
శ్రీ శ్రీ శ్రీ సాయిబాబా శతకము-2
(తే.గీ.)
1*
శ్రీలు జిందు నీభక్తి నాచిత్త మలర
శతకమర్పించి మ్రొక్కితి, సతము దలచి-
సాగు చుంటి, దుష్టగ్రహ శాంతి జేసి
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
2*
తేట గీతాన సద్భక్తి తేటవడగ
వ్రాయ నుంకింతు జంకించు రాతిమనసు-
వివిధరూపుల నినుజూపు, విస్మయముగ!
పద్య చందార్థ దోషముల్ పరిగణించు
సాయి నీసేవ శ్రీశేష సాయి దోవ!
3*
జీవజీవనకారణ! జీవసేవ-
జేయనుదయించితివి, దివ్యచేతనముగ
సర్వ ధర్మ పరాయణా! సత్వధాత!
సాయినీసేవ శ్రశేష శాయి దోవ!
4*
విశ్వ జీవాత్మవే నీవు, విశ్వసింప-
సర్వదేవతామూర్తివి, సవితనేత్ర!
విశ్వరూప! ధర్మోద్ధార! విమలచరిత!
సాయి నీసేవ శ్రీశేష సాయిదోవ!
5*
చపల చిత్తంబు నిల్పగా సాగు భక్తి
దుష్టచింత మాన్పించు దురితదూర!
బాహిరంతర-ఇహపర భ్రాంతిబాపు!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
6*
కృతయుగాన తపస్సు-సుకృతము, త్రేత-
మందు సుజ్ఞానము శుభము, మానవులకు
ద్వాపరము-పుణ్య ప్రదమంద్రు దానగుణము!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
7*
కలియుగాన,దానము మించ గలది లేదు-
తపముతో సమమంద్రు, తదితరాల-
నన్నదానంబు శ్రేష్ఠమై చెన్నుమీరె!
సాయినీసేవ శ్రీశేషశాయి దోవ!
8*
అన్నము-పరబ్రహ్మ, జలము నరయ విష్ణు
అన్నమున రక్తమును గల్గునవని సమయు-
జీవరక్తావయవదాన సేవ యశము!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
9*
కర్త,భర్త,హర్తవునీవె,కర్మసాక్షి!
సృష్టి – సుస్థితి లయకార సూత్రధారి!
మూడు మూర్తుల, వెలుగొందు ముక్తిధాత!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
10*
అప్ప!హరిహరనందనయ్యప్ప సామి!
గురుడ! గురువాయురప్పవో గరుడ గమన!
వేష బాష వేవేల్పువో వెలయు సృష్టి-
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
11*
బురద తామర జన్మంబు బుద్బుదంపు-
ప్రాయమీలోక వెవహార మాయబ్రతుకు
సూక్ష్మమే – ఆత్మకేనీదు మోక్షమబ్బు!
శాశ్వతాత్మ ఎఱుకయు గల్గ సత్ఫలంబు!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
12*
ధరణి సంసారసాగర తలమునకగు-
మనసు బోయిన పోకల-మానవాళి-
మొగ్గు, నీధ్యాసగల్గెనా, మోక్షమడుగు!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
13*
కదలు,చిత్తమాగియు-భక్తిగలిగి,మాయ-
తెరలు జీలగ మదినాత్మ తేజమొందు, ఆత్మ నినుజేర తహతహలాడుచుండు!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
14*
అన్న దాన ప్రసాదాలు, యాత్రసాగు-
పథకమందున వ్యాసుని పలుకు యాది-
అన్నదానంబు నీచేత వన్నెకెక్కె!
సాయినీసేవ శ్రీశేషశాయి దోవ!
15*
నీతి ధర్మంబు బోధించు, నీదువాక్కు-
కలిని కాలుష్యబుద్ధిని గడిగి వేయు!
సచ్చిదానంద సద్గురు, సాయి శరణు!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
16*
ఇరువదవ శతాబ్ధపు తొలి యిరువదేళ్ళు-
గడిపి పోయిన దాదిగా గలిగెమేలు!
రుజలు వీడిపోవగ శాంతి-ప్రజకు గలిగె!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
17*
ఎంత నార్జింపగానేమి యెదను శాంతి-
సుంతలేకయు బ్రతుకున సుఖముగలదె?
