
నీతివైద్యం శతకము-2
(తే.గీ.)
1*
శ్రీలు జిందు మానవ కోటి సిరియె సుఖము!
ఆయురారోగ్యమేభాగ్యమనుటగాక!
మిక్కిలేమున్నది, మదికిమక్కువగను!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
2*
ఎయ్డ్సు ప్రశ్న జవాబుల నేర్పు నోర్పు-
ఎట్టి జాగరూకతగల్గు నెట్టి చర్య-
గలుగజేయు నాజాతికి గట్టిమేలు?
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
3*
నేనె దైల్పెద ననువారలెచట గలరొ!
ఎట్టి జాగరూకత గల్గునెట్టి చర్ఛ?
గలుగ జేయునోరోగికి గట్టిమేలు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
4*
కాలగతితీరు జీవింప గలుగు విధము!
కూటి విద్య పోరాటముల్ కొల్లలయ్యె!
తరచి కల్ల నిజము దెల్పు దక్షులెవరు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
(ఎయ్డ్స్ వెలవెలం-కరోనా కలకలం)
5*
కల్తి రుధిరమార్పిడి ఎయ్ఢ్సుకాటులేవి?
ఏవి కావితరేతరమేది, మలిన-
ఎయ్డ్సు సంబంధఘాతములెట్లు దెలియు?
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
6*
అక్రమపు బంధమున వైరసాక్రమించు!
కల్తి రక్తమెక్కించిన గల్గునేయ్డ్సు!
రక్త గుహనిద్ర తదుపరి రగులుకొనును!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
7*
అపరిచిత రక్త వీర్యముల్ – అపరమృత్యు-
ఎయ్డ్సు నిలయాలు వెలయాలు వెఱ్ఱి విటులు!
చిటిక సుఖమొందు సుఖరోగ చిచ్ఛుబుడ్లు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
8*
జార చోరజీవితము బజారు పాలు!
నేరముల చిట్ట రోగాలు నెసగు పుట్ట!
పడుపు దారి మర్యాదలో పరువు బుగ్గి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
9*
తెలియదేపుట్ట నేపాముతెరవు జేరె
విషరహితమేది? వివరాల విషయమెరిగి!
మసలుకొనకున్న మానవ మనుగడేది?
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
10*
ఎయ్డ్సు గర్జించె-సింగమై ఎరగ నరుడు!
గొఱ్ఱె వాటున బడిపోవు వెఱ్ఱివీడి!
ముందు జూపాలి కుందేటి బుద్ధి బలము!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
11*
చిత్త చాంచల్యమే ఏయ్డ్సు సింగమట్లు-
నీతి సర్కసు మాష్టరు చేతి కొరడ!
చివర ప్రవహించు విద్యుత్తు చిత్తనిష్ఠ!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
12*
విత్త చాపల్యమేవృత్తి విషసమస్య!
నీతి లేకున్న కల్తియౌ నెత్తురైన!
కూలికి విషపానముజేయు క్రూరబుద్ధి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
13*
ఎచట జూచిన హెచ్చెను ఎయ్డ్సు భయము!
పాజిటివు-నెగెటివు తేజి-పాజి జేయు-
నకిలి వైద్యుల లీలలు నసరుకెసరు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
14*
వ్యాధి నిర్నిరోధకమైన వచ్చి పోవు!
తరుణ తరహ రోగములెచ్చి తాళలేని!
బాధ నిర్నిరోధకమె ప్రమాదకరము!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
15*
కొంతకాలమపోహల తోనె గడచు!
దాపరికము భీతియు హేతు దారిగడచు!
తనకు తనవారలకు ప్రాణ హాని గూర్చు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
16*
మొదటనేయపోహలువీడి ముందు వైద్యు-
సంప్రదించి వాస్తవ బుద్ధి సహకరించి-
తగిన రోగోపశమనాలుదరచవలయు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
17*
మనసుచే మనసు విరుచు మాయడబ్బు!
మనజుచే మనుజు దునుము మాయజబ్బు!
