top of page

కృష్ణ వరనివాళి శతకము
(ఆ.వె.)

1*

శ్రీశ!చిన్మయేశ!శిఖిపించ శోభిత!

శరణు రుక్మిణీశ! కరుణ కిరణ!

రాధ మానసేశ! సాధుసజ్జన పోష!

వావిలాల కృష్ణ వరనివాళి!

2*

వేణుగానలోల!వ్రేపల్లె గోపాల!

గోపికామనోహర! హరి! గోకులేశ!

నందలాల! పాహి! నారాయణ! విష్ణు!

వావిలాల కృష్ణ వరనివాళి!

3*

దేవ దేవ! పుణ్య దేవకీ వసుదేవ-

పుత్ర పూత గాత్ర! పుణ్య పురుష!

కామజనక! భక్త కామ్యార్థ ఫలధాత!

వావిలాల కృష్ణ వరనివాళి!

4*

చక్రి! కాలచక్రి! చపలంబు నరికట్టి

బుద్ధి తీర్చి దిద్దు-బుద్ధదేవ!

మంచి వేయి విధుల మన్నించు దేవరా!

వావిలాల కృష్ణ వరనివాళి!

5*

మాయతెరలు జీల్చు మానుష విగ్రహ!

ధరణి సంసృతి ఘన తరణి – నామ!

సూక్ష్మమందు మోక్ష సూత్రగీతాధాత!

వావిలాల కృష్ణ వరనివాళి!

6*

నారద నుత! బమ్మ! శారద సంగీత

గీత వాద్యలోల! క్రీడి వరద!

సవ్యసాచి జేసి సవరించు నామది-

వావిలాల కృష్ణ వరనివాళి!

7*

ప్రకృతి చేతనాత్మ – కాకృతి గావెల్గు-

ప్రాణశక్తి రూప! ప్రణయ దీప!

సేమ ధాత వోకుచేల సన్నుత- హిత!

వావిలాల కృష్ణ వరనివాళి!

8*

నాణ్యమైన భక్తి నవవిధ తారక-

నావలొసగి జన్మ నదిగమించి-

చేరుదాక నాత్మ చేతనమొసగేవు!

వావిలాల కృష్ణ వరనివాళి!

9*

విశ్వ రూపధారి! విజయసంరక్షక!

మూర్ఖ రాజసాళి మోక్ష ధాత!

సత్య ప్రియుడ! సుగుణ సాత్విక నరరూప!

వావిలాల కృష్ణ వరనివాళి!

10*

అష్టభార్యలుండ-ఇష్టమౌ వసుధను

మిగులగారవించు మీనరూప!

నరులవెంట వైద్య నారాయణుడవీవె!

వావిలాల కృష్ణ వరనివాళి!

11*

కరుణ జూపు కన్న! కమనీయం నవనీత-

చోర! నీదులీల చోద్య పథము!

మనసు నిల్పియాత్మగనినిను శోధించు!

వావిలాల కృష్ణ వరనివాళి!

12*

వరుస దుష్ట వధలు, వనభోజన కథలు!

పల్లెమాతయొడిని పరవశాలు!

ప్రేమరాజ కేళి పెద్దసంతోషాలు!

వావిలాల కృష్ణ వరనివాళి!

13*

వత్స నరుడు వేద వాఙ్మయం గోమాత-

పితుకు పాలు గీత, ప్రీతి గూర్ప-

నీదు శరణు జొచ్చి నినదించు నరజాతి!

వావిలాల కృష్ణ వరనివాళి!

14*

ఆత్మమరచి తానునన్యంబుగానెంచి

తనువు-మనసు తాను, తలపుగొనుచు-

పొలిగి మనసుబోవు పోకలబోదురు!

వావిలాల కృష్ణ వరనివాళి!

15*

తనువుతనదిగాదు,మనసు తనదిగాదు,

ఆత్మనేనటన్న-యాది గీత-

సూక్తి చేత దొరికె-సూక్మమే మోక్షము!

