
కాకతీయనివాళి శతకము
(ఆ.వె.)
1*(ప్రారంభము)
శ్రీలుపొంగునాటిశిల్పసౌందర్యమే
తెల్పుచుండుకాకతీయగరిమ!
మేనుజలధరించుమేలిమివైభవముల్
కాకతీయకీర్తిఘననివాళి!
2″
భువిపరోపకారబుద్ధిపుణ్యముగాగ
పరులపీడనంబుపాపమనగ-
నాణ్యమయ్యెబ్రతుకు-నయజయమ్ములుగలిగె!
కాకతీయకీర్తిఘననివాళి!
3*
శిథిలమైనరూపుశిల్పాకృతులుదారి
వీధివీధులందువిరివిగాను
పడినతీరుపరదాడిచిహ్నముల్.
కాకతీయకీర్తిఘననివాళి!
4*
శత్రులైనమదినిసౌమ్యతగలుగగా
కళలుగారవించికదలిచనిరి!
నేడుకీర్తిప్రభలునెగిడెవిశ్వముమెచ్చె!
కాకతీయకీర్తిఘననివాళి!
5*
శ్రీకరముగబ్రోచుఏకవీరాదేవి!
కాకతమ్మవెలసె – కరువుదీర-
బ్రతుకునిచ్చుతల్లిబతుకమ్మపర్వముల్
కాకతీయకీర్తిఘననివాళి!
6*
పూనెపిదపనృపుడుపునరుద్ధణలుకొన్ని
శిథిలశిల్పసిరులె-చిహ్నములుగ-
కోటగుళ్ళుపట్టుగొమ్మలుచరితకు!
కాకతీయకీర్తిఘననివాళి!
7*
కోటపేటగుడులుగోపురంబులుశిల్ప- తోరణాలుమిగిలెత్రోవలందు-
స్వాగతించుచరితసామ్రాజ్యచిహ్నముల్
కాకతీయకీర్తిఘననివాళి!
8*
తరచుయుద్ధభయముతరుగుసంక్షేమంబు
శత్రుదాడియాస్తి-సమయనష్ట-
మగును-పిదపవృద్ధిమందగించునుకదా!
కాకతీయకీర్తిఘననివాళి!
9*
సమరభయములేనిసామ్రాజ్యకాలము
కలిసివచ్చెతగుగకళలువెలిగె!
దనరెశాంతిసాంప్రదాయమేర్పడెనంత!
కాకతీయకీర్తిఘననివాళి!
10*
ప్రజలుకాకతీయప్రభువుసమైక్యత-
ఓరుగంటికోటనొప్పెననగ-
చూడగాపునాదిసుస్తిరతయెదెల్పు!
కాకతీయకీర్తిఘననివాళి!
11*
ఏకవీరభక్తిఏకాంగవీరులై
యోధులైరివిజయసాధకులుగ
నమ్మకమిడుసేవనగరరక్షకులైరి
కాకతీయకీర్తిఘననివాళి!
12*
ప్రభువులైననగరప్రజలైనయోధులే
వీరగల్లులున్నఓరుగల్లు-
లలితకళలయందులభ్దప్రతిష్టమై
కాకతీయకీర్తిఘననివాళి!
13*
బ్రతుకునిచ్చుతల్లిబతుకమ్మగుమ్మడి
తీగ-కాకతీయతీపిగుర్తు-
వారసున్నిగాచెవైరిమూకలనుండి!
కాకతీయకీర్తిఘననివాళి!
14*
నాణ్యమైనబతుకునయజయంబులతుకు
పడగప్రజలనాటపాటసాగె!
రేడుగొలువగాచెరేణుకాయెల్లమ్మ!
కాకతీయకీర్తిఘననివాళి!
15*
కథలబ్రతికెతల్లికలిమిబ్రతుకునిచ్చె
నరులనాల్కపైనెనాట్యమాడె
బ్రతుకుతోనెముడియుబడియెబతుకమ్మయున్
కాకతీయకీర్తిఘననివాళి!
