top of page
గీతామధురం-3
(తే.గీ.)

1*

శ్రీశ! శ్రీకరపాదరాజీవ! కృష్ణ!

వేణుగానలోల! ముకుంద! వేదవేద్య!

విశ్వ భర్త! గీతాచార్య! విశ్వరూప!

సకల యోగీశ్వరేశ్వరా! సాధు హృదయ!

2*

ధర్మ ధేనువు నాల్గు పాదమ్ములూని

సాగె యుగమున కొక్కొక్క చరణమెత్తె!

కడకు పాతిక ధర్మమే కలియుగంపు-

కాలమై ద్వాపరాంతాన గలిగె చర్ఛ!

3*

నాల్గు పాదాల మూడింట నడుచు విధులు

త్రేతమున సాగె భువి ధర్మధేను గెంతె!

రెండిట ద్వాపరంబున పాండవేయ-

కథ కలిప్రవేశపు తొలి కాలమనగ!

4*

ఆరుగురు శత్రువులు మది నాక్రమింప

పతనమగు నీతి, పీడన పనుల దూరు

దోష దూషిత జీవన దోవ మలిపి-

ప్రకృతి యుక్త కర్మవిశుద్ధి ప్రగతి గీత!

5*

ప్రాణి పరతంత్రమున భక్తి బరగ లేదు-

పటిమజూప స్వతంత్ర్యమే బ్రతుకు దారి!

వెల్గు భక్తి విశ్వాసము గల్గు! నాత్మ-

రూప గోచర సృష్టి సర్వోపగతుడు!

6*

మంచి-చెడు యుద్ధ మాగదు, మరల మరల-

తెగక నెడతెరపియులేక తెగువ మీరి

నాడు నేడు రేపటికడ నడచు-ధర్మ

గతియు నొకపాలు-జీవన గమనమందు!

7*

మంచి పాలమీగడ గాగ మానవతయు

సాంప్రదాయ సదాచార సంపదగును

పుడమి భారతీయుల పూర్వ పుణ్య ఫలము!

సహన సంపన్నమై మత సహన మెసగు!

8*

శాంతి బాటలో స్వాతంత్ర్య శ్రమఫలంబు

నందరికి జెందు నిస్వార్థ చందమొప్పు-

భక్తి భావ సమైక్యతా బాట నడుప-

కర్మ ఫలము నైవేద్యమై కలుగు తృప్తి!

9*

భారతీయ ప్రాభవమెల్ల పరులచేత-

శిథిలమైపోయె~వేదాంత నిధియె మిగిలె!

చదువు సంస్కారమే దక్కె – పదవి, నిష్ఠ-

సహన సంపన్నమై దేశ శాంతి వెలిగె!

10*

సమ్మతము గూర్చు పరమత సహనమిచ్చు

నమ్మకము గీత పారాయణాత్మకముగ

జన్మ జన్మల నేకాత్మ జాగృతంబు!

ధర్మ పాలన-పోషణ దారి గీత!

11*

భీష్మ పర్వ హృదయపుట విష్ణుగీత

నుపనిషత్తు సారాంశమై యుర్విమ్రోగె!

తత్వసారమాధ్యాత్మిక సాధనముల-

నిహపర సుఖము-తుదముక్తి నిశ్చయంబు!

12*

నీరు కాల్వ సాగును నది నీరధులను

సంగమించి యావిరి మబ్బు నింగికెగిరి-

కురియునట్లు దీవుల నాత్మ దూరు జన్మ-

జన్మ గుమ్ము తుదజేరు సద్గతికిని!

13*

కలుగుప్రాత క్రొత్తల మేటికలయికలను

సంసృతి జ్ఞాన భారతి శాస్త్ర చర్ఛ-

సగుణ నిర్గుణోపాసనల్, సాగు జాతి

సౌష్ఠవం సమదృష్టి-సమత సత్ఫలంబు!

