
గీతామననం-1
(ఆ.వె.)
1*
శ్రీకరంబు తత్వ జిజ్ఞాస, భారత-
వారసత్వ నిధిగ వచ్చె నాత్మ-
తత్వబోధ క్రీడి తనివిదీర్చగ, నేడు
గీత విశ్వశాంతి గీతమయ్యె!
2*
యుగయుగాల ధర్మముద్ధరింపగ-పర
బ్రహ్మమవతరించు, ప్రజలబ్రోవ!
వివిధరూపులందు, విహరించు తగురీతి
విస్తరింపజేయు, విశ్వశాంతి!
3*
ద్వాపరాంతమందు ధర్మంబు నిల్పగా
నరుల యందె హరియు నవతరించె!
విశ్వనరుల భక్తి విశ్వాస పాత్రత
సూచిజేసె గీత సూత్రధారి!
4*
జీవులందునేక జీవాత్మ దర్శింప
బ్రతుకుభ్రమను బాపు బ్రహ్మవిద్య-
తరతరాల దివ్య తత్వంబు దీపించె!
వివిధ రూపులొందె విష్ణు మాయ!
5*
అవని ధర్మధేను నడచు నాలుగు పాద-
ములను బూని, వేయు ముందుకడుగు!
వేచియున్న కలియు, వెంటాడుచున్ హాని-
జేయ బూను వేటు వేయబూను!
6*
ధర్మ రక్షకుండు దశరూపధారియై
దునిమి నట్టి మూక, దురిత కలిని-
యాశ్రయించి బుట్టి యాపేక్ష వీడక-
ధర్మ భ్రష్టులైరి, ధరణియందు!
7*
కర్మ భూమిని సమధర్మంబు స్థాపింప
కృపను బూని పుట్టె కృష్ణ మూర్తి!
నరుడు పాండవేయ నరునిగా జన్మించె-
నుర్వి రాజ నీతి నుద్ధరించె!
8*
నరుడు క్రీడియయ్యె-నారాయణుడు కృష్ణ
మూర్తియయ్యె! పుడమి మునుల వైరి
సహస్ర కవచుడు ధర జన్మించె కవచాన
కర్ణుడనగ జేరె కౌరవులను!
9*
వాసవుండు పుత్ర వాత్సల్యమునుబొందె
కపట యాచకునిగ కవచకుండ-
లములు, ప్రతిగ శక్తి లభియించె ఫలమేమి?
శాపగ్రస్తుడగచు, సమసిపోయె!
10*
అంగరాజు దుష్ట సాంగత్యమునబడి-
కౌరవులను జేరు కారణమున-
విడక పూర్వ వైర విషయవాసన కలి-
మాయలోన బడియె, మరచె విధిని!
11*
కర్ణు నమ్మి మూర్ఖ కౌరవాళియు జెడె
కడకు రాజరాజు కథయు ముగిసె!
నరుని కొసగె జయము, నారాయణుడు ధర్మ-
పథముజూపె గీత ప్రవచనాల!
12*
బాల కృష్ణ లీల లాలించె వ్రేపల్లె-
యువక కృష్ణ లీల లుర్వి రక్ష!
రాయభారమేగె రాజనీతిని దేల్చె-
సూత్రధారి ధర్మ సూక్ష్మ బోధ!
13*
కర్మ యోగి ధర్మ కర్మ నిష్కామమై-
పరగ రాజనీతి పదును బెట్టె!
ధర్మ పక్షపాతి ధర్మతనయు జైత్ర
యాత్ర నరునిమిత్త మాత్రజేసె!
14*
క్షాత్ర ధర్మ విధులు సాక్షాత్కరించగా
ద్వంద్వములకతీత దారి సాగు-
విధము దెలిసె, నరుడు విధినిర్వహణ,
తన- పనిగ తెలిసె, ప్రభుని ప్రస్తుతించె!
15*
దేశ కాలపాత్ర, దేల్చి ధర్మము సాగు-
భూతహితవె ధర్మ భూమికగను-
దుష్టశిక్ష జేయబూని నరుని నిల్పె!
నరుని ప్రశ్న గీత హరిజవాబు!
16*
వెలసె భారతాన వేదాంత గీతోక్తి.
సాగె సకల యోగశాస్త్ర చర్ఛ!
