
పవనపుత్ర శతకము
(ఆ.వె.)
1*
శ్రీ హరీశ! తరుచరేంద్ర! సువర్చల-
వరుడ! విద్యలందు-గురుడ! బ్రహ్మ!
వాసవాది వినుత! వానరేంద్ర! హనుమ!
వావిలాల వాస! పవనపుత్ర!
2*
ఖాది సదన! ఇష్టకామ్యార్థ ఫలధాత!
అమర వినుత దేహ! అజరభూజ!
రామదూత! దుష్టరాక్షస సంహార!
వావిలాల వాస! పవనపుత్ర!
3*
చిన్న నాటగలిగె! చిత్తభక్తిని నీవె-
దైవమన్నమాట-దండిబాట!
భద్రమయ్యె! నీదు భజన సాగెనునోట!
వావిలాల వాస! పవనపుత్ర!
4*
నటనసూత్రధారి!నారాయణా భక్త!
ఘటన పాత్రధారి-గంగ రేడ!
రోమరోమమందు రామనామ నినాద!
వావిలాల వాస! పవనపుత్ర!
5*
రామ రావణ సమరాంగనమున నీదు
రథముసాగె! తగిన రచననీదె!
సామి లక్ష్మణ హిత! సంజీవరాయడా!
వావిలాల వాస! పవనపుత్ర!
6*
బమను మెచ్చి తనదు బాహుబంధము జేర్చి
కౌగిలించె సామి- కరుణగాంచె!
భరతసముడవని భావించి దీవించె!
వావిలాల వాస! పవనపుత్ర!
7*
స్వామి భక్తిపూర్ణ సాహిత్య-సత్కీర్తి!
దాస్య భక్త శ్రేష్ఠ! దాసదాస-
భావయుక్త పరమ భాగవతోత్తమ!
వావిలాల వాస! పవనపుత్ర!
8*
శ్రీహరినిగొలువ!శివునాంశ జన్మించి-
రామబంటువైన-వామదేవ!
రామభక్త పూజ్య-రామేశ్వర! శరణు!
వావిలాల వాస! పవనపుత్ర!
9*
ఎంతవింతయొ?శివకేశవ సామ్యత-
భక్తభావపూర్ణ-బ్రహ్మ నిష్ఠ!
లోకకంఠక వధ! లోకభాంధవ కథ!
వావిలాల వాస! పవనపుత్ర?
10*
పలికె నొకటె, రామ-ములుకు నొకటె పత్ని
యొకతె! ధర్మమగుచునొప్పె నాడు!
ఆంజనేయ-శరణు! అర్థనారీశ్వరా!
వావిలాల వాస! పవనపుత్ర!
11*
మాటతీపి రసపు మేటరామాయణం-
దు:ఖరసపు బాట-దురితహరము!
భరతకీర్తిహంసి-పారమేష్ట్యము సదా!
వావిలాల వాస! పవనపుత్ర!
12*
కలుగు మార్పు తీర్పు కాలానుగుణముగా
నీతివిలువబెంచు నియమ ఝరుల-
నీదు గీత బోధ – నినదించు- నలుదిశల్
వావిలాల వాస! పవనపుత్ర!
13*
కృష్ణ రాజనీతి క్రీడలో క్రీడియే
విజయుడయ్యె! కీర్తి వెలసె భువిని!
ధర్మవిజయమెపుడు దప్పదు జగతిపై
వావిలాల వాస! పవనపుత్ర!
14*
కలియుగాన మంచి కాలంబు పాతికై
ధర్మ ధేనుగుంటె ధరణియందు-
పావుధర్మమందె-ఆవుగా బతికించు!
వావిలాల వాస! పవనపుత్ర!
15*
భీష్మునట్లు నిల్పి-బింకంబునణగించి-
తలను పండజేసి-తళుకు గూర్చి-
పుణ్య పక్వమెసగి-పొసగమోక్షము నిమ్ము!
వావిలాల వాస! పవనపుత్ర!
16*
మనసు వినదు నితరమార్గసాయముగోరు
ఆశవిడదు పరుల యాచజేయు!
