top of page
శ్రీ రామనరసింహనీకునీరాజనములు శతకము
(తే.గీ.)

1*

శ్రీనృసింహదేవ! తనువు చిత్తములను

శాశ్వతమ్మునెఱుగ లేను సాగు ఆత్మ

నేనుగా దెల్పు నీగీత నిత్య సేవ్య!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

2*

నేను దేహంబుకానని ఎఱుకగల్గె

నేను మెదడుగానేకాను వెలుగునాత్మ

పుంజమంచు సద్గురురాయ పూజ్యవాక్కు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

3*

ఆత్మ నేనైతె నావెగా తనువు మనసు!

మనసు ఆంగ్లాన మైండుగా మరొక పదము!

అరయగానాత్మలో పరమాత్మ వీవు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

4*

తనువు గుడిలోన భద్రమై దనరు మనసు

మనసుగుడిలోన దీపమై మసలునాత్మ

ఆత్మగుడిలోన నీయున్కి తాత్వికంబు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

5*

ద్వైతమద్వైత వైశిష్ఠ్య మైన దారి

తేలిపోయెను నీదివ్య తేజ మహిమ!

గురునిదయనాజ్ఞ చక్రాన గుర్తు గనగ

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

6*

ఎంత తరచినా విన్నను ఎఱుక గల్గ

గగనమేయయ్యె నీభక్తి గమన యోగ

మందు నిశ్చలముగా సుంత మనసు నిలిచె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

7*

కదలనిమదిలో అరిషడ్వర్గమ్మునణగు

దానికైయింద్రియమ్ముల తగుగకట్టి

అంతరింద్రియమదినిల్ప నగును సుళువు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

8*

మనసు నిల్చి సంకల్ప సమాదిదనర

నీదు సమ్ముఖమున బతుకు నిగ్గుదేలు!

ఆత్మనంతర్ముఖముగాగ నడుప వీలు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

9*

సాగు నిరంతర సాధన సంయమనము

సంయమిగజేయు తనకుతా సమయమంత

మిగులకుండ గడపుటయే మిగులముదము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

10*

పరమ బ్రహ్మ ఆనందము పైన నీదు

సచ్చిదానందమౌదీప్తి సద్గతిగను

జన్మరాహిత్యమౌనాత్మ జాగృతమ్ము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

11*

దేవ!దేవాదిదేవుడ! దివ్యతేజ!

బాలప్రహ్లాద రక్షక! భక్తవరద!

కనక కశ్యపుజీల్చితో గడపపైనె!

హారతిగొనుమ నాంపల్లి నారసింహ!

12*

కశిపు వరగర్వమునబొందె కావరమ్ము

తానెదైవంబుగా గొల్వ దగినవాడ

ననుచు శాసించె హింసించె భువనతతుల!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

13*

సోదరునిజంపె హరియని శోకయుక్త

మూర్ఖతయుగల్గ ముల్లోక ములను జుట్టె!

లేడు హరియని తనపాట పాడుమనియె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

14*

గుడిని పూజలు తనవనె గురుల చేత

బడిని పఠనపాఠ్యము తనపలుకుబడిగ-

గురుల శాసించె తనయుని గూర్చి వగచె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

15*

ఒక్కగానొక్క కొడుకని మక్కువెసగ

శత్రు పాటబాడకుమని చాలదెలిపె

బ్రహ్మ జనకనిన్ ద్వేషించె పద్మనాభ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

16*

హరిహరనీదు నామంబు నడ్డుకొనుచు

కొడుకు నిందించె చెరబెట్టి కొట్టిజంప

భటులశాసించె చావని బాలు డాయె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

17*

వరుస శిక్షలమలుజేసి వల్లగాక

చేరి భటులంత మ్రొక్కిరి చేతగాక

తానెసంహరింప దలచి తండ్రి గుమిలె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

18*

ఆయుధముగబుట్టె కొడుకు హరినిగొలిచె!

మానసికచిత్ర వధ పితా మాతలకును!

నిన్నుజూపగా బాలుని నిగ్గదీసె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

19*

అంతటను హరిగలడన్న మాటమాను

స్తంభముననున్నడాహరి డింభకుండ?

