
శ్రీ శ్రీ శ్రీ సాయిబాబా శతకము
(తే.గీ.)
1*
శ్రీ షిరిడివాస! సాయీశ! చిద్విలాస!
తిరుణహరి సత్యమును దిద్ధి తీర్చు కొఱకు!
మదిని నిల్చిన ద్వారకామాయి నిలయ!
సాయి నీసేవ! శ్రీ శేషశాయి దోవ!
2*
భక్తి ముక్తి దాయక భావబంధురమ్ము-
సూక్తి ముక్తావళి నందించు, సూత్రధారి!
నీదు వాక్యంబు మానవ నీతి పథము!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
3*
నిశ్చలానంద దాయక! నిగమశాస్త్ర-
మర్మ బోధక! ద్వారకామాయి వాస!
ధర్మ రక్షక! భారత ధర్మధాత!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
4*
షిరిడి, పర్తిసాయి-జియరు జీవసేవ,
విశ్వరూపు, గీతామృత విషయదీప్తి!
నవ్య భారతాధ్యాత్మిక దివ్య బోధ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
5*
రాగి బైరాగి యనకుండ రాకపోక
జన్మ రహిత మోక్షముగోరి ధన్యులగుచు,
కలసి మెలసి, జీవింతురు కలిని దాట!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
6*
నింబ తరుమూల వాస! రాత్రిం బవలును-
చేర వచ్చిన భక్తుల మ్రొక్కు చెల్లి నంత-
ఆదుకొందువు, సన్నిధి యఖిలమొసగి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
7*
జనుల వర్ణచక్రము ద్రిప్పి-జాతినేక
వర్ణులనుజేయు నీభక్తి వాస్తవంబు!
సాగు బ్రహ్మ పిపీలికా సామ్య దృష్టి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
8*
భక్తి యుక్తము, సమభావబంధురంబు!
సాగు వాక్యము సమజీవ చందనంబు!
బాబ! నీబోధ-పరమాత్మ ప్రాప్తిదంబు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
9*
సాంప్రదాయక సుగుణ మాచారగతులు-
చదువు సంస్కారమందించు శాంతి మతులు,
తరచు జన్మింత్రు-చరితను తరచి చూడ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
10*
భావమొక్కటే-ప్రవచించు బాష వేరు!
అర్థమొక్కటే-మార్గప్రవక్త వేరు!
గమ్య మొక్కటే-గన తారతమ్య గతుల!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
11*
కవిగ భావించ, పాండిత్య చవులు దెలియ-
నింద కుందను, నిందింప నితర కవుల,
విషయమెఱిగింతు-వీనుల విందుగాను!
సాయి నీసేవ శ్రీ శేషశాయి దోవ!
12*
ధరణి దాసానదాసత్వ దారి నమ్మి
తరతరాల తాతల యాన తలనుదాల్చి,
మరక పడునట్లు జీవింప మనసురాదు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
13*
మంచిచేకొన వెఱవను, వంచకులను,
వంచ వెనుకంజ వేయను, వాద పటిమ!
చీకటిని జీల్చగా సుంత చిక్కువడను!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
14*
నరుడు వెఱవగ నపకీర్తి నంటి బ్రతుకు!
అదరి బెదరు, మంచినిదెల్ప నదను దప్పు!
చేయి గాలియాకునుబట్టు చేష్ట సాగు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
15*
సత్య శివ సుందరము నీదు సకల సృష్టి,
అక్షయమ్మగునాత్మ, నాధ్యాత్మికోక్తి!
సత్యనారాయణ కవిగ సాగనిమ్ము!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
16*
కాంక్ష దీరు- నీకరుణాకటాక్షమున్న!
సకల ధర్మ వర్తన కర్మ సాక్షి నీవె!
సాధు సజ్జన సంక్షేమ సాధకుడవు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
17*
వివిధరూప స్వభావముల్ వింత మనసు!
బ్రతుకు బుద్బుదప్రాయము-పదిలమేది?
పారలౌకిక సుజ్ఞాన భావమొసగు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
18*
ఎవరికిని వారె – యిహలోకమెంత వింత!
