top of page
గీతామధురం-2
(తే.గీ.)

1*

శ్రీశ!శ్రీకృష్ణ!గోవింద!గీతధాత!

నీలజీమూత సన్నిభ! నీరజాక్ష!

నిఖిల భూతహితాత్మక! నిత్యసేవ్య!

సరస సాహిత్య సంపన్న! సకల వినుత!

2*

గీత గురులైరి-ఘన భారతీయ గురులు

బ్రహ్మ విద్య – బ్రహ్మీస్థితి భక్తి బాట!

పరమ పురుషలీలలు భక్తి భజన పాట!

నరుల కేకాగ్ర చిత్తంబు నలర జేసె!

3*

గీత సాహితి గ్రంధముల్ చేతబూని

ఎందరెందరో భక్తి నీ మందిరమున

చేరి పూజింత్రు భజియింత్రు వేయి పేర్ల-

నర్చనలు జేసి పఠియింత్రు చర్చ లందు!

4*

గీత బోధ వివేకంబు-నీతి ధర్మ-

నిష్ఠ నాత్మవిచారంబు నింపు గూర్చ-

బ్రహ్మమోద బ్రాహ్మీ స్థితి బడయు-భక్తి

దీక్ష నిర్వాణమున గల్గు మోక్ష సిద్ధి!

5*

దుష్టులకు దూరముండుటే దురిత హరము

దోషరహిత దృష్టి నరులకు దోవ జూప-

దురిత దూరుని గీతోక్తి దూరదృష్టి!

జన్మ రహిత ముక్తికి బాట జగతి శాంతి!

6*

మాయికుల మార్చి సద్భక్తి మార్గ గతుల-

సంయనముగా నడువగా స్వామి గీత!

ముగ్ధులను జేయు విజ్ఞుల, మూఢ భక్తి-

పరుల నర్హులుగా జేర్చు పరమ పదము!

7*ఆ.వె.

దోష రహిత దృష్టి దోవ నిస్వార్థమే

సేవలందు నరుడె శ్రేష్ఠుడనగ-

దాన ధర్మ కర్మ దారి నిష్కామమే

పుణ్యఫలము వెంట పొందు ముక్తి!

8*

దీని జదివి భారతీయేతరులు కర్మ-

ఫలసమర్పణంపు బాటమెచ్చి

సంపద విడనాడి సర్వము హరియనీ

భక్తి మగ్నులగుచు పరవశింత్రు!

9*

గీత విశ్వసించు ఇతరేతరులు భక్తి

దోవ సాగి పనుల దోషరహిత-

దృష్టివెలయ జన్మ శ్రేష్ఠత్వమొందేరు-

గీత మహిమ నుదుటి గీత దిద్ధు!

10*

పరుల ధర్మమెంచి పయనించు భీతియు

సొంత ధర్మమందె శోభ-శుభము-

పొందు,నందు-మరణ మొందుటయును మేలు-

గల్గు ననెను, గీత-కర్మయోగి!

11*

సూది రంధ్రములను దూరి వెళ్ళును వేగ

సాగు దాని వెంట దారమంత-

నింపు గుట్టునట్టు – విధుల నరుడు దార

మైన మేలు బ్రతుకు మార్గమందు!

12*

ధాత సూది గాక, దారమై జీవింప

లోపములను నింపు లోక సేవ!

భూత హితవె- సూది బొరియలు పూడ్చగా

లోపరహిత కీర్తి లోకమందు!

13*

భక్తి శ్రద్ధనాత్మ ప్రభవించు జన్మలన్

సూక్ష్మ బుద్ధి ధర్మ సూక్ష్మమెరుగు

భువిపరోపకార భూతహితవు గీత

భోగి రోగి గాక యోగియగును!

14*

క్షాత్రధర్మ గతుల ఛాత్రులు పోరాడ-

నుప్పుదిన్న పక్షమొప్ప సాగి-

పోవు ధర్మమయ్యె! పోరుబాట గురుల-

ధర్మమయ్యె ముక్తి దారి సాగ!

15*

కౌరవాళి వినక గాసియయ్యెను పోరు-

నష్టమయ్యె-పొందు నిష్టపడక

సంగరాన గూల-సత్సంగమే తుద-

మిగిలె, నరునికీర్తి మిగుల వెలిగె!