16*
అందరొక్కటగుచుఆడిపాడిరిజనుల్
ఐకమత్యశాంతిసౌఖ్యముగని
ప్రభులుమోదమందపాలనకొనసాగె!
కాకతీయకీర్తిఘననివాళి!
17*
పూలజాతరయ్యెపుణ్యదేవతభక్తి
చేతగలిగెప్రజకుచేతనమ్ము!
పూనువనితలెల్లపుణ్యరుద్రమ్మలే!
కాకతీయకీర్తిఘననివాళి!
18*
భక్తిపూలపూజప్రకృతిదేవతపూజ
మనసుజేరుపూలమార్ధవంబు!
మనిషిమనిషిగలుపుమహిమసాధించగా!
కాకతీయకీర్తిఘననివాళి!
19*
దైవమునకెపూతతరులకృతజ్ఞత!
దైవసన్నిధికినిదానిజేర్చి
మదినిభక్తిమ్రొక్కుమనిషికృతజ్ఞత!
కాకతీయకీర్తిఘననివాళి!
20*
కష్టములనుబాపికాపాడుశక్తులు
గ్రామదేవతలుగగలుమగలుమ-
నమ్మకంబుపెంచినడిపిరిముందుకు!
కాకతీయకీర్తిఘననివాళి!
21*
మంచివారికిశుభసంచయంబునుగల్గ
వంచకులునుకీడువడగబతుకు-
మంచినెంచిభక్తిమార్గానుసరణంబు!
కాకతీయకీర్తిఘననివాళి!
22*
ఇష్టదైవభక్తిఇంపైనసత్తువ
కాయధాన్యరుచులగలుగుపుష్టి!
భక్తిదారిబ్రతుకుభద్రతాభావము!
కాకతీయకీర్తిఘననివాళి!
23*
నాటిశత్రుదాడిననుకరింపులబాట
గొట్టములనుచేతబట్టినవ్వు
లాటసాగుపల్లెలందుమొన్నటిదాక!
కాకతీయకీర్తిఘననివాళి!
24*
ఇచ్చిపుచ్చుకొనుటెఇహమరియాదయ్యె!
వాయనంబుమార్చువరుస-బంచి
పెట్టుచుంద్రుపేరుపేరుప్రసాదముల్!
కాకతీయకీర్తిఘననివాళి!
25*
కనులపంటప్రజకుకాకతిబతుకమ్మ
స్ఫూర్తినిచ్చుకథలుఆర్తజనులు
శత్రుదాడినలుగుచరితలేపాటలై
కాకతీయకీర్తిఘననివాళి!
26*
పల్లెపట్నమనకపల్లవించినభక్తి
పుణ్యగౌరిపూజపూనిచేసి
సందెవేళనాటసాగింత్రుపాటలన్
కాకతీయకీర్తిఘననివాళి!
27*
వరుసమాసమాటపాటలనవరాత్రి
పండుగలుమహర్నవమియుదసర
వరకుసంబరాలువర్ధిల్లజేయగా
కాకతీయకీర్తిఘననివాళి!
28*
బ్రతుకునిచ్చుగొప్పపండుగేబతుకమ్మ
లేమిమరచిజనులనోముసాగు!
అప్పుజేసియైనపప్పుబోజనవిందు!
కాకతీయకీర్తిఘననివాళి!
29*
పండుగయిదియాడబడుచుపుట్టినయింటి
వన్నెవాసిగూర్చునన్నితీర్ల!
బలమునిచ్చునవియెసత్తువపిండ్లయ్యె!
కాకతీయకీర్తిఘననివాళి!
30*
కంటగింపులన్నికడకుత్రోసియునవ్వు
పువ్వులాటసాగుపుట్టినింట
ఊరిబిడ్డలంతఊరడిల్లగజేయు!
కాకతీయకీర్తిఘననివాళి!
