
శ్రీయోగానంద పరమహంస ప్రణతి శతకము
(తే.గీ.)
1*(ప్రారంభము)
శ్రీలుజిందు భారత ప్రజాశ్రేయ నిధులు!
పరమగురులు-బాబాజి లాహిరిమహర్షి-
దారి యుక్తేశ్వరునియాజ్ఞ దరలినావు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
2*
శ్రేష్ఠ గురుడు యుక్తేశ్వరుని శిష్యునిగను-
వసుధ వైదేశికోదారవాద సభకు-
భారతీయ ప్రతినిధిగ బంపె ప్రభుత!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
3*
గురుని మాట నీబాధ్యత గురుతరంబు
తత్వ జిజ్ఞాసపరులు-పాశ్చాత్యులంత-
విస్తుబోయిరి-నీబోధ వినినకొలది!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
4*
నీశ్రమ ప్రతిఫలముగా నేటి జగతి-
తారతమ్య బేధము వీడి తత్వమెఱిగి-
నూత్నదృష్టిని-విశ్వాసమూతగొనిరి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
5*
మతము వైజ్ఞానికాంశ సమైక్య కృషియు-
రెంట నేకాత్మ పొడసూపె రేయిబవలు-
సమత సామరస్యముచేత సాగె బ్రతుకు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
6*
ప్రేమ విశ్వరూపమునెత్తె-ప్రేరణొసగె
బాహిరంతర ప్రకృతి సద్భావ పుష్ఠి!
వసుధ మానవ సౌభ్రాతృత్వంబు వెలసె!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
7*
తమరి యోగదా సత్సంగ దారి బోధ-
సక్రియాయోగమానంద శాంతినొసగ-
గమ్యమును జేరె ప్రజ తాతమ్యమనక!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
8*
తూర్పు నుదయించితివి గురు తుల్యమైన-
తత్వబోధన-శోధన దారి గెలిచి-
పడమరాధ్యాత్మికము వెల్గుబంచినావు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
9*
తల్లి మరణింప-లోటును తట్టుకొనక-
నిల్లు వదలి-తాత్విక శక్తి నిచ్చు గురుడు-
స్వామి యుక్తేశ్వరుని బాట సాగినావు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
10*
దైవ భాగమే తానను తత్వబోధ-
అహము నాత్మలీనముజేయు సహనదీక్ష!
జనుల మదివెల్గు నింపిన జగతి గురుడ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
11*
విశ్వమానవాన్వేషణవిస్తరింప-
దివ్యమాత్మ కథాస్ఫూర్తి దీప్తులెగయ-
వెల్తురున్న చోటుకు మమ్ము వేడ్క నడుపు!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
12*
కర్మయోగమే క్రియాయోగ క్రమము సాగ
నీదు సద్బోధ గల్గించె నియమనిష్ఠ-
మానవుని మాథవుని జేయు మహిమనీది
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
13*
వ్యక్తి తనలోని శక్తిని వాస్తవముగ
తాను గుర్తించి పరమాత్మ తత్వమెఱిగి
దైవదారిలో పయనించి ధన్యతొందు!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
14*
ప్రేమ శాంతియానందాలు పెన్నిధులుగ
నాత్మజన్మించు దేహమ్ము నద్దె గృహము
దేహమోజు వీడిననాత్మ తేజరిల్లు!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
15*
భారతీయ పురాతన బ్రహ్మ విద్య
పరగబోధించి పాశ్చాత్య ప్రజల మార్చి
మేలుగూర్చి దీవించిన మేటిగురుడ!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
16*
ప్రజ పరస్పర ప్రేమల ప్రగతి బ్రతుకు
జీవి దైవ ప్రేమయె విశ్వ జీవితంబు!
యిచ్చి పుచ్చుకొనుట విధి నిశ్చయంబు!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
17*
మార్పు మననుండె మొదలైన మంచిదనుచు
మాట చేతల జూపిన బాటసారి!
తండ్రిగా దైవమునుజూపు తమరిబోధ!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
18*
జ్ఞానమున కర్మగాలు-నజ్ఞాన తిమిర-
మంతరించు-నాధ్యాత్మిక మార్గముండు-
ధర్మయుక్త కామార్థ సాధనలు మేలు!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
19*
బ్రహ్మమోదము రుచిజూపి-భక్తి శ్రద్ధ-
నేస్తముగ దైవమును జూడనేర్పి-
భీతిబాపిన సద్గురు ప్రేమమూర్తి!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
20*
దైవ కణమాత్మగా భువి దరలివచ్చి-
పూర్వ పుణ్యఫలముగా బుట్టు మనిషి!
