును, పూని సాగు-

యోగసాధన, తత్ఫలయోగ్యు జేయు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

25*

పుణ్యమనగ ముక్తినిగొను పూర్ణ ధనము!

దాని సాధింప కరుణాత్మక విశుద్ధి!

మంచి పుణ్యము-చెడుపాపమగును పుడమి-

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

26*

భువి పరోపకారము గూర్చు భూత హితవు-

సత్యమై, పుణ్యమై, మంచి సాగు విధము!

ధర్మమైజెల్లు, కలియందు, ధాత తపసి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

27*

దానమే కలియుగమందు, తపసుగాగ-

మునిపురాణ నీతియు ధర్మ మూలకముగ-

నీతి శాస్త్రంబు హితవయ్యె నీ ధరిత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

28*

మంచి,చెడు శత్రు మిత్రులు సంచరింత్రు-

వంచకుడు, నిశాచరునట్లు వచ్చువాడు!

దినము వచ్చుమిత్రుడు బోలు దినకరుణ్ని!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

29*

స్వార్థమున మంచియే లేదు సాగు పనుల

వెలయు నిస్వార్థమే, మంచి వెలయు చోటు!

ప్రేమ భక్తి నిస్వార్థమే-పేరు కీర్తి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

30*

మనసు నవనీతమై-పల్కు మాట, పనుల

తేట తెల్లమౌ త్యాగంబు బాట-మైత్రి-

సూర్య రశ్మిని సరిబోల్చు సూత్రమగును!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

31*

స్నేహమే నిత్య వేదిక-చేయు పనుల

దీన జనసేవ సాగిన దిక్కులందు!

వెల్గు పుణ్యాత్ములే భువి వేల్పు లనగ!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

32*

స్నేహ భావంబు చేకూర్చు నిహసుఖంబు!

భక్తి రూపమై కల్గించు పరసుఖంబు!

మైత్రినుద్ధరింపగ, దైవమవతరించు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

33*

బ్రతుకు పోరాటమారాట – గతుకు బాట!

బలము గూర్చు మైత్రియు భక్తి భావ ఝరులు!

పారలౌకికంబులుగాగ పరిగణింప-

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

34*

చేయు కృషి-మైత్రి చే మించు, చేవ గలుగు!

భక్తి వైరాగ్య సాధనా పటిమగలుగు!

మనసు నిల్పు నిశ్చింత సమత్వ దృష్టి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

35*

దుష్ట చింతన విడనాడి, దురిత దూర-

శిష్ట సత్సంగమున బడి, ఇష్టమైత్రి-

కష్ట సాధన చేయనభీష్ట సిద్ధి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

36*

బ్రతుకు ఝంజాటమునబడి-భ్రమరమట్లు-

మంచి మిత్ర సంపాదన మార్గమందు

మాయికుతోడ గెలువడమాయకుండు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

37*

బాధ్యత,విధుల వీడదు ప్రాణ మైత్రి

కలిమి లేమి-నిమ్నోన్నతఁ గాంచ బోదు!

కల్మిడిగ కష్ట సుఖముల కలిసిఈదు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

38*

కలిమి లేముల గలిగెడు, కలత సుడుల

శత్రు హేళన , గోలగా సాగు వేళ-

మంచి మిత్ర సంపాదన మార్గ హితము!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

39*

ఆపదల యందు’వీడదు ఆప్త మైత్రి!

పేద గొప్ప భావము లేక పెరిగి పోవు!

బాధలకు మైత్రియే మందు-భవిత విందు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

40*

బ్రతుకు నవ్వుపువ్వుల దారి, బండి మైత్రి

సప్త రంగు సింగిడియట్లు సాగు చుండు!

ఏడ్పు నూర్పులు భరియించు నేడుగడగ!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

41*

మింటి సూరీడు-మిహిరుడు మిత్రుడనగ

సూర్యు నంత పవిత్రుడు! సూత్రగతిని

సాగు సామాజికుల దండ సాహితముగ!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

42*

అరయ నవవిధ భక్తులు నలరు పుడమి!

సఖ్య భక్తినావను జన్మ సార్థకంబు!

ముక్తి తీరమ్మునకు సాగు ముందు దారి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

43*

నిజము వచియింప, మైత్రియు నిగ్గు దేలు!

కీర్తిదాయకమగు మైత్రి క్రియలు రోజు

విహితమును గూర్చు భువి దానవీర మైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

44*

నీతి నిర్ధారణకు మైత్రి నిలువ మేలు!

ఇచ్చి పుచ్చుకోగనుమైత్రి హెచ్చు-మిత్ర

దారి మరలించి వెనుదిర్గి తరలి వచ్చు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

45*

పొగడ నుబ్బి తబ్బిబ్బుగా బోని మైత్రి-

తెగడ కూలబడని మైత్రి తేజమొందు!