16*

కౌరవుండు గూలె కౌంతేయులకు జయమ్

కలిగె గీతసూక్తి వెలుగులందె-

యోధ నరుడు నిల్చె-యోగి-గృహస్తుడై

సంసృతి పదమందు సాగి పోయె!

17*

పాత్రధారి నరుడు పాటించె ధర్మమున్

సూత్రధారి గీత సూక్తి సూచి!

పొందు లబ్ధి గాక పోరునష్టము జూపె!

ధర్మజునకె జయము దాపురించె!

18*

పోరు బాట శకుని పోటిజూదరిమాయ

కీడు గూర్చెయుద్ధ క్రీడ సాగె!

సంధిమాట వినక – సాధుహింసయు పాప

మనక, కౌరవాళి మడిసె నంత!

19*

భారతాన భీష్మ పర్వ మధ్యము నందు

మునిపరాశర సుతు మూల ప్రతిగ

వసుధ మ్రోగె మానవాళి జాగృతమయ్యె-

నాడె గీతను గొనియాడె జగతి!

20*

సత్యమెపుడు నీతి సంసృతి పుటదాగు

దేశకాల పాత్ర తేజరిల్లు!

సత్య దీప్తిముందు సర్వంబు లుప్తమే

సత్యమందె దైవ సదనముండు!

21*

గురుల దారి త్రిగుణ కూడలి తామస-

గుణము కీడు, మిగత గుణము మేలు!

రాజసంబు వెంట రాజిల్లు తామస-

పథము నరుని జేర్చు పాద తళము!

22*

ఊర్థ్వ దారి త్రిగుణములను, సత్వము మేలు

చెన్నుమీరు ప్రకృతి చేతనాంశ

నాత్మ వెలుగు బుద్ధి నాణ్యత పరమాత్మ

పదము బొంది భక్తి పరవశించు!

23*

పట్టి విడువరాదు పరమాత్మ పాదము

నడుమ విడువ కొంత నయమె గలుగు-

పుణ్యమునఁబుట్టు – పుణ్యాత్ములింటను

భక్తి జన్మ రహిత ముక్తి బొందు!

24*

బ్రతుకు భక్తియోగ బలముచే నిస్వార్థ-

వ్రతము శరణుజొచ్చు వారికెల్ల-

సత్ఫలంబు గూర్ప సర్వోపగతుడుండు,

సమత బుద్ధి గూర్చి సద్గతొసగు!

25*

కలుగు మార్పు పుడమి కాలానుకూలమై

కష్ట సుఖము లాభ నష్ట-తలపు,

గలుగు-తీర్పు ధర్మగమనానుకూలమై

కలిమి కన్న పుణ్య కలిమి మేలు!

26*

భక్తిమంచిదే – విరక్తి మంచిదే యాసక్తి-

వీడి కర్మఫలము విభుని కొసగ,

పాప పుణ్య గతులు పరిశీలనకు రావు-

చేవ గూర్చి తానె చేదుకొనును!

27*

భక్తియె భవబంధ ముక్తి సోపానము

పుణ్యమనగ మంచి పూర్వకంబు!

మంచియె యుపకారి మార్గదీపము-శక్తి

దోవసాగ హరియె తోడునీడ!

28*

ప్రేమమూర్తులందు పెంపొందు మంచియే

భక్తులందు మంచి భావదీప్తి!

పుణ్యసంచితార్థ పూర్ణ ముముక్షువు!

సాగుచుండు హరియె సర్వమనుచు!

29*

వివిధ ప్రేమలందు విద్యుక్తమగుప్రేమ

నాణ్యమైన సేవ నలరుచుండు!

భూతహితవె నరుల బుద్ధి వెల్గెడు ప్రేమ-

దాని ప్రేరకంబు-దైవప్రేమ!

30*

దైవ గుణము భూత దయయు దాక్షిణ్యమే

దాని వలన పుణ్య ధనము గలుగు!

దైవ గుణము నెంచి ధాతయై జీవింప-

ముదము గలుగు జన్మ ముక్తి గలుగు!

