top of page
రుధిరదానం శతకము-2
(తే.గీ.)

1*

శ్రీలువెలయించు జనదానవీర మహిమ-

వృత్తియు ప్రావృత్తి-సౌష్టవవృద్ధి గూర్ప-

భరతమాత ఋణము దీర్చు చరిత గరిమ!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

2*

సాటి సాహితీ ప్రియులార! సదయులార!

సహచరానుచర సుహృత సభ్యులార!

నమ్మకమునిచ్చి దీవింప నయము జయము!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

3*

జనులు పురుషార్థ సాధకుల్ జననిభరత-

మాత, జీవనమార్గ విధాతగాగ!

మేలు దేశవిదేశాల మేటి చరిత!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

4*

అక్షరాస్యత,లక్షసమస్యలకును-

తెలివి కలిమి మించు తెరువు దోచు!

విద్య గోరంత-తెలుగింట- వెలుగు కొండ!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

5*

మఱ్ఱి విత్తనమునదాగు మాను నూహ-

జేయు మనుజుండు జీవాళి శ్రేష్ఠుడనగ-

దానవీరమునొప్పగా ధాతయయ్యె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

6*

జీవులన్నిట,బుద్ధి విశేషమొప్ప-

బుద్ధి జీవియయ్యె , మిగత భూతహితవు-

ధర్మ సూక్ష్మదర్శిని – సత్యదర్శియయ్యె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

7*

త్యాగ మూర్తులు భారత తాత్వికాళి!

ధర్మమూర్తులు, పుడమి నాధ్యాత్మికులును!

ముందుచూపు సంస్కృతి గూర్చి- మునులు జనిరి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

8*

ఋషుల సంస్కృతియు పురాణ పురుష నీతి-

యిష్టపూర్తి దానములిడు నిష్ఠగూర్చె!

దానధర్మమే బ్రతుకు విధానమయ్యె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

9*

విశ్వ శ్రేష్ఠులు భారత విద్యగురులు!

జీవ శ్రేష్ఠత గాపాడు దివ్యకృతుల-

పుణ్య సంచితార్థముగొను స్ఫూర్తి నిడిరి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

10*

బాధ్యత బరువు-బ్రతుకున పరువు బరువు!

భారతీయ పురాణాల భాగ్య గరిమ!

విద్య వినయ విధేయత-విధిగ బరువు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

11*

తరతరాల మీగడ సాంప్రదాయమైన,

మంచి సంస్కృతి పేరట పెంచు విధము-

సర్వ జనుల సుఖముగోరు సహనమొసగె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

12*

తరచ నాత్మ తత్వము తారతమ్యముడిగి-

గమ్యమొకటిజేయగ-విశ్వగమన గతుల-

తరతరాల సాహితియు ధాతలను బొగడె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

13*

ప్రజలు రాజులై స్వయముగా ప్రభువులగుచు-

సాగు పాలనలో ప్రజాస్వామ్యమొప్ప-

పాలకులు పాలితులుగాగ ఫలము గనిరి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

14*

ప్రజలె ప్రభువులై దాతలై ప్రజలమేలు

గోరువారైరి, పరులకు తోడుపడగ-

వివిధ దానంబులనుజేయు విధము గలిగె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

15*

అన్న పూర్ణ భారత కీర్తి గొన్న పేరు-

దాన విశ్వరూపమునెత్తె ధన్యమనుచు!

దేశ దేశాల కాదర్శ దేశమయ్యె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

16*

స్వార్థ రహితమై నరజన్మ సార్థకముగ-

భక్తి విశ్వరూపమునెత్తె-శక్తి యుక్తి-

సాధు సజ్జన సన్మార్గ సరణి సాగె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

17*

దానవులయందు గల్గిరి దాతలనగ-

మానవులయందు దాత సామాన్య గతిని

గలుగవలెనన్న తపనయు గలిగె నాడె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

18*

ధరణి దానవ దాతలు దైవదారి

దానగుణ గణ్యతయు గల్గి తరలిపోవ-

బలియు ప్రహ్లాద పౌత్రుడై బలము గూర్చె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

19*

దాన కర్ణుడు ధాతయై దనరెననియు-

శిబియు, రంతిదేవుడు దానచిత్తులనియు-

కథల నీతులే-సాహితీ కదలసాగె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

20*

నరులు, భల్లూకములు వానరులు గూడి-

రామదండు సాగె! హనుమ రామబంటు!

