top of page
గీతామననం-3
(తే.గీ.)

1*

శ్రీశ శ్రీ కృష్ణ పరబ్రహ్మ! విశ్వరూప!

సర్వ భూత నిలయ! సుఖశాంతి ధాత!

నీల జీమూత సన్నిభ! నీరజాక్ష!

వేద వేదాంత వేద్యశ్రీ వేంకటేశ!

2*

నందనందన! పండరినాథ! విఠల!

నలువ! హరిహర! ఓంకారనాదబ్రహ్మ!

పరమ పిత! పురుషోత్తమ! బ్రహ్మ జనక!

సూర్య చంద్ర నయన! విశ్వ సూత్రధారి!

3*

విశ్వ విఖ్యాత గురుదేవ! విజయ మిత్ర!

లోపరహిత! గోపాల! గోలోక నిలయ!

భక్త వత్సల! గోవింద! భవవినాశ!

కృష్ణ! గోపికా వల్లభ! కృపను బ్రోవు!

4*

రామ!భృగురామ!బలరామ!రామచంద్ర!

రామ!రిపుభీమ!గుణధామ!రఘుకులేంద్ర!

క్రూర దానవ సంహార! కుబ్జ వరద!

పార్థ సారథి! పరమాత్మ! పాండు రంగ!

5*

అస్త్ర సన్యాసమును జేసి అర్జునుండు-

రణము దాకను వచ్చి నైరాశ్యమొందె!

హృదయ దౌర్భల్యమునకు నౌషదము గాగ

గీత బోధించితివి మ్రొక్కె క్రీడి భక్తి!

6*

సరస సాహితీ సంపన్న! సకలవినుత!

రుద్ర వందిత! శౌరి! శ్రీ రుక్మిణీశ!

ఆశ్రిత భక్తజనావన! అజరభూజ!

మాధవా! మధుసూదన! మధురనాథ!

7*

మూర్తి త్రయరూప! భవబంధ ముక్తి ధాత!

ధరణి క్రతువీవె!ఘృతమీవె! కర్మయోగి!

హవన క్రియనీవె! ఓంకార కవనమీవె!

సర్వమును నీవె! శ్రీ కృష్ణ సార్వభౌమ!

8*

సకల జీవజాతుల సృష్టి సాగులీల!

భూతహితవు విధిగ సాగె! బుద్ధి జీవి-

చేతనాంశ సంభూతుడై శ్రేష్ఠుడగును-

నాల్గు పురుషార్థముల ధర్మ నడక సాగు!

9*

ధర్మ ధాతయై నిష్కామ కర్మసాగి-

కర్మ ఫరసమర్పణ ముక్తి కర్హుడయ్యి-

నిత్య నిష్ఠ గీతాభ్యాస నియతి సాగి-

ధర్మ సహిత జీవన యాత్ర ధన్యుడగును!

10*

నీతి సంకల్పమే గీత నీతి సుధలు-

గురియుటెల్లనీ సద్భక్తి గూర్చు విధమె!

సకల శాస్త్ర సారాంశముల్ సాధు మునుల-

సకల యోగాలు నేకమై సమత వెలసె!

11*

సమతయోగంబు సాధించు సజ్జనుండు

ప్రీతి పాత్రుడు నీకని గీతదెలుపు

విధివి నీవె! వేదత్రయము వెలుగు నీవె!

విద్యలకురాజ విద్యగా వెడలె గీత!

12*

జగతి నాటక కర్తవు జనుల నెల్ల

పాత్రలుగ జేసి యాడించు బ్రతుకు లాట

ధర్మమును నిల్పు నజ్ఙాత దర్శకుడవు!

కర్మ ఫలమును సమకూర్చు కర్షకుడవు!

13*

తల్లి దండ్రి గురువు నీవె తరతరాల

నాశ్రయము నాత్మ బీజముత్పత్తి నీవె!

అమృత-మృత్యు-వౌషదమీవె! యవని మిత్ర-

భావమును నీవె! యవినాశి బ్రహ్మ నీవె!

14*

హృదయ దౌర్భల్యమునుమాన్పు సుధయె గీత

కర్మ యోగమ్ము నిష్కామ కర్మ ఫలము

సౌష్ఠవాభివృద్ధిని గూర్చు చర్యలన్ని

నీదు లీలస్థితినిగాంచు నిశ్చయముగ!

