
గీతాగానము-3
(తే.గీ.)
1*
శ్రీశ! గోవింద! శేషాద్రి శిఖరవాస!
దుష్ట శిక్షక! సంచిత దురితనాశ !
శిష్ట రక్షక! శతకము స్వీకరించు!
సాదు చిత్త నికేతన! సారసాక్ష!
2*
క్షేత్రమగు దేహమున దేహి తేజరిల్లు!
దేహి చెప్పబడు “యిదిగ” దేహమందు!
అనగనాత్మయే క్షేత్రజ్ఞుడనగ జెల్లు!
దీని దెలియుటే జ్ఞానము తేల్చి చూడ!
3*
తనువు ప్రకృతినేకమై దనరు చుండు!
నాత్మ నాతోడ నేకమై యలరు చుండు!
దారి నెంపిక జేయుటే తగిన ప్రజ్ఞ!
కలుగు నాతోడ నీకు నేకత్వ సిద్ధి!
4*
పంచభూతముల్ జ్ఞానము పరగ కర్మ
నలరు పదియింద్రియంబులు నహము బుద్ధి-
మనసు, ఇంద్రియ విషయాలు, మరల నైదు-
గూడితే క్షేత్రమనిదెల్పు రూఢి వాక్కు!
5*
తెలియ,సప్తవికారముల్ – ద్వేషమిచ్ఛ,
సుఖము, దు:ఖము, చేతన, ధృతియు, తనువు-
దేల్చి చూడ తద్రూపముల్ తేజగతులు
ముందె దెల్పితి సంక్షిప్తముగను నీకు!
6*(అర్జున ఉవాచ)
క్షేత్ర రూప దర్శనంబు చేయుటెట్లు?
తనకు తానుగ క్షేత్రజ్ఞ తత్వమెరుగు,
సూచి జేతురు కొందరు జూడ, నాకు-
బోధపడదాయె “ఇది”దెల్య బూనుటెట్లు!
7*(భగవాన్ ఉవాచ)
తెల్పెదను విను క్షేత్రము వెలయురీతి!
ఇరువదియగు పాదాల నింపు మీర-
ఒకటి, నిర్మోహ శ్రేష్ఠత్వమొందుటగును
తన నిరాడంబరత్వమై దనరు రెండు!
8*
తనువు చిత్త శుద్ధిని గల్గి దనరు మూట!
ప్రాణహానిమానుట నాల్గు, పరగనైదు-
గురుల శుశ్రూష, సుజ్ఞాన గుర్తు గాగ-
తదితరమగు పాదంబుల తరచి చూడు!
9*
జనన,మృత్యు,జరారోగ జాడ్య హేతు-
భూతపరిశీలనము వెంట భువిని గదుల-
శుచియు, శుభ్రత, త్రికరణాల శుద్ధి, నిరత-
సాధన ధృతచిత్త నిగ్రహ సామ్యదృష్టి!
10*
ఇంద్రియ విషయ లోలత వీడి, భోగ-
రాగమును వీడి సహన వైరాగ్యగతుల-
సమముగా కొనసాగు సంసారగమన-
బంధముల కన్న-మిన్న నా భక్తి గొనుట!
11*
కొంత సంసార సహవాస మొప్పు విధము
కొంతనేకాంత వాసము కొంత యెడము
పవిత్ర భావము, ప్రీతి ప్రాపంచికంబు
నన్ను సర్వత్ర దర్శింప నయము జయము!
12*
జ్ఞేయ తత్వంబు, నమరత్వమేయటంచు
తత్సదాసదమనరాని దనగ దెలియు
నాది మధ్యాంత రహిత సృష్ట్యాది తత్వ
మదియె పూర్ణ పరబ్రహ్మమదియె చూడ!
13*
జ్ఞేయ విజ్ఞానవేదిక క్షేత్రమదియె!
వాసుదేవస్సర్వమనెడు- వాస్తవంబు
భక్తిచేనట్టి పరతత్వ ప్రాప్తిబొంది
సృష్టి సుస్థితి లయముల దృష్టి గొనుము!
