
శ్రీయోగానంద పరమహంస ప్రణతి శతకము-3
(తే.గీ.)
1*(ప్రారంభం)
శ్రీ క్రియాయోగ, బోధ-ప్రసిద్ధ వక్త!
ప్రేమకర్థంబు దెల్పిన ప్రేరకుండు!
ప్రాచ్య సూర్యుడై వెలుగొందె పశ్చిమాన!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
2*
వివిధ ప్రేమలు రూపించు విశ్వప్రేమ!
దైవశక్తి నిరూపణ, ధరణియందు
మాయ నికషలో గెలుపొందు మంచి మనిషి
ప్రముఖ గురువు యోగానందప్రవచనోక్తి!
3*
ప్రేమ ప్రకృతి లీలగా పెరిగి విరుగు
దైవమును గల్సి యది శాశ్వతంబు పుడమి
దేహమునువీడి యాత్మయు తేజరిల్లు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
4*
విశ్వ ప్రేమ ప్రకృతి సృష్టి – విభుడు దైవ
శక్తిగా, ప్రాణశక్తిని-జనులకొసగు
పాత్రలను ద్రిప్పు, నజ్ఞాత సూత్రధారి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
5*
తరచు కారణార్థము గల్గు తండ్రి ప్రేమ
వెల్లడగును, బేషరతుగా తల్లి ప్రేమ!
ప్రేమ భక్తి రూపున, మైత్రి ప్రేరణనొసగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
6*
కర్మ-సత్కర్మగా పుణ్య కలిమిగూర్చు!
దురిత దుష్కర్మ దారిద్ర్యదారికీడ్చు!
కలుగు కీడెంచి మేలెంచు క్రమము మేలు!
ప్రణతిగొనుమ యోగానంద పరమ హంస!
7*
పరగ వజ్రాన రవిరశ్మి ప్రతిఫలించు-
బొగ్గునది నిష్ఫలంబగు బోల్చి చూడ!
సజ్జనుల భక్తి చేకూర్చు సత్ఫలంబు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
8*
గమ్య మొక్కటే మతతార తమ్యగతుల-
కల్గునేకాగ్రత ముదము వెల్గునాత్మ!
జ్ఞానమానంద దైవసంధాన దీప్తి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
9*
ధ్యానమాయుధమై మాయ దరిమివేయు!
సంతులనగతి సుఖదు:ఖ సరణి శాంతి-
గల్గ హృదయాననానంద కాంక్షవెలయు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
10*
దైవ దిశలోన సాగిన ధ్యాన క్రియయె-
దైవ సంధానమును గూర్చు, దరియు దాపు!
మిగుల దు:ఖపూరితములు మిగత లన్ని!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
11*
దైవ సంకల్పమై స్వప్న దర్శనంబు
స్వప్న మందొక స్వప్నమే జగతి సృష్టి!
ప్రకృతి జీవుల స్వప్నమే ప్రగతి పుష్టి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
12*
శ్రేష్ఠ జీవి మానవకల చేష్ట జగతి
స్వీయ పరిమితి కొనసాగు జీవితంబు
ధరణి యాత్మ స్వతంత్రమే దైవ యిచ్ఛ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
13*
మనసు సహజరూపము పెద్ధ మాయ ధినుసు!
దాని బంధించు నొక్కటే దైవ ప్రేమ!
మనసు గుడినాత్మ దీపించు మాయదొలగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
14*
నరుడు గోపికల్ మది ప్రేమ నలరుకతన
కృష్ణ శిష్యబృందముజేరు కృపనుబొంది
భక్తి గీతామృతముగ్రోల ముక్తి నొందె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
15*
ప్రేమలేకున్న మదిమాయ ప్రేరితంబు
కథగమిగిలించు తుదిదాక కామ దృష్టి!
ప్రేమదాంపత్యమే వృద్ధి పేరుకీర్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
16*
శాంతి ప్రేమలాభరణమై సాగు బ్రతుకు-
వెలయునితరేతరములందు వెతలపాలు
సైన్సు నాధ్యాత్మికముగూడి సాగమేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
17*
జీవి జీవినుప్పొంగు దైవ ప్రేమ
దైవ ప్రేమలో సృష్టి తాదాత్మ్యమొందు!
