top of page
శ్రీ నరసింహ నీరాజన శతకము
(తే.గీ.)

1*

శ్రీనివాస! యాదాద్రీశ! శేషశాయి!

కామిత వరదాయక శౌరి! గరుడగమన!

భక్తమునిజన మందార! బ్రహ్మజనక!

రామ నరసింహ నీకు నీరాజనములు!

2*

శరణు శరణన్న వారల కరుణజూపి

భక్తి మార్గాన నడిపించి ఫలమొసంగి

జన్మరహిత మోక్షమునిచ్చు జానకీశ!

రామ నరసింహ నీకు నీరాజనములు!

3*

కలిని పురుషార్థి ధర్మ యుక్తముగ-కామ-

అర్థ మోక్షాదులను జన్మ సార్థకముగ

బ్రతుక నేర్చునా-నీదయబడయలేక?

రామ నరసింహ నీకు నీరాజనములు!

4*

అన్ని విని బుద్ధిమంతులననుసరించి

భక్తియోగమే సుళువైన బాటగాగ

పూనుకొనియుపాసనజేయు పుణ్యమతియు!

రామ నరసింహ నీకు నీరాజనములు!

5*

ఎంత దెలిసినా యోగంబు కొంతమిగులు

ఎంతజేసినా నీపూజ సుంత మిగులు

శరణువేడగ లభియించు సత్ఫలంబు!

రామ నరసింహ నీకు నీరాజనములు!

6*

క్షామమునుబాపి పోషించు సకలజనుల

క్షేమమును గూర్చు వైకుంఠ ధామ శరణు!

వామదేవాదిమునినుత! వాసుదేవ!

రామ నరసింహ నీకునీరాజనములు!

7*

వరములిచ్చి మరవక గర్వంబుదుడిచి

సాత్వికతగూర్చు-సద్భక్తి సాగజేసి

ముదముతో పాటు జీవన ముక్తినొసగు!

రామ నరసింహ నీకు నీరాజనములు!

8*

కలిగె నొక్కడు బంగారు కన్నువాడు

వాని తమ్ముని తనువంత పసిడిముద్ధ!

పైగ వరగర్వమున జన్మ పాపులైరి!

రామ నరసింహ నీకునీరాజనములు!

9*

భూమిజుట్టి వచ్చిన తృప్తి బుద్ధికేది?

పసిడి నేత్రుడు పరహింస పరుడు ఖలుడు!

గాగ పుడమిని ముంచెనునీట కావరమున!

రామ నరసింహ నీకు నీరాజనములు!

10*

ఆది వరహరూపమున హిరణ్యాక్షు ద్రుంచి-

పుడమి చేపట్టి బ్రోచిన పుణ్య మూర్తి!

క్రూర కశిపుజీల్చినయుగ్ర నారసింహ!

రామ నరసింహ నీకునీరాజనములు!

11*

వేల్పులకువేల్పువిలవేల్పువెచటనున్న-

బాల్యమందుకోటంచలో భక్తిగొంటి!

యవ్వనంబున యాదాద్రి యాత్రగంటి!

రామనరసింహ నీకు నీరాజనాలు!

12*

వేల్పురాజన్న జాతర వేములాడ

దారి నాంపల్లిలోగంటి తమరి రూపు!

అడుగడుగుననీలీలలే అవనిగుడుల!

రామనరసింహ నీకు నీరాజనాలు!

13*

కొరివి కొమ్మాల తీర్థాల గొప్పపేరు

కరినగరమోరుగల్లున కలగు గుడుల-

దర్శనము గల్గుపుణ్యమై ధర్మపురిని!

రామనరసింహ నీకు నీరాజనాలు!

14*

ధరణి సంపూర్ణ మగునవతారమూర్తి!

సజ్జనులను బ్రోవగవచ్చు శాంతమూర్తి!

దుష్ట హరుడవని దురితదూర కీర్తి!