14*
కార్య కారణ హేతుగా గలుగు ప్రకృతి
పురుష సుఖదుఃఖ గుణము, వికార గతులు
మూడు మూర్తుల పరమాత్మ ముడియు బడిన
చందములను ప్రకృతి పురుషు లందు గనుము!
15*
దేహి-దేహబధము దెల్సి దేహమందు
ముడిని బడినట్టి పరమాత్మ విడిగ గాంచు
దేహమేక్షేత్రముగ జేసి దేహి దనరు
దేహమునకు వేరుగా దేహి తేజరిల్లు!
16*
తనువు క్షేత్రముగజేసి ధనరు నాత్మ!
ఆత్మ వెలుగులో క్షేత్రజ్ఞు నరయ వలయు!
తనువునకు వేరుగా జన్మ తరలు జన్మ
జన్మ హారాన దారమై తేజరిల్లు!
17*
ప్రకృతియే క్షేత్రముగనుండు, పరగ నిండు
సూర్య రశ్మిగా, క్షేత్రజ్ఞ సూచి-ప్రకృతి –
పురుషుడంటక, నాకస స్ఫూర్తి వెలయు!
సర్వమున వేరుబాటలో స్వామి జేరు!
18*(గుణత్రయ విభాగ యోగము)
తల్లి వంటియుత్పత్తియు తండ్రివంటి
బీజ సంస్తాపనమునాదె! ప్రీతి జీవ-
జన్మ సత్వరజస్తమో గుణ్యగతుల
దేహి బంధింపబడుచుండు దేహమందు!
19*
సహజ నిర్మల తేజమౌ సత్వ గుణము
సుఖవికారము లేనిది సుంతవాంఛ
గలుగు విజ్ఞప్రవర్తన కారణముగ
దేహి బంధించు, దానిచే దేహచింత!
20*
తృష్ణ నాసక్తి రాజసతృప్తినందు-
రాగమైనది కర్మాను రాగ గతుల,
దేహి బంధించు, నజ్ఞాన తెరల బుట్టు
మోహపూర్వకమైన తమోగుణంబు!
21*
నిద్ర నిర్లక్ష్య వైఖరి నిర్గుణంబు-
తామసికి, దైవవైరంబు, తరచు గలుగు
నిరతమజ్ఞాన తమమందు, తిరుగు బుద్ధి!
దేహిబంధించు, తుదకు నిస్తేజమొందు!
22*
పుడమి కర్మ రజోగుణ పూర్వకంబు
కోర్కె వెలయు నూతన కర్మ కొఱకు వెదకు,
బుద్ధి కర్మ నిల్పగ శక్తి వృద్ధి గాంచు,
సోమరి రజోగుణముచే సొమ్మ సిల్లు!
23*
సత్వ గుణముచేత వివేకశక్తి విరియు!
పొందు సుఖశాంతి, ఘనకీర్తి నొందు, నితరు-
ప్రోత్సహించు సాధకుల నుత్తమోత్తమునిగ-
కదలి పోవు సాత్వికుడు సద్గతిని బొందు!
24*
జగతి లోభము గూర్చు రాజసగుణంబు!
మోహమున తామసుడు తల మునకలగును,
సాత్వికునకు నుత్తమగతుల్, సాధ్యపడును
జీవుడు త్రిగుణంబులను జను జీవయాత్ర!
25*
సాత్వికుడు సాధువుగజను, స్వర్గమునకు,
మనిషిగాబుట్ఠు రాజసి మర్త్యమందు!
తామసికి నీచ నరకాల తగిన జన్మ!
జ్ఞాన, లోభ, మోహమ్ముల గణన వరుస!
26*
త్రిగుణ జోక్యంబుచే కర్మ తెరగు గల్గు-
నమ్మి కర్తృత్వభావంబు నధిగమించి,
మూగు త్రిగుణాలకందక సాగు వాని-
మెచ్చి పరమాత్మనై ఫలమిచ్చి బ్రోతు!
27*
గుణములను దాటి కార్యకారణంబు దెలిసి
జనన మరణ జన్మావృత జరయు రుజయు
దాటి, కర్తదైవంబని, దలచు కర్మ-
లందు బుద్ధివివేకంబు లబ్ధిగూర్చు!
