top of page
శ్రీయోగానంద పరమహంస ప్రణతి శతకము-2
(తే.గీ.)

1*(ప్రారంభం)

శ్రీ జగజ్జననీ సమాశ్రిత సుపుత్ర!

భారతాధ్యాత్మికానంద బ్రహ్మ వరద!

శాస్త్ర శోధక! బోధక! సద్గురుండ!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

2*

శ్రీ పురాతన యోగ శాస్త్రీయ నిపుణ!

సాత్వికోత్తమా! భువిమానవత్వ సూర్య!

పావన క్రియాయోగ సద్బాట సారి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

3*

ప్రాచ్య-పాశ్చాత్య ములుగల్పు భక్తిబాట

సాగె సార్వజనీనమై యోగశాస్త్ర,

జ్ఞాన విజ్ఞానబోధ సోపానమయ్యె!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

4*

పూని విశ్వప్రవక్తల పూర్వనుడుల

తమరు నెరవేర్చ బూనుట దైవకృపయె!

మానవుని మాధవుని జేయు మార్గదర్శి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

5*

కల్గు నాత్మ ముక్తికిదారి కర్మయోగ-

నామమే క్రియాయోగ నీమనిష్ఠ

మరల బాబాజి కృపబొందె-మానవాళి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

6*

కర్మ-సత్కర్మ గా పుణ్య కలిమి గూర్చు!

దురిత దుష్కర్మ దారిద్ర్య దారి కీడ్చు!

కలుగు కీడెంచి మేలెంచు క్రమము మేలు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

7*

పరగ వజ్రాన రవిరశ్మి ప్రతిఫలించు,

బొగ్గు నదినిష్ఫలంబగు బోల్చిచూడ!

సజ్జనుల భక్తి చేకూర్చు సత్ఫలంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

8*

గమ్యమొక్కటే మత తారతమ్యగతుల

కల్గునేకాగ్రత ముదము-వెల్గు నాత్మ!

జ్ఞానమానంద దైవ సంధానదీప్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

9*

ధ్యానమాయుధమై మాయ దరిమివేయు

సంతులనగతి సుఖదు:ఖ-సరణిశాంతి-

గలుగ హృదయాన నానంద కాంక్ష వెలయు!

ప్రణతిగొనుమ యోగానంద పరమ హంస!

10*

దైవదిశలోన సాగిన ధ్యాన క్రియయె

దైవ సంధానమునుగూర్చు దరియు దాపు,

మిగుల దు:ఖపూరితములు మిగత వన్ని!

ప్రణతిగొనుమ యోగానంద పరమ హంస!

11*

భక్తి సత్కర్మలే దైవ బాటసాగు

ధ్యాన కార్యాచరణ బొందు దైవ ప్రేమ!

జీవి ప్రేమగోరును దేవదేవుడెపుడు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

12*

వసుధ బాహిరమగు మానవాళి సేవ

నాత్మపరముగా సాగు జీవాత్మ సేవ!

జీవిజీవిని పరమాత్మ దివ్య సేవ!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

13*

యోగమున మతములు శాస్త్ర యోగ్యమగును

ధ్యానమున మతాచరణలు ధన్యమగును

జగతి దానమే తపముగా – జన్మముక్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

14*

ధ్యానమే శ్రేష్ఠమగు కర్మ తదితరాల-

కన్న నాత్మీయ సద్వివేకంబు మిన్న!

ధ్యానమే శాశ్వతానందదాయకంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

15*

ధ్యానమున నాత్మతేజంబు – దానిచేత

విశ్వ తత్వావగాహన విహిత భక్తి!

నహము నాత్మలీనము జన్మరహిత ముక్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

16*

ధ్యానమున మాయ విడిపోవు దైవదత్త

చేతనముగల్గు – శాంతియు చేరు మదిని

సంతులన జీవనము జన్మ సార్థకంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

17*

సర్వ మతముల సద్యోగ శాస్త్రమట్లు

సాగుయోగదా సత్సంగ సంఘసేవ!

భాగ్యమున దైవదర్శన యోగ్యతెసగు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

18*

మదిని సమబుద్ధి శాంతియు మార్ధవంబు

ప్రేమ సద్భావనానంద ప్రేరకములు!

