top of page
గీతాగానము ద్వితీయ భాగము
(తే.గీ.)

1*

శ్రీకరంబగు నీభక్తి చిత్తశాంతి

శుభకరము నీదు కీర్తన సుఖము, యశము

మానవాళి గీతామాత మహియ చేత-

గుండె నిబ్బరమును బొందు చుండు జగతి!

2*

పరమ, అక్షరరూపమే బ్రహ్మమనగ,

అక్షరాత్మ యహంబ్రహ్మ మనెడు భావ

మందుదాకను, పరమాత్మ మహిమ సాగు. ఆత్మ –

పరమాత్మ నిలయమై యలరు చుండు

3*

భావి గత వర్తమానమై బరగుసృష్టి-

నెఱుగుదును నేను తదితరు లెరుగ లేరు

రాగ, విద్వేష మోహద్విరక, విరహిత

పుణ్య కర్ములెరుగుదురు, పుడమి నన్ను!

4*

నేనుయను నాత్మరూపము నేకమగుదు

జీవిజీవిని నాయున్కి దీప్తిగాంచు!

ఆత్మలో పరమాత్మగా నాదులీల-

సాగు నాధ్యాత్మిక పథము – సమతదృష్టి!

5*

నాస్వరూపమే వివిధాల నలరు, నాదు-

కర్మయే కర్మయను నర్థగ్రహనమగును,

జనన, మరణ భీతిని నన్ను జనులు మరచి,

త్రిగుణ భావజాలగతుల తిరుగు చుంద్రు!

6*

అంత్యకాలాన కోరినయట్ల జరుగు

జగతి వారివారల మది స్మరణ స్ఫురణ,

జన్మరహితముక్తిని బొందు జగతి-నీవు

మనసు బుద్ధి నాకర్పించు, మదియె చాలు!

7*

ఏమహాత్ములు నామీద ప్రేమగలిగి

నాపరమ ప్రేమపాత్రులై నందుచేత-

భువి పునర్జన్మనొందరు, పుణ్యఫలమె-

శుక్లమార్గాన నడిపించి ముక్తిగూర్చు!

8*

వేద సూక్తుల సుకృతంబు వెలయు చుండు

విధుల యజ్ఞదానంబుల విస్తరించి-

పుణ్యకర్ములు, యోగులు, పుడమి జనులు-

జన్మ రహితముక్తిని గొంద్రు జగతియందు!

9*

జ్ఞాన – విజ్ఞాన, ధర్మమార్గాన శ్రద్ధ-

బ్రతుకు విశ్వాస పూర్వక బ్రతుకు బాట

నడువ సైపని వారలు, నన్ను మరచి

మరల జన్మింత్రు, సంసారమార్గమందు!

10*

(రాజవిద్య,రాజగుహ్యయోగము)

గోప్యమిది యర్జునా! విను, దోషరహిత

దృష్టిగలవారికేదెల్ప నిష్టపడుము!

శాస్త్రములనుత్తమోత్తమ శాస్త్ర మనగ-

విద్యలకు రాచవిద్యయను, విద్య యిదియె!

*(రాజ-రాజగహ్య యోగము)

11*

జ్ఞాన విజ్ఞానదాయక జాగృతంబు

ధర్మయుక్తము, సత్ఫలదాయకంబు

గోపనీయ గీతార్థంబు గొప్పవరము!

ప్రశ్న – తత్సమాధానంబు ప్రస్ఫుటంబు!

12*

సూక్తి నిధియైన గుప్తార్థయుక్త యోగ

శాస్త్రమను బ్రహ్మవిద్యయై సాగెపుడమి!

ఆచరణ సాధ్యము, సుళువు, నాత్మమురియ

భోధగరుని గీతామృతమ్ గ్రోలె నరుడు!

13*

జగతి సర్వము ప్రభుశక్తిజనిత సృష్టి-

నింగి సర్వత్ర వాయువు నిండినట్లు

తానె నిండియుండుట దెల్పె తరచి చూడ-

విశ్వ పరకృతి బడిన జీవి విధము దెలియు!

14*

జీవిజీవినియాత్మీయ దివ్య దీప్తి!

