top of page
శ్రీ షిరిడి సాయీశ నీరాజన శతకము
(తే.గీ.)

1*

శ్రీ షిరిడివాస! నిఖిలేశ! చిద్విలాస!

సకల ధర్మ సమన్వయ సద్విచార!

విశ్వ శాంతిప్రబోధక విబుధ వినుత!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

2*

సత్య వాక్పరిపాలన చక్రవర్తి!

సామ్య ధర్మ ప్రచారక! సమతయోగి!

నిత్య భజన కీర్తన ప్రియ నిర్మలాంగ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

3*

అవని మానవ రూపావతార మూర్తి!

మానవాదర్శ జీవన మార్గ దర్శి!

కామిత ఫలదాయక! మురారి కంబుకంఠ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

4*

జన్మ జంజాటములు మాయ జనిత జగతి

కలిమి లేముల సత్యముల్ కలయె భవిత!

ప్రాప్త మైనంతలోతృప్తి పరమ సుఖము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

5*

కలిమి లేములశాశ్వతం కలుగు తొలగు!

ప్రేమ నిచ్చి పొందిన పుణ్య పెన్నిధెసగు!

దైవ సన్నిధి శరణన్న దక్కు ఫలము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

6*

తరతరాల జీవన కేళి తారుమారు!

పాతకొత్త కలయిక ప్ర పంచ సంత!

పెద్ధవారిమాటలె దారి సద్దిమూట!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

7*

పితరుల ననుకరింతురు పిల్లలెల్ల-

పెద్దలై పిల్లలకుదెల్పు పెక్కు నుడులు-

తాత మనుమల ముచ్చటల్ తరతరాల!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

8*

తరతరాల చరిత్రలు తరచి చూడ-

కలుగు కావడి కుండలు కలిమి లేమి!

ఆపదల మ్రొక్కు సంపద నాదమరుపు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

9*

లేమి నాటికష్టార్జితం లెక్కతెగదు!

కలిగి యున్న దీరదు మూట గట్టి దాచు!

మనిషి పైశున్యమున సౌఖ్యమనక బ్రతుకు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

10*

ఆకలికి దిండి వేదన కౌషదంబు-

ధ్యానమున మనోవ్యాధులు దరుగు, సైన్సు-

భక్తి దారుల నారోగ్య భాగ్యమొదవు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

11*

విజ్ఞ-మూఢ మానవులుంద్రు విశ్వమందు

ముదము బొందు వాడికె గల్గు ముక్తి పదము

మొదట భక్తి మార్గ ఫలము ముదము- ముక్తి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

12*

తప్పు లెన్నుటే తమపని – తనదు పనుల

ఎదుటి తప్పన్న నొప్పేది లేదటంచు

వాదులాటకు దిగు వారి వరుస వింత!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

13*

తప్పు దెల్పి దిద్దిన వారు తగిన గురులు

నొప్పు మార్గ సూచన జేయుటొప్పు నెపుడు

సద్విమర్శ లాభముగూర్చు చదువులందు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

14*

తప్పు,పొరబాటు దోషము తదితరాల-

నేరముగ జూడ చదువులో నేమి ఫలము!

ఏమి సాధింత్రు సోమరి గాములగుచు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

15*

తప్పుహేళన జేయరు గొప్పవారు

దెప్పుటేతప్ప తమయొప్పు జెప్పలేని

అథమ దృష్టికానదు తత్వ మార్మికంబు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

16*

బాష వయ్యాకరణ చంద భావ గరిమ

కవన శ్రమ జేయు కృతి యందె కవులకీర్తి!

వట్టి చేతల గలుగునే గట్టిమేలు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

17*

ఊర్థ్వ దృష్టిప్రధానము నుత్తములకు!

అథమ దృష్టి యహంకారి విధము జగతి

నుభయులకు సమదృష్టియే శుభకరంబు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

18*

పుడమి నూహవస్తువు రూప గడన ధనము

పెరిగి విరుగును భూధనం పెరుగబోదు!

