top of page

శ్రీ రాఘవ నీరాజన శతకము
(తే.గీ.)

1*

శ్రీశ! భద్రాద్రి నెలకొన్న చిన్మయేశ!

భద్రు డటగోరె నాలుగు బాహువులతొ

వెలసి తనపైన నుండగా వేడుకొనియె!

రామరాఘవా నీకు నీరాజనములు!

2*

తపమునకు మెచ్చి భద్రుని తనివిదీర్చి-

సీత వామాంకముననుండి సిరులు జింద-

వెలసితివి లక్ష్మణుడు తమ వెంటనుండ!

రామరాఘవా నీకు నీరాజనములు!

3*

అవనికొనసాగె బహుకాలాంతరమున-

మొదట పోకల దమ్మక్కమ్రొక్కులిడుచు-

గాంచినది నిన్ను గూడెంబు గదలిరాగ!

రామరాఘవా నీకు నీరాజనములు!

4*

ఆటవిక పూజలనుజేసి ఆరతిచ్చి

తాళఫలమిచ్చె దమ్మక్క తగినభక్తి

ఇప్ప పూప్రసాదముబంచి మెప్పుబొందె!

రామరాఘవా నీకు నీరాజనములు!

4*

దాపునే పుణ్య గోదారి దరసి పారు-

తీరమునసాగె సద్భక్తి తీర్థయాత్ర!

గాంచ – కంచర్ల గోపన్న కదలి వచ్చె!

రామరాఘవా నీకు నీరాజనములు!

5*

నిన్ను దర్శించిముదమందె నిత్య సేవ్య!

నీపురాణగానముజేసె నిండు భక్తి!

జనుల సహకారమున సేవ జరుపనెంచె!

రామరాఘవా నీకు నీరాజనములు!

6*

నీదు గుడిగట్ట సమకూర్చె నెన్నొ నిధులు

ప్రజల శ్రమదానమున పాలుబంచుకొనియె!

దివ్య ప్రాకారముననొప్పె దేవళంబు!

రామరాఘవా నీకు నీరాజనములు!

7*

వజ్ర హారాలు పతకాలు వరుస నగలు

కానుకలుగాగ జేయించె కనక సిరులు!

దాసదాసానుడై భక్తి దారి సాగె!

రామరాఘవా నీకు నీరాజనములు!

8*

నదిని లభియించె చక్రంబు నదియె శిఖర

మందు నిల్పగా నెంచి తాముందు నడిచి

ఇష్టమై తలమోసిప్రతిష్టజేసె!

రామరాఘవా నీకు నీరాజనములు!

9*

నిత్య కైంకర్యములుసాగు నిధులొసంగె!

నాటి వైభవ క్రమమెయీనాటికైన

ధరణి ప్రఖ్యాతిగడియించె దాసు చరిత!

రామరాఘవా నీకు నీరాజనములు!

10*

భక్తి పారవశ్యమె శత్రుయుక్తి కుట్ర-

తంత్రమయ్యెరాజోద్యోగి తలపు మరచె!

లక్షలారింటి కై ఖైదు శిక్ష గడిపె!

రామరాఘవా నీకు నీరాజనములు!

11*

అవని ఐశ్వర్యమయ రూప! ఆదివిష్ణు!

నాల్గు చేతుల నీరూపు నయన పర్వ-

ముగను దర్శించి భద్రుండు ముక్తినొందె!

రామరాఘవా నీకు నీరాజనములు!

12*

కోరినట్లుగ భద్రాద్రి కొండ కోన

రామనామ తారకమంత్ర ధామమయ్యె!

రామ దాసయ్యె గోపన్న రాగమెత్తె!

రామరాఘవా నీకు నీరాజనములు!

13*

భక్తిపాటలు పద్యాలు పల్లె-పల్లె

జనపదంబుల మార్మోగె జరుగు భజన

హనుమ మందిరంబులు హారతిడగ!

రామరాఘవా నీకు నీరాజనములు!

14*

అపర కుశలవ బృందాలె అవనిజుట్టి

నీదు కథ-గానములమది నిశ్చలముగ-

తమరి మూర్తిమత్వమె జనాదర్శమయ్యె!

రామరాఘవా నీకు నీరాజనములు!

15*

తండ్రి మాటకువిలువేదితతిమ కథల?