మిత్ర కార్యమై సర్వత్ర మేలుగూర్చు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

46*

మిత్రు కోసమై త్యాగము మిగుల జేయు

తప్పులుపొరబాట్లు తరచ వేరు!

మిత్ర గోప్యంబు దాచు, సుమిత్రుడెపుడు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

47*

గొప్ప దనమేది – తనసొమ్ము కొంత నిడక!

మెత్తదనమేదగు, అమాయ కోత్తమంబు!

నీతి నిండుదనంబేది విలువ గనక!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

48*

మైత్రి గలచోట వెల్గును, మంచి మనసు!

మంచి భావాత్మకమె, సాగు- మనసు శుద్ధి!

శుద్ధి గొన్న మదియు, నాత్మ బుద్ధి వెలుగు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

49*

మూడు పురుషార్థముల, మూలగూడు ధర్మ

మనెడు మాటకు నతికియు మనుజు నందు-

అర్థ కామ మోక్షముల్జన్మ-సార్థకములు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

50*

మైత్రి సుఖశాంతి దాయక మార్గమందు-

ధర్మమేసాగు – మైత్రి విధాత వరము!

సత్య మార్గజీవుల వారసత్వ ధనము!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

51*

పుడమి జన్మ జన్మల పూర్వ పుణ్య ఫలము

భక్తి గామారు, నాధ్యాత్మికోక్తిమహిమ

మైత్రి-జాతిసమైక్యత, మానవతయు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

52*

యెదను సద్భావముదయింప నెగడుమైత్రి!

వెలయు ధీ వివేకము గల్గ వెల్గు మైత్రి!

నిండు మనసు నిశ్చలమైన దండి మైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

53*

దైవ ఘటన మానవ పాత్ర ధారి నటన-

జగతి నాటకమున-మాయ ఝరులు పొంగు!

ఆత్మ తత్వదీప్తిని మాయలంతరించు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

54*

ఎవరికెవరు,తనకుతానె-వెలయునాత్మ!

తనువు గాక తనకుతానె దలచుటెల్ల

జన్మ తరియించు మార్గమే – జాగృతిగను!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

55*

ఎవరి కెవరు గారను, మాటలెల్ల, పార-

లౌకికము బాట నిహలోక లబ్ధి గూర్ప-

మైత్రి భావంబు ప్రీతిగా మనుగడెసగు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

56*

చిత్త చాపల్యమున తత్వచింతనంబు

సాగ బోదు, నిశ్చల చిత్త సామ్యగతిని-

బ్రాంతి తొలగు కొలది-యాత్మభావసిద్ధి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

57*

దైవ ఘటన యోగంబుల దారులెల్ల

నొకరికొకరున్న భావననొనర జేయు!

జగతి నాటకమును సాగు జరుగు చరిత!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి

58*

శత్రు శత్రుత్వమే చెడు, మిత్రుడైన-

చెడ్డ-మంచి భావము చేత చెరిపి వేయు!

మంచి మైత్రియే మనుజుని మంచి మార్పు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

59*

భువి నజాత శత్రువనంగ భూరి మైత్రి!

పుడమి సంధింప ధర్మజు పూనికయ్యె!

దారి నడిపించె దైవంబు ధైర్యమొసగె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

60*

అక్కరకువచ్చు బంధుత్వమవని వెలయ-

మైత్రి భావంబు భక్తిగా మార్పుజెందు!

మరపురాని కావ్యాలలో మధురమైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

61*

మన పురాణేతి హాసాలమాట-మైత్రి!

తెఱపిలేని నీతికి వెండి తెరయె మైత్రి!

ఆత్మ పరమాత్మసంబంధ యాత్ర మైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

62*

పాల వంటిది యలనాటి బాల్య మైత్రి!

హృదయ కుహరంపు ముద్రయాకృతిని బోలు!

పాలలో తోడు దైవీయ ప్రకృతి మైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

63*

తోడు వీడని వెన్నమీగడయె మైత్రి!

విరిగి పోనిది పెరుగున వెన్న మైత్రి!

భక్తి బుణ్యాదిగా మైత్రి బలమునొందు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

64*

వెన్న నవనీతమగు క్రొత్త వెన్న గలిపి

కాచి వడబోయగా నేతి కమ్మరుచుల-

పాత్ర పరిమళించే, రీతి పటిమ మైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

65*

పాల మైత్రిని విరుచు పాపాల మైత్రి!

పుడమి నేతిగ రూపించు పుణ్య మైత్రి!

బ్రతుకు మంథానమొనరించు ప్రాణమైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

66*

శత్రు కన్న ప్రమాదమే స్వార్థ మైత్రి!

ఇంటి గుట్టును చాటించు కొంటె మైత్రి!