గాగ నిస్వార్థ సేవయే గణనకెక్కె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

21*

కీర్తి కరమయ్యె రామసుగ్రీవ మైత్రి!

ఉడుత భక్తి రాముడు మెచ్చె నుర్వి పొగడ!

నీతియాదర్శ మానవ రీతి నెగడె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

22*

ఎన్ని జీవులు ఏకమై, ఎలుగునెత్తి-

ఆర్చి కేకేయగా, లంక-అదరిపడదె!

ఐకమత్య మైహిక నీతియైన శక్తి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

23*

నరులునేకమై కదలిన నలరు శక్తి!

రక్త బంధమ్ము వెలయు శ్రీరామ రక్ష!

నయము, అరచేర స్వర్గమ్మునందు జగతి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

24*

భారతీయ సమైక్యత భావపూర్ణ –

ఫలము రామాయణము-దైవ బలము గూర్ప-

జనకుటుంబ జీవన సిరి జగతి కీర్తి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

25*

అందరొకటిగా సమస్యల చందమెరిగి-

రక్త బంధులై-ధాతలై- రామనీతి-

రాహ సాగిన వైరసుల్ రయముజెందు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

26*

రుజ వినూత్నమే-ఔషదరూఢిలేదు!

టీక రాలేదు జాగ్రతే టాకెఎయ్డ్సు!

మూలకణచికిత్స-బహుఖర్చు-మొలకదశయె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

27*

జగతి వణికించు వైరసుల్ జాగృతంబు!

తప్పదిక విశ్వనర సఖ్యతొప్పవలయు!

అనగననగ భారత నీతి మనుగడొసగు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

28*

కనగ దృశ్యాంతరములందు కల్తిసాగె!

వినగ భావాంతరములందు విసుగునెసగె!

అఖిల భారతైక్యత రీతి సుఖముగూర్చు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

29*

కల్తి వంగడమ్ములు గల్గె-కలతవడియు-

రైతు సంగతి దీనమై రక్త – చెమట-

పుడమిదడసె నిధానమై పులకరించె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

30*

కల్తి వింగడంబన రక్త కలుషమొకటి-

మార్పిడుల రోగి కేర్పడె మరణభీతి!

జనుల వణికించె నవినీతి జగతియందు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

31*

జరుగు ఘోర ప్రమాదాల జమలె గాని-

ప్రగతి పట్టిక ఖర్చులే ఫలములేని-

గతియె, ట్రాపికు స్వేచ్ఛకు కట్టడేది?

తిరుణహరిమాట భరతజాతీయబాట!

32*

కల్తి కాలుష్యములు బాహ్య చల్తియగుచు-

రక్తమును జేరు కాలంబు రానెవచ్చె!

పట్టి పట్టని విషతిండి పుట్టిముంచు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

33*

కలియుగాన దానము నాటి కథల తపసు-

ధాత తాపసియనునుడి దలప వలయు!

వసుధ పుణ్యమే రెండింట వచ్చు ఫలము!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

34*

రుధిర ధాతయే, అలనాటి ఋషిగ నెఱిగి-

దానమే యజ్ఞముగ రక్త దానమొసగి-

రక్షణకు బూనుటే జన్మ రహిత ముక్తి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

35*

ఆదుకోవలె రుధిరార్థి నాదరమున-

దానగుణమిచ్చు విద్య సాధనముగాగ-

ధాతయే తాపసిగమారు ధరణియందు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

36*

లోటుగూర్చని దానము లోకమందు-

రక్త దానమే-దైవమే రక్తధాత!

ఖర్చులేనట్టి కీర్తిని గాంచు జగతి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

37*

హాయి పౌష్ఠికాహార విహార సుఖము!