ఆలుమగలన్నదమ్ముల – అనకువేది?

ధర్మ పోరాటమున బుద్ధి దనరెనెచట?

రామరాఘవా నీకు నీరాజనములు!

16*

అరయ జనవాక్య పరిపాలనాద్బుతంబు-

సూచనాప్రాయముననేది? సురలు మునుల-

పుష్ఫవర్ష హర్షమెచట- పుణ్య చరిత!

రామరాఘవా నీకు నీరాజనములు!

17*

ఆలునీవెంటె-అనుజులు ఆజ్ఞలోనె-

భటులు-శత్రుసోదరులు నీభక్తి పరులె!

సరళరేఖగా నీధర్మ సరణి సాగె!!

రామరాఘవా నీకు నీరాజనములు!

18*

అనగననగ రామ మతిశయించె-

వినగవినగనీకీర్తియే విస్తరించె-

కనగ నీగుడిలేనట్టి గ్రామమేది!!!

రామరాఘవా నీకు నీరాజనములు!

19*

చూడగా వ్రాత శ్రీరామ చుట్టబడక-

లేఖలారంభమేకావు! లోకహితవె-

నీదు పేరట కొనసాగు నేటికైన!

రామరాఘవా నీకు నీరాజనములు!

20*

దొరుకదాకూడు నినుబిల్చు దారి యందు!

ఎదురులేని, బాణము-మాట- ఏకపత్ని!!

రక్షయనగ నీరక్షయే సాక్షమయ్యె!!!

రామరాఘవా నీకు నీరాజనములు!

21*

సూరు దాసుకబీరులు సూపినట్టి-

దోవలో దాసుసాహితీ సేవ సాగె!

దాశరథి శతకంబు,కీర్తనలు నిచ్చె!

రామరాఘవా నీకు నీరాజనములు!

22*

పూర్వజన్మకర్మమువెంట పురమువీడి

ఖైదిగా నిన్ను కీర్తించి కనగ వినగ

కనుచెమర్చని భక్తుల గనుట యరుదె!

రామరాఘవా నీకు నీరాజనములు!

23*

లక్షలారు చెల్లింపగాలక్ష్మణుండు

తమరు విచ్చేసినారనె తానిషపుడు!

తనువు నాత్మ వీడగబొందె దాసు ముక్తి!

రామరాఘవా నీకు నీరాజనములు!

24*

మరపురానిభక్తుడు జనుల మానసమున-

బ్రతికి యుండెనేటికి గుడి పర్ణశాల!

నగలు దాసుకీర్తినిజాటు నాల్గుదిశల!

రామరాఘవా నీకు నీరాజనములు!

25*

తమరి వరముచే గోపన్న అమరుడయ్యె!

గౌతమీ భద్రగిరియాత్ర ఘనతయయ్యె!

పుణ్య తీర్థమై క్షేత్రమై స్ఫూర్తి నొసగె!

రామరాఘవా నీకు నీరాజనములు!

26*

నాడు రామదాసుని చేత నడిచినట్టి-

సకల కైంకర్యములునేడు సాగె జనులు-

నీదు కళ్యాణమును గాంచ నిచ్ఛగింత్రు!

రామరాఘవా నీకు నీరాజనములు!

27*

విశ్వ కళ్యాణకారక విషయమయ్యె!

యేట నీదుకళ్యాణమే నేటిదాక-

వరుస నూరూర జరిపించు వాడుకయ్యె!

రామరాఘవా నీకు నీరాజనములు!

28*

అల్లుడేరాముడాబిడ్డయవనిజాత!

కొడుకు రామయ్య సీతమ్మకోడలట్లు-

జానపదపాటలు పల్లె జనులయింట!

రామరాఘవా నీకు నీరాజనములు!

29*

జరుగు నీతలంబ్రాలను గరుడ పక్షి-

తెచ్చి విడుచును నీపెళ్ళిదినముననుచు-

గుడిశిఖరంబు గమనింత్రు గుట్టుగాను!

రామరాఘవా నీకు నీరాజనములు!

30*

ఎన్ని పాటలు ముచ్చటల్ యెదలుపొంగ-

దండి విశ్వాసపూర్ణమై దనరు పల్లె పత్త-

నంబులే భారతావని నాడు నేడు!