పాపపుణ్యంబు దలపగ పడదు వీలు,
పార లౌకిక – భావసంపదయె మేలు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
19*
ఛాత్ర పరమాణువును నేను, చనువు వెంట!
శాశ్వతానందమును గూర్చు, శాస్త్ర విద్య-
భక్తి దారిలో నేర్పించు బాబ శరణు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
20*
విశ్వ ధర్మ సామ్యత శాంతి విస్తరించు!
విశ్వ రూపున నిలవేల్పు వీక్ష చేత-
విశ్వశాంతి యజ్ఞముసాగు, విశ్వసింపఁ
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
21*
విహిత జీవనమున పాపరహితమైన
సహనబుద్ధి ప్రసాధించు – సామ్యవాద-
రాహలో సాగుటకు నీదె రామ రక్ష!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
22*
ఆంజనేయ!వినాయక!అజరభూజ!
అనిల,ఇంద్రాగ్ని తేజ, అత్రి పుత్ర!
పండరీనాథ! బ్రహ్మ ప్రచండ రుద్ర!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
23*
కీర్తి గురుగ్రంధ, గోవింద కృష్ణ శివుడ!
జీససల్లా యెహోవ హే జీవబ్రహ్మ!
లోక సర్వేజనాస్సుఖి నోభవంతు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
25*
డాబు వీడి నీసన్నిధి డాసి భక్తి
చేరి తగుదాన ధర్మముల్, వేషబాష-
బేధభావమ్ము దులిపి నీపేర మనిరి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
26*
మంచి మతిగొల్తు – సాయిరామశ్శివాయ!
మంచి నుడిదల్తు-బాబా నమశ్శివాయ!
మంచి పనినల్తు-నాదర్శమానవాయ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
27*
పుణ్య భారత జాతీయ పూజ్యమునులు-
సత్యసారస్వత నిధి సాంధ్రులనగ!
సూత్ర ధారివై తగుబుద్ధి సూక్ష్మ మిమ్ము!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
28*
నాలుగు వర్ణాలనుత్తమ నరులు గలుగ-
పలుమతోత్తమ గతులందు పలుకు బడుల-
గమ్యమొక్కటె! విధితారతమ్య గతుల!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
29*
సూరు దాసు, కబీరుల సుకృత కవిత-
వీరబ్రహ్మేంద్రసాముల విజ్ఞ సూక్తి-
భారతీయ సమైక్యతా భావ గరిమ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
30*
చీలి సోలి విడివడు జాతి చిట్క భక్తి-
వరుసగాముడివడె, మానవతమతంబు!
సంఘటితమయ్యె భారత సంస్కృతిగను!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
31*
నిత్య నిష్ఠాగ రిష్ట! నీనీతి నుడులు
హితము గూర్చును, విశ్వసాహితిని గూర్చు
కరుణకిరణ! నీచరణాలె, శరణు మాకు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
32*
గోధుమలు విసిరి పొలిమేర కోరిజల్లి
గాలి గత్తర జాడ్య రోగాదులణచ-
విషము విరిగె నీస్పర్శతో విజయ సిద్ధి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
33*
సాధు సజ్జన మందార! సద్విచార!
స్వామి సద్గురువర! నీకు సాగిలిపడి-
రాజు-పేదలు మ్రొక్కిరి రాక-పోక!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
34*
శ్యామ వంటి భక్తులు-దిక్కు ధీమ వనుచు
సన్నిధిని జేరి శిష్యులై శరణు వేడి,
కామితము దీరగా మోక్ష గాములైరి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
35*
నియమ నిష్ఠ, జీవనతృప్తి, నిచ్చు భక్తి-
బాట సారులు-కలిమాయ దాట నెంచి
గురుల సేవించి నిన్ను సద్గురుడ వనిరి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
36*
సంకటావృత-సంసారసాగరాన-
భక్తి నావ యానము సులభమ్ము గాన-
గురియు కుదురంగ నిన్ను సద్గురుడ వనిరి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
37*
దీన జనులపాలిట కామధేను వీవు!