ప్రకృతి జడ-చేతనములందు పరవశించు

పరమ రూప స్వభావంబు మరచి పోయి-

యసురి-రాక్షసి-మోహిని నాశ్రయింత్రు!

15*

త్రిగుణవృత్యనుసారంబు జీవులెల్ల,

ప్రకృతి మాయలోబడియుండు పరగ సృష్టి-

క్రమముగా స్థితి లయమొందు, కాలగతిని-

నేనె, చేతనావస్థకు హేతువగుదు!

16*

పరమరూప స్వభావంబు ప్రకృతిగాంచి

పరవశింపక, త్రిగుణాల బడక జీవి-

నన్ను నాశ్రయింపగ, నాత్మ నాదుకొందు!

అర్జునా విను, నావాక్కు లబ్ధిగూర్చు!

17*

సకల హేతు భూతుడ, నిత్య సత్యగతుడ!

అక్షరుండను, యవినాశియనగ నేనె!

భజనసాగి, మదితదేక భావమొప్ప!

గడుపు వారల వెన్నంటి కదలు చుందు!

18*

ధ్యాన మగ్నులై ననుగొల్చు దాసజనుల-

సగుణ నిర్గుణోపాసన సాగుచోట-

నీవె దిక్కని మ్రొక్కుచు, విశ్వసించు-

సాధు సజ్జనులను జేరి సాగుచుందు!

*(విభూతి యోగము) శ్రీభగవాన్ ఉవాచ.

19*

ఫల్గుణా!నీవునాభక్తి పథము గనుము!

కీర్తనార్చన, వందన క్రియల యందు-

నిన్ను నీవె నియోగించుకొన్న నిష్ఠ-

నా పరాయణుడవగుము, అంతెచాలు!

20*

నేనె సకల హేతువు గాగనెంచి, నమ్మి,

అక్షరాల పాటించుమోయర్జునుండ!

వాస్తవముదెల్సి, కీర్తించు వారినెల్ల-

నిహ పర, జ్ఞానులనుజేసి, హితవుగూర్తు!

21*

విశ్వరూపుడ! విశ్వాత్మ! విధిని నేనె!

విశ్వ రూపునిగా గొల్చు వివిధ జనుల-

విస్మరింపక దరిజేర్చు, విధులనుందు!

విశ్వ సకలమ్ము నన్నునే విస్తరింతు!

22*

వినియు-వినక పరధ్యాన, విస్మయముల

మరల ప్రశ్నించు, పాండవ మధ్యముండు!

భక్తి ప్రార్థించు నర్థంబు ప్రభుడు దెల్ప-

మర్మ గతినుండు, పరతత్వ మార్గములను,

23*

ఆది కారణజన్ముడన్ – అరసిచూడ!

అవని యవతార హేతువున్ ఆదిమునులు-

దేవతల్ దేవతా ఋషుల్ దెలియ లేరు!

తేల్చి చెప్పెద-ననునీవు దెలుసు కొనుము!

24*

నేనె జన్మనాశరహిత తేజ యుతుడ!

విశ్వ మహశక్తి రూపుడ విజయ వినుము!

వెలయుస్వర్గలోకములకు వేల్పనంగ-

నేనెయనిదెల్యుటేమేలు నేర్పు మీర!

25*

పాప పంకంబు వదిలించు బ్రహ్మనేనె!

శోక సంద్రంబు దాటించు లోక గురుడ!

జీవి సకలభావ సమూహ దివ్య దీప్తి-

సర్వమును నాదె! నావల్ల జగతి సాగు!

26*

సకల ప్రాణుల భావముల్ – సనక మునులు

సప్త ఋషులును, వసువులు, శ్రద్ధ భక్తి

పరులు-వారి, వారసజన ప్రగతి – జగతి

చేష్ట మూల కారకుడను-శ్రేష్ట గురుడ!

27*

జగతి నావల్ల సాగును, చక్కవడును,

దీని దెల్సి – దెల్యగ నాత్మ తేటపడును!

నాదు తత్వజిజ్ఞాసచే – ఆత్మ వెల్గు!

నన్ను గుర్తించి-సద్భక్తి సన్నుతించు!