15*

దేహమును మించు నింద్రియ తేజసిద్ధి

దీని కన్న నిష్ఠయు తళుకులీను చుండు-

నిష్ఠ కన్న బుద్ధియుమిన్న నింకదెలియ-

బుద్ధి కన్నకామముమిన్న పుడమి మిన్న!

16*

వెలయు జన్మాంతరములును దెలియు నీకె!

యుగయుగాల నరులవెంట నుద్భవించి

ధర్మ సంస్థాపనకు బూను దారి నీది!

పెక్కు జన్మలు కొనసాగె లెక్కలేక!

17*

దివ్య జన్మ కర్మ సుకృత దీప్తి గీత!

గీతయనతాగి, యైత్యాగ రీతి దెలుపు!

మరల మరల దెల్పునుగీత-మాతవలెను!

సంయమన రీతులును సాగు సహన దృష్టి!

18*

జగతి సర్వము నీశక్తి ప్రగతి నింగి

నిండు వాయువు, సర్వత్ర నుండు నట్లు

విశ్వ సకలమ్ములో నీవె విస్తరించి-

యుండు కతన ప్రకృతి గల్గె నిండు తనము!

19*

నరులు భువిజీవ శ్రేష్ఠులు నాత్మదెలియ-

వారు నరశ్రేష్ఠులై యోగ వారధిగను-

నిండు బ్రతుకు నర్పించగా నీదు కరుణ-

సాగు భక్తి మార్గము ముక్తి సాధనముగ!

20*

సకల భక్తుల నజ్ఞాత శక్తి వీవె!

పతియు గతినీవె-చేతన ప్రకృతి నీవె!

ప్రాణి విజ్ఞాన కళలందు పటిమ నీవె!

నీవె సర్వోపగతుడవు-నీదె సృష్టి!

21*

సూర్య కిరణాలె నీకంటి చూపుగాగ

జలము గైకొని వర్షించు జలదరూప!

జీవితాన స్వతంత్రించి జీవనంబు

చేసి నప్పుడె నీశక్తి దెలియ గలదు!

22*

విశ్వరూప! నీ గీతయు విషదపరచు-

నీతి నరుడు సాకుగజేసి నీదునోట-

వెడలె సకలజీవులముక్తి వేదికయ్యె!

దిక్కులను మ్రోగె జాతిని దిద్ధి తీర్చె!

23*

గుప్తములకెల్ల గుప్తమై గురుతరోక్తి!

నరుడు గీతబోధను విని నయముబొందె!

నరుడు నరజాతి ప్రతినిధి గురుడ వీవు!

బ్రహ్మ నిర్వాణమును గలుగు బాట సాగె!

24*

భారతుడు నెపముగ జాతి భాగ్య గరిమ-

సాంఖ్య కర్మయోగాదుల సాగె బోధ!

పుణ్య ఫలము సాధింపగా పూలబాట-

భక్తి ముక్తుల సాధించు బ్రతుకు తోట!

25*

జన్మ రహిత ముక్తి నరజన్మ ఫలము

దాని సాధించు యోగముల్ దరచి యందు

భక్తి యోగమ్ము సుళువైన బాటగాన

కర్మ పరిపక్వతను ముక్తి గలుగు బాట!

26*

కష్ట సాధ్యము బ్రతుకులీ కలియుగాన

వివిధ యోగాలు సాగించు వీలు పడదు!

చేతగాకున్న శరణన్న చేదు కొనగ

నీవు దెల్పిన గీతయే నీరజాక్ష!

27*

వివిధ జన్మల పుణ్యంబు వెంటరాగ

కలుగు జన్మంబు నరజాతి కలల పంట

భరతమాత బిడ్డగ బుట్టి బ్రహ్మ విద్య-

నిత్య పారాయణము, ముక్తి నిచ్చు వరము!

28*

విశ్వ రూప గీతా దృశ్య విషయ బోధ~

భారతీయ సాహితి వెల్గు బ్రహ్మ విద్య!