31*
ఊహలూయలూగుఊరంతపండుగ
సద్దిసత్తుపిండ్లుసాగుజనుల
వేడ్కలాటపాటవేనోళ్ళసందడుల్
కాకతీయకీర్తిఘననివాళి!
32*
నవదినంబులొప్పనడిపించుజాతర
జానపదముగాగచప్పటులను
కంఠమేలసాగుకమనీయమగుపాట!
కాకతీయకీర్తిఘననివాళి!
33*
పావనమగునీతిపౌరణికంబులు
మనసుముద్రసంఘటనలువస్తు
వగుచుసాగుకథలువాచికమైయొప్పు
కాకతీయకీర్తిఘననివాళి!
34*
బొద్దుగద్దెపీఠిబొడ్డెమ్మయనియాటలాడుకొంద్రుచిన్నలంతగూడి
ఆటసాగుపక్షమమవాస్యదాకను
కాకతీయకీర్తిఘననివాళి!
35*
గునుగుదెచ్చియెండకుంచికట్టలుగట్టి
రంగులద్ధిపేర్చిరాజసముగ
నేర్పుజూడనోర్పునేర్పించువిద్యయే
కాకతీయకీర్తిఘననివాళి!
36*
భక్తినిష్ఠ- వెంటబతుకమ్మపేర్చగా
చాలువారునోర్పుచాలగలిగి
యొప్పుచుందురింటగొప్పనిర్మాతలై
కాకతీయకీర్తిఘననివాళి!
37*
గునుగుబొండుమల్లెగుమ్మడితంగేడు
కలువతామరలునుకట్లపూలు
గోగుబీరపొట్ల-గోరంటరుద్రాక్ష!
కాకతీయకీర్తిఘననివాళి!
38*
తగినపాటయుకరతాళంబువంతలు
చుట్టుదిరుగునృత్యసూత్రగతులు
భంగిమగనతెల్గుప్రజలభాగ్యమెజుమీ!
కాకతీయకీర్తిఘననివాళి!
39*
ఒకరుపాటమేటియొకరుకోలాటము
లొకరువక్త-సత్తులొకరిప్రజ్ఞ!
ఒకరికొఱకునొకరునొనరబ్రతుకువిధం!
కాకతీయకీర్తిఘననివాళి!
40*
నగలువస్త్రశోభనవ్వులపువ్వుల
ఊరువీథివీథిపొంగుకడలి!
చల్లనిబతుకమ్మసాగనంపెడుదాక!
కాకతీయకీర్తిఘననివాళి!
41*
స్వాగతమ్ముబాటసారులకునగర-
దోవదోవనబిల్చుతోరణాలు
గుర్తుగామిగిలినగుళ్ళుగోపురాలు!
కాకతీయకీర్తిఘననివాళి!
42*
కోటపేటజూడగొప్పనిర్మాణముల్
రక్షణకవచాలురాకపోక-
సాగుచుండెవివిధసంతలుసేవకై!
కాకతీయకీర్తిఘననివాళి!
43*
సఖ్యభావవృద్ధి-సౌఖ్యమేబ్రతుకంత
తెలుగుచేతనంబుదెల్పుకళలు!
భయముమాన్పిబ్రోచుభద్రకాళీమాత!
కాకతీయకీర్తిఘననివాళి!
44*
గోప్యమగుచువైరిగుర్తింపజాలని
భువిసొరంగమార్గముండెప్రభుల-
కోటనుండిగుడికిగొప్పనిర్మాణమై
కాకతీయకీర్తిఘననివాళి!
45*
పెనువసతులుగల్గుపేటనిర్మాణముల్
సాగెశాస్త్రపరిధిసంతలందు
నిల్వవస్తుతతులునిత్యావసరముగా!
కాకతీయకీర్తిఘననివాళి!
46*
దేశివస్తులువిదేశిబేపారముల్
విస్తరించెప్రభులవిజ్ఞతొప్ప-
భక్తిసంత-పిదపరక్తిసంతలుసాగె!
కాకతీయకీర్తిఘననివాళి!