28*
ద్వంద్వములకతీతుడు, భువి త్యాగి, కర్త-
గాక, కర్తృత్వమును వీడి, కర్మలందు-
సాగు, సమబుద్ధి నాచార సమత గల్గు!
సాక్షిగా స్థితుడైచను, సాధకుండు
29*
భక్తయోగియు,నన్యంపు బాటజనక,
పట్టి విడని దీక్షను సాగి, పట్టుదలగ-
నన్నై, శరణాగతినిబొంది, నడుపు బ్రతుకు
భద్రమైసాగు, తానొందు బ్రహ్మ ప్రాప్తి!
30*
గుణములే ప్రవర్తిల్లును గుణము లందు-
గాని, కర్తృత్వ భావంబు మానవలెను!
సర్వమును సచ్చిదానంద శక్తి మహిమ-వెలయ లీనమైపోవు సుస్థితిన్ నిలువ మేలు!
31*
సంతతమనన్య సద్భక్తి స్వామి దలచి
బ్రతుకు, త్రిగుణములు దాటి భక్తి యోగి!
భజన సాగు సనాతన పథము వెంట-
దైవమే నడుపుదు సద్భక్తి దారి ముక్తి!
32*
భక్తి యోగి గుణాతీత శక్తి నొందు-
అమృత మవినాశి, పరబ్రహ్మమనగ నన్నె-
నమ్మి, నన్నాశ్రయింపగా, నన్నుజేరు!
ధర్మమును నిల్పునేతను, ధాత నేనె!
*(పురుషోత్తమ యోగము-అర్జున ఉవాచ)
33*
హేమహాదేవ! అవినాశి నామ బ్రహ్మ!
తమరె! వీనికాశ్రయమైన, తమరె, జగతి-
దేనికాశ్రయమగు-నెట్లు-దెల్ప వలయు?
తమరు దేనికాధారమై దనరు చుంద్రు?
34*(శ్రీ భగవాన్ ఉవాచ)
సుధను, సుఖశాంతి కారక శుభము, ముదము
యెడములేక యెదగూర్చు ఏడు గడను!
పుడమి సాగు ధర్మ సనాతనుడను నేనె!
జగతి కాధారమును నేనె! జగము నేనె!
35*
సృష్టి జీవచరాచర స్రష్ట నేను,
అన్నిటను నేనె, నాలోనెయన్నిగలవు,
దివ్య వృక్షాశ్రయము నేనె, దీప్తి నేనె!
ఆదియంత్యంబు లేని యశ్వత్థమగుదు!
36*
వేర్లు,పైకి కొమ్మలు రెమ్మ వెలయు, చిగురు-
లాకులెల్లక్రిందికి బెర్గు, లోకములను-
వింత సంసారవృక్షమై విశ్వమందు-
తత్వసారమై నాబోధ దనరు చుండు!
37*
శాశ్వతముగాని దనుటె యశ్వత్థమనగ-
జగతి, సంసారవృక్షంబు, సత్వమాది-
గుణముల ద్వార పెరిగి భువనములందు
విస్తరించు, నవ్యయమూల విధులనుండు!
38
దీని దెలియుటే వేదార్థ దీప్తి గనుట-
వేదవేద్యుని తత్వమై వెలయు నిదియె!
వింత జగతిని వృక్షమై వెలసి-ఫలము
లన్ని నరలోక ఫలశాఖలందె గాయు!
39*
వేర్లు పైకి కొమ్మలు క్రిద వెలయు దిశల-
మర్త్యకర్మఫలము వెంట, మరొక లోక-
శాఖననుభవింపగ జన్మజన్మ గూర్తు!
కోర్కె విడనాడి శరణనన్న కోర్కె దీర్తు!
40*
జ్ఞానయుక్త వివేకులు జననమరణ-
మొంది తగునాత్మ సంభావ్య మోదముక్తు-
లగుచు,నిర్లిప్తతను సాగి లబ్ధి గొనుచు
భారమంతయు నాదని బ్రతుకు చుంద్రు!
41*
జ్ఞాన హీనులు, జరరుజ, జననమరణ-
పీడితులు, దేహమున నిత్య ప్రీతి, నిహపు-
మూలమెరుగరు, భవబంధ ముక్తి గనరు!