నరులు దైవప్రేమను పొంద నయము జయము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
18*
ప్రేమ గల్గియు-సర్వత్ర ప్రేమగాంచి
సకల జనులందు సమదృష్టి – సంఘసేవ-
చేయ సాగిన దైవంబు చేదుకొనును!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
19*
శ్రేష్ఠ మానవాళి భువివిశేష ప్రజ్ఞ-
బ్రతుకు గడపాలి, మదిపట్టిపట్టనట్లు!
భువి పరోపకారి బ్రతుకు పుణ్య ప్రదము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
20*
ధ్యానమున మాయ కోరికల్ దరికిరావు!
దైవ కృపచేత భ్రమదొల్గు దారిదొరుకు!
నాత్మ జాగృతిగనురీతి నయము జయము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
21*
మానసిక శాంతి, యోచన, మనిషి మెదడు
సానుకూల వైఖరి సాగు సత్క్రమంబు
మొదట, మౌనసాధన, మది మోద మొసగు
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
22*
జ్ఞాన,విజ్ఞాన సాధనల్ జగతిమేలు
దైవ యుక్తమై కలుగును తరచి చూడ
యోగముల్, ప్రయోగములిచ్చు యోగ్య ఫలము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
23*
భౌతికము,మానసికము లాధ్యాత్మికములు!
దైవ యుక్తమై, తగునీతి ధర్మవిధులు
సత్య వాక్పరిపాలన, స్వస్థ్యమిచ్చు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
24*
ధర్మ గతి సానుకూలమై ధరణిసాగు
మాయ ప్రతికూల వర్తన మనిషి మార్చు!
భువిపరోపకారి బ్రతుకు పుణ్యప్రదము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
25*
దైవ మునుగల్సి మాయను, తరుమ వలయు,
మంచి మదిబెంచి చెడుబుద్ధి – మట్టగించి
విశ్వచేతన-జీవించు విధము మేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
26*
మతము సైన్సు గూడిన సృష్టి మర్మ మెరుగు
మానవాళి బుద్ధియు దైవ మార్గ బ్రతుకు
విస్తరించు సత్ఫలసిద్ధి విశ్వశాంతి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
27*
మనసు ప్రతికూల గతిసాగ మాయలతుకు
మాయ సామ్రాజ్యమున నాత్మ మరుగు పడును
శాంతి రంగుటద్ధపు మాయ భ్రాంతి మయము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
28*
ముదము కోసమే కోరికల్ ముసురు మదిని
కోర్కె లెన్నిదీరిన మరి కొన్ని మిగులు!
భక్తి సర్వస్వమును గూర్చు బ్రహ్మ ముదము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
29*
కోర్కె లేని తీరముజేరు కొన్న నాత్మ-
గోరు దైవాను సంధాన కోర్కె యొకటె!
భౌతికాల, తాత్కాలిక భ్రమయె మదము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
30*
బ్రతుక నేర్వని బ్రతుకులిబ్బంధిపాలు!
కోరనేర్వని కోరికల్ కొంపముంచు!
భక్తి సాగని జీవితం బంధిఖాన!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
31*
కట్టుబాటున మదినిల్ప గలుగు ముదము
హృదయ చెలిమెలో పరబ్రహ్మ ముదము నూరు
సత్యవ్రతజీవనము సద్గతొందు
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
32*
అందమానందమగు నాత్మనంతరంగ-
ప్రకృతికన్న బాహ్యప్రకృతి భద్రమనగ-
దైవయుక్తమై గడచును ధన్యజన్మ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
33*
మర్త్య భావమదృష్టము, మాటపలుకు
దృష్టమేయన్నియును దైవ దృష్టి బ్రతుక
ధ్యానమున పూర్వ కర్మంబు దగ్దమగును
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
34*
సంచితార్థాన, దుష్కర్మ జన్య ఫలము
మంచి కర్మాచరణ చేత, మార్చవచ్చు!
మంచి కర్మ ధనాత్మకం-మంచిజన్మ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
35*
మంచి సుఖశాంతి ప్రదమగు మార్గగామి!
చెడు దురాశ దు:ఖము – చేటు చెప్ప వశమె!