విస్తరించు విశ్వాసమై విశ్వశాంతి!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
18*
పెద్ధలను బట్టి పిల్లలు – పెరిగిపెద్ధ- వారలై నడవడిగల్గు-వారసత్వ-
మానవత వెల్గు, నీమహిమాన్వితముగ!
సాయినీసేవ శ్రీశేషశాయి దోవ!
19*
నేజితేంద్రియుడగాను,నేర్పుమీర-
తెలిసి వాదింప నేనేల తెంపరగుదు?
నీదుబోధగా వినిపింతు నిజమునెల్ల!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
20*
బ్రతుకు మాయికుల దగిలి-బండ బారె!
బింక మణగె, నమాయక బిరుదు గలిగె!
చితికె, చీత్కారములనిన్ను వెతికె మనసు!
సాయినీసేవ శ్రీశేషశాయి దోవ!
21*
మాయ గోమాయువులు లులామాలలందు-
మనసు నవిచెఁ, తనువుజిక్కె మంచి చెడులు-
వేరుజేయగాలేక – నిన్ వేడుకొనగ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
22*
నీమహిమ దెల్యగ మది నిష్ఠ గూర్చి-
నీదు పాద సన్నిధి లోకి చేదుకొమ్ము!
భక్త లోకమ్ము మెచ్చగా బ్రతుకు నిమ్ము!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
23*
కర్మ శుద్ధిని వ్యవహార ధర్మమందు
మనసు శుద్ధిని నిర్ణయమైన తీరు-
మాటశుద్ధిని గలిగించు మనుగడిమ్ము!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
24*
దేవదేవుడా!వేదాంత తేజమీవు!
రుషివి పూర్వపురాణ పురుషుడ వీవు!
వరుస బ్రహ్మ పిపీలికా వ్యాప్తమీవు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
25*
ఇతర వైజ్ఞానికమువేరు తాత్వికముగ
నంతరింద్రియ జ్ఞానంబు నదియు వేరు!
రూప రహిత శక్తినిదెల్పు – రూఢి పరచు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
26*
సత్య ధర్మ శాంతియహింస సాగు బాట-
మనసు మాట కర్మలశుద్ధి మనిషి నడక-
జీవిజీవిని ప్రేమించ శివుని – ఇచ్ఛ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
27*
ఎండ బాటను నీరిచ్చు, వెలయు ప్రఫలు-
అన్న వస్త్రదానము జేసి యాదు కొనగ- ప్రజల పుణ్యంబు ముక్తికి బాట యనగ!
సాయి నీసేవ శ్రీశేషశాయి దోవ!
28*
కృతుల మెప్పించు, కవులెల్ల కృపను జూపి
పుణ్య విషయప్రక్రియలెల్ల, బూని వ్రాయ-
సజ్జనాశ్రయమును గల్గు సఖ్యతెసగు!
సాయ నీసేవ శ్రీశేషశాయి దోవ!
29*
భావసామ్యమె నీభక్తి బాటలందు-
సాగు పూజలో గనిపించు సమసమాజ-
తీరు తెన్నులు – భరతజాతీయ సిరులు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
30*
భక్తి పరిమళమున జన్మ పావనమ్ము!
దాన ధర్మ గుణముచేత ధన్య మగును!
మానవతబంచు శ్రేష్ఠమై మానవాళి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
31*
దుర్జనులమార్చి,దుష్టుల దురితమార్పి-
సజ్జనాళి మైత్రిని గూర్చి సంస్కరించు!
భక్తి వెల్గించు-భవబంధముక్తి గూర్చు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
32*
దూర దృష్టిని ప్రసాదించి దు:ఖమార్పి-
సంతసము, తృప్తి సమకూర్చి, జన్మగడుప-
కర్మయోగమ్ములో సదా కదలనిమ్ము!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
33*
శ్రవణ, కీర్తన, స్మరణయు, చరణసేవ-
పూజ, మ్రొక్కు దాస్యము, మైత్రి-పూనియాత్మ-
నర్పణము జేయుట, భక్తి నవవిధాల-
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
34*
తిరుణ హరివంశజుడ నేను తిమిరవైరి!