ధ్యానమున నాత్మగుడి దైవదర్శనంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

19*

నియమ నిష్ఠలాహారాది నిగ్రహంబు

పస్తు, కసరత్తు, మదినిల్పు పట్టుదలయు

ధ్యానమాత్మమోదముగల్గ దరుగు రుజలు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

20*

చావు మరచి సద్భక్తిని సంతసింప

భక్తి ప్రార్థనానందమైపరవశించు-

నాత్మ-ప్రేమశక్తియె, పరమాత్మజేర్చు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

21*

విశ్వ చేతన కుపకార విషయమొకటి,

తగిన క్రమశిక్షణయు రెండు, తాత్వికముగ

ధ్యానమార్గము మూడవ, దారియగును!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

22*

దులరవాట్లతో నిహజన్మ దురిత ప్రాప్తి

దైవ ప్రార్థన సమయంబు దక్కునెపుడు?

భక్తి సాగదు చెరసాల బంధి బ్రతుకు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

23*

స్వేచ్ఛయు స్వతంత్రము జీవికిచ్చి, కర్మ

ఫలితమున తగు జన్మలు గలుగ జేసి

ధ్యాస గల్గించు సద్భక్తి దైవమెపుడు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

24*

ప్రాచ్య పాశ్చాత్యము స్ఫూర్తి-పరగ తృప్తి!

పట్టుదల సమతుల్యమౌ ప్రార్థనలను,

తిరముగానాత్మ దైవమందిరము వెలయు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

25*

ధరణి తలిదండ్రి గురువులు దైవసములు

బుద్ధి, శిక్షణ త్రికరణ శుద్ధి గలుగ

తీర్చి దిద్ధి పిల్లలబెంచు తీరుతెన్ను!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

26*

పరుల మదిప్రేమ తో గెల్చి బ్రతుకువారి

మనసు దైవాను సంధానమైన చాలు-

భక్తి మార్గాన నిర్భీతి – బ్రహ్మ ముదము!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

27*

దైవప్రేమ తల్లిగబుట్టు ధరణి యందు

తల్లి ప్రేమయే బేషర తైనప్రేమ!

పిల్లలకుబంచి పోషించు తల్లి పుడమి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

28*

ఆది శక్తియే స్త్రీలుగా నవని బుట్టి

దయయు దావక్షిణ్యమూర్తులై తల్లి ప్రేమ

విస్తరింపగా పెంపొందె విశ్వమంత!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

29*

తండ్రులందరి వెనకున్న తండ్రి – పరమ

పితగ నివ్వాళులందెడు ప్రియతముండు

తండ్రి దేహ గుడిని వెల్గు దైవమెపుడు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

30*

తల్లి, తండ్రులు తముగన్న పిల్లలట్లు

నితర పిల్లల బెంచగా నింకమేలు!

మాధవుని తత్వమునదేలు మానవాళి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

31*

దైవమున చెరి సగమైన తల్లి దండ్రి

పూని పరపిల్లలను గల్పి పుణ్య మెసగ

పెంచితే దైవమును మెచ్చు పేరు కీర్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

32*

మంచి మనిషైననుజాలు మహిని దివ్య

మానసాంతర జ్ఞాన విజ్ఞాన శక్తి

భగవదానందమన దేలు బ్రతుకు మేలు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

33*

సమయమతి తక్కువ, జన్మ చాలదింక

మరల జన్మించి మరణించు మార్గమేల?

సుకృత క్రియాయోగమున ముక్తి సులభ లబ్ధి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

34*

ఒప్పు పనులలో స్వీయాత్మ నొప్పుమైత్రి

తప్పు పనులనాత్మయె శత్రుతత్వమొందు

ఆత్మ మించు బంధుత్వము – అవనిలేదు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

35*

పరుల తప్పెంచు వారురాబంధు సములు!