31*

కలుము లందు శాంతి కలిమియే కడుమిన్న

సిరులయందు కీర్తి సిరియె మిన్న

లేములందు హింస లేమియే వెన్నుని-

పరమ ధర్మమంద్రు పరమ గురులు!

32*

కలియుగాన మాయ కలుషమై డాయగా

తనువు తానటన్న తలపు గలుగు~

నపుడు నాత్మ దెలిసి నడుపు జీవన దారి

జాగరూకతొసగు జగతి గీత!

33*

భువి సమస్య గలుగు, బుద్ధి పరిష్కార-

మరయు, దాని మరువ మరొకటుండు!

పూని తానె గట్టె భువిసమస్యల గోడ-

తానె గూల్చు గొప్ప తనమదేమొ?

34*

భువి సమస్య కులము బుణ్యాది మతములన్

సహన మనుచు మరల సహజ గుణము

గోడ గట్టి గూల్చు గొప్పలే దారెంట-

బ్రతుకు నతుకు రిత్త పథక రచన!

35*

గుణము నరుని గుర్తు కులము చిర్నామయే

మత సమూహ గతుల మనుజుడెంచు-

సమ్మతంబె దోచు, నమ్మకంబేదాని-

కేడుగడగ సాగు నేడు రేపు!

36*

మాయికుండు దినము మర్యాద గోల్పోవు

మునుగు దాక పరుల ముంచి పోవు!

గెలుచు గేలి సేయు-కేళినమాయకున్

కష్ట పెట్టు- మాయ కలిని మెచ్చు!

37*

మాయ రహితుడగు నమాయకుండని దెల్సి-

మాయ గొప్పదనమె మాటలందు!

వేయునేల మాయ వెలయాలి సంస్కృతి-

మాయ మనుజు జేర మరల జన్మ!

38*

విజ్ఞ-మూఢ గతుల విషయంబు చర్చింప

మంచి గలుగనన్ని మంచి గతులె!

వివిధ భక్తులందు – విధినిర్ణయము మంచి-

దాని వెంట గొప్పదనము దనరు!

39*

మానవాళి సేవ, మంచిమార్గము గాగ

ధర నహింస పరమ ధర్మ మయ్యె!

దుష్ట దురిత జనుల దుర్మార్గవర్తనల్

ధర్మ రహిత హింస – దనుజ దారి!

40*

ప్రజలె రాజులైన పరగు స్వాతంత్ర్యము

దానియందె భక్తి దనరు చుండు!

పార తంత్ర్యమందు – పరమాత్మ గనుటెట్లు?

దేల్చిచూచి యాత్మ దెలియుటెట్లు!

41*

మాయ మిత్రుకన్న మంచిశత్రువు మేలు

చెడ్డదారి మంచి చేష్ట వృధయె!

ఇంటగెలువ, బయటి తంటగెల్వగవీలు!

మోస మెఱుగ – బ్రతుకు మోదమొందు!

42*

మంచి శత్రు దాడి మార్గంబులో ధర్మ-

మర్మ గతులు సాగు- మంచినెంచు

బలమె గాని శత్రు బలగమ్ము భయమేది?

బాహిరముగ గెలుపు బాట సాగు!

43*

చెడ్డ మిత్రుడింట చేరియోడింపగా

జతన-బుద్ధి కీడు జరుగు చుండు!

తెలియరాదు మొదట, తెలిసినంతనె మోస-

మయ్యె ననుచు-మైత్రి మాయమగును!

44*

జరుగ నున్నదెల్ల జరుగె భారతమందు-

జగతి నున్నదెల్ల జతపడంగ-

వివిధ పాత్రలందు భిన్నవిభిన్నమై-

చిత్త వృత్తులు కడు చిత్ర గతులు!

45*

ఇంటి కన్న గుడియె యిహమందు పదిలమై

తనువు కన్న నాత్మ తళుకులీనె!

ఆత్మ కన్నను పరమాత్మ పదిలమయ్యె-

యచ్యుతుడవినాశి యనగ జెల్లె!

46*

జరుగ నున్నదెల్ల జరుగకమానదు-

జరుగరానిదేది జరుగ బోదు!

తనువు నింట నాత్మ-తగుభద్రతను గనున్

అత్మ గుడిని దైవమలరుచుండు!

47*

చట్ట పరిధి-పేద చుట్టు కంచెను వేసి

గావకున్న రక్ష గలుగునెట్లు?

