
పార్వతీశ శతకము
(ఆ.వె.)
1*
శ్రీద!భక్తులెల్ల చిత్తశుద్ధిని గొల్వ-
అడిగిన వరమిచ్చి ఆదుకొనుచు-
జగతిగాచునట్టి జంగమయ్యవె నీవు!
వావిలాల వాస! పార్వతీశ!
2*
రామనామజపము-రామతారకమంత్ర!
ధ్యాని వీవు కామ దమను డీవు!
బోలశంకరుడవు! భూతనాథా శివ!
వావిలాల వాస! పార్వతీశ!
3*
సృష్టి విధికినిచ్చి-పుష్టి విష్ణువు నుంచి-
లయమునందు వెలయు లాసకుడవు!
మరల సృష్టి కొఱకు మహిసిద్ధ పరిచేవు!
వావిలాల వాస! పార్వతీశ!
4*
తీర్చి దిద్దు పనుల తీన్ మూర్తివి మహేశ!
ఆదియోగి భరత వేదబ్రహ్మ!
స్వార్థరహిత సుగుణ-అర్ధనారీశ్వరా!
వావిలాల వాస! పార్వతీశ!
5*
మోహినిగని వలచి-మోదము మదినిల్పి-
అయ్యపానుగన్న-అయ్యవీవు!
భ్రమల మోసవాది-భస్మాసురుడు బూది!
వావిలాల వాస! పార్వతీశ!
6*
బ్రహ్మచర్యదీక్ష-బహునియమ పరీక్ష-
దురితకలిని గెలిచె-దుడుకు మాన్పె-
సత్వమొసగె-ధర్మ శాస్తయై శాశించె!
వావిలాల వాస! పార్వతీశ!
7*
మాయరద్దు పరచి మహిషి నదుపుజేసి-
హరహరపుత్రుడవని బ్రోచె!
నీదు కొడుకులైరి మేదినీ రక్షకుల్.
వావిలాల వాస! పార్వతీశ!
8*
రాజు-ప్రజల మదిని రాజిల్లె సద్భక్తి-
ప్రకృతి చేతనాంశ – ఫలితమొసగె!
దురితులణగ-భువిని దుర్భిక్షము తొలగె!
వావిలాల వాస! పార్వతీశ!
9*
స్వస్థతొసగె భువిని-శబరీశ దీక్షలు-
హనుమదీక్ష గలుగ-మనుగడెసగె!
దానవత్వముడిగి-దైవీగుణముగల్గె!
వావిలాల వాస! పార్వతీశ!
10*
మనిషి సేవ సమము-మహదేవ నీసేవ
క్షితిని సాగె-నరులచిత్తశుద్ధి-
నీదు పూజఫలమె-నిండెనీజగతిలో
వావిలాల వాస! పార్వతీశ!
11*
సోపతితగనిమురిసె!సోమయాజులశర్మ
పౌరజనులప్రేమ పావనాత్మ-
తీరుతెన్ను బతుకు తిరుమల గురుబోధ!
వావిలాల వాస! పార్వతీశ!
12*
ఊరిమాట బాట నోరూరు-ఘనచాడి
కోరుజుట్టుముళ్ళు, కొంపలార్చు!
మరలకోలుకొనెడు మర్యాద పీనసం-
వావిలాల వాస! పార్వతీశ!
13*
బెల్లమున్న ఈగలిల్లు జేరును-ఫల-
వృక్ష ములకు రాతి శిక్ష దెబ్బ-
జనము మధ్యలోన నజాతశత్త్రుడ నైతి.
వావిలాల వాస! పార్వతీశ!
14*
స్వాగతాలు లబ్ధి సాగుదిశల సంప
దలకె, కోరు దీను దరికి సున్న!
మోదపూర్ణ చూపు-మోహాతిశయ రూపు!
వావిలాల వాస! పార్వతీశ!
15*
సులభజీవి మనసు చుట్టాలనాశించు-
సోమరి తనమైత్రి సొమ్ముకమ్ము!
యాంత్రికముగ సాగు యాచకోత్తమ జీవి!
