top of page
శ్రీ యాదాద్రి నారసింహ శతకము
(తే.గీ.)

1*

శ్రీ రమాధవా! స్తంభజ! చిత్రసింహ!

నారదనుత! నారాయణ! నాదబ్రహ్మ!

హ్లాదమునుగూర్చు దేవ! ప్రహ్లాద వరద!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

2*

పల్లెనుండియు డిల్లికి పరగ జగతి

కెల్ల సుఖముశాంతి బతుకుకేళి వెలయ

దేశశతకోటి గృహదివ్వె దీప్తులెగసె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

3*

కొడితె భయముగా పెడితపొంగును యెడంద!

భారతీయులాబాలగోపాలమునకు!

దివ్వె వెల్గున చప్పట్లు ధీటు ముదము!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

4*

చావుభయము కరోన సకల దేశ

భక్తి భావన బతుకును భారమితిగ

కొలువజాలని కలిమాయ కొలువుదీరె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

5*

లబ్ధి జనజీవనార్థమై లాకుడౌను

బయటదిర్గక పరస్పరం బాసి యెడము

తగినజాగ్రతలు గడువుదాక దేవ!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

6*

వ్యక్తిగత శుచి శుభ్రత వస్తుతతికి

తప్పదికమును ముందైన తలసరిగను

గట్టి కట్టడియె నడుచునట్టి చరిత!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

7*

ముక్కునోరుగప్పెడు మాస్కు ముందు వెనక

మూడడుగలదూరమై ఉండు వరుస

ఇల్లువెడలిజేరెడుదాక నొళ్ళురక్ష!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

8*

గడప నటునిటు దాటిన నీటితొట్టి

సబ్బునిర్వది క్షణముల్ సరిగరుద్ధి-

కడుగ వలెపలు మారులు ఖచ్చితముగ!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

9*

తాను తనకోసమే ఇది తగినపనుల

సాగె హద్ధు పద్ధులవిధి చట్టపరిధి!

బ్రతికి యుండిన నీకృప బడయవీ!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

10*

జనత కర్ప్యుభారతబందు జనులనిత్య

అక్కెరసరుకు దొర్కుమూడడుగు లెడము

వరుస జాగ్రతలెవరివి-వారివనగ-

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

11*

బ్రతుకు బాధలదిరుగు బయట యింట

సాగు వెవహారములు పెక్కు సంసృతందు

బతుకు వరమిమ్ము సద్భక్తి బాట నడిపి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

12*

నిన్న మొన్నటి నుడి సుఖమన్న నేడు

జగతిలో కరోనయె ముందు జాగ్రతలను

పవలు రేయి రుగ్మతయాది పదిల పరచి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

13*

చిన్న చితుక వైరసుగాదు చెలగిరోగి

తుమ్ము దగ్గు తుంపరలందు దుమికి దూరు

ఎదుటి భౌతిక దూరాల మెదలమేలు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

14*

ముందు జాగ్రత మాస్కున ముక్కు మఖము

మూసి తిరుగుజనము రద్ది ముందు వెనక

చేయి పలుమారు గడుగంగ సేమమంద్రు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

15*

పిల్లలును వృద్ధులును శ్రద్ధబెట్టి గడప

దాటనీకుండ పోషింప దగును నేడు

యువత నిత్యావసరముల నురుక సాగె

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

16*

ఒకటి రెండు దినములైననోపవీలు

మార్పుజీర్ణించుకొనుటెట్లు మాసములుగ

భౌతికదూరగతులందె బతుకు దెరువు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

17*

సంఘ జీవి-నిస్సంఘజీవి సామ్యతయ్యె

తారుమారుగ బతుకు భద్రతలు హెచ్చె

మనిషి దూరమై చేరువ మనసు కుదుర

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

18*

కార్యక్రమము సామూహిక గతులు మారె

మితముగా హద్దుమీరక మిడక వలసె

ప్రభుత కట్టడి చట్టముల్ పదునువెట్టె

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

19*

కట్టడలవడె జీవిత కక్ష బతుకు

భవిత సాగేటి కట్టడి భద్రపడిన

చావు దప్పదు పోకిరశ్రద్ధ పనులు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