భోగి – రోగిగాకను కర్మ యోగి గాగ-

పావనాత్మ జీవనవృత్త పటిమ గలుగు!

29*

ఆత్మ పరమాత్మ సంగమ స్థానముక్తి-

జేరు యోగంబు కొనసాగు తీరమునకు

సాగు సౌలభ్యమయ్యెను స్వామి- గీత,

బ్రహ్మ నిర్వాణమునుగూర్చు పరిధి వెలసె!

30*

విశ్వ నరులు గీతార్థంబు విశ్వసించి~

విశ్వరూపు లీలలు దెల్పు విషయ చర్ఛ!

విశ్వ కౌటుంబ భావనల్ విస్తరింప~

విధుల నిస్వార్థ కర్మయు విస్తరించె!

31*

గీత గుప్తమై ప్రసరించు నీతిబోధ

తెలియగోరిన వారికే దెలుప దగిన-

విద్యగా విభునాజ్ఞయే విశ్వమందు-

శ్రద్ధ విశ్వరూపము నెత్తు పద్ధతయ్యె!

32*

గుప్త శాస్త్రమై వివరించు గొప్పబోధ!

అడుగ కున్న దెల్పిన గాదునవగతమ్ము

మంచియనగ వినగ రూపు గాంచు దాని-

నిత్య మననంబు నాచరణీయమగును!

33*

శాంతి నిస్వార్థ బుణ్యాది సౌధమగును

శాంతి నిష్కామ కర్మలో సత్ఫలంబు

విశ్వసించు వారికి శాంతి, విశ్వశాంతి-

విశ్వరూపమెత్తగవీలు-విధిగ సాగి!

34*

తరతరాల శాంతియె నీతి సౌరభంబు

నరనరాల జీర్ణించిన-నాత్మ వెలయు

నిత్య పారాయణాత్మక నిధిగ గీత

యవని దెల్యగ ప్రశ్నింప నరుని వంతు!

35*

సకల వేదసారము బాష సరళ కృతము

భావసౌందర్య సుస్ఫష్ట భగవదోక్తి!

పరమ గుప్తము సద్యోగ పథము గీత!

దోష దృష్టియు లేకను దెల్య గోరవలయు!

36*

శ్రావ్యమై యర్థమభ్యాస గ్రాహ్యమగుచు

భారతుడు వినునెపమున భరత జాతి

శ్రద్ధగానాలకించెను-స్వామిబోధ!

విధము విశ్వ పరివ్యాప్త విద్య యయ్యె!

37*

యోగ దీప్తిగా భువి కర్మయోగమందు

సాంఖ్యమును జేర్చి దెల్పగా సమతయయ్యె

జనులకందె-శాస్త్రరాజము స్వామి కరుణ

పఠన-పాఠమై సులభార్థ పటిమ వెలసె!

38*

ఆశయమతి గంభీరము-అభ్యసింప

నాత్మ పరమాత్మ నూహింప నరుల చేష్ట

చిత్రమున శిల్పరూపంబు చెలగు నట్లు-

గీత సదవగాహనబొందు రీతి సాగు!

39*

దీక్ష ప్రత్యక్ష సాక్షి పరీక్ష నరుడు

గుప్త తత్వార్థ బోధన గుర్తెఱుంగ

గీత ధర్మ సంస్థాపన కీలకంబు-

విస్మయముబాపి విధి జూపు విషయమయ్యె!

40*

బ్రతికి నన్నాళ్ళు నాత్మీయ భావ గరిమ-

మనసు దోచగా నిర్భీతి మనెడు విద్య-

సదుపదేశమై నరునాత్మ శాంతి గూర్చె!

క్రీడి ప్రతినిధిగా జాతి కీర్తి గాంచె!

41*

జననమరణ భీతియుదొల్గి, జగతి నరులు

విధిగ విషయంబు మదినిల్పు విధముగీత!

గ్రంధరాజమై గాయత్రి సామ్యమయ్యె!

42*

దోవ దెల్యనియాత్రలో దోషదృష్టి

గమ్యమును జేరగా తారతమ్య గతులు

నాత్మ బాధించు నప్పుడు నయము గీత-

దైవ శరణాగతిని బొందు దోవజూపు!

