
శ్రీయోగానంద పరమహంస ప్రణతి శతకము-4
(తే.గీ.)
1*ప్రారంభము.
శ్రీ పరాశక్తి, భక్తిపరీక్ష నెగ్గి-
తల్లి రూపున దర్శించి తత్వమెఱిగి-
ప్రకృతి మాత సంభావించు పరమహంస!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
2*
హంస పాలు ద్రావియు నీరు పరగ వదలు-
పగిది బిరుదంబు నీదయ్యె, పరమహంస!
దైవ ప్రేమపాత్రుడవైన ధన్యయోగి
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
3*
స్వేచ్ఛ పనిశక్తిచేనాత్మ చేతనమ్ము
కృషియు, సృజనాత్మకత గూర్చు ఫలము!
చిత్త శుద్ధి, శ్రద్ధను, పుణ్య విత్త వృద్ధి!
ప్రమఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
4*
పస్తుతో స్వస్థతయుగల్గు పరగ తనువు
నిల్వ శక్తినాస్వాదించు-నిల్చు మదియు-
పూర్ణ ప్రాణశక్తినియాత్మ పుంజుకొనును!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
5*
భగవదవతారమూర్తి బాబాజి బాట-
పరమ గురు లాహిరిమహాత్ము పథము వెంట-
గురుడు ముక్తేశ్వరునియాజ్ఞ గూర్చె కీర్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
6*
నిశ్చయాత్మకమై మది నిల్పు పనులు-
సాగు దైవానుగ్రహముచే సఫలమగును-
ప్రేమపూర్వకమై సేవ పెంపు మీరు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
7*
నచ్చని పనులు యాంత్రిక నడక సాగు
మెచ్చు పని కష్టమైనను మేలొసంగు!
నమ్ము కొన్న దైవముగూర్చు నయము జయము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
8*
తాను,మనిషి మాత్రుడనను తలపు మాని-
దైవ సంతానముగ జీవితంబు గడప-
దైవ భాగమీ జీవాత్మ దనరు చుండు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
9*
నిత్యమారోగ్య దాయకమ్ నిర్భయంబు
విశ్వసించి ముందడుగేయ విజయ సిద్ధి!
పలు సమస్యలకౌషదమ్ ప్రాణశక్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
10*
కలుగు గెలుపోటములు కాల గమనమందు
మంచి మదినెంచు యత్నముల్-మంచి ఫలము!
విఘ్నములు బాపి, దైవము విజయమొసగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
11*
భయముచే కాలమును వృథా బ్రతుకు బరువు!
సానుకూల భావన గూర్చు సాహసంబు!
మైత్రికినిమారు పేరుగా మనుట మేలు!
ప్రముఖ గరువు యోగానంద ప్రవచనోక్తి!
12*
పుడమి బుట్టి పాఠము నేర్చి పుణ్యబాట
మనిషి జీవింప వలె దైవమార్గమందె!
ప్రేమ గురిపింపవలె చిన్నపెద్ధయనక!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
13*
పరుల తనవలె భావించు పటిమ బుద్ధి
భువిపరోపకారముజేయ పుణ్యవృద్ధి
గురుల సేవింప పరమాత్మ గుట్టుదెలియు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
14*
పటువ బలిగి పాలొల్కియు పరితపింప-
వృధయె! గతయాది బాధించు విధము నిట్లె!
వర్తమాన జీవనగతి వసుధ మేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి
15*
అంటియంటక,బ్రతుకున నతుకు పడక-
పట్టుదల గల్గి విధులందు ప్రజ్ఞ నెఱపి-
వర్తమాన యోచన సాగవలయు నెపుడు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
16*
మది,తితీక్ష , నిశ్చల తపమాచరించి-
మంచి వరమొందుటకుగల్గె మనిషి జన్మ-
శాశ్వతముగాదు, మరుజన్మ సాగిపోవు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
17*
మంచి చెడుకర్మ తత్ఫలమందు కొనును!
వ్యష్టిగ, సమిష్టిగను సాగు వసుధ కర్మ-
బూనవలె, సన్మార్గులై-మానవాళి!