రామ నరసింహ నీకు నీరాజనాలు!

15*

బాలురకునీదు రూపంబు భక్తి గూర్చు!

బుద్ధులనునేర్పు విద్యాభివృద్ధి గాను!

జరను నీభక్తి కొండంత జవము గూర్చు!

రామనరసింహ నీకు నీరాజనాలు!

16*

కామదృష్టి ధర్మముతోడ గలిసి సాగ

ప్రేమశక్తిగా రూపొంద పేరుకీర్తి!

పుణ్యధనము సత్కీర్తికి పుష్టి తుష్టి!

రామ నరసింహ నీకునీరాజనాలు!

17*

యాత్ర బాల్య కౌమారముల్-యవ్వనంబు!

ధర్మ యుక్త మై పురుషార్థ దారియందు-

జరయుగలిగెడు తరిదాక జరుగు బ్రతుకు!

రామ నరసింహ నీకునీరాజనాలు!

18*

తనువు బెర్గిన నేమగు తత్వమరయ-

బుద్ధిబెరిగిన నాత్మయేయుద్దరించు!

ఆత్మ నెరిగిన నరుడునిన్నందుకొనును!

రామ నరసింహ నీకు నీరాజనాలు!

19*

ఆత్మ నీలోని భాగమై యవనిబుట్టె-

పుడమి గోళము రవినుండి బుట్టినట్లు!

నీదు ఆకర్శనేభక్తి నిచ్చి బ్రోచు!

రామ నరసింహ నీకునీరాజనాలు!

20*

ధరణి సూరీని జేరెడు దాక ప్రకృతి-

సృష్టి సుస్థితి లయకారచేష్టసాగు!

ఆత్మ పరిపక్వమున పరమాత్మ జేరు!

రామ నరసింహ నీక నీరాజనాలు!

21*

దశదిశలు నీదశరూప దర్శనంబు-

గలుగు తీర్థాలు క్షేత్రాలు కనులవిందు!

భాగవతకథా నిలయాలు భక్తిసిరులు!

రామ నరసింహ నీకు నీరాజనములు!

22*

చంటి బాలల రక్షించు శాంతమూర్తి!

దుష్టసంహారమొనరించు ఉగ్రమూర్తి!

పాహియన్నరక్షించు వరాహమూర్తి!

రానరసింహ నీకు నీరాజనములు!

23*

దురిత బుద్ధికి నీయాది దుడ్డుకఱ్ఱ!

చిత్త చాంచల్యమును మాన్పు చిత్ర సింహ!

ధ్యాన మంత్రబీజాక్షర ధామ శరణు!

రామ నరసింహ నీకు నీరాజనములు!

24*

చక్కగానొక్కతనజునియసాక లేక!

కక్షసాధించు క్రూరాత్ముగర్వమణచ-

ధరకు దిగినసపూర్ణావతారమూర్తి!

రామనరసింహ నీకునీరాజనములు!

25*

వేదములు బ్రోచి యవనిపై వెలయజేసి

అవని రక్షించి కనకాక్షునివధించి-

కశ్యపుని జీల్చి ధర్మంబు గాచినావు!

రామనరసింహ నీకునీరాజనములు!

26*

కొడుకు నాయుధంబుగజేసి కోరినట్టి

మరణమునుగూర్చి మరుజన్మమరయ బంపి!

వారి కడతేర్చితివి రామబాణఘాతి!

రామనరసింహ నీకునీరాజనములు!

27*

కనకనేత్ర కశ్యపులుగ కథయు ముగిసె!

రావణాకుంభకర్ణులు రయముగాగ-

వైరి శిశుపాలు వరదంత వక్త్రహరుడ!

రామనరసింహ నీకునీరాజనములు!

28*

వంద జన్మల మైత్రియు వాసిగాదు!

మూడు జన్మల వైరమెముందుగడిపి-

సేవకైవచ్చు భాగ్యమే సేమమనిరి!

