top of page
శ్రీ శ్రీ శ్రీ నృసింహ నివాళి శతకము
(తే.గీ.)

1*

శ్రీహరి దశరూపుడ! విశ్వ సృష్టి కర్త!

భర్త, హర్తవు, పరబ్రహ్మపదము నందు-

మూడు మూర్తులవెలుగొందు ముక్తి ధాత!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

2*

శ్రీనివాస! యాదాద్రీశ! శేషశాయి!

కామిత వరదాయక! శౌరి గరుడ గమన!

భక్త మునిజన మందార! బ్రహ్మ జనక!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

3*

ఆర్త జనరక్షక! పరమాత్మ రూప!

సృష్టి సుస్థితి లయకార! శ్రేష్ఠ! వరద!

ధర్మ సంస్థాపక! దశావతార మూర్తి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

4*

సనక ముని శాపగ్రస్తులు జయవిజయులు-

వరుస ముజ్జన్మలీదియు వాసమునకు

వేగ జేరెడు వరమిడన్ వేడుకొనిరి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

5*

మిత్రులై పెక్కు జన్మలు మిడుక వశమె?

శత్రులై వేగ నీసేవ సాగు దీక్ష

దగ్గరైయుండుటె కదా తనివిదీర!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

6*

ధరకృత, త్రేతము యుగముల ద్వాపరాన

మూడు శత్రుజన్మలుదాటి ముక్తులగుచు!

వాసమునుజేరి తమధర్మ వసతి గనిరి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

7*

కనక నేత్ర, కశ్యపు లైరి గనిరి ముక్తి

రావణాకుంభకర్ణులై ద్వాపరాన-

వరుస శిశుపాలుడును దంత వక్త్రులైరి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

8*

నీదు ప్రతిరూపములె కదా నిజమెఱుంగ

సనక సనఁదులు సురమునుల్ సాధుజనులు!

మంచిచెడులకు సమరమే మహిచరిత్ర!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

9*

బ్రహ్మ వై సృష్టిగావించి భద్రతొసగి

విష్ణువైవ్యాప్తి-శివుడవై విలయ గతుల-

శక్తి-మమ్మూర్తులను సాగు భక్త వరద!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

10*

తుచ్ఛ సంపదల్ పుణ్యమున్ తూచగలవె!

తూచ దప్పక స్మరియించు దోవనీదు

శత్రు మిత్రాత్మలును బొందె సద్గతులను!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

11*

అంతరంగ శాత్రవుదాడి నధిగమింప

మదిని నిల్పగా ధ్యానమే మంచిదారి

మనసునాత్మనిశ్చలమైన మనిషి ఘనత!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

12*

ఎఱుక గనుదాక నీబోధ లెన్నితీర్లు

ముక్తి గలుగుదాకను సృష్టి ముడిని బడగ

స్వచ్ఛమై ధర్మధేనువునిచ్ఛ సాగు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

13*

ధర్మ సంస్థాపనయు జర్గు ధరణియందు-

ధర్మ మార్గనిరూపణ తమరి పనియె!

దానికోసమీవెలయు పౌరాణికాలు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

14*

వేదమునుపనిషత్తుల తేట వెలసె విధిగ

బహుపురాణసంచయనీతిబాటగీత

నిధియు నరజన్మ గతి నవనీతమయ్యె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

15*

ఒక్కమాటలో తత్వంబు నొక్కబోదు

నాత్మనలవోకనెరగదాధ్యాత్మికంబు

మదిని నాటుట నీభక్తి మార్గ వశమె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

16*

ఎన్ని వివరణలీ తత్వవిధుల నిధులు

వ్యక్తియనుభవ సారముల్ వసుధ కథలు

కలిమి లేములు కావడి కడవలనగ!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

17*

ఉర్వినితిహాస భరితమై యుగయుగాలు

నణువు నణ్వున జీర్ణించె తనువు మనము

మిగిలి లేదులేదనుటెల్ల మిగుల వింత!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

18*

శాస్త్ర వేత్తలు వేదాంగ శాస్త్ర హితులు

యెదను నాటగా సెలవిచ్చిరెట్టిమాట?

