top of page
శ్రీ సాయి హారతి శతకము
(ఆ.వె.)

1*(ప్రారంభము)

శ్రీలు జిందు భావ చిత్రమై నీభక్తి

చిత్తశాంతి గూర్చు – చిత్ర పటము

చూపుజాలు బ్రతుకు శుభ శోభితంబగు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

2*

కమ్మనైనవాక్కు కరుణామృతపు జల్లు

భక్తిభావపూర్ణ బ్రహ్మ ముదము!

ఆత్మదేల్చి చూపు అద్భుతమార్గము!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

3*

మనసు మాట క్రియల మంచియనెడు

పుణ్య కర్మ ధర్మ సూత్ర మర్మబోధ-

సాగు సభలు నీదు సంస్థాన సేవలు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

4*

ధన్య దర్శనంబు ద్వారకామాయిని

నింబవృక్షమూల నిండు దీప్తి-

దీనజనుల దివ్య దీపకాంతివి నీవు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

5*

ఆర్త జనుల పాలి ఆత్మ బాంధవ! జన్మ

సార్థకముగ సేవ సాగు జనుల-

భక్తి నియమ నిష్ఠ భద్రత సమకూర్చు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

6*

సకలమిచ్చు భక్తి సామ్రాజ్య నేతవు

దీనజనుల కామధేనువీవు!

నయజయంబు గూర్చి నడిపించు ముందుకు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

7*

నాణ్యమైన బుద్ది నడవడి దీపించ-

నీతి బోధ భూతహితవుగాగ-

వర్తమాన భక్తి వర్తన సరిదిద్ధు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

8*

రాజు పేదయైన రాగి బైరాగైన-

నవ్వగలుగు బ్రతుకె దివ్యమగును!

బహ్మ ముదముగలుగు భక్తిని సాగించు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

9*

జిమ్మెదారి వగుచు జీవకారుణ్యపు-

దారిసాగి ధర్మ ధాతవగుచు!

అణచినావు నాటి ఆకలిమంటలన్

స్వస్తి హారతి గొను సాయి బాబ!

10*

శక్తులన్ని ప్రేమ శక్తిరూపముదాల్చె

ద్వారకమయి యయ్యె దైవకొలువు!

వెంట నడిచి బ్రోచు వేల్పులవేల్పువు

స్వస్తి హారతి గొను సాయి బాబ!

11*

యోగియైన యుద్ధ యోధుడైనను భక్తి

నేకపంక్తి నిలుచు లోక జనుడె

కొరు శాంతి సుఖము చేరు ముక్తిపదము!

స్వస్తి హారతిగొను సాయిబాబ!

12*

భక్తిమార్గమందు పండిత పామరుల్

సంయమనము గలిగి సాగమేలు!

సాగకున్న భక్తి సగపాలు వృధయౌను!

స్వస్తి హారతిగొను సాయిబాబ!

13*

భక్తి గుడిసె వాసి భవననివాసియు

దైవభిక్షగోరు దాసులనగ-

డంబమణగ నాత్మ బింబంబు దోచును!

స్వస్తి హారతిగొను సాయిబాబ!

14*

దీన రక్ష నీదు దీక్షగా కొనసాగె!

బ్రహ్మవైన భక్తి బాటసారి!

భిక్షమెత్తి జీవరక్ష చేపట్టేవు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

15*

మహిమ జూపి చెడును మరలించు సన్మార్గ-

గమనుజేసి బ్రోచు కర్మయోగి!

భూతహితవె నోము పూజగా సల్పేవు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

16*

సంఘ రుజలు మాన్పు సంస్కరణాత్మక-

భక్తి విధుల నొక్కబాట నడిపి-

భువిపరోపకార పుణ్యకోశము నింపు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

17*

గీతపరిధిలోనె కీర్తిధనార్జన

ధనము దానమనకె ధన్యజన్ము

నియమ నిష్ఠ భక్తి నీతి లక్ష్మణరేఖ?

స్వస్తి హారతి గొను సాయి బాబ!

18*

స్వాస్థ్య విధుల సాగు సంజీవరాయుడ!