అహము వీడి పుణ్యాత్మడై యలరుచుండు!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
21*
కదలు నీటను వస్తువు గాంచనట్లు
మనసు చంచలమై యాత్మ మరుగు పడును
మనసు నిల్పగా ధ్యానమే మంచిబాట!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
22*
మనసు నిశ్చలమౌ ధ్యాన మార్గమందె-
నీదు బోధ – క్రియాయోగ నియమ నిష్ఠ-
రాంచి యోగదా – పాఠ్య సారాంశమిదియె!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
23*
ధ్యానమే శాంతియానంద దాయకంబు
సాగు ప్రార్థనే సద్భక్తి యోగనిష్ఠ!
భజన పరవశమ్మున గల్గు బ్రహ్మముదము!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
24*ప్రార్థనల సమస్యలు దొల్గి-బ్రతుకు వెలుగు-
ఆత్మ గాంచ నేకాగ్రత నలరు శాంతి-
బాట నాధ్యాత్మికానంద పరవశమ్ము!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
25*
ధ్యానమున నాత్మ – పరమాత్మ దర్శనంబు-
బింబ ప్రతిబింబమైబోలు ప్రీతిగొలుపు-
ఆత్మ పరమాత్మ భాగమై యలరుచుండు!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
26*
మూడు కాలాల యాదిచే మూగబోయి
యలసి సొలసి మూఢముగాగ నలజడెదుగు-
వర్తమానయోచన మేలు వాస్తవముగ!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
27*
గతము మెట్లపై భవితవ్య మూతగొనియు
పథకమూహ-నిర్మాణమై పనుల సాగు-
వర్తమాన కర్తవ్యమే వన్నెవాసి!
ప్రణతిగొనమ యోగానంద పరమ హంస!
28*
బ్రతుకు నిస్సాయమనుకోక పట్టుదలగ
మంచి కార్యసాఫల్యతా మార్గమెరుగు-
పూని పూరింప సత్ఫలమ్ పుడమియందు!
ప్రణతిగొనమ యోగానంద పరమహంస!
29*
బల్బ దేవహము – విద్యుత్తు ప్రాణ శక్తి-
వసుధ దైవచైతన్యమే వాస్తవాస్తి!
దేవ-జీవప్రేమయె బ్రహ్మతేజమగును!
ప్రణతిగొనమ! యోగానంద పరమ హంస!
30*
పూర్ణ భక్తి విశ్వాసాలు పూని దైవ-
ప్రేమ పాత్రత సాధింప పేరుకీర్తి!
జీవి ప్రేమనే గోరును దేవుడెపుడు!
ప్రణతిగొనమ యోగానంద పరమహంస!
31*
ఆత్మ నేనన్నచేతనానంద గరిమ!
తనువు నేనన్న దు:ఖంపు తలపు మదిని-
దైవ శరణాగతిని జన్మ దరచ మేలు!
ప్రణతిగొనుమ యోగానంద పరమ హంస!
32*
బాహిరంతర ప్రకృతి భావఝరులు
కలుగు మార్పు చేర్పుల తీర్పు-కాలమహిమ!
ఆత్మ శక్తిగెల్చుట తథ్యమవనియందు!
ప్రణతిగొనుమ యోగానంద పరమ హంస!
33*
అహము తనువుగా భావింప నదియె చావు-
ఆత్మ తానన్న భావన – అవని జన్మ-
జనన మరణాల కవతల-జన్మ ముక్తి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
34*
బ్రతుకు బాధలు-వ్యాధులు బహుప్రయాస!
ఓర్పు నేర్పు పరిష్కారమొప్పు శ్రమల-
తప్పుకొనక నెదుర్కొన్న తగిన జయము!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
35*
సృష్టి నాత్మీయ ప్రేమనే స్రష్టగోరు!
ఆత్మ దైవ ప్రేమనుగోరు నవనిజన్మ-
ప్రకృతి పురుషుల ప్రేమ పరస్పరంబు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
36*
తనువు కోవెలలోనాత్మ తళుకులీను!