43*

తాను నాత్మగా భావించి తరతరాల

తర్కమాపి, నాప్తియుబాసి-తరలిపోక

తృప్తి గల్గించు లేశమే ప్రాప్తసుఖము~

గాక సకలమ్మును మది వికలమగును!

44*

తరతరాల బోధనల-గీతార్థ మహిమ

ప్రాప్త లేశంబునకు తృప్తి పడుట నేర్పు!

నోర్పు గలిగించు నాపేక్ష నొందనీక!

సాగు – సంసృతీ, సంస్కృతి, జనులమేలు!

45*

సహజరూప స్వభావాల సాగు మాయ-

మనసు నిల్వ నీయదు మంచి మార్గమందు

జనులు పాటింపదగిన యాచరణ గీత!

సాగి పోవుచు శరణన్న చాలమేలు!

46*

మాయయే స్వార్థ గుణమగు మనసు నిల్పి

మాయ పొరజీల్చుటకు పరమాత్మ బోధ

నరుని శ్రేష్ఠత్వమును నిల్పి నయము గూర్ప-

గీతగావించె పరమాత్మ క్రీడి బొగడ!

47*

సకల జన్మల నాత్మ సంచార సరణి

సకల జీవరూపుల పుణ్య సంచితంబు

గాగ-నరు జన్మయుగలుగు, గమనగతుల-

జన్మ శ్రేష్ఠత్వమునుబొందు, ధన్యుడగును!

48*

మాయ మర్మంబు నజ్ఞత మాయికతయు-

సహజ రూపస్వభావముల్ స్వార్థ పూర్ణ

నరుల కెట్లు శ్రేష్ఠత్వంబు-నలరు? మార్పు-

తీర్పుగా గీత బోధించు తీరుతెన్ను!

49*

దివ్య గీతార్థ మననంబు ధీయుతంబు!

మధురమున్ గ్రోల తత్ఫల మమరపథము-

గీత విజ్ఞాన వాహిని చేత జనులు-

చేతనాంశ జీవనముక్తి జెందు చుంద్రు!

50*

ఆత్మలో పరమాత్మయు నలరు దీప్తి-

వెలయు గురుత్రయ సిద్ధాంత వేదికలను

భక్తి బాటయే సుళువైన ముక్తి యనుచు-

శిష్టవైశిష్ట్యమద్వైత శ్రీలుదెలుపు!

51*

ఆత్మ పరమాత్మ జేరుటే యగును ముక్తి

ఆత్మ పరమాత్మ వీడుటేయగును జన్మ-

పుణ్య సంపాదనకె జన్మ పునరు జన్మ!

ధర్మ సంస్థాపనే యవతార లీల!

52*

జన్మ పుణ్యంబు భవబంధ జాలమూడ్చి

మూలకములంతరించగా ముక్తి జేర్చు-

బాటయే యోగమగు భక్తి బాట, జగతి

నాత్మ పరమాత్మ లద్వైత నటన సాగు!

53*

ఆంగ్ల రిలిజియో పదమూల సంగతిదియె!

రిలిజియను పేర కొనసాగు రీతి ముక్తి!

ఆత్మ పరమాత్మ వీడియు నవని బుట్టి-

జన్మ రహితమై పరమాత్మ జేరు మరల!

54*

పిల్లలిది విన్న చెడి పోరు! ఇల్లు వదలి

సాధు సన్యాసులను గల్సి సాగిపోరు!

రిత్త మాటలపోహలనుత్తరించ

మేటి గీతార్థ నిధి మది మేలు గూర్చు!

55*

జరగు శుభకార్యముల గీత జయము, శుభము-

గూర్చు, సంసారి సన్యాసి కోర్కె దీర్చు-

సాంప్రదాయ సంస్కృతి గీత చల్ల-వెన్న!

జన్మ రహితముక్తిని జూపు జనుల ప్రాపు!

56*

యోధ నరుడు గీతను దెల్సి యోగ్యుడయ్యె!

వివిధ ధర్మమర్మములెర్గి వీరుడయ్యె!

మిగత బ్రతుకు గృహస్తుడై మిగుల కీర్తి

సమత యోగాన సాధించె సవ్య సాచి!