20*

ఆర్థికము గుంగె, కష్టాల వార్థిపొంగె

ప్రగతి వెనుకంజ వితరణ బరగమేలు

వలసదారులనిలుజేర్చు బాటలందు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

21*

కూడు గుడ్డ గూడును నిద్ర తోడు శుద్ధి!

మిగుల భద్రతగొనకున్న మిత్తి భయము!

కలత నిద్రను యజమాని యలసిసొలసె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

22*

నాల్గు లాక్డౌనులకరోన నణగలేదు

పొంచికాటేసె జనముల పోరు మొదలు

బాధ్యతయుజేసె ప్రక్కకు ప్రభుత జరిగె

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

23*

ప్లానుగాబత్కుదెరువు తుఫాను బెడద

మీదు మిక్కిలి దండుగ మిడత దాడి.

యుద్ధ తంత్రాలు పొరుగున నుగ్రతణచి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

24*

చావు దరిదాపు పొరుగు నిస్వార్థమేది

భూధనాక్రమణకుబూనె బుద్ధి మార్చు!

కీర్తి ధనముశాశ్వతమను క్రియలనడిపి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

25*

సాగు టీకశోధనలు ప్రయోగ దశను

విషకరోన రుగ్మత హెచ్చె విషయ చర్ఛ!

మరల వేసవి దాకను మరణ భయమె

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

26*

వైద్య సిబ్బందికే సోకె వైరసనెడు

వార్త దిగజార్చె ధైర్యమున్ బతుకు ప్రశ్న

జనుల వేదించె మది జవసత్వమొసగు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

27*

దీక్ష భజనసాగింప నపేక్ష తగ్గు

నిండు తృప్తి చే బాధలు నిమ్మలించు

దీన జనసమూహములకు దిక్కునీవె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

28*

అప్పు జేసిపప్పులకూడు నదుపు పొదుపు

గాగ పెండ్లి – యుత్సవరద్ది కట్టడిగను

బందు దూరపయనముల బాటలదుపు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

29*

బంధు మిత్రులాత్మీయుల విందులదుపు

నెలలు గడిచెను, జాగ్రత నేర్పునోర్పు

టీక దాకను సామాన్యు శోకముడుపు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

30*

ఇష్టములు దూరముగనుంచి కష్టమెంచి

హితులరూపాన దీనులకిడుము భుక్తి!

కట్టడిని సాగుబాటుగా కలిమిగూర్చి-

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

31*

ప్రకృతి బీభత్సములు యేట ప్రాణహాని

గూర్చుచుండగ నెండలు గొట్టిపంట

పొలమునెఱ్ఱెలు బాసెడు-పోరు బతుకు-

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

32*

చెలగు సేద్య పరిశ్రమల్ చేష్టలుడిగి

ప్రకృతి వైపరీత్యములందు పాడుబడగ

మంచి రోజులకై నిన్నె మతికిజేయు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

33*

బతుకు జాడ నిరంతర బాధనెదుటి

పోటి పోరాటమయ్యెను-పొద్దు మాపు

మనసు కోర్కెతురంగమై మాటవినదు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

34*

వెసన సప్తకమున జాతి వెఱ్ఱిమోజు

ఆయురారోగ్యమను మాట అటుకునెక్కె

మరల చేతనార్థము గీత మాకొసంగు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

35*

ప్రక్కవాడు పచ్చగనుంట పరగ కడుపు

మంట చేతగాక కనుకళ్ళమంట – మాన్పి

బుద్ధి చైతన్యములదారి వృద్ధి గూర్చు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

36*

ఐకమత్యము సాధించ నవనియందు

ఆత్మ ఏకత్వబోధ మహాత్ము పేర

మరల నవతరింపుము భక్తి మనసు నిల్పి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

37*

ఈతిబాధలు మైమర్చి ఇల్లు మరిచి

బాధ్యతలు వీడి వెసనాల బతుకు నష్ట

జాతకుల గాచియారోగ్య నిష్ఠ దేల్చి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

38*

మంచియన పుణ్యమేకదా మహిని భక్తి

మార్గసౌలభ్యమన మరోమార్గమేల?