47*
భూమిశోధజేసిభూకంపనష్టముల్
తట్టుకొనెడునిసుకదనరనింపి
నిపుణమతులచేత, నిర్మింపబడుతీరు!
కాకతీయకీర్తిఘననివాళి!
48*
కఠినశిలలుమలచికట్టడాలకుజేర్చి
ముదముగూర్చువెన్నముద్ధలట్లు
శిల్పములమలిచిచిత్తముల్దోచిరి!
కాకతీయకీర్తిఘననివాళి!
49*
నల్లరాతినునుపునవనీతమైవెలయ
ఎడములేకనతుకుధృఢమొనర్చి-
అబ్బురపరచుకడునద్భుతశిల్పాలు!
కాకతీయకీర్తిఘననివాళి!
50*
విశ్వదృష్టినబడె- వింతయ్యెరామప్ప
పేరుగాంచెకళకుప్రేరణొసగు-
గేముగాగవెలిగెగిన్నీసుపుటకెక్కె!
కాకతీయకీర్తిఘననివాళి!
51*
కళలుజిందువేయికంబాలమందిరం
కోట-లోస్వయంభుకోవెలందు
నాట్యమాడుశంభు! నాటికినేటికిన్
కాకతీయకీర్తిఘననివాళి!
52*
ఖ్యాతిగాంచెనేడుకాకతిసమ్మక్క-
సారలమ్మజాత్ర-జనులపాత్ర-
చాలనమ్మకంబుసంతృప్తిగనుయాత్ర!
కాకతీయకీర్తిఘననివాళి!
53*
జనులదేవతైనసమ్మక్కయేవీర
వనితయయ్యెరాజువచ్చిమ్రొక్కె
గొలుసుకట్టుచెర్లుగొప్పగానిర్మించె!
కాకతీయకీర్తిఘననివాళి!
54*
పరగదేవతలైరిపసుపుబండారుతో
బెల్లమయ్యెపసిడియెల్లరకును-
సకలమొసగుదివ్యసమ్మక్కసారక్క!
కాకతీయకీర్తిఘననివాళి!
55*
కలిగెపేరునోరుగల్లు-వరంగల్లు-
ఏకశిలనగరము-ఏకవీర-
వెలసె-రేణుకమ్మఎల్లమ్మగానిటన్
కాకతీయకీర్తిఘననివాళి!
56*
విశ్వశాంతిదూతవిఖ్యాతభారతి
పరమతసహనంబుప్రజలసొత్తు!
సెక్కులరుగప్రభుత-సేవప్రజాస్వామికం!
కాకతీయకీర్తిఘననివాళి!
57*
శాతవాహనదీప్తిసంధించెనెములాడ!
కాకతీయమోరుగల్లుకోట!
పేటనాగరికతప్రేరణగలుగగా!
కాకతీయకీర్తిఘననివాళి!
58*
పెక్కునియమగతులుహక్కుబాధ్యతవిధుల్
ప్రోదిచేసిమంచిప్రోత్సహించు
పథము-ప్రగతిరథముభారతదేశము!
కాకతీయకీర్తిఘననివాళి!
59*
దేశప్రజలుపరదేశిసంబంధాలు
భద్రమైనరీతిప్రభుతనీతి
ఘనతకొలదివచ్చెఘనతంత్రరాజ్యము!
కాకతీయకీర్తిఘననివాళి!
60*
కాలమనుసరించికదలుజీవనవృత్తి
చరితమార్పుతీర్పుసాక్ష్యముగను-
గడచెతరతరాలుగమ్యంబుమంచియే!
కాకతీయకీర్తిఘననివాళి!
61*
వచ్చిపోవునూత్నవత్సరంబులుజన-
చేతనంబుగూర్చు-సేమమొసగు
మరలనరువదేళ్ళమరవనివరముకై
కాకతీయకీర్తిఘననివాళి!
62*
పుడమిబుట్టుజీవిపూర్ణసుఖముగోరు
పొందుదాకదినముపొగులుచుండు-
కష్టపడుటకెవరుకాంక్షింతురీధరన్
కాకతీయకీర్తిఘననివాళి!