రామరాఘవా నీకు నీరాజనములు!

31*

అమృత ఘడియలొతాతలునాలపించు-

కీర్తనలు గోపన్న త్యాగయ్య కీర్తి సిరులు

సాగె మేల్కొల్పు భూపాలరాగఝరులు!

రామరాఘవా నీకు నీరాజనములు!

32*

తత్వములుబాడగలదిక్కు తాతలేరి?

స్వీయచెరసాల బ్రతుకంత శిక్ష గాక-

గుండె విప్పిమాటాడని గొట్టు బ్రతుకు!

రామరాఘవా నీకు నీరాజనములు!

33*

తమిళుడైనను తెలుగున తాత్వికముగ-

జేసె కీర్తనల్ జగతి జేజేలు బలుక!

పరగ నీదయ తెల్గు సంపన్నమయ్యె!

రామరాఘవా నీకు నీరాజనములు!

34*

తేపతేపకు వినుటయు సైపలేని

తెల్గు శ్రోతల వశమౌనె తెలిసి దెలుప-

పరులె పలుమారు వినుచుంద్రు పరవశించి!

రామరాఘవా నీకు నీరాజనములు!

35*

రాగ తాళ పల్లవివాద్య రమ్యగతుల-

వీనులకు విందు త్యాగయ్య విరచితములు!

గాన గాంధర్వులునుమెచ్చు గమక ఝరులు!

రామరాఘవా నీకు నీరాజనములు!

36*

నీదు భక్తుడై త్యాగయ్య నియమ నిష్ఠ

భక్తి నిత్యార్చనగ తన శక్తికొలది-

గానమేజీవనముగాగ గడిపి చనియె!

రామరాఘవా నీకు నీరాజనములు!

37*

భారతీయబాషలనొక్క బాటజేర్చి-

జాతి నైక్యంబుగావించి జనుల బ్రోచె!

నీదు భక్తియే వరమయ్యె నిగమ వినుత!

రామరాఘవా నీకు నీరాజనములు!

38*

త్యాగరాజు గొంతున తెల్గు తాండవమ్ము!

ఆత్మ లోనీవుగా నీకథాత్మకముగ-

సాగుకీర్తన సాయుజ్య సాధనమ్ము!

రామరాఘవా నీకు నీరాజనములు!

39*

కీర్తనల రక్ష త్యాగయ కీర్తి భిక్ష!

అమర జీవిగా దీవించి యమిత ప్రేమ

శక్తి సామ్రాజ్యమిచ్చిన భక్త సులభ!

రామరాఘవా నీకు నీరాజనములు!

40*

తప్పకను నీకథా వ్రాయు తరతరాలు!

జనులకెల్ల నీదేస్ఫూర్తి జగతి కీర్తి!

కథలు కావ్య గానాదుల కలుగు ప్రగతి!

రామరాఘవా నీకు నీరాజనములు!

41*

నీదు భక్తినిమగ్నుడై నీమగతుల-

పెద్దలనుగూడి పదవుల పద్దు వదలి-

నీదునామకీర్తనలందు నిపుణుడయ్యె!

రామరాఘవా! నీకు నీరాజనములు!

42*

గీత గానసంగీతాది గేయకవియు

గాయకుడుగాగ సత్కీర్తి గడనజేసి-

నిత్య దారిద్ర్యమున నీడ్చె నిండు బ్రతుకు!

రామరాఘవా నీకు నీకు నీరాజనములు!

43*

తరచి రాగసంపదగూర్చి తాళమేసి-

త్యాగరాజు నీసద్భక్తి సాగి ఇంట

గెలువకనె గాయకులరచ్చ గెలిచె భువిని!

రామరాఘవా నీకు నీరాజనములు!

44*

గంగ పాలైన గ్రంథముల్ గాచి భక్తు

విగ్రహములతొ సహదేల్చి విజయమొసగ-

తెలుగువాగ్గేయకారుడై తేజమొందె!

రామరాఘవా నీకు నీరాజనములు!

45*

ధనము కన్నను శాశ్వత ధనము కీర్తి!

పుడమి నద్దాని సాధించె పుణ్యమూర్తి!

తేగరాజుచే వ్యాపించె తెలుగు కీర్తి!