వృద్ధజనులపాలిట కల్పవృక్షమనగ-
మాతృప్రేమను బంచిన మాన్య చరిత!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
38*
పల్కు పల్కున సుధలూరు పండితుడవు
చూపు చూపున, కృపనిల్పు సూరి వీవు
బాబ! నీబాష భాసించె బ్రహ్మ విద్య!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
39*
శాశ్వతాత్మ సాక్షాత్కార సమతయోగి!
భూమి జీవజీవన హేతుభూత విధివి!
పంచ భూతాళి శాసించు, పాశుపతివి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
40*
దాసగనుడు దర్శించి నీదయను బొందె!
నామ సప్తాహమొనరించె నాత్మనెఱిగి!
పండరీశుని-నీయందె పరగ గాంచె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
41*
దాసగనుడు ప్రయాగకు దరలు కోర్కె
నీదు పాదాల తలనుంచె-నిజము దెలిసె
నంగుళీధార ప్రవహించె గంగవలెను!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
42*
తప్పిపోయిన గుఱ్ఱమే దారి గలదు-
తెల్పుమని చాందు ప్రశ్నించె, తెల్పి నంత!
వచ్చె నెలుగెత్తి పిలువగా వారువంబు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
43*
స్వాగతించి-రమ్మని మ్రొక్కె చాందు భక్తి
దురిత హరుడంచు నెంచిరి ధూపు జనులు-
పూజ సత్కార మొనరింప పుణ్యమెసగ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
44*
బంధువుల పెళ్ళికి బిలువ చాందు వెంట
బయలు దేరితివి షిరిడి బాబ-యనగ
ఫికరు లేని ఫకీరుగా బిలిచె ప్రజయు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
45*
స్థిరనివాసమయ్యెను,నాడు షిరిడి తమకు-
పుడమి భవపాద సుస్ఫర్శ పులకరింప!
అడుగు జాడలు మ్రొక్కుచు నడచిరంత!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
46*
నాన సాహెబు గొల్చె,సంతానమందె!
సతులు యిద్ధరు నీభక్తి సంతసింప!
నయము జయమొందె, పొగడెనీనామ మహిమ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
47*
వాడలను,పల్లె,నగరాల నాడిపాడు-
జనులు శరణాగతిని గోరి చరణమంటి-
వేడుకొని ఫలమొందిరి, వేడుకలర!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
48*
తమ మనోరథ సిద్ధికై తరలి వచ్చు-
వారినానందమునదేల్చు వరుసనీది!
సంతు-సంపద దయసేయు సాధు మూర్తి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
49*
ఊబిదిని పొంది నీచేత నూరడిల్లి-
పల్లవించెనుల్లాసమై పల్లె-ఢిల్లి,
నేకమొనరించె, నీభక్తి నేటిదాక!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
50*
రోగు లేగిరి-స్వస్థతలోటు దీర-
బ్రతుకు లాభనష్టాల వ్యాపారములను
మ్రొక్కుచెల్లింప వచ్చేరు, మోదమలర!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
51*
లాభనష్టాల ఖాతాలొ లబ్ధి భక్తి
ఆస్తు-నాస్తుల, తృప్తి తథాస్తు గాగ!
తప్పు గాచి బ్రోచెదవహో దత్తరూప!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
52*
అనలుడవు,కోర్కె ధుని గాల్ప నహము వ్రేల్చ,
నాట్యమొనరించు, నటరాజ నాదబ్రహ్మ!
భక్తులానందమే నీకు బహుప్రియంబు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
53*
సమ్మెతోడ బేపారులు షర్తుజేసి
తైలమును బందు జేసిరి, తగిన విధిగ-
మరల దివ్వెలు వెలిగె నీ మహిమ వలన!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
54*
నీరు ప్రమిదలో నింపి – నిష్ఠ వొత్తి
వేసి వెల్గించితివి, దివ్వె వేడ్క జూప!
నీరు నూనెగా మార్చితో నిమిషమందె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
55*
కలిని నరరూప రాక్షసుల్ కలతవడగ-
దివ్య లీలలు జూపించి దినదినంబు!
క్రూరచిత్తుల మార్చితో కూర్మి పేర్మి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
56*
వదరు బోతుల మార్చి వరద!