వెలితి లేని విశ్వాసంపు, విలువ – వినరు!
42*
జగతి జలమందునున్నను, జలము నంటక-
కుండ, నుండు తామర పత్ర దండి తనము
సామ్యతగ సాగు, సంసారి సత్యమెరుగ-
వెలయు నాత్మవిశ్వాసము వెతి పడక!
43*
నేనె,రవిశశి యగ్నుల తేజమగుదు-
నేనె, విశ్వాత్మగా జీవి నేలు చుందు!
జీవిజీవనస్వాతంత్ర్య భావమొసగి-
కలదు లేదన్న తద్భావ్య గమ్య మగుదు!
44*
జీవి జీవిని వెలయు నా దివ్య యంశ!
సృష్టి సర్వోపగతుడనై పుష్టి గూర్తు!
ప్రాణి జీవనమార్గము పరగుపగిది-
తిండిజీర్ణింప జఠరాగ్ని దీప్తి నిడుదు!
45*
వేద కర్తను, వేదాంత వేద్యుడనగ
అక్షరాచ్యుత బ్రహ్మ నే నక్షయుండ!
శాశ్వతుడను, సర్వజ్ఞుడ! సర్వ విధుడ!
నేనె యవినాశి పరబ్రహ్మగా నెఱుంగు!
46*
గోపనీయమిది పరమగోప్య విద్య!
పట్టువడదిది, బహుకష్ట పడినదెలియు,
బ్రహ్మ విద్యయనజెల్లు-పాపరహిత-
దృష్టి నరుడ! నీకందె, నదృష్ట వశమె!
47*
యోగవిద్యగా నీవల్ల లోకములకు-
గుప్తమైయందెనిది, ముక్తి గూర్చు విద్య-
శోకరహితమై-సత్యమై లోకహితవు
గూర్చు దీనిదెల్యుట, నన్నుజేరు వరమె!
48*
క్షరుడు,అక్షరుడు,ద్విలక్షణులు గాగ
సాగు సృష్టి-అక్షరుడు శాశ్వతుండు!
పరమ పురుషోత్తముడు తానె పరమ పితయు,
వెలయు నాత్మలో పరమాత్మ వెలుగు తానె!
49*
ఉత్తముడ నేను! భువినక్షరుండనేను!
నశ్వరుడగాను, వేరుగా నలరుచుందు!
క్షరుల, నక్షరుండను కర్మసాక్షి నేను!
వేదవేద్య పదవిబొంది వెలయు చుందు!
50*
అన్య భావంబు విడనాడి, నన్నె గొలిచి-
గోప్యమిది దెల్సి, నమ్మిన కోర్కెదీరు!
అన్ని విధముల నాయందె యున్నవారి-
డాసి సమకూర్తు, కృతకృత్యుడగునతండు!
*(దైవాసుర సపద్విభాగ యోగము)
51*(అర్జున ఉవాచ)
స్మృతియు లభియించె సంశయ స్ఫురణ దీరె!
కృష్ణ!నీకృయె నాయెద-ధృతియు గలిగె!
తొలగె, నీబోధ మహిమచే దోషదృష్టి!
బ్రహ్మ విద్యసాధన దివ్య భావమెసగె!
52*(శ్రీభగవాన్ ఉవాచ)
దైవ సంపదయననాదె, దానిచేత-
నాకు దేవదేవుండను నామ మలరె!
దేవ గుణసంపదలు దివ్య చేవ గతులు-
నన్ను పొందు సాధకములే, యన్ని దెలియు!
53*
భయములేని విశ్వాసము, భామందు-
యాత్మ ననుబొందు దృఢనిశ్చయంబు, సమత-
సాత్వికత, దేల్చి, నాతత్వ సారమెరుగు!
యింద్రియాలణచియుదీక్ష నిర్వహించు!
54*
శాస్త్ర సిద్ధాంతముల కర్మ నాదరించి
కష్టమును హర్షముననోర్వగలుగు ఋజువు-
తనువు, మది, వాక్కు, త్రికరణ తాల్మి శుద్ధి!
ధాతవైసాగ లోక విఖ్యాతి గలుగు!