సుంతపుణ్యమునకు సొంత సొమ్ములనదు!
వావిలాల వాస! పవనపుత్ర!
17*
వయసు మీరి మనసు బతుకాశలెందుకో
తానె మిగిలియాత్మతలపులేల?
సంతుకొఱకు ఇంక సపాదన తపన!
వావిలాల వాస! పవనపుత్ర!
18*
జనన మరణ భయపు జంజాటమును మాన్పి
ఉన్నమూడునాళ్ళునూర్థ్వదృష్టి-
సాగిపోవు ధైర్య సాహసమును గూర్చు!
వావిలాల వాస! పవనపుత్ర!
19*
చిత్త చింతదులిపి-విత్తధైర్యము నిలిపి-
గతపు చెత్త మరిచి-గమ్యమునకు-
సాగజేయు భక్తియోగ మార్గమునిమ్ము!
వావిలాల వాస! పవనపుత్ర!
20*
దాసదాస!రామదాసనీ సద్భక్తి-
రాముగెలిచె-నిన్నె సామిమెచ్చె!
దాసదోషమాయె-దండంబుతోసరి!
వావిలాల వాస! పవనపుత్ర!
21*
మారుమూల పల్లె-మానేటికెరటాల
ఊసులాడు తల్లి – నోచె నేమి?
వరదలెత్తి పోసి-కరువునెత్తిన మోసె!
వావిలాల వాస! పవనపుత్ర!
22*
వందురైన-మిట్ట చంద సేద్యముబోలె!
తాగు నీటి కరువు వాగుదరిని-
తల్లిగాసమునకె-తండ్లాట ఏటేట!
వావిలాల వాస! పవనపుత్ర!
23*
మాట వరుస-పిలుపు మార్ధవ మరియాద
యాది మరువలేని-ఆదరంబు!
కౌతుకమ్ము-నేక కౌటుంబ జీవనం!
వావిలాల వాస! పవనపుత్ర!
24*
అండ దండలున్న-కొండెగాళ్ళె-మిగత-
సగటుమాయకత్వ-సరణి బతుకు!
ఊరిపౌరవయసు-నూరేళ్ళ పైపాటె!
వావిలాల వాస! పవనపుత్ర!
25*
అమ్మగారిబొట్టు-అయగారి సేద్యము
కుటిలరాజకీయ-కుత్సితాలు!
హళ్ళికళ్ళి సున్న జీవననకేళి!
వావిలాల వాస! పవనపుత్ర!
26*
నాటి యతిథి-ఘనుడె! నైజాము మనుమడు!
బగ్గినెక్కి వచ్చు-బహుమతొసగు!
రెచ్చి పోయియూరు-రేపల్లెగాపొంగె!
వావిలాల వాస! పవనపుత్ర!
27*
వెలిగెమంచి కీర్తి వేగమే బహుకాల
మేగె-కరువు కలతలెగిసె! జనుల
నైకమత్యముడిగె! నలజడి బయలెల్లె!
వావిలాల వాస! పవనపుత్ర!
28*
బతుకు దెరువు వలస బాటలోచదువరుల్
సాగిపోవ-జవము-సత్వముడిగె!
రిత్త ధనమె మిగిలె-రీతియస్వస్థతే!
వావిలాల వాస! పవనపుత్ర!
29*
ఆడసంతు గోల-అరువుకట్నపు జాడ
శ్రద్ద దరిగి వెసన పద్ధు సాగె!
వీగిపోయె జనత-మూగవోయెను కథ!
వావిలాల వాస! పవనపుత్ర!
30*
అరసి-నూరుబాళ్ళు నమ్ముకొనెడు నేల-
అమ్ముకొని తినంగ-సమ్మతాయె!
తిండి-పెండ్లి-పుల్క-దండికష్టపు మెల్క!
వావిలాల వాస! పవనపుత్ర!
31*
రామనంద తీర్థ-రాహలో చేనేత
ఖాదిసంస్థ సొంత కార్యమయ్యె!
రంగులద్ధు పనుల పొంగె కలంకారి!
వావిలాల వాస! పవనపుత్ర!
