top of page

శ్రీ శ్రీ శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి శతకము

(తే.గీ.)

1*

శ్రీలు పండించు నీరూపు చిత్రముగను

రాలు కరిగించు నీపాట రాగసుధలు!

రామదూత! నీమాటె వరాలమూట!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

2*

పేరులెన్నైన రామయ్య పేరు ప్రేమ!

ప్రేమ వెల్గించు నీసూక్తి పేరు భక్తి!

భక్తి తోటలో నీపాట ముక్తి బాట!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

3*

రామనామ మహత్తుచే రాతిగుండె

లీలగా మారె! మౌని వాల్మీకియయ్యె!

పిట్ట కన్నీరతని మార్చె దిట్టకవిగ!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

4*

పరమ పురుషోత్తముని పుణ్య పదము సోకి-

పుడమి రాతియహల్య తాపులకరించె!

పచ్చపచ్చగ బ్రతుకంత పల్లవించె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

5*

రాము మదిమెచ్చి సతియయ్యె రమణి సీత!

రామ శరఘాతమును మెచ్చె రావణుండు!

రామ రావణ సంగ్రామ రచన నీదె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

6*

రామ సతిజూచి లంకను గాల్చి వచ్చి

రామ సోదరు సంజీవ రక్షజేసి

రామ కౌగిలినోచిన రామబంటు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

7*

శత్రు తమ్ముని గమనించి మిత్రు జేసి

ఉర్వి మైరావణైరావణులను జంపి

ప్రభునియాజ్ఞ పాలించిన ప్రజ్ఞనీది!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

8*

రోమ రోమంబునా రామనామలర

గుండెనాదర్శ దంపతుల్ నిండియున్న

దివ్య కవిరాజ! నావాక్కు దిద్దితీర్చు!

కొండగట్టేశ! మమ్మేలుకో! హరీశ!

9*

రాక్షసాంతక! నీవె మారక్షకుడవు!

వేదతీర్థంబులను మమ్ము సేదదీర్చి

తీరుదెల్పి చేర్చుము మోక్ష తీరమునకు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

10*

ఆలకించుము మామొరల్ ఆంజనేయ!

ఆదుకొని మమ్మునీదరి చేదుకొనుము!

కరములెత్తి మ్రొక్కెదమయ్య! కరుణ గనుము!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

11*

బ్రతుకు భారము తలమోసి బలము తగ్గి

ఓపజాలను నీపటాటోప భజన

తాళజాలను నీయాట తాళ మాపు!

కొండ గట్టేశ! మమ్మేలుకో హరీశ!

12*

రామదాస! నీమతమేమి? రామ మతమె!

వాయుపుత్ర! నీకులమేమి? రామకులమె!

కామరూప! నీరాజ్యమే రామమయము!

కొండ గట్టేశ! మమ్మేలుకో హరీశ!

13*

తరము గాదంటె, సంసార తారకమ్ము

దెలిపి సంచితార్థపు దుమ్ము దులుప రమ్ము!

విషయ వాసనల్ వీడగా విశ్వరూప!

కొండ గట్టేశ! మమ్మేలుకో హరీశ!

14*

ఏల నన్ పరీక్షింతువో? ఏకవీర!

చాలు నన్నూరడింపుమో స్వామి భక్త!

ఏది నిత్యమో వాస్తవంబెరుగ లేను!

కొండ గట్టేశ! మమ్మేలుకో హరీశ!

15*

కరము జోడింప లేకుంటి కర్మవశము!

కాల క్రియలందు మదినంటె కల్మశంబు!

తీరు వేరాయె నినుజేర తీరదాయె!

కొండ గట్టేశ! మమ్మేలుకో హరీశ!

16*

కాలు నిలువదు కదలించు కాలమహిమ!

పొట్టకూటికి గూటికి పోటి బ్రతుక!

మెతుకుముట్టగ నిద్రింప మెఱుపు గతము!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

17*

కమ్మని భజనకోర్చునా కర్ణ పుటము

రాక పోక రవాణయే రామభజన!