28*

మనసు, బుద్ధి నాకర్పించు, మనన గతుల

నిశ్చలాత్మక స్థిరభక్తి – చిత్తవృత్తి,

నియమ నిష్ఠ నిరంతరమ్ – లీనమగుచు-

చింతనము జేయు వారల చింత దీర్తు!

29*

భక్తి శ్రద్ధచే యజ్ఞాన భావముడిగి-

నిష్ఠ సాగిన జ్ఞానికి నిజము ముక్తి

నమ్ముకొన్న యజ్ఞానికి నయము జయము!

ఉభయులును లీనమై పోవ శుభము గూర్తు!

30*

బుద్ధి యోగాన మొదటనే పుష్టి వెలుగ

వారి యజ్ఞానమును బాపి, దారి జూపి

విశ్వ రూప విజ్ఞానంబు – విధము దెల్పి-

యోగిగా జేసి, ననుజేరు యోగ్యు జేతు!

31*

(అర్జున ఉవాచ)

కృష్ణ శాశ్వత బ్రహ్మ! నీకృపయె చాలు!

నిత్య సత్యవచన! దేవ! నీరజాక్ష!

నీవె నినుదెల్య గలవు దివ్యలీల-

దెల్పి కరతలామలకంబు జేయుమయ్య!

32*

(భగవాన్ ఉవాచ)

నరుడ!వినునేను, వైకుంఠ నాయకుడను

దేవతల పూజలందెడు దేవదేవ-

పదవి నేనుందు, నదియె నాపరమ పదము!

నన్నె యవినాశి, పరబ్రహ్మ యనగ దెలియు!

33*

ఇంద్రియంబుల మనసునై యుందు ప్రాణి

రూప చైతన్యమగుదు, రుద్రులందు-

శంకరుడ!పురోహితుల బృహస్పతి, యక్షు-

లందు నుకుబేరుడ, వసువు లందు నగ్ని!

34*

సేన పతులలో స్కంధుడ నేనె! జలధి

నేను-ఏకాక్షరోంకారమేను, శబ్ధ-

బ్రహ్మనై వేదప్రారంభ పదము నైదు!

యజ్ఞముల జపయజ్ఞమై యలరు చుందు!

35*

భూధరముల హిమగిరిని-భూరివృక్ష-

ములను, రావిని, సిద్ధకపిలుడ నేను!

చెలగు గంధర్వ వీరుల చిత్రరథుడ!

నారదుడనేనె! వివరములరసి చూడు!

36*

ఉచ్ఛైశ్రవము,నైరావతములును, నేనె!

రాజు, నాయుధ పతిని-వజ్రాయుధమును,

ధేనువుల కామ ధేనువు నేనె! సంతు-

కారకుడ, కాముడను నిరాకారముగను!

37*

నాగులను వాసుకిని, శేషనాగు నేను!

వరుణ దేవుడ! పితరుల నార్యముడను!

శాసకుల యముడను నేనె! శక్తి నేనె!

పక్షులందు గరుత్మంత పక్షి నేనె!

38*

శస్త్రధారుల శ్రీరామ చంద్రుడేను!

జలచరాల మొసలి నేను! సాగు నదుల-

గంగ నేనె! పుట్టుక, గిట్టుకనగ నేనె!

యుర్వి సృష్టి, స్థితి, లయ త్రిమూర్తి నేనె!

39*

తర్క వాదాల శాస్త్రీయ తర్క మగుదు,

అక్షరాల”న” కారము, ద్వంద్వ పదస-

మాసమును, అక్షయమగు, సమయము నేనె!

కాలమును, జన్మ మృత్యువు కారకుడను!

40*

స్త్రీలలో కీర్తి, శ్రీనుడి, స్మృతియు, మేధ-

ధైర్యము, క్షమాస్ఫూర్తియు దయను నేనె!

చందములవేద గాయత్రి చంద మగుదు!

మాసముల మార్గశిరమును, మరల వినము!

41*

ఋతువసంతమున్, వ్యసనాల జూదమేను

నిశ్చితుల మదియందునే నిశ్చయమును

వాసుదేవుడ! వ్యాసుడ! ఋషుల యందు

సత్వ గుణమేను, జయమున సర్వమగుదు!