వావిలాల వాస! పార్వతీశ!
16*
పరుల చేత కరువు కరుగదు, బరువైన
బతుకు నితర గతుల బాగు పడదు!
తమరియాజ్ఞలేకదరిజేరునా చీమ!
వావిలాల వాస! పార్వతీశ!
17*
సానుభూతి వాక్కు సంధించి తప్పుకు
బోవనేర్చె-నటన దోవ సఖులు!
సొమ్ము లూడు పనికి సొత్తురా లుబ్ధులు!
వావిలాల వాస! పార్వతీశ!
18*
పస్తు చేత రోగ బాధలుపశమించు-
కాయగసరుదిన్న-కాయశుద్ధి!
జరనుమేలు-సర్వసన్న్యాస దీక్షయే!
వావిలాల వాస! పార్వతీశ!
19*
నాటియాశ్రమంబు నయముగా నెవరిది-
వారిదగుచు గృహము వరలె – నేడు-
అందరొక్కట వెతలందగా కొనసాగె!
వావిలాల వాస! పార్వతీశ!
20*
పట్టుపురుగు నమ్మి పైకమాశించిన
మౌనవృత్తినుండు మనుగడంత!
కాయదశనె దాని కాయంబువిడిచను!
వావిలాల వాస! పార్వతీశ!
21*
అడుగు వరములొసగి-అతిగర్వపడజేసి
అంతుజేసి-కథలసంత జేసి-
మంచివిలువ బెంచి-మనుగడనొసగేవు!
వావిలాల వాస! పార్వతీశ!
22*
సిరులొసంగి-శాంతి శ్రీలుపొంగగ జప
తపములాచరించు తత్వమొసగి-
పుష్టిగూర్చు శివుడ! పుణ్యనిధులు పేర్చు!
వావిలాల వాస! పార్వతీశ!
23*
సృష్టి కర్తగ పరమేష్టిపుట్టించగా
వ్యాప్తి విష్ణు వంతు తృప్తి బతుకు-
శిథిలతనువులతలు-జేసేవు లీనంబు!
వావిలాల వాస! పార్వతీశ!
24*
భూతజాల చితి విభూతి చర్ఛిత దేహ!
నందివాహన! ఘననాగభూష!
రక్షలిచ్చు భిక్షు! రాజరాజేశ్వరా!
వావిలాల వాస! పార్వతీశ!
25*
బూదినొసటదాల్చి పూర్ణవిభూతులన్
జనులకొసగు జగతి జంగమయ్య!
రాజిలుతనువెల్ల-నిరాడంబరత్వమే!
వావిలాల వాస! పార్వతీశ!
26*
చేదుదాగు నాడె-చెడుకాల కలిబుట్టె-
మాయబుద్ధులెసగె-మాననీయ-
జీవిదరిగె-నీవె జీవమైతివి నేడు!
వావిలాల వాస! పార్వతీశ!
27*
శాంతిమూర్తి నీకు సామీప్యమునజీవి-
రుద్రమూర్తివగుచు భద్రతొసగ-
నీకె సాధ్యము భువి నిగ్రహానుగ్రహము!
వావిలాల వాస! పార్వతీశ!
28*
ఒనరుగను జగమోంకారమున బుట్టె!
శాస్త్రమయ్యె బాష-సైన్సు పేర-
ప్రకృతి రక్ష జగతి-ప్రగతిమార్గము వేసె!
వావిలాల వాస! పార్వతీశ!
29*
తారకుణ్ని దునుమ-పార్వతీ పరమేశ-
ధరణి వెలసియాది దంపతులుగ-
సాగినారు-భరత సంసృతిన్ సంస్కృతిన్
వావిలాల వాస! పార్వతీశ!
30*
కలిమికన్న బలమె కారుణ్యధామము!
బలముకన్న తెలివె-బహులముదము!
తెలివి తమరి వరము-తేపతేపకు మాకు!
వావిలాల వాస! పార్వతీశ!
31*
మనుజు జననమరణమగు-
నీదుగుడి వరం జనులతీపిగుర్తుబొందు!