వైష్ణవాక్షయ పాత్రుడు వావిలాల-
గురుడు రంగయ పౌత్రుడ! కూర్మి పేర్మి-
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
35*
సత్యనారాయణుడ-వెంకటార్య సుతుడ!
నిత్య నీరాజనము జేతు నిండు బ్రతుకు-
భక్తి సామ్రాజ్యమున దేల్చు ముక్తి నొసగు
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
36*
రామదూత! దత్తాత్రేయ! రామకృష్ణ!
నాగభూషణ! సత్సంగనాద బ్రహ్మ!
నీదు భక్తిబాటను జన్మ నీదసుళువు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
37*
ముత్యముగ ననుజేసి నీ సూక్తి గూర్చు!
దారముగనైన జేసి నీదండ నిలుపు!
ధూళిగా నీదు పదధూళి దూరనిమ్ము!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
38*
భక్తి ముంచియు భవబంధ ముక్తిదేల్చి-
హితవు సాగించి, జన్మరాహిత్య మొసగి-
చేదుకో నీదు సన్నిధి చేర్చు కొనుము!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
39*
వాగి వాచాలనై మూల దాగి, యుంటి-
వదరు బోతన్న పేరును వదలుకొంటి-
మూగవోయితి-నీదరి, ముక్తి వాంఛ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
40*
మాయికునికన్న మేలునమాయికుండు-
రక్కసునికన్న, మేలుగా-రాలుగాయి,
ద్రోహి కన్న, సోమరిమేలు-పాహియనగ
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
41*
స్వచ్ఛమైన మానసభక్తి సాధు వృత్తి-
శ్రద్ధతోపాటు సమభావ శుద్ధి గూర్చి-
మోదము – సబూరి బ్రతికించి ముక్తినిమ్ము!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
42*
చదువు సంధ్యలతోడ సంస్కారమబ్బె-
ఇచ్చి పుచ్చుకో మరియాద హెచ్చె భక్తి!
ముక్తిదారి సాగించి ప్రమోదమొసగు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
43*
సకల జనసమ్మతము నీదు సత్య మతము!
నిఖిల మత ధర్మ సారమ్ము నీదు సూక్తి!
నిచ్ఛలానందమును గూర్చు నీదు చరిత!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
44*
విశ్వ సంక్షేమ, సందేశమిచ్చు షిరిడి-
విడిదియయ్యె-నీలోకాన విహిత మెఱిగి-
విశ్వసించి సాగిన కల్గు విశ్వశాంతి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
45*
భక్తి సామ్రాజ్యమున వెల్గు బ్రహ్మదీప్తి-
అంతరంగాన చేకూరునాత్మ తృప్తి!
ముక్తి హేతువులుగ నేముముక్షువగుదు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
46*
విశ్వ విజ్ఞాన శోధన వెల్గు నీవె!
వేద వేదాంత బోధన తేజమీవె!
విస్మయంబు నీలీలు విశ్వరూప!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
47*
సకల జీవులాకలి బాపు సాకు వెంట-
అన్న దానంబు జేయగా నవతరించి-
తల్లి ప్రేమను బంచిన తండ్రి వీవె!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
48*
బాబ, భక్తపరాధీన! బ్రహ్మ తేజ!
కాల గమన శాసనకర్త! కామభూజ!
కర్మ ఫలధాత! దుష్కర్మ కలుష నాశ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
49*
భక్తమందార! భువి సర్వభార భృత్తు!
పరమ పావన! పావనీ! పరమ సుఖద!
ధర్మమార్గ సంరక్షక! కర్మ యోగి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
50*
సరళ వాగ్ధాటి గంభీర! గరళ కంఠ!
సకల సమభావ సాహితీ సారసాక్ష!
అండ పిండ బ్రహ్మాండాల కండదండ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
51*
సర్వ లోక రక్షకాధార! సచ్చిదాత్మ!
యోగిజనానంద శ్రీ యోగిరాజ!
సకల సద్గురు వందిత సమయపాల!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
52*
ధర్మ సూక్ష్మార్థ బోధక! కర్మవీర!
సుకృత దుష్కృతములదేల్చు సూచి, శాస్త్ర
చర్ఛ సేయంగ నీముందు చట్ట నేను!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
53*
నిత్య సత్యవ్రతమహింస నియతి గలిగి
సాగు భక్తుని కెపుడు శ్రీరామ రక్ష!