చట్ట రకములందు చుట్టరికములెందు-

గలుగునన్న ప్రశ్న గలుగ మేలు!

48*

తెగువ మీరి బరియు దెగికిల్బిశాత్ములు~

రాకపోక బ్రతుకు రాజి పడరు!

తేజి పాజి జేసి, పేచిగెల్వగజూచు-

తీరు తెన్నులందె తిరుగు చుంద్రు!

49*

జగతి భరత జనులు, జాగరూకత బొంది-

నాగరికపు వెఱ్ఱి సాగరైరి

పరులపీడనంబు-పాపంబుగా కోర్కె

కొంపముంచు-సుఖము, లోకనింద!

50*

గీత భరత జాతి నీతి గీతను గీచె-

బ్రహ్మ గీతలోనె బ్రతుకు యాత్ర!

ప్రాప్త లేశమునకె తృప్తిబొందుట చేత-

గీత నీడ తేగ దీప్తి గొనిరి!

51*

భూత హితులు మునులు, ఉపకార జీవనుల్

సత్య నిర్వచనులు సాత్వికులుగ

పుణ్య సంచితార్థ పూర్వకమగుదారి-

వేసి చనిరి జాతి వెంటరాగ!

52*

జగతి భారతీయ జవసత్వ వీరముల్

దానవీరమనెడు దారి సాగె!

భూతదయను జేసి బుద్ధులై వెల్గిరీ-

రాజు పేద కొక్క రాహ దోచె!

53*

ఏది నిజము, కానిదేది, శాశ్వతమేమి-

వాదుసాగె, నెవరి వాదు గెలిచె?

వేద కల్పవృక్ష వేదిక పైగీత-

మ్రోగె, నాత్మ బ్రహ్మ మోదమయ్యె!

54*

పూర్వ సాహితి ఘన పౌరాణికాదుల-

నుపనిశత్తు శ్రుతుల నుద్భవించె-

వేద నీతి వెన్న-వెన్నుని దయనరున్

తీర్చి దిద్ధె-గీత తీరుతెన్ను!

55*

గీత సుధ పురాణ నీతి జిల్కిన నవ-

నీతమార్ధవంబు-నీతిధర్మ-

దాన తపము పుణ్య ధనమింధనము గాగ

వివిధ యోగగతుల వెలసె ముక్తి!

56*

భక్తి మైత్రి ప్రేమ బహుళార్థ సాధకమ్

దాన ధర్మ పాదు – మానవతయె!

ప్రజలు మానవతకె బ్రహ్మ రథము బట్ట-

సాగె బ్రతుకు, హరియె సారథిగను!

57*

భక్తి మైత్రి-మైత్రి భక్తియు కొనసాగె-

నాత్మయు పరమాత్మ నలరె గీత!

ప్రణయ పుష్టిగూర్చె-ప్రణవనాదమునూదె

కామ్య కర్మ దృష్టి ప్రళయ కాల వృష్టి!

58*

విజ్ఞ మూఢ గతుల విశ్వాసమై భక్తి-

తల్లి దండ్రి గురువు దైవమతిథి-

దేశభక్తి తత్వ తేజంబు త్యాగమై-

వివిధ దేశమైత్రి విస్తరించు!

59*

కల్తి పనుల సాగు కలియుగాలోచనల్

పల్లె పల్లె నిపుడె పల్లవించె-

పట్టణాల సాగు ప్రగతి కాలుష్యముల్

కాలనీలచుట్టు కలియబారె!

60*

వెసన పరిసరాలు వెస గమ్మి వేయగా

జనులు దాటలేరు జగతి మాయ!

విత్తలోభమెసగి – విజ్ఞత గోల్పోక-

ముందె జాగరూకతొంద వలయు!

61*

కల్తి పరిసరాల గలుష సంతలసాగు

క్రయము విక్రయంబు కథల విందు

ప్రాణ హాని, హింస, నారోగ్యలోపముల్

ముందె జాగరూకతొంద మేలు!

62*

మాయదారి మనుజు మరబొమ్మ జీవనమ్

క్షేమమెట్లు? పుడమి చీమ పుట్ట-

పాముకిరవు గాగ – పరపీడనము సాగు

లోకమెల్ల పాప కూపమగును!