యనగ వల్లెయనెసుతుడు నమ్మకముగ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

20*

ఒక్కవేటున కంబంబు వ్రక్కలయ్యె

ఉగ్రనారసింహాచ్యత రూపు వెడలి

రాగ ఖలుడహో బిలమున దాగెనంత!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

21*

వెంట దరుమితివట దేవ వెఱచె జగతి

అథము పీడదొల్గునటంచు ముదముజెంద-

బిలముజొచ్చి గర్వినిమరి పిలిచి నావు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

22*

పిరికి పంద పూర్వము మర్చి ప్రేలెగాని

జయుడు వేచెనీ ద్వారాన సత్వరంబె

కశిపు దెచ్చెయాతనిఇంటి గడపపైకి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

23*

హే నఖాయుధా కంబజా కేసరీంద్ర!

జీల్చితి వతిభయంకరముగా జీవతతులు-

మేలుమేలన దేవతల్ పూలుగురియ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

24*

సంధ్య సమయమూ శత్రువు సమరమనడు

కుక్కినకణజీవిగ జచ్చె క్రూరబలుడు!

భయము చేకంపమొందెను బాలుడంత!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

25*

నిన్ను శాంతింప జేయగా నెదరువచ్చి

నిల్చిమొక్కువారెవ్వరని సురలంత-

లక్ష్మిదేవిని రప్పించి లబ్ధిగనిరి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

26*

లక్ష్మి వేడగా శాంతించి లయమునాపి

బాలునెదజేర్చి దు:ఖమ్ము భయముబాపి

కరుణ దీవించితివి పొగడెలోకమ్ములన్ని!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

27*

రాజ్యములుసాగె భక్తిపురాణనీతి!

లోభికై వరాహస్వామి ప్రాభవంబు

క్రూర గర్వికై పూర్ణావతార సృజన!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

28*

దేవ బ్రహ్మమహేశ్వరుల్ తెలియరైరి

బ్రహ్మవరవిరుగుడురూప బవర చర్య-

వామనావతారానికి వరుస సూచి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

29*

మనిషి మృగము చెరిసగం మహిత విజ్ఞ

మూఢవిశ్వాశముల భక్తిముక్తిదమ్ము!

రామకృష్ణావతారాల రాణకెక్కె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

30*

క్షితిని నవనారసింహ సుక్షేత్ర వరుస

నొకటి యాదాద్రి పరిసర ప్రాకటములు

వివిధ తీర్థంపు జాతరల్ వెలసె సామి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

31*

పుణ్య పూరి జగన్నాథు పూర్వచరిత-

పురమునంటురోగము ప్రబల పూని యోగ

మూర్తివైనీవు వెడలగా ముప్పు దప్పె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

32*

పెద్దలానతి నిప్పుడు పెద్ధ సేవ

సాగెను కరోన కణ జీవి సమసిపోగ

వేగ రావయ్య యాదాద్రి యోగమూర్తి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

33*

జ్వాల నరసింహ వైరసుల్ కాల్చవేమి?

యోగ నృహరి కరోనార్పె యోగ్యతొసగు!

పంచనరసింహ! మాలోన మంచిబెంచు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

34*

గండబేరుండ నరసింహ గాయి గత్త

రలను మించెకణవిష రజము నరుని

లోనదూరెనా మరణమే లోకులకును!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

35*

యజ్ఞ నరసింహ పరదేశ విజ్ఞ మాయ

అజ్ఞులనుజేసె భారత ప్రజ్ఞ మరచి-

శుభ్రతనుగూర్చు మారోగ్య సూత్రగతుల!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

36*

ఉగ్రనరసింహ నవరుజనిగ్రహించు

శ్రద్ధ శుభ్రతరహితుల వద్ద వృద్ది!

శ్వాసనాళాన నిదిదూరు చంపివేయు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

37*

లక్ష్మి నరసింహ వైరసు లక్షణాలు

స్ఫష్టమొనరించు తగురీతి శాస్త్రవేత్త

టీక గనిపెట్టుటకిడు తదేకదృష్టి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

38*

శ్రీవరాహనృసింహమా భావమందు

విశ్వమానవకళ్యాణ విత్తనంబు –

నాటి వటముగాగ మదినలరజేయు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

39*

స్వామి కోటంచ నరసింహ సజ్జనాళి

పుణ్యగణననచే శక్తిపెంపొందజేసి-

రుజనిరోధించి సకలమున్ బ్రోవరమ్ము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

40*

దేవ సంతాన నరసింహ దీనబంధు!