పట్టుకొనిపోరు మట్టిని గిట్టువారు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

19*

పుట్టి గిట్టు వారలు తలల్ గొట్టుకొనుచు

ఏమి గొంపోరు మహరాజులెచటగలరు?

కాల వస్తు ప్రదర్శన శాల సాక్షి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

20*

ఏమి గొనిపోయె సామ్రాట్టులేరి భువిని-

వారి పేరైన నిలిచెనే వసుధ – చరిత

మంచి చెడు సాగు పలుజన్మ మార్గములను!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

21*

అనుభవింపక దప్పని – అవని కర్మ-

కాల తీర్పు ననుసరించు కడకు జేర్చు!

కీర్తి యపకీర్తి చారిత్ర స్ఫూర్తి మెఱయ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

22*

కర్మయోగి పరంతప ధర్మమైన-

హింస వద్దన్న బుద్ధ ప్రశంసయైన-

కాలమొకతీరు గడపెడు కర్మ దశలె!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

23*

ధర్మ మిరుసుగా కాలంబు కదలు – చక్ర

గతిని కర్మ ఫలంబును గలుగు – దాని

దైవమునకు నర్పింప గీతార్థ బోధ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

24*

ధ్యానమున కర్మ దగ్ధమౌ దారి భక్తి

దిన దిన దహనమగునదే దేహ మనగ-

దైవ భాగమాత్మయు శాశ్వతముగ మిగులు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

25*

యోగములు చేత గాకున్న భోగి గాక

భక్తి శరణాగతిని వేడు చందమందు

కర్మ ఫలసమర్పణ పుణ్య కలిమి గూర్చు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

26*

నరుని బ్రతుకెల్ల కృష్ణార్పణంబు గాగ

భక్తి పూజాధికములన్ని బలమొసంగు!

కర్మ ఫలసమర్పణ ముక్తి గలుగు చుండు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

27*

ఒకరి మంచి మరొకరికి నొనర చెడుగు!

నేటి మంచి రేపటిచెడు నెంచు విధము-

భావ ప్రాధాన్య మదివేరు బ్రతుకు విధుల!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

28*

ధర్మ మార్గాన దైవంబు దనరు చుండు

దైవమును దల్పకున్నను ధరణియందు-

మళ్ళి మొదటికి వచ్చేది మనిషి జన్మ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

29*

ధర జయాపజయములెల్ల దైవవశమె!

కట్టుబాటున మది నిల్ప గలుగు దాక

ఆత్మ పరమాత్మ దాగుడుమూతలాట!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

30*

కూడు గూడు గుడ్డలకేళి కూర్మి పేర్మి

గూడి విడిపోవు నాత్మ వైకుంఠపాళి!

పాపమే మిక్కుటముగాగ పాము మ్రింగు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

31*

బ్రతుకు పరతంత్రమున సాగు భక్తి లేదు

భక్తి లేకముక్తియు లేదు పాపపుణ్య-

గతుల సమకూర్చు కార్యముల్ గలవుపెక్కు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

32*

యౌవనము బాలలకువింత యౌవనులకు

ముసలి తనమన్న మాటయే ముసుగు బొంత!

వృద్ధులకు బాల్య యౌవన పద్దు సమము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

33*

జన్మ బొక్కెన పున్నెంపు జలము దోడు-

గాక దురిత బురద దోడు – కలుగు ఫలము-

స్వర్గ నరకాలనెడు కాల చక్ర గతులు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

34*

కల్మి లేముల జీవితం కదలు చిత్ర

దశలలో పాత్ర ధారులే ధరణి నరులు!

శాశ్వతముగాదు జీవాత్మ శాశ్వతంబు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

35*

కష్ట సుఖములు జీవిత కలశ నిధులు

వెల్గు కర్పూర హారతి వింత బ్రతుకు!

శాశ్వతముగాని దానికై చావు భయము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

36*

దేహ దేవాలయము నాత్మ దేవునాంశ!

యోగులాత్మ బోల్తురు దైవ భాగమట్లు!