మంచినిండగ చెడుదొల్గు మాట నిజము

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

39*

కంటక సమస్యలు – జవాబుగానరాదు

రిత్తజతనాల విపరీత రీతి పొగులు

మరణ భీతి రహితముగా మానవాళి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

40*

బతుకు సమర సంరంభముల్ భక్తి మరుపు

భద్రతయులేని కలికాల భ్రమలుమెండు!

కట్టడిగ జాతినాధ్యాత్మికముగ దేల్చి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

41*

చూచి మేలోర్వలేని యసూయ గుణము

కష్టములనోర్వ జాలని కలతఘనము

సుఖము గోరనిదెవ్వరు చూడ జగతి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

42*

స్వార్థ తపన జీవితమంత సాగు పైగ

దుష్టచింతన నిరతమ్ము దొలుచు మదిని

ఉభయ రుజలు మదితనువు నొవ్వుగూర్చు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

43*

బాధలో జాతకమడ్గి భవితదెలియు

సంతసంబున మరచియు సాకులెన్ను

ఆపదమ్రొక్కులలవడె అర్థకాంక్ష

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

44*

ధరణి నిన్మరచి బతుక ధైర్యమేది?

బరువు బాధ్యత దిగనాడ భద్రతేది?

మధ్యతరగతి జీవితం మిధ్యయనక

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

45*

ఇష్టములు చాలకను ఆశలినుమడించు!

మనసు దేహమస్వస్థతమయము దిగులు!

దుష్టచింతనలెడబాపి తుష్టిగూర్చు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

46*

జరుగు బ్రతుకుదెరువునందు భద్రతేది?

ధైర్యమొసగు నీదర్శన దారి భక్తి-

మనసు తనువుల స్వస్థత మాకొసంగు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

47*

ఒంటరి కుటుంబముగసాగు నోపికేది!

కలిసియుందమటన్నను కలహదారి!

బంధు పోటియే ఉపకార భాగ్యమేది?

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

48*

లేమి లోసాను భూతియు లెక్క పద్ధు

కొంత కలిమిని రద్ధగు కొంటె పోటి

సాయము మరచి తలదన్ను సర్కసాట-

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

49*

కలిసి బతుకనివ్వదు కదా కలిమి పోటి

బంధు మిత్రులకన్నను పరులె నయము

లోతు దెలియుదాకను మైత్రిలోనటింత్రు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

50*

డాబు దర్పంబు వెలయించి దర్జజూప

పిల్వనంపెడు శిశువులు పెద్దలైరి!

దీవెన మిగిలె కనుమంట దేనికనగ

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

51*

దర్ప మలర ప్రదర్శన దారులందు

ఎదుట మర్యాద చాటున ఏవగింత

హెచ్చులకునభినయమైన వేసబాస

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

52*

డబ్బు సంబంధ బంధుత్వ డాబుఘనత

అరయనాత్మీయతకులేదు అవనియందు

చాలనిజమయ్యె కద కలికాలమహిమ-

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

53*

మీదమెరుగు సంబాషణ మించునటన

లోనకుళ్ళుదాచిన ధన లోభమయము!

రోత విందుమూయించె కరోన జడుపు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

54*

కొత్త పోకడలు కరోన కొఱతవడియె

భారి బలగప్రదర్శనల్ బందువడియె!