55*
ప్రీతి వచనాలతో భూత హితవొనర్చి,
భూత నిలయుండన నన్ను బూని కొలిచి
కోపగించకను ప్రపంచ కోరికలను,
పెరికి వేసియు నిశ్చల ప్రేమనుండు!
56*
కోపతాపము స్వార్థంపు పోకడలను-
కొండెములు మాని, దయబూని యుండుటొప్పు!
సతము ప్రియవాక్యముల ప్రాణి హితవు
-సహన-
దీక్షసాగిన దైవ పరీక్ష నెగ్గు!
57*
భూతహితవు సత్యముగాగ పుడమి వెలయు
హేతు రహిత సత్యవ్రతము హితము గూర్చు
శుద్ధి త్రిగుణాలధిగమించి బుద్ధి నెపుడు
రాగ విద్వేషరహితమై సాగ వలయు!
58*
ధృతిని కోమలవైశాల్య మతిగ విశ్వ-
విషలోలత్వమును వీడి, విహిత కర్మ,
బిడియ పడక, కర్తవ్య విధి ప్రీతి నడిపి-
భూతదయగల్గి జీవింప పణ్యప్రదము!
59*
శిక్ష సామర్థ్యమున్నను, చిరుతరాప-
రాధి, మన్నించి, సర్వాపరాధినంచు-ద్రోహచింతన నెడబాసి సాగి
యాత్మ శుద్ధి బడసిన మహాత్ముడగును!
60*
దైవి సంపద, నరజాతి దనరు చుండు!
అసురి సంపద బంధింప నమ్మకంబు-
నా స్తియై చను, వైరుధ్య జాస్తి వాచ-
మీశ్వరుని వీడి యితరంబు నాశ్రయించు!
61*
విశ్వసించు ప్రాధాన్యత విలువ ధర్మ-
బద్ధమైయుండ, నాశక్తి బరగుచుండు!
సిగ్గుపడవలె, నాచారవిధి విరుద్ధ-
పనులు వీడిన నిశ్చల పటిమ వెలయు!
62*
నరుల లోకాన నాదన్న నరకమగును!
నేనునేనన్న గర్వంబు నేరమగును,
నేను నాదను స్వార్థంబు నేరదృష్టి!
శత్రు కన్నను బాధించు శస్త్ర మగును!
63*
విహిత కర్మను సాగించు విధము లన్ని-
శాస్త్ర సమ్మతమగు తత్వ సాధనముల-
శాస్త్ర విధిప్రమాణికముగా సాగు బాట,
గురుల ననుసరించుట ధార్మికులకు మేలు!
64*
చేయ వల్సిన కర్మలు చేయరాని-
కర్మలను నిర్ణయింపగాగల్గు శాస్త్ర –
సమ్మతములెల్ల మతములై సాగుచుండు!
దేశ, కాల, పాత్రంబులన్ తేజరిల్లు!
* (శ్రద్ధాత్రయ-విభాగయోగము)
65*
దీక్షతోనరిషడ్వర్గ తేజమణచి,
త్రికరణాల శుద్ధిని సాగు, త్రిగుణబంధ-
ములను జిక్కకుండును, మూడు విధుల-
చర్ఛ యక్ష రాక్షస దేవ తార్చనలుగ!
66*
త్రిగుణ బంధములను జిక్కు త్రివిధ భక్తి-
నిష్ఠ సాగు పూజలు మదినిచ్చమేర-దేవతలు రాక్షసులు ప్రేతములను-
భక్తి పూజించు, తత్ఫల యుక్త గతుల!
67*
అహము వీడక-పేరాశ నణచలేక
సాత్వికేతర గుణులచే సాగు భక్తి-
కాముకత్వ ఫలాశచే గలుగు కర్మ,
దేహ-దేహిని బంధించు, చేష్టయుతమె!
68*
వసుధ నరసురాసుర శ్రద్ధ వరుస గనగ
విధిని, వీడిసాగిన, జవ్మ విడక బుట్టు!
వింగడింపవీలు-గుణము తిండి బట్టి-
విధిని గూడి జన్మ రహిత విధుల ముక్తి!