14*

దాస దాసాన దాసత్వ దారి సేవ-

వైష్ణవాదర్శ సిద్ధాంత వైనములను

జీవ శరణాగతి యె దోచు దివ్య గీత!

భక్తి నావ చుక్కానియై భద్రతొసగు!

15*

అసురి-రాక్షసీ-మోహిని యనెడు ప్రకృతి-

గుణములుభయత్ర, వైరులై గుప్తగతుల-

బాహిరాంతర ఘర్షణ బాట వేయు!

వాని నెట్టగా గీతార్థము వాణి మేలు!

16*

రూఢియయ్యెను-విశ్వాత్ము విశ్వరూపు!

పాడియయ్యె-నిస్వార్థమై భక్తి సాగు-

వివిధ నిష్కామ కర్మల విశ్వశాంతి-

దాని సాధింపు నాత్మీయ దారి గీత!

17*

ఆత్మ పరమాత్మ సంగమస్థానమైన-

ముక్తి తీరము-రేవుగా భక్తినావ-

నావికుడు పరమాత్మ యే నయ జయంబు

కన్ను గట్టిజూపెడు గీత కాంతి లేఖ!

18*

మననమొనరింప గీతయే మంత్రమగును

గానమొనరింప గీతయే ఘనత గాంచు

మధుర మధురాధిపతి భక్తి మార్గ గతియె-

భక్త జనులకు సులభము ముక్తి పథము!

19*

భక్తి – ముక్తిని సాధించు శక్తి గీత-

ఆత్మ పరమాత్మ వృత్త కేంద్రమ్ము గీత-

బ్రతుకు నైతిక విలువల ప్రగతి గీత-

సత్య మార్గమహింసయే స్వామి గీత!!!

20*

హితవు నాత్మ సంస్కార సాహితియె గీత-

తర్క వారాల గీతదే తగు జవాబు!

సాగు ప్రశ్నోత్తరములందు సమత గూర్చు!

భక్తి యోగాన సమకూర్చు బ్రహ్మముదము!

21*

సుకృత కర్మ ఫలత్యాగ సూచి గీత!

పాపకర్ము శరణుగోర ప్రాపు గీత!

తత్వ సార సదాచార త్రాసు గీత!

దయను గలిగించి దరిజేర్చు దారి గీత!

22*

జీవి జీవినాత్మనుగాంచు దివ్య తత్వ-

సారగతి గుట్టు తెల్లమై సాగు గీత!

ముక్తి, బ్రహ్మ నిర్వాణ పదోక్తి సూక్తి

జన్మ రాహిత్యమును గూర్చు శక్తి గీత!

23*

ధర్మ ధాతల నిష్కామ కర్మ పలము

దాన వీరుల నిస్వార్థ దారి వరము

త్రి కరణవిశుద్ధి త్రిగుణాల తీరుతెన్ను!

తేట తెల్లమైన బ్రతుకు దెరువు గీత!

24*

రాజ ధర్మ పీఠము మెచ్చు రాజనీతి

వివిధ యోగాల ఫలమును విడుచు రీతి

గుట్టుగా రాజు బంటును గోరుముక్తి

ప్రకృతి చేతనాంశను బొందు ప్రతిభ గీత!

25*

జన్మ రాహిత్య సుకృతాత్మ జతన గీత-

భక్తి నిర్ధేశ్య జీవన బాట గీత!

జాతి నేకత్వమునుగూర్చు శాంతి గీత!

విశ్వ కౌటుంబ సంక్షేమ విధియె గీత!

26*

సకల జన్మ సంచిత పుణ్య సత్ఫలంబు

సద్గతిని గూర్చు ననితెల్పు సద్గురుండు!

వివిధ తార్కాణముల గీత విధమె జూపు

గ్రంథ సూచి ప్రామాణిక కథన గతుల!

27*

సకల జీవుల నాత్మయు సాగు, జన్మ

సద్గతినిబొందు పుణ్యమే సత్ఫలముగ

తనువు-తలము-నాత్మయు జన్మ దరలు గతులు

జన్మ జన్మ యాత్రిక దారి సాగు నాత్మ!