32*
ఖాది కారుకాన-గాంధేయ రాట్నమై
నూలువడికె-వస్త్ర నూత్న శోభ-
తేజరిల్లె వస్తు దేశీయమై వెల్గె!
వావిలాల వాస! పవనపుత్ర!
33*
డబ్భు జబ్బులెగసె! ఆరోగ్య భాగ్యమే
అందిపుచ్చుకొనెడు సంధులేక-
బతుకు భారమయ్యె-భద్రత సమకూర్చు!
వావిలాల వాస! పవనపుత్ర!
34*
తరము మాయమయ్యె! తత్వ చింతనగల్గె
నీదుభక్తి మదిని నివ్వటిల్లె!
సంకట హరణ! భువినింకేది ఊరట!
వావిలాల వాస! పవనపుత్ర!
35*
చేదుకోగ రమ్ము! సేదదీరగ జవ-
సత్వమొసగు! భక్తి సాధనముల-
ఆదుకోగ రమ్ము! బాధలుబోకార్చు!
వావిలాల వాస! పవనపుత్ర!
36*
సాధు హృదయ! రామసామ్రాజ్య రక్షక!
దీక్ష-దక్ష-హనుమ! దీనపోష!
ధర్మ పక్ష పాతి – కర్మసాక్షివి తండ్రి!
వావిలాల వాస! పవనపుత్ర!
37*
కోర్కెదొలుగ-శోక కోరమొక్కిలి బోవు!
సంతసంబు నిండ-శాంతివెలయు!
తృప్తి గలుగ భక్తి తేలియాడును జాతి!
వావిలాల వాస! పవనపుత్ర!
38*
సంపదొకటె ఇచ్చి సంతుసోమరి జేసె!
కలిమిదృష్టి కదిలె-చెలిమి మరచె!
పాడుబుద్ధి – గతపు- పాతరకాపుంచె!
వావిలాల వాస! పవనపుత్ర!
39*
చేతగాని మాట చెల్లని రూప్యమే
మాట పథ్య సమము సత్యమొకటె!
మనసు నిల్పి బ్రహ్మ మార్గంబు బోధించు!
వావిలాల వాస! పవనపుత్ర!
40*
వెసగ కరుణ బ్రోవు! వెన్నంటి బోధించి
కన్నువిప్పు గూర్చు-కార్యశూర!
చాడికోరు మార్చి సామాన్యు గాపాడు!
వావిలాల వాస! పవనపుత్ర!
41*
విద్యలిచ్చు గురులు-విత్తమిచ్చు విభులు
భూములిచ్చురైతు-భూరిగాను-
ఇవ్వబోరు – సంతుకింగితజ్ఞానంబు!
వావిలాల వాస! పవనపుత్ర!
42*
విలువ సున్న నీతి-విజ్ఞాన రహితాళి-
నిలువబోదు-వెసన నిప్పు రగులు!
సుజను జేసీ వారసుని బెంచుటేనయం!
వావిలాల వాస! పవనపుత్ర!
43*
వారసత్వ పంపు-వర్థిల్లు ధరలోన
గడన గలుగ వృద్ధి గలుగు – బతుకు-
మంచిబెంచు విధుల మార్గమే పదివేలు!
వావిలాల వాస! పవనపుత్ర!
44*
అధికభాగ్యమేది?ఆరోగ్య భాగ్యమే!
అధికశాంతి సుఖములలరు నపుడె!
గాక ఎన్నియున్న కాంతి విహీనమే!
వావిలాల వాస! పవనపుత్ర!
45*
ప్రాథమికవసర, వరాలు- నియమ నిష్ఠ
గడపకున్న వెఱ్ఱిగలిగి కూలు!
కృషిని, శ్రద్ధ, భక్తి గీలించి మనవలె!
వావిలాల వాస! పవనపుత్ర!
46*
తెలియరాదు ముందు దేలె ముమ్మిరిదశ-
తెసిసినంక కట్టతెగిననీరు!
ధనముకన్న మూల్య ధనమగు స్వాస్థ్యము!
వావిలాల వాస! పవనపుత్ర!
47*
చేయిగాలియాకు చేబట్ట నిష్ఫలం
కడకు జేయు పనియు మిడుకుడొకటె!