63*

మాయ జగతి బ్రతుకు మార్పు తీర్పును లేని

ఆశ పాశ గతుల యాత్ర సాగు-

క్రొత్త వింత పాత రోతగా మదినెంచు

పైపటార దృష్టి బరగుచుండు!

64*

తనువు తానటంచు తపన వెంటను సాగు

నంద చందములను, ఆత్మమరచు!

తనువుకన్న నాత్మ తళుకు సౌందర్యమే-

మిన్న యనుటె గీత మేలు కొలుపు!

65*

దేహ పుష్టి సుఖము – దేహి దృష్టియు సౌఖ్య

మిహపరాల తృప్తి విహితమగును-

లోన, బయట ప్రకృతిలో చేతనాంశ గీ

తార్థ విధుల జన్మ సార్థకంబు!

66*

విద్య-విత్త గడన వీలుగా కొనసాగె

విజ్ఞ శోధమరచె-విశ్వశాంతి-

వేయుమూడడుగులు-వెనకకేడడుగులు

చూపు ప్రగతి శాస్త్ర రూపు రేఖ!

67*

కృత్రిమంబు భూప్రకృతిసహజము మించె

కల్తి సరుకు సంత కలియబారె!

వస్తు సృష్టి బెరిగె-వసుధ రసాయన

కలుష పరిసరాలె-కలియుగాన!

68*

సిరుల నోమునోచి జీనోము గనిపెట్టె-

మనసు శోధ నెంచె మరలమరల-

సాగుచుండె మాప్రయోగశాల దశను-

సవ్యసాచి నేటి శాస్త్ర వేత్త!

69*

సహజ వస్తుపంట సాగెడు వ్యవసాయ

భూరసాయనాలు గూర్చు-ఎరువు-

కృత్రిమములు నిషిద్ధ కృతక విషంబులే

విరుగుడు గనిపెట్టు విధము లేవి?

70*

గీత సమత దృష్టి కీలెరింగిన లబ్ధి

దోషరహిత పుష్టి దూరదృష్టి –

సత్యవ్రతము బోలు శాస్త్ర వేత్తల సృష్టి –

గీత పరిధి సైన్సు కీర్తిగాంచు!

71*

జానపదుల భక్తి జాగరణలు, నప్ర-

మత్తముగను, విజ్ఞమార్గ భక్తి-

గమన గతులు వేరు, గమ్యమొక్కటె, పుణ్య-

ధన సమాంతర రహ దారులయ్యె!

72*

భక్తితోట తేటి పాట సంకీర్తన

క్రీడి ప్రశ్న-సామి గీతసూక్తి!

భక్తజనుల ప్రశ్న-బ్రతుకుదెరువులాట

తెగువ పనియు పాట తగుజవాబు!

73*

బ్రతుకు పంటపొలము – పల్లీయ సంసృతి

బ్రతుకు దెరువు సాగు పనియు పాట

లేని వేళ కలిమి లేముల కావడి-

కుండలయ్యె! హరియె యండదండ!

74*

తెలిసినంత బ్రతుకు తెలివితేటలబాట-

సాగినంత సాగు సాగకున్న-

బ్రతుకు ప్రశ్న జన్మమతుకు ప్రశ్నల మయమ్

స్వల్ప ఫలము కృషియు సల్పు క్రియల!

75*

ఉన్నయంత మేలు నుప్పతిల్లును తృప్తి

తిప్పలైన తనివి దీర్చు భక్తి

జరుగుబాటు వెంట జతపడు పుణ్యమే

ధనముగాగ మోక్ష దారి సాగు!

76*

స్వేచ్ఛ జీవనంబు చేయగోరును పల్లె

జనము తేగ గుణమె జవము గూర్చు-

దారి, ప్రశ్న గీత తగుజవాబొసగంగ-

తెలిసినంత బ్రతుకు తెల్లవారు!

77*

బ్రతుకు దెరువు భక్తి భావన ముడివేసి-

నటన సాగు-దైవ ఘటనసాగు

నేరమొకరి మీద నేరస్తుడొకరను

కొనుటె గాని, ఎదురుకొనగ గాదు!