పుడమి తిరుగు బోతుల మార్చి, ప్రతిష్ట – నిలిపి,
తిమ్మి బమ్మి జేయవె! ఆత్మ దీప్తి నొసగ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
57*
లోన బయట శాత్రవులను, లొంగ దీసి-
మైత్రి భావ పవిత్ర సమైక్య జాతి-
సంస్కరింపగ భూదేవి-సంతసింప!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
58*
మానవత నిల్పు దైవమై మనుషులందు-
కలిసి నివసించు, నీచూపు కలుష హరము!
ప్రభులు తలవంచి మ్రొక్కిరి ప్రజలు పొగడ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
59*
నమ్మకము లేక నడచునే నరుని బ్రతుకు
మూల కందమై నమ్మకమున్నగాని
ముక్తి మార్గమ్ము దోచదు భక్తు లకును!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
60*
దుడుకు దగ్గించి, చెడుబుద్ధి దులిపి, దారి
తప్పులొప్పులు చర్ఛించి-ముప్పుబాపి!
బ్రహ్మ విద్య బోధించితో బ్రహ్మచారి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
61*
కులము – వర్ణ-వర్గము తెగ సులభ గుర్తు-
మతము బ్రతుకు దారిని సాగు మనిషి యొక్క
సమ్మతభిప్రాయముగాదె? సాంత చర్ఛ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
62*
పుట్టు ప్రతిజీవి, సుఖశాంతి పురిటి హక్కు!
సమ్మతించిన, లేకున్న-నమ్మకంబు-
వెంట సాగు తతిమ్మ వివేక హక్కు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
63*
నీతి యొక్కటే, బాషల రీతి వేరు!
గీత యొక్కటే-బోధన క్రియలు వేరు
యెంచ – నిస్వార్థ గుణమగు మంచి యనగ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
64*
బ్రహ్మ భావైక్య సిద్ధాంత బాట భక్తి,
నద్వితీయంబు, నితరత్ర. సాధ్యపడదు!
సందు-సడలింపు – సవరింపు సాగబోదు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
65*
బ్రహ్మలో లీన మొందగా బాట జూపి,
రాజు-పేద భావము లేని రాహ నడపి,
చేసుకొన్న పుణ్య ఫలము జెందు ముక్తి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
66*
స్వర్గ నరకాల, కావల సత్యలోక-
మనెడు, గోలోకమే మోక్ష మనగ జెల్లు!
జన్మ రాహిత్యమాత్మమోక్షమ్ము జేర్చు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
67*
యుగయుగావతారిగ నీవు నుద్భవించి,
యుర్వినుద్ధరితువు ధర్మ మూర్తి వగుచు!
గీత నీతుల దొలగును-కిల్బిషంబు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
68*
శీఘ్రగతి భక్త బృందంబు షిరిడిజేరి
పర్వ దినసంబరాలలో పరగ నుండ,
కర్మ యోగానుభవ విద్య కనుల జూపు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
69*
దివ్య దీపావళిని – ధునీ-దేదీప్యమవగ-
చేయి జాచితీవు-శామ చేయి నీడ్చె-
దగ్ధ మెవ్వరికైన సదాభరింపు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
70*
కర్మరింటిలో గొల్మినీ గాలె బిడ్డ!
గొల్లుమనె తల్లి-యిలవేల్పుగోరె! బాధ-
నీవె యనభవించగ బిడ్డ నిమ్మలించె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
71*
భక్త రక్షణకెంతైన బాధనోర్వ-
షిరిడి సంస్థాన ప్రభుడవై చింత దీర్ప!
బ్రతికి పోయిరి నీదయ భక్త జనులు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
72*
జనులు శ్రీ రామ నవమిని జరుపు కోర్కె
యుప్పు నీటినూతినితీపి నొప్ప త్రాగు
నీటి నందించితివి,భక్తి నిష్ఠ వెలయ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
73*
పుణ్య తీర్థమై క్షేత్రమై పోయె షిరిడి-
సర్వ మతసహనము సూత్ర సారమయ్యె!