ప్రమఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
18*
నిద్ర మనసుకు విశ్రాంతి, నిచ్చు పుడమి-
చావు నాత్మకు విశ్రాంతి , జన్మ పుణ్య-
సంచితార్థము, జమచేయు జగతి బ్రతుకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
19*
జనన మరణ ఖేదము దాటు జాగృతముగ-
ధ్యానమున, నాత్మ చేతన దారి సాగు!
బ్రతుకు జంజాటమును వీడి పరవశించు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి
20*
పూని దేశదేశాలలో పుట్టి గిట్టి-
వెళ్ళి చనుదాక, పరమాత్మ వెల్గులందె-
యాత్ర, చేతనత్వముగల్గు – పాత్ర బ్రతుకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
21*
వెడలు,పరలోక వాసియై వెల్గునాత్మ
పరగ పరమాత్మ గుర్తింపు పత్రమొంది
జన్మ రహితముక్తినిబొందు, జాగృతముగ!
ప్రముఖ గురువు! యోగానందప్రవచనోక్తి!
22*
మంచి కర్మచే చెడుకర్మ త్రుంచవలయు
గురుని, విశ్వసించినయంత, గురియు కుదురు
ధ్యాననిష్ఠచే, చెడుకర్మ దగ్ధమగును!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
23*
హృదయ పరిశుద్ధి, మెరుగైన మెదడు వృత్తి
దైవ దీప్తియు, నాత్మలో దనరు చుండ-
జాగృతిని జన్మరహితమై సద్గతొందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
24*
తాను,దైవభాగంబుగా దలచి కొలచు-
నాత్మ పరమాత్మ సంయోగ సాధకముగ
కర్మ సంకెళ్ళు విడనాడు కడకు ముక్తి!
ప్రమఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
25*
యోగ – విజ్ఞానశాస్త్ర ప్రయోగ ప్రజ్ఞ-
తనువు, మనసు జాగృతమగు తాత్వికముగ,
తాను నాత్మగా లీనమౌ దైవమందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
26*
మనసు నేనన్న గర్వమై మాయజేరు
నాత్మ నేనన్న మనిషికే నయము జయము!
మదిని చెడుద్రోసి – నింపగా మంచి నిండు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
27*
యుద్ధమా?శాంతమా?ఆత్మయద్ధమందు-
మంచియా?చెడ్డయా?వృద్ధిమనసు పొరల!
మనిషి భావసారూప్యమే మనుగడంత!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
28*
మనిషి భావన, సమతుల్యమైన వృద్ధి
నంటియంటక-తగువిధి వెంటసాగి-
పరుల కోసమే సజ్జనుల్ బ్రతుకు చుంద్రు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి
29*
మనసు తృప్తికోసమగు సామాన్యు తిండి
తనువు నిల్పుకోసము, దిను తపసి, దైవ-
ప్రార్థనలు సాగు, సద్గతి ప్రాప్తి, కొఱకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
30*
మనిషి మనిషి జంపిన శిక్ష మరణమగును
పెక్కురను జంపు యోధుడు – పేరు కీర్తి!
మదినియంత్రణచే, భువి మంచి బ్రతుకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
31*
లోతుగా ధ్యానమొనరించు లోకజనులు
నిరతమాధ్యాత్మికమువెంట, నిత్య విధులు,
నెఱపుచుందురు, సద్యోగ నియమ నిష్ఠ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
32*
ధ్యానమగ్నత, నభ్యాసదారి, యోగి-
నిత్యవిధుల కాటంకము, నిడని తీరు
కదలు – పనులందు, దేవుని కరుణ చేత!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
33*
సాధు సంసారులకు యోగసాధనాలు-
దలప, దైవానుసంధాన దారి సాగు-
విత్తము-కుటుంబమును జీల్చు, కత్తి వలెను!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
34*
నియమ నిష్ఠయు, సవికల్ప నిర్వికల్ప –
సమాది స్థితులబొందు-మర్మ మెఱిగి
మది, నియంత్రణ కొనసాగుమనిషి-యోగి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
35*
ధనికులొంటరి జీవులే, దరిద్రులైన
కలిమి-లేమి సఖ్యత నుంద్రు కల్మిడిగను
అందరికి భక్తి బాట నానందమొసగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
36*
భౌతికము మానసికమాత్మ బరగు విధులు
బ్రహ్మమోదానుసంధాన ప్రార్థనములు
యోగ్యతను గూర్చు గురుబోధ యోగి జేయు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
37*
ధర జగన్నాటకము సాగు తగిన పాత్ర
సూత్రధారి యాడింపగా స్తుతిని పాడు!