78*

గుండె నిబ్బరంబు గుర్తు-పల్లీయుల-

తేగ బుద్ధి భక్తి యోగ సిద్ధి-

నిండు మనసు సేవ-నిస్వార్థ భావనల్

ముగ్ధ భక్తజనుల ముచ్ఛటగును!

79*

భక్తి పల్లె జనుల భావవికాసమై-

ఐకమత్య, బల, సమైక్యమొసగు-

కలుగు, పుణ్యఫలము, కామ నిష్కామముల్

సాగు, కర్మలు శరణాగతిగను!

80*

శిష్ట జానపద-విశిష్ట సాహితి జూడ

భిన్నమైన-దురిత భీతి మరియు-

పుణ్యప్రీతి,గలుగు బుణ్యాది గంధముల్

పరిమళించు భక్తి పాట తోట!

81*

సకల పాఠకులకు శతక సాహితి ప్రీతి-

యగుట-కవిగ బ్రతుకు యాత్రగలిగె!

శతకగీతి-గీత పథకంబు నెరవేరె!

కవినటన్నయూహ కలుగదాయె!

82*

తప్పు లెన్నువారు దారిగాచియు ప్రశ్న-

నొవ్వుగూర్ప – కవిత నోర్పు సాగె!

కలము బట్టు వరకె కాలయాపన గాగ-తప్పు నొప్పుకొనుటె తగుజవాబు!

83*

భక్తి కవిత జేయు భాగ్యంబు గల్గెనా

ప్రస్తుతి కవి యంద్రు పల్లె జనులు!

ప్రస్తుతింత్రు గురుల ప్రస్తావనోచిత-

కవులనైన భక్తి కవితలందు!

84*

భక్త జనులవెంట-పరుగెత్తి వినిపించు

కాలమయ్యె నేడు – కలుగు కవిత,

ప్రతుల నచ్చువేయ-ప్రజలె రాజులుగాన

వారి వలన కీర్తి వరలు భవిత!

85*

తప్పు దిద్ధు పనికి తగు గురువుల జేరి

వేచియుంటి ప్రతుల సూచి వ్రాయ-

జూచి పాత బడగ – తూచియమ్మితిమనన్

వెతను గొంటి, ముతక కథల యాది!

86*

తప్పులు సరిదిద్ధి, తర్కించి, మిత్రులు

ప్రాతదాయె గీత వ్రాతలేల?

అనుచు – ప్రజలె దీనియంతుదేల్చెదరని

ప్రోత్సయింప నింత ప్రొద్ధు గడచె!

87*

భక్తి కృతులు దైవ భారమై-దాసుని-

దోషహరము జేయు దోవ భక్తి-

మ్రొక్కియంకితమిడు మోదంబు గొంటినీ

పాదధూళి దాల్చి పాడుకొంటి!

88*

శతక గీతి నీదు శరణాగతినిబొంది-

నపుడె యంకితంబునయ్యె-నిపుడు

గ్రంధ రూపమొందు కార్యంబు కొనసాగె-

సాయి జోతి ముద్ర శాలయందు!

89*

దేహమందు దేహి తేజరిల్లగ నాశ-

యంబు, భక్తజనులయందు మనుట-

భాగవతులు భక్త పరమాణువుగ నెంచ-

నిన్ను జేర జన్మ నీదు చుంటి!

90*

పుడమి ధర్మ కర్మ భూమి నిస్వార్థమై

వెలయు సేవ-నీతి విలువ వెంట-

కలుగు పుణ్య ఫలము-కర్మ నిష్కామమై

వెలయు గీత గ్రోలు విధము గనుట!

91*

దేహి పాహియనగ దేవదేవుడ రమ్ము!

దీన పోష! జనుల దిక్కు నీవె!

బ్రహ్మమోదమొసగ – భక్తి నావనుజేర్చు

వాసుదేవ! శ్రీనివాస బ్రోవు!

92*

బ్రతుకు బాట గలుగు భావ స్వతంత్ర్యమున్

భక్తి గూర్చు పిదప ముక్తి గూర్చు!

యోగ బాట గీత మ్రోగు నిష్కామమున్

ఫలము నీదె! ముక్తి పదవినీదె!