42*

జ్ఞానవంతులలో జ్ఞానజన్యమగుదు!

గోప నీయాల మౌనమున్ భూత తతుల

బీజమైయుందు, జీవి ప్రీతి భీతి

నటన-ఘటన నాదె జగతి నాటకమున!

43*

కుంతి పుత్ర వినుము! నాయనంతమైన

సకల లీలలు దెల్పగా సాధ్య పడదు,

జగతి శోభించు నైశ్వర్య ప్రగతి నేనె!

ప్రకటితంబుగ తద్వస్తు ప్రతిభ నేనె!

44*

అర్జున యనంతకోటి బ్రహ్మాండనాయ-

కుడను, విధిగ నీరథమందు కోల కళ్ళె-

ములను, చేబూని, నీయాజ్ఞ ముదల దాల్చి

కదలనుంటిని నిజధర్మ కార్మికునిగ!

45*

(అర్జున ఉవాచ)

హేప్రభో! కృష్ణ! నీవాక్కు హేతువుగను

మోహమంతరించెను, మదిమోదమొందె!

నీదు వాక్కులు నమ్ముదు, నిజమటంచు!

నీదు దివ్యవిభూతుల నింక దెలుపు!

(విశ్వరూప సందర్శన యోగము)

46*

(భగవాన్ ఉవాచ)

అర్జునా విను, ఆదిమధ్యాంతమేను!

ప్రాణులందు నాత్మను, తేజ ప్రాభవమును

కవుల,? కవిశుక్రుడను నేనె! కలుగు సకల-

ప్రాణి కోటి చరాచర ప్రకృతి నేనె!

47*

పాండవులలోన పార్థుడ! పరగ దెలియ

నేనె – నీవును, నీవును నేనె యగుదు!

అరయ దివ్య విభూతులకంతమేది?

చెప్పెద క్లుప్తముగ దీని చెవిని బెట్టు!

48*

(అర్జున ఉవాచ)

ఓప్రభో! పురుషోత్తమా! కోర్కె వినుము!

చూపుమైశ్వర్య మయమగు రూపు విశ్వ-

ప్రాణి యుత్పత్తి వింటిని, ప్రళయగతుల-

జాడ వింటిని, తమరూపు జూడనెంతు!

49*

దివ్య మైశ్వర్యమయరూపు! దివ్యకాంతి

దేవ దేవ! నిన్-చూడగాలేను తండ్రి!

కనులు మిరుమిట్లుగొల్పు నేకముగ భూన-

భోంతరాలమునిండె కాంతిరేఖ!

50*

(భగవాన్ ఉవాచ)

దోష రహిత దృష్టిని జూడ దోచు రూపు-

విశ్వసించి గాంచుమిదియె, విశ్వరూపు!

సవ్య సాచి!యిచ్చెద దివ్య చక్షు యుగము-

చూడు, నాయోగ శక్తిని జూడుమింక!

51*

(సందర్భ వాక్కు)

అడిగె రారాజు, సంజయా! యంతనేమి?

చేసె భగవానుడన, దెల్యజెప్పె నిట్లు-

దేవ-దేవుడు దయచేసె దివ్య చక్షు

జూచి పులకించె నరుడు కేల్మోడ్చి మ్రొక్కె!

52*

(అర్జున ఉవాచ)

హే! సనాతన! శాశ్వత! హేముకుంద!

నన్ను బ్రోవగా నాధ్యాత్మికమ్ము దెలిపి

దోష రహిత దృష్టిని దూర్చి దోవజూపి-

సంశయము దీర్చినావహో సారసాక్ష!

53*

మదిని విశ్వాసముదయింప మైత్రి వెంట-

గోపనీయమౌ నీతత్వ రూపబోధ

జేసితివి, తండ్రి! సమర విజేత జేయ!

వింటి, కనుగొంటి,నిపుడు నీ విశ్వరూపు!

54*

తమరె,అక్షర పరబ్రహ్మ! తమరె రక్ష!

