top of page
రుధిరదానం శతకము
(తే.గీ.)

1*(ప్రారంభము)

శ్రీలు గులుకు సేవాధర్మ చిత్తవృత్తి-

వృత్తినేకమై సౌష్ఠవ వృద్ధిగూర్చు!

దాన గుణముచే కడుపుణ్య ధనము వెలయు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

2*

దానమె తపస్సు-కలియుగ ధాత తపసి-

పుడమి దానధర్మముగూర్చు-పుణ్యఫలము!

పుణ్యమార్జింప నరునిగా బుట్టు నాత్మ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

3*

దేవ దానవులకు మధ్య తేజరిల్లు- మానవుడు దేవదేవుని మార్గగామి!

దైవ దానవతకు మధ్య మానవతయె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

4*

ప్రేమమయులార! గురులార! పెద్దలార!

చదువు సంస్కారయుతులార! ఛాత్రులార!

వినియు వినిపించు నీతికోవిదులు మీరు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

5*

మంచి యానోట నానోట సంచరించు!

అంతట వ్యాప్తమై చెడునంతరించు!

వినియు- వినిపింప, నైతిక విలువబెరుగు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

6*

సూక్తి నిధులార! విజ్ఞాన సూర్యులార!

పురపుముఖులార! జనులార! పూజ్యులార!

మేటి సహచర-అనుచర, మిత్రులార!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

7*

మిమ్ము వేడెద నమ్మక మివ్వరండు!

తీరు నడిగెద మరియాద మీరకుండ!

నీతివిద్యలు వేరుగా నేర్వ వలెన..?

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

8*

సాటి సాహిత్య ప్రియులార! సభ్యులార!

కీడు మేలెంచు ఘనపాత్రికేయులార!

చదువుతో నీతి జోడింప సాధ్యపడద?

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

9*

వినియు వినిపింపవలె దాన విధుల మహిమ!

ప్రజలు ప్రశ్నింపవలె నీతి, ప్రభుతనైన!

తర్కవాదాల వినవలె తగుజవాబు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

10*

శిబియు, రంతిదేవుడు దానవీరులైరి!

దాన కర్ణుండు పేరొందె ధాతగాగ!

బలియు విష్ణుపాదము మోప తలనుజూపె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

11*

వెఱవక దధీచియిచ్చెను, వెన్నుపాము!

జగతి వజ్రాయుధముగ వాసవునిజేరె!

గిరుల రెక్కలు ఖండింప కీడుదొలగె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

12*

నరునికై సురేంద్రుడడిగినంత-సహజ-

కవచ కుండలములనిచ్చె, కలత వడక!

దాన కర్ణుడై రాజలోకాన వెలిగె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

13*

త్యాగమే గీత-గీతయే త్యాగమనగ-

తెరచి తిరగేసి చదివిన తెలియు –

ఈవి!

పుణ్య ఖని గీత! భువి – భూతముక్తి నిధియు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

14*

గీతయే త్యాగముగను తాగీయనంగ-

అక్షరాకృతి లీలయే – అద్భుతముగ-

దోచునది యోచనే మదిన్ దోచుకొనగ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

15*

బ్రతుకు బుద్బుద సమమంద్రు-భద్రతెరిగి-

సతత త్రికరణ శుద్ధిని సాగునట్టి-

సత్యవ్రతమును, త్యాగిదే నిత్యసుఖము!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

16*

సత్యమన భూతహితవుగా సాగునట్టి-

దైవ కార్యక్రమమె దాన ధర్మ కర్మ!

వ్రతముగా పుణ్య నిధిగూర్చు వాస్తవంబు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

17*

శుద్ధి గలిగిన స్థిరబుద్ధి సూక్ష్మగ్రాహి-

త్రికరణ విశేషమైన నైహికసుఖంబు-

పిదప పరసుఖమును, పుణ్య ప్రీతి గూర్చు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

18*

రుధిరమమృత సమానము, రోగులకును!