ఆత్మ పరమాత్మ వృత్తాలు నమరియుండు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

37*

దేహ గుడిప్రవేశింప దెలియునాత్మ-

ఆత్మ గుడిలోన పరమాత్మ నరయ వలయు!

దైవ దర్శనార్థము భక్తి దారి వెలసె!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

38*

ఆత్మ పరమాత్మలద్వైత మందు నొకటె

ద్వైతమున వేరు వైశిష్ట్య దారి నొకటె!

ఆత్మ వృత్తాన పరమాత్మ నలరు విధము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

39*

తనువు లోనికి వీక్షించు తపనమేలు

అంతరాంతర శోధనల్ ఆత్మ తత్వ-

మెఱుక గాబోధ – నరజన్మ మేలు గూర్చు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

40*

దైవ బలము తోడగు భక్తి దనరు కొలది!

లక్ష్యమును మర్చి పోకుండ లభ్ధి కొఱకు-

సాధనలు యోగముల పేర సాగుచుండు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

41*

భక్తి యోగమే సుళువైన బాటగాగ

మనిషియాత్మ సాక్షాత్కారమంద వలయు!

అందు పరమాత్మ వెలుగొందు చందముండు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

42*

అంతరాంతరములనాత్మ వింతయునికి

మనసు మేధలకందని మర్మమిదియె!

జీవి జీవిలో పరమాత్మ దివ్య దీప్తి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

43*

బంధములు తొల్గుట విముక్తి – భక్తి బాట

నాత్మ పరమాత్మ లీనమౌ ననుట ముక్తి!

బ్రహ్మ ముదము జీవన్ముక్తి బాట సాగు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

44*

మనిషియాత్మ సాక్షాత్కారమందకున్న-

నూత్న విజ్ఞాన శాస్త్రమునుత్తదగును!

సైన్సు నాధ్యాత్మికము గల్సి సాగమేలు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

45*

కలిమి లేమిజన్మలమాట కడకునుంచి

సైన్సునిత్యావసరమందె సద్దు మణుగు

జీవికాధ్యాత్మికము సమదీవెనొసగు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

46*

సకల మార్గాలు ముక్తికి సాధనములు

విశ్వ – వివిధ ప్రయోగాలు విస్తరించె-

శోధనాధ్యాత్మికము సాగె బోధలందు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

47*

దైవ భాగమాత్మగ సాగు తనువు మనసు

తాను గాదన్న వాస్తవ తత్వమాత్మ-

దృష్టి బలపడు సాధన నిష్ఠ వెలయు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

48*

భక్తి నవమార్గముల ముక్తి పథము సాగు!

పుడమి జన్మరాహిత్యమే పూర్ణ ముక్తి!

బ్రహ్మమోదంబు నానంద బ్రహ్మమంద్రు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

49*

చిన్న మెదడు గంధపుసైన్సు చిహ్నమైన

భౌతిక సుఖతోషమగు మతి బాటవేరు!

టక్కు టిక్కులకాత్మయు చిక్కదెపుడు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

50*

తగిన పరిసరాలను బట్టి తనువు బెరిగి

సిరుల లభ్ది సీతాకోక చిలుకలట్లు

రంగు పొంగు పల్కులసాగు రక్తిబాట!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

51*

తనువు వైజ్ఞానికపు శుద్ధి – తాత్వికముగ

జ్ఞానమున చిత్తశుద్ధియు ధ్యాన గరిమ

నాత్మ సిద్ధియు పరమాత్మ నరయు బుద్ధి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

52*

ఎంత సాదించె నున్నదింకెంత సైన్సు-

నింక తోడుకోగను కొత్త నిధియదేమి?

సైన్సుకందని నిధులెన్నొ సాగు సృష్టి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

53*

సైన్సు నింగితజ్ఞానమై సత్యమెఱుగ

లభ్ది గలుగు నాధ్యాత్మిక లక్ష్య సిద్ధి-

చిక్కు ప్రశ్నల కాత్మయు జిక్కుపడదు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

54*

తనువు బోధన సమిష్టిగా తరచు సైన్సు-

వ్యక్తి గతముగా చిత్తము వ్యక్త పరచు!