రామరాఘవా నీకు నీరాజనములు!

46*

త్యాగరాజకీర్తన జేసె తాండవంబు!

నృత్యమై క్షేత్రయ పదము సత్యమయ్యె!

భళిరె! భక్తతుకారాము బంధముక్తి!

రామరాఘవా నీకు నీరాజనములు!

47*

ఎందరో దాసులిల వీను విందుగాను

శ్రోతనుఱ్ఱూత లూగించు స్త్రోత్ర గాన

యజ్ఞ ఫలసమర్పణల-జీవయాత్రజనిరి!

రామరాఘవా నీకు నీరాజనములు!

48*

బాషలేవైన గానమై భక్తి పూర్ణ

భావనల లలితకళలుగా వహించు-

ఘనత కీర్తి తేజము తమదె! గరుడ గమన!

రామరాఘవా నీకు నీరాజనములు!

49*

అమ్ముడైపోయె నేటికళార్చనములు!

సొమ్ముగామారె మేధస్సు వమ్ముఘనము!

నీతి ధర్మంబునిలబెట్టు! నిగ్గుదేల్చు!

రామరాఘవా నీకు నీరాజనములు!

50*

ఏది ఏమైన శాంతిని యెదుగనిమ్ము!

ఇంట నొంట ప్రశాంతతనిముడనిమ్ము!

స్వేచ్ఛ జీవన సాఫల్య మిచ్చి బ్రోవు!

రామరాఘవా నీకు నీరాజనములు!

51*

కైక కోర్కెనెపము దశకంఠు దునుమి

తిరిగిచేరగనయోధ్య తేజరిల్లి-

నటుల- ప్రతి యేట నీపెళ్ళినలరుగుడులు!

రామ రాఘవా! నీకు నీరాజనములు!

52*

వెలయు నూరూర నీగుడి వెలుగులీను

నీదు కథనుగానముజేసి నీతి ధర్మ

కట్టు బాటునీ యాజ్ఞగా కదలు జనము!

రామ రాఘవా నీకునీరాజనములు!

53*

భయము గల్గెనా హనుమంత పాదసేవ!

బ్రతుకు భద్రతా భారముల్ హితవుగూర్చు-

నామ తారకమంత్రమే నయజయంబు!

రామ రాఘవా నీకునీరాజనములు!

54*

తప్పు జరిగిన తలవంచి దండమెట్టి

బుద్ధి సవరించు కొందురు పుడమి జనులు!

మ్రొక్కి మరచిన వాయిదా మ్రొక్కు చుంద్రు!

రామరాఘవా నీకునీరాజనములు!

55*

ఎంత చల్లని దైవమై యెదను నిల్చి

నెమ్మదిని గూర్చి నడిపించు నేతవీవు!

మరుపురాని రాజ్యమునీది మహిత చరిత!

రామరాఘవా నీకునీరాజనములు!

56*

కలిని పాతిక ధర్మమే కలుగునంద్రు

రామ కృష్ణాహరేయని రాత్రిబవలు

తారకముగాగ కీర్తింత్రు తమరి మహిమ!

రామరాఘవా నీకునీరాజనములు!

57*

పెద్దలందరు మదిగోరు ప్రేమ కోర్కె

తరతరాలకు నీకథ తరలు నట్లు

మేలు మేలని పాడేరు మేలుకొలుపు

రామరాఘవా నీకు నీరాజనములు!

58*

భాగవత భారతము రామ భద్ర నీదు

దివ్య పౌరాణికము నరు తీర్చి దిద్దు

విశ్వ శాంతి ప్రసాదించువిధియు విధము!

రామరాఘవా నీకు నీరాజనములు!

59*

జానకీ తనమాటనిజమ్మటంచు

విశ్వసింప గానముజేసెవినమటంచు

ప్రథమ రామాయణపు కవి పవనసుతుడె!

రామరాఘవా నీకు నీరాజనములు!

60*

మానవత్వపునాదిగా మానవాళి

నీకథానీతి పాటింత్రు నిజమునెఱిగి

పుడమిభారతీయతపొందె పుణ్య గరిమ!

రామరాఘవా నీకు నీరాజనములు!

61*

పండువో పబ్బమో నిన్ను ప్రస్తుతించి

కొలువగా మది సంతృప్తి కోరి జనులు

యాదిమరువని సంస్కృతి పాదుకొనియె

రామ రాఘవా నీకునీరాజనాలు!