రామనరసింహ నీకునీరాజనములు!

29*

భాగవత-రామకథ-మహా భారతాది-

పాఠ గుణపాఠములె భువి పాపహరము!

ప్రేమశక్తియారాధన పేరు కీర్తి!

రామనరసింహ నీకునీరాజనములు!

30*

పుడమి పౌరాణికమువిన్న పుట్టు బుద్ధి-

తిరిగి ఇల్లుజేరగ మంచులా కరిగిపోవు!

వీనువిందుగ మరల వినగ మేలు!

రామనరసింహ నీకు నీరాజనములు!

31*

స్వస్థతనుగూర్చు తీర్థంబు వైద్యసేవ!

సంకటముబాపునీదుప్రసాదమహిమ!

ఎచట ఏరూపున నెపుడు ఎదుపడుదొ!

రామనరసింహ నీకునీరాజనములు!

32*

ఎన్ని గాథలో బాధలో వెడలివచ్చి-

మ్రొక్కు దీర్చువారలునోపి ముచ్చటింత్రు!

చక్కబడగోరువారలు మ్రొక్కుకొంద్రు!

రామనరసింహ నీకునీరాజనములు!

33*

ఇష్టపడు భక్తి దారిలో తుష్టి పుష్టి!

కష్ట కాలాన దేవనిన్ గాంచగలము!

తప్పుగాసియు రక్షింప తరలిరమ్ము!

రామనరసింహ నీకునీరాజనములు!

34*

భోగములనిన్ను మరవనీ బోధలొసగు!

సంతసములందు నీయాది సాగనిమ్ము!

భాగ్యములమిన్న-నారోగ్యభాగ్యమొసగు!

రామనరసింహ నీకునీరాజనములు!

35*

మార్చెనే తండ్రి ప్రహ్లాదు మార్చుజతన-

ములువృధాప్రయాసయె తుద ముక్తి దారి

తథ్యమనికొడ్కు జేసెను తత్వబోధ!

రామనరసింహ నీకునీరాజనములు!

36*

పసిడి కంటికీభూమియే పసిడి ముద్ద-

ప్రాణనష్టంబునకుబూని పరగ వసుధ-

బంధనముజేసె నసువులు బాసెతుదకు!

రామనరసింహ నీకునీరాజనములు!

37*

భువియు రక్షింప గొల్లెత్తె-పుణ్యమూర్తి

నీదు కోరనెత్తగ మది నిమ్మలించె!

క్రోధి కనకాక్షు దునిమిన క్రోఢరూప!

రామనరసింహ నీకునీరాజనములు!

38*

చిరుత ప్రహ్లాదు కోరిక సింహగిరిని-

చూపితివి వరాహనృసింహ రూపు వెలయ!

ప్రజలపాలి సింహాద్రియప్పన్న వనగ-

రామనరసింహ నీకునీరాజనములు!

39*

ప్రేమ శక్తిరూపుడ! జగత్పితవునీవె!

ఆదిశక్తివై వ్యాపించు అచ్యుతుడవు!

వివిధ శక్తులు వెలయించు విశ్వ రూప!

రామనరసింహ నీకునీరాజనములు!

40*

సానుకూలతకై ప్రతి కూలకథలు!

ధన్యజన్మ కృతజ్ఞతా దారిసాగి-

నీయనంత ప్రేమనుబొందు నిజమె ముక్తి!

రామనరసింహ నీకునీరాజనములు!

41*

రోగములు మూగి బ్రతుకు నిరోధముగను

కాలము గడవకనుబాధ గ్రమ్ముకొన్న

ఓషధిగ నీదు తిరునామ ఘోష జాలు!

రామ నరసింహ నీకునీరాజనాలు!

42*

వైద్యుడవు నీవు నినుజేరు భక్తజనుల-

వివిధ శారీర మానసిక విషమ రుజల

మాన్పి యారోగ్యమునుగూర్చు మహిమ నీది!

