top of page

గాన కృష్ణ శతకము
(తే.గీ.)

1*

శ్రీలు జిందు గుడినివేశ! చిన్మయేశ!

నిన్ను మ్రొక్కి తెలుగుబాష నేర్చుకొంటి

పసిని పండితు జేసితో పరమపురుష!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

2*

వాసవుని గర్వమణచియు దేస జనుల

గావ గోవర్ధనమునెత్తి గొడవమాన్పి-

రక్ష జేసిన కన్నయ్య రమ్ము బ్రోవ!

కమనపుర వేదనిధి వేణుగాన కృష్ణ!

3*

వసుధ జీమూత సంభూత వర్ణ దేహ!

ఆర్త జనబృంద ఛత్రమా! ఆదివిష్ణు!

రాక్షస రుజకు వైద్య నారాయణుడవు!

కమనపుర వేదనిధి వేణుగాన కృష్ణ!

4*

రాధ,రుక్మిణీ సమేత-రాజ కృష్ణ!

నయము జయమిచ్చు లక్షీశ! నాద బ్రహ్మ!

రయము మాన్పియు జీవాక్షరంబులిమ్ము!

కమనపుర వేదనిధి వేణుగాన కృష్ణ!

5*

గాసి గావుము క్షుద్రవైరసుమార్పి-

ప్రకృతి వైపరీత్య-కరొన పదటగలుపు!

విశ్వశోక నాశక విధిన్ వివరమొసగు!

కమనపుర వేదనిధి వేణుగాన కృష్ణ?

6*

నాటిదానవ మూకలే-నరులబుట్టి-

దురిత కలినాశ్రయించి దుడుకుగొనిరి!

దుర్గతి ప్రయోగాలలో దూరనీకు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

7*

లోక కంఠకుల్ స్వార్థ విలోల చిత్త

మత్తులై ధర సేమంబు మాటవినరు!

క్రోధ మైయెక్కినకొమ్మ- గొట్టుకొంద్రు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

8*

స్వార్థమున లోకమునుముంచి చక్కిబుగ్గి

విషము జిమ్ముచు నార్జింత్రు విపుల ధనము!

కీర్తి ధనమన్న గిట్టని క్రియల నుంద్రు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

9*

రక్షిత దూర గామి – బతుకు రాహగాగ-

లక్షణము మారె నరజాతి లక్ష్య శోధ

ఠీకుగా టీకగనిపెట్టు తీరు సాగె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

10*

విశ్వ రూప! సుగీతగోవింద శౌరి!

నేర్పు భయభక్తి నయనిష్ఠ నెగ్గు నాత్మ-

ఆత్మలోదీప్తిగొను పరమాత్మ వీవు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

11*

గోప బాలక! గోలోక గోప్యచరిత!

నియమ నిష్ఠ భక్తిని వెల్గు నీరజాక్ష!

శుచియు శుభ్రత – రక్షిత సూత్ర మొసగు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

12*

వాయు శుద్ధి చే వనజంతు వచ్చిపోయె!

కరొన కట్టడినడుగంటె-కలుషచయము!

పంచభూతావళియు కళలు పంచగలిగె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

13*

పిదప మొదలయ్యె వాహన రొదల పొగలు

సాగె జనజీవనము వెర్థ రసాయనాలు –

గుప్పె, తప్పొప్పు బేరీజు నొప్పె బతుకు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

14*

మనసు నిల్పుటే కష్టము మనుగడంత-

తనువు నిల్పుటే, పొత్తము, తరతరాల!

ఇహమె తలపోయ పరమెట్లు హితవొసంగు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

15*

పుట్టితిని పుణ్యసంపాదనుట్టివడగ!

కట్టితిని కంకణపుదీక్ష-కట్టుబడిగ-

లోపమేమయ్యెనో విధికీ లొంగిపోతి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

16*

యుక్కి శాంతిసుఖాలతో యువతనడుపు

నీవె మిన్న కుండగ తావు నేది జగతి!