62*

చలన చిత్రప్రదర్శన శాలముందు-

యాగ సంరంభమే చిన్ననాటి యాది

తమరి మాటలు పాటలే తలపులందు!

రామ రాఘవా నీకునీరాజనాలు!

63*

సీత రామ నీకళ్యాణ చిత్రకథయె-

వింటుకొనసాగె విధులన్ని ఇంటబయట!

పదుగురునుజేర మార్మోగె పాటలన్ని-

రామ రాఘవా నీకునీరాజనాలు!

64*

పెండ్లి జరిగువేళరికార్డు వేయకున్న

నదిసమగ్రముగాదంద్రు ముదము గోరి

వచ్చి వినువారితోగల్గె పచ్చదనము!

రామరాఘవా నీకునీరాజనాలు!

65*

పోటి పాటల తమపెళ్ళి పాట గెలుపు

భక్తి లవకుశగానముల్ బడులయందు

నిజము దెల్పిన కలయంద్రు నేటివారు!

రామ రాఘవా నీకునీరాజనాలు!

66*

తండ్రి యానతి జవదాట తనయు వెఱపు

సాగు తోబుట్టుకలహాలు సద్దుమణుగు!

గొప్ప ఆత్మీయతాభావముప్పతిల్లె!

రామ రాఘవా నీకునీరాజనాలు!

67*

మంచి దారిసాగిన గల్గు మంచిఫలము!

కష్టమిష్టమై సత్కీర్తి సంపదెసగు!

సత్యవ్రతశీలియు నగునజాతశత్రు!

రామరాఘవా నీకునీరాజనాలు!

68*

జానపద సాంప్రదాయ సమానదృష్టి-

నీదుకళ్యాణమును గాంచు నిఖిలజనుల-

పెండ్లి తంతుపవిత్రత పెచ్ఛుమీరె!

రామరాఘవా నీకునీరాజనాలు!

69*

నీదు చరితగానము సాగు నీతి ధర్మ

సంకటములుబాపు తగు సామెతలుగ!

మైత్రిబాటవేసియు దౌష్ట్యమణచు చుండు!

రామరాఘవా నీకునీరాజనాలు!

70*

లక్ష్మణ విభీషణులు తమ్ము లైనవిధము

మారుతి భరతులేకసన్మానులగుట!

నీదు వాక్కున ధర్మంబు నిగ్గుదేలె!

రామరాఘవా నీకునీరాజనాలు!

 

(ఆ.వె)

71

తమరి పెళ్ళి పుణ్య దాంపత్యమాదర్శ

మయ్యె-పేద గొప్ప మాటమరచి

రీతినీతిగాగ జాతి యనుసరించె!

రామ రఘువరా! నివాళి!

72*

ఆలుమగల నడత ఆదర్శవంతమై

కష్టసుఖములందు కలిమిడిగను-

బ్రతుకుగెలువ నెంచి భక్తినిన్నర్చింత్రు!

రామ రఘువరా! నివాళి!

73*

కనుల విందు తమరి కళ్యాణ వైభవం

వీనువిందు కథయు విధిగ జనుల-

సీత కూతురట్లు చిత్తగింతురు చేరి!

రామ రఘువరా! నివాళి!

74*

ఒకరికొఱకునొకరు నొనరజీవించగా

భార్య భర్త లైరి బ్రతుకు నెల్ల-

కష్టసుఖము గడిపి కడతేరు దీక్షయే!

రామ రఘువరా! నివాళి!

75*

రాజధర్మనిరతి రక్షణ సమధర్మ

పరిధి జనుల సేవ ప్రభులదయ్యె!

వసుధ సాగెను జనవాక్య కర్తవ్యము!

రామ రఘువరా! నివాళి!

76*

తల్లి దండ్రి గురువు దైవభక్తియు సేవ

ధర్మపరిధి కొడుకు- తండ్రియాజ్ఞ

మీరరాని విధియె మేదిని మెప్పయ్యె!

రామ రఘువరా! నివాళి!

77*

అన్నదమ్ములందు అతిథియభ్యాగతు

లందు-ప్రేమ గలుగ లబ్ధి గూర్చు-

ప్రస్తుతింత్రు విధిగ పరులతమ్ములైన!