93*

భారతాన గీత భావవికాసమున్

సకల జీవ సేవ సాగు విధుల-

వెలుగు భాగవతమె-విశ్వతార్కాణము

సర్వజీవరక్ష సాగు గతుల!

94*

ధరణి నితర బాధ తనబాధగా దల్చు-

నరుడె, ధర్మ గతుల నడువనోపు!

తాను బాధకోర్చి-తత్వంబు దరచగా

దెలియు ధర్మజోక్తి దేల్చు నిజము!

95*

వేదమార్గమంత వెలసె పురాణమై

భారతాననదియె భద్రమయ్యె!

విధిగ గీత-సమత వెల్లడించిన నాడె

రాహ గల్గె-జన్మ రహిత ముక్తి!

96*

పూర్వ కవులచేత పూర్ణసాహితి నిండె

గీతపాటవంబు-నీతిధర్మ

మార్గమయ్యె, నీవె మార్గ దర్శివి గాగ

వివిధ ధర్మగతుల వీక్ష సాగె!

97*

దండి సూక్తులుండు – పండితోక్తులుగల్గ

దేశి చందమందు తేటగీతి-

నాటవెలదిసాగె, నాత్మతత్వము దెల్పు-

జానపదము సాగె-జానుతెలుగు!

98*

శతక పాఠకులిక సతతకాలక్షేప-

ముగను, జదువ పుణ్యముగను దలప-

నెచట జూడవారె నెదురు పడిరి నేడు

గలుమ గలుమను తెలఁగాణ జనులు!

99*

తరగనట్టి పుణ్య ధనము గీతోక్తమై

కృతిని వెలయ శతక కృతులు జేసి

వెరవకుండ నచ్చు వెలయింపజేసితి-

కృపను జూచి శతక కృతిని గొనుము!

100*

క్రీడి వరద! తోడునీడ నీవెకదా!

భక్త జనుల దాపు ప్రాపు నీవె!

పెంచి శిథిల ప్రకృతి త్రుంచి-సృష్టించేవు

పూర్వ పరము నీవె! సూర్య నేత్ర!

101*

అవని భక్తజనులు అన్య వేల్పులగొల్చు

పథములందు పుణ్యఫలము గొనుచు

పరమ పదమము జేర్చు పరమాత్ముడవు నీవె!

జీవి జీవి నాత్మ దీప్తి నీవె!

102*

గీత ధాత! సృష్టి క్రీడసాగించేవు

సుస్థితిలయ ధర్మ సూత్రధారి!

భూత హితవుజేయు బుద్ధి ప్రసాధించు

విధుల పాదుకొల్పు-విశ్వశాంతి!

103*

కుబ్జ వరద నీ పదాబ్జంబు నమ్మితీ

దేశి పద్య శతక గీతి సాగె!

గీత బోధ గురుల చేతబొందిన ఫలమ్

నాట వెలది తేట గీతి పాట!

104*

మునిపురాణ కథలు ముక్తి మార్గ గతులు

కర్మ పక్వతగను ధర్మ నిధులు!

దారి సూచి, గీత-ధర్మార్థ నిష్కామ

ఫలసమర్పణంబు – పరమ పదము!

105*

దివ్వె క్రింద మరొక దివ్వె వెల్గిన చోట

నీడ దొల్గి నట్లు-పీడ దొలగు-

పుణ్య గీత దోవ బూనిసాగిన వారి-

జీవితంబు వెలుగు దీవెనొసగు!

106*

నరుల యాత్మ గుడిని యజ్ఞాత శక్తివై

వెల్గు చున్న నిన్ను దెలియు దాక

గీతమాత భక్తి గీటురాయి నికష-

మరలమరల బోధ మార్గ గెలుపు!

107*

విశ్వ నరున కాత్మ విశ్వాసముదయించు

పుణ్య సంచితార్థ పూరకముగ-

సాగు జన్మ, దైవ సాయుజ్యమును గాంచు!

తీరు తెన్ను గీత తీర్పు నొసగు!

108*

శుభము – గీత గాన ఝరియు సుకృత లబ్ధి!

శుభము-గీతామనన దీక్ష సుఖము శాంతి!

శుభము-గీతార్థ మాధురి సుధను గురియు

శుభము-శ్రోత- పాఠకులకు, శుభయశంబు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page