జగతి సర్వస్వము తమరె సగుణ నిర్గు-

ణమునిరాకార సాకార నమ్మకంబు-

తమరె, యనుమాట నిజమయ్యె తరచి చూడ!

55*

తమరె, గతవర్తమాన గతాగతముల-

తమము బోకార్చు తత్వంబు తమరి మహిమె!

రాక్షసుల్ పారిపోయరి-రాగమెత్తి-

పాడుచుండిరి, భక్తులు పరవశించి!

56*

ఉగ్ర రూప! నీనోటిలోనురుకుచున్న-

సకల లోకులు, మునిజనుల్ స్వస్థి బలికి

దూరుచుండిరి, దేవతాదులును, సకల-

జాతులును, నిన్ను జేరగా జ్వాలలెగసె!

57*

ఉగ్ర!యుగ్రదృగాయుధ!యుల్లమెల్ల-

ఝల్లుమనె,తల్లడిల్లితి,సంభ్రమమున-

దృశ్య భీతి విడ్డూరముల్-దృక్కు నిల్ప!-

తమముఖజ్వాల లధికావయమ్ము లెన్నొ!

58*

ఎన్ని, ఉదరాలు? వానిలోనెన్నిలోక-

దృశ్యలీలలు? సృష్టించు దృక్పథములు!

అన్ని ముఖ కర చరణముల్ అగ్ని నిధులు!

దిక్కులును దెల్య కున్నవో దేవదేవ!

59*

కోటి సూర్య చంద్రులు, శతకోటి కిరణ-

కాంతి, కనుదోయి బైరులు గ్రమ్మె శేషు

తలలు-నాగులు చేరి వేయినోళ్ళ-

పొగడలేరన్న నేనింక పొగడ గలనె?

60*

చేతగాదు విశేష సశేష చేష్టగాగ!

కవుల వర్ణన కందని చవులు మీరె!

విశ్వ రూప కటుంబ వివిధ ధృవుల-

నక్షయంబగు నక్షత్ర సాక్షి నైతి!

61*

తమరె!గతవర్తమాన గతా గతముల

తమమముబోకార్చు తత్వంబు తమరి మహిమె!

రక్షసుల్ పారిపోయిరి రాగమెత్తి-

పాడుచుండిరి భక్తులు పరవసించి!

62*

ఉగ్ర రూప! నీనోటిలో నురుకుచున్న-

సకల లోకులు-మునిజనుల్ స్వస్తి బలికి-

దూరు చుండిరి దేవతాదులును, సకల-

జాతులును, నిన్నుజేరగా జ్వాలలెగసె!

63*

ఉగ్ర! యుగ్రదృగాయుధ!యుల్లమెల్ల-

ఝల్లుమనె, తల్లడిల్లితి-సంభ్రమమున-

దృశ్య భీతి విడ్డూరముల్ దృక్కునిల్ప!

తమ ముఖజ్వాల లధికావయమ్ములన్నొ!

64*

ఎన్ని యుదరాలు? వానిలో నెన్ని లోక-

దృశ్య లీలలు? సృష్టించు దృకపథములు

అన్ని ముఖ కర చరణముల్, అగ్ని నిధులు!

దిక్కులును దెల్య కున్నవో దేవదేవ!

65*

కోటి సూర్య చంద్రులు శతకోటి కిరణ-

కాంతి, కనుదోయి బైరులు గమ్మె, శేషు-

వేయి తలలు నాగులుచేరి వేయినోళ్ళ-

పొగడలేరన్న, నేనింక పొగడ గలనె?

66*

చేతగాదు విశేష సశేష చేష్ట గాక-

కవుల వర్ణన కందని చవులు మీరె!

విశ్వరూప రవికుటుంబ వివిధ ధృవుల-

నక్షయంబగు నక్షత్ర సాక్షి నైతి!

67*

భీష్మ ద్రోణాదులును త్రెళ్ళి భీష నాగ్ని-

కీలలందుబడిపోయిరింక, కర్ణ-

కౌరవాదులు నుదరాగ్ని గాలి రంత-

మిడతలట్లు జొచ్చిరినోట మిగతవారు!