తత్చరిత్రకథలు తరతరాలను వెలయు!
వావిలాల వాస! పార్వతీశ!
32*
గరిక- చెడదు-తినిన గాడిదచెడిచను-
మనసు దినెడు మాయ మహిమవీడు!
పిదప నీదు భక్తి పీఠమే మానసం!
వావిలాల వాస! పార్వతీశ!
33*
కర్త వీవె జగతి భర్తవీవే హర్త-
ప్రణవ-ప్రణయ-ప్రళయ-ప్రగతి నీవె!
విశ్వనాథ! సకల విషయాలు నీప్రభల్
వావిలాల వాస! పార్వతీశ!
34*
ప్రకృతి వృద్ధి సౌష్ఠవాకృతి సహజమౌ!
బోదెకాలు వృద్ధి భోగరోగ-
పక్ష ప్రీతినేక భాగాన ప్రకటమౌ!
వావిలాల వాస! పార్వతీశ!
35*
తనువు లోనితనువు-తళుకులింద్ర ధనువు-
మనసు వీడి తనువు మసల బోదు!
ఆత్మనెఱుగి-మనసు నరికట్టవలెముందు!
వావిలాల వాస! పార్వతీశ!
36*
మనసు నిశ్చలత్వమగుదారి-నాధ్యాత్మి
కంబు సాగ జేయు కంబుకంఠ!
మోహరహిత బతుకు మోదమ్మె సన్ముక్తి!
వావిలాల వాస! పార్వతీశ!
37*
తాను తనువు గాదు మనసుగాదని నమ్మి
ఆత్మనేననియెడు దాక నదియు-
దాగియుండు తాను భాగమై పరమాత్మ
వావిలాల వాస! పార్వతీశ!
38*
ఆత్మదర్శనముకె-ఆధ్యాత్మిక తపన-
ఆత్మమరలలీనమగుట కొఱకె-
జన్మజన్మయాత్ర-జగతినీనాటకం!
వావిలాల వాస! పార్వతీశ!
39*
అధికయత్నఫలితమాత్మ గాంచిన మనసు-
తానుబ్రహ్మమగుచు తళుకులీను!
జీవియాత్మకెపుడు-దేవ-నీతోపని!
వావిలాల వాస! పార్వతీశ!
40*
జ్ఞాన రేఖపైకి జనయూధములదెచ్చి-
సంస్కరించకున్న జంపు-వెసన –
విషపు ధూళి- నరుల వేగమార్చుము-శివా!
వావిలాల వాస! పార్వతీశ!
41*
మనిషియయ్యి చదివి మహనీయుగామారి-
బ్రతుక మేలు-వేత్త పటిమమెఱయ!
మనిషిగాక, మనసు మాయలద్యయ్యమౌ!
వావిలాల వాస! పార్వతీశ!
42*
మనిషిజేసి మతికి ఆస్తక్యమతికియు- వేత్తజేసి విధుల వెలుగులొసగు-
పిదప నీదు భక్తి పీఠంబునకు జేర్చు!
వావిలాల వాస! పార్వతీశ!
43*
జ్ఞానిజేసి నిన్నుగాంచు తేజమునిమ్ము!
ముగ్దభక్తి నడిపి ముదమొసంగు!
నడుమవిడువ బతుకు నగుబాటె హరిహర!
వావిలాల వాస! పార్వతీశ!
44*
ఉన్నవారిలోన ఊరడించగరమ్ము!
లేనివారిలోన సేమమొసగు!
నయగుణమిడబోదు-నడమంతరపు సిరీ!
వావిలాల వాస! పార్వతీశ!
45*
అవనిమానవాళి ఆరోగ్యభాగ్యాలు-
గాక కలిమి-లేమి కదనమేల?
చెత్త తనువు నింపు చేష్ట తాత్కాలికం!
వావిలాల వాస! పార్వతీశ!
46*
పాలుకూరగాయ ఫలహారమును పరి-
శ్రమను-నడక-నిద్ర-సంయమనము-
వీడి కలిమి పోటి వేడిలో శూన్యమే!