నేటి ఎయ్డ్సు వైరసు నీతి కెదురు పడదు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
18*
నీతి సాగని వేళలో నిజముగూడ-
నివురు గప్పియుండును-దోషి నిక్కి నీల్గు!
పిదప దోషమెంచక తుద పతనమొందు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
19*
నిజము-నిర్ధారణ పిదప రుజయు దెలియు!
విచ్చలవిడి తనముచేత చచ్చుబడిన
తనువు వర్జింప నాత్మీయ తపనవెలయు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
20*
ఇంగిత జ్ఞానమును లేక విత్త దృష్టి-
నిష్టరాజ్యముగా సాగి నీతి వీడి-
రోగి క్రొత్త జబ్బున జచ్చు లోకమందు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
21*
డబ్బు లోభము కొంగ్రొత్త జబ్బు దెచ్చు!
బ్రతుకు దెరువు పడుపు వృత్తి బ్రతుకు నార్పు!
అసహజ నడవడిని లోకమపసహించు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
22*
సహజ దారిదప్పి లోభి సాహ సాలు!
తప్పు తడక చెదలుబట్టు-తరతరాలు-
పాపమై శాపమై సంతు సంతాపమొందు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
23*
సహజ గుణముగా స్త్రీ పురుష సహవాస-
సంగతియె సెక్సు – సుఖభోగ సంపదలను!
హితవు వీడి తెగిన నీతి హీనతెసగు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
24*
డబ్బు సెక్సుల బలహీనదారియందె-
వైరి వలె చొరబడు ఏయ్డ్సు వైరసంత
మూయలేనిదారిని వచ్చు మాయ మారి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
25*
విషయ నిశ్శబ్ధఛేధన, వీధి-వీధి-
మారుమ్రోగిన మాయలమారి జబ్బు!
పట్ల భయమూహ భ్రమపటా పంచలగును!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
26*
అందరునుజేరి యొకచోటనాగి వేచి-
యున్నకాలము హెచ్చైవి వన్నె చిన్నె
మాయ మర్మంబు చర్చింప మానవద్దు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
27*
తెగువ నిజనిర్ధారణ దేల్చి ఏయ్డ్సు
రోగితనకు తానె దెలుప రోగవిషయ-
విరుగుడగుముందు జాగ్రతల్ వీలుపడును!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
28*
భూత మీఎయ్డ్సు భువి హేతుభూతమేది?
యోగ్య శోధ ప్రయోగముల్ యోగ్యులైన-
వైద్యు ప్రాయోగశాలలో వైనమేమి?
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
29*
మందు గలదంద్రు టీకాలు వచ్చెనాడె!
రోగియాయువు పొడగించె – రోగవైరి
వైరసును నాశమొందించు వైద్యమేది?
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
30*
ముందు జాగ్రత గలదంద్రు మూగనీతి-
మరల ప్రయోగింపమనరేమి? మరచినట్లె-
ఇంగితము నెఱుగవలెనన్న సంగతేది?
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
31*
జాన పద కథానాయకు జతనమయ్యె!
వద్దు వద్దన్నా దిక్కుకే వరుసజనెడు-
కథలె, ఎయ్డ్సు శాతముబెంచు కదధనమయ్యె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
32*
బాధ్యతాయుత పౌరులే భారతాన – సగము పడిపోయె శాతంబు సాగు కృషిని-
మంచి ఫలితంబు మననీతి మందు మహిమ!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
33*
నీతి ప్రసరించు మనదేశ రీతిగాంచి – అనుసరించుచుండె దేశంబులన్ని-
నీతి విద్యల దిగుమతి నిష్ట పడగ!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
34*
లవ్వుకన్న లౌక్యము మిన్న లబ్ధి గూర్చు!
నీతి నిరసించు నపరాధి రీతిమార్చి-
మనపురాణాలు జదివింప మంచి జరుగు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
35*
దర్ఫి ఇంద్రుండహల్యతో తప్పుజేసి
వెడలి ముని శాపగ్రస్తుడై వేడుకొనగ-
వేయి కన్నుల వాడయ్యె వెసన శీలి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
36*
దర్ఫముగ రాగ శివుడు కందర్ఫు గాల్చె!