పరిసరాల మంచియు చెడు, బ్రతుకు నతుకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
36*
ఎప్పుడేకాంత వాసమే గొప్పయైన-
భువి సమాజ సేవయు కొంత బూని చేసి
దైవ దారికి మరలింప – ధన్యజన్మ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
37*
మంచి సంకల్పమునకృషి-మంచి ఫలము!
భువిపరోకారము గూర్చు పుణ్య ధనము!
దైవ కార్యము నెరవేరు- దక్కు ముక్తి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
38*
మంచి మార్పునాత్మల మైత్రినెంచి గలుగు-
శక్తి భావన పనిజేయు-యుక్తి వెలయు!
భక్తి పూర్వక సాధన ఫలము ముక్తి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
39*
చిత్త నాణెము-కిటునటు-చిత్తు బొత్తు!
ద్వంద్వములు, ‘నేమి’-సత్యమై దారిసాగు-
సత్య వ్రతమాచరించుటే సాహసంబు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
40*
‘యాది’ గాగుర్తు కొచ్చేదియాత్మ శక్తి!
మది సామర్థ్యమున్నంతె-మనిషియూహ!
ప్రేమ ప్రాణశక్తిగ నిండి పెరుగు సృష్టి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
41*
జాతి దేశసమైక్యత ఖ్యాతిగాంచు
విశ్వశాంతి సాధన ప్రేమవిషయచర్ఛ
మానసిక శాంతి పూర్వక మార్గ ధనము
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
42*
భువి పరస్పర దేశగౌరవము వెంట
ఎల్లలేని మానవ యుల్ల మట్లు
మానవాళి కుటుంబమై మనుట మేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
43*
యుగయుగాల ధర్మము తగ్గు నుర్వి యందు
కలుగు పాతిక ధర్మమే కలియుగాన
దైవ విశ్వాసి ముదమొందు దక్కు సుఖము
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
44*
ప్రళయమున భూమి సూర్యుని పరిధి జేరు
నంతదాక మహాయుగ గంతు యాత్ర
చిత్రమై మిగులును – వటపత్ర శాయి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
45*
క్రొత్తలంకురించగ ప్రత కొఱతవడగ
చెత్త తొలగించు తగుకాల వృత్తలయము
చక్రధారి చిత్తమువెంట సత్యయుగము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
46*
సృష్టి లయమైన విశ్వంబు పుష్టినొందు-
మరల సృష్టి దాకను సత్యమార్గ తుష్టి!
వాంఛ రహితాత్మలానంద వార్థి దేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
47*
మొదట మది సవికల్ప సమాది నొంది-
యోగమభ్యాస క్రియ సాగ యోగ్యతెసగు-
నిర్వికల్ప సమాదియే నిజము ముక్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
48*
మౌన నిశ్శబ్ధమున నిద్ర-మనిషి సుఖము-
పిదప మెలకువ కలదెల్పు-ప్రీతియట్లు-
నాత్మ నేకాగ్రతసమాది నలరుచుండు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
49*
దైవ విశ్వరూపము దెల్సి-దైవభాగ-
మాత్మ తత్వంబులో పరమాత్మ గాంచి-
మరల జేరుటే రిలిజియో మాట భువిని!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
50*
వ్యక్తిగత హర్షమానంద వార్ధి గలియు-
పూర్ణ బ్రహ్మమోదము భక్తి పూర్వకమ్ము!
భక్తి నావ సాగును జన్మ ముక్తి దరికి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
51*
బ్రతకు,బంధిఖానయె,యాత్మబాధరహిత
మైన మదిశాంతి యానందమందు మునిగి
దైవ వార్ధి సంగమమొందు ధన్యజన్మ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
52*
మనసులో నాత్మ శాంతి సమాదినొంది
నదిగ ప్రవహించు, మదినాత్మ పదిలమొందు
దైవ వార్ధి సంగమమొందు దారిసాగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
53*
సంతతారోగ్య సంతోష సాహసంబు,
సహనమనుమాట దొర్కదు సైన్స్ నందు!
అల్లరి బడిని చదువు వర్ధిల్ల గలదె?