కలుష కాళీయమర్ధనా కరుణ సిందు!

మందు లేనిరుగ్మతబాధ మాన్పుముందు-

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

41*

కణజ భూతపిశాచ రాకాసిమూక

రక్త బీజుని వలె వృద్ధి రాక పోక

నరుల నంటనీయక వేగనణచరమ్ము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

42*

జగతినాటికినేటికి జరుగు చరిత-

మునుల జాగ్రతల్ ప్రతియింట ముదమొసంగె!

సాగెనాచారవిధులట్లు సంఘమందు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

43*

పాత రోతగా కాలము పరుగులెత్తె!

క్రొత్త చేర్పున మంచివి కొన్ని తొలగి

కొంతచెడుదూరె కొందరి కోర్కెదీరె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

44*

శుచియు శుభ్రత పూర్వక శుద్ధి మడియు

చాందసముగాగ పెద్దల చాటు చెడుగు

క్రియలనాధునికతచాప కిందనీరు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

45*

రాసుకొని పూసుకొనితిర్గు రాత్రిపగలు

ఐక్యతనుదెల్పె క్రిములకునాటపట్టు

గాగరోగములుపంచుకొనగల్గు బతుకు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

46*

అంటురోగహేతు పరస్పరమంటుకొన్న

గజము దూరముండక ముప్పు గలుగనుండె!

పాతక్రొత్తలుకలబోసె బతుకు దెరువు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

47*

భుక్తి భోగముతోపాటు భక్తి యోగ

మవసరము సదాచారముల్ మానవతయు

సంస్కరణపూర్వకముగను సాగె జగతి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

48*

ఆపద మ్రొక్కు సంపదనాదమరచునట్లు

పాతగొప్పలు నూత్నవివాదములును-

భ్రష్టుబట్టించె శుభ్రతల్ భ్రమగ మిగిలె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

49*

ఏది మంచియో చెడుగేదొ ఎఱుక జేయు

ధర్మ సూక్ష్మమార్పులకవతారమెత్తి-

రమ్ముదేవ నీగీతార్థ మిమ్ము మరల!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

50*

ఇంటనాశ్రమ జీవన నియమవిధులు-

వైరి వైరసు భయము నీభక్తి ధైర్యమిడగ

కాలతీర్పున నరజాతి కదల నిమ్ము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

51*(contd. భాగముతో సంపూర్ణం)

కాళికాదేవిచేదుష్ట కణజ మూక-

రక్త బీజుని పేరవిముక్తమాయె!

మరలవచ్చెనీనాడిట్లు మనిషిజొచ్చె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

52*

లీలవెయించు సింగోట లింగరూప!

సూక్ష్మవిషబీజ విర్గుడు సూచినిమ్ము!

తిర్గుబోతుతనంబాపి పెరుగనిమ్ము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

53*

సురస సింహికలనుగూల్చి శూరహనుమ-

తల్లి సీతమ్మ జాడను తమకుదెలిపె!

యాదమునిగొల్చె కలిసంతు యూధమణచె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

54*

మొదటి తాతలమడి నాటుమోటుగాగ

ఎంగిలిభుజింపు నవనాగరికత నీటు!

దీని వంచిచక్రముదిప్పు దీనపోష!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

55*

ఏమి మిగిలె సర్వస్వమునీల్గె మట్టి

చెట్టునాటినయట్లిమ్ము చేతనమ్ము!

సాధు సంస్కృతి కట్టడుల్ సాగనిమ్ము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

56*

మతమతంబున పరిశుద్ధి మాటగలదు!

హితహితంబున శుచిశుభ్ర రీతి గలదు!

ముడియు బడెమడి భుక్తికి ముక్తిదాక!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

57*

పైమెరుగుకోసమై బ్రతుకు పడవమునిగె!

కొంప దాటగ నేరమై రొంపదాడి!

ఆత్మ – పరమాత్మ శోధన నలరనిమ్ము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

58*

వేషబాషలు దేహాళి వేడ్కవేరు!

బుద్ది సుద్ధుల విజ్ఞాన వృద్ధి వేరు!