69*
సాత్వికులు-రసపూర్ణ సారాత్మకముగ-
తినుచు,చిరకాల జీవిత స్థిరత నుంద్రు!
రాజసికి పుల్పదిండిపూర్ణముగ చేదు,
జేరునుప్పురసాత్మకమే రుచించు!
70
సగముడికి – పాచిరసమ్ము-మధువు
మాంస ప్రోపులింపగును, తామసికి నెపుడు!
ధర్మ రహితయాగములందు తద్విరుద్ధ-
సౌఖ్యగతి సాగు, శాస్త్రంబు సాగనీక!
71*
రాజసుని యజ్ఞపూనిక స్వార్థ యుతము
శాస్త్ర బద్ధయజ్ఞము చేయు సాత్వికుండు!
బ్రహ్మచర్యంబు, తపమునన్ భక్తి శ్రద్ధ-
వెలయు నిష్ఠ శారీరక విధి తపస్సు!
72*
ఇతరులకు బాధగలుగని, రీతి బ్రతుకు
విహిత ప్రియవాక్కులను ధర్మ సహిత శాస్త్ర –
పఠన దైవనామజపము, భక్తియోగ,
చిత్తశుద్ధి నిష్ఠలను వాచిక తపస్సు!
73*
మదిని మోదము సుస్థిర మైన భక్తి-
దైవ చింతన-సుఖశాంతి-దగుపవిత్ర-
చిత్త నిర్మల స్తితి-మానసికతపస్సు!
దీక్ష నిష్కామ గతుల సాత్విక తపస్సు!
74*
దంబ మాత్మాభిమానంబు, సంబరంబు
కీర్తి యాపేక్ష తత్కాల క్రియలఫలము!
రాగభోగ ప్రదర్శన ప్రాభవేచ్ఛ
జరుగు నాడంబరాల రాజసిక తపస్సు!
75*
అజ్ఞతయు-మొండి తనముచే ప్రజ్ఞ జూపి-
ఇతరులను కష్ట పెట్టగా నిష్ట పడెడు-
దాస గుణ సత్కారాది, తదితరాల-
తామసిక తపస్సును సాగు తరతరాల!
76*
తపసు-దానముల్,రాజస, తామసంబు-
సహిత-రహిత శాస్త్రోక్తముల్ సాగుచుండు
శాస్త్ర సహిత క్రియలందు సాగు విధులు-
విశ్వజన సహితములు గాగ-విస్తరించు!
77*
సాగు చుండె సృష్ట్యాదిగా-శాస్త్ర విధుల-
నాదె “ఓం తత్ సత్” పరమాత్మ నామ త్రయము
మొదట యజ్ఞాది క్రియలందు మ్రోగు నిదియె!
నాడు నేడును, మునుముందు నటులె సాగు!
78 *
వేద పండితులును, శాస్త్ర విహిత క్రియల-
నుచ్ఛరింతురు”ఓంకార” యుక్తముగను!
యజ్ఞ దాన తపాదుల ప్రజ్ఞ మెరయు
ముదము కొఱకు “తత్” అను పేర ముక్తి కొఱకు!
79*
సత్య శ్రేష్ఠ భావముల సత్ శబ్ధముండు
తపము యజ్ఞదానంబుల తగిన శ్రద్ధ-
కర్మ యుక్త ప్రశంసాత్మకములయందు
దైవకర్మ”సత్” శబ్ధాదియై తనర్చు!
80
ఎంత మాత్రము శ్రద్ధగా నెంచనట్టి-
హవన, తపదాన క్రియలందు, నవని బిలువ-
బడు”నసత్” పదయుక్తముల్, భావగతుల
నిష్ఫలము జూపు నివియును-నిలువవెందు!
81*
కర్మలన్ని దోషము చేత గలగు గాన-
యజ్ఞ దాన తపము వీడ ప్రజ్ఞ గాదు!
కర్మలను వీడుటయు తగు కార్యమవదు!
కర్మ కన్నను నిష్కామ కర్మ మేలు!
82*
త్యాగ, సన్యాసమను వాక్కు తగుగ బోలు
దార్శనిక వాక్కు నాల్గింట దనరు విధము
కామ్య కర్మల త్యాగంబు కర్మ ఫలము!