రధిర సంద్రంబులు ప్పొంగు రుజువు జూపి-

వైద్యనారాయణుల్ దెల్ప-వలదు శంక!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

38*

హాయి – కొలది విరామంబు శాయశక్తి-

రుధిరమత్పత్తియగు సుధానిధిగ వెలయు!

విధియు బాధ్యత నెరవేర్చు విధము తృప్తి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

39*

పాతనీరు వరదరాగ పాతమగుచు-

మత్తడినిదుంకు! వెనువెంట క్రొత్తనీరు-

నిండునట్లుగ-రక్తంబు నిండుచుండు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

40*

ఇచ్చు వారికి, తృటిలోనె వచ్చిపోవు-

నీరసము, దల్ప వలదింక-నీకునేను-

నాకు నీవన్న భావన నయము గూర్చు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

41*

రక్షకుడు ధాత! రుధిర సురక్షితనిధి-

సాక్షముగలేదు, పిదపరియాక్షనేమి!

లేనిపోనియపోహల నెన్నవలదు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

42*

పల్లె పట్టణ ప్రజసాగు పయనగతుల-

గాయపడు, వారి జూడగా డాయువారు-

గ్రూపుగల్సిన రక్తమున్ గూర్చవచ్చు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

43*

ధాత రప్పించు సమయంబు-దారి దూర-

పయనమైయున్న వేగిర పడియు రక్త-

బంధువులు ముందడుగిడగ బ్రతుకు నిలుచు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

44*

ల్యాబు లైసెన్సు గల బాంకులందు దొరకు-

రక్తమెక్కించగా జాగరతయుగాగ-

సులభ సూత్ర రుధిరదాన సుధయు గురియు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

45*

వివిధ సేవలు-క్లబ్బులు వెలయ జేయు-

సంస్థలెన్నియో, శిబిరాల సాధనములు!

దీక్షగా రక్త నిధిగూర్చు దిక్కుసాగె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

46*

భువి పరోపకారము, పుణ్యపూర్వకమగు

భూతహితవు సత్యముగాగ-పూని సేవ-

జేయు ధాతలుండిరి భారతీయ గరిమ!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

47*

వ్యక్తి నిత్యావసరవస్తువయ్యె-రక్త-

ధాత చిరునామ చిట్టాల వ్రాతసాగె!

రక్తదాన దీక్ష జనసురక్షితముగ!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

48*

కంటి దానదీక్షయు జీవ కాంతిరేఖ!

తదితరావయవములందు ధాత-నేడు

కిడ్ని ధాత శాశ్వతసత్కీర్తి గాంచె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

49*

జనన మరణాల రేటుల, జగతి తారు-

మారుగాసాగె-అధికజనాభ చేత-

ప్రభుత బూను ప్రణాలికల్ పట్టు సడలె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

50*

దేహమాసక్తి వీడి విదేహుడైన-

జనక మహరాజు వైదేహి జనకు కీర్తి!

కీర్తన సమకాలీన సంకేతమయ్యె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

51*

క్రొత్త వొరవడి-వైద్యాన క్రొత్త దారి-

క్రొత్త దానపత్రము రక్త కొఱతదీర్చు!

ప్రాణధాతకు మరిలేదు పాత క్రొత్త!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

52*

వెనక ముందాడ పనిలేదు, వెలితి పడక!

ఇష్ట పూర్తి రక్తమునిచ్చి హితవు జేయు-

క్రొత్త రక్తవృద్ధియు జర్గు-గొప్పమేలు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

53*

దైవ దీవెన తోడగు ధాతలకును-

ఆత్మ సంతృప్తియును-కల్గు దానఫలము!

పారలౌకిక భావనా పటిమబెంచు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

54*

రక్త దానమ్ముచే కీర్తి రాణకెక్కు!

బ్రతుకు మానవత్వము చే పరిమళించు!

ప్రాకటముగ ప్రజలుమెచ్చు-ప్రభుత మెచ్చు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

55*

రాజు పేదను ముడివేయు రక్తఝరులు-

కలిమి లేములనక రక్త కాల్వ సాగు!