28*

ధర్మయుక్తమౌ పురుషార్థ దారి గీత!

సకల శాస్త్ర సారము కర్మ సాక్షి సూక్తి

వివిధ యోగాల బేరీజు వేయు చర్ఛ-

భారతీయ జీవన సౌధ భాగ్య గరిమ!

29*

సాగు త్రిగుణ శుద్ధిని సాత్వికుండు

మిగత గుణ ప్రకోపమధిగమించి విధుల-

తగిన యోగసాధన ముక్తి దరలిపోవు

తరము గాకున్న-సద్భక్తి శరణు జొచ్చు!

30*

సత్య ధర్మాది పురుషార్థ సాధనముల

ధర్మ రక్షణ కవచంబు – దైవ భక్తి-

దేశ భక్తి బుణ్యాదిగా తేజరిల్లు!

వివిధ దేశ సమైక్యతే విశ్వశాంతి!

31*

దురిత భీతి గల్గిన బుద్ధి పుణ్యప్రీతి

దుష్టులకు దూరముండు నిర్ధిష్ట నీతి

శిష్టులకు సాధ్యమై జీవ శ్రేష్ఠ పదవి

బొందు, దురితాత్మ మరుజన్మ బొందు చుండు!

32*

దైవ గుణమున్న నరజాతి ధన్య మగును

తాను నాత్మగా భావించు తాత్వికుండు

దాన ధర్మ మార్గము సాగు ధార్మికుండు

వెదకుచుందురు పరమాత్మ వెలయు చోటు!

33*

త్యాగి గీత – గీతత్యాగి తారుమారు

చదువు శబ్ధాక్షరము తీరు శాస్త్ర బోధ

సాగె కర్మఫలంబు నాసక్తి వీడి-

సద్గతిని జెందుటకు మ్రోగె శ్రావ్య గీత!

34*

తోటి సాటి పోరాటమే పోటి బ్రతుకు

పుట్టు ప్రతి జీవి సుఖమునే పుడమి గోరు

తాను నాత్మగా నెఱిగిన తక్షణంబె-

పోటి మాని యా త్మీయత పొసగ నడుచు!

35*

మదినియంత్రించి యింద్రియాలధిగమించి

కోర్కె వీడి లౌకికమందు కొంత సాగి

బుద్ధి భక్తి వివేకమ్ము వృద్ధిగాగ

సతత సమదృష్టి సాగిన సత్ఫలంబు!

36*

మతము మానవతను బెంచి మమత గూర్చు

సమతగా మారి యాత్మీయ సద్గతొసగు-

ధర్మ విధులనాకర్శించు దైవ భక్తి!

నరుని-నారాయనాంశలో నలరజేయు!

37*

భక్తి పరలోక సంబంధ ప్రకరణంబు

విహిత కర్మల నిహమందు హితవు గూర్చు

నాత్మ తరియించు మార్గమై నరుడు-తత్వ-

గీత గానాధికములందు కీర్తి గాంచు!

38*

యుక్తి, భుక్తి-యిహలోక శక్తిగాగ

భక్తి, ముక్తికి పరలోక సూక్తి సూచి

భాగవతము సఖ్యతగూడ భక్తి యనగ-

భక్తి నవవిధంబుల సాగె పరమనిష్ఠ!

39*

భక్తి పరలోక చింతనబరగు నాత్మ

బ్రహ్మమెరిగిన, ముక్తిని బడయు దాక!

నియమ నిష్ఠ – నాణెము కటునిటును భక్తి

తనువు-మనసు శుద్ధిని సాగు దారి భక్తి

40*

భక్తి యోగాననుపకార బాట వెలయు

దానిచే దానధర్మంబు ధాత కీర్తి!

తపసి కన్న ధాతయె మిన్న ధరణి నేడు

వీరులకును గొప్పగు దాన వీరనరుడు!