వావిలాల వాస! పార్వతీశ!
47*
పరులముంచిదినక-పరనిందలాడక-
దుష్టచింతజేయు-దుడుకు మాని-
భక్తిచింతనజేయ బలపడు స్వాస్థ్యము!
వావిలాల వాస! పార్వతీశ!
48*
పకృతిమాత యొడిని పత్రహరితము బెంచి
ప్రకృతి వైపరీత్య-పనులు మాను-
సాధు జీవనంబు సంక్షేమదాయకం!
వావిలాల వాస! పార్వతీశ!
49*
మార్గగతుల భక్తి-మానవత్వపు వాద-
మేల? రెంటనున్న-మేలు నీవె!
పదిలవస్తువగుచు-ప్రసరించు నీభక్తి!
వావిలాల వాస!పార్వతీశ!
50*
దైవనిష్ఠలేక దైవీయగుణజాల
మందుటెట్లు? కృతులునలరనెట్లు?
మానవత్వ మైన మాథవ తత్వంబె!
వావిలాల వాస! పార్వతీశ!
51*
సదనమందు శాంతి సాధన సద్భక్తి
జన్మసాగువిధుల-జపతపాలు-
మనసు దృఢముజేయు-మాటవాస్తవమగు!
వావిలాల వాస! పార్వతీశ!
52*
వదనమందు ముదము వదలక నీభక్తి
కర్మలందు సాగు కలిమి వేళ-
పుణ్యమెసగు పనుల బూనిక పదివేలు!
వావిలాల వాస! పార్వతీశ!
53*
గతము తుడిచి-నేటి బతుకుసాగించిన
వర్తమాన సుఖము వసుధశాంతి!
ఈక్షణాన తలపులింపొంద ఫలమిచ్చు!
వావిలాల వాస! పార్వతీశ!
54*
తృప్తి లేని తనువు తిరములేనిమనసు
బాగుపడని బతుకు భాధమయము!
దాతకెపుడు భువిని దక్కును సంతృప్తి!
వావిలాల వాస! పార్వతీశ!
55*
తృప్తి లేక సప్త దీవులు తిరిగిన
చక్కబడడు మనిషి సాగుదిశల-
తన్నుమించు వాడు తానుగా తలపోయు!
వావిలాల వాస! పార్వతీశ!
56*
మాటవరుసకైన మర్యాద నీయని-
నోట బతుకుదెరువు నోచునెట్లు!
సంగతెఱుగుదాక-శృంగభంగమె భువి!
వావిలాల వాస! పార్వతీశ!
57*
ఆస్తులేల – ఇల్లు ఆరోగ్యభాగ్యమై
రుజలుముసర-లేమి రూఢిగలుగ!
అడిగి పొంద మేలుఆధ్యాత్మికాస్తులన్!
వావిలాల వాస! పార్వతీశ!
58*
తాతలాస్తి పరులు-తమవారి కిలనాస్తి!
గొంతు దిగని భిక్షకూటి పోటి-
ఉన్నతరములేమి-ఊబివెసనపాలు!
వావిలాల వాస! పార్వతీశ!
59*
అట్టిపెట్టుకున్న అనుభవ నికరమ్ము-
వెంట భవిత నడుపు వెసగ యాది-
జాగ్రత్త గొనిముందు సాగుదోవయె మేలు!
వావిలాల వాస! పార్వతీశ!
60*
మంచిచెడుగు మనుజునెంచి సాగవు గాని
మిశ్రమాల సంచి మెడకువేయు!
చెడును దులిపి మంచి చేయూత గొనవీలు?
వావిలాల వాస! పార్వతీశ!
61*
ఆడు కొనిన దెవరు? ఆదుకొనిన దెవరు-?
చేదు కొంద్రురెవరు-చేవ గూర్చి-
ఎవరికెవరు? నీవె ఏడుగడవు శివా!
వావిలాల వాస! పార్వతీశ!
62*
భక్తియుత్సవాలు-బహువినోదపు కీర్త-
నాళినుతులు కథలు -నటనలలరు!