శత్రు శత్రుత్వమును వీడి మిత్రుడగును!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

56*

జన్మ భూమి ఋణము దీర్చు జాతి సేవ!

జాతి సేవలో ధాత విజేత గాగ-

రక్త ధాత సమాజ గౌరవముబొందు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

57*

రక్త గ్రూపులు ఏబివో రకరకాలు!

పాజిటవు నెగెటివు సరి పడిన రుధిర-

మార్పడియును సాగును వైద్య మార్గ మందు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

58*

ధరసురాసుర నరవానరముల-జంతు

జలచరులు భూచరులుభయ చరులు-పక్షి

తదితరాలను నాత్మయు నొక్క తాత్వికంబె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

59*

దీన రోగుల దీవెన దినదినంబు-

దైవదీవెన వలెఫలదంబునెఱిగి-

ధరణి ప్రఖ్యాతి గాంచిరి ధాతలంత!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

60*

మేలు గుర్చు దోవన గల్గు మేలు తనకు!

కీడు లేనితీరున వచ్చు కీర్తి, తిరము!

దయయు దాక్షిణ్యమున నాత్మ దనరు సేవ!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

61*

రాగి బైరాగి సంసారి రాజు పేద-

ప్రాణమెవ్వరిదైన సమానవిలువ!

ప్రాణ ధాతలై యెవరైన బ్రతుక మేలు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

62*

విద్య వైద్య సేద్యములందు వెలయువారు!

చదువు పదవులు లేకున్న పదిలమైన-

బ్రతుకు సుఖమునే గోరు ప్రాణ ప్రదులు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

63*

మనిషి-మనిషినిగా జేయు మార్గమందు!

విద్య-మానవతయె విలువబెంచు!

దయయు దాక్షిణ్యముదయింప ధాతయగును!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

64*

రక్త బేపారమే సాగరాదటన్న –

రక్తి కల్తి బేపారము రాక్షసంబె!

డబ్బు కక్కుర్తి జబ్బును డాయజేయు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

65*

మానవతగను స్వచ్ఛంద దానమహిమ!

దాన గుణమున్న నరజన్మ ధన్యమగును!

అవసరార్థము నిడు రక్తమధిక విలువ!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

66*

రక్త సిరిగల్గ బ్రతుకున రంగు పొంగు!

రక్త బలమున్న జాతీయ శక్తి యుక్తి!

తిండి రక్షణ నిద్రయు నుండ మేలు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

67*

ఎట్టి వారైన కాలమ్ము ఏదియైన-

అవసరానికందిన వస్తువదియె విలువ!

చేయిగాలియాకునుబట్టు చేష్టలేల!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

68*

సొత్తు నిచ్చినవారు విరోధు లైరి!

సొత్తు రికవరియగువారి సొమ్ము చేత-

నెత్తురిచ్చిన మరి ప్రాణ నేస్తమయ్యె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

69*

ఇతర ధాతల-మరచినా హితవు గూర్చు-

విధిని ధాతలుందురు గాన-వింతగాదు!

ప్రాణధాతను మరవదే ప్రాణియైన!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

70*

రాదు లోటు జీవించియు రక్తమిడగ!

కాదు లోటు చని వెళ్ళియు కంటినిడగ!

వెలితి పూరింప దానముల్ వెలసె నంద్రు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

71*

అన్నదాత చెమటనోడ్చి – అహరహంబు-

బ్రతుకు కనుమల్పక రాత్రిఁ బగలుతాను-

కాపలనుగాచి కల్లాన గాంచు పంట!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

72*

అన్నమే రక్తమై పారు – వెన్నమనసు

కరిగి రక్తదానముజేయ కదలివచ్చు!

అన్న దాత రక్తమునోడ్డ్చి యాదుకొనును!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

73*

అసువులను బాసి జీవించు-అన్నదాత!

రాహ జీవించి రాణించు రక్తదాత!