57*

గీత సంస్కృతి-సంసృతి చేతనంబు

సాంప్రదాయ సదాచార సామ్య గతుల-

గీత పాలమీగడ బోలు – ప్రీతి గ్రోల-

జన్మ రహిత ముక్తిని గూర్చు-జాగృతంబు!

58*

పరమ పద ప్రాప్తియోగుల పథమువెంట-

సాంఖ్య కర్మంబులును గల్సి సాగె-గీత-

జయము నుద్యోగ సద్యోగ జనుల యింట-

సహన సంపద సమకూర్చు సాధకంబు!

59*

కర్మయోగి గీతార్థంబు కరణి నరుడు-

సాగె, కర్మఫలత్యాగ, సామ్య దృష్టి!

పుణ్య సంసారి-సన్యాసి పూని నడువ-

ధర్మకర్మల-నిష్కామ కర్మ వెలసె!

60*

కర్మ యోగాన విశ్వాత్మ గాంచి, తాని-

మిత్తమాత్రుడై విధిసాగి, మితిగ కర్మ-

నీశ్వరార్పణ జేయగా మిగత దంత-

తనదె-భారమనెను, తత్వ గురుడు!

61*

భక్తి నిష్కామ కర్మలో బ్రతుకుటన్న

ఫలమునాసక్తి వీడుటే-భగవదాజ్ఞ

ఫలసమర్పణ గావింప, ప్రతి ఫలంబు

తానొసంగుదుననె గీత తత్వగురుడు!

62*

అన్ని ఆశ్రమంబుల సాంఖ్యమనుసరింప

కష్ట సాధ్యము, నిష్కామ కర్మ మేలు!

తత్ఫలాసక్తి లేకను – తరలు జన్మ-

గడప నేకాత్మభావన గలుగుచుండు!

63*

శత్రు శత్రుత్వమును జంపి-మిత్రు జేసి-

సాగు చిత్తచికిత్సగా స్వామి గీత!

నరుల సదసద్వివేక చాతుర్య మొసగి

ఫలనిరాసక్తిగను భక్తి బాట నడుపు!

64*

నరుడు నరజాతి ప్రతినిధి – అడుగు ప్రశ్న-

విశ్వ నరు ప్రశ్న, గీతార్థ విషయ బోధ-

సంశయములెల్ల దీరగా సాగు వేళ-

విశ్వ రూప సందర్శన – విశ్వ గీత!

65*

భువి చరాచర జీవ తత్పూర్వ పరము-

జనుల కిహపర సుఖవాంఛ జనిత మైన-

కర్మ త్రిగుణ బంధమును త్రికరణ శుద్ధి!

సాగె గీత సర్వస్వము స్వామి మహిమ!

66*

వేద వేదాంత తత్వంబు వెలయు, నుపని-

షత్తు సారాంశమే గీత సాగు బోధ!

భువి పురాణ సాహితి నెల్ల బూని పుణ్య-

దధిని జిల్కె, గీతయె వెన్న విధము దేలె!

67*

భారతీయ వేదిక వేద భావ జలధి-

గీత తరియించు నావయై క్రీడి వెంట-

కృష్ణుడే వ్యాస మునిగ సుకృతము నెల్ల

విశ్వ తత్వ తార్కాణమై వెలసె గీత!

68*

వేద చరితేతిహాసాల వెలయు కవన-

కృతులు పౌరాణికోక్తులు కృష్ణ విభుని-

చేత వెన్న ముద్ధగ దోచె చేత నాంశ!

ప్రకృతి గీతమై గీతార్థ పటిమ గాంచె!

69*

చపల మది పంచేంద్రియ సడుల నణచి

ఆత్మ పరమాత్మ బోధన -నలరుచుండ-

తనువు తానుగాదని దెల్సి, తానునాత్మ-

గాను, దెల్సిన పరమాత్మ గమ్యమెఱుగు!

70*

త్యాగ దీప్తి యంతరశత్రు దాడి నాపి-

కోర్కె మాని, శోకములేని గొప్ప తనము-

దోష దృష్టి లేకను, సాగుదోవ-గీత!

జన్మ రహితముక్తిని బొంజాడదు

దెలుపు!