తుదకు తృప్తిగా దెల్పిరి అదియె నీవు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

19*

ఏదొ? మిగిలెప్రయోగమై యదియె శక్తి

విశ్వరూపదర్శన శక్తి విశ్వసింప-

నరుని మేధయోచన శక్తి నాణ్యమయ్యె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

20*

తృప్తి పడవలె కద, లేశ ప్రాప్తికైన-

భక్తియంకురించినకద, బ్రహ్మముదము!

మనిషితోబుట్టి గిట్టును మహిని భక్తి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

21*

ధర హిరణ్యాక్ష కశ్యపుల్ దైత్య నీతి

సాధు జీవుల హింసింప సాగిరంత!

కనకనేత్రుడు చెలరేగె కాంక్షమీర!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

22*

తోడబుట్టువు హోలిక తోడుపడగ

రాక్షసుల జృంభనము హిరణ్యాక్ష యాన

తుదకు భూమాత చెఱబట్టె దోషమనక!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

23*

పుడమి మొరలిడెను, పరమ పురుష రమ్ము

వేగ జీవుల రక్షింప వేడుకొనెను

ధర్మధేనువు ఘోషించె దారిలేక!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

24*

క్రోఢరూపాన పుడమిని కోరనెత్తి

రక్షజేసిన యాదివరాహరూప!

జలధి శోధించి దైతేయు జంపినావు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

25*

ధరణి నుద్ధరించియు జీవతతుల బ్రోచి

మూర్ఖ దానవాళిని తుదముట్టజేసి

రక్షకుడవైతివాది వరాహమూర్తి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

26*

ఆర్త జనుల బ్రోవగవచ్చు ఆది దేవ!

ఆపదలు మాన్పి సంపదలందు దేల్చి

భూమి భారమును వహించు పుణ్యమూర్తి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

27*

ధర వరాహ నృసింహావతార మూర్తి!

దేవ దేవర శ్రీ దేవి దీప్తి హృదయ!

చిన్మయానంద భూదేవి చిత్తచోర!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

28*

బ్రహ్మ శివుల వరాలంది బలిమి గ్రొవ్వి

దానవాధముల్ బూనేరు ధర్మహాని-

వారి దునిమి జీవుల బ్రోచు వాసుదేవ!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

29*

బ్రహ్మ సృష్టి, శివలయపు బాట నడుమ-

వ్యాప్తి సాగించు విష్ణువై వసుధయందు-

భక్తి యోగసాధనమెచ్చు భవవిదూర!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

30*

అగ్రజుని జంపె హరియని యాగ్రహించి

వైరమునుబూనె కుత్సిత వర్తనుండు!

కశ్యపుడు హరి భక్తుల గనడు వినడు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

31*

శ్రీశ!భక్త చిత్తాబ్జనివేశ! భువిని

సింహగిరి నాథకోటంచ స్థిరనివాస!

హరిహర నాథ! మురవైరి! శౌరి శరణు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

32*

హ్లాదమునుగోరి నినుగొల్వ హాని జేయు

కశిపు-వరగర్వి పూజింప గానిపనియె

రాజునానతి తలదాల్చ రాజ్యఘోష!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

33*

కొడుకు హరిభక్తి గమనించి కోపగించి

గురుల శాసించె తనభక్తి గూర్ప గోరె!

సాధు సద్భక్తులనుమార్చ సాధ్య పడునె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

34*

నీటమునుగడు, నగ్నిలోనీరుగాడు,

గిరులలోయల విసరిన గొఱతవడడు!