చెల్లిపోయినా-కను ధాత కళ్ళవెలుగు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

74*

దాన తపమున వీడియు దరిద్ర చింత-

బరువు బాధ్యతలనిచెప్పి-పాటిదప్పి-

బ్రహ్మ రాతను నిందింప భావ్యమగునె!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

75*

మలిన రక్తంబు నమ్ముట మానవలెను!

మలిన రక్తంబు నెక్కించు మాటవలదు!

మలిన సెక్సు జిక్కియు జచ్చు మది-విషంబు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

76*

పటిమ నైపుణ్యమే వైద్య ప్రగతి గాగ-

మలిన రక్తంబు వర్జించు మార్గముండు-

తగును సురక్షిత మార్పిడుల్ దనరు భువిని!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

77*

భ్రమయు గల్గియు బ్రతుకుట- భయము గలుగు!

పరగ భయముచే నమ్మని ప్రజల మనసు

తెల్సినది గ్రుడ్డిగా నమ్ము నేదేనియొకటి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

78*

భక్తి శ్రద్ధలు గల్గిన ప్రజల మేధ-

భవభయదూరమైనట్లు, బ్రతుకు భ్రమయు!

దూరమగు-మంచిదారి చేకూరు ఫలము!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

79*

నరులు నైతిక విలువల నైజమెరిగి-

వారధిగ పాత క్రొత్తల దారి సాగి-

దాన గుణ ప్రచారము జేయ దనరు జాతి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

80*

ధర్మ మార్గంబు వివరించు దారి విద్య-

బ్రతుకు ఫలియించు తీరున ప్రతిఫలించు!

నీతియుక్తంబుగా సాగ-రీతి వెలయు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

81*

నిర్భయత్వముచే గల్గు నియమనిష్ఠ-

నిర్భయత్వంబు స్వాతంత్ర్య నియతి సాగు!

దేశజనులు ధాతలుగాగ తేజమొసగు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

82*

బ్రతుకు నిల్పు భద్రత దేశ ప్రభుతవంతు!

జాతి పరువు ప్రతిష్ఠయు ప్రజలవంతు!

బరువు బాధ్యతలుభయత్ర బరగు విధులు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

83*

నీతి గీత దాటగరాని రీతి గీత-

భారతీయ సంస్కృతినమ్ము బ్రహ్మవ్రాత!

ధర్మమునకు జయంబను ధరణి గీత!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

84*

నైతిక విలువలు దాటేసి నడువనెంచు-

నడవడిని పొందనేర్చునే నయము జయము!

నైతికమె శాశ్వతమైన పునీత రీతి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

85*

అకషరాస్యత సంస్కృతికాది మెట్టు!

ఆత్మ తత్వంబు ముక్తికినాదిమెట్టు!

అంచెలంచెల నిచ్చెనల్ మంచిగుట్టు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

86*

బ్రతుకు సాంకేతికము వెంట పరుగులెత్తు!

నాడు నేడు రేపట నడయాడు ప్రగతి!

జనులు ధాతలైనప్పుడే జగతి సుఖము!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

87*

నిత్యమవినీతి వర్జింప నీతివెలము!

నిత్య నీతిని సాగింప సత్య పథము!

సత్యమే భూతహితవు సాహిత్య ప్రగతి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

88*

నిఖిల దానాల సర్వత్ర నీతి నిష్ఠ-

మంచి చెడులెంచి సాగించు మనుగడంత!

గీత ననుసరించియు నిత్య కీర్తి గాంచు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

89*

ఏయ్డ్సు గర్జించె-దేశవిదేశములను-

మాట! మనదేశ మనరాష్ట్ర మనగ వినమె!

తెలుగు నీతిని నిరసించు తెగులదేల?

తిరుణహరిమాట భరతజాతీయబాట!

90*

మలిన రక్తమెక్కించిరి మాయ కల్తి-

మలిన సెక్సునిందయు మోయ మరణసమమె!

ననెడు రోగిభావన సాగె నాడు నేడు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

91*

మలిన రక్తసేకరణలు మనకుహాని-

వైద్య దుందుభి మ్రోగించె వైనమెరుగ-

మాట మనదేశ మనరాష్ట్ర మనదె రిస్కు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

92*

స్వార్థమును వీడ నుభయత్ర చాలమేలు!