పుడమి కలికాలచెడునిండె పుష్కలముగ

మంచి-త్రికరణ శుద్ధిని మనుటమేలు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

36*

ఎప్పుడేకాంత వాసమే గొప్పయైన

భువి సమాజసేవయు కొంతబూనిచేసి

దైవదారికి మరలింప, ధన్యజన్మ!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

37*

మంచి సంకల్పమున కృషి-మంచిఫలము

భువిపరోపకారముగూర్చు పుణ్యధనము

దైవ కార్యము నెరవేరు – దక్కుముక్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

38*

మంచి మార్పు నాత్మల మైత్రి నెంచి గలుగు

శక్తి భావనపనిజేయు యుక్తి వెలయు!

భక్తిపూర్వక సాధన – ఫలము ముక్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

39*

చిత్త నాణెము కటునిటు చిత్తు బొత్తు!

ద్వంద్వములు, నేమి సత్యమై దారిసాగు!

సత్యవ్రతమాచరించుటే సాహసంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

40*

యాదిగా గర్తుకొచ్చేది యాత్మశక్తి!

మదిని సామర్థ్యమున్నంతె-మనిషి యూహ!

ప్రేమ-ప్రాణశక్తిగ నిండి పెరుగు సృష్టి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

41*

తనువు విషతుల్యమైనంత – తగని భయము

చిత్తమాయచీకటి బుద్ధి చితికి పోవు!

మాయతెరజీల్చు సద్భక్తి మార్గమొకటె!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

42*

మొదటి గుడి దేహమున నాత్మ మోద మొసగ-

తృప్తి, ప్రతిగుడి ననుభూతి ప్రాప్తి పిదప

కాంక్ష దీర దైవమును సాక్షాత్కరించు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

43*

అన్ని ధర్మాలలో సత్యమలరు – యోగ

శాస్త్రమేమాయ తెరజీల్చు – శస్త్రమట్లు!

ఆత్మ లక్ష్యసిద్ధిని పరమాత్మ జేర్చు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

44*

తప్పుడలవాట్లు – మనిషియు తనకు తానె,

శత్రువై యహంకారాన మైత్రి మరచు,

కనక-వినక నాత్మయుతానె యనక బ్రతుకు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

45*

వైరి భావన విద్వేష వైఖరి మది

హానిగూర్చు జాతిని బలహీనపరచు!

సఖ్య భావన భక్తియై సత్వమొసగు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

46*

తనకు తానె మంచినిజేయు తపనగలిగి

మంచియలవాట్లనెంచియు మనుట మేలు!

సానుకూల ప్రేమను బంచి-సాగవలయు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

47*

నవ్వులానంద పరబ్రహ్మ దివ్యవరము!

నవ్వు విశ్వచేతన నావ నడుపు సూచి!

పుడమి నవ్వు దేవునిపూజ పువ్వు సమము!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

48*

సతత చిరునవ్వు సంతోషమతుకు జిగురు!

మానవుడు చిరునవ్వు శ్రీమంతుడైన

ప్రాణశక్తి సంపన్నుడై బ్రతుకు చుండు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

49*

డబ్బు వెసనాల సుఖవాంఛ జబ్బు మాన్పు!

సహజ కోర్కె వివేకమై సాగుబుద్ధి

రక్షణ కవచమై యాత్మ దీక్ష నడుపు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

50*

మదివికాసమే కీలకమ్! మానవాళి

సూర్యరశ్మియు వ్యాయామ సూత్ర పటిమ,

మితము పౌష్ఠికాహారసహితము బ్రతుకు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

51*

ప్రకృతి నియమాలు పాటించి-బ్రతుకు తిండి-

పిండి కొవ్వుల తగ్గింపు దండి మేలు!

దైవ నామమౌషద, రుజల్ దరికిరావు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

52*

కూరగాయ – ధాన్యము పండ్లు గూర్చుమేలు-

పాలు-వెన్నలారోగ్యమున్ పాదుకొల్పు-

ముఖ్య పోషణ దేవుని మూలశక్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

53*

ఆబగాదిన్న బాధయే ఆకలైన-

పౌష్టికాహార సమతుల్య పథకరీతి-

అతిని వర్జించిదినుతిండి మితము హితము!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

54*

భయము,విధిపూర్వకదైవ భయము-బాని

సత్వభయములు బాధించు-చావు భయము!