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
54*
దినదినంబు,వేకువజాము దివ్య నిష్ఠ-
స్వస్థతనుగూర్చు! మదినిల్పి సాగుయోగ-
మార్గమునగల్గు నయజయమైన ఫలము
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
55*
శాంతి ప్రేమలాభరణాలు, సాగుబ్రతుకు
దైవవరముగా, సమదృష్టి దారియందు,
సైన్సు నాధ్యాత్మికముగల్సి జగతి వెలుగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
56*
మంచి చెడులొక్క గాటను మనగలేవు!
చట్టమనుసరింపక నిజ స్ఫష్టతేది?
మనిషి ప్రతికారమును మర్చి మనుట మేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
57*
జీవ హింసమాని మనిషి జీవితంబు-
గడపగా – కూరగాయలు కుడువ మేలు!
దూరి మెల్లగా జంపును దురలవాట్లు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
58*
దిక్కు దిశయు దైవముగా దక్కుశాంతి!
మనసు నిశ్చలమై పరమాత్మ యందు-
నాత్మ జాగృతమగు చేతనత్వమొందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
59*
మదిని యేకాగ్రతయె కత్తి-మెదడు వృక్ష –
పత్రకాడముల్ ఛేదింప-పరగుమంచి-
చెడుగు యోచనల్ తొలగించు చేతనంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
60*
దైవమున లీనమగు మది ధ్యాస బ్రతుకు-
దైవ భారమై సాగును’ధరణి నరుల-
నిశ్చలాత్మ తానుగనెంచు- నిపుణతెసగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
61*
వదరు బోతు నాకర్శణ వదలి పోవు
మేలు మితబాషి సూక్తులు, మేలు కొలుపు
జ్ఞాన – విజ్ఞానమమునిడు నిధానముగను
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
62*
తనకు తానె సంబాషించు కొనెడు గురువు-
వినెడు శ్రోత దొర్కిన దెల్పు – వినుమటంచు
తెల్ప, వినువారలెవ్వరు, స్వల్ప మతులు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
63*
కల్గు వెల్గు, దైవమును, చీకటినిమాయ,
మనిషి నాడింపజూతురు, మంచి-చెడుల
దైవమును నమ్మితే ముక్తి దారి దొరుకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
64*
మాయ దేవునిసృష్టియే, మనిషి నికష-
గెలిచి, తనమార్గమునుబట్టు-కేళి లీల!
ఆత్మ ప్రేమకై దేవుని నాటకంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
65*
మెరుగు బంగారమే, యాత్మ, మేను యినుము!
మంచితనముచే తళుకొందు, మనసు గుడిని
యాత్మ గుడిదీపమై – పరమాత్మ మెఱయు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
66*
సాగు నరజన్మ సంసార సాగరాన-
భక్తి నావయానము జేయు బ్రతుకు మేలు!
తిన్నగానాత్మ – జనుముక్తి తీరమునకు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
67*
నిత్య సత్య సంబాషణ-నీతి నియమ-
పరులు-ప్రజలమెప్పునుబొంది బ్రతుకు చుంద్రు!
నీతి ధర్మజ్ఞులకు దైవనిష్ఠమెండు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
68*
భౌతికాలతో వైరంబు బలపడంగ-
మానసికము మైత్రినిగూర్చు మార్గమయ్యె!
మంచి మైత్రియే-సద్గతి మార్గ సూచి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
69*
నీతి రహితాత్ములను నమ్మి నిందజెంది-
మాయలో బడు పుడమినమాయకాళి-
చేయిగాలి యాకులుబట్టు చేష్టసాగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
70*
మంచి వాడుకనెంచియు మనిషిజూచి
తూచియడుగేయ గల్గును తుష్టి పుష్టి-
నీతి రహితు బోధలు విన్న నిష్ఫలంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
71*
మనిషి మదిదైవ మందిరమైన చాలు
గెల్పు బీజవాపన జర్గు వెల్గు భవిత!
తలచినది జర్గు యద్భావతద్భవతిగ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
72*
సత్ప్రవర్తన-వర్తన సచ్చరిత్ర-
జన్మ సార్థక్యమునగల్గు జగతి కీర్తి-
రాక-పోక లబ్ధియు జన్మ రహిత ముక్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
73*
దైవ భక్తి పూర్ణత గల్గు జీవనమ్ము!