41*

శత్రులార్గురణగ మది చపల మాగి

నిల్చు నేకాగ్ర చిత్తాన నిశ్చలంబు

నాత్మ పరమాత్మ దర్శించు నట్టి దారి

పట్టు వీడక నిర్వాణ బ్రహ్మమొందు!

42*

అంత్య కాలాన సాధకుడైన యోగి

యోగబ్రష్టుడైనను పుణ్యయోగ్యుడగుట

విజ్ఞ వంశోద్భవుడుగాగ విహిత జన్మ

పుణ్య సంచితార్థము వెంట పొందు ముక్తి!

43*

తపసి కన్న యోగియె జూడధగిన వాడు

కర్మ నిష్ఠులు-జ్ఞానులు గలుగు చోట

యోగి శ్రేష్ఠుడు – నీవును యోగివగుము!

నరుడ యనిదల్పె – హరిగీత నాడె – జగతి!

44*

సాంఖ్య కర్మాది యోగాల సాగు నియమ-

నిష్ఠ నిష్కామ కర్మయు హితవుగాగ

చేత గాకున్న శరణన్న చెందు ఫలము!

గీత కాలానుగుణమైన క్రియలు దెలిపె!

45*

కర్మ ఫలతేగమై కార్య కర్మ ఫలము

లోకమున మేలు – కర్మఫలోల్భనంబు

సాగు నిష్కామ కర్మగా జనుల సేవ

సాగు శరణాగతిని తాను సద్గతొందు!

46*

పుడమి గుణత్రయాత్మక జీవి పుట్టు గిట్టు

సత్వగుణ ప్రకోపము దాక సాగు జన్మ

తుచ్చ సుఖ సంపదలనాప్తి దుడిచి-భక్తి

యోగి, జన్మరహితముక్తి యోగ్యుడగును!

47*

ప్రకృతి పురుషులీ సృష్టికి పరమ గరులు

కరియు చీమయు సమదృష్టి గాంచినపుడె-

యోగి యొదిగి తాబేలులా సాగిపోవు

ప్రకృతి చేతనాంశను గను-ప్రతిభబొందు!

48*

నరుడు జీవశ్రేష్ఠుడు తానె నయము నెఱిగి

ధర్మయుక్తమౌ పురుషార్థ దారిసాగు

తానె యజమాని – బంటు గా తలపు గొనును!

నీదు కరుణాకటాక్షమై నిజమెఱుంగ!

49*

బ్రహ్మ నిర్ణయమగు తిండి బ్రతుకు దెరువు

వివిధ జీవరాశుల – బ్రహ్మ విధులనెంచి

తిండి తిప్పలు సాగిన తీరు మేలు!

ద్రవ్య దాన్యోల్భనములేని దారులందు!

50*

త్రిగుణముల సత్వగుణ తిండి తీరు వేరు

యోగ సాధనకనుకూల యోగ్యముగను

రాజసమునందు వీర విహారి తిండి

రీతి-తామసాహారివి రిత్త రుచులు!

51*

విధుల వివరించు గీతార్థ విషయ చర్ఛ

విశ్వ సించు సమైక్యత విశ్వ శాంతి

సాంప్రదాయ మీగడ వెన్న సాహితి తగ-

వెలయు ముందు తరాలకు వేడ్క గూర్చు!

52*

ఆత్మ నెఱిగి జీవన భ్రాంతి నధిగమించి

తన్మయత్వంబుచే బ్రహ్మ తత్వమెఱిగి

గీత శోధింప సద్యోగ కీలకంబు-

గాంచి కైవళ్య ప్రాప్తికై కదలునాత్మ!

53*

పుణ్య కర్మ ఫలము చేత పుణ్యు లింట-

పుణ్య జన్మయై నరజన్మ పుడమి గలుగు!

చివరి మజిలి భారతభూమి చిద్విలాసు-

భక్తి జన్మరాహిత్యమై ముక్తి గూర్చు!

54*

బ్రతుకు తోటలో స్వాతంత్ర్య భావగీతి

పిన్న పెద్ధల- సంప్రీతి ప్రేరకంబు!