అభయ మిచ్చు దేవునిరక్ష శుభముగూర్చు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

55*

శాంతి రహిత మానస భీతి భ్రాంతి చేత

శిథిల దేహాన రోగియై చింతజెందు!

ఆత్మ దెలియక మాయలో నలమటించు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

56*

ఆత్మ నిగ్రహమారోగ్యమైన దారి!

తగినతిండి, పస్తులు,నౌషదములు భక్తి

ప్రార్థనల చేత నిండును ప్రాణశక్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

57*

పరులకుపకారమొనరించు పనులబూను

నియమనిష్ఠపూర్వక భక్తి – నిర్విరామ

ప్రార్థనలు మెచ్చు పరమాత్మ ఫలమొసంగు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

58*

స్వస్థతాధ్యత్మికాధార శక్తి మేలు

యోగమభ్యాసపూర్వక యోగ్య తెసగు

సకల మత దారులను దైవ సాయముండు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

59*

స్వాస్థ్యకారుడు దైవమే సకలజనుల

యత్నముల వెన్క తానుండు-యాది కొలది

దైవమునుగల్సి బ్రతికెడు దారి నయము

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

60*

దైవ జిజ్ఞాస యొకటె ప్రధాన కోర్కె!

మిగత తాత్కాలికములన్ని మిడుకు పనులె!

దైవసంసర్గమున కోర్కె దరికిరాదు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

61*

తనవలె నితరుగాంచుటే – దైవప్రేమ!

పుడమినేకాత్మలనలరు, సంపూర్ణ జీవ-

శక్తి దైవసంసర్గాన సార్థకంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

62*

విషము,శత్రువిద్వేషమే విశ్వ చరిత-

కాంతకనకాల మోజులో కనలు జన్మ-

పాత్రధారి వీడడు జన్మ సూత్ర ధారి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

63*

చిత్త శుద్ధిని దీరును చిన్నకోర్కె-

మిగుల కోరేది ముక్తియే మిగతవేవి?

జన్మ రహితమై పరమాత్మ జేరుటొకటె!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

64*

చలన చిత్ర జీవనమిది- సకలజనుల-

సమమనస్కతయే జేర్చు సద్గతులకు!

స్వప్న జగతిమాయనుదెల్సి సాగమేలు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

65*

కదలు దైవమే మదిలోన కలసి మెలసి-

యుండగ స్వర్గము బయటనుండునెట్లు?

స్వర్గమున్నది దైవ సంసర్గమందె!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

66*

సత్ప్రవర్తన వెంటనే జనుల మైత్రి

భావప్రకటన స్పష్టము – బ్రతుకు దారి

పూర్ణ సమజీవనము మేలు పుడమి యందు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

67*

మనసు దైవపీఠముగాగ మానవాళి

ధ్యానమగ్నస్థితిని దైవదర్శనంబు-

గూర్చు మదివిశ్వచేతన గురుని కృపయె!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

68*

కలిని వెలిని విశ్వాసమాకాశవాణి!

అంతరాత్మ నారవ సెన్సు ఆప్తవాణి!

ననుసరింపగా మేలగు నరుల కెల్ల!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

69*

జన్మ వదలు పాఠ్యము మరుజన్మ ఫలము!

జన్మ మారదు పుణ్యంబు జతను పడక!

పిదప దివ్యత్వమందగా పిలుపు వచ్చు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

70*

పూను పుణ్యార్జనల జన్మ పుట్టి సాగు!

పుణ్య రహితమే మ్యూజియం పునరు జన్మ!

పాపమచ్చుగా మరుజన్మ బ్రతుకుసంత!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

 

71*

అహము వీడియు జ్ఞానియై యిహమునందె-

తానునాత్మగా నెఱిగిన దైవభాగ-

ఫలము, జన్మరాహిత్యమౌ పరమపధము!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

72*

ఇతరులందున కపటంబు నింతలేక-

నిరతమితర ప్రేమలయత్కు నిత్య బ్రతుకు-

ప్రేమమూర్తిబొందును విశ్వ ప్రేమరూపు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

73*

బల్బు బగిలినా విద్యుత్తు బారునట్లు-

ప్రాణశక్తియు ప్రవహించు ప్రజ్వరిల్లు!