సాంఖ్య కర్మ సాధన నిష్కామ
కర్మ యుద్ధ కర్మ ధర్మమయ్యె!
17*
స్వామి సాంఖ్య కర్మ సామ్యంబు సమతగా
గీత బోధ శ్రవణ పేయమయ్యె!
సర్వ జనుల సుఖమె సారాంశమై సమా-
ధానమొంది, నరుడు ధనువు దాల్చె!
18*
పరమ పురుషుగీత, బ్రహ్మగీతను బోల్చి-
పరమ దాసుడయ్యె ఫల్గణుండు!
వేయగల్గె ప్రశ్న – వేదవేద్యు జవాబు
కరతలామలకము కనగ, వినగ!
19*
పాత్ర ధారి యాత్ర ప్రవహించు నదియాత్మ-
పొంది గీతబోధ బొందు ముదము!
సూత్రధారి కడలి దూరి నురగలెత్తు-
జన్మరహిత ముక్తి సంభవించు!
20*
పాత్రధారి జన్మ పరిమళ పూమాల –
దారమట్లు-సూత్రధారి చేతి –
కంటియుండు-నాటకంబు నరసి ప్రశ్నింపగా
గర్తుగలుగు జగతి గురుడు దెలుప!
21*
సమయమొచ్చు దాక సాగదు సద్బోధ
నయము నెఱిగి దెలియ నర్హతగును,
నరుడు సంశయంబు నరసి ప్రశ్నింపగా
గుర్తు గలుగు జగతి గురుడు దెలుప!
22*
బంధు మాత్ర హనన భావ శోకము పొంగె-
పోరు నష్టమెంచి పొగిలె యెడద!
ప్రబల శత్రువు రక్త బంధువే హతవిధీ!
యనుచు కూలబడియె అర్జునుండు!
23*
ఆలమేల ననుచు-నాయుధంబులు వీడె!
పాలిపగయు మదిని పట్టు సడలె!
జాలి గలిగె, జరుగు సమర సైనిక హింస-
సైపకను నరుడు విషాదమొందె!
24*
గీత దాటకున్న కీర్తిగాంచుట యెట్లు?
బంధు నాశనమ్ము పాడిగాదు!
మిత్ర జనులు మడియ మిగుల సంతాపమే-
పిదప నేమి మిగులు ప్రీతి గూర్ప!
25*
రాజ్య కాంక్ష చేత రక్తబంధము తెగున్
తెగని యాశకొలది తెగువమీరు-
పోరుబాటను గెలుపోటమి కొన సాగు!
దెబ్బవేయ నెదురు దెబ్బదగులు!
26*
క్షాత్రవిధులు – శత్రునాశన క్రియల్
పొడుపు కథలె -సుంత బోధపడవు
నిశ్చయంబె-గెలుపు నిచ్ఛయు దీరునె?
శూరు జంప ధర్మ సూక్ష్మ మగునె?
27*
అరయ నరుడు తానె, నారాయణుడు తానె!
జీవులన్నిటాత్మ దీప్తి తానె!
పాత్ర ధారి నటన – సూత్రధారి ఘటన
కదలు జగతి నాటకంబు తనదె?
28*
నీతి మరచి జచ్ఛు నిజముగా తాజచ్చు
చచ్చు వారలెవరు చంపుదెవరి?
చావు పుట్టుకలను సాగు నాత్మయు దేహ-
యాత్ర గతి-నిమిత్తమాత్ర మగును!
29*
తత్వమెరుగకున్న-తాత్కాలిక ప్రమోద-
మొందు భువివిషాద మొందు పిదప
తరచి-శాశ్వతాత్మ తానుగాదని యెంచి
భారరహితమొంద బ్రహ్మముదము!
30*
కుటిల రాజనీతి – కూకటి వ్రేళ్ళతో
బెరికివేయకున్న-పెరిగి విశ్వ-
మెల్ల నిండు ప్రజల మేలెంచు దిక్కేది?
దుష్ట దూరమెపుడు దురిత హరము!
31*
నీతి దప్పి నాడె నిర్జీవులైరని
చెప్పి విభుడు, నరుని చేత దునుము-
మార్గమందు తానె మార్గదర్శిగ నిల్చె!
నరుడు తానిమిత్త మాత్రుడయ్యె!