సాత్వికత బెంచు పుడమి శ్రీ చరణ దీక్ష!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
54*
మంచి పుణ్యము, చెడుపాపమంద్రు బుధులు-
భువిపరోపకారమె గొప్ప పుణ్యమయ్యె!
పుణ్య విత్తంబు భక్తిచే పూర్ణ మగును!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
55*
త్రిగుణములయందు జూడ సాత్వికము మేలు!
పిదప రాజసమందురు, విహితమెఱుగ-
తామసమ్ము ప్రకోపించెనా? సమయు జాతి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
56*
పగలు రేయనక, బ్రతుకు పగలు శగలు-
రగులు కాలాన భ్రాంతియే రక్షణేది?
శాశ్వతము దెల్సి జీవింప శాంతి సుఖము!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
57*
నేటి సైన్సు జనాభవిస్ఫోటనాలు-
ప్రకృతి కాలుష్యహేతువుల్ పతనమునకు-
బాహిరంతర శత్రుల బలము కీడు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
58*
కలిని నరరూప రక్కసుల్ గలుగు కతన-
మాయికత్వంబు ఘనతయై మారుమ్రోగె!
మంచి బేలయై చెడుఘుమాయించె నేడు!
59*
దేవ దానవాళిని దేవదేవుడైన-
మాధవుడునాడు సరిజేసె మహిని నేటి-
నరుల రక్షింప కలికాల నాయకుడవు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
60*
దేవదానవ యుద్ధమే తేల్చి చూడ-
మనిషి మది మంచిచెడులకు మరల మరల-
జరుగు చున్నది, మంచికే జయముగూర్చు-
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
61*
బుద్ధి సిద్ధి ప్రధాత హే! భూతనాథ!
భూతదయజూప వచ్చిన బుద్ధ దేవ!
శక్తి యుక్తి ప్రధాతహే! శక్తి రూప!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
62*
సమత మమత మానవతయు సత్య దృష్టి-
జన్మ సార్థక్యమొనరించు జగతియందు!
నీదు భక్తి పూర్ణతగల్గు నివియు భువిని!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
63*
హితము జూపియు లోకాన హింసమాన్పి
క్రూర తత్వంబు మారగా కృను గాంచు
సాధు వర్తన గల్గించి సంస్కరించు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
64*
మాయికులచేతిలోబడి మంచివాడు
కీలుబొమ్మయై చేసిన క్రియలు-కీడు
లీలగామార్చి జగతికి మేలుగూర్చు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
65*
బాబ,దిక్కునీవేయని భక్తి మ్రొక్కి-
పిలిచి నంతనె పలికేటి ప్రేమమూర్తి-
వనుచు జనులెల్ల నినుజూడ వచ్చు చుంద్రు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
66*
నీసమాదిజేరియు చెవి నిడిన వాక్కు-
కోరు కోర్కెల ఫలమిచ్చు గొప్పవాక్కు!
భక్తి పరల పోషించగా బ్రహ్మవాక్కు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
67*
కుఢ్యచిత్రాన నీకంటి చూపులందు-
చూపు గల్పి జూడగ గల్గు సూక్ష్మ దృష్టి-
బుద్ధి సూక్ష్మత – జిజ్ఞాస వృద్ధి గలుగు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
68*
నీదు మోము దర్శించగా నెదుట నిల్చి-
కన్నులారజూచిన వారి కలలపంట!
ధైర్య సాహసంబుల లక్ష్మి దనరునింట!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
69*
కనగ నీమూర్తి కనువిందు వినగ నీదు-
మాట కోటియుసేయు భక్తి బాట పదిల-
మనగ, శ్రద్ధచే జీవనమార్గమొప్పు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
70*
అన్న వస్త్ర దానము వైద్య మందు, రక్త-
మౌషదమునుగూర్చు ప్రాణ సమానమైన-
మైత్రి పాటింపనేర్చు నీమార్గగామి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
71*
పూర్ణ భక్తి విశ్వాసముల్ పులకలెత్తు-
మదిని పుణ్య పూజాభావమతిశయింప
సర్వ దేవతారామమై సదనమలరు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
72*
భజన సంగీత వాద్యాలు, భావరాగ-
తాళములు పల్లవింపగా తగిన రీతి-
ప్రార్థనలు, మ్రొక్కుబడులిచ్చు భక్తకోటి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
73*
నీవె కొండంతయండగా నిలిచి యుండ-
మూడు వేళల హారతి-ముదము గూర్ప-
పూర్ణ భక్తి విశ్వాసమే పుణ్యపూజ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
74*
గుండె గుడిజేసి నీమూర్తినుండజేసి-
వాద్యమై లబుడబుహృది వరుస మ్రోగ-
కర్మ ఫల సమర్పణజేతు కరుణకిరణ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
75*
ద్వారకామాయి కడుపుణ్యధామమయ్యె!