తిర్గిరాని పాత్రలె వచ్చి తిరిగి వెళ్ళు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
38*
సద్విమర్శ సంస్కారమై చక్కదిద్ధు-
దైవ ప్రతినిధి గురుదేవు దయను గలుగ-
దైవమునుగల్సి జీవించు దారి వెలయు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
39*
మంచి-దైవసన్నిధిజేర్చు మానవాళి-
చెడ్డలోమాయ నర్తించు-చేటుగూర్చు!
మంచి బెంచు వర్తన మెచ్చు మాథవుండు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
40*
దోమ రక్తముబీల్చినా తొండముననె-
వీలుగా విదల్చును రోగ విషపు క్రిములు-
నట్లె పుడమి జీవించెడు నరుని ప్రకృతి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
41*
మెదడు చెడుచేత దురితమై మేటవేయు
మంచిచే పుణ్యమును నిండు-మనిషియందు
దైవ దూతావతారాన, ధరణి గాచు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
42*
శత్రు పాఠంబు నేర్పును, శ్రమనుగూర్చు!
వర్తమాన మైత్త్రిని మంచి వరలుచుండు!
అవని జీవన గమనిక – అనుభవమ్ము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
43*
మార్పులేనట్టి మనుగడ మార్గమందు-
సాగు సృష్టి ప్రదర్శన శాల బ్రతుకు!
చేవగూర్చు నాధ్యాత్మిక సేవ మేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
44*
చావు పుట్టుక జీవిత చలన చిత్ర-
ద్వంద్వములచేత కొనసాగు దైవసృష్టి!
సుస్థితప్రజ్ఞ చేగల్గు సుఖము శాంతి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
45*
జన్మ నాద్యంతములనాత్మ జాగృతంబు-
అతికి బ్రతికిన మోక్షంబునతుకు పడదు!
జ్ఞాన విజ్ఞానమాధ్యాత్మికాన మేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
46*
నిండు పూదోటలో భ్రమరముండు నట్లు-
దండి ప్రేమ పూర్ణమదిని – దైవముండు!
ధరణి ప్రేమలన్నిట వెల్గు దైవప్రేమ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
47*
ముళ్ళ పొదచుట్టు, తుమ్మెద, మూగ నట్లు-
కపట బుద్ధిలో దైవంబు గానరాదు!
పూర్ణ భక్తిమానసమొక పూలతోట!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
48*
పూలతోట పూదేనియ, పుష్కలంబు-
విరులదారియై, మదిభక్తి విస్తరింప-
సుకృత దైవప్రేమయునిండు, సుధలు గురియు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
49*
మనసులో సానుకూలతే మంచి తోట!
మాయ ప్రతికూలపుటెడారి, మనిషి మదిని-
ఏది భావించునోయది యెదుట జరుగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
50*
సానుకూల భావన మంచి సాగు పనుల-
సుఖము శాంతి యానందాల సూత్ర మగును!
బ్రతుకు-ప్రతికూలభావమే భ్రాంతి మయము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
51*
దివ్వెగా చీకటినిబాపు-దైవనిష్ఠ!
జ్ఞాన విజ్ఞానమాధ్యాత్మికాన నాత్మ
తాను పరమాత్మ భాగమై తళుకులీను!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
52*
మోహపూరితమగు ప్రేమలో మోదమెంత?
శాశ్వతము, దయాపూర్ణమైసాగు ప్రేమ!
ప్రాణశక్తి రూపమె ప్రేమ ప్రాణులందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
53*
మనిషి సేవలో ప్రేమసామాజికంబు-
కరుణ వర్ణింప-దీనుల కనుల పంట-
దైవ ప్రేమగా భాసించు, ధరణియందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
54*
ఎంగిలాకు దేహము వీడు నెన్నడైన-
ప్రాణశక్తి వాహనమాత్మ పయనమగును!