71*

ఆత్మ తత్వంబు వడవోసి యలరు గురుల-

చేరి సామాన్యులును వారి చేష్టలెంచి-

యనుకరింతురు, శ్రేష్ఠత్వమదియటంచు-

జాగరూకులై శ్రేష్ఠులు జనుట మేలు!

72*

పంకమును వీడి గుడిజేరు పంకజంబు-

దేహ తతివీడి యాత్మయు దేవు నరసి-

లీనమగుచుండు మరుజన్మ లేని గతుల-

గడ్డి పూవై గుడినిజేర గలుగు భక్తి!

73*

మనసు బుద్ధి నర్పించియు మనెడు జన్మ

పుణ్య నిధి పూర్ణమై యాత్మ బొందు ముక్తి!

యిహపు సంసార సుఖశాంతినిచ్చు విభుడె!

భక్తి నావలో పయనించ బలముగూర్చు!

74*

మొదట కీడెంచి సాగిన మోదమిచ్చు

పిదప మేలెంచు దారుల ప్రీతి గూర్చు-

మంచిదలపెట్టి సేవించు మనుగడంత-

గలుగునుపకార పుణ్యంబు గట్టి మేలు!

75*

ప్రకృతి జఢచేతనంబుల బడిన జనుల

బ్రతుకు బండి చక్రాలుగా పరుగులెత్తి

మంచి చెడ్డల ఫలితంబు-మరల జన్మ-

చిత్త శుద్ధిచే చేతన స్థితియు గలుగు!

76*

కాల మాసన్నమగుదాక కలుగు జన్మ-

ఎన్ని జన్మల కైనను ఎంచుకొన్న-

పుణ్యమార్గమే వెన్నంటు పుడమినాత్మ-

భక్తియోగాదులనుబొందు బ్రహ్మముదము!

77*

క్షితిని పాంచభౌతిక సృష్టి, జీవరాశి-

యాత్మ నెలకొన్న దైవమజ్ఞాత శక్తి-

ప్రకృతి దండ దారము బోలు పరమ పురుషు-

లీల, పంచభూతాత్మక కేళి సాగు!

78*

మంచి బుద్ధియు సత్కర్మ మాటశుద్ధి-

త్రికరణ, త్రిగుణ బంధమ్ము తీరు తెన్ను

గీత వివరించు, నాత్మీయ చేతనంబు!

వెలయు దారుల, భక్తి – వివేకముండు!

79*

జన్మ-జన్మల పుణ్యంబు జతపడంగ

పుడమి పుణ్యాత్ములింటిలో బుట్టునాత్మ!

నదిగ సాగుచు దరులొర్సి నాణ్య మగుచు-

సాగి పరమాత్మ కడలిలో సంగమించు!

80*

పుణ్య సంచితార్థము జన్మ పూర్వకముగ

నరుని జన్మ గల్గుట చేత నరుడె శ్రేష్ఠ-

జీవియయ్యె, పూరించు-పూజించు పుణ్య-

ఫలము రాజు పేదల కొక్క బాట గలుగు!

91*ఆ. వె.

విశ్వ దేశ దేశ విషయాను వాదాల

నచ్చు పడిన ధర్మమైచ్ఛికముల-

పటిమ వెలయు ధర్మ పర్యాయ పదమేది-

ధర్మ మనియె వ్రాయ దగునటండ్రు!

92*ఆ. వె.

సాధు వృత్తి భక్తి సామ్రాజ్య జీవనమ్

భరత జాతి కుగ్గు పాల బువ్వ!

ప్రాణహితవె నీతి ప్రాధాన్యతను దెల్పు-

శాశ్వత సుఖ శాంతి జాతి వాంఛ!

93*గీ.

అనువు విభజించి పరమాణువరయ నేర్చి

గురుడు బోధించె తాత్విక గురియు కుదర!

ఆత్మ విభజించి పరమాత్మ నరయు దోవ-

గీత బోధించె కర్మయోగీశ్వరుండు!

94*గీ

గుర్త గల్గిన గరుబోధ గుప్తగీత!

తత్వ పరిశోధనలు సాగె తరతరాల!

విజ్ఞ జీనోము గనిపెట్టె విశ్వ నరుడు!