సార్థకంబుగా జన్మ కృతార్థ గరిమ!
సానుకూల పుణ్యఫలము స్వర్గ ప్రాప్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
74*
తెల్ల సుద్ధముక్కయు దైవతేజ లిపిని-
నల్ల బల్ల మాయగ బోలు-నరుని జన్మ!
సాగిపోవగా నక్షర సత్య మాత్మ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
75*
మంచియే సత్యము చెడుగు మాటకల్ల-
మంచి వ్రతజీవనము మదిమసలునాత్మ!
తానె దైవభాగమటంచు-దలచుచుండు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
76*
మాయ దారి సాగిన వృధా-మనిషి బ్రతుకు-
బుద్బుదము-దైవప్రేమయే యద్భుతంబు!
దైవ నీడయే మాయగా దలప వలయు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
77*
మాయవీడి రమ్మని పిల్చు మాధవుండు!
మరలిరావలె, సద్భక్తి మార్గమందు-
మాయదాపున సదా దైవ మార్గముండు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
78*
ఆత్మ నహముగా భావింప నయ జయంబు!
మనసు-నహముగా జీవింప మరలజన్మ!
మాయ యతుకు కాలము వృధా మనుగడంత!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
79*
దైవ సన్నిధి, స్వాతంత్య్ర దారి బ్రతుకు
భక్తియై సాగు, భద్రమై భయముదొలగు!
మాయ మత్తు వీడగ, దైవ మాదుకొనును!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
80*
క్రిములు-యుద్ధాలు,పుడమిని కీడుసేయు!
ప్రకృతి సమతుల్యతయు చెడ, పరగముప్పు!
సానుకూల ప్రేమను, సాగ సత్ఫలంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
81*
ప్రేమ గల్గియు సర్వత్ర ప్రేమబంచి-
సాగు సమదృష్టి మానవ సంఘసేవ-
దయయు దాక్షిణ్యమున బొందు దైవ ప్రేమ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
82*
మైత్రి భావసంపన్నత మనిషిసొత్తు-
ప్రేమగుణము గూర్చును-పెద్ధ పేరు కీర్తి-
దైవమును గల్సి జీవించు దారిమేలు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
83*
సందడించు తాత్కాలిక సంబరాలు-
నంబరమునంటవలె-నిరాడంబరముగ-
అంతరంగ దైవముగల్సి యాడవలము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
84*
మనసు నద్దుడుగాగిదం-మంచి చెడుల-
బీల్చు ప్రేమ చమురునద్ది పిదప మంచి రుద్దు!
పరుల కుపకారమొనరించు పరుల పద్దు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
85*
రాత్రి కలగాంచి భయపడరాదటన్న-
పగటి కల జీవితము జూచి భయమదేల?
కలలు కల్లలే-మదినాత్మ కళలు నిజము!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
86*
దైవ విశ్వాసి గని-మాయ దరికిరాదు
మాయ విశ్వాసి, మార్చును మంచి గురువు
తరతరాల చీకటి, వెల్గు తళుకు దివ్వె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
87*
రాత్రి కల తారుమారైన రాజు-పేద!
లేని దున్నట్లు నున్నది లేనియట్లు-కలయె,
నిజమని తలచిన కలత మిగులు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
88*
బ్రతుకు కలలోన, తాదైవ భాగమనుచు-
నాత్మ విహరించు, నిజమనినంత దిగులు
స్వప్నమనుకొన్న – జీవితం సఫలమగును
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
89*
ప్రేమ నాయుధంబుగజేసి, ప్రేరణొసగి
విజ్ఞ నిరసన-నిరశన, విధులగెలిచె!
గాంధి శత్రుమాయలుద్రోసి గాంచె కీర్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
90*
కూడు, గుడ్డ, గూడును గల్గునాడు మేలు!
దేశ వస్తువాడుక వృద్ధి తేజరిల్లు!