అంటరానివంటగ హాని తంటదీర్చు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

59*

అదియునొక్కటమంచిదై ఆత్మ భోధ

బుద్ధి వచ్చెను శుభ్రతల్ వృద్ధిజొచ్చి

కల్మశముగడ్గ సాగెనో కల్కిరూప!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

60*

ముక్కుమూసుకు కూర్చొని ముదముబొందు

బ్రతుకు-శుద్ధితిండినిగూర్చి భయముదీర్చు!

కడప దాటక ధ్యానింతు కంబజాయ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

***********************

61*

పుడమి సారవంతముజేయు పూని సేంద్రి

యములు గూడగట్టియు పెంట జార

గొట్టి పొలమును పండించు గొప్పలేవి?

రామనరసింహనీకునీరాజనములు!

62*

పొలము బలముబీల్చెడు పంట ప్రోదిజేయ

విషరసాయనములచేత వికట సేద్య-

పైక మునుగూర్చ మోజాయె! పరమ పురుష!

రామ నరసింహ నీకు నీరాజనములు!

63*

రుగ్మతలు జేరె నౌషద రుజువు లెగసె

మూలికౌషద ములుపిరముగను గొనగ

పేదలకు నీదునామమే పెద్ద దిక్కు!

రామనరసింహనీకునీరాజనములు!

64*

పాతరోతంచు నూత్నముల్ పరగవృద్ధి

విషరసాయన ధినుసుల నేమి మేలు

వాస్తవము దెల్పి బ్రోవుమా వాసుదేవ!

రామనరసింహనీకునీరాజనములు!

65*

అవని ఆశానిరాశలు నవసరంబె!

మానసికము శారీరకమందు నలత

శాంతిలేక సాగదు కదా సగటుబతుకు!

రామనరసింహనీకునీరాజనములు!

66*

ధనమె మూలమై మేము నీధ్యాసమరచు

మాట నిజము నీదగుభక్తి మార్గ గమన

మందు సాగుబాటును సాగ మంచిజరుగు!

రామనరసింహనీకునీరాజనములు!

67*

రోయు డబ్బు కోసము సదా భోగి పిదప

రోగియై డబ్బునవసరముగనురోయు

దారి ఎదురేగిదోయును ధనపిశాచి!

రామనరసింహనీకునీరాజనములు!

68*

కర్మ కరిగించి భక్తుల కరుణ జూపు

కాంక్షనీయందు మరలించి క్రాంతి నొసగు

భక్తి గలిగించి వరముక్తి బాటనడుపు!

రామనరసింహనీకునీరాజనములు!

69*

పుడమి కాలుష్య భరితమై పుట్టె విషము

నరుల విరబారు చుండెను హరిహరుండ!

లభ్యమొనరించు శుద్ధి జనాభ తిండి!

రామనరసింహనీకునీరాజనములు!

70*

తెలిసినాకొద్ది మాకేమి దెలియదనెడు

విషయమే దెల్సెనని నాటి విజ్ఞులనిరి!

కలుష విష – విరుగుడు వృద్ధి కలుగనిమ్ము!

రామనరసింహనీకునీరాజనములు!

71*

కల్తి దోషంబు మిక్కిలై కలియుగాన

కలుషములకు తోడయ్యె కలిమికాంక్ష!

వెడలు విషవైరసుల నుండి వేగగావు!

రామనరసింహనీకునీరాజనములు!

72*

కల్గు భోగాలు రోగాలు కలహకలత

వివిధ సరిహద్దు లనుమీరు విధుల ఘోష!

ధర్మహానిచే గలిగెడు దాడి గనుము!

రామనరసింహనీకునీరాజనములు!

73*

వైద్యమున గల్గు ఔషద వస్తు నికర

మందు కల్తి రక్తము కల్తి మాటెగాని

దాని సాగనీయని మంచితనమొసంగు!

రామనరసింహనీకునీరాజనములు!

74*

అసలు నకిలీలు అన్నింట అధికమవగ

మనిషి బ్రతుకు వాయిదా మాయమర్మ

మెరుగలేమయ్య మముబ్రోవు మేటివైద్య

రామనరసింహనీకునీరాజనములు!

75*

ప్రకృతి కాలుష్యమును జూడ బ్రతుకు భయము!

నీరు భూమివాయువు నింగి నిప్పుగూడ

కలుషములు జల్లె కృపజూపి గావుమయ్య!