32*
నీచ కలిని జేరి నీతిమాలిన దుష్ట-
కౌరవాధములను కదనమందు-
గూల్చు నెపముగాక యుద్ధావసరమేమి?
నరుడు తానిమిత్త మాత్రుడయ్యె!
33*
శూర నరుడు ధర్మ సూక్ష్మంబు గమనించె
యెడద దుర్బలత్వముడిగి పోవ
విధినెఱింగి దుష్ట వీరుల దునుమాడె!
శిష్ట రక్ష దుష్ట శిక్ష సాగె!
34*
దురభిమాన ధనుడు ధుర్యోధనుడు చెడె
పార్థ సారథి దయ బడయ లేక
తుచ్ఛ భోగియయ్యె నిచ్ఛ తృప్తియు లేక
కలిప్రభావ మాయ గతినశించె!
35*
పాప భీతి లేని పాడు కౌరవ మూక
పుణ్యమనక-చెదలు పుట్టి చచ్చు
సరణి కీర్తి గనని – జన్మపునర్జన్మ-
దయయు లేకసాగు ధరణి యందు!
36*
దయయు గల్గ ధర్మ దారి నిష్కంటకమ్
దాని చేత వెలయు దాన-తపము!
సుకృత ధర్మ కర్మ సూత్రమై భాసించు-
ధాత పుడమి జన్మ ధన్యుడగును!
37*
కరుణ గల్గుమదిని గల్గును నవనీత
ప్రేమ సఖ్య భక్తి ప్రేరణంబు!
దాని చేత గల్గు దాన తపోఫలమ్
పుణ్యమెసగ జన్మ ధన్యమగును!
38*
సహనమున్నగాని సాగదు సమభావ
పూర్ణమైన బ్రతుకు పుడమి నిష్ఠ!
పూని పొంద వలయు పుట్టెడు సహనంబు!
సహన శీలు జన్మ సార్థకంబు!
39*
కర్మ వీరమున్న ధర్మవీరము సాగు-
దాన వీరుడవని ధాత యగును!
కలియుగాన తపసి కన్నధాతయె మేలు-
సుకృత నిధిని ముక్తి సులభ మగును!
40*
స్వేచ్ఛ లేక భక్తి చేయూత గల్గదు-
శ్రద్ధ లేక బుద్ధి సద్దుమణుగు-
సత్ఫలంబు బొంద సాగుస్వతంత్రుడే
భక్తు డగును బంధ ముక్తుడగును!
41*
శోకసంద్రమందు సోలి పోవగ జేయు
తీరనట్టి కోర్కె తీరు వేరు!
కోరజాచు, కాటుకోర్వగల్గిన వాడె-
తేగ గుణము వెంట యోగి యగును!
42*
పేరు కీర్తి కాంక్ష పెర్గి నిస్వార్థమై-
భూతహితవుజేయ బూనుకొన్న-
క్రియల సత్ఫలంబు-కీర్తించు లోకంబు!
యోగియగును నరుడె యోధుడగును!
43*
మంచి పనుల పుణ్యమతిశయించగచెడ్డ
పనుల యందు గలుగు పాపవృద్ధి!
పూను గతుల నాత్మ పురుషోత్తముని జేర్చు!
చందములకు పుణ్యమింధనంబు!
44*
మంచి చెడు వివేక మెంచిసాగుట మేలు
దాని నెఱుగ గీత దారి బుద్ధి-
మననగతుల యోగమార్గమభ్యాసమై-
వెలయు బాట భక్తి వెంట ముక్తి!
45*
మంచి చెడుల విభజించు వివేకంబు
గలిగినపుడె బ్రతుకు గడప వీలు!
గాకమందబుద్ధి గనలేదు తత్వంబు-
విద్యలేనివాడు వింతజీవి!
46*
నమ్మకంబు వెంట నడచునీ విశ్వంబు
ధనముగల్గు మంచితనము గలుగు!
దానతపము చేత తరియింపగా పుణ్య-
చేవ గలుగు దీన సేవలందు!
47*
స్వార్థ రహిత భక్తి సాగును త్యాగమే
యింధనముగ, భూతహితవు పుణ్య-
ధనముగూర్చు, జన్మదారిమారియు ముక్తి-
తీరమందు నాత్మ తిష్టవేయు!