వావిలాల కృష్ణ వరనివాళి!

16*

మనసు నిల్చినంత మాయపొరలు దొల్గు

బుద్ధివెలుగు పారు భూతకైన-

నీదు భక్తి నిత్య నియమావళి భాసించు!

వావిలాల కృష్ణ వరనివాళి!

17*

భక్తి గొలుతు నిన్నె- బలభద్ర సోదరా!

ముక్తి వలతు జన్మముక్తి ధాత!

బతుకు ప్రీతి గూర్చు వలరాజు జనకుడా!

వావిలాల కృష్ణ వరనివాళి!

18*

చిత్తచోర రామ-సీతామనోహరా!

స్థితికి కర్త వీవె! చిత్రసింహ!

రాధ మానసపతి! సాధుహృదయ!

వావిలాల కృష్ణ వరనివాళి!

19*

యుక్తి బుట్టి మధుర శక్తివై తిరుగాడ-

కల్ల-శక్తులణగె-కంసుడుడిగె-

సృష్టి గెలుచు-ప్రేమ పుష్టిగా ధరనిండె!

వావిలాల కృష్ణ వరనివాళి!

20*

పల్లెనుండి మధుర పల్లవించిన చైత్య

రథముసాగె భక్తి పథము సాగె!

విశ్వ గెలుపుధాత- విజయసారథి వీవె!

వావిలాల కృష్ణ వరనివాళి!

21*

జీవిమనుగడాగు, జీవితేచ్ఛయులేక?

ప్రణయం రహిత మది-బాధగుములు!

ప్రణవనాదమూది-ప్రాణిగావుము ప్రభూ!

వావిలాల కృష్ణ వరనివాళి!

22*

వైరి వైరసెదిగి, వాస్తుపై మానవ-

లోపమందు దూరు-లోక జనుల-

లోపసవరణ తమది-లోకకల్యాణమై!

వావిలాల కృష్ణ వరనివాళి!

23*

బాల్య గ్రహ దోష బాధ సూక్ష్మక్రిమి-

విషకణజము-రుజల విస్తరించు-

నయము జేయ నీదు- నామౌషధమె చాలు!

వావిలాల కృష్ణ వరనివాళి!

24*

పల్లె పాడి-పంట పసిడి సిరులెల్ల

ఆకలార్పు దివ్య ఔషధాలె!

తీర్చి దిద్దుమమ్ము-దివ్యగీతాయుధం!

వావిలాల కృష్ణ వరనివాళి!

25*

విపులరాజనీతి-వివిధనగర సంఘ

సంస్కరింత-నీదు సంస్కృతయ్యె!

ప్రేమశక్తి రూప! ప్రేరణాత్మక దీప!

వావిలాల కృష్ణ వరనివాళి!

26*

పత్రహరిత సృష్టి ప్రాణవాయువు పుష్టి

చెట్టు చేయనున్న శ్రేష్ఠి నీవె!

ప్రాణభిక్ష గలిగె-ఆయురాగోగ్యమై!

వావిలాల కృష్ణ వరనివాళి!

27*

రాజలోకబుద్ధి రాణించె-రాముని

ఏకపత్ని వ్రతము-లోకమందు!

పల్లజనులజుట్టె-బహుభార్యబంధముల్

వావిలాల కృష్ణ వరనివాళి!

28*

దుష్టరాజనీతి-దుడుకుచేస్టకు భూమాత-

మొరలుబెట్టె -చేటుమూడువేళ!

చెడుకు శిక్షగలిగె-సేమంబుగనె మంచి!

వావిలాల కృష్ణ వరనివాళి!

29*

పరశురామ ప్రీతి పరగర్వ ఖర్వమై

రామధర్మతేజ రణనినాద-

కార్యరంగమాయె-కలుషాపహరణమై!

వావిలాల కృష్ణ నివాళి!

30*

హాని జేయువేళ కానివాదుల జీల్చి

భారతసమరంబు బదులుజెప్పె!