చిత్త భక్తి మాయ జీల్చు కత్తి-

ధారగాగ గీత తాత్పర్యమందించు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

19*

భరత సిరులు పరుల పాలైన వేళలో

జాతినైక్యభావ జాగృతముగ-

పుట్టి బోధగురులు గట్టిమేల్జేసిరి!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

20*

ధరణి వీరబ్రహ్మ దాసకబీరులు

నీదు భావజములు నివ్వటిలగ

భక్తిబాటవేయ-బాబాజి తోడ్పడె

స్వస్తి హారతి గొను సాయి బాబ!

21*

ధరణి సద్గురుడవు-దైవస్వరూపుడ-

సత్యవచన! దివ్య సంయమీంద్ర!

జీవసిరులు షిరిడి దివ్యమై దీపించె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

22*

ధర్మవిధుల మార్గ దర్శకా! ద్వారకా

మాయినాథ! శరణు మాన్య చరిత!

నీదునాజ్ఞ ప్రకృతి నిర్వాకముల్ సాగె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

23*

చింత మరచి భక్తి చింతనామృతపాన-

మత్తచిత్తులైరి-మర్మమెఱిగి-

పుణ్యవిత్త సిరుల పూరింప సాగిరి!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

24*

కర్మ ఫలద! పాప కర్మ దగ్ధము జేసి

యిష్టదైవరూపు నెత్తి వచ్చి-

భక్త జనుల బ్రోచు బ్రహ్మచారివి నీవు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

25*

భక్త వరద! నహము బాపగా నిరతంబు-

ధునిని గాల్చు దేవ దురితదూర!

దానవతను వంచి మానవతను పెంచు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

26*

కార్య క్రమము నిత్య కైంకర్యములు సాగె

నాడు నేడు నీదు నామ మహిమ!

మెప్పు భజన సాగె ముప్పూట హారతి!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

27*

భక్తిగరిమ వెంట భారతీయ సమైక్య-

భావదీప్తి కీర్తి బాహుటెత్తె!

నాడు నేడు భవిత నాణ్యమౌ యోచనల్

స్వస్తి హారతి గొను సాయి బాబ!

28*

పుణ్య ఫలమె బ్రతుకు పూర్ణత్వమును గూర్చు-

పూజ ఫలము వెంట పుణ్యమొప్పు-

పుణ్యపూర్వకముగ పుడమి మానవజన్మ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

29*

కష్ట సుఖములందు కాన్కలివ్వగ మ్రొక్కి-

ముడుపు గట్టి మ్రొక్కి ముట్టజెప్పి-

మాటనిల్పుకొన్న మదితృప్తి కరమగు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

30*

వివిధ దేశ శాంతి విశ్వరూపమె కదా

విశ్వశాంతి యనగ-విస్తరించు

బుద్ధి జీవి మనిషి భూరిబాధ్యత మ్రోయు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

31*

స్త్రోత్రపాఠముగను సూక్తిముక్తావళి

నీతి ధర్మ బాట నిల్పు శక్తి

విశ్వశాంతి పూర్ణ విశ్వాసమందించు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

32*

నీదు వాక్కువెడలు నినదించు భక్తుల-

సూక్తి నిధులు విషయ సూచి జేరు-

గ్రంధపుటల పఠన కలిమాయదొలగించు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

33*

ఆపదలను మ్రొక్కి సంపద మరుపుల

సంసృతిబడి యీదు జనులు భక్తి-

తీరుబడిగ పరుగుదీయుచు దర్శింత్రు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

34*

సజ్జనాళివెంట సద్భావనాయాత్ర

షిరిడి జేర భక్తి సిరుల పంట!

మనిషమనిషి గలుపు మంచి పుణ్యము వెంట!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

35*

స్వేచ్ఛ భక్తి బాట సేవింప సంతృప్తి

కోర్కె దీర నిన్ను గొలిచి మ్రొక్కి-

సంతసింప యాత్ర సంతబేరముసాగు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

36*

ధరణి మానవత్వ దైవత్వముల మధ్య-

వారధిగను సాగు భక్తి గలుగ

మానవాళి సేవ మాధవ సేవయే!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

37*

బ్రహ్మ ముదమె నీదు భక్తిమార్గఫలము

దుష్టచింతనంబు దూరమగును!