చిత్త చాపల్యముననాత్మ చిక్క బోదు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

55*

అన్ని మరచి తానొక్కడే యున్నయట్లు-

తపముజేయ మనోయాన దారినాత్మ-

వృత్తమందున పరమాత్మ చిత్తగింపు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

56*

అట్టహాసాన గనలేనిదాత్మ రూపు-

దైవ దర్శనం బహిరంగదారి వృధయె!

స్వానుభవ సాధ్యమీక్రియల్ సాధువులకు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

57*

మనసు భక్తిమట్టుకు గట్టి మాయజీల్చి

నిర్వికల్ప స్థితిని మది నిల్పి గాంచ-

సైన్సు లబ్ధప్రయోజన సరణి సాగు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

58*

సాగు నాధ్యాత్మకాంశ ప్రయోగశాల

దేహమాత్మకు తొడుగు గా దేల్చు కొఱకు-

గీత బోధించె సద్యోగ క్రియలు దెలిపె!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

59*

గురులు నూరేండ్ల క్రిందటే గురి కదిర్చి-

సైన్సు నాధ్యాత్మికము గల్పి సాగుమనిరి!

దేశ దేశాలకును కీర్తి తేజులైరి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

60*

దేహతత్వాన్ని కనుగొని దేవు నరసి-

అంతరంగ ప్రవేశమై యాత్మ రూప-

మనెడు దైవ భాగము గాంచి మనుట మేలు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

61*

మానసిక దేహ రుజమాన్పు మనుగడొసగు

కొంగు బంగారమై భక్తి కోర్కెదీర్చు!

దయయు దాక్షిణ్యమున జన్మ ధన్యమగును!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

62*

సేవ సమయపాలన భక్తి భావగరిమ-

శుచియు శుభ్రతలను చిత్త శుద్ధి సుఖము

శాంతి జీవనమెల్ల కాంతి మయము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

63*

మానసిక శరీర శ్రమ మార్గములను

సిరుల నార్జించి సద్భక్తి పరుల గలిసి

బరువు బాధ్యత లనుమోసి బ్రతుకు చుంద్రు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

64*

నిద్ర తిండి రక్షణ తోడు నీడ-దైవ

నిర్ణయానుసారము భక్తి నియమ నిష్ఠ

మానవత-నీతి ధర్మము మనుగడంత!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

65*

అన్నియున్న నేదోలోపమదె సమస్య-

ఎందరున్నను వెదికేది ఎవరి కొఱకు?

అతడు పరమాత్మయని యంతరాత్మ మ్రోగు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

66*

ఉన్న లేనట్లే లేకున్న నున్న యట్లె-

దోచు వాదవివాదాల తో పనేమి?

అంతరాత్మ ఘోషించగా పంతమేల!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

67*

బ్రతుకు తృప్తి-శాంతి సుఖము బాట భక్తి

పూర్ణ విశ్వాస భరితమై పున్నె గరిమ!

పడవ సాగించు ముక్తికి బ్రహ్మ ముదము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

68*

తనకువలె నందరిని జూచు తత్వబోధ

తగినయూరట గలిగించు తమరి చరిత!

ఉన్న లేకున్న బ్రతికించు నున్నతముగ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

69*

ధనము రాజుపేదల మార్చు ధరణి భక్తి

పాపి పుణ్యాత్మునిగజేసి పరమ పదము

జేర్చి జన్మరాహిత్యమున్ జేయు నికష!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

70*

ఊహ చిత్రనిర్మాణ సమూహ జగతి

రూపమునుదాల్చు వస్తునిరూపణముగ

నాటి ఊహలే వస్తువుల్ నేటి ప్రగతి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

71*

వరుస వాదవివాదాలు వసుధ సాగు

వాని జోలి పట్టని భక్తి వలసినంత

ప్రేమశక్తిని పూరించి ప్రేరణొసగు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