రామ రఘువరా! నివాళి!

78*

భక్తుడాంజనేయు భరతసముడవని

యెదనుజేర్చి నట్టి సదయ! జాంబ

వంతుడు-కపివీర వరులు జయంబనన్

రామ రఘువరా! నివాళి!

79*

ఉడుత యిసుకరాల్చ కడువింత నీచేత

జేరి దీవెనొందె చెట్టు పుట్ట

నీదు ప్రేమ దడిసె-నినదించె సృష్టియే!

రామ రఘువరా! నివాళి!

80*

ధర్మముద్ధరించి దానవాళి దునిమి

మానవతను గూర్చి మనిషి నిలిపి

త్రేతయుగమునందు తేజరిల్లిన దేవ!

రామ రఘువరా! నివాళి!

81*

సీత రామస్య ఆయనం హితవు ధర్మ

మార్గమే రామాయణంబు గాగ

ముళ్ళ బాటనడిచితివి ముదముతోడ

రామరాఘవా నీకు నీరాజనములు!

82*

ధర్మమునకు నూపిరినూది దాశరథిగ

చల్లగా బ్రోవ వచ్చిన చంద్రునట్లు-

సకలలోకుల నేలిన స్వామి శరణు!

రామరాఘవా నీకు నీరాజనములు!

83*

సత్యమును బ్రతి కించిన సాత్వికుడవు!

పుణ్య రాశివి సుగుణాల పుట్టవీవు!

ధర్మ ధేనువు ప్రాపువూ-దాపువీవు!

రామరాఘవా నీకు నీరాజనములు!

84*

ప్రజలు రాజులు నీప్రేమ పాత్రులైరి

శత్రువులుకూడ నీధర్మ శక్తి బొగడి

ముదముతో యుద్ధమున జచ్చి ముక్తిగనిరి!

రామరాఘవా నీకు నీరాజనములు!

85*

చిన్న ప్రాయాన విద్యలన్ చిత్తుజేసి

ఘోర దనుజుల గూల్చిన గొప్ప తమది

బుద్ధి హృదయ విద్యలనీదె భూరి యశము!

రామరాఘవా నీకు నీరాజనములు!

86*

దండకాటవి రాకాసి దండునణచి-

మంచికవధివై యాదర్శ మానవునిగ-

వ్యక్తి గతపు విద్వేషమున్ వదలినావు!

రామరాఘవా నీకు నీరాజనములు!

87*

ధర్మముగ పదవిని పొంద దలచినావు-

తమ్ములైక్యత కొఱకెనీ తపన చూడ!

న్యాయ నిరతి నీనడతలోనలరె దేవ!

రామరాఘవా నీకు నీరాజనములు!

88*

ముదము చెదరని చిరునవ్వు ముఖము జూడ!

నుడులు మృదువు మరియాద లున్నతములు

పితరు వాక్య పాలన నీకు ప్రీతికరము!

రామరాఘవా నీకు నీరాజనములు!

89*

చక్ర వర్తిగుణగణముల్ సర్వమున్న-

నీదు అభివృద్ది కాంక్షించి నిష్ఠ గలిగి

ప్రజలు దైవాన్ని మ్రొక్కిన ప్రభువు వీవు!

రామరాఘవా నీకు నీరాజనములు!

90*

ధర్మ ప్రభుడవు నీవయ్య ధర్మయోగి

కర్మయోగివి కళ్యాణ కారకుడవు-

పుడమి బుట్టిన ఆదర్శ పురుషు డంద్రు!

రామరాఘవా నీకు నీరాజనములు!

91*

అరువది నాల్గు కళలను అభ్యసించి-

జనుల బ్రోచివచ్చితి ఆజానుబాహు!

జలధి గంభీర! హిమశైల సమ సుధీర!

రామరాఘవా నీకు నీరాజనములు!

92*

నిఖిల మునిజన సన్నుత నిర్వికార!

సర్వ శాస్త్ర పండితవర! సద్గుణుండ!

సకలలోక పోషక హరి సాధు హృదయ!

రామరాఘవా నీకు నీరాజనములు!

93*

వీర శౌర్య పరాక్రమ విష్ణుమూర్తి

సర్వ మంగళకరనామ శాంతమూర్తి!