శాంతి సుఖము-బ్రతుకు సంతృప్తి నొసగును!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

38*

పిలుచు పేర బదులు పల్కుదైవము నీవు

తలచు రూపురేఖ దర్శనంబు!

గతపు యాది వెక్తిగతమైన విన్నపం

స్వస్తి హారతి గొను సాయి బాబ!

39*

దరణి దానవతయు దైవత్వముల మధ్య-

మానవతయు సాగు మనిషి యిచ్ఛ-

ఎంచు కొన్న ధరిని పంచుకొన్న ఫలంబు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

40*

ధర్మ నిలయమైన దైవంబు నీవుగా

చేవజేయువారి చేవ నీవె!

సేదదీర్ప దరికి చేదుకొందువు నీవె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

41*

సకల జీవసేవ సామిసేవగ దల్చి

సాగువారు కలిని సాగుటెల్ల-

నేలవిడిచీ సాము నేర్పున జేయుటే

స్వస్తి హారతి గొను సాయి బాబ!

42*

నిష్ఠజేయుతపము నిర్గుణోపాసన-

సాగు పూజవిధుల సగుణ భక్తి-

నాత్మతత్వమరయ నానంద బ్రహ్మమే.

స్వస్తి హారతి గొను సాయి బాబ!

43*

ధార్మిక సభసాగు దారక మాయిని

వ్యక్తపరచు నట్టి వ్యక్తి శాంతి-

విశ్వ రూపగతిని విశ్వశాంతిగ చర్ఛ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

44*

సంకటములకిక్క సంసారజీవనం

సంద్రసమమె ధైర్య సాహసముల

నీదవలయు భక్తి నిష్ఠ చేయూతగా

స్వస్తి హారతి గొను సాయి బాబ!

45*

కీర్తి ధనము నిచ్చు గీతోక్తి నిస్వార్థ-

గుణముగల్గె నేని గుణకమగును-

పుణ్య ధనము-మోక్ష పూర్వకసాధనం

స్వస్తి హారతి గొను సాయి బాబ!

46*

నీతి ధర్మయుక్త గీతోక్తి నీబోధ-

విశ్వరూపమెత్తె-విధుల సాగి-

విస్తరించె జనుల విశ్వాస పాత్రమై!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

47*

ప్రకృతిమాత భక్తి పర్యావరణ రక్ష

జీవ రక్షణ సమ జీవనముగ-

చేయు పూజ సుకృత చేతనత్వము నిచ్చు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

48*

అడవి పచ్చదనము నందించు సకలార్థ-

సాధకముగ ప్రగతి సాగుబాటు-

పరగ శుభ్రమైన పర్యావరణ రక్ష!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

49*

శుద్ధి వెంట చిత్త శుద్ధియు శివపూజ-

ధాతకీర్తి గనిరి తాతలంత-

ప్రకృతి గొలిచి మనిరి పావనమూర్తులై

స్వస్తి హారతి గొను సాయి బాబ!

50*

భువిపరోపకారి పూర్ణ పుణ్యాత్ముని-

పలకరించు ప్రకృతి పులకరించు!

నింగిగురిసి పుడమి నిండుపాడియు పంట!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

51*

పాపిగోరు సతత పరపీడనము భువి-

క్షణిక సుఖము ధర్మ కక్ష్య దాటి-

మరల మరల బుట్టి మడియు మానవవిధి!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

52*

త్రికరణాల శుద్ధి తెల్సితెల్పగనేమి?

ఆచరించకున్న నయమదేమి?

ఆచరణల శుద్ధి ఆచార్య సత్కృప!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

53*

నీదు భక్తి నియమ నిష్ఠలాచరనీయ-

విధులగూర్చు మేలు విస్తృతముగ-

జనులుధన్యులగుచు జన్మ తరింతురు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

54*

మనసునిల్ప నాత్మ మర్మంబు దెలియును

ఆత్మ నిశ్చలమున- బ్రహ్మముదము!