63*
భువిపరోపకారబుద్దిశుద్దియనక
పుడమినెట్లుగలుగుపుట్టగతులు!
కర్మఫలమువెంటకలుగునీజన్మము-
కాకతీయకీర్తిఘననివాళి!
64*
ఆరురుచులతోనుగాదిపచ్చడినూత్న
రుచినిబంచుబ్రతుకురూఢిపరచు-
కష్టసుఖములిట్లుకలిసిసంతృప్తిడున్
కాకతీయకీర్తిఘననివాళి!
65*
బట్టపొట్టక్రొత్తబాటజీవనకేళి
జాతకాలశ్రోతజాగృతొందు-
నిరుటికన్నకొంతనిబ్బరంబునుపొందు!
కాకతీయకీర్తిఘననివాళి!
66*
రూకరాకపోకరూఢిగాపంచాంగ
వచన-శ్రవణములను- వాస్తవంబు-
స్ఫురణగల్గుచుండుచూఛాయగాకొంత!
కాకతీయకీర్తిఘననివాళి!
67*
ప్రాప్తలేశతృప్తిబ్రతుకునసుఖశాంతి
స్వస్థతయునుగల్గజనులబ్రతుకు
తెరువుబట్టిశుభముదేల్చగాసంతృప్తి!
కాకతీయకీర్తిఘననివాళి!
68*
కోర్కెలెగయగూయుకోయిలాకమ్మగా
చిలుకపలుకుతేనెజిలుకుతెలుగు!
పిల్లజెల్లలాటలల్లరితోటలే!
కాకతీయకీర్తిఘననివాళి!
69*
ప్రజలసహజబ్రతుకుప్రతికూలపరచనీ
సానుకూలగతులసంబరాలు!
క్రొత్తపాతలు – సరిక్రొత్తవింతలుగూర్ప-
కాకతీయకీర్తిఘననివాళి!
70*
చరితజదివిభవితసరిదిద్ధుకోవలె
జాతకాలుముందుజాగ్రతొసగ-
వర్తమానమందువర్తింపమేలను-
కాకతీయకీర్తిఘననివాళి!
71*
విరులపండుగలను-తరుసిరిసంపదల్
స్వస్థతొసగుమదికిశాంతిగూర్చు
కూడుగుడ్డనీడగూర్చిదీవించగా!
కాకతీయకీర్తిఘననివాళి!
72*
సామరస్యభావసంపదేయభివృద్ధి
పల్లెపట్నమయ్యెప్రజలపనులు
విధిగమారెయంత్రనిధులభవిష్యత్తు!
కాకతీయకీర్తిఘననివాళి!
73*
నేలదడుపుచుండునెలమూడువానలు
పాడిపంటవృద్ధిప్రగతిదిశను
పచ్చదనపుప్రకృతిపచ్చనిబ్రతుకలు!
కాకతీయకీర్తిఘననివాళి!
74*
తనువుమొదటిదండ్రుధర్మసాధనలందు
దేహితనువునందుతేజరిల్లు!
మనసునిల్పిదేహిమార్గానజనమేలు!
కాకతీయకీర్తిఘననివాళి!
75*
అందరికిమేలుఆరోగ్యభాగ్యమే
జనులసుఖముశాంతిజగతిమేలు!
ఆత్మమేలుగాంచునాధ్యాత్మికమునందె!
కాకతీయకీర్తిఘననివాళి!
76*
భద్రకాళిగుడియుపద్మాక్షిదేవళం-
పేటవీధివీధిపెక్కుగుడులు-
కనులకింపునోరుగల్లుచౌరాస్తయున్
కాకతీయకీర్తిఘననివాళి!
77*
బొమ్మలున్నగుడియుపోచమ్మప్రాంతము
సంతలున్నవీధిసరుకునిధులు-
పేరుతోబజారుపెద్దబేపారముల్
కాకతీయకీర్తిఘననివాళి!