రామ నరసింహ నీకునీరాజనాలు!

43*

తలచు నదివేరు జరిగేదితలప వృధయె?

జరుగ నున్నది జరుగును జగతియందు!

కవఛమగునీదు సద్భక్తి కలిని దాట!

రామ నరసింహ నీకునీరాజనాలు!

44*

వరుస వైద్యాల పూర్ణనివారణేది?

వ్యాధి పైధ్యాస మాన్పించు వైద్యమేది?

బాధ మరిపించు నీభక్తి బాటయొకటె!

రామ నరసింహ నీకునీరాజనాలు!

45*

బ్రతుకు టకు బట్టపొట్టయు బంధువసతి- గూటిరక్షణ సంతతిగూర్మి పేర్మి

గాక నీభక్తి ముదమొందు కాలమేది?

రామ నరసింహ నీకునీరాజనాలు!

46*

చదువు- సంపాదనలు నిల్లుచక్కబడగ

ఆలుబిడ్డల పోషణ లతిశయింపె-

సాగు నీధ్యానముద్రకు సమయమేది?

రామ నరసింహ నీకునీరాజనాలు!

47*

కోరికల మదినార్గురు కొంటె రిపులు-

ఆశనశియింప నిత్తురా – ఆత్మ బోధ

గురుని పైనెట్లు నిశ్చింత గురియుగుదురు!

రామ నరసింహ నీకునీరాజనాలు!

48*

మూఢ విశ్వాసముల చర్ఛ ముగిసె సైన్సు-

విజ్ఞ వాదనలొకదిక్కు విషమగతుల-

మనుగడయు మిథ్య మదినిల్పు మార్గమేది!

రామ నరసింహ నీకునీరాజనాలు!

49*

పోయినది దొర్కె నీదారి పొసగ శాంతి

మది రుచింపగ సద్భక్తి మార్గమలరె!

నీదు దర్శనభాగ్యమె నిఖిల మొసగె!

రామ నరసింహ నీకునీరాజనాలు!

50*

సకలమునిడు నీ తీర్థ ప్రసాదమహిమ!

స్వాస్థ్యమునుగూర్చు కోనేటి స్నానఫలము!

లోక కళ్యాణ కారక లోచనుడవు!

రామ నరసింహ నీకునీరాజనాలు!

51*(ద్వితీయ భాగము)

తిండి సాగించ తండ్రికి తిప్పలనుచు

తాత ప్రొదస్త మానము తంటబడుచు-

మనుమడి ధనార్జననుగోరు మార్గమరయు!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

52*

కదిలితే డబ్బు నీటికి గాలికొఱకు

నడక కస్రత్తు – వాహనం గడనకొఱకు

పరుగు బాట జీవనమంత పరువుమాట!

రామ నర్సింహ నీకు నీరాజనములు

53*

డబ్బుతోపని – యదిలేకడుబ్బుకైన

మనిషి కొరగాడు మనిషిగా మనగలేడు

డబ్బు తోతూగె కొంగ్రొత్త జబ్బులెన్నొ!

గాక ఇబ్బడి ముబ్బడి కష్ట మెసగు!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

54*

దైవ పూజసామాగ్రి తద్దారి కల్తి-

గాక పోతెరసాయన కలుష ధినుసు-

విషపుతిండి-యౌషద పథ్య విషయ చర్ఛ!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

55*

సేంద్రియాలని నమ్మిన సేద్య-పంట

పల్లె కురవాణయై వచ్చు పట్నమందు

చుక్కలంటిన ధరజెల్లు చోద్యముగను!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

56*

వైద్య ఖర్చులు మందులు వరస పథ్య

మనెడు సాకున కొనియెడు మంచి సరుకు-

తడిసి మోపెడై బ్రతుకన్న జడుపు గలుగు!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

57*

ముప్ప దేళ్ళగడన వైద్య మూల్య మునకె

ఆస్తి నాస్తియై దారిద్ర్య జాస్తి గాగ-

దోషియేతాను గృహచ్ఛిద్ర ఘోష లందు!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

58*

సంతు సంపాదనకునఱ్ఱుజాచి బ్రతుకు

పితరులసుఖముశాంతియు పీడకలయె!