రాక పోక ప్రమాదాల రక్త నష్ట-

రూప మృత్యువు కబలించు రూటులందు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

19*

అన్నమే రక్తమై నరునరములందు-

అన్నియవయవములజేరు – అవసరముగ!

జీవశక్తినిచ్చియు, జీవనేచ్ఛ దీర్చు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

20*

రుధిరమమృత సమానము-రుజలయందు-

చెడిన రక్తము వడవోయు చేష్ట గుండె-

సిరలు ధమనులు పనిజేయు చిత్రముగను!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

21*

రుధిర సుధహీనమగురోగి-రూపు రేఖ-

మారిపోవును బలహీనమగును – తిండి

రక్తమునుగూర్చు నౌషద శక్తి వలయు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

22*

రక్తధాత-అవసరము రక్తనిధుల-

కొరత గల్గిన నేర్పడు-కోరినట్టి-

గ్రూపు – రక్త బాంకు సమకూర్చు చుండు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

23*

రక్త ధాతయే నిజమగు ప్రాణధాత!

దానవీరుడు భువిరక్త ధాతయగును!

రక్షకులు బంధుమిత్రాది లక్షజనులు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

24*

అన్న ధాతయు-సేద్యంబు నలరు ఫలము-

దానమును జేయు-ఆరోగ్య ధాత-వైద్య-

సేవ బ్రతికించు-వైద్యంబు చేత పుడమి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

25*

వైద్య నారాయణుని దయ వరముగాగ-

సాగు పూర్వాధునిక వైద్య శాస్త్ర ఫలము!

నౌషద క్రియల రోగ నివారణంబు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

26*

వైద్య శాస్త్ర ప్రక్రియలందు-వరుసక్రమము!

రుజ పరీక్షలౌషద సృష్టి-రుధిర పుష్టి!

పౌష్టకాహార సలహ సత్పౌరవృద్ధి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

27*

వైద్య విద్యల దానంబు వసుధ గలుగు!

గురువులే ధాతలుగ సమకూరు విద్య-

పుడమిలోన విద్యాధాత పూర్ణ కృపయె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

28*

వైద్య దాత సేవాస్ఫూర్తి వైద్యమందు-నౌషదములున్నను చికిత్స-అవసరముగ-

రక్తమందక పోయిన రిత్త కృషియె!

29*

మనుజులను గావ దైవంబు మనుజులందె-

మనుజు రూపంబు దాల్చియు-మనుచు నుండె!

వైద్యుడో-రక్తదాతయో? వారసుండొ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

30*

మనుజులను బ్రోవ ధర్మంబు మహిని వెలయు,

హాని మాన్పియు బ్రతికించు హాయి గూర్చు! ఆత్మ బంధువో-మిత్ర మహాత్ముడొకడొ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

31*

రక్షకుడు దైవమే-వైద్యుడై రక్షసేయు!

రక్త దాతయై బ్రతుకిడు, శక్తినొసగు!

ధర్మమే ధనధాతగా దారిజూపు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

32*

మనుజులనుగావ నీతియు మహినివెలయు! పుణ్యవ్రతమందు జనులంత పులకరింప-

భువిపరోపకారముగూర్చు భవితనిచ్చు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

33*

రక్త ధాత సురక్షిత రక్తమొసగి-

వైద్యధాత సురక్షిత వైద్య సేవ-

లో సురక్షితోపకరణ లొసగనయము!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

34*

ధాత యిచ్చు సురక్షితధార రుధిర-

మును సురక్షిత పరికరములను జేర్చి-

రోగి కెక్కించవలె, వైద్యుడోర్పుగలిగి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

35*

అర్హుడొసగ నపుడె-నిల్వ రక్త నిధులు!

మలిన రక్త బేపారముల్ మచ్చదెచ్చు!