పాట గుణపాఠముల భక్తిబాట సాగె!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

18*

తినగ రుచిమర్గె నీమాటలనదు నాల్క

తీపి కీర్తన జేయగా తీరదనును

చేదు వర్తన రుచులెంచి చెప్పుచుండె!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

19*

మనసు నిల్పగ తరమ నీమహిమ గనక

సారె సారెకు కోర్కెల స్వారిజేయు!

మరల కట్టివేయుదు భక్తి మట్టుకేసి!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

20*

గోరు చుట్టుపై రోకటి పోటు కోర్చి

ఊకదంపుడుకలవడె హృదయ పుటము!

లబ్బు డబ్బులో డబ్బుకే డబ్బగొట్టె!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

21*

గాలి కంప నింపుదగిలి గడిపె మెదడు

చొప్పయోచన మేతగా చప్ప బడియె

భక్తి భావార్థ తాత్పర్య శక్తి నుడిగె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

22*

కన్నుటద్దాల రంగులో గాంచు జగము

గానరాదాయె తెల్లమై కల్లనిజము

చర్ఛ సాగింప విజ్ఞాన చక్షువిమ్ము!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

23*

డాబు దర్పంబు నేలెడు డబ్బుగబ్బు

గాక నితరంబు నోర్వదు లోక ముక్కు!

కోపమునుదాల్చు నెఱుపెక్కు కొంప ముంచు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

24*

మేధ తలరాత గతిసాగె – మేను వంచె!

మేలు కీడెంచి బుద్ధికి వెన్నుజూపె

బుద్ధి సుఖభావ వృద్ధమై సద్ధుమణిగె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

25*

ఏల నెకసక్కెములు జేతు వెదుట పడక?

బూని యాడెద వేల? దోబూచులాట!

తిమ్మదేవర! నీభక్తి తిరముగూర్చు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

26*

ఏకమైనీదు వృక్షంబులెక్కలేను

ఈసడించిన జలనిధుల్ యీదలేను

సాత్వికోత్తమ నినుజేరు సత్మమిమ్ము!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

27*

దినము చిత్తశాంతినిగూర్చి దిగులు మాన్పు!

బ్రతుకునాటంకములు బాపు బ్రమవిదూర!

తనివిదీర నిన్ పూజింతు తరుచరేంద్ర!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

28*

ఏల గల్గునో మామదికెమరు పాటు

తుచ్ఛ భోగాలు శాశ్వత తృప్తినిడునె!

రాగ వైరాగ్యముల భక్త రక్షకుడవు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

29*

తోచు నీరూపమే మాకు తోడునీడ!

సాగి పోదుము నినుమ్రొక్కి సాకుజూపి!

తోకదేవర మముబ్రోవు దోవనడపి!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

30*

నమ్ముకొంటి నీకేమది నమ్ముకుంటి

రమ్ము నాగుండె గుడిలోకి రామభక్త!

సత్య భరిత దయాపూర్ణ సత్వమిమ్ము!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

31*

లేరు నినుబోలు రక్షకుల్ లేరు భువిని

కోరి శరణన్న వారి ముంగొంగు పసిడి

పరమ భాగవతోత్తమ! పవన తనయ!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

32*

పల్లెసీమలో నీభక్తి పల్లవించు

వెలయు నగరాల నీసేవ వెల్లి విరియు!

బుద్ధి వెలుగ నీదయ కాయ సిద్ధి గలుగు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

33*

అలిగి గంతేసి నినుగెల్వనలవిగాదు

పాడగాలేను కొమ్మచ్చులాడ లేను

భజనకీర్తన నీమెప్పు బడయ గలనె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

34*

కొండ కోనలలో నెలకొన్న దేవ!

దుష్టశక్తులు నీవన్న దూరమగును

పల్లె పట్నాల ప్రజలకు ప్రాపు నీవు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

35*

రామచంద్రుని కీర్తనల్ వ్రాయలేను

తియ్యగా భక్తి రాగాలు తీయలేను

చేరి నీచెక్కభజనలు చేయలేను

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

36*

భక్తి భావ సరాగాల బరగు సుధలు-

బ్రతుకు పాటతోటను నాదబ్రహ్మగాన-

మధుర వాద్యాలు నీగుడిన్ మారు మ్రోగు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

37*

పసిడి ముత్యాలహారాలు పగులగొఱికి

పారవేసితివందు నీ ప్రభుని గనక!