మిగులు బంధుతతికిబంచ భావ్యమిపుడు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

55*

క్రితపు మర్యాదజనె రాజకీయ మాయె

మనిషి చిననాటి వారిని మరచి మసలె!

భక్తి సంబంధమునగల్పు బాటనడుపు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

56*

రక్త సంబంధములు కల్మి రిక్తమయ్యె

రాజకీయ కులమతాలు రాణకెక్కె!

వసుధ వస్త్రాభరణ సోకు వాసికెక్కె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

57*

ఆకసమునందు దిరుగాడునట్టి పక్షి

నీట నీదు చేపయు గాగ నింకమేలు

మట్టి బుట్టిజీవింపగా మాకుదరమె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

58*

పుడమి బతుకు ఘోరము నేడు గడపదాట

రోజు రోజుకోభయము కరోన వార్త

ముందు జాగరూకత లేక మునుగు కొంప

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

59*

వయసు దాటి నిబ్బరముడ్గి పైనబడిన

ముదిమి బాధలు గాధలు ముదురు రుజలు

చిన్నవారి చేతిచలువ వెన్నదొంగ!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

60*

వయసు నాటి యోపికదర్గె బతుకునీడ్వ

జతనముల సమస్యలువేలు జరుగు చరిత

దేహముననాత్మ ఓల్డేజు గేహవసతి!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

61*

జరను నీభక్తియోగియై జనుటకన్న

మేలు గూర్చునదియు సున్న మేలుకొలిపి

ఆశ పాశంబులనుదెంచి యాదుకొనుము!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

62*

ఎంత సాధింప నింకొంత ఎదురనుండు

తృప్తి నిస్వార్థపరమైన తీరునడిపి

భక్తి యోగాన నినుజేరు బాటసాగ

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

63*

వేష బాషల దీప్తి సంతోషమందె

ముందడుగుగాగ బతుకున ముక్తిపదమె!

శోకమున నిఖిలముగల్గ చొప్ప సమమె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

64*

భయమె నరజాతి కొరడాగ పరిణమించె

భద్రతయు లేని బతుకులిబ్బంది గూర్చు

నిర్భయమె మోదమునిచ్చు నెపుడు భువిని

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

65*

పోరు నష్టమనిన – వైరి పొందులబ్ధి

సందు బలహీనతగనెంచు ముందు ముందు

కఱ్ఱు గాల్చివాతయుబెట్ట కడకుమేలు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

66*

వైరి మంటలార్పగవలె- వైరసంటు-

రుగ్మతకుదగ్గ టీకాలు రుజువుపరచి-

సకల జనులకందింపగా సాగవలయు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

67*

వైరి పోరు నష్టమె యార్థిక బాధలెసగు

ఈతి బాధలు స్వార్థముల్ ఇరుగడలను

వైరసంటు రోగులవెతల్ బహుధ గలుగు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

68*

బాల వృద్ధుల సంక్షేమ బాధ్యతలును

విధుల కష్టము నైతిక విలువ నిలుప

యువత జంజాటపడు కలియుగమునందు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

69*

బతుకు పోరాటమున నింట బయట వివిధ

పోరుబాటలు నార్థిక పొదుపు నదుపు

దూరభార విచారంపు దొంతరలను

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

70*

బతుకు బాధలోనను వంట జతనమలరు

తిండి దప్పదు వేళకు తిప్పలైన

కాలచక్రమాగదు తుద కర్మమిగులు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

71*

ముదిమి రుగ్మతల్ తగు పథ్యములును సాగు

వివిధ పేర్లవైధ్యవిధాన విషయ చర్ఛ

లాయుర్వేదముననాగు నంత్యదశను!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

72*

ఏది వైద్యమైనను గుణమివ్వనపుడు

మందులలవడెనందురు మార్గమెరుగ

యోగ సూచింత్రు తుదభక్తి యోగదారి!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