మూగరోదనే నీగుడి ముందు వెనక!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

59*

వేళ్ళపైనలెక్కిడు వారి విషయమేల?

మందు లెఱువులపాలె సామాన్యు బ్రతుకు! భద్రతను యోచింప గావీలు పడునె నేడు!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

60*

తిండి నీజిమ్మెదారు తతిమ్మ బ్రతుకు

దెరువు మానవమాత్రమై కరువు కోర

కంటనీకుండ దరిజేర్చు కమలనయన!

రామ నర్సింహ నీకు నీరాజనములు!

61*

శ్రీశ!దీనదయాళువు! చిత్రసింహ!

చింతలనుబాపు నీనామ చింతనమ్ము!

స్థిమితమునుగూర్చు, సద్భక్త చిత్తనిలయ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

62*

భక్త జనపోష! పరమాత్మ! ప్రాణశక్తి-

రూప! గీతార్థబోధక! రుక్మినీశ!

నయము జయమిచ్చు హరిహర నాథ శరణు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

63*

పాహి సంతాన నరసింహ! పాపనాశ!

సాధు సజ్జన హృదయ! ప్రహ్లాద వినుత!

జయ విజయ వరద! రిపుహర! భయవిదూర!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

64*

డింభకునిగావ కంబాన సంభవించి-

వరము కనుకూలముగ శత్రు వధను జేయ-

చిత్రమగురూపి వైతివో చిన్మయేశ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

65*

జన్మ జన్మల జీవాత్మ జయముగోరి

నీతి ధర్మ సూత్ర పరిధి రీతి నడిపి-

పాత్రధారిని ధరిజేర్చు ప్రకృతినాథ!

హారతి గొనుమ! నాంపల్లి నారసింహ!

66*

పంచభూతాల శాసించు ప్రణవ మూర్తి!

ప్రాణికోటిని పోషించు ప్రణయ శక్తి!

పాప పంకంబు తొలగించు ప్రళయ మూర్తి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

67*

సృష్ట సుస్థితి లయముల-నీదృష్టి – నీతి

ధర్మ పునరుద్ధరణకదా ధరణినాథ!

జీవకోటిని వికసింప జేయు విధివి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

68*

ప్రకృతి సౌందర్యముప్పొంగు ప్రాంతమందు

చుట్టు చెట్లున్న గుట్టపై కట్టబడిన-

దేవళమునందు వెలసిన దేవదేవ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

69*

వేములాడ మార్గంబున వెళ్ళుదారి

నానుకొనియున్న పల్లెయే నామపల్లి!

తమరి నెలవయ్యె నారు, శతాబ్ధములుగ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

70*

చోళ చక్రవర్తులగొల్చి నాలయమున

ప్రజలు ననుసరించియు పూజ-ఫలముగొనిరి!

పవన సుతుడయ్యె నీక్షేత్ర పాలకుండు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

71*

మాత లక్ష్మీ సమేత హే మాధవుండ!

వాంఛలీడేర్చుశ్రీకృష్ణ వాసుదేవ!