జానకీమాత మెచ్చిన జ్ఞానతేజ!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

38*

అష్ట సిద్ధుల్ నవనిధుల కధిపుజేసి

పుత్రవాత్సల్యమును జూపె పుణ్యచరిత!

నవమ బ్రహ్మగా దీవించె నవనిజాత!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

39*

అండదండవై నీవుండనాంజనేయ!

గుండె గూటిని దాగిన గుబులుదీరు!

కలుగు కొండంత ధైర్యము కలుగు యశము!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

40*

అతుకు గతుకుదారినిబడి బ్రతుకు బండి

సాగదాయెను సగములోనాగసాగె!

వెతక సాగెను మదినిన్ను వెనక ముందు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

41*

గుండె గుడిలోని రామయ్య గుట్టు దెలిపి

ఉండిపోవయ్య నాగుండె కొండదేవ!

నిండు భక్తిని స్మరియింతు నిత్యసేవ్య!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

42*

నిండు గుండె సీతారాములుండి రనుచు

పలికి యెదజీల్చి జూపిన పరమ భక్త!

విశ్వసించె నీలోకమ్ము విమల చరిత!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

43*

శివుని యంశ బుట్టిన చిరంజీవి నీవు

అంజనాదేవి వరపుత్ర అమరచరిత!

కేసరీ పుత్ర! బ్రోవు సుగ్రీవమిత్ర!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

44*

వెలయు కొండగట్టే మాకు వెండి కొండ

పారిజాతమూల నివాస! పవనతనయ!

భక్త జన కల్పతరవైన బ్రహ్మ తేజ!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

45*

అండ పిండ బ్రహ్మాండ భాండంబు నిండు

అర్థ పరమార్థముల నాత్మ తత్వమరయు

పండితులు భక్తి కీర్తించు పండితుడవు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

46*

పాపములు బాపి పుణ్యాల పంటజూపి

పేరుగాంచిన కడుగొప్ప ప్రేమనీదె!

గ్రామగ్రామాన నీగుడి గాలి సూతి!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

47*

ఆదుకోవేల నాపద నాదరించి

చేదుకోవేల నీదరి జేరుకొనగ

వాదులాడంగ నేనెంత వాడతండ్రి!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

48*

కమ్మగయ్యెను పరకూటి కుమ్ములాట!

చెమ్మగిల్లని తనువంత సొమ్ముదాల్చ

సులభ మార్గాలనార్జించు సూత్రమడిగె?

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

49*

తప్పుబట్టకమార్చు మాతలను రాత!

ఉప్పు కప్పురంబుగజేసి ముప్పుబాపు!

ఒప్పు బ్రతుకును వెలిగించి మెప్పుగూర్చు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

50*

బండ చాకిరితో పస్తులుండువారు-

సులభ సూత్రాల సుఖపడుచుండు వారు-

మానసికముగా శ్రమజేయు మనుషులుంద్రు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

51*

మంచివాడు మునిగె-నమ్మించలేక

వంచకుడు మించి నమ్మించి పోయె

మంచి గెలిపించు శక్తిని మాకొసంగు

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

52*

రాక పోక సంపాదన రాజి పడగ

మేక మేసిన కాకరే మెతక బ్రతుకు!

కాకి గొట్టి గ్రద్ధలకేయు కథలు సాగె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ ప!