మంచి తరుణము మించిన మరణమగును!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

36*

రుధిర ధాత పరీక్షచే రుజువు పడియు-

అర్హతాపత్రమును బొందు-అదనుకంది-

ప్రాణదానమ్ము జేయు తా పవిత్రుడగుచు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

37*

రక్తమిడగ ధాతకు లోటు రాదు పైగ-

నూత్న నెత్తురుత్పత్తియై-పుష్టి కొలది-

నూతనోత్సాహమును గల్గు-పుణ్యమనగ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

38*

గాలి లోపింప భువి సుడిగాలి నిండు-

నేర్పు జల్లుచుండగ నూరు నీటిచెలిమె!

పౌష్టికాహారమున- రక్త ప్రాభవంబు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

39*

క్రొత్త రక్తంబు వెనువెంట కొసరి కలుగు!

మూడు మాసాల వ్యవధిలో ముదము గాను-

రక్త దానంబు జేయునర్హతయు గల్గు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

40*

నీరు పల్లమెరుగునంద్రు-నిజము-దాత-

రక్తమిడ ఖాళి పూరించు శక్తియుతుడు!

పుష్టినిడు తిండి విశ్రాంతి పూటజాలు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

41*

అవని గాయపడిన రుధిరార్థిగోలు-

పోయినట్టి రుధిరమును పూని మరల-

నిపుణుడెక్కించి ప్రాణంబు నిల్పుచుండు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

42′

కోలు పోయిన రక్తంబు కొనుటకైన-

మరల పూరింప నితరత్ర మార్గమేది?

ధాత రక్తంబె జీవించు దారిజూపు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

43*

అర్హతయుగల్గ, దయగల్గ-అడిగినంత-

రక్తదానంబుజేయగా రాదు లోటు!

మేలునుభయత్ర సంశయమేల? తగదు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

44*

జాలిగలిగి క్షతగాత్రు చాలినంత రక్త నిధిగూర్ప ధనదాన రాహగలుగ-మేలునుభయ తారకమగు, మెప్పు గలుగు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

45*

ధన్య జన్ములు భువిరక్త దాన పరులు-

నిరత వితరణ శీలురు-వివిధ దాన-

ములనుజేయుట కెప్పుడు ముందునుంద్రు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

46*

నేత్ర ధాతలు, నవయవ-నెత్రుదాత-

లన్నదాతలు-ముక్తియే లబ్ధిగాగ-

సన్నిధిజేర్చి మన్నించు సామి కృపను!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

47*

నిరత వితరణ శీలురు-నీతి మతులు-

దేహి – దేహతత్వముదేల్చు-ధీవిశేష-

ఈవితో తావులీనుచు నింపుగొంద్రు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

48*

రుధిర దానవీరుడె భువి సుధలు గురుయు!

నేత్ర దానవీరుడు చను-నేత్రముండు!

తాసజీవుడైగాంచు పిదప తరంబు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

49*

వెలయు సకలదానాలలో వేడ్కవెంట-

సుళువుగా రక్తదానంబు సుఖమునిచ్చు!

వేయి నోళ్ళపొగడ్తలు వినగముదము!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

50*

బ్రతికి రక్తదానమునొక్క బ్రతుకు నిలిపి-

చనియు నేత్రదానముచేత శాశ్వతముగ-

వెలుగ తనకనుల్ స్ఫూర్తిగా వెలయు కీర్తి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

51*

రక్తమవయవదానాలు రక్షితముగ-

మార్పడికి సురక్షితమైన మార్గగతిని

దాత కీర్తిదేహముదిర్గు-ధరణిమీద!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

52*

తనువువీడియుచను నాత్మ-ధాతపేర-

మరొక తనువును నేత్రాది మార్గ గతుల- ధాత జీవించు పుణ్యంపు ధనము గొనును!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

53*

వరుస దానాలలో రక్త వారసత్వ-

గ్రూపు ప్రవహించుటయెవింత-గొలుపుమరొక తనువులో సామ్యతగ రక్త తరణి సాగు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

54*

వరుస వ్రతమయ్యెదానముల్ వసుధయందు

నాడు నేడును రేపట నడవడికగ- నేత్ర దానము కన్నప్ప నేమమయ్యె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

55*

వరుస రక్తదానము క్రొత్త వ్రతముగాగ- మూత్ర పిండదానాదులు ముందుబడియె!