హాయి హరినామపాయి ప్రహ్లాదుడనగ!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

35*

అగ్ని గాలని వస్త్ర యైయ్యధిక గర్వి-

కశ్యపు తోబుట్టు హోలిక గాలె తానె

బాల ప్రహ్లాదు నొడిజేర్చి భస్మమయ్యె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

36*

హోలికా బాధ సమసెను గోలమాని

జనులు ప్రస్తుతించిరి – సురమునులు గూడి

భక్త ప్రహ్లాదుబొగడిరి బహువిధాల!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

37*

కాముకి హోలికయుగాలె కలిగె ముదము

పాడిపంటల పర్వమై ప్రజలయందు

కామదహనంబు మరునాటి కథగ మిగిలె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

38*

తనయుడుజూపె కంబము తండ్రియడుగ-

ఎందు జూచిన హరియుండునందనంగ-

మూర్ఖ కశిపుండు పెనుగద మోదెనంత!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

39*

భీకరాద్భుతరూపాన నేకముగను

దిక్కులును పిక్కటిల్లియు బిక్కుమనగ

కశిపుదునుమాడి ప్రహ్లాదు గాచినావు

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

40*

సన్నిధినిజేరె లక్ష్మియు శాంతిగూర్ప-

బాల ప్రహ్లాదు దీవించి ప్రభువు జేసి

వేడ్క నరహరి రూపమై వెలసినావు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

41*

బాలుడడుగ సింహాద్రియప్పన్నవగుచు

వెలసితివి దేవ జనులకు వేడ్కలొసగ

శబరిగిరినాథ యయ్యప్పసామి నీవె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

42*

శత్రు జన్మ నహంబున జయవిజయులు

ఎంత కథను సృష్టించిరి యెఱుగఁ బ్రతుకు

మైత్రి బలపడు నీతి సన్మార్గముగను!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

43*

మిత్రులై జన్మనెత్తిన మితము భక్తి

పెక్కు జన్మలు నహమింక పెరుగుచుండ

నీదు సేవ-భాగ్యపు తృప్తి-నెలవులగున!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

44*

తారకుని వధింపగను కుమార సామి

జన్మ గౌరీశ్వరుల పెళ్ళి జరుగవలయు

కామదేవుడు దిక్కయ్యె కథయు నడిచె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

45*

కాముడిలలోక కళ్యాణ కారకుండు

హోలికా లోకమారణ హోమ శక్తి

మంచి చెడు వెల్గు నీడల మనిషిబ్రతుకు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

46*

కాము పునరుజ్జీవనకాంక్ష గలిగి రతియు

తపము సాగించె గౌరియు ధవుని వేడె

హరుడు వరమిచ్చె కాముడు మరల బ్రతికె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

47*

ధరవసంత జయంతుల దారి ప్రకృతి

మరల చిగురించె చిలుకపై మన్మథుండు

పుష్టి గలిగింప ప్రేమతో సృష్టి వెలిగె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

48*

వ్యసన సప్తకంబు నరిషడ్వర్గములకు

నరుడు బలిగాక మదినిల్పు నట్లు భక్తి

కామియై మోక్షగామియౌ కాంక్షదీరె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

49*

ధరణి నరనీతి ధర్మమై దనరు సృష్టి

విశ్వ కర్మ శిల్పములాగ విస్తరించె!

పాఠ గుణపాఠముల ధర్మ పథముసాగె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

50*

సకల పౌరాణికవిధుల సాగు శక్తి!

ధర్మ వర్తనమై ప్రేమ దనరు భక్తి-

యోగమై గీత భోధల యోగ్యతెసగె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

51*

దేవ దానవ బుద్ధియు దేనికదియె!

మదిని యుద్ధరంగముజేసి మరలజరుగు!

మంచి చెడుపేర ఘర్షించు మానవాళి!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

52*

మూడుమూర్తుల విహరించు మూలశక్తి

ప్రేమ శక్తియే ప్రాణమై ప్రేరణొసగు!

భోగమై యోగమై సాగి పోవుచుండు!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

53*

స్వార్థమునుమాని పూర్ణవిశ్వాసమొంది

వివిధ ప్రేమల నీప్రేమ విస్తరింప-

త్యాగపూరితమగు నాత్మ తపన ముక్తి!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

54*

కోరి పాల్గుణ పూర్ణిమ కొడవటంచ

జాత్ర శోభయాత్రయు రథోత్సవముజరుగు పూర్వ పరము కైంకర్యముల్ నుర్విమేలు!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

55*

గరుడ గజవాహనములతో కదలు రథము

నీదు కళ్యాణ వైభవం నింపొసంగు!