ముగ్ధ భక్తి నోమున జన్మ ముక్తి గాంచె!

95*గీ

నేటి విద్య లో నేపేజి విశ్వశాంతి?

విషయ సూచిలో నుపకార విస్మరింపె!

విద్య కీడెంచి మేలెంచు విధులు మేలు!

చేత గాని కోతల నీతి నేతిబీర!

96*ఆ.వె.

ధర్మ పక్షపాతి ధర్మజు గెలిపించె-

కలినిరోధమైన కట్టుబాటు-

చర్యలందు ధర్మ ఛత్రంబు బట్టెను-

ధర్మ ధేను సాగె ధరణి యందు!

97*ఆ.వె.

సత్యగతులె నీతి సంస్కృతికాయువుల్

సాగు సత్యవ్రతము సంసృతిగను-

సత్య ధృవమె ద్రిప్పు సకల భువనములన్

సత్యమందె దైవ సదనముండు!

98*ఆ.వె.

స్వేచ్ఛజీవనంబు సేమంబు స్వాతంత్ర్య-

భావనంబు జన్మ పావనంబు!

భక్తుడై స్వతంత్ర భావ సాధన చేత-

బ్రహ్మ తత్వమొందు భారతుండు!

99*ఆ.వె.

సామ్య భావ సుగమ సంసార జీవనమ్

భరత జాతి సొమ్ము పౌరనీతి-

ప్రాణి హితవు గూర్చు పావన ధర్మము

వెన్నుని దయ గీత వెన్నెలయ్యె!

100*ఆ. వె.

దివ్వె క్రింద మరొక దివ్వె వెల్గింపగా-

నీడ దొలుగు నట్లు పీడనంబు-

దొలగె, గత హృదయ దుర్భలత్వము మాన్పె-

బలము గూర్ప పుణ్య భావ మెసగె!

101*ఆ.వె.

స్వేచ్ఛ బ్రతుకు బాట సేమమై రాణించు

ప్రజల గన్న తల్లి భరత మాత!

పారతంత్ర బాట – భక్తి సాగదు కదా!

స్వేచ్ఛలేక నాత్మ దెలియరాదు!

102*అ.వె.

భారతుండె గీత ప్రశ్నోత్తరాలకు

కారకుండు ధర్మ కార్మికుండు!

కదలె యుద్ధమందు కారణమాత్రుడై

జగతి నాట క్రియ ప్రగతి గీత!

103*తే.గీ.

భక్తి నికషలో నిర్ధేశ్య పటిమ కొలది

సుకృతము బెంచు శ్రీకృష్ణ సూక్తి – ముక్తి

గీత భూతద్ధమున తత్వరీతి గాంచ

లోక కళ్యాణకారకాలోచనంబె!

104*తే.గీ.

పుణ్య విత్తంబు వెచ్చించి పౌనపున్య-

ఫలము పరమాత్మ కర్పించి భక్తి సాగు!

పారలౌకిక దృష్టియే భక్తి యిహపు-

సౌఖ్యమాడంబరముగాదు జగతి చరిత!

105*తే. గీ.

ద్వంద్వముల శాంతి చేనోర్చు దారి గీత

మంచి త్రికరణ శుద్ధిగా నెంచు క్రియల-

గురుల సమమనస్కతగీత గుర్తు జేయు!

మానసిక సంతులనగతి మనుట మేలు!

106*తే. గీ.

కర్మ ఫలము దైవార్పణ గాగ బ్రతికి

నిత్య నిష్కామ కర్మ పునీత మగుచు-

దైవ శరణాగతిని జన్మ ధన్య మట్లు

సాగవలయు సద్భావన శాంతి గతులు!

107*తే. గీ.

పూని దేవుని ప్రేమకై దైవంబు నవతరించు

దైవ సంకల్పమే జన్మ దారి బ్రతుకు

వేడ్క పరమాత్మ కోసమే వెతుకు లాట!

108*ఆ.వె.

శుభము నరులకెల్ల సుఖము శాంతి!

శుభము భక్తి, ముక్తి గూర్చు విధుల-

శుభము గల్గు శతక శ్రోత ధాతలకెల్ల-

శుభము గీత పఠన శుభప్రదంబు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page