ఆత్మముక్తికై ప్రార్థింప సార్థకంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
55*
కామపూర్వక ప్రేమ తాత్కాలికంబు-
గ్రుడ్డి మోహపూర్వక ప్రేమ గూడ వృధయె!
భక్తి పూర్వకమే మేలు బహువిధాల!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
56*
ఆత్మ గతజన్మ లక్షణమనసరించు-
జన్మజన్మల కర్మంబు జతపడంగ,
పుణ్యమున గొప్పవారింట బుట్టుచుండు!
ప్రముఖ గురవు యోగానంద ప్రవచనోక్తి!
57*
దైవమును గల్సి జీవించు దారి నీతి-
వివిధ రీతి నీతుల రూపు విశ్వప్రేమ!
మనిషిలోదైవమే ప్రేమ మార్గదర్శి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
58*
మనిషిలో దైవమే శాంతి మాయ భ్రాంతి!
ధర నమాయక జన్మయే ధన్యమనగ-
మంచి సమకూరునాత్మీయ మార్గమందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
59*
దైవమోంకార రూపమై దనరుచుండు!
మోదమోంకారనాదమై మ్రోగుచుండు!
ప్రణవ-ప్రణయ-ప్రళయ సృష్టి ప్రతిఫలించు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
60*
సానుకూల దృష్టినిసాగు, జనుల ప్రేమ!
మాయ చెదరి, యమాయకమగును బ్రతుకు!
గురుని బోధచే, ప్రతికూల గుణము మారు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
61*
గొప్ప భావంబు, మేధస్సునొప్పు సృజన-
వస్తురూప నిరూపణ, వసుధ సృష్టి!
మనిషి లబ్ధి, యదృష్టమై మనసు మురియు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
62*
శాంతి సంతోష సంవృద్ధి సహనబుద్ధి
స్వాస్థ్యమును గూర్చు, మహభాగ్య సంప దెసగు!
సాగు మంచి పనులచేత, సత్ఫలంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
63*
నిశ్చలము గల్గు మదినాత్మ నీతిధర్మ-
సూత్రముల కర్మ-క్రియచేత సుకృతంబు-
సాగు సత్కార్య క్రమమందు సత్ఫలంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
64*
ఆవు రక్తాన క్షీరంబు నలరునట్లు-
పాలలోవెన్నగా సృష్టి ప్రకృతి పుష్టి!
దైవమంతట గలడను ధ్యాసమేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి
65*
నిప్పురవ్వలో జ్వాలయు నిమిడినట్లు-
దైవ శక్తి! వెడలి, చేయు ధర్మ రక్ష!
సాగు సకల జీవుల జన్మ సార్థకంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
66*
సృష్టి-దృష్టమదృష్టమౌ స్ఫష్టమైన-
మార్పు సహజమే దేవుని తీర్పు వెంట-
ప్రకృతి యొడిలోన జీవాళి పరవశించు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
67*
మొదట నాపద మ్రొక్కుల మోదమలర-
పిదప సంపద మరపుల ప్రీతి పుడమి!
ఆత్మ ప్రేమార్పణలు పరమాత్మ గోరు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
68*
భక్తి దేవుని గనుగొను బలమొసంగు
పిదప దైవాన లీనమౌ, ప్రీతి మెరయు-
నాత్మ చేతనత్వము ముక్తినందగోరు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
69*
వసుధ పరమాత్మయే నిత్య వాస్తవంబు!
దురలవాట్లు తత్కాలపు దురదగాట్లు!
మనిషి డబ్బుకుస్తీపట్లు-మాయగబ్బు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
70*
అవసరము కోసమలవాట్లయందు, మంచి-
చెడగులుండు, మంచిని యెంచు చేష్టమేలు!
దైవమార్గాన కడుమంచి దారి దొరుకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
71*
కుతియు దీర దుర్వ్యసనాల కుటిలమాయ
ఏది ఏమైన గల్గదు-ఎట్టి మార్పు!
సాగు చెడుమాయ దర్పమే జనుల యందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
72*
క్షణిక సుఖవాంఛలాత్మ లక్ష్యంబు గనవు
పెక్కు తప్పులు మన్నింప మ్రొక్కువారె-
దైవ నికషలో గెల్తురు, ధరణియందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
73*
కుండ నిండి యెండినయట్లు కుతియు నుండు!