మధ్య రాత్రి గడియదీయు మాయమైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

67*

నీతియుతమైన మైత్రిదే నిండు దనము

నీతి రహిత మైత్రిని సాగు రీతి కీడు!

నీతి సహిత శాత్రవు చర్యలింక మేలు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

68*

అవని తలిదండ్రి, గురుదేవు, డతిథి, యాత్ము-

లనగ వేల్పు లైదుగురును, దనరు పూజ-

కర్హులుగ భక్తి నర్పింప గలుగవలయు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

69*

భక్తి చే మాధవుని సేవ బరగునట్లు-

మైత్రి చేత మానవ సేవ – మార్గముండు!

మనసు గల్గిన నడవడి మంచి బెంచు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

70*

బుద్ధియు వివేక సంపద-భూత హితవు,

దయయు, దాక్షిణ్యపూరిత దారులందు-

మిత్రుడాకాశమణి మిత్రు మించి వెలుగు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

71*

భారతీయ పురాణాల భక్తితోట!

ప్రేమ గాథలో మైత్రికే పెద్ధపీట!

భాగవతులందు గను సఖ్య భక్తి బాట!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

72*

మంచి పూదండ దారమై మైత్రి సాగు

దారి-ఉమ్మెత్త – పరమాత్మ దయనుబొందు!

గడ్డి పూవు గుడిని జేర గలుగు చూడ!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

73*

దురలవాటున గలిగేది దురిత మైత్రి!

దారిలోగల్గి ఖర్చగు, ధాత ధనము!

కలిమి కర్పూరమౌ కరుగు కడకు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

74*

నిత్య సంతోషికెప్పుడు నిత్య సుఖమె!

అలక దీర్చు తాయిలమట్లు నలరు మైత్రి!

తలప తాత్కాలికమె, యాకతాయి మైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

75*

గాయ పడురాలు గాయితా గాయపరచు!

ప్రేమ జూపడు, మైత్రిని పెంపు గనడు!

మనసు గాయంబు మార్చేది – మైత్రిభక్తి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

76*

శోకమణచు నిష్కామమే లోకమందు

గీత సారాంశముగ మ్రోగె నీతి పథము!

సమతయోగ సాధన దాక సాగిపోయె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

77*

అందరును జన్మబంధాల నలరు చున్న

భక్తినేకాత్మ దోచుట – వ్యక్తిగతము!

ఇష్టదైవమేకముగా, సమిష్టియాత్ర!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

78*

ఏది గౌతమ బుద్ధుని యెదను నాటి

యాత్ర సాగియు-జ్ఞానోదయంబుగూర్చె!

అదియె, నరులందు నేటికి కదలు కోర్కె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

79*

కోర్కె హేతువు స్వార్థమే లోకమందు!

శోక హేతువు కోరిక, సొమ్ము మోజు!

హింస కైన బూనుటకదా! హీన చరిత!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

80*

బౌద్ధ మతదారి దైవమే బుద్ధుడయ్యె!

భూత దయ దెల్పె-జైనము పుడమి వెలసె!

హింస మాన్పించె-జీవుల హితవు గోరె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

81*

నీతి గీతార్థ సారంబు రీతి బోధ

సాగె నిష్కామయోగాది సాధనముల

కాని తీరుకు భక్తియు కలిగి మనుట!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

82*

సఖ్య భక్తి – భాగవతము వ్యాఖ్యసౌరు-

మంచి బెంచు పౌరాణిక వాంఛితమ్ము!

భిన్న ప్రాణుల నేకాత్మయున్న తీరు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

83*

సఖ్య భక్త కుచేలుండు, సామి నెపుడు-

గుండె గుడిలోన నిల్పియు గుట్టుగాను

మైత్రి భావార్చనలు జేసె మరవకుండ!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

84*

భిన్నమగు వేషబాష విభిన్నగతులు-

భిన్న కులమత-గుడుల వి భిన్నవేల్పు

భిన్నముగ దోచు వాస్తవమెన్న నొకటె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

85*

ప్రథమ ధర్మసాధనమగు పరగ తనువు

పిదప నితరసాధనముల ప్రీతిగొనును!

తరలి పోవలె దైవాజ్ఞ ధర్మ రక్ష!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

86*

తనువు ధర్మసాధనముగా, తగిన రీతి-

ఆత్మ శోధనయే భక్తియాత్ర బ్రతుకు

ధాతగా పుణ్యధనముతో తరలవలయు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

87*

మైత్రి బ్రహ్మ, వైష్ణవ, శైవ మధ్వ మొదలు

వివిధ మత గురులేకమై విశ్వమాన-

వతను బోధజేయ సాగిరి-వసుధయందు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

88*

ధర్మ సుస్థిరతయె కదా! దైవలీల!

ధర నవతరించి సాగించు ధర్మ రక్ష!