68*

రయము జెందెను, నరరూప రాక్ష సాళి

కోరవడిముక్కలైజిక్కె-కోరనంటి-

యుండ గాంచితి, సైన్యంబు లండనుండ!

మిగత వారంత వక్త్రాగ్ని మిడత లైరి!

69*

నదులు,జలధికభిముఖమై నడిచి నట్లు-

శూరభీష్మాదలేగిరి, క్షుద్రనృపులు-

నీతి-భయభక్తి మూర్చిల్లి-నీల్గిరంత!

ఉగ్ర తేజస్సు జగతినుఱ్ఱూతలూపె!

70*

తమరు ఎవ్వరు? దేనికై తపన పుడమి!

దేని గోరి విజృంభన? ఏమిసృష్టి?

ఏల స్థతి లయకారచేష్ట? మాయ-

మానుషస్వరూపము, యోగమాయలేల?

71*

ఓప్రభూ!దివ్య శ్రేష్ఠ! దెలుపు మోమహేశ!

ఈశ్వరా! దీనబాంధవ! ధీవిశేష!

ఆది మధ్యాంత రహిత! విఖ్యాతరూప!

వసుధ నాకు ప్రసన్నుడవగుము, దేవ!

72*

ఏది మీవృత్తి? ప్రావృత్తి యేది నిజము?

దేనికీ పరస్ఫర వైర తేజ ఘటన?

ఎందుకీ రూప వైవిధ్యమొందు నటన!

యోగ మాయలో నీలీల సాగుటేల?

73*

హే పరబ్రహ్మ! పరమాత్మ! దేవదేవ!

దివ్య ఐశ్వర్యమయరూప! దివ్యతేజ!

ఆది రూపుడ! నీతత్వమంత దెలుపు!

వణుకు మాన్పి ప్రసన్నుడవగుము దేవ!

74*

(శ్రీభగవాన్ ఉవాచ)

అర్జునా విను, కరతలామలకముగను,

కనుము, నాయందె, యమధర్మ కాలగతిని

కాలుడను నేనె! జీవన కారకుడను!

నేనె, కాలపురుషునిగాగ, నెఱుగుమింక!

75*

కోరి మీపక్షమున జేరి, కోరినట్లె-

వైరి పక్షంబు తోసహ, కౌరవేంద్రు-

ద్రుంచు వంకతో, వచ్చితి! దుష్ట శిక్ష-

సాగు, జీవశ్చవములట్లు శత్రులజూడు!

76*

లెమ్ము!జాగ్రత నిలువు, విజేతవగుము!

నీవు జంపక ముందె నిర్జీవులట్లు-

గనుము పరుల, కారణమాత్ర కదనవీర!

జయము నీకగు, యుద్ధంబు జేయు మింక!

77*

(అర్జున ఉవాచ)

కృష్ణ! భీతి మ్రొక్కెద నిన్ను, కృపను జూడు,

సాగదేమాట, గద్గద స్వరము గలిగె!

ఓహృషీకేశ!నా మది మోదమొందె!

మాటికి పొగడగా లేను, మాట రాక!

78*

జగతి పులకించె-రాకాసి సంఘమంత-

పారిపోయెను, నీనామ భజన మహిమ!

సిద్ధులాడిరి, భక్తులు చిత్తశుద్ధి-

చిందులేసి పాడిరి నీ ప్రసిద్ధ చరిత!

79*

వింత మీరూపము, ననంతప్రేమ!

తీరు తెన్ను సాక్షరములు తెలిసినంత-

మీరె! సత్తసత్తుగ మరి వేరుగాను-

వెలయు దానికి పరమైన వేల్పు మీరె!

80*

జగతి అక్షరాచ్యుత రూప! సత్త సత్తు!

ఆది మధ్యాంతముల పరమాత్మ మీరె!

దానికంటెను పరమైన ధాత మీరె!

బ్రహ్మ జనక తమరె, పరబ్రహ్మమనగ!

81*

ఓయనంతరూపుడ! సర్వలోక నిలయ

నింగి నేల సందును లేక నిండి యుండి

తమరె, సర్వస్వ మనియెంతు, తమహరుండ!