ధర్మజు ఘననీతి దారి సుస్థిరమాయె!

వావిలాల కృష్ణ వరనివాళి!

31*

భాగవతము వెలసె, భక్తినవవిధాల

నీదు పూజసాగె! నిత్య నిష్ఠ-

నీదు భాగమాత్మ నిశ్చలత్వము గనె!

వావిలాల కృష్ణ వరనివాళి!

32*

బాల భక్తు మెచ్చి, లాలించి గాచిన

చిత్ర సింహ! నిన్ను చేరికొలుతు!

దుష్ట హరుడ వీవె! దురిదూరుడ వీవె!

వావిలాల కృష్ణ వరనివాళి!

33*

బంగరు తనువొంది- బంధియై కశిపుడు-

తానెదైవమనుచు-తగినవరము-

పొంది గర్వమొంది-పొగిలెను బతుకంత!

వావిలాల కృష్ణ వరనివాళి!

34*

పట్టు వదలనట్టి-పసిడినేత్రుడు జచ్చె

కోర్కెదీర్చు కొనెను-క్రోడరూప!

చిత్రసింహమైన – శ్రీహరి మాంపాహి!

వావిలాల కృష్ణ వరనివాళి!

35*

రక్త బీజు, మహిష రాకాసులను గొట్టి

ధర్మ సుస్థిరతను ధరనునిల్పి-

చేవగూర్చి దుర్గ చేయూతనందించె!

వావిలాల కృష్ణ వరనివాళి!

36*

బ్రహ్మ సృష్టి శివుని ప్రళయంబు మధ్యనా

వ్యాప్తి నీదె విష్ణు – వసుధయందు!

కార్యమాగిన త్రి కల్పించుకొనెదవు!

వావిలాల కృష్ణ వరనివాళి!

37*

యోగనిద్ర-నిరత యోచన యోజనల్

చేయు నీకు గలిగె వేయిపేర్లు!

పిలిచినపలికేవు-ఏపేరునైనను-

వావిలాల కృష్ణ వరనివాళి!

38*

నిజము కలయె-కల్ల నిజమగు నరులకు

మాయ మనసుటూహ-డాయునిలను-

మాయ దొలగినయమాయకత్వము గలుగు!

వావిలాల కృష్ణ వరనివాళి!

39*

జరుగు శుభము-సృష్టి జరిగి పోవుకొలది

లోకకంఠకాళి లొంగి చనగ-

జరుగనున్నదెల్ల జరుగక మానదు!

వావిలాల కృష్ణ వరనివాళి!

40*

చెడ్డ మరచి మంచి చేయూత మానవ-

జాతికెల్లనాత్మ జాగృతంబు!

అంతరాత్మ బోధ – ఆలకింపగ మేలు!

వావిలాల కృష్ణ వరనివాళి!

41*

సంతసంబె బతుకు సాగించునాయువు

హర్షమందె బెరుగు – నీర్ష్యరహిత-

ప్రేమ సానుకూల ప్రేరణ గలిగించు!

వావిలాల కృష్ణ వరనివాళి!

42*

స్వాగతించి పరుల సంక్షేమ విధులలో

తిరిగి చేసి యలసి – తృప్తినంది-

సానుకూల ప్రేమ సంధింప మేలగు!

వావిలాల కృష్ణ వరనివాళి!

43*

ద్వేషగుణముచేత,దేహము – దేశము

గాసిజెందును ప్రకాశముడిగి-

శాంతిరహిత బతుకు- సాగదు సద్భక్తి!

వావిలాల కృష్ణ వరనివాళి!

44*

కాలచక్ర గమన గమ్యవేగము తన-

గర్భమందు గలుపు-గతము, భవిత-

రిత్త-వర్తమాన రీతి సాగుటమేలు!

వావిలాల కృష్ణ వరనివాళి!

45*

సృష్టి లయము నడుమ-స్థితికర్తవేనీవు!