48*
సకల జన్మల నరజన్మమే తుదిజన్మ-
పూని పుణ్య ఫలము గూర్చ వీలు-
పుణ్యసంచితార్థ పూర్ణమే మరుజన్మ-
రహితమగును, ముక్తి సహితమగును!
49*
నిష్ట గలుగ పుణ్యనిష్కామ కర్మంబు,
సాగు సత్ఫలంబు సాధ్యమగును!
ఫలమునిచ్చి, దైవపదముజేర్చుటె ముక్తి
దాని గూర్చు భక్తి దారులన్ని!
50*
భక్త దారులందు బంధముక్తి సుళువు
వత్సవెంట గోవు వలెను, విభుడు-
వచ్చు నవ విధాల వసుధ భక్తులు సాగు-
దారి గమ్యమగుచు దనరు ముక్తి!
51*
భక్తి యోగదారి పయనించు వారికి
నభయమిచ్చి మదిని యాత్మ నిల్పి
ఆత్మలోన నంతరాత్మ సర్వాత్మగా
దర్శనంబునిచ్చి దరిని జేర్చు!
52*
స్వామిదలచి, యాత్మ సంస్కారమొందగా
తను విదేహుడగుచు తత్వమెఱుగ
నంత కర్మ ఫలము నర్పింప మోక్షము
శరణు వేడ గూర్చు సద్గతులను!
53*
అన్ని జీవులందు నలరు చైతన్యము
ప్రకృతి చేతనాంశ పరిమళంబు!
దానియందె దైవ ధామంబు నెలకొను-
బాహరంతరాల బరగు వెలుగు!
54*
పుడమి నరుని జన్మ పుణ్య కర్మఫలమె
తామరాకు – నీరు నంటనట్లు
పుడమి బ్రతుక మేలు-పుణ్యాత్ము తుది జన్మ-
చేరువగుచు దైవ సేవసాగు!
56*
విశ్వ రూపు జూచి వివిధ జీవులనాత్మ-
విస్తరించు తీరు విశ్వసించి-
కరి పిపీలికంబు గాంచు దీప్తినియాత్మ!
సామ్య మెఱుగు తత్వసాధకుండు!
57*
విశ్వరూపు దినము వీక్షింప గీతార్థ
సుధను గ్రోల వచ్చు, సూరిజనుల-
చర్ఛలందు గీత నర్చింప పరమాత్మ-
విశ్వరూపు దినము విస్తరించు!
58*
విశ్వరూపు మిగుల విజ్ఞాన శోభితమ్
జాగరూకతొందు జన్మ వరము!
పరమ పదము దాక పరమాత్మ చేయూత-
దారి గీత బోధ దనరు చుండు!
59*
విశ్వరూపు భక్తి విశ్వాసదాయకమ్
మూడుమూర్తులపని ముడియు బడగ-
ప్రకృతి మూడు విధుల పరిశీలనము జేయ-
బాహిరంతరాల బరగు దీప్తి!
60*
శౌరి గీత సకల శాస్త్ర సాంకేతికమ్
విశ్వరూపు గీత విషయ బోధ-
సూక్తులందు బుద్ధి సూక్ష్మత గలిగించు-
తర్కవాద పటిమ తాత్వికంబు!
61*
విశ్వజీవనమ్ము విడమర్చి శోధింప
బుద్ధి జీవి కర్మ వృద్ధి-
పుణ్యమార్గమొకటె పురుషోత్తముని జేర్చు!
మిగత వన్ని జన్మ మిడుకు కథలె!
62*
తాత్వికులకు లేవు తరతమ బేధాలు
సిద్ధ యోగవరుల హద్ధు లందు
మంచి చెడుల మధ్య నెంచి చూడగ గీత
హద్ధు నాత్మ తత్వసిద్ధి గూర్చు!
63*
కదలు గ్రహగతులను-గాచు నయస్కాంత
మైత్రి బంధమగును, మైత్రి భక్తి-
తరతరాల భక్తి తరచు మారుచునుండు!
సఖ్య భక్తి గలుగ చాలమేలు!
64*
త్రికరణాల శుద్ధి తిమిర హరము, నాత్మ-
శుద్ధిని పరమాత్మ సిద్ధి గలుగు!
పుణ్య కర్మఫలమె పూర్వరంగము, జన్మ-
రహితమైన యాత్మ సహిత ముక్తి!