రతియు బూడిదనొడిగట్టి భక్తిమ్రొక్కె-
దహనమైన కామునిబొందె దనరె హోళి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
37*
కామ దహనంబె నిష్కామ కర్మయోగ-
సూత్రమై గీత బోధించె సూత్రధారి!
పాత్ర ధారి భారతు జేసెనను, పావనునిగ!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
38*
తెలియ కున్న ప్రశ్నించియు తెలియవలయు!
తెల్సి ప్రతిచర్య చేపట్టుటే నయంబు!
తెలిసి తెలియనిదే కీడు తెగులు గూర్చు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
39*
తిట్టు శతకాన నీతిని తిట్టి పోసి-
గట్టి మేలని గనిపెట్టి-కథలు జెప్పి-
దేశమెటుబోవుచున్నదో తెలియరైరి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
40*
తల్లి దండ్రినేరము ముందు తరపుశిక్ష!
చచ్చు రోగంబు తమవారసత్వ భిక్ష!
దుష్ట శిక్షణ హరికథ దునియ రక్ష!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
41*
పాత రోతని నీతికి పాతరేసి-
క్రొత్త వింతసోద్యకవిత, చెత్తకుండి-
కడుగు చట్రమై నీతి ముందడుగు వేసె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
42*
నడ్డి విరిగిన పద్యంపు మడ్డినీతి-
మందుగా ఎయ్డ్సు శాతంబు మందగించె!
నీతి శతకాలు జదివింపనింకమేలు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
43*
ఎడ్డెమంటె తెడ్డెముజేసి ఎయ్డ్సు రోగి-
ఏడ్చు-ఏడ్పించు మునుముందు ఏయ్డ్సు సంతు!
కథయు కంచికింటికిమన గమనగతులు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
44*
మానుకోవలె నవినీతిమార్గమింక-
మానుతీరాలి- కనరాదు-మలినసంతు!
భారమెవరిదియారోగ్య భాగ్యమునకు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
45*
ఏయ్డ్సు ఏడ్చురోగంబయ్యె ఎండగట్టె!
కల్తి రక్తమెక్కించిన కఠినమతుల-
వెఱ్ఱి మొట్టి – రోగులజూచి వెక్కిరించె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
46*
తార్చు వారల బ్రతికించి తరతరాల-
కాస్తి పాస్తియు సమకూర్చు కాంక్షచాలు!
కల్తి బేపారములుజాలు-కలియుగాన!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
47*
కల్తి రక్తబేపారి రక్కసిని బోలు!
ధర్మ-అర్థంబుచే కామ్య కర్మ గనక-
నరుడు పురుషార్థములు వీడి నరకుడగును!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
48*
ఎవరి పాపదోషము ఏయ్డ్సు ఎవరికంటు?
ఆదినిష్టూరమైనను వారిమార్చి-
ఆదరించుట-సామాజికావసరము!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
49*
మందు లేనిరుజ మలినపొందు ఏయ్డ్సు!
కల్తి రక్తాన జొచ్చు రాకాసి ఏయ్డ్సు!
వెలపల నశించు మామూలు వేడికదియు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
50*
విషయమెరుగని కలయిక విషము ఏయ్డ్సు!
తనువు విషపూరితము నాత్మ తల్లడిలుచు-
శిథిలవస్త్రంబు విడనాడు చివరి దశను!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
51*
మందు లేనిఎయ్డ్సు మలిన పొందు నంటు-
అంటు రోగముకాదు తానంటుకొనదు!