వెలయు పుష్టి నీదు వేడ్క సాగు!

జగతినాటకమున-సుగతిపాటవ భక్తి!

వావిలాల కృష్ణ వరనివాళి!

46*

ప్రజల జన్మనాటి పంటపుణ్యముదీసి

కాన్కపొందు నీదు కథలు పెక్కు!

జగతి సాగుబడుల-సర్వంబు నీకృప!

వావిలాల కృష్ణ వరనివాళి!

51*

రాజు పేదయనక రాణించు నీభక్తి

పేదకన్న తేగి పెద్దరికమె-

రాజునదుపు జేసి రాజ్యాన్ని పాలించు!

వావిలాల కృష్ణ వరనివాళి!

52*

ఏమి వింత మదిని వెలయుకోరిక శోక

తిమిరకారకంబు-తీరుదాక!

కోర్కె నియతి-భక్తి కొలువున సాధ్యమౌ!

వావిలాల కృష్ణ వరనివాళి!

54*

ఆత్మ కొఱకె విద్య-అందు కొఱకె తనువు-

మంచికొఱకె మనసు – మనుజుకందె!

మనసుగట్టు భక్తి మార్గగమ్యము ముక్తి!

వావిలాల కృష్ణ వరనివాళి!

55*

పతనమొంది జనిరి-ప్రభువులు పెక్కురు

దనుజ వైరి నీవె-ధరణిగావ-

మరల సుఖము శాంతి మహిలోన చిగురించె!

వావిలాల కృష్ణ వరనివాళి!

56*

ఆత్మలోనె నిన్ను అర్చింతు – నీదివ్య

దీప్తిగాంచి మదిని దిద్దుకొందు!

జన్మరుణము దీర్చు-జాగృతిన్ వరమిమ్ము!

వావిలాల కృష్ణ వరనివాళి!

57*

ధనమూలమైన-ధారుణి బంధముల్

సాగనియవు-భక్తి సమయమేది?

త్యాగబుద్ధినొసగి-తప్పించుమిహ బాధ!

వావిలాల కృష్ణ వరనివాళి!

58*

గతము మరువజేసి గల్పించు ఈక్షణం

బతుకు విధము గూర్చి భద్రతొసగు!

వచ్చుకాలమునకు-రెచ్చియోచనలేల!

వావిలాల కృష్ణ వరనివాళి!

59*

అందుకొనుము-మంగళారతి జగతి-గో

వింద – శుభములొసగు! విశ్వరూప!

సజ్జనోద్ధరణలు-సాగించి మన్నించు!

వావిలాల కృష్ణ వరనివాళి!

60*

వితరణిచ్ఛసున్న – విధులనాస్తియె మిన్న

డబ్బులబ్ధికొఱకె-తపన బతుకు!

ఎదుటి పోటి గెల్వ చెలరేగ జేయకు!

వావిలాల కృష్ణ వరనివాళి!

61*

భువిపరస్పరము-భూతదయయులేక

నరుడు బతకలేడు-నరరూపదానవుల్

ఆశ్రయించి కలిని అవనిబుట్టెదరింక!

వావిలాల కృష్ణ వరనివాళి!

62*

సొంతసొమ్ము మేలు సొరగమ్ము తలపించు-

పరధనంబుకాశ పడుట చేదు!

నిన్నునమ్మికొలువ-నిండు ధనకోశముల్

వావిలాల కృష్ణ వరనివాళి!

63*

ఆయవారవృత్తి అవనిగారవమందె!

నేటి దైవభిక్షు నిగ్గుదేలె!

వేదమంత్రవిధుల వేవేగసంధించె!

వావిలాల కృష్ణ వరనివాళి!

64*

అవనిగౌరవించె మదిసగుణోపాసన-

తపమెదానమయ్యె! తపసిదాత!

గమనదారులన్ని గమ్య పుణ్యంబుకె!

వావిలాల కృష్ణ వరనివాళి!