ఆత్మ గుడి దైవనిలయమైయలరుచుండు!
విశ్వదైవమే తలిదండ్రి-విభుడు సఖుడు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
37*
కరిగితే నిగ్గుదేలిన కనకమట్లు-
జనన మరణాల పరిశుద్ధి జరుగునాత్మ!
దైవమును జేరగా జన్మ ధన్యమగును!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
38*
భక్తి ప్రార్థనౌషదమున-బాధలోర్చి-
సమమనస్కత జీవింప సానుకూల-
భావ ప్రావీణ్యతయుగల్గు బాటమేలు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
39*
నవ్వులేడ్పుల సహజమౌ పువ్వు బ్రతుకు!
పుడమి మూన్నాళ్ళ ముచ్చటే-పూని నవ్వి-
పుణ్య సంచితార్థముగొని పోవ మేలు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
40*
జగతి మాయ జీల్చగ భక్తి జాగృతంబు!
భజన ప్రార్థన మదిబొందు పరమ సుఖము!
యోగ సాధన నాత్మ సాయుజ్యమొందు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
41*
సృష్టి ప్రేమశక్తియె ప్రాణ పుష్టి గూర్చు-
నాత్మ ప్రాణశక్తియె జగన్మాత శక్తి!
ప్రాణవాయువై బ్రతికించు-ప్రాణికోటి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
42*
వ్యక్తిగత ప్రేమ లేకమైవ్యక్తపరచు-
విశ్వ ప్రేమయే పరబ్రహ్మ విశ్వరూపు!
విశ్వ త్రైమూర్తి కర్తవ్య విధులమెఱయు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
43*
పుట్టుకయు తల్లి దండ్రికి పూర్ణముదము!
మరణమును వృద్ధులకు మహాభరణమగును!
దైవ భాగమాత్మయుజేరు-దైవమందు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
44*
పరమ పిత సంతతైన ప్రపంచ జనులు-
భిక్షగాగాక బిడ్డలై ప్రీతి నడుగ-
దైవమును మెచ్చు – వరమిచ్చు దరికి జేర్చు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
45*
ధ్యానమార్గాన మాయను దాటి- మనసు-
భ్రమను వీడగా బ్రతుకు భయముదొలగు!
భయము భక్తి శ్రద్ధగ మారి ఫలమొసంగు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ!
46*
ధ్యానము సరళరేఖిగా దైవశక్తి!
సానుకూలమై స్పందించు మానవులకు-
జీవ శ్రేష్ఠత గలిగించె దేవుడెపుడొ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
47*
తేజ కణముగా నాత్మయు దేహమందు-
విస్తరించె చైతన్యము వెలుగుజిందె!
వెల్తురున్న చోటునుజేర వెదకులాడె!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
48*
బ్రతుకు బాధ-సమస్యల బందిఖాన
కారణార్థము తగు పరిష్కారమరసి-
చేయు విధులందు ముందడుగేయవలయు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
49*
మర్త్య మానవ భావన మరచి నరుడు
తాను దైవసంతతియను తత్వమెఱిగి-
ఆత్మ తేజాన జీవింప అమరకీర్తి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
50*
చిత్త శుద్ధి సుస్థిరతయు చేయు పనుల-
ధైర్యము-సాహసంబున సిరి దక్కు భువిని-
దానమే తపముగ జన్మ ధన్యమగును!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
51*
అంతరంగికానందపుటమరభావ
తతుల తనువు బాధలు తొల్గి మర్త్య భావ-
ముడిగి-మాయదొల్గగ బ్రహ్మ మోదమలరు!
ప్రణతి గొనుమ యోగానంద పరమహంస!
52*
పీఢ కలజీవితము మది భీతిమాని-
ప్రీతి నాత్మయు-పరమాత్మ రీతి నెఱిగి-
భ్రాంతి వీడిన-సుఖశాంతి భద్రమగును!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
53*
సుఖమె భావింప బ్రతుకంత సుఖము శాంతి
ప్రజల సేవింప సంతృప్తి-బ్రహ్మముదము!
మానసిక సంతులనగతి మనుటమేలు!
ప్రణతిగొనుమ యోగానంద పరమహంస!