భ్రాంతిదొలగి బ్రతుకు శాంతి దాయకమగు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

55*

సుఖము గోరు జీవి సులభ జీవనకాంక్ష

బ్రతుకు కేళిసాగు బాధగలుగ-

గొప్పనష్టమనియు గొల్లెత్తిమొరలిడు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

56*

శాంతిలేక సర్వ సౌక్యంబులును వృధా

నీతిలేక శాంతి నిలుచు నెట్లు!

సులభమైనదారి సూచించు భక్తినే

స్వస్తి హారతి గొను సాయి బాబ!

57*

మొలకలెత్తు శాంతి మెలకువ నీబోధ

చెలగు రుజకు మందు చేదు గుళిక-

రోజుతీపి దిన్న రుగ్మత గలుగదా

స్వస్తి హారతి గొను సాయి బాబ!

58*

మనసు శుద్ధి నీతి మార్గాన నలవడు

నీతియౌషద మవినీతి రుజకు!

కర్మలందు మంచి గాంచ సార్థక జన్మ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

59*

కలుగు ధర్మయుక్త కామార్థ మోక్షముల్

ధర్మ రహితమైన దండగేను!

పుణ్యమనక నాల్గు పురుషార్థములువృధా

స్వస్తి హారతి గొను సాయి బాబ!

60*

స్వార్థ రహిత కర్మ సత్ఫలదాయకం

తేగ మగును- గీత – త్రిప్పి చదువ!

జన్మ రహిత ముక్తి జెందు పుణ్యాత్మకే!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

61*

ఆప్తిజెందకుండ అతినివర్జించియు

ప్రాప్త లేశమునకు తృప్తినొందు-

విధము నీదు భక్తి విధులందు దీపించు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

62*

దోష రహిత దృష్టి దోవ మైత్రికి పుష్టి-

మైత్రి భక్తి నొక్కమార్గమగును!

సఖ్య భక్తిపరులు సాయుజ్యమందిరీ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

63*

యోగములను భక్తి యోగంబు మేలగు-

విశ్వసింపగ నవ విధములుగను-

భక్తిబాట జూపె భాగవతమునాడె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

64*

సైన్సు విశ్వశాంతి సాగుబాటయె మేలు

భక్తి గలసి శాంతి ప్రదము గాగ-

విజ్ఞ ముగ్ధ గతుల విశ్వాసమైయొప్పు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

65*

సైన్సు నాత్మ తత్వ శాస్త్ర సంయోగము-

విడిగ భయమొసంగు-విధులగలసి-

నుభయ తారకముగ నభయంబు దయసేయు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

66*

ల్యాబు దశను మనసు లాస్యవిజ్ఞానము

అనుభవంబు దెలుపు-ఆత్మదృష్టి

వెలయు భక్తి బాట విజ్ఞాన తోటలో

స్వస్తి హారతి గొను సాయి బాబ!

67*

తమరి బోధలు వసుధైక కుటుంబపు

సూచనలుగ-ముందు చూపు గాగ-

నీదు చరిత శాంతి నిక్షేపమై తోచు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

68*

సత్య వ్రతమె సుగతి సాధన మార్గమై

భూతహితవె సత్య భూమికగును!

కరుణ వితరణాత్మ కకృషినీ షిరిడిలో

స్వస్తి హారతి గొను సాయి బాబ!

69*

నీదు బోధ భరత వేదవిజ్ఞానమే

సంఘజీవనంబు శాంతి మయము-

జేయుదారి భక్తి సేవలు కొనసాగు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

70*

దుష్ట చింతనంబు తుష్టి పుష్టి జెఱచె-

కల్తి వస్తు కలత గలుగు రుజల-

నిలువ రించు భక్తి నీతి నిజాయితీ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

71*

విస్తరించు మఱ్ఱి విత్తనంబును బోలు

షిరిడి మార్గ విధులు! మంచిబెంచు-

కార్యక్రమము జీవ కారుణ్య ముప్పొంగె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