భక్తి కీర్తింతు పరమేశ! బ్రహ్మ జనక!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

72*

మూల వాగున జలధార ముదముగూర్చు

నొక ప్రక్క-మరోప్రక్క నున్న నదియు-

పొంగి పారేటి మానేరు కొంగు పసిడి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

73*

శౌరి!సంతాన నరసింహ సామి యనుచు

సంతుగోరి పొందిన భక్త జనము పొంగి

పోయి చేతురిక్కడ వనభోజనాలు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

74*

క్రొత్త పెళ్ళిజంటలుసంతు గోరి మ్రొక్కి

సంతుగలుగగా తూరుపు స్థలమునున్న-

చెట్టు రావికి ముడుపులు గట్టుచుంద్రు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

75*

తరలి వత్తురు తినుపదార్థముల వంట

వార్పు చెట్లనీడను సాగు బంధు మిత్ర

ప్రోది జేసితిందురు వనభోజనాలు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

76*

కర్ణ వేధ, పుట్టెంట్రుకలును, నామ-

కరణమాదిగా గలశుభకార్యములను

నీదు సాక్షిగా జరిపింత్రు నిండు భక్తి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

77*

సంబరము నంబరమునిండ సామి జాత్ర

చిన్న పెద్దలందరితోడ చేరిచూడ

కనుల పండుగే కళ్యాణ కార్య క్రమము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

78*

ద్విగుణమగు తిండి సంతృప్తి త్రికరణాల

శుద్ధి బుద్ధిని కొనసాగు చుండు తీర్థ

యాత్రగా చెప్పుదురు దైవార్పణముగ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

79*

సాగు ఎములాడ నాంపల్లి జాత్ర లేక

కాల కళ్యాణ శోభలు ఘనతరంబు!

జనుల రద్ధియు జూడగా కనులవిందు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

80*

దేశమంతట శివరాత్రి దినము శివుని

పెళ్ళి జరుగును ఎముడాల ప్రీతిగూర్చు

నట్లు కాముని పున్నమి నాడు జరుగు

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

81*

పదియునొకటిశతాబ్ధపు పాలకుండు

రాజరాజనరేంద్రుడు-ప్రజలకోర్కె-

పత్ని రత్నాంగితోతపో ఫలముబొందె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

82*

నృపుడు పుత్రప్రాప్తినిబొంది నిన్నుగొలిచె!

తనయు సారంగధరునిగా తానుబిలిచె-

చోద్యమయ్యెకుళోత్తుంగ చోఢచరిత!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

83*

చెట్లునాటించి కోనేటి మెట్లుగట్టె!

వేములాడరాజేశుని వేడ్క దలచె!

ఇంద్రసమకీర్తినొందె నరేంద్రుడంత!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

84*

జనుల నాల్కనైతిహ్యముల్ సాగె పెక్కు

పూర్వ పౌరాణిక పుటల స్ఫూర్తి-వెంట

రాజరాజేశ్వరఖండమారాధ్యమయ్యె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

85*

కొండచరియలో కోనేర్లు రెండు-సహజ

సిద్ధమైయొప్పె! దేవతల్ శివుడు వెలసె-

చిన్న గుహలోన నర్చింత్రు చిత్తభక్తి-

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

86*

నాడు నవనాథ సిద్ధులకేడుగడగ

తపము జేసిరి పదవశతాబ్ధమందు

దారిగాసొరంగము గలదంద్రు నిచట!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

87*

ఒక్కరోడ్డున వాహనాల్ పెక్కుజనుచు

దట్టు ఎముడాల నాంపల్లి గుట్టదాక!

మూడు కేయమ్ల దూరము ముదమొసంగు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

88*

కరిమి నగరు సిద్ధీపేట గలుపు జగితి

యాలరోడ్డునుగల్సి కూడలిగ వేము

లాడ దాపునాంపలి గుట్టజూడగలము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

89*

భాగ్యనగరు సిర్సిల్లల బాట నూట

ఏబదియురెండు జగితియాలేబదైదు

కరిమి నగరుముప్పదిరెడుగా కి. మీ. లు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

90*

పరిసరాలరవాణా నగరములందు

నడుచునార్టీసి ప్రైవేటు నడుపు బండ్లు

అన్ని వేళలనుండును-అందుబాటు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

91*

కనగ కాళీయ మర్ధనం కనులవిందు

తలలు ఐదింట కన్నయ్య తాండవంబు

కళల నిపుణత భక్తిసంకల్ప బలము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

92*

కనగ నాగదేవతగుడి కట్టడంబు-

జనులు జననాయ కులకృషి జన్మవరము!