రామనరసింహనీకునీరాజనములు!

76*

సులభమని కృత్రిమాలతో సుఖముబొంద

మొదటికేమోసమని తెల్సి ముదము వీడి

ప్రకృతి సిద్దంబులనుగోరి పరుగు సామి

రామనరసింహనీకునీరాజనములు!

78*

కడలి ఇసుమంత చెత్తైన కడకు ద్రోయు

నదుల కాలుష్యమున జనం నలుగు పైగ

చెత్త సమకూర్చు మా చిత్త వృత్తి మార్చు!

రామనరసింహనీకునీరాజనములు!

79*

చెట్టు గొట్టిన దేలిసెను చేటు విధము

మరలబెంచుయోచన సాగు మార్గమేది!

మొక్క వృక్షమయ్యెడు దాక మొరలు వినుము!

రామనరసింహనీకునీరాజనములు!

80*

వాయువోష్ణతతోప్రాణ వాయు దరిగె

దాని కొనిబీల్చుటకు కూడ ధనము లేమి!

పంచభూతకాలుష్యమై బ్రతుకగలేము!

రామనరసింహనీకునీరాజనములు!

81*

పంచభూతకాలుష్యాలు పాదుకొన్న

వింతరోగాలు ముసిరిన విశ్వజీవ

లయము సూచించు నరజాతి రయమె మొదలు!

రామనరసింహనీకునీరాజనములు!

82*

వేగ పరియావరణ శుద్ధి వెలయజేయ

బూనవలె మానవాళిదోబూచులాపి

గాసి దప్పు సమైక్యతన్ గదలమేలు!

రామనరసింహనీకునీరాజనములు!

83*

కలుష ధూమావృతము మేఘ గగన గామి

జీవజాలమూపిరులార్పు చీడపీడ!

శ్రమవృధయె పారిశ్రామిక భ్రమలు జూడు!

రామనరసింహనీకునీరాజనములు!

84*

ఆట పోరాటముల వైరసాటసాగె

చంపితాజచ్చు మూర్ఖత జరుగు చరిత-

భవిత పట్టింపులెవ్వారి బాధ్యతగును!

రామనరసింహనీకునీరాజనములు!

85*

బ్రతుకు శుభ్రత శౌచాది భద్రతనక

ఏమి లబ్ధి కరోన గాలేమిజేసె?

విజ్ఞ మూఢమునొకమట్టు వేసికట్టె!

రామనరసింహనీకునీరాజనములు!

86*

చాందసాలటుంచియు తుచ్ఛచందములను

కల్మిడినిదూరు వైరసుల్ కలతరేపె

మాయికామాయికులహాని గాయినాపు!

రామనరసింహనీకునీరాజనములు!

87*

మనిషి లోపదారులదూరు మారి వైరి

కణజములు ఎయిడ్స్ కరోన గాకనొకటి

సన్నిహితతత్వమెడబాపెనన్న నిజము!

రామనరసింహనీకునీరాజనములు!

88*

మానవుని యత్నమేముందు మంచిఫలము

పొందవలెనన్న నీకథా ప్రోత్సహింప

గజముదూరాన పరిశుభ్ర గతుల సేవ!

రామనరసింహనీకునీరాజనములు!

89*

ఏడ్సుబోలెకరోనలు లెక్కలేని

వైరసుల్ గెల్కి వైరులు పైకివచ్చి

గావుపట్టేరు దీనుల గావుమయ్య!

రామనరసింహనీకునీరాజనములు!

90*

నీరధినిజిల్కి నప్పుడే నీరజాక్ష!

అణగదొక్కిన కణమెట్లు అధిగమించె!

కట్టడినిజేయు నీబాణ ఘాతమొకటె!

రామనరసింహనీకునీరాజనములు!

91*

ఆత్మదృష్టి గీతార్థమై అవనిమ్రోగె!

ఊర్ధ్వ దృష్టి సాగెడుభోధలుర్వి గలిగె!

తుచ్ఛ దేహసౌఖ్యాదుల ఇచ్ఛలణగె!

రామనరసింహనీకునీరాజనములు!

92*

దూరమెంతైన మానసమ్ చేరువగును!

ఆత్మలోభావనారూపమైన దేహ

మూహసేయగ వీలుండు మురిపెమలర!