కనులు చాలవు మిముగాంచ కమల నయన!

82*

ఓప్రజాపతి!పరమాత్మ!వోమహేశ!

వాయు,యమ,యగ్ని,శివ, బ్రహ్మ, వరుణ సూర్య-

చంద్ర, యింద్రాది దేవత చత్ర హస్త!

నేను నామేను గనలేక నెగడు చుంటి!

83*

వ్యోమకేశ!నేనిను బిల్చు-నోర్పు దప్పి

మైత్రి కోపింతు-చుల్కన మాటలందు-

ఏకవచనంబు బంధువై మేలమాడి-

యాదవాయంటి, మన్నించు, మాధవుండ!

84*

మిత్రుగానెంచి,మితిమీరి,మిగుల చనువు

మసలు నాటినా నడవడి మనసు చెదరు!

మేను వణికేను, గతమునే నెంచి చూడ!

నీదు కరుణ జూపుము! నను సేదదీర్చు!

85*

స్వామి!నాయపరాధముల్ సైచి, యభయ-

మిమ్ము! నీరూపము నుపశ మింపు మింక!

ఆత్మ బాంధవా! క్షమియించు నాటివలెనె!

నాల్గు భుజముల విష్ణువై నన్ను బ్రోవు!

86*

ఓసహస్రబాహు!ఓవిశ్వమోహనాంగ!

ఉగ్రరూపంబు వెంటనె యుపశమించు!

తగు ప్రసన్నాకృతిని జూపు తండ్రి యనగ!

దయ, చతుర్భుజ రూపంబు దాల్చె హరియు!

87*

అనితరేతర సాధ్యము! ననవరతము

గొల్చు వారైన గనలేని గొప్పరూపు!

తాపసులకైన జూడంగ తరముగాని

తనదు మానుష రూపంబు దయను జూపె!

88*

(భగవాన్ ఉవాచ)

నరుడ! నీసర్వ కర్మలన్ నాకొసంగి-

నాపరాయణుడ వగుము నన్నె నమ్మి-

యన్యచింతన మానుము-ఆత్మ భావ-

వైరరాహిత్య కైవళ్య పదము జెందు!

89*

జగతి సంసారికాసక్తి జనక, జన్య-

చింతనము మాని నిశ్చలచిత్తమందు

పరమ రూపస్వభావంబు పదిల పరచి

నిలువుమర్జునా!నాభక్తి నిష్ఠయందు!

90*

అన్య చింతరాహిత్యమై యలరు మింక-

నెపుడు మరవక, మదిశ్రద్ధ యెసగ-సమత

సాగు, సర్వత్ర సమబుద్ధి – సంయమనము,

చేత వెలయు భక్తుడె సర్వ శ్రేష్ఠుడగును!

91*

(భక్తి యోగమ)

వ్యక్త రూపుగొల్చు జనులవ్యక్త రూపు

గొల్చు యోగులుందురు, వీరిలోన నాకు

నిష్ఠుడగు భక్తుడే, శ్రద్ధ నిష్ఠ గలుగ-

నాపరాయణుడు, పిదప నన్నుబొందు!

92*

మనసు బుద్ధి నాకర్పించి, మనెడు వారు

నిరత మాత్మలో ననుగాంచు, నిష్ఠగలిగి

మననమభ్యాస యోగంబు ననుసరింప-

సిద్ధిబొందియు, నాలోవసించుచుంద్రు!

93*

చేయు కర్మనాకోసమే చేయు వారు

చేత గాకున్న-తుదకునా చిత్త భక్తి

సాగి, నిత్య జీవన ధర్మ సాధనముల

తత్వమును దెల్సి నాభక్తి దనరు చుండు!

94*

నీవు నాకోసమే కర్మ నిలిచి సాగు!

తరముగాకున్న ననుజేరి శరణుబొందు!

నమ్మి నాభక్తి యోగమ్ము నాశ్రయించు,

పిదప కర్మ ఫలత్యాగ ప్రీతి గొనును!

95*

సకల కర్మఫలత్యాగ సాధనంబు-

నిష్ఠ నభ్యాసమొనరించనీకు మేలు!