మార్చు-జన్మ బల్బున జేరి మరల వెలుగు!

74*

కలను గాంచినదియు వెలి కలగ దెలియు-

విశ్వచేతన మేల్కొన్న వింత జగతి-

బ్రతుకు కలవలె గాంచుటె-పరమ సుఖము!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

75*

మొదటనాలోచనా రూపు-పిదప వస్తు-

సకల సృష్టి చలన చిత్ర సానుకూల-

వెలుగు రేఖయే-తెరమీద వెలయుబొమ్మ!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

76*

బాధలందున ప్రేక్షక పాత్రమేలు!

భక్తి తాదాత్మ్యమునుజెంద బంధముడిగి తగు

పరిష్కారమిడు దైవ తత్వ సిద్ధి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

77*

నటక రాజుపేదయు బంటు – నాటకాన,

ఎవరి పాత్ర వారిది ముఖ్య మేదియైన

దర్శకునియాజ్ఞ జీవింప దగినపాత్ర!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

78*

వ్యక్తి దృక్కోణమును బట్టి భక్తి కలుగు

భిన్న జీవన స్పందన ప్రీతి రీతి

వర్తన ప్రవర్తన దైవ వరము ముక్తి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

79*

నిత్య కృత్యముల్ తిండియు నిద్రగామ

మింక నేదియో గోరు మనిషి యదేమి?

దైవదర్శన కాంక్షయే ధరణియందు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

80*

లోభియై తలయొగ్గు ప్రలోభములకు

నాత్మ దివ్యత్వమును బొందు నంతదాక!

మంచి చెడుపోరు – కొనసాగు మరల మరల!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

 

81*

మేలుగూర్చు, ఆధ్యాత్మిక మేలుకొలుపు-

శాశ్వత ఫలదమిల సృష్టి నశ్వరంబు!

భగవదానందమున భ్రాంతి భయముదొలగు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

82*

మొదట గుడి గోపురముగాంచి పిదప దైవ-

విగ్రహము గర్భ గుడిజూచు-విధినియాత్మ-

లోన పరమాత్మ గన కర్మ పక్వమగును!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

83*

మొదట విశ్వ వింతయె దైవ విషయ చర్ఛ!

పిదప శోధింప- పరమాత్మ ప్రేమవెనుక-

రాగ రంజిత కైవల్య రాజ్య శోభ!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

84*

మొదట భావన-తదుపరి ముడిపదార్థ-

సూక్ష్మమును-మూట-భౌతిక స్థూలరూపు!

వస్తు సముదాయ త్రిత్వమై వరలు సృష్టి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

85*

భౌతికము సూక్ష్మమును, కారణాత్మకముగ-

దేహములనాత్మ విహరించు, తేజమొప్ప-

పొందునాధ్యాత్మిక స్వేచ్ఛ పుణ్య నిధుల!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

86*

జనన మరణాల పలుమారు చావుబ్రతుకు

భయము వీడియు – పరమాత్మ బాటనెరిగి

మూడులోకాల జన్మించి-ముక్తినొందు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

87*

ప్రాచ్యమందు నాధ్యాత్మిక ప్రాభవంబు

సాగు భౌతికోత్పత్తి పాశ్చాత్యమందు

రాకపోక సాగు – పరస్పరాభివృద్ధి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

88*

జాతులేకమై పాశ్చాత్య జాగృతంబు

మతములేకమై ప్రాచ్య ప్రమాణికంబు!

రాకపోక సమైక్యతా రాహవెలసె!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

89*

తూర్ప పడమరలో గల్గు మార్పుచేర్పు!

సూర్య సంధ్యలు గల్గుటే స్ఫూర్తి గాగ

గలిగె నాధ్యాత్మికము దైవఘటన సాగె!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

90*

సృష్టి తెలివి తేటలకెల్ల స్రష్టయెవరు?

ఈథరు నెవరి మేథస్సు నిండి-దాగె?