మంచి మైత్రిచే కుతిమాన్పు మార్గముండు-
ధ్యాన రుచిమర్గి జీవింప దైవ రక్ష!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
74*
వెలుగ-వెయ్యేండ్ల చీకట్లు వేగ దొలగు-
చేతనాత్మ దీపింప విజేత మనసు!
ధ్యానమున నాత్మ పరమాత్మ దర్శనంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
75*
పుట్టి గిట్టునాత్మకు తగినట్టి జన్మ-
జన్మరహిత ముక్తినిగోరు జనులభక్తి!
దిక్కు దిశలొక్కటిగ దైవ దిక్కుమ్రొక్కు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
76*
దైవము సకలాంతర్యామి తత్వమెఱిగి-
దివ్య భక్తిభావన దైవదీక్ష నాత్మ-
జగతి కక్ష్యనభ్యాసించు జన్మముక్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
77*
భక్తియును,నియమావళి,ప్రాణయామ-
ధ్యాన ధారణాది సమాది-తనువు వీడి-
దైవ సంధానమునకాత్మ కదలి పోవు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
78*
జనులు విశ్వాత్ము ప్రేమలో మనిన శాంతి-
సాగు సైన్సు సాధన విశ్వశాంతి కొఱకు!
సైన్సు భక్తి ప్రపంచమై సాగ మేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
79*
దైవమును గల్సిజీవించు దారియందె!
మదిని విశ్వసౌభ్రాతృత్వమనెడు మార్పు!
వసుధ వైకుంఠమై జనవాంఛ దీర్చు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
80*
గురువు రూపున జ్ఞానము గూర్చునట్టి-
దైవ శక్తిని కనుగొన్న దైవదూత-
మనిషి రూపున మనవెంట మహిమ జూపు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
81*
ఆది మధ్యాంతరహితమనంత శక్తి
శేషపాన్పున నిద్రవిశేష సృష్టి
సాగు పరమాత్మ వటపత్రశాయి కడకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
82*
బ్రతుకు సర్వస్వమును దైవ బాటవెంట-
నిర్ణయించినట్లుగ ముక్తి నిశ్చయంబు
గాక మరల మరల జన్మ గలుగు చుండు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
83*
కర్మ ధర్మ సూత్రము దైవ కాంక్ష సృష్టి-
కర్మ ఫలసమర్పణ యుక్తి కడకు ముక్తి!
భక్తి మది-భుక్తి దేహాన బలమొసంగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
84*
కృష్ణ గీతార్థమును, యేసు క్రీస్తుబోధ-
మహ్మదుపకార సందేశ మందు జనుల-
సమ్మతము మతముగసాగె సాత్వికముగ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
85*
సృష్టి-ప్రేమపూర్వక పుష్టి తుష్టి వృష్టి-
ప్రేమ విశ్వరూపము నెత్తె! పేద ధనిక-
వాదమును మాని జనుల సమాదరించె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
86*
ధ్యానమును,దాన గుణము, నిధానములను
గమ్యముగ, ప్రేమ మత తారతమ్యమనక
దైవ ప్రేమ లీనము నాత్మ దరికి జేర్చు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
87*
స్వార్థ రహితాత్మ ప్రేమ సంసారి, యతియు-
మంచి చెడు పోరు సాగింత్రు-మనసు-తనువు
తగజయాపజయములిచ్చు దైవ శక్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
88*
ఎందరెన్ని జెప్పిన, యందు నెదుటి మేలు-
అందరన్ని విధాలుగా ననుసరింత్రు!
వివిధ మత సామరస్యమే విశ్వశాంతి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
89*
విశ్వ ప్రేమ బీజము సృష్టి – విశ్వశాంతి!
మనిషి గెల్పించుటకె దైవ మాయ సృష్టి-
మంచి సమకూర్చు దాకనే మరల జన్మ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
90*
యోగ్య క్రమజీవనము భక్తి యోగఫలము
ముక్తి యోగ్యమై బంధవిముక్తి గలుగు!