నీరురాకముందె నింర్మించవలె – కట్ట!
వావిలాల వాస! పవనపుత్ర!
48*
పొసగనున్నదె సరిపోవును, పోయింది-
పొల్లుగాగ దలచి-ఇల్లుదిద్దు-
అనభవ ఫలరుచుల-ఆస్వాదనమె-మేలు!
వావిలాల వాస! పవనపుత్ర!
49*
స్వార్థతేగ సిద్ధి సామాన్యు పనిగాదు-
సాధన సమకూర్చు-సత్ఫలంబు!
కలిమి సోమరితన గబ్బుజబ్బుల మేట!
వావిలాల వాస! పవనపుత్ర!
50*
అన్నిరుచుల పచ్చడట్లు సంతృప్తితో
నిబ్బడగు నుగాది-పబ్బరుచులు-
తీపికన్న చేదె తీవ్ర రుగ్మతమాన్పు!
వావిలాల వాస! పవనపుత్ర!
51*
బాలరామమూర్తి బాట కార్మిక సంస్థ
ప్రాంగణ గుడిగట్టు భావ భక్తి-
పూనుకొనియె మేస్త్రి బొజ్జ చిన్నరుసన్న!
వావిలాల వాస! పవనపుత్ర!
52*
ఖాది కార్య కర్త కరసేవ ఫలముగా
నీదుమందిరంబు నిలిచె నాడు!
వేగజరిగెనంత విగ్రహ ప్రతిష్టలున్.
వావిలాల వాస! పవనపుత్ర!
53*
ప్రీతి మండపంబు పిదపనెలకొల్పగా
దీప ధూప పూజ దినముజరిగె!
వరుసభజనలు శనివారసాయంత్రముల్
వావిలాల వాస! పవనపుత్ర!
54*
భక్తియంకురించె- ప్రసరించెనూరంత-
గొప్పయూరటొంది గొలిచె నిన్ను-
కాలసేపమయ్యె-కార్మికులకునెల్ల!
వావిలాల వాస! పవనపుత్ర!
55*
పొసగ భజనలందు-పోటికీర్తన కొన-
సాగె నీదుకథల సాంస్కృతికములు-
బహుమతులను పొందె-భక్తియు పెంపొందె!
వావిలాల వాస! పవనపుత్ర!
56*
భక్తి పారవశ్య పాలవెల్లియు పొంగె-
శ్రమను భ్రమను మరచె-జనము మంచి
మనసు నిమ్మలించె-మధురవిరామమై!
వావిలాల వాస! పవనపుత్ర!
57*
చిన్నపెద్దలనక చేరిపూజించగా
మొలక వృక్షమయ్యె-మోదమలర-
సిరులుజిందె సామి-శ్రీరామమందిరం!
వావిలాల వాస! పవనపుత్ర!
58*
ఉత్సవాలు జరిగె-నూరంత పర్వమై
గణపతి నవరాత్రి ఘనతగాంచె!
అందరికిని గుడియు బృందావనమయ్యె!
వావిలాల వాస! పవనపుత్ర!
59*
సేద్య కార్మిక మదినాధ్యాత్మిక ఫలము-
శాంతి శదనమయ్యె! సంస్థ ఖాది!
పేరుకీర్తి వెలయ పెరిగెనుత్పత్తులున్
వావిలాల వాస! పవనపుత్ర!
60*
స్వామి కార్యక్రమము సత్వంబునొసగును
సేవకార్యక్రమము సేమమొసగు-
రామపెండ్లి జరిగె-రాజిల్లెనూరంత!
వావిలాల వాస! పవనపుత్ర!
61*
పబ్బమన్న వేళ-సబ్బండ వర్ణము-
కొలువ వచ్చి మదిని కోర్కెలడిగి-
అంజలిఘటియించి-అర్చన సాగింత్రు!
వావిలాల వాస! పవనపుత్ర!
62*
పూర్వగుడిని మొదట-పూనిభజన జేసి-
వేణుగోపబాలు వేడుకొనియు-
భక్తితోనిటునటు-భజనబృందము దిరిగు!