54*
ఆత్మ దైవ సాయముచేతనలరమేలు!
నరుల మిథ్యాత్మ భావన నష్టపరచు!
సానుకూల భావన కార్య సాధకంబు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
55*
భావ ప్రతికూలత-ద్వంద్వఫలమొసంగు-
బ్రతుకు సుస్థిర ప్రజ్ఞత బలము గూర్చు!
సానుకూలతే ప్రేమయై సర్వమిచ్చు!
ప్రణతిగొనుమ యోగానంద పరమహంస!
56*
గురు సమమనస్కత గీతగుర్తుజేయు,
భ్రాంతి ద్రోసి-శాంతినిపొంది బ్రతుకనేర్చు –
వారినేమెచ్చు దైవంబు వరములిచ్చు!
ప్రణతి గొనుమ! యోగానంద పరమహంస!
57*
తనువు మది రుగ్మతలుతగ్గు-దైవనామ-
మౌషదమ్ముగాగ చికిత్స – మార్గమందు
ప్రాణశక్తియై ప్రవహింప బ్రతుకునిలుచు
ప్రణతి గొనుమ యోగానంద పరమహంస!
58*
నవ్వు లౌషదతుల్యముల్ దివ్యవరము,
నవ్వినవ్వించు సత్కీర్తి నయముజయము!
ధన్యవాదార్హులు పుడమి దైవసములు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
59*
క్షేమమునుగూర్చు ధరలోన ప్రేమశక్తి!
బ్రతుకుపూయునవ్వులపూత ప్రాణశక్తి!
దివ్యవరములై యందుట దైవ కృపయె!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
60*
ధర్మ పక్షపాతియె భువి దైవదూత!
మాయకులవంచి బ్రోచునమాయకులను
లీలగాజనుల లాలించు నెపుడు!
ప్రణతి గొనుమ!యోగానంద పరమహంస!
61*
బుద్ధి శుద్ధిగా సద్యోగ సిద్ధి గలుగ
దిద్ధి తీర్చును తమబోధ దివ్యదారి
సద్గతినిగూర్చు జోహారు సద్గురుండ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
62*
జ్ఞాన దీప్తుల తొలగు నజ్ఞానమాయ
అహమునాత్మగాభావించి నంతరాత్మ-
యందు పరమాత్మ నిలయమానందమొసగు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
63*
శమదమాది సులక్షణ సారమతులు-
భువి-జితేంద్రియులై క్షమా బుద్ధి బ్రతుకు
గుర్తు జేసిన మేటి సద్గురుడవీవు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
64*
త్యాగమేమూలమగు దాన తత్పరతకు-
దానమే కలికాలన తపసుగాగ-
తేటతెల్లమాధ్యాత్మిక తేజ గురుడ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
65*
స్వస్థతకు శుద్ధి – శుభ్రత సాత్వికతయు
సమయపాలన బ్రతుకున సత్యవ్రతము
అతిని వర్జింప జేసిన అమర గురుడ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
66*
మనిషి మదిమంచి మర్యాద మార్థవముల
దయయు దాక్షిణ్య పూర్వకాదరణ జూపి
ధ్యానమగ్నుల జేసిన-తాత్వికుడవు
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
67*
ధర్మ వైరుధ్య భావనాదారి మలిపి
నీతి నియమనిష్టల భక్తి రీతి దెలిపి
శిష్యులను తీర్చి దిద్ధితో శీఘ్ర గతుల!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
68*
యజ్ఞ దీటుగ సుజ్ఞాన యజ్ఞమందు
నిత్యశాంతి సదాచార నియమనిష్ఠ
పుణ్యనిధులైరి నీబోధపూర్వకముగ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
69*
సతతశాంతి యానందాల సాగు జీవ-
ప్రేమ సన్మైత్రి పూర్వక ప్రేరణొసగ
సాగు సమదర్శి పొందును సద్గతులను!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
70*
ముక్కుసూటివర్తన మునుముందటడుగు
నిరత నిస్వార్థకారుణ్య నియతి గలిగి
ద్వేష రహితుడే జీవన తేజమొందు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
71*
అహమువీడియు నిస్వార్థ సహనబుద్ధి
యోర్పు నేర్పుల సామర్థ్య మొప్పదినము
సాగు నధ్యయనాలతో సమతవెలయు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
72*
మదిని దృఢనిశ్చయము మంచి మార్గ గమన-
నిత్య నిష్కామ్య కర్మపు నీతి ఫలము!