దురిత హరమయ్యె! నుదుట నీ ధుని విభూతి!
పుణ్య ధనమింధనము భక్తి ముక్తి నొసగ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
76*
జనుల మేలెంచు నీధ్యాస జయముగూర్చు
జగతి మేలెంచు నీబాట ప్రగతి జూపు
పేరు నీది యూరునుమాది ప్రేమమూర్తి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
77*
చిత్తమున నీదు చిరుభక్తి విత్తనంబు-
అంకురించినదాదిగా అహరహంబు-
తేగ బుద్ధి శుద్ధియు గల్గి తేజరిల్లె!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
78*
శ్రద్ధతో భక్తి పెంపొందు, సహనశక్తి-
జనుల సేవలోదీపించు, శాంతి గలుగు!
నిశ్చలాత్మ నీమార్గంబు, నిచ్ఛగించు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
79*
సకల మతసహనము చేత, శాంతి, భక్తి-
యుక్తముగ గల్గు భవబంధముక్తి పథము!
ముక్తి గోరినవాడె ముముక్షు వనగ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
80*
భక్తి విశ్వాసమే శ్వాస బలముగాను
ప్రేమశక్తిని సమకూర్చు ప్రేరణొసగు!
ప్రాణశక్తినార్జింపగా-పదిల పరచు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
81*
జనులు నీవాక్కులాలింప జగతిశాంతి!
స్వార్థ రహితబుద్ధిని భక్తిసాగు కతన-
సాగు నిస్వార్థ సేవనీ సదన మగును!
సాయినీసేవ! శ్రీశేష శాయి దోవ!
82*
తల్లి దండ్రి దైవమునీవె! తరచి చూడ!
అతిథి యభ్యాగతుడవీవె! అరసిచూడ!
గుట్టు దెల్పి బ్రోవగను సద్గురుడ వీవె!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
83*
ఋతువు రాక వరద రాదు రుజువు చూడ
గర్భమును దాల్చదు ఋతువు గాక కన్నె!
నీదు భక్తి సత్ఫలమిచ్చు-నీతి గూర్చు
సాయినీసేవ శ్రీశేష శాయి దోవ!
84*
నిత్యనిస్వార్థ గుణమిమ్ము నిష్ఠగూర్చి
సత్యవ్రత పుణ్యఫలమిమ్ము-సత్యమొసగి-
లోటు లేని జీవితమిమ్ము లోక మందు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
85*
పుడమి బంధుమిత్రాదుల పూర్ణ ప్రేమ-
నీదు భక్తిచే నిరతమ్ము నిగ్గు దేలు-
ఆత్మబాంధవ్యమున పరమాత్మ వెలయు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
86*
దుష్టమతిమార్చి,దిశమార్చి దుర్జనాళి-
దురిత మార్పి, సజ్జనమైత్రి చక్కదిద్ధు!
నీదు సత్సంగమునగల్గు నిత్య శాంతి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
87*
ప్రీతి వర్థన భక్తుల ఫికరుమాన్పి-
గమ్యమునుజేర్చెదవు తారతమ్యమనక!
నీఫకీరు రూపమె దివ్య దీపమయ్యె!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
88*
నాల్గు పురుషార్థములు బొంది నరుడు పుడమి
బ్రమను వీడియు తరియించు – బాబ నీదు-
అభయహస్తాననోంకారమలరి మ్రోగు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
89*
నీదు మందిరమై మది నిండు శాంతి,
సమయపాలన యలవడు సహనమొదవు
అర్చనలు హారతులు భక్తి చర్ఛసాగు!