72*

మతము సమ్మతంబు మానవధర్మమే

సద్గురూక్త సరణి సాగె – జన్మ-

శోకహరము భక్త లోకకళ్యాణము!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

73*

లౌకికంపు సౌఖ్య లబ్ధి శాంతియుతము-

పారలౌకికముగ పరగముక్తి-

వ్యక్తి గతము గాగ వర్ధిల్లె సద్భక్తి!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

74*

ప్రాకటముగ సాగె పరమత సహనంబు-

ధర్మమార్గమందె తరలు బ్రతుకు-

పుట్టు జీవి హక్కు పూర్ణ సౌఖ్యముశాంతి!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

75*

చెడు నశించు నాత్మ చేతనత్వము గలుగ-

మంచి విస్తరించు మంచి నిలుప!

మూడుమూర్తుల నిను మూలశక్తిగ గాంచు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

76*

కఠిన కల్తి చల్తి కలుష తుఫానులు

ఉప్పెనేయు తూ. చ. దప్పకుండ!

ముప్పు మానవాళి తప్పిద ప్రతిఫలం

స్వస్తి హారతి గొను సాయి బాబ!

77*

జగతి సమత వెల్గె జన్మతరించగ-

యోగసాధన ప్రయోగ శాల!

ద్వారకమయి నీతి దారుఢ్యమును గూర్చె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

78*

నానసాబు బొందె నయమైన సంతతి!

నానపాటిలాత్మ నమ్మి మురిసె!

బహువిధాల భక్తి పరులు కీర్తించిరీ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

79*

ఆంజనేయుడ!గణనాయక!శ్రీ దత్త!

మూలశక్తివి-త్రిమూర్తి రూప!

అతులిత మహిమాత్మ! ఆదిశక్తివి నీవె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

80*

కృష్ణ గీత కీర్తి తృష్ణ బాపగ-జీవ

సేవ-నీదు బోధ సేద దీర్చె!

దు:ఖహరణియయ్యె ధునివిభూతియె భువిన్

స్వస్తి హారతి గొను సాయి బాబ!

81*.

కరుణ కిరణ! జీవకారుణ్య గుణధామ!

బాధిత జనపాలి పట్టుగొమ్మ!

చమురు లేని దివ్వె చమకాత్మ గలిగించు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

82*

అహము వీడి గురులు హారతిచ్చియు మ్రొక్క-

ఘోల సామి శిష్య గోల మణిగె!

స్వార్థముడిగి భక్తి సామాన్యులెదిగిరి!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

83*

నాన వలియు వాదు నందోడి పడిమ్రొక్కె-

గర్వముడిగి భక్తి గలిగి మనగ-

ఇనుమడించె కీర్తి హితవొంది తరియించె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

84*

ఉప్పునూతి నుండి గుప్పెతీయని నీరు-

రామ పెళ్ళి జరిగె రమ్య నవమి!

పర్వదినములందు ప్రజసంబరముబొందె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

85*

చర్ఛ సాగె పంతు చరిత రచనబూనె-

సాక్ష్యమయ్యె రాధ-శామ-సలహ!

గ్రంధము వెలుగొందె కలిదోష హరముగా

స్వస్తి హారతి గొను సాయి బాబ!

86*

సంప్రదింపు సలహ సందర్భ కథలతో

బూటి బాల గణప మాట సాగె!

దండి సమత మమత రెండు బల్లుల కథ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

87*

దనర వలయు నరులు దైవీయ గుణములే

సంపదలుగ బ్రతుకు నింపు సొంపు-

పుణ్య లబ్ధిగలుగ భువిజన్మ సార్థకం

స్వస్తి హారతి గొను సాయి బాబ!

88*

కల్ల నిజము దెలియు కలలు ఫలించగా

బ్రతుకు కడలి దాట-భక్తి నావ!

నావికుడవు ముక్తి నందించు సద్గురు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

89*

లబ్ధిగూర్చు భక్తి లౌకిక సుఖశాంతి-

పారలౌకికముగ ఫలము ముక్తి-

అభయహస్తమొసగు నుభయత్ర భద్రత!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

90*

అహపు ధునిని గాల్చు – అనల స్వరూపుడ!