కోరి యంటించుకొనునట్టి రోగమిదియె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
52*
అన్ని చోట్లభద్రతలెన్నియున్నగాని-
ముందు తస్మాత్తు-జాగ్రత! ముఖ్యమైన-
హెచ్చరిక ఎయ్డ్సు – హెచ్చైవి వచ్చు వేళ!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
53*
ఎన్ని తీర్లు జాగ్రతలున్న ఎదుట లోప-
మెన్ని దారుల గలుగునో-ఎయ్డ్సువైరి-
మోసము-ధగాపడగ విత్త మోజు కీలు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
54*
అక్కడిక్కడయనికాదు, అన్నిచోట్ల-
ఎందరెందరు బూనినా, అందరికిని-
సేవ-నిశ్శబ్ద ఛేధన చేవ గూర్చు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
55*
రోగి జీవ ద్రవ్యముసోకియున్న ఎయ్డ్సు-
వైరసు బయటబడి యల్ప మైనవేడి-
కేనశించు! నిల్వదు నితరేతరాల!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
56*
ఏయ్డ్సు రక్తంటు రుజ రోగి యెడముగానె
సాగుటయు మేలు-దాంపత్య చనువు వెంట-
తనువులెడమైన నాత్మీయ తలపు సాగు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
57*
రోగి భోగదృష్టిని వీడి రోజురోజు-
ఎడముగానుండ తనవారు నేడుగడగ-
కలసి జీవింప హానియు గలుగబోదు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
58*
తనను – ఆపేక్షజూపక తరుము నట్లు-
మదిని భావించి బెదరు ప్రమాదమెంచి-
దూరమగువారి గనితానె దూరమగును!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
59*
మాన ప్రాణాలు హరియించు మాయమారి-
ఏయ్డ్సు మిడిమేలపురుజగ-యెదుట పడని-
తెలిసి తెలియని ప్రకటనల్ తెచ్చుముప్పు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
60*
ఎయ్డ్సు నిశ్శబ్ద కారణాలెన్నొగలవు!
పూర్వ పర భద్రతాంశముల్-బూని ప్రజలు-
తగిన జాగ్రత్త పడినచో దప్పుముప్పు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
61*
రోగి-దోషమో తదితరమోసమేమొ
ఘోర శిక్ష ననుభవింప కోరి యింక-
మాటలీటెలు సంధింప-మంచిగాదు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
62*
ఎవరి బాధ్యతలో వారు యెదుటివారి-
భద్రతనుజూడవలెనన్ భయముమాని-
వైద్యు జేర కీలెరిగిన వాతయగును!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
63*
రుజ నియంత్రణ మార్గాలు రూఢిగాను-
కంట్రి కంట్రోల్సొసైటీలు-కంటిరెప్ప-
నాదరింపగ మరిలేదు – అదరు బెదరు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
64*
ఆదరణ బంధు మిత్రాది యాత్మజనుల-
యోర్పునోదార్పులను సానుభూతి దెలుప-
చాలు! గానిచో స్వచ్ఛంద సంస్థ మేలు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
65*
చెఱువు నిండినకప్పలు-చేరుజనులు!
ఆశ్రితులు బంధు మిత్రాది యాత్మ జనులు!
కష్టకాలాన కనరారు కఠినమతులు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
66*
కారణముదెల్య సఫలంబు కాన్సలింగు!
కల్గు కర్తవ్యబోధన కాలక్రమము!
వైద్య సదుపాయములు తద్నివారణములు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
67*
రోట తలనిడి రోకటి పోటు భయము-
దలతురేయెవ్వరైనను తప్పు శిక్ష
తప్పదిట వైద్యమును నీతి తగిన రక్ష!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
68*
పోయినది పరువు ప్రతిష్ట-పోతెబోని-
పోవునది సిరి సంపద తోడునీడ!
పోవునది ప్రాణమే చిట్కపొందుదాక!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
69*
నిండ మునిగిన ఛలిలేదు-నిజము దెలియ-
వెసన సోకుమాడెను! ఎయ్డ్సు వెసనశించు!
రోగికుండునే మరియాద లోకమందు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
70*
యాంటి రిట్రోవైరలు మందులంటు వచ్చె!
పూర్తి రోగనివారణ గూర్చకున్న –
తీవ్రతను మాన్పు-బ్రతుకులు తీరుదాక!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
71*
అధిక ఖర్చుతోకూడినదా చికిత్స-
ఆయువును మాత్రమే బోయునదియు కొంత!
యోగ్య టీకౌషద దశప్రయోగ శాల!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
72*
వ్యాధి నిర్ధారణ పిదప వరుసటెస్టు-
మరల మరల శోధించియు మాటదెలుపు-
కార్యక్రమమందు పొరబాటు కలుగరాదు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
73*
రోగి వెలివేయు కాలంబు బోగనేడు
రోగమును వెలివేయు నిరోధకములె!