వేదికలను నీకు వేడ్కనైవేద్యాలు!
వావిలాల వాస! పార్వతీశ!
63*
భక్తి పూజ-సరుకు-భవ్య ప్రసాదాలు!
తీర్థసేవ! వెలుగు దివ్వె పంక్తి-
విస్తృతముగ విందు వినియోగములు జర్గు!
వావిలాల వాస! పార్వతీశ!
64*
భీతిమాని చేరి పిల్లలు పెద్దలు-
భక్తి తృప్తి నొంది పడియు మొక్కు-
పూజ పుణ్యమొప్ప పూజారి దీవించు!
వావిలాల వాస! పార్వతీశ!
65*
అవని నీకుజరుగు శివరాత్రియర్చనల్
వేములాడ గుడిని పెండ్లి జరుగు!
కోడెమొక్కుజెల్లు-కోరిక దీరగా-
వావిలాల వాస! పార్వతీశ!
66*
తెలుగు నేలలందు-దేవేరి నవరాత్రి-
సద్దులబతుకమ్మ-సత్తు పిండ్లు-
పల్లె పట్నమనక-పసిడిపూ జాతరే!
వావిలాల వాస! పార్వతీశ!
67*
దానవతను వంచు దసహరోత్సవ తంతు-
చేవగలుగ గెలుపు చెడ్డ పైన-
స్త్రీల రక్షణంపు సిరికార ఘట్టమై!
వావిలాల వాస! పార్వతీశ!
68*
మాస పర్వమిచ్చు మంచిసందేశమున్
వేడ్కపబ్బమందు-వెలయు విందు!
సమ్మతించు-మది సంబరాలకు నిధి!
వావిలాల వాస! పార్వతీశ!
69*
తనివి దీరజేయు తానాలు బోనాలు!
మాత భుక్తి ముక్తి-మంచి పుష్టి-
పంచు పంచగజ్జ ఫలహార భక్షనల్
వావిలాల వాస! పార్వతీశ!
70*
అన్న వస్త్ర దాన ఆరాధనలశోభ!
చెమ్మగిల్లి మనసు చెలగి మొక్కు!
భక్తి పారవశ్య పాటవంబును బొందు!
వావిలాల వాస! పార్వతీశ!
71*
మెచ్చె జగతి-భరతమిహలోక తేజమై
ఆధునికత బాటలనుసరించె!
దూరెవైరసుకణము-దారిమారెను బతుకు!
వావిలాల వాస! పార్వతీశ!
72*
మానవగుణలోప మార్గగాములుగాగ
విషకణాలు బహుధ విస్తరించె!
సొంతకట్టడాయె-సోలిపోయె జాతి!
వావిలాల వాస! పార్వతీశ!
73*
భారతానమొదటె నార్థికమాంద్యంబు
గూడుగట్టె-ననగ-పాడుకరొన-
ఈతిబాధ వెంట విహరించెనుకటా!
వావిలాల వాస! పార్వతీశ!
74*
ఎంత మార్పు, జగతి సంత-ప్రకృతిగత-
పంచభూతకలుష పాలుదరిగె!
అలవిగానిదయ్యె-ఆర్థికపు కుదేలు!
వావిలాల వాస! పార్వతీశ!
75*
భువి సురక్షితెడము బూనిపాటింపగా-
మూతిముక్కు మాస్కు,యూతగలుగ-
సాగుచుండ్రి జనులు శానిటైజరుగొని-
వావిలాల వాస! పార్వతీశ!
76*
గతమునుండె-ఇపుడుగల్గె కట్టడిమాట-
హద్దుమీరు బతుకు రద్దుపాలె!
చాందసమ్మునట్లు-సాగె శుభ్రతశుచిన్
వావిలాల వాస! పార్వతీశ!
77*
బహు పటిష్టమైన భారత సంస్కృతి
ఎంగ్లిమంగ్లి షేకుహేండు రహిత-
మాటలు మరియాద మార్గకేల్జోడింపు!
వావిలాల వాస! పార్వతీశ?