65*
తనదు కర్మ ఫలము తగురీతి నర్పింప-
బ్రతుకు దెరువు దైవ భారమగును!
పదిల పరచునాత్మ పది వేషముల సామి-
కృపయు గల్గ జన్మ సఫలమగును!
66*
భక్తి నికష కోర్చు ప్రజలు – ప్రభువు గల్గ
సహన దీక్ష వెంట సాగు బ్రతుకు-
నికషకోర్వకున్న నీవె దిక్కని మ్రొక్క-
కరుణజూపి బలము గలుగ జోయు!
67*
భారమంత హరియె భరియించు సాత్విక-
కర్మ ఫలము గొనుచు కడకు జేర్చు!
తత్వమెఱుగ నాత్మతాపంబు చల్లార్చు-
సేద దీర్చి దరికి చేదుకొనును!
68*
నిష్ఠతోడ సాగు నిష్కామ కర్మమే
కర్మ యోగిమెచ్చు, కర్మ ఫలము-
నిచ్చు, భక్తజనుల మెచ్చి-సకలదుష్ట-
భీతిమాన్పి బ్రతుకు ప్రీతి గూర్చు!
69*
మానవాళి సేవ మాధవ సేవగా-
సాగు వారికెల్ల సహన శక్తి-
ముగ్దభక్తి కైన ముక్తి ప్రసాదించు-
శరణటన్న హరియు కరుణ బ్రోచు!
70*
సాగె,భారతాన జాతి సమైక్యత-
వెలసె, దేశ వేదికయ్యె!
దివ్య తత్వదీప్తి, జీవ సమైక్యత-
పాఠమయ్యె! గీత పథము సాగె!
71*
ప్రాత క్రొత్తవిద్య ప్రామాణికత నెంచు
వేళ గీత నూత్న వేదికగుచు
సంయమనము వెంట సాగె, సనాతన
సూత్ర గతియు నిత్య నూత్నమయ్యె!
72*
పుడమి నరుడు బొందె బుద్ధి వివేకము
గీత మ్రోగె ప్రకృతి చేతనాంశ
దానివెంట భక్తి తరియింపదారియై
చూపు విధుల విశ్వ రూపు దోచె!
73*
పుణ్య పూనిక నరు బుద్ధి మేల్కొన జేయ
మేలు గీడు లెంచు మేధ వెంట
యోగములను సాగు యోగ్యత సాధింప
స్వామి భక్తి దైవ సన్నిదయ్యె!
74*
శ్రేష్ఠ వస్తుచయము చేతనాంశము గల్గ
పరమపురుషు నిలయ ప్రాభవమున
పుణ్య మార్గ సూచి పురుషోత్తముని జేర్చు!
నావయయ్యె భక్తి నవ విధాల!
75*
పుణ్యధనము గూర్చు పుస్తకమే గీత
వివిధ వేద గతుల విధిగ దూచి-
సులభ భక్తి నావ సూచిగా దాటించు
తారకముగ సాగె తరతరాలు!
76*
కర్మ యోగి జీవ కారుణ్య మూర్తియై
హింస మాన్ప దుష్ట శిక్ష బూనె
దాని చేత భూత దయను సాధించెను
దీన జనుల రక్ష దీక్ష గాగ!
77*
వివిధ యోగగతుల విజ్ఞాన సూక్తులన్
జ్ఞానయజ్ఞ సంవిధానమగుచు-
పుడమి వెలసె గీత పుణ్యాత్ములనుజేసి
జనుల బ్రోవ ధర్మ జయము గూర్చి!
78*
సకల యుపనిశత్తు సారాంశమే గీత
దుగ్ధమయ్యె గీత దోగ్ధ హరియె!
క్రీడి వత్సయట్లు గీతామృతము గ్రోలె!
తృప్తి పిదప సుగతి ప్రాప్తి గలిగె!
79*
ఋక్కులేకమై కురుక్షేత్రమున గీత-
మారు మ్రోగె నరుడు మరల నడిగె!
జగతి బ్రహ్మ నాథ ప్రగతి ప్రతిధ్వనుల్
ధర్మ యుద్ధ ధర్మ ధారనూదె!
80*
తిరిగి రాని జన్మ తీరమే సద్గతీ!
జగతి నాత్మ పుణ్య ప్రగతి జన్మ!