65*

నీతిరహిత సొత్తు నిప్పచ్చరంబగు

నీతియుతమె మంచి నియతినొసగు!

సులభ సిరులు వెసన సోకుతో పరిమార్చు!

వావిలాల కృష్ణ వరనివాళి!

66*

వృద్ధసేవజేయ సిద్ధమై యవ్వారి

మనసుదెలిసి-సంయమనము జూపి

స్వాస్థ్యమొప్పజేయ-సార్థక శ్రమయగు!

వావిలాల కృష్ణ వరనివాళి!

67*

చాలకష్ట పడియు శారీర, మానసి

క స్థితిని బట్టి మెదల కస్తియైన-

గతపు వారిసేవ – గమనించుకోవలె!

వావిలాల కృష్ణ వరనివాళి!

68*

కోపగించి వృద్ధు ఘోషబెట్టగ తప్పు

బట్టపనియులేదు-తరతరాల-

తాల్మియాస్తిగాగ తలవంచి మొక్కాలి!

వావిలాల కృష్ణ వరనివాళి!

69*

కఠినమాడకుండ-కన్నపేగు దలచి-

ఒకటిరెండుమార్లు-వొనరజెప్పి-

అవసరాలు దీర్చి ఆనందపరచాలి!

వావిలాల కృష్ణ వరనివాళి!

70*

పుడమి మంచి జనులె! పోయినవారల-

తీపిగుర్తులున్న తీరుతెన్ను-

లరసి-భావితరము-లనుసరింపగ మేలు!

వావిలాల కృష్ణ వరనివాళి!

71*

ఈసుగలిగి మదియు నిద్రకు దూరమౌ

గర్వమున్న మైత్రి గలుగుటెట్లు!

సందియముల వలన-రంది జీవనదారి!

వావిలాల కృష్ణ వరనివాళి!

72*

అదుపుజేయ – పూర్వ ఆశ్రమ వ్యవస్థ

గలుగవలయు ఇంటి గలుమలందె!

ఆచరణ మది – శాంతి-నీచవైరము దొల్గు!

వావిలాల కృష్ణ వరనివాళి!

73*

అత్తజేసె తనకు అన్యాయమని దల్చి-

కోడలందుకొన్న కొంప పెద్ద-

రికము మరల కోడరికము పాలేకదా!

వావిలాల కృష్ణ వరనివాళి!

74*

వచ్చు పితరులాస్తి వారసత్వంబుగా

వారిమంచిబుద్ధి పటిమరాదు!

వరుసగాను మానవత్వసిద్ధిని గూర్చు-

వావిలాల కృష్ణ వరనివాళి!

75*

దుడుకుగాను బెంచి దౌష్ట్యమూకను జేర్చి

ముదిమి దిట్ట రిత్త-ముళ్ళమొక్క-

నాటి పళ్లు గోర-నయశూన్య వేదనే!

వావిలాల కృష్ణ వరనివాళి!

76*

సమ్మతమగు రక్తసంబంధియంశమే

నమ్మకమ్మెనడుపు నమ్మ, నాన్న!

మాట వృధయె-సేవ మార్గమే విధియగు!

వావిలాల కృష్ణ వరనివాళి!

77*.

ఆప్తుగాంచి గంపెడాశింప వచ్చునా-

మితముమేలు-గతముమిడుక-కీడు!

చిత్తవృత్తి మాన్పు నిత్య చేతనత్వము నీదె!

వావిలాల కృష్ణ వరనివాళి!

78*

తృప్తి గలుగ మేలు ప్రాప్తసౌఖ్యమునకు-

నోటనొక్కమంచి మాటజాలు!

ఇచ్చినంత మరల పుచ్చుకో వీలగు!

వావిలాల కృష్ణ వరనివాళి!

79*

సానుభూతి వెంట సాయమాశింపకూ!

మైత్రితానె ఇచ్చు-మరి సుధామ-

అడుగ వెఱచె! నీదు అడుగులమడుగొత్తె!