వావిలాల వాస! పవనపుత్ర!
63*
తరుచరేంద్ర! ఇలను దైవీయగుణ సంప
దలను భక్తి ముక్తి-తమరి భిక్షె!
యోగ్యతొసగు భక్తి యోగమార్గమె-నీది!
వావిలాల వాస! పవనపుత్ర!
64*
నీదు నిష్ఠ నీదె-నిండుజీవనకథా
తిథియు-తార వార మితియు గతియు-
రాత్రిబవలు సర్వ-రామమయమె సదా!
వావిలాల వాస! పవనపుత్ర!
65*
దుష్ట శక్తులణచి-పుష్టిగూర్చియు జగతి
రామమందిరాల రమ్యతెసగ-
క్షేత్ర పాలనంబు సేయుయోధుడవీవె!
వావిలాల వాస! పవనపుత్ర!
66*
తగిన నయజయంబు-దైవీయగుణగణ-
జాలమిచ్చి మనుజు చాలమెచ్చి-
దురిత విషజ కరొన-దూరంబు జేయుమో-
వావిలాల వాస! పవనపుత్ర!
67*
చను పిశాచగణము శాకినీ ఢాకినీ-
విడిచి పారు పేరు వింటెచాలు!
గుండె నిబ్బరంబు గూర్చు నీధ్యానమూ!
వావిలాల వాస! పవనపుత్ర!
68*
ధైర్యమెసగు నీదు దర్శన భాగ్యము-
స్థైర్యమొసగు-మదికి-సాత్వికేశ!
సూర్య శిష్య – బాష-సూత్రార్థ బోధక!
వావిలాల వాస! పవనపుత్ర!
69*
వజ్రదేహ!నీదు వచనం-మధురమూ!
కపివరేంద్ర! నీదు కథనశైలి-
సరళసుందరంబు- చంద బంధురమగు!
వావిలాల వాస! పవనపుత్ర!
70*
కరుణ కిరణ-జీవకారుణ్య మూర్తివీ-
ధరణి జీవశక్తి దాత వీవె!
జగతి నరుల గాచు- సంజీవరాయుడా!
వావిలాల వాస! పవనపుత్ర!
71*
స్వాస్థ్య దాత! నిత్య సంతోష దాయక!
శాంతినొసగి-బతుకు కాంతి నొసగి-
స్వార్థముడిపి తేగ సత్వంబు సమకూర్చు-
వావిలాల వాస! పవనపుత్ర!
72*
వానరాళి బొగడ-వార్థిని లంఘించి-
సిరుల లంక- రామ సీత జూచి-
ఉంగరంబునిచ్చి-ఊరడించిన దూత!
వావిలాల వాస! పవనపుత్ర!
73*
ఆకలనుచు వనిని చీకాకువడ జేసి
అక్షకొమరు దునిమి-అగ్గి రగుల-
బుగ్గి జేసినావు- బుద్ధిహీనుని లంక!
వావిలాల వాస! పవనపుత్ర!
74*
బంధివగుచు-బమ్మ భావన బ్రహ్మాస్త్ర
గౌరవార్థముగను-కదలి సభను-
రామశరణుగోర-రావణు బిలిచితో-
వావిలాల వాస! పవనపుత్ర!
75*
దురిత బుద్ధి వినడు-దుర్మార్గుడై చెడు-
క్రోధి కొంపముంచు కొనును-హితవు-
సూక్తి-కీర్తిగనియె-సుందరకాండము!
వావిలాల వాస! పవనపుత్ర!
76*
రామరథము నీవె-రామవ్రతము నీదె!
రామరావణాజి- రచన నీదె!
స్వామికార్య దీక్ష సాగుటే నీపని!
వావిలాల వాస! పవనపుత్ర!
77*
ప్రభుడ!శివుడ!భవుడ!ప్రాణవాయువు పుత్ర!
దాస్య భక్తి దిట్ట! ధర్మ పుట్ట!
రామదాస దాసరక్షక! హనుమంత!
వావిలాల వాస! పవనపుత్ర!