చక్రతీర్థంబు దాకను సంబరములె!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

56*

ఎద్దు బంది సంసిద్ధత యెంత శ్రద్ధ!

ఊహమాత్రమై పోయెను ఊసులన్ని

ముందు జాగరూకతలన్ని మురిపెమొసగె!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

57*

వారి వారి హోదాగసవారు బండి

తడకలమరించినవి పెద్దతరపు బండ్లు

పరగ వస్తుసామాగ్రియు పసుల మేత!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

58*

జాజు సున్నపు పట్టెలు జనుము తైల-

మందుదడపిన యిరుసులు మంచినొగలు

చక్ర శీలపటిష్టత చాటువలును!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

59*

వరుస కనెములు దుత్తలు వారుగట్టె

మువ్వ గజ్జెలు ఫణతాళ్ళు మొలకు గంట!

కొమ్ము రంగుల పగ్గముల్ కోరినట్లు!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

60*

వరుస సాగుజోడెడ్ల సవారుబండ్లు

సెలవు దినములు పనిపాట సేదదీర్పు!

మనసులానంద వారాశి మునిగి తేలు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

61*

బండి నడిపి సంతోషించు పసితనంబు

ముందు గూర్చుండి పయనించు ముచ్చటగును

జాత్ర సంబరమేగ రోజంత సాగు!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

62*

రాత్రి వరకుజాత్ర పరిసరాలనాగి

తోట విడిది వంటలు సాగు తోటివారి

స్నాన బోనాదులును వస్తు సంచయములు!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

63*

ఎన్నిమారులు తిర్గునో ఎడ్లబండి

పిదప దర్శనార్థము గుడి ప్రీతివెంట

మ్రొక్కు సేవ ప్రదక్షిణల్ మోదమొసగు!

స్వామి కోటంచ వాస నివాళిగొనుమ!

64*

పుట్టు వెంట్రుకల్ కళ్యాణ ఘట్టనొసగి

పూర్ణ భక్తి జోటసేవ భుజపు మ్రోత

దంపతులమ్రొక్కు టెంకాయతదితరాలు!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

65*

రకరకాలుగ జనసమారాధనములు

గొడుగు మీస సమర్పణల్ ముడుపుకాన్క-

జానపద సంబరాలతో జాత్ర మెఱయు!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

66*

చుట్టముల్ ప్రక్కముల్ దూర చూపు జనులు

యేట గల్సి సంబాషించు పెద్ద చిన్న

ముద్దు మురిపెంపు పిల్లలు ముందు వెనక!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

67*

తనివి తీర్థ ప్రసాదముల్ దర్శనములు

మ్రొక్కుదీర తోటకుజేరి మొదలు తిండి

వివిధ వస్తుల కొనుగోలు వెడలుదాక!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

68*

ఆటవస్తులు నిత్యావసరపు పనులు

పిలిచి పంచు మిఠాయిలు పిన్న పెద్ద-

తృప్తి తిర్గు పయనదారి తీపియాది!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

69*

అలసి బండిలో దిగబడి యరగు వేళ

అందరాత్మీయులను వీడు నపుడు బాధ

చెప్పజాలని స్త్రీ దు:ఖమొప్పు సొదలు!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

70*

మరల జాతరలో గల్సి మరువలేని

మాట మంతి సాగింపగా మనసు గోరు

దూరములు దగ్గరయ్యనో దురిత దూర!

స్వామి శ్రీనృసింహ శుభ నివాళిగొనుమ!

71*

నాటి యేటేటయూరట నేటియాది

మ్రొక్కుబడియె ఆత్మీయత పెక్కువిధుల-

వేగవంతజీవనయాన వేదికలను

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

72*

మరపురానిదై పిల్లలమనసు దోచు

పాఠమగు యువతకు గుణపాఠమగును

యాది గా వృద్ధులకు నచ్చు యాత్రసోది!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

73*

ఉరుకు పరుగుల జాతరల్ ఊయలట్లు

గుడికి నింటికి జనుపొద్ధు గ్రుంకువరకె!