కనలిపోయినదాధ్యాత్మికాత్మ నాడె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

17*

బతుకు నియమబద్ధము జేసి యతుకమేలు!

పిదప అంటుబాసియు గీత ననుసరించి!

హృదయ దౌర్భల్యముడుగుట హితవు మాకు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

18*

ప్రగతి నైతిక విలువల పసయు దెలిపి

జగతి జణ్మంటు బాయించి జయమొసంగు!

నీదు శరణాగతిని పొంది నెగ్గనిమ్ము!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

19*

బతుకు నిల్పనితిండేల? బలమదేల!

స్వస్థతొప్పని నిద్రేల? సంయమనము-

గోలుపోయెడి మానవ గోలలేల?

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

20*

పోతె పొల్లగు-ఉన్నదే పొసగు తృప్తి!

జన్మలను ఈదు ఇహనావ జాగృతోక్తి!

పారమార్థికమున భక్తి సారపటిమ!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

21*

ఆప్త భక్తినియలరించు అయ్యనీవు!

వెలిని వెలిగించు – ఆత్మలో వెలుగు వీవు!

పొసగ మేలుగూర్చగ దైవ పొత్తమీవు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

22*

అలజడిని భక్తి మొలచునా? ఆదివిష్ణు!

తారతమ్యాల తత్వము తళుకుగొనున?

జిలుగుమాసిన మదికెట్లు జిక్కు సూక్తి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

23*

దక్షిణపుగుడికుత్తరపు దిశ దనరు శివుడు!

వెలయ హరిహర క్షేత్రము వెలిగె నాడు!

మంచి మతసమైక్యత వెల్గె మానవాళి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

24*

మనసు కల్మశములు దోయు మార్గభక్తి!

మానవాళియు హర్షించు మధురభక్తి!

వీరమెందుకు? నీలోన చేరుకొనగ!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

25*

ఎవరు కనివినిచదివేరు మీరె-కాల

దోషమ్మునంటెను, దురితమెసగె!

మురిసి పోదును నాలోనె మరలచదివి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

26*

అతిథిగవచ్చి నినుగన్న ఆర్తజనుడ!

బతుకు గతిదప్పి వచ్చిన పండితుడను-

అత్తగారింట అర్చింతు చిత్తభక్తి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

27*

బతికి చెడివచ్చి నీదయా భక్తి నెగుల

పరగనన్ను నిందించెడు ప్రశ్న గలద?

మంచి వంచించబడె నాడె మదనజనక!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

28*

వావిలాలగుడినిబోలు వాస్తవంబు

దోచె నీగుడి సన్ముక్తి దోవలందు!

మరల భక్తి సంధింపగా మార్గమొసగె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

29*

పూనుకొంటిని నవరత్న వరుస శతక-

పుస్తకమునచ్చు నొత్తించి పుణ్యమనుచు-

సప్త సంతాన ఫలముకై సాగు దిశల-

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

30*

తృప్తి బొందితి బతుకున తిప్పలింత

దీరదాయెను, ఉద్యోగ తీరుబడుల-

శతక శతిజేయ బూనితి శక్తిమేర!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

31*

అన్నిముగిసి, జరాభారమధిగమించు!

గతముదవ్విన మానసం-కమిలికుములు!

చిత్తమెటులనీచింతన జెంద నేర్చు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

32*

ఉన్నదెప్పుడు,లేమిడి నుండె సంతు-

కన్నకృషి ఫలితార్థంబు కలిమి వీడి-

తెల్లవస్త్రధారణ నింద దేలి చనియె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

33*

మూగ గామొరబెట్టుకొను భక్తి మానసమ్ము-

దినము శతకాళిలో దాగె! తిరమునొందె!

వెరసి సోదియయ్యెను ఎదరి విసిగె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

34*

కాలమార్పున సమకాల కథనగతుల-

దరసి నరజీవనముసాగె దక్కెయాది!