బంధ ముక్తి కొఱకె భక్తి యోగాదులున్
సాధనములుగాగ సాగు చుండు!
81*
భారమంత మోయు, బ్రతుకు నర్పింపగా
ముగ్ధ భక్తి మెచ్చి ముక్తి నొసగు!
అవని విజ్ఞ భక్తి ఆత్మ నివేదన
చేయ సద్గతులను చెందజేయు!
82*
నరుని భారమంత నారాయణుడు మోసె
కఱ్ఱియు తనవంతు కాలు కదిపె
సంఘ సంస్కరణకు సంగ్రామమే నాటి
సామి కార్యమయ్యె, సాగె నరుడు!
83*
ఈసు గలుగ కుండ, భీతిని విడనాడి
భూతహితవు జేయు బుద్ధిమంతు-
చేరదీసి గీత చేతనంబును గూర్చు
చెంతజేర్చు కొనియు చింతమాన్పు!
84*
తలము,తనువు,తలపు,తదితరాల మమత
వీడి చిత్తశుద్ధి వెలయు వాడు
మనన శీలుడగుచు మాయవీడియు సాగు
సమత యోగి మెచ్చి సకలమిచ్చు!
85*
వివిధ యోగ గతుల విధి చేతగాకున్న
శరణు జొచ్చు నరుడు సకలమొందు!
భక్తుడైన సుళువుబాట నిస్వార్థమై
సాగుయోగిమెచ్చు సకలమిచ్చు!
86*
రుషులు గనని విశ్వరూప సందర్శనమ్
నరుని భాగ్య గరిమ-నాత్మ నమ్మి-
కొలుచు భక్తి వెంట, దొలగించు మోహంబు
సమత గీత బోధ సంస్కరించు!
87*
గీత పాఠమై విద్యార్థి క్రీడి గాగ
గురువు తానుగా పరతత్వ గుట్టు దెలిపె!
విషయ సంగ్రహ సారాంశ విషయ బోధ
ప్రశ్న తగు సమాధానముల్ ప్రభుడొసంగె!
88*
రూఢియయ్యె గీతను విశ్వ రూపురేఖ
సాక్షి భారతుండుగ గీత సార బోధ
విశ్వమాయ దెల్పియు దాటు, విధులు సాగె-
కర్మ పరిపక్వతను ముక్తి గనెడు తీరు!
89*
యోగశాస్త్రమయ్యె సకల యోగములను
దెల్పి – సాంఖ్య కర్మంబుల దేల్చి చూపు
విధము నరజాతి భక్తి వివేక బుద్ధి
కర్మ పరిపక్వతను ముక్తి గనెడు తీరు!
90*
స్వామి తత్వబోధ సారసంగ్రహగీత
వెడలె-యోగశాస్త్ర వేదికయ్యె!
చిత్తమాయ పొరలు జీల్చగా నభ్యాస
యోగ విద్య బ్రహ్మ మోదమొసగె!
91*
సహజ కర్మలు వీడుట సరియు గాదు
పొగను గూడియుండెడు నగ్ని బోలు నట్లు
దోషయుక్త కర్మంబును దోచు, సుఖము-
నుర్వి, నైష్కర్మ సమభావ యుక్తమగును!
92*
నరుడు దేహాభిమానంబు నసలులేక
నాత్మ భావన సాగుట, నాథునాజ్ఞ-
యనుచు సంసారి సాంఖ్యంబునందు!
కర్మ యోగాన తగును నిష్కామ నిరతి!
93*
అర్జునా!నాకృపనుబొందు నార్త జనులు
పాహి-శరణన్న, నవినాశి పదము జేర్చి
దయను పాలింతు సద్భక్తి దనరెనేని
అన్ని నేనగుచు జనుల నాదుకొందు!
94*
గుప్తములకెల్ల గీతోక్తి గుప్త మైన-
హితవుగా దెల్పి యుంటిని ధృతినొసంగి
తెల్పినది బ్రహ్మ విద్యగా దెలియు మింక
శరణు బొందుము! భక్తి విశ్వాస నిష్ఠ!
95*
(సందర్భ వాక్కు)
ధృతియు లభియించె నాత్మీయ స్ఫురణ గలిగె
నీకృపకు పాత్రుడ నైతి నీదుయాజ్ఞ
విధిగ పాలింతునని దీక్ష నిలిచి నట్టి
సవ్య సాచిని వర్ణించె సంజయుండు!