78*
బ్రహ్మ చారి! భావి- బ్రహ్మ! ఇహసృష్టి-
కర్త భర్త హర్త-కర్మసాక్షి-
వేయి వేశములను-వెలయుతీన్ మూర్తివి!
వావిలాల వాస! పవనపుత్ర!
79*
పాత్రధారి వగుచు- ప్రకటించు సహనంబు-.
సూత్రధారి వలెను-మైత్రిగూర్చు-
జగతినాటకమున-ప్రగతి పథము నీది!
వావిలాల వాస! పవనపుత్ర!
80*
ఆటపాట నీదె-ఆనందమునునీదె!
నాటకాలకెల్ల నాంది నీవె!
ప్రస్తుతిగను నీతి ప్రస్తావనయు నీవె!
వావిలాల వాస! పవనపుత్ర!
81*
మాతమహుడు, రైతు, మధురకవిన్నార
ణాఖ్యుడనగ వెలసె నాటిపేరు-
పరమవైష్ణ గురులు-పన్నిద్థరాళ్వార్లు!
వావిలాల వాస! పవనపుత్ర!
82*
కట్టడులనుమార్చె-మెట్టసేద్యపు తీర్పు-
ఆడసంతు గన్న అలపుసొలుపు-
కథయుసాగె నకట – కమనీయ కావ్యమై-
వావిలాల వాస! పవనపుత్ర!
83*
రమణరెడ్డి హితుడు, రంగయార్యుని వీధి
బడిని వెల్లివిరిసె-బహువిధాల-
రాణకెక్కె నాటి రాయవాచక బోధ!
వావిలాల వాస! పవనపుత్ర!
84*
తిరుణహరిని బుట్టి-తీపితెలుగును నేర్చి-
పద్యవిద్యలందు-ప్రతిభ నెఱపి-
వెంకటార్యు పుత్ర- పేరునిల్పితి నాడె!
వావిలాల వాస! పవనపుత్ర!
85*
ఉన్న ఊరు మరవ-కన్నఊరు మరవ-
బతుకుదెరువు మరవ- బయట ఊరు-
అన్నియూళ్ళ గుడులె-ఆంజనేయుడ నీకు!
వావిలాల వాస! పవనపుత్ర!
86*
పద్య పటిమ గూర్చె బడిపంతులే నాడు
రచనమెఱుగువెట్టె-రసముదెలిపె-
శతక కృతుల కర్త జేసినన్ విడిచెను!
వావిలాల వాస! పవనపుత్ర!
87*
సతత భక్తి వెంట-సప్తశతియు సాగె-
వయసు డెబ్బదేళ్ళ-వంత పాట!
వసుధ నెవరి పిసయు వారికానందమౌ!
వావిలాల వాస! పవనపుత్ర!
88*
ఆత్మ బంధు-తిరుణ హరిసత్య నారాయ-
ణుడను -తెలుగు గురుడ! నూత్నవేశ-
ధారినైతి ప్రభుత – ఆధ్యాపకుడ నైతి!
వావిలాల వాస! పవనపుత్ర!
89*
వావిలాల గ్రామ-వాస్తవ్యుడను, సత్య
నారణాఖ్య- భక్తి సార్థకముగ-
ముడినిబడియె కృతులు ముప్పాలు నీభక్తి!
వావిలాల వాస! పవనపుత్ర!
90*
ఆదరించు సామి-అందింతు సద్భావ
బంధురంపు-శతక పథక విరులు!
కాలసేపముగను చాలమెచ్చగ జనము!
వావిలాల వాస! పవనపుత్ర!
91*
వింతసోమరైతి విలువైనకాలము
ఇంతలోనె గడిచె! హితవుగాగ
పథ్యమొకటి నిలిచె-సత్యమొకటి గెలిచె!
వావిలాల వాస! పవనపుత్ర!
92*
చొప్పధాన్యరుచులు-సోకువంటలు రద్దు-
గడుకుడుకల కూరగాయ మేలు!
గొప్పవయ్యె నేడు గోవు ఉత్పత్తులే!
వావిలాల వాస! పవనపుత్ర!
93*
అల్లొ పతియె తగినదాకస్మికములందు!
ఇతరములను గొప్ప హితవు గలుగు!