72*

సకల శక్తుల ప్రేమయే సాగు చుండు

ముక్తి గోరువారంత ముముక్షువులుగ-

భక్తి నావలో పయనింప పరమ పదము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

73*

భోగి కిహసుఖమాసక్తి యోగియైన

పరమునందు సుఖించగా వరము గోరు

భక్తి యోగాన సుళువైన ప్రాప్తులివియు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

74*

నిత్య పారాయణము సాగె నీదు చరిత-

గ్రంధ నిధిగాగ దక్కెను కథల కూర్పు-

జన్మ ధన్యమొనర్చగా జగతి కాన్క!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

75*

భక్తి బీజ సంక్షిప్తమై భావజములు

నియమ నిష్ఠల పఠియింప నిచ్చు ఫలము!

ధ్యాన గంభీరమై విస్త్రుతార్థమొసగు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

76*

పద్య చందంబు వాడుక బాష భావ

రచనలచ్చు తప్పులు దిద్దరాని గురులు

తప్పు బట్టగ వచ్చేరు తరుము కుంట!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

77*

తాత వాడుక బాషయు ప్రాత కృతులు

పండితులు పామరులు మెచ్చు పల్లె పదము

భక్తి తత్వార్థ సంపదల్ వాసికెక్కె!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

78*

భక్తి శతక సమర్పణ బాట లందు

నోర్పుతో కువిమర్శల నొచ్చుకొనక-

చెప్పితేబది శతకముల్ సేవ-భక్తి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

79*

చెఱుకు వంకరయైనను చెడదు తీపి

బాష గట్టిది గాకున్న భక్తి పరులు-

ఉందురభిమాన పఠితలు కొందరైన!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

80*

భక్తి తోటమాండలికమై బాషమెఱయ-

తేట తెలఁగాణ తత్సమ బాట సాగె-

తరచి పండితావళియు సుతారమనగ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

81*

సర్వ లోక సమర్థుడ సద్గురుండ!

సర్వ దైవస్వరూపుడ! సకలవినుత!

సర్వ ధర్మ సంసేవిత! సంయమీంద్ర!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

82*

సర్వ ధర్మ స్వరూపాయ! శాంతి ధాత!

సకల సిద్ధి సంకల్పాయ! సాత్వికాయ!

నాథనాథాయ! దురితవినాశకాయ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

83*

ద్వారకామాయి సదన – చైతన్యలింగ!

విశ్వ ప్రాణశక్తి విధాత విశ్వరూప!

విజ్ఞ మూఢ భక్తులనేలు విశ్వసాక్షి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

84*

పంచ భూతాత్మక పరమ పావనాంగ!

విశ్వ రూప! విరూపాక్ష! విఘ్నరాజ!

శక్తి రూప! దత్తాత్రేయ! సాధు హృదయ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

85*

భక్త జన పరిపాలక! పండరీశ!

మూల శక్తిస్వరూపుడ! ముక్తి ధాత!

రామ నరసింహ! మారుతి స్వామి శరణు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

86*

బాబమార్తాండు గనిన ఖండోబ రూప!

సకల సాధు స్వరూప! సత్సంగ దీప!

తారతమ్య వర్జిత భావ-తత్వవేత్త!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

87*

స్వీయ ధర్మవిచక్షణే స్థిమిత మొసగు!

పరుల ధర్మ విమర్శలు భయముగూర్చు

సత్యవ్రత బోధ సాగిన సచ్చరిత్ర!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

88*

ధర్మమాత్మ విమర్శతో తళుకులీను!

ఇతర జోక్యమంటని దారి నిమిడి యుండు

స్వీయ ధర్మ వర్తన కమనీయమగును!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

89*

భక్త జన భార భృత్తువై భరత జాతి

నేక త్రాటిని నడువగా నేర్పినావు!

గట్టి మేలును గూర్చిన గరళ కంఠ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

90*

సాధు సజ్జన సన్నుత సమత యోగి!

నిండు విశ్వాసమును గూర్చు నీదు చరిత!