53*

ధనపు సూరీడు తనచుట్టు ధరను ద్రిప్పె,

ధరణి-నరుడు బ్రమించెను తనకుతానె

వెలుగు తనసొమ్ము సూరీడు ఎవరి సొమ్ము!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

54*

రంగురంగుల జీవన రంగ నటన

వాపు బలుపులెఱుంగని వరుస ఘటన,

సుఖ విషాదాంతముల దేల్చు సూత్రధారి!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

55*

అడుగు సాగదు బ్రతుకేమొ పిడుగు ప్రశ్న

చేత గాకున్న, ఈదేవి చేదునదులు

నోరుదాటని మాటయ్యె నొసటి రాత!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

56

బ్రతుకు బాటలో నిర్భీతి భవిత ప్రీతి

మాట మన్నన మర్యాద మనిషిగోరు

వొరులు గోర నోర్వడు తానునొసగబోడు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

57*

అరచె లోలోన నేదో సుపరిచితాత్మ

వెరచి పాపదోషమెఱింగి వెనుక కొదుగ

పిదప యోచించ నీభక్తి ప్రీతిగొల్పె!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

58*

అంధ కారమ్ము మదితొల్గె నాత్మ వెలిగె!

బ్రహ్మ మోదమ్ము నుదయించె భక్తి మీర!

నీకటాక్ష వీక్షణగల్గ నింత జరిగె

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

59*

కలిమి మరచియు లేమిని దలచి కొలచి

చింతమాన్పగ వేడితి చిత్తమందు-

భక్తి భావమ్ము గలిగించి ముక్తిజూపు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

60*

కఠిన కష్టముల్ సైప నీ కరుణచాలు!

చుట్టు నష్టముల్ నెట్టనీ చూపుచాలు!

పెద్ద దు:ఖముల్ దాట నీ పేరుజాలు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

61*

నావికుడ వీవె ననుభక్తి నావ జేర్చు

ధార్మికుడ వీవె ననుధర్మ దారి నడుపు

అభయ హస్తంబు జూపించి శుభము లిమ్ము!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

62*

పాత క్రొత్తల కలయిక పాదుకొలుప

వింతరీతులు జాతిలో గంతులేయ!

రాత మార్చు విజ్ఞాన విధాత వీవు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

63*

రేపటికి వాయిదాపని నేడు-నేటి

కార్యక్రమ శ్రమ లిప్పుడే గాగ మేలు!

రేపు మాపను మాటకు రూపు జూపు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

64*

రోమరోమంబున,రామ నామ మలర

గ్రామ గ్రామాన నీరూపు గాంతు సామి!

దుష్ట శక్తులు నిను గొల్వ దూరమగును!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

65*

పుడమి నిత్య సత్యమగు సంపూర్ణమేది?

కీర్తిదాయకమగు రామ కీర్తనమ్మె!

తనువుతో బోవు సకలమ్ము తత్త్వ మరయ!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

66*

సాగు జనులందువెలయు సుస్వాంతమొప్ప

సత్య గంగాప్రవాహము సాగిపోవు!

దాని పొడగన్న జనులదే ధన్యజన్మ!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

67*

మాటమాటికి మనిషేల మాటదప్పు!

మనిషి నిమనీషిగా మార్చు మాట మహిమ!

మాట నిలుపు ధైర్యము నిచ్చి మనుపవయ్య!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

68*

మాటయే కోటిసేయు మరోటియనగ

మాట దప్పుటే నడవడి పాటిదప్పు!

పాటి దప్పిన మనుగడే పాపమయము!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

69*

మూఢ నరుమాట ముప్పాలు ముళ్ళబాట!

వంచకునిమాట ఎండలో మంచుమూట!

మంచి మానిషి చతురోక్తి మంత్రసూక్తి!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

70*

మాట పైనిల్చు భువిధర్మమనగ వినమె!

ధర్మ రక్షయే జనరక్ష ధరణి రక్ష!

మాట నిల్పమాకింకమో మాటమేల!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

71*

పుణ్య చతురోక్తి జనులకు స్ఫూర్తి నిచ్చు

భక్త భావోక్తి ప్రజలకు ముక్తి నిచ్చు

పంచు ప్రేమ తోబుట్టు- ప్రపంచ శాంతి!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

72*

మాట శుద్ధియే సామాన్యు మాన్యు జేయు!

కర్మ శుద్ధిచే మనిషికి కలుగు యశము!

మానవుని మాధవుని జేయు మనసు శుద్ధి!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

73*

అవని తనువులు వేరైన నాత్మ యొకటె!