ఆయురౌషధతతి-జేయు వివారణల్
వావిలాల వాస! పవనపుత్ర!
94*
సుధలు మాని విషపు సూక్ష్మాల రుచిమర్గి
శిథిలతనువు నీడ్చు చిత్త బాధ-
అనుభవించ వలసె! అశ్రద్ధ ఫలితంబు!
వావిలాల వాస! పవనపుత్ర!
95*
ధనపు తపనె-విలువదక్కదు ప్రాణికి
పాపభీతి దరిగె-భక్తి నటక-
సాధనయ్యె-దోపు సాగించు నిల్వలన్
వావిలాల వాస! పవనపుత్ర!
96*
దురితకల్మి నిధులు దుర్వినియోగమై
మంచిబెంచు నరుని మాయకాళి-
కంచె చేనుమేయు కథనంబు మొదలాయె!
వావిలాల వాస! పవనపుత్ర!
97*
ఎంత వింత జగతి ఎనలేని మాయల-
గంతబొంతె-విజ్ఞ గతుల సైన్సు-
గ్రహపుటంచు దాకి-సహనంబు గోల్పోయె!
వావిలాల వాస! పవనపుత్ర!
98*
మార్పు సహజ తీర్పు మార్గగమన కాల
గతియు సాగె! నరులు గతమునందె-
మిడుకు జాతకాల- మీనమేషము పరిధి!
వావిలాల వాస! పవనపుత్ర!
99*
కనికరమ్ము జూపి కర్తవ్యమును దెల్పి-
జీవి జీవివెలుగు శివుడవగుచు!
కలిని యదుపు జేసికలిగించు శాంతిని!
వావిలాల వాస! పవనపుత్ర!
100*
కల్తి కల్శశ గతి-కాలుష్య ప్రాకృతి
చల్తియయ్యె-వాయు చలిత గతుల-
వెల్తి-ప్రాణశక్తి-వేదిక బతుకాయె!
వావిలాల వాస! పవనపుత్ర!
101*(సంపూర్ణం)
రాలుగాయి బుద్ధి రాజిమార్గమనదు-
ఆత్మనిన్నె వెదకు అతుకు పడగ-
మనసు వినదు భోగమార్గగామియె సదా!
వావిలాల వాస! పవనపుత్ర!
102*
“కరిక బరియె దున్ను కడియత్త దేయను”
చస్తు బలుకు- లుబ్ధ-చవులు విడక-
ఆవరించియుండు నరిషడువర్గాలు!
వావిలాల వాస! పవనపుత్ర!
103*
శత్రులార్గురణచు చతురత పంచేంద్రి
యముల నిగ్రహింపె-యత్న గరిమ-
మనసు నిల్పు చేష్ట మానవాళికి దక్కు!
వావిలాల వాస! పవనపుత్ర!
104*
గురువు బోధ చేత గురికుదరగ వీలు-
బుద్ధి వెలుగు తత్వ సిద్ధి గలుగు-
అధిక తృప్తి గలుగు నాధ్యాత్మికము నందె!
వావిలాల వాస! పవనపుత్ర!
105*
అందివచ్చు మంచి సంధించు నానంద
జలధి దేలియాడు జాగృతాత్మ-
జెందు తృప్తి – వెలయు చేతనత్వపు భక్తి!
వావిలాల వాస! పవనపుత్ర!
106*
అర్చ జేసి శతకమర్పించితిని-భక్తి
భావపూర్ణ మొరను ప్రాకటముగ-
ముక్తి దాత! బ్రహ్మ – మోదప్రదాయక!
వావిలాల వాస! పవనపుత్ర!
107*
భక్తి భజన పాట సూక్తులు పునరావృ-
తాలుగాగ-మనసు తళుకులీను-
అనగ వినగ కనగ నంతరంగము నిల్చు!
వావిలాల వాస! పవనపుత్ర!
108*
శుభము పఠిత-శ్రోత కభయంబు-గలుగు
శుభము-భారతీయ సూక్తి నిధికి!
శుభము-సుఖము శాంతి-శోభిత జగతికి!
వావిలాల వాస! పవనపుత్ర!