మరొక వడవోత పిల్టరు మార్చినట్లె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

56*

మంచి గుణమె కులముగాగ మనసు విరిసె!

మానవతయె సమ్మతముగా మనుజు కీర్తి-

విధిగ విశ్వ గ్రహాంతర వీధి సాగె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

57*

సేకరణ పరికర సృష్టి చేత-సులభ-

మయ్యెను పరీక్ష నాళిక మార్గమందె-

నూత్న వ్రత పరికర సృష్టినుర్వి గలిగె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

58*

సులభసేకరణలు సాగె-సునిశితముగ-

సున్నితపు మార్పిడి క్రియ సూత్రబద్ధ-

నిపుణతలుగల్గె! చిటికెలో నిచ్చె ఫలము!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

59*

రామ రక్ష కంపూటరు ర్యాము రక్ష –

గణన గలిగె సురక్షిత గ్రహణ శక్తి!

అతికి, విడదీయు నైపుణ్యమతిశయించె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

60*

రక్తధాతలుమెచ్చు మార్గమున సాగు-

నేత్ర ధాతలు మెచ్చు త్రినేత్ర సములు-

వైద్యనారాయణులు-శస్త్రవైద్య ఘనులు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

61*

శివుని దీక్షకంపూటరు చిప్పుగాగ-

భువి సుభిక్షమేకాగ్రత బూను క్రియల-

ఆస్తినాస్తియు, సుకృతమాసక్తిగూర్చె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

62*

గుప్తమౌ సహజ ప్రకృతి గుణవిశేష

గణన చేరువయ్యెను, సైన్సు గలుగు మేలు-

భవిత దర్శించు శోధనల్ ప్రస్తుతంబు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

63*

ధనము కన్నను విజ్ఞాన ధనము మిన్న! కులము కన్నను నరుని సద్గుణమె మిన్న!

దానముల మిన్నగ రుధిర దానఫలము!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

64*

మనుజుడొంటరి మార్గాన మనగ లేడు!

ఇరుగు పొర్గునోర్వగలేడు హితవటంచు!

జీవితము గడ్పు సరి సంఘజీవిగానె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

65*

సంఘ కట్టడి శాసన చట్ట పరిధి-

మీరజూచి నీతినిదల్చి మితముగూర్చు-

క్రియల కొనసాగు తగు పుణ్య కీర్తి కాంక్ష!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

66*

చట్ట పరిధి, సేద్యము వైద్య చరిత పుటల-

సాగుటే నీతి యుపకార సాధనముల!

తన్ను మాలిన ధర్మంబు దలచునెటుల!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

67*

శ్రేష్ఠ సహజీవనమె దేశ శ్రేయమయ్యె!

చేతలో మాటలో గనదగు క్షేమమయ్యె!

తలచు సాధన త్యాగమై తళుకుమనియె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

68*

మాట దప్పుట మరణ సమానమనిరి!

సర్వమును వీడి సాగిరి సత్యవ్రతము!

దాన ధర్మంబులే ముక్తి దాయకకముగ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

69*

శ్రద్ధ గలిగిన త్రికరణ శుద్ధి గలుగు!

జీవితత్వమెరిగి పుణ్య ప్రీతి గలిగి-

దానికై దానమొనరించి దాతలైరి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

70*

ధర్మ యుక్తమై పురుషార్థ దారి సాగి!

జన్మ సార్థకమగు నట్లు-జగతి బ్రతుకు!

విజ్ఞులును దానపరులైరి విశ్వమందు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

71*

పూని పురుషార్థ సాధన స్ఫూర్తిగొనుచు-

భారతీయపురాణాల బాట నడచి-

అడిగినది లేదనకదానమిడగ జనిరి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

72*

భక్తి శ్రద్ధల దురితంపు భయము వీడు-

భయమువీడగ మదిమాయ భ్రమలు దొలగు!