73*

వృద్ధ దశబాధలనుదెల్ప వినెడువారు

దొరుకుట గగనమేయగు దొర్కిరేని

ఉచిత సలహాలనిడివెళ్ళుచుంద్రు తరచు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

74*

మనిషి సాయము గొప్పది మరియునొకటి

చేత డబ్బుతోడ్పడుచుండు చేతగాని

సమయమందు నీకీర్తన సాగమేలు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

75*

చిత్రమేమిటో పనిబడి చేతియందు

డబ్బులున్నను మనిషెట్లు డాయు- విధియు

వక్రమగు నీదు దయలేక వసుధ బతుకు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

76*

వలయునది దొర్క బోదునావశ్యకముగ

నడిగినది దూరమగు వయసుడిగి తాను

పరుగులిడ సాధ్య పడదుగా బతుకు గతుల

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

77*

తెలిసినా తెలియనియట్లె దేల్చు నిజము

గాక నితరసాయముగోరు కథలె పెక్కు

అనుభవింపక తప్పని కర్మ ఫలము-

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

78*

ఉమ్మడికుటుంబములు లేవు ఊరుమారె

పట్నమనుకరింపులను అపార్టు మెంటు

బతుకు దెరువు వృద్దుల పోషణతుకు బడియె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

79*

చెట్టు చేమపార్కునజూచి చెమ్మగిల్లు

యాది కనులకే పరిమితం చేదు తీపి

కాలమునుగాది పచ్చడి కమ్మదనమె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

80*

కొంత మెరుగయ్యె వృద్ధుల గొడవలణగె

యువత కవగాహనయు సాగె భవిత యందు

ప్రభుత మరియింత సహకారపడగనుండె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

81*

కలిగె ప్రకృతి రసాయన కల్మశమ్ము!

సేంద్రియ యెరువు మేలయ్యె సేద్యమందు!

పల్లె ధినుసు రుగ్మతలకు పథ్యమయ్యె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

82*

ముతక బియ్యము కరువాయె మునుపుదిన్న

గట్క చిరుధాన్యముల తిండ్లు కడుపిరమ్ము!

కట్టడి కరోన వైరసు కాలమొచ్చె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

83*

బాల వృద్ధులింటింటనే భద్రపడగ

భౌతిక దూరము మాస్కుతో బయటకేగి

నిత్యమవసరములగూర్చె నేటి యువత!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

84*

ఈతి బాధలార్థికమాంద్యమితర హేతు

కష్ట నష్టాలునేకమే కలిమిలేమి

పెక్కు మార్పులు-కలికాల చిక్కులెగసె

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

85*

అంటు రుజకారక కణము వెంట

మనిషి నుండియు మనిషికి మార్గముగను

హెచ్చె జగతినౌషదశోధ లెసగసాగె!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

86*

ఇరుగు పొరుగు దేశ కుటిల పోరుబాట

శాంతిమార్గాన చర్ఛలు సాగుచుండె

నిశ్చలత్యంబు చెదరెనో నీరజాక్ష!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

87*

సకల బాధలు నీదయ సవ్యముగను

తగు పరిష్కారదారిని తరలిపోవ

భక్తులకు నీదుదర్శన భాగ్యమొసగు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

88*

సంధ్యలను మూడు సారులు జలకమాడు

నీరు వాతావరణముండె నీదుకృపను

శుచియు శుభ్రతలారోగ్య సూత్రగతులు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

89*

తానుగా పంచె సతతమాధ్యాత్మికతను

సైన్సు గొనితెచ్చె భారతి జగతియందు

వాసిగాంచె నేడెదిరించు వైరసులను

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

90*

చెక్కు చెదరని ధైర్యము చెలిమి కలిమి

మక్కువనుగూర్ప భారతమాత బిడ్డ

పదిలమయ్యె సత్కీర్తి ప్రపంచ చరిత-

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

91*

రుగ్మతలను,సామాజిక రుగ్మతలను

దేహ, దేశములను నిండె తేజ మొసగు-

టీక తోపాటు నీతియే ఇలను గాచు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

92*

అడవి పునరుద్ధరించుట, కడలి కలుష

హరణమగుతీరు మసలుట, చెరిపి చెడగ

మానుటయె సామి! నీభక్తి మార్గదృష్టి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