వావిలాల కృష్ణ వరనివాళి!

80*

సంతు విశ్వసించి సాంతము బతుకంగ-

స్థైర్యమొసగు గుండె ధైర్యమొసగు!

చిత్త శుద్ధి నీదు శ్రీపాద సిరులిమ్ము!

వావిలాల కృష్ణ వరనివాళి!

81*

శ్రీకర!శుభకర!సురేశ!గోవర్ధన-

ధారి!కంసవైరి!ధర్మతేజ!

మానవాళి సేవ మార్గదర్శివి నీవె!

వావిలాల కృష్ణ వరనివాళి!

82*

సఖ్యభక్తి దారి ముఖ్యమనియు చాటె-

భక్తియోగమందె భద్రతొసగె-

శరణు జొరగనాత్మ- సాయుజ్యమొసగేవు!

వావిలాల కృష్ణ వరనివాళి!

83*

సర్వమీవె!నరుడు సాగియాగినవేళ

నిర్ణయంబు ధర్మ నియతి సాగు!

చేతులెత్తి మొక్కి చేవబొందును జాతి!

వావిలాల కృష్ణ వరనివాళి!

84*

కలయొ?వెలియొ?బతుకు కల్లయో నైజమో

అండనీవునుండ దండిమేలు!

గోరుదీప కాంతి కొండంత సంక్రాంతి!

వావిలాల కృష్ణ వరనివాళి!

85*

అవనియవసరాలు-అందించు అయ్యవై

వెంటనుండ జీవవెలితి యేమి?

డబ్బు జబ్బు చింత డాయదు ఇసుమంత!

వావిలాల కృష్ణ వరనివాళి!

86*

స్వార్థ తేగమనక సంతుకొఱకు సంత

బేరమాయె బతుకు భారమాయె!

సొంతకొఱకు చింత-చొప్పడవు చింతనల్

వావిలాల కృష్ణ వరనివాళి!

87*

ధ్యాన నిష్ఠనొసగు-దయనాత్మ దీప్తివై

భక్తియోగమిష్ట పథము జేసి-

కరుణతోడ నీదు శరణాగతి బ్రోవు!

వావిలాల కృష్ణ వరనివాళి!

88*

కాలహరణమాయె-కలవరించితి నిన్నె

అన్యచింత వంత అలుసులేల!

నియమరహిత భక్తి నిధియు నిష్ఫలమంద్రు!

వావిలాల కృష్ణ వరనివాళి!

89*

రోతపనికి – భువిపరోపకారానికి

దానధర్మకర్మ దారి ధనమె?

ధనమె మూలమయ్యె-దారెంట బతుకెల్ల!

వావిలాల కృష్ణ వరనివాళి!

90*

మనసు నిల్వదాశ మరిమరి పీడించె

నొక్కచిత్త భక్తినొనర జేసి-

ఆశపాశముడిపి ఆదరించగ రమ్ము!

వావిలాల కృష్ణ వరనివాళి!

91*

పూజజేసి మొక్కి పూర్ణ సాంగోపాంగ

యాగముగను భక్తి యోగమందు-

హారతిచ్చి తృప్తినందేరు ప్రజలెల్ల!

వావిలాల కృష్ణ వరనివాళి!

92*

చిత్తశుద్ధి వెంటచేతనివ్వాళితో

చేరవచ్చు జనులు-సేమమొంద-

సేవమొక్కు దీర్చి చెల్లింత్రు కాన్కలు!

వావిలాల కృష్ణ వరనివాళి!

93*

శుభకరము-దీపశోభితకాంతులున్

దీపపంక్తి పర్వ దివ్యవేడ్క

పరవశింపజేయు- ఫలపుణ్య ప్రదముగా

వావిలాల కృష్ణ వరనివాళి!

94*

మాసమాసమునకు మనిషింట పండుగ

పున్నమి యమవాస్య – పుష్టిదములు!