భ్రమయు దొలగిన ధనపాతరలను బంచు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

73*

వెళ్ళిపోవునాత్మయు దేని వెంటగొనదు!

వదలి పోయినదెవ్వరి వద్దజేరు!

ఎట్లు వినియోగమగు -ఆత్మ లెక్కగొనదు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

74*

నూరు చేతులనార్జించు సొమ్ములెల్ల –

వేయిచేతుల పంచగా వెలయు కీర్తి!

వితరణము విత్తమున్ననే వేడ్క సాగు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

75*

వయసు పద్దెనిమిదేడుల వారు మొదలు-

అరువదేండ్ల లోపున్ననే-అర్హులంత-

పూని రుధిరదానము జేయ పుణ్యమగును!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

76*

సేకరణ నియమంబున-చేరువారి-

అర్హతలుజూచి యారోగ్యవంతులైన-

ధాతలను ప్రోత్సహించు విధానముండు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

77*

రగ్మతలు గల్గు వారలు రుధిరమిడగ-అనుమతించబడరు-తగునర్హతలను-

టెస్టు జేసియే వైద్యులు స్వీకరింత్రు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

78*

రోగ రహితులైన లేదు రోకుటోకు!

బలము పుష్టి తుష్టియు గలుగ ఫలము మెండు!

అర్హతలులేని రక్తంబు – అసలుకెసరు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

79*

అనుమతిని బట్టి సేకరణానుకూల-

చోటులో రక్తమునుదొర్కు-వైద్యు-

చీటియాధారముగని దెచ్చేటి వీలు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

80*

ప్రభుత యనుమతిగల రక్త బాంక్ సురక్ష-

హామిగలిగిన లేబిలు వాస్తవములు-

గ్రూపు తేదీ వివరముల, గుర్తులుండు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

81*

వ్యాధి గ్రస్తులును-దురలవాటు రోగు

లర్హులే గారు బలహీనులైనవారు-

రక్తమిడుటేల? యత్నింప రిక్తశ్రమయె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

82*

సులభ సేకరణార్థమై జూచు విధము-

దాత వైద్యులు నుభయత్ర తగినరీతి-

సేవలు లభించు- ఎన్నెస్సెస్ శిబిర వసతి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

83*

వైద్య సమ్ముఖ నికషల వైనమరసి-

నిపుణులు సురక్షిత నిధి స్వీకరింత్రు!

సేకరణలొప్పు ధాతల స్వేచ్ఛవెంట!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

84*

పదిల పరచని రక్తంబు పాడుగాగ-

భద్రతా సీలు లేనిది భయముగూర్చు!

విశ్వసించక సుధయైన విషసమంబె!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

85*

ఎయ్డ్సురుజనిరోధక శక్తి నెండగట్టు-

మూలకణశోధనలు సాగె మొలక దశనె!

కల్తి రక్తాన నన్నింట గలుగు హాని!!!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

86*

కల్తి రక్తంబు ప్రాణాంతకంబుగాన-

ముందు వెన్కచరిత్ర సమూలమెఱిగి-

సీలు లేబిల్లు జాగ్రత జేయమేలు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

87*

వలదు-ఊహలపోహలు-వైద్యునాజ్ఞ-

బూని,యాతనియాధ్వైర్యముననె రోగి-

రక్తమెక్కించువిధులు జాగ్రత్తయగును!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

88*

వివిధ సంస్థల స్వచ్ఛంద విశ్వరూపు!

జూడనాశ్చర్యమే-ముందుచూపు ప్రభుత-

రక్త-నిధుల బాంకర్లదే రామరక్ష!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

89*

రక్తమివ్వవచ్చును-శిబిరాలు జేరి-

వైద్యనిలయాల- నిర్ణీత వార్డులందు

నిపుణులుంద్రు సేకరణలు నెఱపుచుంద్రు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

90*

రక్తమివ్వగా రావచ్చు రాక పోక-

ముప్పది నిమిషాలె బట్టును-ముదముగాను!