ప్రాణికోటి సంరక్షక బ్రహ్మ జనక!

రామరాఘవా నీకు నీరాజనములు!

94*

పాపములుబాపి దీవించు పావనాంగ!

శూర వైరిమూకల పాలి సూర్య తేజ

ధరణి చంద్రునివలె ప్రియ దర్శనుండ!

రామరాఘవా నీకు నీరాజనములు!

95*

దివ్య సుందర విగ్రహ దీన పోష!

సాధు సజ్జన స్తోత్ర విశాలహృదయ!

దివ్య వేదాంతములవెల్గు దేవదేవ!

రామరాఘవా నీకు నీరాజనములు!

96*

నారదవినుత సకలగుణాభి రామ!

లక్ష్మణాగ్రజ ధరశుభలక్షణుండ!

జానకీమనోహర! సువిశాలవక్ష!

రామరాఘవా నీకు నీరాజనములు!

97*

వేద శాస్త్రజ్ఞ ధరధనుర్వేదనిపుణ!

బాణమొక్కటే యొకమాట భార్య యొకతె-

వ్రతముగా సాగినట్టి దివ్యావతార!

రామరాఘవా నీకు నీరాజనములు!

98*

దైవముగ నవతారంబు దాల్ఛకుండ

చందమామలా శ్రీరామ చంద్రుడనగ

చల్లగనుగావ వచ్చిన సచ్చరిత్ర!

రామరాఘవా నీకు నీరాజనములు!

99*

వెడలు రూపంబె శక్తిని వెల్లడించు

మనసు తత్వంబు కరతలామలకమనెడు-

వేద – శాస్త్ర సూక్తియధార్థ విషయ బోధ!

రామరాఘవా నీకు నీరాజనములు!

100*

సీత రాముల ప్రేమయే చిత్రమయ్యె!

తనువు దూరమై చిత్తము దగ్గరయ్యె!

ముళ్ళబాటయే తమకునామోదమయ్యె!

రామరాఘవా నీకు నీరాజనములు!

101*(సంపూర్ణం)

కరుణ జూపుము వాయ్ లాల ఖాదినిలయ!

భక్తి సద్గుణ పూరక బాట జనుల-

వ్యసనములుమాన్పియారోగ్య భాగ్యమిమ్ము

రామరాఘవా నీకు నీరాజనములు!

102*

పల్లె పట్టణమగ-పట్న పల్లయనగ-

రాహ రూపులు మారె పరస్పరంబు!

నడుచు రాకపోకలయందు నాగరికము!

రామరాఘవా నీకు నీరాజనములు!

103*

వైద్య మునకు పట్టణమందె వసతి – పల్లె

విద్య సంబంధ పనిదొర్కు విధములేదు

సర్వమొకచోట గల్పిప సాధ్యపడదు!

రామరాఘవా నీకు నీరాజనములు!

104*

ఉమ్మడికుటుంబములు జీలె ఉనికి వేరు- వేరుతలముల సభ్యులు చేరిబ్రతుక-

వలసి వచ్చెను-వీలేది? కలసిమనగ!

రామరాఘవా నీకు నీరాజనములు!

105*

తప్పు లెంచియానందించు తత్వమొకటి

నూత్నముగ వచ్చె కవితార్థ మూహజేయు

సమయమేలేదు కవులంత చప్పబడిరి!

రామరాఘవా నీకు నీరాజనములు!

106*

భక్తి శతకాళి యాధ్యాత్మికోక్తి సాగు

గాన చిన్నచితుక తప్పు గనిన దిద్ధి

సాయపడకుండ దలతురు- చౌక పనిగ!

రామరాఘవా నీకు నీరాజనములు!

107*

తెలుగు సత్యనారాయణ తిరుణహరిని

వెంకటయ్య సీతమ్మల వేడ్క సుతుడ!

శతకమర్పించి మ్రొక్కితి సార్వభౌమ!

రామరాఘవా నీకు నీరాజనములు!

108*

శుభము శతకాభి మానికి శుభయశంబు!

శుభముపఠిత శ్రోతలకెల్ల సుఖముశాంతి!

శుభమునీనామ కీర్తన శుభకరంబు!

రామరాఘవా నీకు నీరాజనములు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page