నేలగురియు చుండు నెలమూడు వర్షాలు!

వావిలాల కృష్ణ వరనివాళి!

95*

ప్రకృతి వికృతి గాగ ఫలిత-విరుద్ధమై

కరువుతాండవించు-కలియుగాన-

పచ్చదనము లోటు ప్రకంటించు ప్రకృతీ!

వావిలాల కృష్ణ వరనివాళి!

96*

కర్మఫలము నీకె కాన్కజేసియు మొక్కి

ధ్యాన ఫలము నిచ్చు-దాస దాసు-

నిత్యభక్తి యోగనీరాజనమె బతుకు!

వావిలాల కృష్ణ వరనివాళి!

97*

కరుణాంతరంగ!శరణాగతిని గూర్చి-

సమతయోగ బాట సాగజేసి-

తుచ్ఛకోరికలను-తుడిచేయు బలమిమ్ము!

వావిలాల కృష్ణ వరనివాళి!

98*

చాలకాలమేగె-సంకటహరణుడా!

బింకమణుగదాయె బెట్టు మదికి!

నిచ్చలంబుజేసి-నీధ్యానమననిల్పు!

వావిలాల కృష్ణ వరనివాళి!

99*

మనసు నిల్వదాశ మరిమరి పీడించు-

నిశ్చలత్వమొసగి- నిగ్గుదేల్చి-

ఆశాపాశముడిపి-ఆదరించగ రమ్ము!

వావిలాల కృష్ణ వరనివాళి!

100*

రోతపనికి భువిపరోపకారాలకూ-

దానధర్మ కర్మరదారి ధనమె!

ధనమె మూలమయ్యె తరియించు మార్గమై

వావిలాల కృష్ణ వరనివాళి!

101*

ఎందరో ఘనులుంద్రు-రెందైన ఉచితసత్

బోధ-గురులు-వారి ఊర్థ్వదృష్టి-

సుగమదారి-తత్వసూక్తి సాగగ నిమ్ము!

వావిలాల కృష్ణ వరనివాళి!

102*

భక్తిసాగును సమభావపూర్ణ గతుల-

యుక్తిసాగుయోగ శక్తిగోరి-

తుచ్చ మనసు- వెనక తచ్చాడ జేసేను-

వావిలాల కృష్ణ వరనివాళి!

103*

ఆశలుడిపి చరమ ఆశ్రమ జీవన

దారినడుపు కలుషదారి మలుపు!

సాధుజీవనవృత్తి-సాగజేయగ రమ్ము!

వావిలాల కృష్ణ వరనివాళి!

104*

వేడుకొంటి శతక వేదిక సప్తతిఁ

పాఠమయ్యె భక్త భజన సాగె బతుకుదెరువు

మాయలుడుగవాయె-మనసునిల్వదాయె!

వావిలాల కృష్ణ వరనివాళి!

105*

సత్యసాధనములు-సత్సంగమునదొర్కు

తేగమొప్పు బుద్ధి తేజరిల్లు!

నిగ్గుదేలునాత్మ నిత్సంగ దారిలో-

వావిలాల కృష్ణ వరనివాళి!

106*

ఆత్మనిబ్బరంబె-అవనిమానవ రక్ష!

ఆత్మదీప్తిని పరమాత్మనీవె!

నిజముముక్తి భువిని నిత్యమానందమే!

వావిలాల కృష్ణ వరనివాళి!

107*

మంగళకర!గొనుము-మంగళహారతి-

శతకపూజమెచ్చి బతుకు దిద్దు!

భక్తిగల్గు కూడు-పట్టెడైనను బెట్టు!

వావిలాల కృష్ణ వరనివాళి!

108*

శుభము-పఠితజనులు-శ్రోతలు కవులకూ-

శుభము-భక్తి పూర్ణ శోభితులకు-

శుభము-పద్యపఠన-లభిత సంతోషికి!

వావిలాల కృష్ణ వరనివాళి!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page