96*
(సంజయ ఉవాచ)
వ్యాసమునిదయ సంవాద వాస్తవంబు-
వింటి, వినిపించి తరియించు విధమెఱింగి-
కృష్ణయోగీశు శరణంటి! కృపనుగంటి!
నరుని కుపదేశముగ గీత ధరను వెలసె!
97*
వింటినిరహస్యమగు బ్రహ్మ విద్య గీత
విహితమాశ్చర్య సద్యోగ విధులబోధ
మనము మాటికి పులకించు మనన గతుల!
ఓమహారాజ! మాటాడ నోపజాల!
98*
సంతసంబున మునిగెడు సంజయుండ
సంబ్రమాశ్చర్యమును వీడి-సంభవించు
భవిత నిర్ణయంబేమి? బలుకు మనగ!
నిశ్చయంబుగ ధృతరాష్ట్రు నిచ్ఛ దెలిపె!
99*
ఎచట కర్మ యోగి నరుడు, చేత వెలయు
కార్ముకంబుదాల్చి నిల్చునో? కలుగు నచట!
సిరి, విభూతియు, ధృఢనీతి, విజయసిద్ధి!
నింపుమీరగ నిదియె నానిశ్చయంబు!
100*
విశ్వ సర్వోపగతుడైన విష్ణు దలచి-
జగతి వర్తించి, నరజాతి జన్మ గడచి-
పుణ్య సంచితార్థము గూర్చు పూర్ణ భక్తి-
యాత్మ విశ్వాత్మ జేరెడు యాత్ర బ్రతుకు!
101*
విశ్వ విఖ్యాత గురుబోధ గీత, మాన-
వీయ విజ్ఞాన శోధన విషయగతుల-
విశ్వహితము భాసించె, విశ్వ నరుల-
సేవ, నారాయణుని జేర్చు నావయయ్యె!
102*
గీత వెడలె దైవోక్తమై క్రీడి బ్రోచె!
భువి పరోపకారమె జన్మ పుణ్యఫలము,
గాగ, మంచి బుణ్యాది గా సాగు, సమత-
మానవత సౌధమై గీత మాత వెలసె!
103*
ప్రాణి తాను స్వతంత్రించి బ్రతికినపుడె-
ఆత్మతత్వము, జ్ఞానమాధ్యాత్మికముగ-
దైవ జీవసంబంధపు దారి వెలయు!
బ్రతుకు సర్వోపగతుగాంచు ప్రతిభ జూపు!
104*
“అన్య భావంబు మదిలేక నన్నె నమ్మి-
అన్ని విధముల నాయందె యున్న వారి-
భక్తి నాసక్తి గల్గించు భాగ్యమనెడు”
గోప్యమిది దెల్సి-నిష్ఠగొనుట మేలు!
105*
ధర్మ జయశబ్ధముల మధ్య దనరు గీత
గ్రంధరాజి ప్రమాణిక గ్రంధమయయ్యె!
సదవగాహన నుంకించి – జంకి నీదు-
శతక గీతి నర్పించితి స్వామి శరణు!
106*
దాసు దోషంబు దండంబుతో సరియని
యంద్రు దాసాన దాసుడ యదుకులేశ!
దేశ కాల పాత్రంబుల వెలయు నూత్న-
జీవన సమస్యల నీదు చేవ గూర్చు!
107*
శుభము గోరియపోహలు ప్రబలనీక-
అందరికి వీలుగా దేశి చందగీతి-
అందరును గీత తాత్పర్య-మమృతధార-
గ్రోలగాజేయు గురులదే గొప్పమనసు!
*
నిత్య సత్యవ్రతము నీతి నియమ నిష్ఠ
పూర్ణ భక్తి ప్రపత్తుల పూర్వకముగ-
సాంప్రదాయ సదాచార సమ్మతంబు-
సహన సంస్కృతి-గను జన్మ సార్థకమ్ము!
108*
మంగళము మధుసూదన మంగళంబు!
మంగళము మాధవా పాండు రంగ విఠల!
మంగళము చక్రి! ఖగరాట్తురంగ! శౌరి!
మంగళము హరిహరనాథ మమ్ము బ్రోవు!