భగవదర్పణ చేగల్గు పరమపదము!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
73*
యోగ సాధన వరముక్తి యోగ్య క్రియల
భక్తి యోగమే సుళువైన బాట సాగ
బ్రతుకు సమదర్శి సొమ్మగు పరమ పదము!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
74*
కలత – అతిమోదమతిదు:ఖమలజడియును-
గతపు బాధల ప్రతికూల గజిబిజియు-
నిరత సానుకూల్యముచేత నిమ్మలించు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
75*
మంచి చెడుకాలములయందు మంచినెంచి
కలిమి లేములనొకతీరు గడుపువారు-
ద్వంద్వములకతీతులు-జనవంద్యులెపుడు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
76*
ఇంటి వొంటిపై మమకార మంటనీక
మనిషి విధిబాధ్యతల సంయమనము గలిగి
సాగు సాత్వికజీవన సరణి మేలు!
ప్రణతి గొనుమ! యోగానంద పరమ హంస!
77*
బ్రతుకుదెరువున సత్సంగబాట భక్తి
నోర్పు-ధారణ యాది ధైర్యోపకార –
గుణము సద్వాక్కు సంపద గూర్చుయశము!
ప్రణతి గొనుమ! యోగానంద పరమ హంస!
78*
పుడమి భక్తులు స్త్రీ లైన పురుషులైన
గమ్యమును జేర్చువిధి తారతమ్య మనక
పాత్రలను మార్చు మరుజన్మ సూత్రధారి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
79*
ఎంతబ్రతికినా నూరేళ్ళె వంతపాట!
బ్రతుకు గొప్పలు తుప్పలే – పరగనాత్మ
చరమ లక్ష్యము – పరమాత్మ జేరుటొకటె!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
80*
మానవునిచేష్టయే ప్రకృతి హానికరము
కలుగు సంక్షోభముల్-స్వార్థమే కలియుగాన!
దైవచేష్టల కలిమాయ దగ్ధమగును
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
81*
ధరణి ధర్మోద్ధరణచేయు-దైవయిచ్ఛ!
సానుకూల స్పందనవెంట సకల జనుల –
సహజ సిద్ధ జీవన కేళి – సాగ మేలు!
ప్రణతిగొనుమ యోగానంద పరమ హంస!
82*
నిండు కుండ తేనెజెఱచు నీటిబొట్టు!
ఇనుప ముక్క త్రుప్పునరాలు యిసుకవలెను-
చెడ్డయాలోచనె మనిషి చేటుగూర్చు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
83*
దైవ ప్రేమయే సృష్టికాధారశక్తి!
సృష్టి జీవుల మనిషియే శ్రేష్ఠడగుట-
బ్రతుకు సమదర్శియై ముక్తిబాట నడుచు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
84*
జీవ సమదృష్టి-జీవింప దేవునాజ్ఞ!
భువి పరోపకారార్థమై పుట్టె మనిషి-
మానవాళి సమైక్యతే మనిషివంతు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
85*
మానవత్వంబు దీపించ మంచిబెంచి
భక్తి దైవానుభూతిని బడిసి తోటి-
మేలుకొల్పిన మనుజుడే మేలుబొందు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
86*
స్వేచ్ఛ భద్రత మదిదైవ చేతనముల
మాయదారికినెదురొడ్డు మనిషిగెలుచు!
ప్రేమ పూర్ణ జీవనమిచ్చు పేరుకీర్తి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
87*
కపటి గాక తాతెరచిన గ్రంధమగుచు
మంచిచెడును విశ్లేషించి-మనిషినెంచి
గమ్యమును జేరయత్నింప గలుగు జయము
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
88*
అంతరాత్మ హెచ్ఛరికల ననుసరించి
వెనకముందాడకను భక్తి వెలుగుబాట –
బ్రతుకు యాత్ర సాగిన జేరు పరమపదము!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
89*
మంచిసంకల్పబుద్ధియు – మనసు శుద్ధి –
భువి పరోపకారముచేత పుణ్యసిద్ధి-
మనసుసాక్షిజెప్పినతీరు మనగ వృద్ధి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
90*
బ్రతుకు భారము దేవునిపైనవేసి
పట్టు విడకనోటమి మెట్లపైకినెక్కి-
గమ్యమును జేరి గెల్వగా ఘనయశంబు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
91*
మదిని సృజనాత్మకత గూర్చి – మనిషిచేత
పనులు జేయించి ఫలసిద్ధి-పరగనొసగ
శరణు జొచ్చిన దైవము కరుణ జూపు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
92*
కలుపు మొక్కలై వ్యసనాలు కడకు ముంచు!