93*

ధర్మమును దప్పిచరియింప ధరణిముప్పు

హితవు గలుగును సత్యమహింసవిధుల

గాక మారణహోమమే కలియుగాన!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

94*

సాగవలెనసత్యము నుండి సత్యమునకు

తమమునుండి జోతికి మృత్యు-అమృత

మయమునకు నీదు వేదోక్తి మార్గమందు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

95*

ఈతి బాధ-కరోనగా ఇలను వెలసె

కట్టడి నిరోధక సత్వముట్టిపడగ

టీకతోడ్పడ నీకృపలేక గాదు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

96*

పుణ్యమనగ మంచియెకదా-పుడమియందు

పాపమనగ చెడ్డయె గాన బతుకు దెరువు

మంచి సాగించు తీరున మమ్మునడిపి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

97*

తల్లిదండ్రి గురుప్రేమ దనర దేశ

ప్రేమ భాగ్యమ్ము నోచిన పెద్ధ బుద్ధి-

వయసు పెద్దలనదలించి వసుధ సృష్టి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

98*

దేశ భక్తిదురంధరుల్ తేగనిధులు

భారతజవానులకు జేతు ప్రణుతి నీదు

రూపులుగనెంతు వారి భూరుహము బోల్తు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

99*

గడిచి గట్టెక్కి దేశంబు ఘనతకెక్కె

గతము, నీతేజమైసాగ గలదు భవిత

దురితహరమైనదగు శాంతి దూతపేర!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

100*

ధరణి నెలకొను గావుత ధర్మరక్ష!

విరివిగను సాగు గావుత వృక్షరక్ష!

పాపమణగి పుణ్యమెగసి పడును గాక!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

101*

మంచి చెట్టునాటిన వచ్చు మంచి ఫలము!

తుచ్చమగు ముళ్ళ చెట్టైతె గుచ్చుముండ్లు!

తీరు తెన్నుదెల్పిన కవి తిరుణహరికి

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

102*

భీతిచేతనే తత్కాల నీతిదారి

పిదప నవినీతిగమనమేప్రీతి నిరత

గడన కోసమే బతుకగా కవిత గనున?

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

103*

ఐకమత్యమునుపకారమైన గుణము

భక్తి యోగమార్గమునందు బలపడంగ

జనుల వర్ధిల్ల జేయునీ జపతపంబు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

104*

శ్రీలు గులికెడు నవనార సింహగుడుల-

నూత్నవైభవ యాదాద్రి నూహసేయు

పుణ్యఫలముచే నామది పులకరించు!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

105*

కష్టములమరుపుగ సాగె కవనదృష్టి

రక్షగా సత్ఫలమునిచ్చె తక్షణంబె-

చదువు పుణ్యాత్ములకు నట్లె సత్వమొసగు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

106*

విజయమే మదితృప్తిగ-డిజిటలచ్చు

మీడియా ఎఫ్బి పఠితల మెప్పుగొంటి

లీనమైతిని కృతిని నీధ్యాన మందు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

107*

వైరసెడబాపి తగుశుభ వరమొసంగి

లీలమెరిపించు సింగోట లింగరూప!

జగతి సుఖశాంతియొనగూర్చి జరుగు చరిత!

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

*

108*

శ్రోత పఠితల సొమ్మగు శుభయశమ్ము

సేమమగుగాక నిస్వార్థ సేవకులకు

ప్రజ-పరోపకార ప్రజా ప్రభుతకెపుడు

నయము జయమిమ్ము యాదాద్రి నారసింహ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page