తాపసులు సిద్ధులకు గల్గు తత్వసిద్ధి,

నీకు గల్గును, జ్ఞానికి నిదియె త్రోవ!

96*

సకల ప్రాణుల స్నేహంబు సాగి, తృప్తి

దయయు, సమదృష్టి వర్తింప, దనరు శాంతి!

నిష్ఠ నిష్కామ కర్మచే నిర్భయంబు!

సకల సుఖదు:ఖములనొక్క సరణి గనుము!

97*

సకల భూతమైత్రిని గల్గు సహన శాంతి!

అహము దొలుగంగ, సమభావ మలవడంగ

యింద్రియంబులు-వశపడ, ప్రీతి వెంట-

మనసు బుద్ధి నాకర్పించి, మనుట మేలు!

98*

మదిని ఈర్ష్య, భయోద్వేగమంతరింప-

నితర ప్రాణుల కివియు గల్పింప నీక

సాగు బ్రతుకు ద్వద్వాతీత సాధకుండు

నితర నిస్వార్థపరుడు నాకిష్టుడగును!

99*

స్థలము- తనువును – తలపున-తదితరాల

మమత వీడియు, స్థిరబుద్ధి మనెడువాడు

మననశీలుడై యాసక్తిమాని-నన్నె,

విశ్వ సర్వస్వమని భక్తి ప్రీతి గొనును

100*

భక్తి మార్గమే, సుళువైన ముక్తి బాట-

సాగు, నిస్వార్థ భక్తుడే నాకు ప్రియము-

గూర్చు వాడగు, సిద్ధియు గుణములందు

ప్రీతి గలిగిన ప్రియమైన రీతిజూతు!

101*

(సందర్భవాక్కు)

గీతపాఠమే,విద్యార్థి క్రీడి యడుగ

గుట్టు బోధించె తత్వంబు పట్టు వడగ

విశ్వరూపాన విషయ వివేకమొసగి

మాయ గెల్వగ ధరభార తీయు నిలిపె!

102*

విపుల విషయ సంగ్రహప్రశ్న విజయు డడుగు,

వివిధగతిసమా ధానముల్ విభుడొసంగు

విజ్ఞ శాస్త్రార్థ బోధనల్-విస్తరించ!

భారతీయత్యాగ సంపదయె, గీత!

103*

రూఢియయ్యెను, విశ్వస్వరూప రేఖ!

సాక్షిగా భారతుడు నిల్చె, సామి గీత-

నరుని నారాయణుని జేయు నాదబ్రహ్మ!

ఉపనిషత్తు సారాంశ మైయుర్వి మ్రోగె!

104*

భాగవతమందు తొమ్మిది బాటలుగను

సాగు నవవిధ భక్తులు, స్వామి గొలిచి-

పుణ్య సంపన్నులగుతీరు, పుడమి జీవి

కర్మ పరిపక్వతను ముక్తి గాంచు విధులు!

105*

భక్తి గల్గిన పెద్ధల భక్తి గలుగు-

నిష్ఠ గల్గిన సద్భక్తి నిగ్గుదేలు!

భక్తి, జీవిలో దేవుని-ప్రతిభ జూపు!

ప్రజల భక్తిగా రూపొంది పవిత్ర మగును!

106*

భక్తి పేరట కొనసాగు బహుప్రయాస!

లౌకికము గాదు-భువిపారలౌకికంబు!

వేష బాషా విశేషంపు బేషజాలు!

డాంబికపువృత్తి నిజభక్తి డాయలేదు!

107*

భక్తి శ్రద్ధచే గీతార్థ భావ గతుల-

ఆత్మ పరమాత్మ తత్వంబు నరయు విధము-

దెల్పె, శ్రీకృష్ణ పరబ్రహ్మ దివ్య వాణి-

దోష రహిత దృష్టిని సాగు దోవ జూపె!

108*

శుభము విశ్వాత్ము రూపంబు జూడ శుభము

అక్షరబ్రహ్మ! యవినాశి! యద్భుతోక్తి!

అభయ హస్తంబు, దయచేసి శుభము లిచ్చు!

శుభము శతకగానము నిత్య శుభప్రదంబు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page