కల్తి రక్తంబు వర్జింప గలుగ వలయు!

మనుజు దానవీరమె నిజ మగతనంబు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

93*

వలస సెక్సు, హైవేసెక్సు, వైరసెయ్డ్సు

ముద్దు ముచ్చట వ్యసనాలు! హద్దు మీరె-

రోడ్డు పైక్షత గాత్రుల రోదనములు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

94*

కలిని దానమే తపసైన-కల్తి దాన-

దోషమున గల్గుచుండును, రోగి బ్రతుక-

కలుష రహిత రక్తము పుణ్య కార్యక్రమము!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

95*

రక్త బేపారి పైపెచ్చు రకము కొఱకు-

ప్రాణములు దీయు రక్తంబు-పరగ నమ్మి-

పైకమును గూర్చు కొనజూడ పాపమగును!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

96*

ధరణి మానవ సేవ మాధవుని సేవ!

మంచి పూర్వక జీవన మార్గమందు!

నిండు పుణ్యమే ముక్తికి ఇంధనంబు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

97*

మాయకుని పోటి నెగులమాయకుండు!

డాబు దర్ఫంబు గల ధాత డాయలేడు!

నడుమ వాలంటరీ సేవ నలరు ఫలము!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

98*

దానవినియోగమును గాని, దాతయాస్తి-

పాస్తి యెల్ల, దుర్వినియోగ ప్రాప్తియగును!

మొదట మేల్కొని పుణ్యంబు నొందవలయు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

99*

రోగి రోగమ్ము మాన్పియు, రోగిబ్రోచు-

శత్రు శత్రుత్వమును మార్చి మిత్రుజేయు-

నరు దయాపూర్ణ హృది పుణ్య నదిని బోలు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

100*

ఆత్మ కీజన్మలో దేహమద్దె గృహము!

కాలధర్మ గతిని దీని – ఖాళి జేసి-

వెళ్ళవలె, దేహ సౌందర్యమెల్ల వీడి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

101*

ధాత భువి సూర్యుడే, రశ్మి దానమిచ్చు-

రశ్మి ధాతయై దీపించు రక్తధాత!

ముదము, ఫలమొందు భవబంధ ముక్తి తుదకు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

102*

కలిమినుబ్బి-తబ్బిబ్బుగా కదలువేళ-

దాన ధర్మదారిని సాగి ధాతయైన-

ఇచ్చి పుచ్చుకొనెడు కీర్తి హెచ్చు భువిని!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

103*

గొప్పదనమేది? తనసొమ్ము గోలుపోక-

మెత్తదనమేదమాయకమేగ పేరు!

తేగమే సామాజికశాంతి యోగహేతు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

104*

పెట్టి పుట్టిన ధాతదే పేరుకీర్తి!

దానఫలముగా పుణ్యంబు దనరు సిద్ధి!

ధాత నిస్వార్థమే ముక్తి దారి దీప్తి!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

105*

విలువ గలిగిన వారిదే, వీరజన్మ! –

నీతి గలిగిన చేరువ నిత్యముదము!

పూర్వ పుణ్యంబుచే దాన గుణము గలుగు!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

106*

దాన ధర్మంబు చే వెల్గు దాతగుణము!

వేయి నోళ్ళ వర్ణించినా వెలితియగును!

విశ్వ కౌటుంబయై పంచు విశ్వ ప్రేమ!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

107*

నిన్న పాత రేపట క్రొత్త-నేటి వింత!

కాలమెంత మారిన హృదిజాలి దలచు-

గుణము మారదు భువి జాలి గుణుడె ధాత!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

108*

శుభము-పుణ్యమార్గాలకు శుభము శుభము!

శుభము-రుధిరదాతలకెల్ల శుభయశంబు!

శుభము-శతక పాఠకులకు శ్రోతలకును!

తిరుణహరిమాట భరతజాతీయబాట!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page