నందు నాసక్తి విడుటయు నాచరించు!
*మోక్ష సన్యాసయోగము* 83*(అర్జున ఉవాచ)
ఓమహా బాహు! తెల్పుము, యోగములను,
సాంఖ్య కర్మంబుల-విడిగ సన్యసించు-
వారి తత్వ, పరిత్యాగ తీరు తెన్ను!
దెలియ గోరెద, కేశవా! తెల్పుమింక!
84*
శాస్త్ర సహితకర్మలు ఫలాసక్తి విడుచు-
తీరు మేలు, నియత కర్మ తేగమొప్ప!
వీడటేమేలు-సాత్విక విధులనిట్లె-
శాస్త్ర సమ్మతమగు మంచి సాగు వేళ!
85*
దు:ఖమని యెంచి కర్తవ్య దూరుడైన-
దేహ పరిశ్రమ భీతియే దేల్చచూడ!
నియత కర్మ ఫలత్యాగ నిష్ఠమేలు-
తగని కర్మల త్యాగంబు తామసికము!
86*
నియత కర్మలు తగనాచరించుటెల్ల-సాత్వికపు తేగమనబడు సాగు కర్మ!
ఫలము వీడుట చేతను, ఫలమునందు-
నిచ్ఛ నాసక్తి వీడుట నివ్విదంబు!
87*
కర్మ దేలియు కర్తృత్వ కాంక్ష వీడి-
“నేను కర్త” ననకదేహ నియమ యాత్ర,
నన్నె సర్వంబుగా కర్మ నాకొసంగి-
సాగ, నాకృపగల్గిన సత్ఫలంబు!
88*
మూడు గుణముల-మూడింట చూడ త్రివిధ-
లక్షణాలను, జ్ఞానమే లబ్ధి, యందు-
సాత్వికము తేజమును గూర్చు, శరణటన్న-
కర్మ ఫలముచే ముక్తియు, గలుగ జేతు!,
89*
త్రిగుణ బేధంబుల హృదయ ధృతిని బూని
నరుడు హాయిగ నిద్రించు నాల్గు వర్ణ-
ములను, జూడగా వారల వెలయు కర్మ-
పూర్వక స్వభావంబులన్ బూని వినుము!
90*
నిఖిల ప్రాణుల పుట్టుక నియత కర్మ-
ఫలము, నిష్కామమైయన్య భావమలర
వసుధ కర్మము సిద్ధించు, వరుసగతుల-
ఫలము, జీవాత్మ-పరమాత్మ పదము జేర్చు!
91*
సహజ కర్మలు వీడుట సరియు గాదు-
పొగనుగూడియుండెడు నగ్ని బోలునట్లు
దోషయుక్త కర్మంబును దోచు, సుఖము-
నుర్వి నైష్కర్మ సమభావ యుక్తమగును!
92*
నరుడు దేహాభిమానంబు నసలు లేక
సంయమన భావనసాగుట స్వామి యాజ్ఞ-
అనుచు సాగుసంసారి సాంఖ్యంబునందు
కర్మ యోగాన తగును నిష్కామ నిరతి!
93*
అర్జునా!నాకృపను బొందు నార్త జనులు-
పాహి! శరణన్న-నవినాశి పదము జేర్చి-
దయను పాలింతు, సద్భక్తి దనరనేని-
అన్ని నేనగుచు జనుల నాదుకొందు!
94*
గుప్తములకెల్ల,గుప్తమీ ప్రాప్త బోధ-
హితవుగాజేసితిని యెదధృతినొసంగి-
తెల్పినది బ్రహ్మ విద్యగా దెలియుమింక!
శరణు బొందుము, భక్తి విశ్వాసనిష్ఠ!
95*(సదర్భవాక్కు)
స్మృతియు లభియించె, నాత్మీయ స్ఫురణ గలిగె!
నీ కృపకు పాత్రుడనైతి-నీదుయాజ్ఞ-
విధిగ పాలింతునని, దీక్ష నిల్చి నట్టి-
సవ్యసాచిని వర్ణించె సంజయుండు!