కార్యరూపమొందిన గొప్పకాన్క గాగ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

93*

గుట్టపైనుండి వీక్షింప గుట్టుదెలియు

చెట్లనడుమ కొండంతగాజుట్టుకొన్న

పాము గనిపించ-ప్రార్థించు భక్త జనము!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

94*

చిత్రమీగుట్ట నిద్రించు సింహమనగ

పామునోటనృసింహుని పరమలీల

దెల్పు శిల్పాలు మరినాగ దేవతుండు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

95*

వలయు దత్తతాక్షేత్రమై వేములాడ

ఆలయాధికారుల కృషి పదియునైదు

వత్సరాలుగా నభివృద్ధి పరచు సేవ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

96*

రోడ్డు ముఖ్యదారిగను ఘాట్ రోడ్డువెంట

పైవరకురవాణయే-భక్తజనులు

వాహనాలన్నిట పయనించు వసతులుండె!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

97*

వెలయు గుట్టపై సాగెడు వేడుకలుగ

లక్ష-నరసింహ స్వామి కళ్యాణ మగును-

పార్వతీ రాజరాజేశు పరిణయంబు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

98*

మంది యెక్కువ శ్రావణ మాసమందు

ఏకముగ సాగు భక్తి ప్రత్యేక పూజ!

జనుల వంటమ్రొక్కు-వనభోజనముసాగు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

99*

రామ నవమి, సీతారామ సామి పెళ్ళి-

గోద రంగనాథుల పెళ్ళి గుట్టపైన

జరుగు నేటేట సద్భక్త జనులవేడ్క!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

100*

ప్రకృతియందాల రాశి నాంపల్లి గుట్ట!

ఎగువ కాళీయమర్ధనం-దిగువ నాగ

గుడి పురాతనగుడి నీదు గొప్పమహిమ!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

101*(సంపూర్ణం)

మనిషి “ఇదియునొకందుకు మంచి” దనుచు

లౌకికముమాని మదిపారలౌకికముగ

మంచిభావింప సర్వత్ర మంచి జరుగు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

102*

జరుగనున్నదే జరుగును జగతి-జనులు

మంచిభావింప జరిగేది మంచిదగును!

నిత్య సత్యమై నీదయ నిఖిలమొసగు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

103*

నయము జయమిచ్చును సహస్రనామ జపము

శతక పద్యాల నుతిజేయ సతము శుభము

గాగ నీధ్యానమున ముక్తి నిశ్చయంబు!

104*

తెలుగు” సత్యనారాయణ తిరుణహరి”ని-

దాస దోషంబు దండముతోసరియగు!

భక్తి శతకాంకితం ప్రేమ శక్తి రూప!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

105*

పంకజము జేరు నీపాద పద్మయుగము-

చెఱుకు వక్రత తీపిని- చెరపలేదు!

సాధుజనరక్ష నీయిచ్ఛ-సామి శరణు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

106*

కడకు కశిపుని వరగర్వమణిగి సమసె!

భక్త ప్రహ్లాదుని ప్రేమ శక్తి గెలిచె!

చేతనమె ముక్తి మార్గమై చెన్ను మీరు!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

107*

తపము సహనదీక్షగభక్తిదారి-శతక వ్రతము సాగెను-హరిహర! శతక సరము-

అర్పణముజేసితి, దేవ! అభయ వరద!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

108*

శుభము కవిపండితోత్తమ శ్రోతలకును

శుభము సద్విమర్శకులకు సుఖము శాంతి!

శుభములను గూర్చి దీవించు సూత్రధారి!

హారతి గొనుమ నాంపల్లి నారసింహ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page