పూలజాతులు వేరైన పూజయొకటె!

కలుగు మతములు వేరైన గమ్య మొకటె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

74*

వర్ణ మేదైన భువి మానవత్వమొకటె!

బాషలేవైన వాక్కుల భావమొకటె!

బుద్ధులెన్నైన మానవ హద్ధులొకటె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

75*

దేశమును దాటి దేశి విదేశి యయ్యె!

దేహమును దాటి దేహి విదేహి యయ్యె!

ఆత్మ తత్త్వంబు దెలియ-విశ్వాత్ము గాంచె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

76*

ఆదిలో హంస పాదేయు, ఆప్త సఖులు!

బంధు ప్రకటించి బాధింత్రు, బంధుజనులు!

వంతు భారమ్ము తలనెత్తి సంతు సాగు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

77*

విందులందు చిందేయ పసందు గూర్చు!

వాస్తవాస్తులు కర్పూర వస్తులగును!

గురుని జేరి వేడగనీదు గుట్టుదెలియు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

78*

మెత్తువేసిన కోరికల్ వుత్తయ్యె!

గాదెవోసిన వెన్నెల గలిసె సిరులు!

బతుకు చీకటి వెలిగె నీభక్తి దివ్వె!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

79*

కుటిల సంసార సంద్రాన కోటి సుడులు!

సాధు సన్యాసి మార్గాన సంతు సడులు!

భక్తి నామస్మరణజేయు బాట సుళువు!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

80*

బ్రతుకు నేకిన దూదాయె బమలుదీరె!

పత్తివిత్తనమై మది భక్తిదడిసె!

మరలమొలకెత్తు భీతి నీమాటు జేర్చె!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

81*

పాత రీతులు గనచిత్ర పటములాయె

పూతనీతులు గంధపు పూతలాయె

తాత నీతి సోదిగమారె తళుకుమాసె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

82*

నాటి సాంప్రదాయపు పాలు నీట గలిసె,

సోది, సంస్కృతి పాత్రలు సొట్ట బడియె,

మిశ్ర-జీవన చందముల్ మిగుల వెలిగె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

83*

రామ భక్తి దీపములేని రాత్రి బ్రతుకు-

తెగిన విద్యుల్లతయె దాని తేప కతుకు-

యాంత్రికుడవీవె! తారకతాంత్రికుడవు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

84*

నమ్ముకొన్న మైత్రిని తెగనమ్ము నరుడు

చిల్లపెంకుల సిరినేరి చిందులేయు!

సిరులు సిరులౌనె ధర జీవ సిరులె సిరులు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

85*

గమన చక్రాలు గూలగా గతులు మారె!

బ్రతుకు గోతిని బడిపోయె బ్రమలు దొలగె,

భక్తి భావమ్ము దీపించె భావి బ్రహ్మ!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

86*

మంటలెన్నియో మావెంట – వంట మంట-

కళ్ళమంటయు చలిమంట కడుపుమంట!

మంటలెన్నైన తీరునా? మనిషి తంట!

కొండగట్టేశ! మమ్మేలుకో హరీశ!

87*

వాయిదాలేని దొక వావి వరస జూడ

మిగత వన్నియు వాయిదా మిగుల తతులు!

బ్రతుకు వాయిదాబడె నీదు భక్తి వెదకె!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

88*

ఏడ్పుతోబుట్టి బ్రతుకంత నేడ్పు గడీపి-

ఏడ్పుతో గిట్టు వెన్నంటి ఏడ్పు మిగుల-

తరతరాలకు ఏడ్పులు తరలిపోవు!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

89*

ఏడ్పు మేఘాలు దొలగించు గాడ్పుసూతి!

నవ్వు చంద్రుల వెలిగించు దివ్యతేజ!