కలిసినంతసేపును పోవునలసి నిద్ర!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

74*

సాగె దూరపు యాత్రలు సత్రవసతి

దేశమంతయు తిర్గునుద్ధేశమొకటి!

మంచిదే యైన సంతృప్తి మనసుకేది?

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

75*

భక్తి పద్యాన బాషయు భావపుష్టి

భావ్యమరయక తప్పలుబట్టి చనెడు

పండితుడుదిద్ది తీర్చడు పలుకు బడిని

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

76*

దాసు దోషము దండంబు తోసరియన!

శతక నిధిని గాపాడుమో చక్రధారి!

గురుల మెప్పించు బాధ్యత గురతరంబు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

77*

తాము వ్రాయరు వ్రాసిన తప్పటంచు

భావ్యమెరుగరు సోమరుల్ భక్తి గనరు!

బాష లే నీవి సద్భక్తి పథము మాది!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

78*

సాధనయు లేని పనులెట్లు సాధ్యపడును

సాగనీని ఖలుల మూక సాగనంపి-

భక్త ప్రస్తుతి పద్యం పు బలమొసంగు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

79*

మాట పోటున చిధ్రమౌ మనసు మాది

భక్తి పోటిని భధ్రమౌ వరము నిమ్ము!

భక్తి బాటసాగెడు మంచి బ్రతుకు నొసగు !

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

80*

వ్రాయనేర్చిన దుష్టమౌ వాదమాయె!

మానివైచిన శిష్టమై మన్నికాయె!

సంస్కరింపక నిల్చెనే సంస్కృతంబు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

81*

వినరు తమతోడిదేలోకమనెడు వారు

శ్రమకు నోపరు సోకుకై రాకపోక

పరుల బాధకే నినుమ్రొక్కు భక్తి యాత్ర!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

82*

తెలివి తనసొమ్ముగా నెంచి తెగను వాగు

తుంటరియు జిక్కు తుదకు తాఁ నొంటరిగను!

పామరులె దాపు ప్రాపుగా ప్రేమబొందు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

83*

తర్క వయ్యాకరణ నేర్పు తగినయోర్పు

ప్రతిభ సత్పండితుల సొమ్ము ప్రజల సొమ్ము

జానపద బాషయందురు జగతియందు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

84*

పరగ మూర్ఖు సంతోష పరతు రెవరు

అద్దమున కొండవలె విజ్ఞుడణగియుండు

క్షమను గోరియు వారకి క్షేమ మొసగు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

85*

వాదమేదైన తుది తీర్పు వాస్తవంబు

భక్తి యేదైన తుదజేరు ముక్తి ధరిని

సంయమనము పాటింపగా చాలమేలు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

86*

మంచి దిక్కుమొగ్గునుజూప మంచి గలుగు

అల్పువాదవివాదాలు యవని కీడు-

కూర్మము పగిదిని ముడుచు కొనుట మేలు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

87*

కరువు దీరగ కృషిజేయ పరువు దక్కు!

వ్యర్థ జంజాటములకన్న భక్తి మేలు!

మానవత నీడలో నీదు మార్గముండు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

88*

ధ్యానమున మది నిల్పిన దనరు శాంతి

సహనమును గల్గి జీవన సౌఖ్యమలరు

తృప్తియానందమున ముక్తి పాత్ర మగును!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

89*

అనుభవము దక్కె దుడుకుల నధిగమింప

కాలయాపన దొల్గె నీకరుణ చేత

స్తిమిత మేర్పడె సద్భక్తి చిత్త మలరె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

90*

జరను నీధ్యానమీలోక జాగృతొసగు

పారలౌకిక మగుభక్తి పథము వెలయు

భక్తి జన్మరాహిత్యమగుముక్తి పదము జేర్చు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