78*
విద్యవైద్యశాలవిఖ్యాతరైలువే
బస్సులాగుతలముపరగమూడు-
నగరములనుగల్పునయముభవిష్యత్తు!
కాకతీయకీర్తిఘననివాళి!
79*
ఓరుగల్లుహన్మకొండఖాజీపేట-
పల్లెలన్నిగలిసెపట్నవసతి!
కనులవిందుసేయుకళలుమున్నగరాల!
కాకతీయకీర్తిఘననివాళి!
80*
తీపిగుర్తుకాకతీయవర్షిటివిద్య-
సింగరేణిఘనులసిరులుజలము
గొలుసుకట్టుచెర్లుగోదారికాల్వలున్
కాకతీయకీర్తిఘననివాళి!
81*
కనులవిందుగుడులు, ఘనపురంరామప్ప
గొలుసుకట్టుచెఱువుగొప్పసేద్య
భూమిపాడిపంటభూరియుత్పత్తులే!
కాకతీయకీర్తిఘననివాళి!
82*
చుట్టుపట్టుమెట్టగుట్టగుడులు
లక్నవరపుజలము – లలితకళలు-
వాగువంతలెన్నొసాగుబాటుబ్రతుకు
కాకతీయకీర్తిఘననివాళి!
83*
కొట్టివేయచెట్టుకొల్లగాచిగురించు
నట్లులలితకళలునలరెనాడు
అన్నిరంగములనుఅభివృద్ధిలబ్ధిగా!
కాకతీయకీర్తిఘననివాళి!
84*
చెట్టుకొలదివానచుట్టుపరిసరాల-
తేమలేకమబ్బుతేలిపోవు
పరిసరాలశుద్ధిప్రకృతివికాసమై
కాకతీయకీర్తిఘననివాళి!
85*
చెట్టుబెంచిపూజజేసిమ్రొక్కినచోట
శ్రేష్ఠుననుసరింత్రుచేరిజనులు
గానశ్రేష్ఠలెపుడుగమనించిమెదలగా
కాకతీయకీర్తిఘననివాళి!
86*
చెట్టురక్షవేగచేపట్టుటేమేలు
రాలుగాయివిసరురాయి-పండ్లు-
రాల్చుచెట్టునీడ-రహదారిగొడుగగున్
కాకతీయకీర్తిఘననివాళి!
87*
చిలుకగూడుగట్టిపలుకరించగకోకి-
లమ్మకూతకొమ్మరెమ్మపూత-
కాతలిచ్చుపుణ్యకాణాచియేచెట్టు!
కాకతీయకీర్తిఘననివాళి!
88*
ఉన్నచోటసొరగముపకారమూపిరి
చెట్టుఘనచరిత్రచెప్పవశమె!
ప్రాణవాయువూదిప్రాణులబ్రతికించు!
కాకతీయకీర్తిఘననివాళి!
89*
నీరుపల్లమెఱుగునిజముదేవుడెఱుగు
సంతువలెనెపల్లెజనులుచెట్లు-
పెంచిఫలముబొందిమంచిగాజీవింత్రు!
కాకతీయకీర్తిఘననివాళి!
90*
దారులకిరుగడల-తరువులబారులు
ఓరుగల్లుశిల్పతోరణాలు
పట్న-పార్కులందుపరగదర్శింపగా!
కాకతీయకీర్తిఘననివాళి!
91*
రసములన్నిశిల్పరాగరంజితములయ్యె!
పులకరించుహృదయపుటల – శిల్ప
కావ్యరచనరాయికరిగించెముద్రగా
కాకతీయకీర్తిఘననివాళి!
92*
బాహ్యకుఢ్యశిల్పప్రతిమసందేశముల్
కామియగుచుమోక్షగామియగుట!
రక్తి-భక్తి-ముక్తిరాహ-ఆధ్యాత్మికం!
కాకతీయకీర్తిఘననివాళి!