రోకు టోకులేకను సాగె రోజురోజు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
74*
రోగి నిజ నిరోధక శక్తి గోలుపోవ-
జేయుటే ఏయ్డ్సు పని-హానిజేయునితర-
రోగములు ఘోరవిజృంబ నోర్పు దరుగు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
75*
రోగకారక వివరాలు రోగిదశయు-
లోకనిందలు తొలగించు శోక వార్ధి-
రోగివ్రేలాడు తపనలారోగ్యమునకు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
76*
బాధతో బ్రతుకుటగాని-భయమదేమి?
రక్తరాకాసి వైరసు రాచరికము-
బయట మామూలు వేడికే బ్రద్ధలగును!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
77*
ఆంత్ర ద్రవములే ఎయ్డ్సు గత్యంతరాలు!
గాక – గాసిజేయును ఎయ్డ్సు గలుగజేయు-
వైరసుల్ రెండింట ప్రమాదమైన దొకటి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
78*
బయట వాతావరణమున బడిన నర్ధ-
నిమిషమున నాశమైపోవు! నెలవులైన-
అంతరద్రవములను వృద్ధి నందుచుండు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
79*
ప్రథమ దశనెన్మిదేండ్లు తా పైకిరాక-
రెండు మూడు దశల ఎయ్డ్సు రెచ్చి పోవు!
తనువు చిక్కి శల్యముగాగ తస్కరించు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
80*
చివరి దశయందుజేయు చికిత్స లేదు-
పరులకును సోకకుండుటే భద్రతగును!
కట్టె తనువు కట్టెనుగాలు కర్మదాక!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
81*
రోగి చావుదోవన దొర్లు రోదనమున
నేరమని శిక్షలెంచగా నేమి వచ్చు?
మోసగింపబడి బ్రతుకు మోసమందె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
82*
శాపమో పాపమో తుద చావు శిక్ష-
దోషమెంచగా ఫలమేమి? తోటివారి-
-పుట్టిముంచు రోగము ఎయ్డ్సు పుడమియందు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
83*
ఎవరు బోధింత్రు-వివరంబునెవరి వంతు-
ఎవరు వారింత్రు-విధ్యుక్తమెవరి వాక్కు?
లింకు వాలంటరీ సేవలిక దిక్కు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
84*
ఎచట గనిపెట్టబడి-విర్గుడెచట దొరుకు?
ఎచట ముమ్మారు టెస్టుల దేల్చు నిజము?
డేంజరేదగు హెచ్చైవి రెండు తీర్లు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
85*
ఎన్నగా దెల్యు హెచ్చైవి వన్నుటూల-
వన్ను డేంజరు మిన్నగా నెన్నవలయు!
నమ్మబల్కు వారలు దెల్ప నయము మాట!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
86*
దేశమాతాజ్ఞ – దైవ సందేశ ప్రజ్ఞ-
ప్రజలు పాటింపకుండుట పాడిగాదు!
పాటి దప్పిన మృత్యువే పట్టుగొమ్మ!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
87*
యువత జాతీయ పథక చేయూతవెంట-
లింకువాలంటరీ సేవలింక కొన్ని-
చేరి సాగించు కృషిచేత జెందు మేలు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
88*
ప్రకటితముగ ప్రజాస్వామ్య ప్రభుత వెంట-
మీనమేషాలు మాని గ్రామీణ యువత-
కలసి వచ్చిన చైతన్య కార్య క్రమమె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
89*
చేరి నిశ్శబ్ధఛేదన చేయు చోట-
ప్రజలు గురుశిష్యశిబిరాల పలుకుబడుల-
లింకువాలంటరీ సేవలింకమేలు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
90*
యువత విద్యార్థి సంద్రంబునుర్వి పొంగ-
నుప్పెన తుఫానుగాసాగు నుద్యమంబు!