91*

శిష్టులును జానపదులును – ఇష్ట పడగ

స్పష్ట మగు నర్థ తాత్పర్య పుష్టి-శతక

కృతులనర్పించి మ్రొక్కితి కృపను గనుమ!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

92*

పండితులు దుష్టములనెత్తి బాధి యడుగ-

శాస్త్ర మని సంస్కృతమురుద్ధ సరియుగాదు

తెలుగు హితవుగా కృతి సేయ తెగువనొసగు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

93*

ఎవ్వరేమన్న సద్భక్తి నివ్వటిలగ

శుద్ధి నిశ్చల మగు భక్తి శ్రద్ధ మదిని

యాత్మ దర్శనమున జన్మ సార్థకంబు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

94*

సింధువుననేక బింధువీ చిన్ని శతక

మిష్ట దైవ ప్రస్తుతి భక్తి నిష్ఠ వెలసె!

భక్త జనసమాజము భావ భద్రతొసగె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

95*

వాసు దేవసర్వస్వమై వస్తు నిధుల

ధర్మముల శోధ మొదటిదే తదుపరేది?

నూత్న గతినీదు ప్రకృతి వినూత్న శక్తి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

96*

వసుధ నరులు వాస్తవమెర్గి వరలు జీవ

తతుల నుద్ధరింపగ గీత దరచ మేలు!

నరులు మరచిన ప్రకృతియు నష్టమొందు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

97*

లోక జీవనమొక కల లోపయుక్త-

బ్రతుకు రూపకమును సాగు బంధమగుచు-

తద్విముక్తికై నినదించు తాత్వికంబు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

98*

తెలిసిన కొలది తెలిసేది తెలియదనియె!

యోగ్య వైజ్ఞానికదశ ప్రయోగ శాల

దాటునెప్పుడు మదిభక్తి దరచ మేలు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

99*

ఊహ వస్తువై వస్తులే యూహ దేల

శాస్త్రమైయాగె ముందుకు సాగె భక్తి

జన్న జన్మాంతర దృష్టి జాగృతొసగె!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

100*

జీవి జీవిని నీదీప్తి దివ్య ప్రేమ

ఆత్మ పరమాత్మ దర్శన మైనదెలియు!

ధ్యానమున చిత్తమును నిల్ప దనరు భక్తి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

101*

నీదు ప్రేమ యనిర్వచనీయ శక్తి!

స్పష్టమొనరింతు సామాన్య జనులకొఱకు!

తదితరాలతో పనియేమి తదుపరవియు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

102*

ఆత్మ తనవు నాత్మీయులు నతుకుపడిన

బంధుమిత్రాదులను సాగు బంధమేది?

ప్రేమ శక్తి నీ భక్తియే ప్రేరణొసగ!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

103*

కనగ వినగ శక్తులనమ్ము కలిమియట్లు

నలరు ప్రేమశక్తియు నీదు నటన సూత్ర

జగతి నాటకమాడించు జన్మగతుల!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

104*

వసుధ నరులు వాస్తవమెర్గి వరలు జీవ

తతులనుద్ధరింపగ ధర్మ దారి ప్రేమ-

శక్తి నీతిధర్మము గీత సాగుబోధ!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

105*

బయట బడిపరీక్షలు లోన బరగునాత్మ

నికష నిర్ధేశ్యములు సాగె నీదు శతక

మాలనర్పించితిని భక్తి మార్గమందు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

106*

సృష్టి శోధనలిహలోక పుష్టి గూర్ప-

పరముకై సాగు సద్భక్తి పడవ జేరి-

యెఱుక గల్గితరింపగా మెఱుపు గీత!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

107*

వ్రాయనెఱిన సత్యనారాయ కవిని

తెలుగుసారు పేరునసాగు తిరుణహరిని!

దోషముల్ క్షమార్హముజేసి దోవజూపు!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

108*

శుభము శతకాభిమానులౌ శ్రోతలకును-

శుభము భారతజాతికి శుభయశంబు!

శుభము విశ్వమానవులకు సుఖము శాంతి!

స్వామి శ్రీనృసింహ శుభనివాళి గొనుమ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page