పుష్టికరమైన తిండిచే పూర్ణ సిద్ధి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

91*

మందులవసరమే లేదు ముందు వెనక-

జాగ్రతల్ గూర్త్రు వైద్యులు జాలమేల!

రక్త దాన ప్రక్రియలు సురక్షితములు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

92*

సేకరణ పావులీటరే స్వేచ్ఛవెంట-

బొప్పి కట్టదు, సూదంటు నొప్పిరాదు!

రికవరి సులభసాధ్యము ఫికరు లేదు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

93*

రక్త దానము క్షతగాత్రు రక్షగాగ-

జాగు సేయక పొందు మా యాగఫలము!

పుణ్య యోగమిదియె! జన్మ పుణ్యధనము!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

94*

ఆయురారోగ్య దాయక మమృత సేవ!

తనువు చెలిమెనూరెడు రక్తధార నూత్న-

చేతనావృతాంతర శక్తి తేజరిల్లు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

95*

ఆపరేషనులో రుధిరార్థులకును-

వరుస బాటప్రమాదాల పరిసరాల-

గాయపడిన వారికి, మేలు గలుగు చుండు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

96*

రక్షకులకు కుటుంబ సంరక్షణేది?

సైనికులకు రుధిరావసరము బెరిగె! ధాతలెందరో దీనికై తరలవలయు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

97*

రక్త దానముజేయు కర్తవ్య విధికి-

భరతమాత యాజ్ఞ ప్రజా భారమయ్యె!

జాతి గౌరవశ్రీ నిలుప-జగతి కీర్తి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

98*

అధిక కీర్తిమంతుడు ధాత-అర్హడైన

అన్న దాత – విద్యాదాత ప్రాణధాత!

విశ్వ రూపుడే విజ్ఞాన విత్తధాత!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

99*

అర్హుల బరువు కేజీలు నలుబదైదు!

వయసు పద్దెన్మిది మొదలు -అరవదేండ్లు!

ధాతలారోగ్యవంతులై దనరవలయు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

100*

రక్త హీనుతరమ? జీవి రక్షజేయ!

కండగలవాడె మనుజుడు-అండదండ!

రక్త పూర్ణులే-రుధిరార్థి రక్షరేఖ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

101*

రక్త బలమున్ననాటిదే రంగుపొంగు!

బ్రతుకు రక్తహీనతచేత బడలుదాక-

ఉన్ననాటిదానము-లేమినుపకరించు!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

102*

ఎట్టివారైన నాపద మెట్టియుంద్రు!

ప్రాణధాతను మరువదే ప్రాణియైన-

రక్తదానంబుజేయ శ్రీరామరక్ష!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

103*

రక్త ధాతకు భీమాది రాయితీలు!

ఐదు వేలు రిస్కున, నిర్వదైదువేలు!

టాక్సుమాఫియు-సత్కీర్తి టాకు కీర్తి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

104′

యువత దానధర్మాసక్తినుద్యమింప-

హెల్తు శిబిరాల నుపకారమెచ్చు-చూడ-

నేటియువత రేపటిపౌర నేతలనగ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

105*

బ్రతుకునావ చుక్కానిగా, ప్రభుత గలుగ-

యువత జాతీయ సేవచేయూత గాగ!

ప్రజల మేల్గోరు జాతీయ పథకసేవ!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

106*

జనని, జనకులపైభక్తి జనుల భక్తి-

దైవభక్తి సద్గురు భక్తి అతిథి భక్తి-

దేశ భక్తి ధాతనుతీర్చి దిద్దు శక్తి!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

107*

జగతి ధాత పాత్రనుమించు జన్మకేది?

సూత్రధారి నాటకలీల-సూచి, ధాత

దైవ ప్రతినిధి-సంస్కృతి దనరు విధుల!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

108*

శుభము దాతృత్వమును మెచ్చు శ్రోతలకును!

శుభము శతకపాఠకులకు సుఖము శాంతి!

శుభము రుధిర ధాతలకు శుభము-శుభము!

తిరుణహరి విను భువిదానవీర మహిమ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page