దోష రహిత దృష్టి దోవ భక్తి-

సహనయుక్త బ్రతుకు సాగించ వరమిమ్ము!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

91*

దానగుణము నిచ్చి దాతలుగా దిద్ధి

ధరణి జీవ శ్రేష్ఠ బిరుదు నిలుపు-

కొనగ మరల మరల క్రోధాగ్ని చల్లార్చు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

92*

దైవ మాత్మ నిలిపి తాధ్యాని యైధ్యాన

నిష్ఠ సాగు జీవ శ్రేష్ఠ నరుడు

దమము దానము దయ తరచి పాటించాలి!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

93*

చావడోత్సవంపు సందేశ పూర్వక

నియమబోధ నేడు నీసమాది-

వాక్కువెడలు ప్రజల వర్ధిల్లజేయగ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

94*

ఇరువదవశతాబ్ధి ఇరువదేండ్లుగబోధ-

పిదప నీసమాది పిలుపు గలిగె-

చేరి భక్త జనులు చెవియొగ్గి వినుబోధ!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

95*

బాధజెంద వలదు భద్రత గూర్చెద-

భారమంతనాదె భయము వీడి-

ఊరడిల్లుడనియె ఊరూర నీవాక్కు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

96*

ప్రకృతి యందె నీవు ప్రతిఫలింతువు -

సదా పంచభూతములుగ ప్రకట మగుచు-

జీవి జీవినాత్మ దివ్వెవై వెల్గేవు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

97*

అవని డాబు దర్పమాడంబరము మాని

మొరలు బెట్టుకొనెడు ముగ్ధ భక్తి-

పరుల మెచ్చి – కోరు వరమిచ్చి పంపేవు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

98*

బాధలోర్చి వచ్చు వారినోదార్చియు

తమసమాది నుండె తగుగబలికి-

శాంత పరచి బ్రోచు సద్గురుండవునీవు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

99*

చంద్ర సవిత నేత్ర! శతకంబు గైకొని

ఆదరించి బ్రోవు అజర భూజ!

వత్స వెంట గోవు వగుచు సంరక్షించు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

100*

రక్ష గలుగ రంధి రవ్వంతయునులేదు

దుష్ట శిక్ష నీదె దురిత దూర!

ధర్మ ధాత యిమ్ము దైవీయ గుణములన్

స్వస్తి హారతి గొను సాయి బాబ!

101*(సంపూర్ణం)

నాది నాదియనుటె నరకానబడుదారి

నేను నేనటన్న నేరదృష్టి-

మాది-మీది, వాదు? మనదనుటేమేలు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

102*

ధాత సద్గురుడవు దత్తరూప త్రికాలజ్ఞ-

సర్వలోక రక్ష-సచ్చిదాత్మ!

ద్వారకమయి నిలయ! దయగల దైవమా!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

103*

సజ్జనాళి మైత్రి సద్గ్రంధ పఠనము

సుధలనూరు పండ్లు జూడ రెండె!

మిగత వన్నివిషము మితులకథలె!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

104*

అవని నూత్న సైన్సునాధ్యాత్మికము పొత్తు-

గూర్చి పుణ్యధనము గూర్చ మేలు!

దొమ్మిసాగిన తుద దుమ్ము ధూళినిదూలు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

105*

సర్వ ధర్మ సమత – సద్భక్తి ననుభవ-

సైన్సు గలసి విశ్వశాంతిగూర్చు!

జనులమేలునెంచు జాగృతమొనరించు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

106*

కల్మశోల్భన విషయఘాతకముల చెఱ-

చేదుకొనుము పైకి సేదదీర్చు!

సుధను గురిసి పుడమి సుఖశాంతి నెలకొల్పు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

107*

సూక్ష్మమందె బంధమోక్షంబు నీవాక్కు-

శాంత భీకరగళ-సద్గురుండ!

నీదు శతక పఠన నిత్యజయము గూర్చు!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

108*

శుభము నీదు భక్తి సుఖశాంతి దాయకం

శుభము నీదు చరిత సూక్తి-ముక్తి!

శుభము పాఠకులకు, శ్రోతలకు శుభము!

స్వస్తి హారతి గొను సాయి బాబ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page