96*(సంజయ ఉవాచ)
వ్యాసముని దయ సంవాద వాస్తవంబు-
వింటి, వినిపించి తరియించు విధమెఱింగి
కృష్ణయోగీశు-శరణంటి, కృపనుగంటి!
నరుని కుపదేశముగ గీత ధరను వెలసె!
97*
వింటినిరహస్యమగు బ్రహ్మ విద్య గీత!
విహితమాశ్చర్య సద్యోగ విధులబోధ
మనము మాటికి పులకించు మనన గతుల
ఓమహా రాజ! మాటాడ నోప జాల!
98*
సంతసంబున మునిగెడు సంజయుండ!
సంభ్రమాశ్చర్యమును వీడి సంభవించు-
భవిత నిర్ణయంబేమిటి? బలుకుమనగ-
నిశ్చయంబుగ ధృతరాష్ట్రు నిచ్ఛ దెలిపె!
99*
ఎచట కర్మ యోగి, నరుడు, చేత వెలయు
కార్ముకము దాల్చి నిల్చునో? కలుగు నచట-
సిరివిభూతియు, దృఢనీతి, విజయ సిద్ధి!
ఇంపు మీరగ యిదియె నానిశ్చయంబు!
100*
విశ్వ సర్వోపగతుడైన విష్ణు దలచి-
జగతి వర్తించి, నరజాతి జన్మ గడచి,
పుణ్య సంచితార్థము గూర్చు పూర్ణ భక్తి
యాత్మ విశ్వాత్ము జేరెడు యాత్ర బ్రతుకు!
101*
గీత గురుబోధ విశ్వవిఖ్యాత-మాన
వీయ విజ్ఞాన శోధన విషయ గతుల-
విశ్వ హితము, భాసించె, విశ్వ నరుల –
సేవ, నారాయణుని జేర్చు నావయయ్యె!
102*
గీత వెడలె దైవోక్తమై క్రీడి బ్రోచె,
భువిపరోపకారమె జన్మ పుణ్య ఫలము-
గాగ, మంచిబుణ్యాదిగా సాగు సమత-
మానవత సౌధమై గీతమాత వెలసె!
103*
ప్రాణి తాను స్వతంత్రించి బ్రతికినపుడె
ఆత్మ తత్వము, జ్ఞానమాధ్యాత్మికముగ
దైవ జీవసంబంధపు దారి వెలయు
బ్రతుకు సర్వోపగతు గాంచు ప్రతిభ జూపు!
104*
అన్యభావంబు మదిలేక నన్నె నమ్మి-
అన్ని విధముల నాయందె యున్నవారి,
భక్తి నాసక్తి గలిగించు, భాగ్యమనెడు-
గోప్యమిది దెల్సి, తగునిష్ఠ గొనుట మేలు!
105*
ధర్మ జయశబ్ధముల మధ్య దనరు గీత!
గ్రంధరాజి ప్రామానిక గంధమయ్యె!
సదవగాహన నుంకించి, జంకి నీదు
శతకగీతి, నర్పించితి స్వామి శరణు!
106*
దాసు దోషంబు దండంబు తో సరియని-
యంద్రు-దాసానదాసుడ యదుకులేశ!
దేశ కాలపాత్రంబుల వెలయు నూత్న-
జీవన, సమస్యల నీదు, చేవ గూర్చు!
107*
శుభము గోరియపోహలు ప్రబలనీక-
అందఱికి వీలుగా దేశి చందగీతి!
అందరును, గీత తాత్పర్యమమృతధార-
గ్రోలగాజేయు, గురులదే గొప్పమనసు!
108*
నిత్య సత్యవ్రతము నీతి, నియమనిష్ఠ-
పూర్ణ భక్తి ప్రపత్తుల-పూర్వకముగ-
సాంప్రదాయ సదాచార సమ్మతంబు-
సహన సంసృతి గనుజన్మ సార్థకంబు!
*శుభశృతి:-
మంగళము మధుసూదన! మంగళంబు
మంగళము మాధవ! పాండురంగ! విఠల!
మంగళము చక్రి! ఖగరాట్తురంగ శౌరి!
మంగళము హరిహరనాథ! మమ్ము బ్రోవు!