సైన్సుకంతుబట్టని రహస్యంబు లెన్నొ!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

 

91*

సిద్ధ గురుబోధచే జ్ఞాన వృద్ధి గలుగు-

సంతులనగతి జీవింప సత్వసిద్ధి-

ముందడుగు జాగ్రత సంయమనము మిగుల్చు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

92*

వ్యసన బంధాల జిక్కిన వసుధ జనుల-

నాత్మ తనమీద ప్రేమతోనలరుదాక-

వేడ్క నాటకమాడించు వెనకనుండి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

93*

ఖాళి మదిమాయ – చెడుచేత గలిసినిండు-

భయమువీడి మంచిని నింపి-భక్తి గలిగి-

మంచి గిరిగీసి బ్రతకాలి-మానవాళి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

94*

దైవ సృష్టియె, దయ్యము- దానిమాయ-

హామి యిచ్చి మరచిపోయి హానిజేయు!

స్రష్టతోగల్సి మనవలె-సృష్టియందు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

95*

కొట్టు యజమానియు మిఠాయి ముట్టనట్టు-

పాలలో వెన్న-నీటిలో తేలినట్టు-

పంకజమువలె బ్రతుకుటే పరగ మంచి!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

96

తగనియత్యాశ, పక్షపాతంబు-మాయ-

దారిమరలించు జాగ్రత-దైవభక్తి-

పరిమళించు జీవనగతి పరమ ముదము!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

97*

మది సదానందపూర్వకమైన శాంతి,

మంచి తనమిహపర సుఖమార్గ సూచి!

మైత్రి – భక్తియు సంతోష ప్రాప్తి గూర్చు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

98*

తప్పులెన్నువారు విమర్శ తట్టుకొనరు!

జనులు దూరమైనను దుడుకు పనులు విడరు!

బ్రతుకులో ప్రేమ పూర్ణమౌ బాట గనరు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

99*

పట్టు విడని యేకాగ్రత ప్రాణశక్తి!

జీవచక్రాల జాగృతి దివ్య దీప్తి!

శ్రద్ధగా ధ్యాన క్రియసాగ సత్ఫలంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

100*

మౌనమును ప్రార్థనయు యోగమార్గ క్రియలు

భక్తి పూర్వక జీవనబాట విధులు!

సాగు దైవానుసంధాన సాధనములు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

101*(సంపూర్ణం)

తనువు చిత్తమునైతికాధ్యాత్మికముగ-

మంచి లక్షణ సముదాయ-మహిసమాజ-

శాస్త్ర ప్రజ్ఞ సాగిన జన్మ సార్థకంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

102*

సర్వతోముఖమగు వృద్ధి-సంయమనము-

సద్వివేక సంకల్పమై సాధ్యపడును!

దివ్యమైన స్మృతినిబొందు దైవనిష్ఠ!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

103*

దైవమునుగాంచు యత్నము-తగిన శ్రద్ధ-

సత్క్రియాయోగ, ప్రార్థనల్ సాగువేళ-

మనిషి భగవదన్వేషణే-మంచి వరము!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

104*

పేరు సత్యనారాయణ తిరుణహరిని-

చంద్రునకు నూలుపోగన్న చందముగను-

నాల్గు శతకాలుగా నీకునంకితంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

105*

సృష్టి జీవుల మనిషియే శ్రేష్ఠుడవని-

నాత్మ పరమాత్మ భాగమైయలరుకతన-

దైవమునుగల్సి జీవింప ధన్య జన్మ!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

106*

దైవ ప్రాధాన్యత బ్రతుకు దారి కృషియు

విత్తనము నాటి – యాధ్యాత్మికోత్తమముగ-

పుణ్య పంటనూర్చగ జన్మ పుడమిగలిగె!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

107*

తగిన విధమగు స్వేచ్ఛ-స్వతంత్ర్యమొసగి-

నిశ్చయాత్మక సంకల్ప నిష్ఠ-సంతు-

బెంచు తలిదండ్రులెల్లరు ప్రేమమయులు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

108*

శుభము-శతకపాఠకులకు సుకృత ఫలము!

శుభము-విశ్వశాంతినిగోరు సభకు శుభము!

శుభము-భారత గురులకు శుభయశంబు!

ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page