78*
దండికొండయైన-దయనీయ చెట్టైన
దండమప్పగించు-దారి ఘనత-
పారదేశికముగ- పతనంబు గలిగెను!
వావిలాల వాస! పార్వతీశ!
79*
నడుచు చరిత రుద్దె-నాగరికతామిశ్ర-
కోరికలను గోరు కొండయయ్యె!
పాతచిత్తశుద్ధి పరిధిదాగియు సాగె!
వావిలాల వాస! పార్వతీశ!
80*
కలిగె బతుకు మార్పు-కలికాలతీర్పుగా-
శ్రద్ధ రహిత బతుకు చేటుగూర్చె-
కాల్వసాగె – భరత కారుణ్య నదిపొంగె!
వావిలాల వాస! పార్వతీశ!
81*
వనధినణగె లక్షలాదివైరసుమూక
గెలికె-నాగరికుడు గేళియాడె!
అనుభవించె-తగిన యారడి శిక్షలన్
వావిలాల వాస! పార్వతీశ!
82*
చెబితెవినని నరుని చేష్టగాసిని దెచ్చె!
లబ్ధి గోరి కొంపలన్నిముంచె!
ఏకముగను – నరికె – ఎక్కిన కొమమ్మనే!
వావిలాల వాస! పార్వతీశ!
83*
కరొన చేతకొంత కాలుష్యమును తగ్గె-
మరల పెరుగుచుండె-మలినజిడ్డు!
వస్తులుత్పతులకు- వరుసగారడి యాటె!
వావిలాల వాస! పార్వతీశ!
84*
ప్రక్కదోషరహిత పద్ధతౌషదమగు-
రుజలుగూర్చునదియు-రుజువుగాదు!
పథ్యమనక-వైద్య-పాటవంబును దర్గు!
వావిలాల వాస! పార్వతీశ!
85*
గొప్పదయ్యె మరల గోవుతెరపి పేరు-
పంచగవ్యసుధయె-మంచిదనగ-
పట్నవాసిమెచ్చె-పల్లెజీవనబాట!
వావిలాల వాస! పార్వతీశ!
86*
పదిలమాయె నేడు ప్రాణవాయు చికిత్స-
ఎండగాగి హరితమండనుండ-
దండిమేలుగలిగె-దాపునీవైయుండ!
వావిలాల వాస! పార్వతీశ!
87*
భ్రాంతిబాయ- సుఖము శాంతి కాంతులబాట
దాంతి గలుగ-కీర్తి ధనముగలుగు-
నాదబ్రహ్మ-నన్ను నడిపించు ముందుకు!
వావిలాల వాస! పార్వతీశ!
88*
లేని పోనపేక్ష-నేను నాకొఱకనీ
నీకొఱకు-నేను-నిల్చితనక-
సాగగలవ? పనులు- సాధుసత్సంగముల్-
వావిలాల వాస! పార్వతీశ!
89*
మరలమరల గోల మానస రొద-మర్మ
మేమొదెలియరాదు-రామదూత!
స్థిరత గూర్చకున్న-చీకాకు బతుకెల్ల!
వావిలాల వాస! పార్వతీశ!
90*
మొక్కుబడుల కోర్కె-మోహావృతము-భువీ
విన్నవించుకొనెడు-విషయగతుల-
పదిలపడెడు కోర్కె-పరమపద సంప్రాప్తి!
వావిలాల వాస! పార్వతీశ!
91*
మౌని నైతి నుతులు మరిపునరావృతం
గాగ శతిని జేయ గలిగితేను!
విన్నవించుకొంటి-విపుల విషయసొదల్
వావిలాల వాస! పార్వతీశ!
92*
అవనిబతుకు సర్వమారోగ్య భాగ్యమే
మంచితిండి నిద్ర మానవతయు-
ప్రాథమికములయ్యె-పరమాత్మ నీయాన!
వావిలాల వాస! పార్వతీశ!
93*
చాలతృప్తి గూర్చె సామాన్య జీవనం
ముదము గూర్చె సేవమూల వసతి!
తేగభావ భక్తి యోగసాధన గూర్చె!