రామనరసింహనీకునీరాజనములు!

93*

నేరమెవరిదైనను ఫలము నేకపంక్తి-

కుడువ మర్యాద కారణమడుగ రిత్త!

జరుగునదిమానకుండనే జరుగుసృష్టి!

రామనరసింహనీకునీరాజనములు!

94*

స్వచ్ఛత స్వేచ్ఛ సొంతమై సాగునిష్ఠ

కష్టమగు కట్టడందురా కలియుగాన

కర్మ ఫలితానుభవసిద్ధి కలుగుచరిత!

రామనరసింహనీకునీరాజనములు!

95*

శుచియు శుభ్రత లేకున్న సూక్ష్మకణజ

విషము చేతికంటు మొదట పిదప గొంతు

నూపిరి తిత్తుల తనసంతునుద్ధరించు!

రామనరసింహనీకునీరాజనములు!

96*

మంచిచెడు తూకమేసియు చూచుటేల?

మంచిబెంచితే చెడుతొల్గుమార్గమొదవు!

రెంట సుఖదు:ఖములమధ్య రేఖ విధియె!

రామనరసింహనీకునీరాజనములు!

97*

భారమేమగు సామాజిక దూరగతులు?

బతుకవలెనన్న దప్పని భద్ర హితులు!

పరులకోసమైననసరె పరగు విధులు!

రామనరసింహనీకునీరాజనములు!

98*

ఎఱిగి పదిమంది కంటించు నేరమునకు

శిక్ష లిబ్బడిముబ్బడి సేయ మేలు!

మనికొకమాట జెప్పెడు మార్గముండు!

రామనరసింహనీకునీరాజనములు!

99*

తాత సంస్కార వాసన తండ్రి కొడుకు

మనుమలకువచ్చునాస్తుల మార్పిడట్లు!

నాటుమోటైన సరి భక్తినలర చాలు!

రామనరసింహనీకునీరాజనములు!

100*

దుడుకు నాగరికత గోతి దూకవలదు!

నూత్ననాజూకు కావద్దు నూతిపాలు!

బతుకుటె తెలివి తదుపరి బలిమి కలిమి!

రామనరసింహనీకునీరాజనములు!

101*

పశులనాశ్రయింపగమాని వైరసాళి

నరులపీడింపసాగుట నదుపుజేసి

భయముమాన్పించు తగినట్టి భద్రతొసగు!

రామనరసింహనీకునీరాజనములు!

102*

కలిమి తెలివి బలిమియధికారముండి లేమి

మంచిచెడునొక్క పెట్టున మలిచి మడయ

జేయు మహమారి బ్రతుకులన్ మార్చివేసె!

రామనరసింహనీకునీరాజనములు!

103*

సంఘజీవి నాగరికత సాగు దారి-

మూతబడిపోయె కలకలం ముగియుదాక!

మ్రోగె వెనుదిర్గి యోచించు వేళఘఁటిక!

రామనరసింహనీకునీరాజనములు!

104*

ఆయురారోగ్యభారతి- వేద భూమి!

సాంప్రదాయ సంస్కృతి సదాచార చరిత!

పసిడి పిట్ట ప్రపంచపు పటమునందు!

రామనరసింహనీకునీరాజనములు!

105*

నూత్న పోకడవైరసుకూతకర్ర-

గాన పాతపద్ధతి జీవనానుకూల-

విధులుచేపట్ట తగుమేలు విస్తరించు!

రామనరసింహనీకునీరాజనములు!

106*

నీపురాణ పారాయణ నిష్ఠ మేలు!

గుండె తేలికపడు వైరిగుట్టుదెలియు!

ఖడ్గములపాట డేగాట గలుగుధిటవు!

రామనరసింహనీకునీరాజనములు!

107*

భక్తి దర్శింప హృదయంబు భద్రమగును!

తీవ్ర రుజకు నీతీర్థమే టీక ఇపుడు!

బ్రతుకు జాగరూకతయె ప్రథమచికిత్స!

రామనరసింహనీకునీరాజనములు!

108*

శుభము భారతీయులకెల్ల శుభకరమ్ము!

శుభము విశ్వమానవులకు సుఖముశాంతి!

శుభము శతకపాఠకులకు శుభయశంబు!

రామనరసింహనీకునీరాజనములు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page