93*
ఏనుగెక్కిసింహమెత్తినయాసరా
రాతిదూలశిల్పమూతశిలగ-
వరుససాగెకప్పుబరవుమోతయెజుమీ!
కాకతీయకీర్తిఘననివాళి!
94*
నందికనులచూపు-ననునినుజూచిన
చందముండుప్రక్కలందుజరుగ-
లెంకవేయలేచిదుంకునోయన్నట్లు-
కాకతీయకీర్తిఘననివాళి!
95*
సింహవక్త్రమందుచెలగుకందుకముండె!
చిద్రములనుసూదిజేర్చితీయ
సులభమగుటజూడచోద్యమౌకంబముల్
కాకతీయకీర్తిఘననివాళి!
96*
గతముగతమెభవితగలుమసింగారంపు
అనుభవంబుగల్గుననుసరింప
తాతగొప్పదనముతరతరాలస్ఫూర్తి!
కాకతీయకీర్తిఘననివాళి!
97*
చేయితిరుగునిపుణచేతనపనితనం
అద్భుతంబునేటియాంత్రికంపు-
విద్దెలేదుసహజసిద్ధమౌపరిశ్రమల్
కాకతీయకీర్తిఘననివాళి!
98*
ఆలయాంతరానదైవమలరు-బాహ్య
చెడునుజూడదెలియుభక్తిగెలుపు!
మానవాంతరంగమందిరమేగుడి!
కాకతీయకీర్తిఘననివాళి!
99*
విస్తరించెభరతవిఖ్యాతినిర్మిత-
కట్టడాలశిల్పకళలసరణి!.
ప్రేరణొసగెనాటిపేరిణినృత్యమై
కాకతీయకీర్తిఘననివాళి!
100*
తెలుగులలితకళలదీప్తికోటయుపేట
గుడితటాకవసతికూర్మిపేర్మి-
తెలుపుసాంప్రదాయతెలఁగాణసంస్కృతీ
కాకతీయకీర్తిఘననివాళి!
101*(సంపూర్ణం)
శతకకృతియుసాగెచంద్రునికొకనూలు-
పోగుచందముగను-పూనివ్రాయ-
నాటిఓరుగల్లు-నేటివరంగల్లు !
కాకతీయకీర్తిఘననివాళి!
102*
కరిమినగరుఓరుగల్లుజిల్లాలకు-
వావిలాలహద్దుగావిశేష
మొప్పవిద్యరెంటముడివడిలభియించె!
కాకతీయకీర్తిఘననివాళి!
103*
శకటచక్రబాటశంభుస్వయంభువై
వెడల- రాజుప్రజలవేడ్కసాగ
నీదుగుడియుకోటనిర్మింపబడెనంద్రు!
కాకతీయకీర్తిఘననివాళి!
104*
సత్యనారనతిరుణహరికవిగశతక
మర్పణంబుగొనియుమనుగడెసగ-
స్వస్థతొసగుకోటశంభు! స్వయంభువు!
కాకతీయకీర్తిఘననివాళి!
105*
ఆవుదేహమందునావరించినపాలు
పొదుగులోలభించు – పుణ్యగరిమ
కోటగుడియెభక్తితోటయైభాసించె!
కాకతీయకీర్తిఘననివాళి!
106*
అవనియంతటజలమావరించియునుండు
పొసగబావినీరుపొందుపగిది-
గుడినిదైవప్రేమగుర్తింపవీలగున్.
కాకతీయకీర్తిఘననివాళి!
107*
నేటివృద్ధిజూడపోటిగాదిదినాటి
దీవెనలకుఫలమెదేవునాజ్ఞ-
ఆత్మతారకంబె – అవనిశాశ్వతవృద్ధి!
కాకతీయకీర్తిఘననివాళి!
108*
శుభముకోటపేటశోభించుకళలకు!
శుభముశతక-పఠిత-శ్రోతలకును!
శుభముభారతీయసూక్తిముక్తాళికిన్-
కాకతీయకీర్తిఘననివాళి!