భక్తి కోటలో స్వాతంత్ర్య భావ మాత్మ-

వేద వేద్యుని దరిజేర్చు వేడ్క సాగు!

55*

దివ్య హరిగీత – హరగీత దేవి గీత-

వేదవేదాంతముపనిషద్వేత్త లెఱుగు-

గుప్త తత్వార్థ వివరణ గుర్తు ముక్తి

నరుని దేవునిగ మలచు నద్భుతంబు!

56*

గీత విద్యయై బుద్ధి వివేకమొసగు

గీత సుజ్ఞానమై బ్రహ్మ గీత దిద్ధు!

గీత విజ్ఞాన ఖని భక్తి కీర్తనముల

గీత సూక్తి ముక్తావళి చేతనంబు!

57*

చపలబుద్ధి నిశ్చలమగు చర్ఛ గీత-

విధుల సాధన కొనసాగు విధము గీత!

వివిధయోగములొకటైన విషయబోధ-

గీత ప్రామాణిక గ్రంథ కీర్తి గాంచె!

58*

అమృత ఝరి గీత నరులకు నమ్రతొసగు

సరళ బాష సూక్తుల తత్వ సాహితిగను

యోగ సాధన వివరించు యోగ్యుజేయు

తుదకు శరణన్న పరబ్రహ్మ ముదము గూర్చు!

59*

సుధలు గురియు గీతాబోధ సుప్రసన్న-

మూర్తియై స్ఫూర్తినిడు మూడు మూర్తులందు-

వెలయు విధులందు పరమార్థ వేదికగుచు-

వాసుదేవ సర్వస్వమై వసుధ వెలయు!

60*

నరుడు గీతనభ్యాసించి యలరెననగ

బ్రతుకు చిన్నపెద్ధల నీతి బలము గూర్చు!

యోధ నరు యోగి జేసియు మోదమొసగ-

భారతుండు గృహస్తుగా భాగ్యమొందె!

61*

దేహి దేహయాత్రయె పరదేశికైన-

దేశికైనను గీతోపదేశమొకటె!

గీత సందేశమున విశ్వ నీతి రీతి~

దైవ బాటలో జీవాత్మ వైనమొకటె!

62*

సకల దేశ విదేశీయ జనుల సాంప్ర-

దాయ సంసృతి దారిలో దనరు నాత్మ!

దోష రహిత దృష్టిని సాగు దోవ దోచు!

బేధ ఖేదంబు లేనట్టి వేద ఘోష!

63*

మాతగా గీత మాటల మార్థవంబు

శ్రావ్య సకలార్థ సాంద్ర ప్రశాంత శబ్ధ-

భావ గాంభీర్యమున సాగు బ్రహ్మ విద్య!

ప్రజలకును బంచె శ్రీ కృష్ణ ప్రభుడు కృపను!

64*

ధర్మ బద్ధుడై పురుషార్థి ధరణి బ్రతుకు

దాన ధర్మ కర్మ ఫలవిధానమగుచు-

ధాతగా కీర్తి గాంచును దైవసేవ!

పుణ్య ధనవంతుడై ముక్తి బొందుచుండు!

65*

కోర్కె వీడ శోకము వీడు లోకమందు!

శోకరహితమై బ్రతుకు సంతోషమెసగు!

తేగ గుణమొప్ప సత్కర్మ తెగువ మీర-

సాధకుడు సాగు గీతార్థ సాధనముల!

66*

సాధనలు చేతగాకున్న సకల కర్మ-

ఫలసమర్పణ గావించు బాట గలదు!

యోగములు చేతగాకున్ననోర్పు గలిగి

సుళువుగా భక్తి యోగాన సుకృతమెసగు!

67*

గురువులకు గురుడుగ విశ్వ గురుడు వెలసె!

దేవ దేవుడు-శ్రీకృష్ణ దేవు కరుణ

యోగశాస్త్రసారము గీత మ్రోగె భువిని-

విద్యలకు విద్యగా బ్రహ్మ విద్య వెలసె!