నీదు చూపు సోకిన గుండె నిబ్బరంబు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

91*

అద్దె గేయదేహము నాత్మ నలరు-దాని

తానుగా నెర్గు సాధనాధ్యాత్మకంబు!

సాగు నానంద వారాశి శాంతి సుఖము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

92*

సంత చూఢామణి షిరిడి సాగు జాత్ర!

ప్రాకటితము వాస్తవ భక్తి పరుల పాలి

భగవదవతార మూర్తివీ యుగమునందు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

93*

మనసు తనువు నైశ్వర్యము మనుగడంత

అర్పణముగ శరణాగతి నందు గురులు

ఛాత్రులొక్కటే తమతమ పాత్రలందు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

94*

దురిత దు:ఖ హరము షిరిడి దూరభార-

మెంచి సాగు భక్తాళికి మేలు ఘనము!

కామ ధేనువై భక్తుల కాంక్ష లిడుము!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

95*

ద్వారకామాయి లో తారతమ్య రహిత-

స్వాగతము భక్తులార్తులై శరణు వేడు-

వారికెల్ల ప్రవేశంబు వరుసగాను!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

96*

అవతరింతువు భావించు దైవమగుచు

అప్రమత్తమై సమకూర్చు – అర్థియర్థ-

మార్గ దర్శకుడవు నీ సమాది నుండె!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

97*

గతము వర్తమానము భవిత కాలసృష్టి

నేక కాలాన సవరించు నేర్పు తమది!

మాట మన్నన రక్ష సమాది నుండె!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

98*

అలరు దేహ ప్రపంచాన నాత్మ భక్తి

పుణ్య మార్జించ దగుజన్మ బుట్టి గిట్టి-

తిరిగి నీలోన లీనమౌ తీర్పు ముక్తి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

99*

విశ్వ మానవ విశ్వాస విధుల ముక్తి

గలుగు కరుణాకటాక్ష వీక్షణము సోక

శత్రు భావన తొలగి సన్మైత్రి వెలయు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

100*

నీ సమాదికి చెవియొగ్గి నిన్ను నడుగు –

ప్రశ్నకు జవాబు నమ్మిన భక్తి కొలది

బుద్ధి మదినాత్మ నిశ్చల సిద్ధి గలుగు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

101*

తేలికైనంత దూరము తెలిసి బ్రతికి

భారమునునీదె యనిభక్తి బాట నడిచి

పెద్ధ బుద్ధిని జూపింప పేరుకీర్తి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

102*

భక్తి గొల్చిన వారిల్లు భద్రమయ్యె!

లేమి మాటరా బోనీదు ప్రేమ శక్తి-

యుక్తముగ సాగి పోగ సాయుజ్య ప్రాప్తి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

103*

ఆలయాన నందరు జేర నాదరించి

వ్యక్తి గతకోర్కె సద్భక్తి వరమొసంగి-

జన్మ తరియింప జేసేవు జాగృతొసగి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

104*

జీవి జీవిని నీవు! నీలోవసించు-

నన్ని జీవులు – సమదృష్టి నున్న మేలు-

గూర్చి నడిపింపజూతువు గుట్టు దెలిపి!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

105*

కీర్తి మార్గ దర్శివిల ఫకీరు బాబ-

భావమే తథాస్తుగజేయు భక్త వరద!

చీమనుండి బ్రహ్మము దాక నీమహత్తు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

106*

తెలుగు సత్యనారాయణ తిరుణహరిని-

భక్త పరమాణువుగ శతక పద్య కృతిని-

పొంకముగ జేసితి నీకునంకితముగ!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

107*

నీదు పదకొండు సూత్రాల నిష్ఠ యుక్త

భక్తి పాటింప ధర్మము పరిమళించు!

సమత మమత జీవనశాంతి సౌఖ్యమలరు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

108*

శుభము శతకాభిమానికి శుభప్రదంబు!

శుభము భక్తలోకానికి సుఖము శాంతి!

శుభము జాతిసమైక్యత శుభకరంబు!

రామ సాయీశ నీకు నీరాజనాలు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page