భక్తి పరిమళ గ్రంధముల్ బ్రతుకు నింపు!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

90*

వెసన పుట్టల విషపాము బుసలుగొట్టు-

వసనడాంభిక జీవన విసనకర్ర-

నాగరికమయ్యె-నరజాతి నగలమాయ!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

91*

మనసు మసిపూత మాయలమారి మనిషి

మాట బూటకమ్మును, కర్మ నాటకమ్ము

గాగ గానుగు జీవన గమనమేగె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

92*

తోచి నంతగ మరితాము నోచినంత

దాచనేర్చిన దాదిగా దోచనేర్చి!

మనిషి చుట్టుగోడల మధ్య మనగనేర్చె!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

93*

జన్మతో జమాఖర్చులు జగతి మొదలు

కూడు,గూడు, గడ్డకు పెద్ధకూడికలును

చేసి-తీసివేయ బ్రతుకు బేసినిల్వ!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

94*

చదువు పదవుల గనరాదు శాంతిసుఖము

నీదు భజనలీనముగాగ నెమ్మనమ్ము-

శాంతి సంద్రమై యిహపర సౌఖ్యమొసగు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

95*

సిరులు మరులేల?కావలె చిత్తశాంతి

కడుపు నిండగా కావలె కనుల కూర్కు!

మొదట తృప్తి నొందని జీవమోదమేది?

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

96*

ఆకలాకలి కేకనేకాకి యరుపు!

లోకమంత మూగగ కాకి శోకమయ్యె!

తోక దేవర దారియే తోచదాయె!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

97*

నరులనాకలి నీకలి నమలసాగె

మూఢ కలహాలు కృషిమాన్ప-మునిగె జగతి-

దాసదాసుల దరిజేర్చు దాసపోష!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

98*

అస్మదీయులు మనసునే విస్మరింప-

తస్మదీయులు బ్రతుకునే తస్కరింప-

రానికాడికి రాయి పరాయి తనమె!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

99*

ఆశ చిగురించె మది రాగమాకుదొడిగె!

మొగ్గ కోరిక వికసించె మోము వెలిగె!

పట్టి విడుతునా నేను నీ పాదయుగళి!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

100*

నిక్కమగు భక్తి నామది నిగ్గుదేల-

భక్త బృందమ్ములో నన్ను భర్తిజేసి-

భావసామ్యంబు గల్పించు భవవినాశ!

కొండగట్టేశ మమ్మేలుకో హరీశ!

101*(సంపూర్ణం)

మెదడు గర్జించె మదిలోన మెఱుపు మరిసె

భావ మేఘాలు వర్షించె భక్తి కవిత!

మానవత్వంబు వికసించె – మౌనినాథ!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

102*

పాప భీతిచే పుణ్యంబు పదిల మగును

దానవుని మానవుని జేయు దైవభీతి!

ప్రాప్త సంతృప్తిచే మోక్ష ప్రాప్తి సుళువు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

103*

భక్తపరమాణువులు నిన్ను భక్తి గొలుచు

వెంకటయ్య సీతమ్మల వేడ్క సుతుడ!

తిరుణహరి సత్యనారణ చిహ్నితుడను!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

104*

తేట గీతుల నాభక్తి తేట పరచి

చేదుకొమ్మని మాగోడు చెప్పుకొంటి

సేదదీర్చియు శాంతి సంక్షేమ మొసగు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

105*

భక్తి భావముల్ భువిపుణ్యఫలము గూర్చ-

లోక కళ్యాణమును గూర్చు శోకరహిత-

జీవనమునిమ్ము ధరచిరంజీవి హనుమ!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

106*

సంపదలచేత బెరుగునా శాంతి ద్రుమము?

కరువు కాలమ్ము గడచునా కథలు జెప్ప?

మల్లి మొదటికి చేరదా మనిషి బ్రతుకు!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

107*

దిక్కులేని వారల బ్రోచు దివ్యనామ!

మ్రొక్కి ప్రార్థింతుము నిన్నె మోదమలర!

ముక్తి గోరి చేతుము నీదుభక్తి భజన!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

108*

శుభములిచ్చి రక్షించుమో శూర హనుమ!

శతక పఠనజేయగ నిమ్ము సతత శుభము,

అండదండగ నీవుండ-దండి శుభము!

కొండ గట్టేశ మమ్మేలుకో హరీశ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page