68*

దేశ వాస ప్రవాసులు తేజమొంది-

దేశ దేశాల విహరించి దేవునాజ్ఞ

కృష్ణ చైతన్య సంఘముల్ కృషినిజేయ

జాగృతము జేసె, గీతోక్తి-జగతి కీర్తి!

69*

పదుగురేకమై యొక్కని బట్టిజంపు-

పదవి మోహలోభములెల్ల-పదట గలిసె!

మోసమున పెక్కురను జంపునొక్కడైన-

అర్థ రహితమీయాపేక్ష నణచె గీత!

70*

శత్రు మన్నించి శత్రుత్వ చర్యలణచు-

రాజనీతి శ్రీకృష్ణుని రాహ గీత!

మైత్రి దీపింపగా గీత మార్గమందె-

యోధ నరుయోగిగా జేయు బోధ గీత!

71*

సుజన మైత్రి చేకూర్చెను సుకృత ఫలము

చెన్నుమీరెనానాడె- కుచేలమైత్రి

కుబ్జ తరియించె కంసుండు గూలె నవని

యందరికి దిక్కు మ్రొక్కు గోవింద విభుడె!

72*

వెలయు సద్గ్రంధ పఠనగా వెలసె గీత-

దెలియ గోరిన వారికే దెలుపు విద్య-

మోక్షదారి వాహకమైన యోగ సమత-

భావ సంయమన విధుల బ్రహ్మ విద్య!

73*

కీర్తి గాంచెను గీతోక్తి క్రీడి నాడె-

విశ్వరూపంబు దర్శించె – విశ్వసించె

భావి నరజాతి ప్రతినిధి భారతుండు!

యోగ శాస్త్ర సాగరమీద-యోగ్యుడయ్యె!

74*

భక్తి యోగంబుచే భవబంధ ముక్తి!

భక్తి యోగి శ్రేష్ఠత దెల్పె బ్రహ్మ విద్య-

భక్తి సామ్రాజ్యమేకాత్మ భావ గరిమ!

విశ్వ శాంతికి బీజమ్ము వేసె గీత

75*

గీత సంగీత గానముల్-కీర్తనములు

వేదనలు బాపి నరజాతి సేద దీర్చు!

దినదినాభ్యాస యోగముల్ దీక్షగొన్న-

సేవ-పరమాత్మ దరిజేరు – పావనాత్మ!

76*

గతము వర్తమానము సాగు కాల గతిని-

భవిత నెఱుగు సర్వజ్ఞుని భావగీత!

దోష రహిత దృష్టిని సాగు దోవ జూపె!

చెడును త్రుంచి మంచిని బెంచు చేష్ట సాగె!

77*

చేరి మూర్ఖుని మనసు రంజింప లేము!

దురభిమాని క్రూరుండైన దురితమెసగు!

దుష్టులకు దూరముండుటే దురిత హరము!

దురిత దూరుని గీతోక్తి దూర దృష్టి!

78*

మూఢ మతి కర్మ తత్కాల ముదము గూర్చు!

మాయికుడు దెప్పు-తోటి యమాయకులను!

లోభమున తనతోడిదే లోకమనుచు-

మోక్షమును బాసి జన్మించు మోహ బుద్ధి!

79*

ప్రకృతి జడ-చేతనాంశలు బరగుచుండు!

చేతనాంశలో దైవంబు తేజరిల్లు!

చేరువగు భక్తి యోగాన చెందు ముక్తి!

చేత గాకున్న శరణన్న – చేదుకొనును!

80*

గ్రామ దేవతార్చన సాలగ్రామ పూజ-

తనకె, చెందునటంచు గీతార్థ బోధ-

దాని ననుసరించెను పల్లె-దనరె భక్తి!

పట్టణాల విజ్ఞుల భక్తి పరిఢవిల్లె!