వావిలాల వాస! పార్వతీశ!
94*
శక్తినీవె-భక్తి సాధన యోగార్థ
సూక్తినీవె-గీత సూత్రగతుల-
వెలయజేయునట్టి వేదవేత్తవు నీవె!
వావిలాల వాస! పార్వతీశ!
95*
మంచినీవె!సత్యమార్గదీప్తివి నీవె!
చెడుగు దుడుకులణచు-చేవనీవె!
లోకంఠకులను లొంగదీయునదీవె?
వావిలాల వాస!పార్వతీశ!
96*
సాధువృత్తి భిక్ష-సాత్వికం నీపూజ-
సాగు బతుకు దెరువు బాగు నీవె!
మనసు నిలుపు-మిట్ట మధ్యాహ్న సూరీడ!
వావిలాల వాస! పార్వతీశ!
97*
మాత గంగరేడ! మహిమోహిని ప్రియ!
ఆదియోగి-సదయ! అమృతభావ!
అచ్యుతాద్భుత ఘన! ఆరాధ్య దైవమా!
వావిలాల వాస! పార్వతీశ!
98*
కాలభైరవ!మహకాలేశ్వర!వరద!
నీలకంఠ!రుద్ర!నిగమ భద్ర!
అక్షర ప్రదాత! అమర వినుత శివా!
వావిలాల వాస! పార్వతీశ!
99*
శుభము నీదు దివ్య-అభయవరద హస్త
దశ్శనంబు చాలు-ధరణి గడుప!
శూలి! శరణు! వేగ సుఖశాంతిదయసేయి!
వావిలాల వాస! పార్వతీశ!
100*
కోర్కెలిమ్ము-జనులు కోలుకోగలతీరు
వర్షమొసగి పాడి పంటలిమ్ము!
సామి శరణు! ధరణి సమవృష్టి గురిపించు!
వావిలాల వాస! పార్వతీశ!
101*(సంపూర్ణం)
లోకనాశి కరొన-లోకకళ్యాణమై
బెండువోవ జేసి బెట్టుమాన్పు!
నీదు నిచ్ఛ బతుకు నిచ్ఛసాగగ నిమ్ము!
వావిలాల వాస! పార్వతీశ!
102*
ఆపదంటె మొక్కి సంపదమరుపుల-
భక్తి సహజ పాత్ర బరగు నటనె!
నీదు సేవకులము-నీవె మాయజమాని!
వావిలాల వాస! పార్వతీశ!
103*
అర్పణంపు శతకమందింతు-కందర్ప-
దర్పభంగ! భర్గ! సర్పభూష!
నేర్పగలగ దిద్ది నెగ్గించు కృతులెల్ల!
వావిలాల వాస! పార్వతీశ!
104*
ప్రమదనాథ!నందివాహన!పరమేశ!
పాలనేత్ర!నందలాల మిత్ర!
భక్త సులభ! జన్మ ముక్తి ప్రదాతవు!
వావిలాల వాస! పార్వతీశ!
105*
మాత,పితవు నీవె! మహదేవ మారాజ!
లింగ ఈశ! గిరిశ! గంగధారి!
చిత్తభక్తి గూర్చు-సిరిశైల మల్లన్న!
వావిలాల వాస! పార్వతీశ!
106*
ధ్యానలింగ!దానధర్మ ఫలద! ముక్తి
బాటనడుపు దీక్ష బాటసారి!
గీత దాత! బ్రోవు-కిల్బిషములనార్పు!
వావిలాల వాస! పార్వతీశ!
107*
మంగళంబుగొనుచు-మాయభీష్టములిడు-
మంగళకర!లింగమయ్య – శరణు!
మంగళాంగ ఇమ్ము!-మాకునారోగ్యమున్
వావిలాల వాస! పార్వతీశ!
108*
శుభము- పాఠకులకు-శ్రోతాళికిని శుభం!
శుభము – శతకపద్య సభకు-శుభము!
శుభమునొసగు దేవ! అభయహస్తము నిమ్ము!
వావిలాల వాస! పార్వతీశ!