మూతబడు ఎయ్డ్సు కథయు మున్ముందు దశను!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
91*
ఐటి,డిఎ,వీటిడిఎ,సిఎమ్మీయివైలు-
వివిధ జాతీయ సంఘాలు వీధిలొల్లి-
ఎయ్డ్సు జాగ్రతల్ నినదించె ఎదురుకోలు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
92*
ఎదురు వచ్చె ప్రజాసంఘ బెదురు మాన్పి-
చెదరు గుండె ధైర్యము నిల్పు చేష్ట లెల్ల-
వెలయు విద్యాలయాల దివ్వెలుగ వెలిగె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
93*
వెలయు శిబిరాలు నైతిక విలువబెంచె-
కలలు విజ్ఞానములనెల్ల కలియబోసి-
కదలె క్రమశిక్షణగ కార్య క్రమములందు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
94*
ఉర్వియుక్తమయుక్తమౌ నూత్నగతుల-
హంసపాలనాయము వెంట హర్షమొదవ-
భూత దయబూని విద్యార్థి పులకరించె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
95*
పుడమి నీతిధర్మము వెంట పుట్టగతులు-
ప్రజలకాత్మ విశ్వాసమున్ ప్రభలజేయు!
దానివెంట సత్కార్యముల్ దనరు చుండు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
96*
అవని నవినీతితోగల్గు నసలు కెసరు-
వెట్టు ఘోరప్రమాదముల్ గుట్టుదెలిసి-
నీతి యౌషద సేవతో నెగ్గవలయు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
97*
అల్పునాత్మ విశ్వాసమే యధికు జేయు-
ఆత్మ గల్గిన న్యూనతే యల్పు జేయు
యుక్తమగుదాని సాధింప నుత్తమంబు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
98*
భవిత భాసించు నాత్మీయ బలమువెంట!
మంచి గూర్చు సుబాషిత మనన పటిమ!
చెడు విసర్జింపగా నీతి చెలగు మదిని!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
99*
భక్తి శ్రద్ధలు గలిగిన భ్రమలు దొలగు!
భక్తి దేశభక్తిగవెల్గ భయముదొలగు!
నీతి నిస్వార్థమలవడు నిత్య సేవ!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
100*
పాప పుణ్యంబు విభజించి పటిమజూపి-
భువి పరోపకారమె గొప్ప పుణ్యమనుచు-
నెంచి సంచరించినజాతి మంచినీతి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
101*
ఆరు నెలలు సాగిన నీతి వారువీరు!
తారుమారగు తప్పుల తడక దొలగు-
నిజముగా నవినీతికి నీతె మందు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
102*
అలసి పోయిన సోదరుల్ అలక మాని
సొలసి పోయిన పెద్దలు శోకపడక-
కలసి వచ్చిన మునుముందు కలదు సుఖము!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
103*
కథలు కాకరగాయల-గలుగు నీతి!
చెఱుకు గడతేనెలను తీపి చుఱుకుదనము!
ప్రాణతీపికుపమ! నీతి పథము పుడమి!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
104*
తీపి వస్తులను ప్రాణ తీపి మిన్న!
నీతి ధర్మాల నుపకారనీతి మిన్న!
భరత జాతీయమే నీతి బాట కోట!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
105*
కార్య సాధకులీచర్ఛ గలుగు నీతి-
బ్రతుకు తరియింప బొందిరి పరువు కీర్తి!
చేయు సేవలో స్వచ్ఛంద సేవ వెలసె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
106*
దయయు దాక్షిణ్య గుణ నీతి ధాతకీర్తి!
సేవ శ్రమదానచైతన్య శక్తి గూర్చె!
భారతీయులకారోగ్య భాగ్యమొసగె!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
107*
నాయకత్వలోపము, ఏయ్డ్సు అణువు రణము-
ముంచు నీప్రపంచమునెల్ల ముందుముందు!
జాగ్రతయను మేధావుల జాగరణలు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!
108*
తల్లి భారతి శుభధాత్రి తరతరాల-
నీతి భారత జాతికి నిండుదనము!
విశ్వ శాంతికి బీజమై వెలయు చుండు!
తిరుణహరి విను దీనుల కరుణగనుము!