కలుపు దీసిన బ్రతుకు సంస్కారమొందు!
పుణ్యముల పంట నూర్చగా పూనవలయు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
93*
చెడును వాయిదా వేసిన చేటు దప్పు!
మంచి తక్షణ కర్తవ్యమెంచి చేయ-
పుణ్య ఫలసిద్ధి-నరజన్మ ధన్యమగును!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
94*
సత్య వ్రతులు-సద్గుణులు-సంస్కారమతులు-
దుష్టులకు దూరముండుటే దురిత హరము!
భక్తి నియమ నిష్ఠల బ్రతుకు భద్రమగును!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
95*
క్షమయె యోధలక్షణమగు-క్షమయె శాంతి!
ధైర్యము స్థైర్యము – మదిమార్ధవమ్ము!
ఐక్య భావన సంక్షేమమైయలరు జగతి!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
96*
మంచియలవాట్ల మీదనే మనసు నిల్పి-
మంచి గని-విని-మాటాడి-మంచిజేసి
మంచి పేరు కీర్తిని గాంచు మనిషి ఘనుడు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
97*
సానుభూతి యోదార్పు-సంయమనము-
సాయ సహకార నిస్వార్థ సహిత సేవ-
భువి పరోపకార గుణము పుణ్యప్రదము!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
98*
వేడ్క పరమాత్మ కోసమే వెదుకులాట!
యుగయుగాలుగా సాగు సాయుజ్యమునకు-
నాత్మ లక్ష్యము-భగవదానంద గరిమ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
99*
దైవ చేతనా సాగర తేజ కణము
తేలితే జన్మము-మునిగితేనె చావు-
గాగ జన్మ జన్మలనీదగలుగునాత్మ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
100*
జ్ఞానమానంద ప్రేమ విజ్ఞాన విధుల-
దైవ చింతనచే జన్మ దరలియాత్మ-
జన్మ రహిత ముక్తినిబొందు జగతియందు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
101*(సంపూర్ణం)
పేరు సత్యనారాయణ తిరుణహరిని
చంద్రునకు నూలుపోగన్న చందముగను
నాల్గు శతకాల నర్పింతు నయమొసంగు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
102*
పరుల నాదరించిన పుణ్య ప్రదము పుడమి-
తపము కన్న దానము మిన్న తత్వమెఱుగ
ఆత్మ చైతన్యమున పరమాత్మ వెలయు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
103*
కలుగు మతమార్గములు వేరు గమ్యమొకటె
దైవమే గమ్యముగ జన్మ దాల్చునాత్మ!
ఆత్మ కోసమే దైవంబు నవతరించు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
104*
నిత్య కృత్యాలలో నైన నిద్ర నైన-
దైవమే ధ్యాసగాసాగు దివ్య ప్రేమ-
సద్గతినిగూర్చు నీబోధ సద్గురుండ!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
105*
పూని దైవోపదేశంబు బొంది జగతి-
దైవసందేశమందించి-దయను బ్రోచి-
వేడ్క సూక్ష్మలోకాలకు వెడలినావు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
106*
శ్లాఘనీయము నీకథా సార్థకముగ-
నిత్య పరిశీలనాత్మక సత్య విషయ-
గ్రంథరాజమై మముజేర్చు గమ్యమునకు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
107*
నీ త్రివిక్రమ స్ఫూర్తి పవిత్ర బోధ-
భక్తి వెలుగు క్రియా యోగ బాటసారి!
ప్రముఖ గురులందు నీపేరు ప్రకటితంబు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!
108*
శుభము మానవాళికి నిత్య శుభకరంబు!
శుభము భారతాధ్యాత్మిక సూక్తములకు!
శుభము శతక పాఠకులకు శుభయశంబు!
ప్రణతి గొనుమ యోగానంద పరమ హంస!