81*

కర్త- కర్తృత్వ భావన కడకు ద్రోచి

కర్త పరమాత్మ యనిదెల్సి గర్వముడిగి

కర్మ ఫలమిచ్చి-బ్రతుకును గడపవలయు

స్వామి శరణాగతినిబొంద సకలమొసగు

82*

సకల సుఖవాంఛలనువీడి సాత్వికముగ

సమత సమబుద్ధి సమదృష్టి సాగు భక్తి

యోగమున శరణాగతిఁ యోగ్యుడగును

సేదదీర్చియు హరియె తాచేదుకొనును!

83*

కోర్కె వీడిన శోకము- క్రోధమణగు

బుద్ధి వికసించు జన్మయే బుద్బుదముగ

జరుగు నది జర్గు సంతృప్త జతన ఫలము

దైవ ఇచ్ఛాను సారము దనరుచుండు!

84*

సంయమనము నిశ్చయబుద్ధి సాత్వికముగ

సాగు కర్తవ్యమున గల్గు శాంతి సుఖము!

పరులమేలును పాటించి బ్రతుకు గడుప-

కలుగు మదిప్రసన్నత కడుయశంబు!

85*

పడవ నడిపించు గాలియే పరగ ముంచు

చందమున భోగి తత్సుఖమందు సమయు!

సంగమించు నదులతో సంద్రమట్లు

సంయమియుబోలు శాంతికి సదనమగును!

86*

అహము మదికామమై జడమందు నిండు

ఆత్మ తోచేతనాంశగా నలరుచుండు!

ఆత్మ బలమొందు విధముగా నవని నరులు

తత్వ జిజ్ఞాస-ప్రేమల దనర వలయు!

87*

ధ్యాన భక్తి యోగములను దాన తపము

లందు పరమాత్మయేభోక్త-లబ్ధఫలము

ప్రాణి సుహృదుని సొమ్ముగా పదిలపరచి

స్వామి కర్పించువారిదే శాంతి సుఖము!

88*

దు:ఖ సంయోగమే భోగిదూరు గృహము

యోగి శోకవియోగమై సాగు చుండు

ధైర్యముత్సాహమున సాగు దారియందె

సగుణ నిర్గుణో పాసనల్ సత్ఫలములు!

89*

వేద యజ్ఞ తపోదాన వేదికలను

పూను పుణ్యధనార్జన పూర్వకములు

మోహ హరముల్సనాతన బ్రహ్మ మోద-

మొందు దారులు యిహజన్మ ముక్తిదములు!

90*

గోపనీయమీ గీతార్థ మొప్పు ప్రకృతి

జీవజాలము ప్రళయాన జేరు నన్ను!

భక్తి గనకున్న వినకున్న పాపులకును

ఎన్నడును దెల్ప వలదనె వెన్నుడంత!

91*

తన పరాభక్తి సంపన్న తాత్వికుండు

గీత మాధుర్యమునదేలు ప్రీతి బొందు-

నతడె తనకిష్టుడనె భక్తి నలరు, గీత

అధ్యయనశీలి ననుబొందు ననియె హరియు!

92*

మోహమునశింప,గీతార్థ మోదమలరు

స్మృతియు లభియించు జీవన భీతి దొలగు

గీత మననంబుచే దీరు నిత్యశంక-

దైవ సందేశమిది జన్మ ధన్యతొంద!

93*

క్రీడి నిల్పె శ్రీకృష్ణ యోగీశ్వరుండు

విశ్వరూపంబు జూపించి విశద పరచె!

వ్యాస కృప సంజయుడు విని వినుమటంచు-

గ్రుడ్డిరాజుకు వివరించె గురుతరోక్తి!

94*

గీత మాధుర్యమును గ్రోలి క్రీడి-దైవ

మహిమ గనివిని తరియించె విహిత-నియత

కర్మలనుదెల్సి తత్ఫల కాన్క జేసి

తానిమిత్త మాతృడుగాగ-తరలిపోయె!

95*

కర్మ మర్మ ప్రకాశిని ధర్మ నిధిగ-

కాముకులవంచె కలికాల కలుష హరణి!