పెక్కు సిద్ధాంతముల గట్టె నొక్కత్రాట!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
74*
అన్ని కులమతములవారి పెన్నిధిగను,
ప్రేమ పంపకమున నీవె పేరు గాంచ-
లోకు లేకమై కీర్తింప లోటు దీరె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
75*
ఆత్మ-జన్మల గడచియు ఆర్తి తోడ,
మనిషిగా బుట్టు-చివరిదౌ మజిలి యనగ
చేరు విశ్వాత్ము సన్నిధి సేదదీర!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
76*
పుణ్యమున విజ్ఞులింటను పుట్టు నాత్మ!
గురునిగా పరమాత్ముని గుట్టు దెలుపు-
పుణ్యముల పంట పండేది పుడమి యందె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
77 *
ఆజ్ఞ పాలించు భక్తుల కఖిల మొసగు-
అదపు దప్పిన సవరించు, ఆదరించు!
ఆటపాటల జీవన యాత్ర నడుపు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
78*
జీవి జీవిని నీవుండ చీమకూడ-
ఆజ్ఞ మీరదు, మీరితే అదుపు దప్పు!
పాపి మారితే, నీభక్తి ఫలము బొందు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
79*
మూగ జీవుల యాకలి ముందుదీర్చి-
పిదప నేభుక్తి సాగించు ప్రీతి నీది!
రోట్టె శునకంబునకు బెట్టు రోజు పస్తు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
80*
పరుల పొట్టనింపుట నీకు పరమ తృప్తి!
పశులు-పక్ష్యాది జీవుల పాలనంబు-
వ్రతముగాసాగె, నీచుట్టు సతము విందు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
81*
అష్టసిద్ధులు నీలోన నలరు చుండు
పరగ మామూలు నరునట్లు బ్రతుకు నీడ్చు-
మార్గ దర్శివి, ద్వారకామాయి నిలయ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
82*
త్యాగ,యోగ,విజ్ఞానమ్ము, తపసు, నాల్గు-
ముక్తి దారులంటివి, ముద మొక్కటగుచు-
సాగితే, నరజన్మంబు-సార్థకంబు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
83*
సగుణ, నిర్గుణోపాసన సాగు విధుల-సహజ,
సులభమ్ము సాకార సగుణ భక్తి!
మదము, నిహపరసుఖ శాంతి ముక్తిదంబు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
84*
మునులుగోరు,నిరాకారమూర్తి జపము-
నిష్టకామ్యార్థ సిద్ధిని యిచ్చు తపము!
నిర్గణోపాసన విధుల నియమ క్రమము!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
85*
గద్ధరించె నానావల్లి గద్ధె దిగియు-
వాని గద్ధెనుంచియు, మంచి వాక్కు చేత-
మహిమ జూపించితివి, బాబ! మార్పు గలుగ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
86*
డాబు దర్ఫంబు, మెచ్ఛవు, డాయువారి-
గర్వమును ఖర్వమొనరించ గలవు-చిత్త-
భ్రమదొలగి భక్తి, విశ్వాస బాట నడుపు-
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
87*
ఘోలసామి శిష్ముడు పేరు మూళె శాస్త్రి,
శాస్త్రవిజ్ఞాన గర్వియై చర్ఛబూని-
తర్కమునగెల్వగా జూచె, తానెయోడె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
88*
నీవె ఘోలసామిగదోచ, నివ్వెరొంది-
శాస్త్రియాందోళనయుజెందె! శాస్త్ర చర్ఛ-
పోటిమాని దైవంబని పోల్చి, పొగడె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
89*
శాస్త్రి కభయ హస్తంబిచ్చి, శాంతిగూర్చి,
కృపనుబ్రోచి-తద్గురువునాకృతి జూప-
పాహిమాం పాహియనె శాస్త్రి పదిలపడెను-
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
90*
పుడమి పూజలు, సేవలు-పుణ్యమునకె!