శరణు జొచ్చిన, పరమాత్మ కరుణజూపు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

89*

ధర్మ వర్తనమే మెచ్చు దనజవైరి!

కర్మ ఫల సమర్పణజేయ కాంక్షదీర్చు!

తదితరాలకన్నను ఇదే తగిన దీక్ష!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

90*

సఖ్య భక్తియోగము సాగ, చాల సుళువు!

సమత యోగసాధన జన్మ సార్థకంబు!

భక్తి పారలౌకికమార్గ బ్రహ్మ ముదము!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

91*

మైత్రియలవోక సాగెడు మాట కాదు

భక్తి పైనపటారంపు బాటగాదు

జీవ శ్రేష్ఠమానవు జూపు దీప్తులివియె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

92*

అంతులేనియాపేక్ష చే గంతు లేయ-

ధరణి సామ్రాట్టులకుతృప్తి దక్కలేదు!

ఆశ వీడి సామాన్యుడే యలరు తృప్తి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

93*

మంచి మనసున్న నిహలోక మనుజు జన్మ

సార్థకము బొందు-మనసు నిస్వార్థమొప్ప-

పరుల కుపకార గుణరీతి పరువు కీర్తి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

94*

మదికి నెమ్మది గలిగిన మైత్రి గలుగు!

అర్థి నవనీత హృదయాన నాప్త మైత్రి!

ప్రాణి హితవెంచి సాగిన ప్రాణ మైత్రి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

95*

మనసు బోయిన పోకల మనిషిబోక-

మాటపై నిల్చి, సన్మార్గమందు నడచి

పనుల నుపకారియగుటయే పరువు కీర్తి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

96*

వరద కోర్కెలుప్పెన వేయ బురద-శోక

రొచ్చు హెచ్చు భోగములను రోసి మనిషి-

సాగవలె, నిశ్చలమగు సు స్వాంతమొప్ప-

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

97*

మిత్ర రశ్మిమూలమె, చంద్రు మించులెల్ల!

చంద్రికలవెల్గు పుడమిని జెందునట్లు-

మిత్ర మిత్రుండును తనకు మిత్రుడగును!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

98*

భువి చతుర్విధ పురుషార్థములను మదిని

దలపవలెను, ద్వంద్వాతీత దారి ధర్మ-

యుక్తముగ నర్థ కామముల్, ఉర్వి మేలు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

99*

ఉప్పు లేని తిండియు, రసములూర నట్లు-

రుచియు పచిలేని, బ్రతుకులో రోజురోజు

మైత్రి భక్తి లేకను సాగు మార్గమేల?

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

100*

ధర్మయుతమైన పురుషార్థ కర్మసాగు-

ధాత లై నరుల్, భక్తిని దనరు చుండ!

పుడమి నాకలోకము వలె పులకరించు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

101*

బ్రతుకు నాపేక్ష – సాపేక్ష గతుల విషయ-

వాసన గల్గు, గత జన్మ వాంఛలవియె!

విషయ వాసన దొలగించు విష్ణు గీత!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

102*

ఆత్మ,బుద్ధి,వివేకంబు ననుసరించి-

మనసు నిశ్చలతయు గల్గు మాయదొలగు!

ప్రజ్వరిల్లునాత్మయు, తనువు ప్రమిదయందె!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

103*

భక్తిచే మైత్రి శుద్ధియు-శక్తి గలుగు

మైత్రి భక్తిసాగిన దైవమాత్మ నిలుచు!

ఆత్మ పరమాత్మ బంధంబునలరు ముక్తి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

104*

భక్తి పాదపమే కదా! భారతంబు!

భాగవత వృక్ష బీజముల్, భక్తి పరులు-

మఱ్ఱి విత్తనమే బ్రహ్మ మహిమ సృష్టి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

105*

అంతరాత్మ సాక్షాత్కారమైన చిత్త-

నేత్రమును విప్పి చూడగా నిత్య సత్య-

విశ్వ రూపంబు-గీతోక్తి విశ్వసించు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

106*

నరుల గలుపు మైత్రియు, భక్తి-నాత్మలెల్ల

నేకమను భావబంధంబు నేర్పడంగ-

సూక్ష్మమై, స్థూలమై దోచు సూత్రధారి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

107*

జన్మ తరియింపగా భక్తి సాధనంబు!

బ్రతుకు సాగింపగా మైత్రి బాట మేలు!

విశ్వ జీవన సుఖశాంతి విస్తరించు!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

108*

శుభము భక్తిసాహితి మిత్ర, శ్రోతలకును

శుభము శతక పాఠకులకు శుభము! శుభము!

శుభము అభిమానులకునెల్ల సుఖము, శాంతి!

తిరుణహరి సఖ్యభక్తి యాత్మీయ సూక్తి!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page