సాయ నీసేవ శ్రీశేష శాయి దోవ!
90*
భువిపరోపకారమె కదా పున్నెమనగ
పాపమన పరపీడన, పరగదెలియ-
మానత నీదు భక్తికి మారుపేరు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
91*
దాన ధర్మంబె కలియుగ తపమనంగ-
ధాతలైనవారల జన్మ ధన్యమయ్యె!
ద్వారకామాయి దాన నిధానమయ్యె
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
92*
వాక్కు భక్తి వివేకమై వాసికెక్కె-
నీదు బోధచే నజ్ఞాన నిశియు దొలగె!
ఆత్మ విజ్ఞాన దీప్తి సమైక్యతయ్యె!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
93*
మంచియందు ప్రీతియు గల్గ మంచి జరుగు
చెడ్డ భీతిచేనుదయించు దొడ్డ గుణము!
మంచి బెంచు సద్భక్తులే మహిని ఘనులు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
94*
గీత దాటు యత్నము పాప భీతి చేత-
మానుకొను దైవ భీతిచే మంచి జేయు!
ధరణి మంచిజేసిన సైన్సె-దైవమగును!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
95*
ధర్మమును సాగజేయును దైవ భయము!
భయములేకున్న గల్గునే నయము జయము!
చేరి నాస్థిక వాదాలు జేయనేల?
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
96*
బావి దరికేగు బాలుడు పామటన్న-
భయముచే తల్లి దెసకేగు పదిల పడగ!
భయములేక నజ్ఞానితో పనియు గాదు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
97*
ధరణి తలిదండ్రి, గురువులు దైవ సములు!
అతథి యభ్యాగతులునాత్ములనగ భక్తి
దేల్చకున్నను గల్గునే దేశభక్తి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
98*
భక్త చే నైకమత్యంబు, బలము నెదుగు-
దైవసాయముతో దొల్గు ధర్మ హాని!
కాని పోని మాటలు, జలధి కాకిరెట్ట!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
99*
దైవ దారిని నాకమై ధరణి వెలుగు-
దానవుని మానవుని జేయు ధర్మదారి!
మానవుని దేవునిగజేయు మంచిదారి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
100*
చిన్న రంధ్రాన నీరంత చిమ్ము నట్లు-
లోపమొకటున్న ఖాళియే-లోకులందు-
దురలవాటు భక్తియునట్లె దూరమగును!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
101*
పాపి యవినీతి మార్గాన పరుగులెత్తు
పుణ్య ప్రీతిచే తరియించు పుడమి జనులు-
మొండి వాదాలచే, లాభమొంద గలరె!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
102*
పాప బీతిచే క్రౌర్యంబు పలుచ బడును
కష్ట జీవనమున మంచి నిష్ట పడును!
చెడుగు మాని నీభక్తిలో జెందు మార్పు-
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
103*
రీతి లేని వారికిల నిర్భీతి లేదు!
నీతి లేని చోటను భక్తి నిలువ బోదు!
జాతి వాదవివాదాల ప్రీతి గొనదు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
104*
కలిమి బోయిన నేమిబోగలదు పుడమి
కొల్లబోవు నారోగ్యము కొంత లోటు!
శీలమును బోవ-సర్వంబు శిథిలమగును!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
105*
కలిమి కోసమే మాకోర్కె కట్టువడియె!
ఆద మరుపు జీవనయాత్ర – అలుసు గాగ-
అరసి, కావల్సినవి యిచ్చు అయ్యవీవు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
106*
అపర షిర్డీ కొరుట్లగా సఫలమమయ్యె!
అశ్వయుజ శుద్ధయాకాశి యందు నీదు-
పుణ్యతిథి-పర్వదినమయ్యె-పూనిజేయ!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
107*
కనగ నీమూర్తి కనువిందు గలుగ జేయు!
వినగ నీమాట వీనుల విందు గూర్చు!
అనగ ననగ నీభక్తియు నతశయించు!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!
108*
శుభము నీభక్తి భావన సుఖము, యశము-
శుభము నీరూప వర్ణన శుభకరమ్ము!
శుభము నీపద్య-శతకము శుభము, శాంతి!
సాయి నీసేవ శ్రీశేష శాయి దోవ!