సంద్రమంత నమ్మకమున్న చాలు మీకు-
సకలమిచ్చి, బ్రోచెదనన్న శాంతమూర్తి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
91*
బాల గణపతి నినుగొల్చె బడసె సంతు-
బూటి సంతాన సంపద భూరి యశము-
పొందె, దాసానదాసులన్ బోలిరంత!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
92*
భక్తజన బాధలుడుగంగ బహువిధాల-
వచ్చి పోవు సంపద వాన వరదగాగ-
పుణ్యమై మిగిలె పుడమి పులకలెత్తె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
93*
కాలమాసన్నమై వచ్చె,కడకు సప్త-
రూకలే నిధి గల సద్గురుండ! విధిగ-
తనువు చాలింపు సమాది తగువిధాన!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
94*
సంతు-సౌభాగ్య సంపదల్ స్వాస్థ్య మొప్ప-
నీదు దయచేత బాధితుల్ నిబ్బరించి,
కలిని వారించు నీభక్తి గలుగ మనిరి!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
95*
రెండు బల్లుల కథ జీవి నెసగు మమత-
సమత సమతుల్యమౌ చర్ఛ హాస్య-
మైన, మాటలన్ దోచులోతైన నిజము!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
96*
బాబ!నీయాజ్ఞ హేమాడు పంతుబూనె-
శామ, రాధబాయి, నుతుల సహకరింప!
చరిత రచన సాగించగా చర్ఛ జరిగె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
97*
ద్వారకామాయి-కథలుగా తమరి లీల-
షిరిడి యాత్రలు,పాత్రలు-జీవనటన-
సూత్రధారివి నీవె! నీ చూపె చాలు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
98*
జీవిజీవిని,నినుగాంచి,దివ్యమైన-
దీప్తి గుర్తింప-దైవత్వ తీరు దెలుపు-
నట్టి మార్గాన చరితగా నలరె రచన!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
99*
విషము,విరుగుడు,రుజమాన్పు,విద్యలొప్ప,
పిలుపు చే లొంగు బాధలు-మలుపు ద్రిప్ప-
భక్తి విశ్వాసమే నీదు బాటగాగ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
100*
మూడు తరగతులుగ భక్తు లుండు విధము-
మూడుమూర్తుల నీవుండు ముక్తి గొనగ-
గీత ధర్మోద్ధరణ గల్గె-నీతి వెలిగె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
101*
ధ్యానము – ధ్యాని – దైవము త్రయములందు –
రూపబ్రహ్మవై దీపించు రూఢి నిన్ను
నెంచి-నీదారిలో ప్రయత్నించు, బోధ!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
102*
తేది-చావడోత్సవమందె తెల్పి నట్లు-
విజయ దశిమి నిర్యాణంబు విషదమయ్యె!
హిందు-ముస్లీము చర్ఛల హితవు సాగె!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
103*
తొమ్మిది,నాణెములు లక్ష్మి తోడ రొట్టె-
చివరి చెల్లింపు, నాకలి జీవులకును,
విందు జేయుమటంచు దీవించి నావు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
104*
భక్తి పరిపూర్ణత, నహము భయము వీడి
గట్టి నమ్మకంబున జేరి పట్టువిడక-
జన్మ రాహిత్యమొందేరు-జగతి జనులు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
105*
శ్యామ కిస్తివి, గ్రంధంబు, సహస్రనామ-
విష్ణువర్చన స్త్రోత్రంబు-విధము దెలిపి-
చదువ సూచించితివి-మోక్ష పదవి కొఱకు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
106*
ప్రాజ్ఞ వైరాగ్యమూర్తి శ్రీ బాబయోగి!
శాంత గంభీర వదన! వేదాంత తేజ!
భారతీయాత్మ సంకాశ! బ్రహ్మ రూప!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
107*
విశ్వ శాంతిప్రచారంబు-విస్తరించ,
ఆర్త రక్షణోద్యమ వ్రతమాచరింప-
పూనుకొను భారతీయులే పుణ్య ఘనులు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!
108*
శుభము నీరూపు దర్శింప సుఖము శాంతి!
శుభము నీచూపు సద్బుద్ధి సూక్ష్మతొసగు!
శుభము నీసూక్తి శతకంబు సూనృతంబు!
సాయి నీసేవ శ్రీ శేష శాయి దోవ!