బ్రహ్మ విద్య తత్వజ్ఞాన భాసురముగ

శరణు-గుప్త ప్రదాయిణి- సమత వాణి!

96*

గంగ గోవింద గాయత్రి గౌసమూహ

నామ పంచగ కారాలన్ నయమొసంగు!

వాస్తవాలవాలమగు సంవాద పటిమ-

వాసుదేవ సర్వస్వమై వసుధ వెలసె!

97*

విధిగ గీత గానము జేయ విష్ణు పదము!

గీత మననంబుచేదొల్గు కిల్బిషంబు!

గీత మాధుర్యమున నాత్మ చేతనంబు!

ప్రజకు భవబంధ ముక్తి సోపానమయ్యె!

98*

రాగ విద్వేష హరణి వైరాగ్య దాయి!

బ్రహ్మమోద సంధాయినీ భగవదోక్తి!

అసుర భావవినాశిని – యమలచరిత!

సకల సద్గుణ దాయినీ శాంతి ధాత!

99*

తామస నిశి వినాశిని దైవ సూక్తి!

సమత-సకలశాస్త్రవిచార సంచితంబు-

భువిదయాభక్తి పరిపూర్ణ పుణ్య ఫలద!

మంచికే దర్పణము బట్టు మహిత చరిత!

100*

గాన గీతాంభువులయందు తానమాడి~

మననమొనరింప గల్గును మనసు శుద్ధి!

సమత పాటింప దొల్గు సంసారమలము!

చేత గాకున్న శరణన్న గీత బ్రోచు!!!

101*

మూఢ విజ్ఞ నమ్మకముల ముందు వెనక-

మంచి కొనసాగ సద్భక్తి మార్గముండు

నాగరికమైన మంచియే సాగవలయు

జానపదమైన మంచియే జరుగవలయు!

102*

మంచియాచారముల వెంట మనుజు ప్రగతి

భారమై దురాచారముల్ ప్రతిభ కొలది

సుళువుగా సాగు తత్కాల సుఖములివియు

పేక మేడలే – గీత వివేక దీప్తి!

103*

నేడు తనదన్న మరునాటి కెవరిసొమ్ము

ఎవరి దైయుండె నిన్న నేడెవరి దనెడు-

ప్రశ్న నాత్మీయ శోధన ప్రతిఫలించు!

విశ్వ జీవుల నేకాత్మ విధము దోచు!

104*

భువి సహస్రనామార్చన పుణ్య ప్రదము

నిత్య పారాయణము గీత నిచ్చు శుభము

భక్తి విశ్వాస సమదృష్టి భద్రమగుచు

కీర్తి యాదర్శమానవ స్ఫూర్తి మెరయు!

105*

కల్మశోల్భనమై భీతి గలుగు నూష్ణ-

వృద్ధినోజోను చిధ్రమై యుద్ధ ఫలము!

విశ్వ రూపు భీకరమగు విశ్వ నరుల-

ప్రశ్న గీత సమాధాన బ్రతుకు నిచ్చు!

106*

విష్ణు కరుణాకటాక్షమే విశ్వరూపు!

జాతియదృష్టమే దివ్య గీత సుధయు!

గ్రోలు వారికి సద్భక్తి గోప్య మక్తి!

చదివి చర్ఛింప కొంగ్రొత్త చరిత

వెలయు!

107*

విశ్వ విజ్ఞాన సంపద వివిధ కళలు

శాంతి భారతి స్వాతంత్ర్య శ్రమఫలంబు!

సమత సమదృష్టి గీతార్థ సార వృష్టి!

నాత్మ- పరమాత్మ సంధింప నయజయంబు!

108*

శుభము-నీగీత గానము నభయ ప్రదము!

శుభము-నీతత్వమననము సుకృతధనము!

శుభము-నీనామ కీర్తన సుమధురంబు!

శుభము నీయాది సర్వంబు- శుభయశంబు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page