దైవ శరణాగతినిబొందు దారి సుళువు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
91*
సహనమును లేక సాగదు శ్రద్ధ భక్తి
మనసులో ప్రేమ లేకున్న మాయ యుక్తి
సంయమనము లేకను మంచి సాగ బోదు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
92*
వెదకులాటకు తుది, వేద వేద్యు ప్రేమ!
యోగ సాధన ధ్యానమే యోగ్యతొసగు!
ఆత్మ పరమాత్మ నతికి మహాత్మ్య మొందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
93*
ధరణి నాంక్ష కాంక్షలు సర్వ మార్గ-
నేమ నిష్ఠలన్నియు మంచి నిచ్చు ఘనులె!
మార్మికముసాగు సమధర్మ మార్గమునకె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
94*
దైవమే కేంద్రముగ ధర్మదారులన్ని
భక్తి నావలై దరిజేర్చు ముక్తి గూర్చు!
ధర్మ మార్గాను సరణయే దైవ ప్రేమ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
95*
మనిషి-జనన మరణ సృష్టి మహిమలందు
స్వేచ్ఛయు, స్వతంత్ర్యము జీవ శ్రేష్ఠ పదవి-
నిచ్చె దైవంబు, ప్రేమనే పుచ్చుకొనగ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
96*
జ్ఞాననేత్రాన గాంచు విజ్ఞాన యోగ-
తతుల సమకూర్చె ప్రేమనే బ్రతుకు నింపె!
ఆత్మ ప్రేమకోసమె పరమాత్మ వేచె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
97*
ధ్యానమున తల్పు తట్టును దైవమెపుడు-
ప్రేమశక్తి రూపున సృష్టి ప్రేరణొసగు!
అవని నవతారమెత్తియు నాదరించు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
98*
ఎఱుక గల్గియు జీవించు కొఱకు మతము
కోర్కెలన్ని వీడగనాత్మ కోర్కె ముక్తి!
ఆస్తి నాస్తుల తలపించు యాత్ర బ్రతుకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
99*
ప్రేమ దారిలో దైవజ్ఞ పేరు కీర్తి-
బ్రతుకు దారిలో ప్రేమయే ప్రాణశక్తి!
పుణ్యమును మూటగట్టుటే పుడమి జన్మ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
100*
ధరణి మానవాణ్వేషణే దైవప్రేమ-
మనిషి ప్రేమ తొమ్మిది భక్తి మార్గ విధులు-
అతుకు పడి విశ్వప్రేమగా బ్రతుకు సాగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
101*
ఆత్మ ప్రేమవిజ్ఞాన సంధాన క్రియల-
గలుగు యోగములు పరమాత్మ కడకు జేర్చు!
దైవ భాగమాత్మయు వెల్గు దైవమందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
102*
ఆత్మ పూదోటగా పరమాత్మ భ్రమర-
నాదమోంకారమై ప్రేమ నలరు జన్మ!
మది యెడారైన మరుజన్మ మరలమరల!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
103*
ముదము లేని, మదియు, రేగు ముళ్ళ పొదయె!
దైవమేరీతి, భ్రమరమై దరికి జేరు!
మంచి గురునాశ్రయించి యోచించ మేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
104*
మనిషి సంక్షేమ జీవన మార్గ గతుల-
రాచబాట జేరగ భక్తి రాజయోగ-
సాధనాత్మక క్రియ సాగ సత్ఫలంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
105*
మంచి గూర్చు విచక్షణ మనిషి బుద్ధి~
జీవిగా సద్గురు బోధ చేత వృద్ధి!
చట్ట బీజంబు బలపడు సాగు బ్రతుకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
106*
దైవ ప్రేమ సదానంద ద్రవ్య రసము-
త్రాగవలెగాని నితరంబు త్రాగ వృధయె!
త్రాగు బోతు మారును దైవతత్వమెఱుగ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
107*
తెలుగు సత్యనారాయణ తిరుణహరిని!
నాల్గు శతకంబులను ప్రేమ నలరజేసి-
భక్తినంకితమొనరించి-ప్రస్తుతింతు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
108*
శుభము యోగదా సత్సంగ సభకు శుభము!
శుభము సకల జనోద్ధార సూత్రములకు!
శుభము భారత జాతికి శుభయశంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!