పత్తి యుత్పత్తి, వస్త్రమై, ప్రజలకందె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
91*
బంధ రహితాత్ముడై గాంధి బంధిఖాన-
దలచె గ్రంథాలయమువలె పిలిచె ప్రజల-
నాత్మ పరమాత్మ నెఱిగి మహాత్ముడయ్యె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
92*
ప్రాచ్య పశ్చిమాలకు ప్రేమ బంచిపెట్టి-
హింస రహిత పోరాటాన హితవొనర్చి-
తెల్ల దొరల గెల్చెను విశ్వమెల్ల బొగడ!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
93*
విశ్వ ప్రేమ సౌభాతృత్వ విజ్ఞ కవచ-
నిరసనాయుధమున గాంధి వరస జయము!
మేలు మేలనె విశ్వంబు మేలుకొనియె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
94*
స్వేచ్ఛయు స్వతంత్రము శాంతి చేతమాయ-
దరుమ సుళువు-భక్తియు దైవదారి సాగు!.
తృప్తియానందమై స్వర్గప్రాప్తి గూర్చు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
95*
పుడమిలో స్థూలదేహాన పుట్టునాత్మ-
సూక్ష్మ లోకమేగియు దిర్గు సూక్ష్మ మేన-
దైవదూత భూమినిబుట్టు దివికినేగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
96*
కడుపునింప,నారోగ్యయుక్తముగ తిండి
కలుగ, కల్సిమెల్సియు బ్రత్కు, కలల పంట!
విశ్వ ప్రేమ, సౌభ్రాత్వుత్వ, విధుల మెఱసె!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
97*
స్వర్గ ధామ శాంతి, యహింస, సత్యనిష్ఠ
కలిగి, వినయవిధేయత, కలిమి లేమి-
నొకరి కొకరుగా, జీవింప నొప్పు జగతి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
98*
లక్ష్యమునుజేర,నిరశన దీక్షబూని,
సానుభూతిని గెల్చెను, శత్రుమనసు!
దేహమున నాత్మ చైతన్య తేజదీప్తి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
99*
చిలుక బెరిగిన తనయింటి పలుకు బలుకు!
చెట్టు బెర్గును, పరిసర గుట్టు దెలిసి!
మంచి నెదిగిన, మనిషికి – మహిమ గలుగు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
100*
మౌనమున చిత్తమేకాగ్రమైన నాత్మ,
నహము తానుగా భావించు, అహరహమ్ము!
సేవ భావన-జాతీయ క్షేమ మగును!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
సంపూర్ణం.
101*
మంచిచెడుయాది మయమైన మనసుపొరల-
మంచితలపులే, స్వాస్థ్యమై, మనిషి యెదుగు!
మెదడు, చెడుయాది వర్జింప మేలు బొందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
102*
మంచి భావింప, బ్రతుకున మంచి జరుగు
బ్రతుకు కలగానె గడుపగా, భయము దొలుగు!
వర్తమాన యోచన సాగ వలయు మనిషి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
103*
మెదడు సానుకూల భావన మెదల, బలము!
మంచి వాసన, రుచి, మాట, మంచి పనులు-
కనగ వినగ మేలగు, మంచికాలమందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
104*
అన్నిటికి దైవరక్షణ యున్న నిజము!
మంచి చేకూర్చు, ప్రతికూల మాయ దొలగు
దైవమున జాగృతముగాగ, దనరు శాంతి!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
105*
మితము, తిండి, నిద్ర, విహార, హితవుగాగ-
పస్తు, ప్రార్థన, మదిదైవ బలము గల్గు!
దేహ పీడదొల్గియు, నాత్మ తేజమొందు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
106*
ప్రణవ నాదంబులో సృష్టి పాలపుంత!
ప్రణయ వాదంబులో, స్థితి పరిధి వింత!
ప్రళయ తాండవ,లయముప్రపంచ సంత!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
107*
సతత భక్తినిష్ఠను, నాల్గు శతకములను-
తేటగీతుల నర్పించు తిరుణ హరిని-
సత్యనారాయణ, కవిని స్వామి బ్రోవు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!
108*
శుభము శతకపాఠకులకు శుభప్రదంబు!
శుభము, దైవభక్తి జ్ఞాన శ్రోతలకును,
శుభము మానవాళికి, నిత్య శుభ యశంబు!
ప్రముఖ గురువు యోగానంద ప్రవచనోక్తి!