భావి పౌరులకిదియు నిప్పచ్ఛరంబె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

35*

మౌన రోదన వాస్తవమార్గ మొరలు

ముఖపుటిచ్ఛలు గాకుండ-మూలకముగ

భక్తి బలపడు శతకాళి బాట మేలు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

36*

దారినాగును,శిథిలశరీర బరువు

జవముదగ్గును, భోగముల్ చవులుదప్పు!

రాయి వేసిబురదదాటు సోయి మిగులు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

37*

కుతకమెచ్చిన కనులుండి గుడ్డి బతుకు

కృత్రిమ వస్తువాడకముచే కృంగు, తనువు!

స్వస్థత రహిత వైద్యాన చతుకు జన్మ!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

38*

జరుగనున్నదే జరుగును జగతి ప్రగతి

మంచిచెడులుండు నీదయ మంచిగెలుచు!

చెడ్డలనుభవముద్రలై చెన్నుమీరు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

39*

పాతరోతగు,బంగారు సేతయనగ

కొత్తవింతల మరుగున కొంపలందు-

ఇంగు గట్టిన వాసన గుడ్డసంగతిగను!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

40*

వాటమగుడబ్బుగబ్బులే-మాట మాయ-

పేటినింపుసంపాద్యమే మేటియగును!

నీతి యడుగంటి,నీభక్తి నిష్ఠ దేల్చు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

41*

ఆర్జనలు లేని శైశవారాటమందు

బహుగ సంతసమున్నను భవిత ఊహ-

గడచుసోమరితనముచే గడబిడగును!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

42*

పిదప నీరసపు నిరుద్యోగ వీథి బతుకు

వైద్యములు రిపేరులు వాడవాడ-

తిరగగా నారు వర్షముల్ తరిగి చనియె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

43*

పని విరామ మైమాతృ బాష చదువు!

ధృవపు పత్రాల వేటలో దీక్ష తెలుగు

గురునియామకమయ్యె, గుర్తు గలిగె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

44*

వేచి చూచుకుటుంబానికి ఏడుగడయె!

తిండి దినవెచ్చముల ఖర్చు దీర్చు తపన!

ఆశ్రితులు ఆశ్రయమునిచ్చు ఆశయమున!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

45*

తన్ను మాలిన ధర్మంబు ధరణి గలద?

తెప్పదాటికాల్చెడు లోభగుప్తమతులు-

వీడిపోవగ హృది దొల్చె వివిధయాది!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

45*

ముందువెన్కలయలనాటి ముద్ర మలిపి

గతము మరిపించి మురిపించు, కనలు మదికి-

మరుపు వరమంద్రు తుదకిచ్చు మంచిఫలము!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

47*

సాగె సంసారవారాశి చౌక బతుకు

వృద్ధి పొందె సత్సంతాన బుద్ధి పటిమ!

మంచి జరిగించు మునుముందు మాట నిలుపు!

కమనపుర వేదనిధి!వేణుగాన కృష్ణ!

48*

అంటుబాయదు ఆత్మీయ తంట గెలుచు

సాంప్రదాయము గుల్లయె సాయమడుగ-

ఆడబిడ్డల సొమ్ములు అరగవంద్రు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

49*

పాదుగొల్పితి గురుకీర్తి పాదపమును-

పూతకాతసత్ఫల పుణ్య పూరకముగ!

చింతనములందు నినుజేరు చింతమిగిలె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

50*

కోర్కె శోకహేతువుకదా? కొంపకొంప

గల్మశాంతి సిరి దట్టిన గలుగు ఈవి!

ఈవితోపుణ్య కార్యముల్ ఇంపుగూర్చు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

51*

తండ్రి పరమపదవి బాట దరలె, నాడె!

తల్లి శతవృద్ధి గుదిబండ దలపజేసె!

అనుజు తోబావల్ భువి లేని మనుజులైరి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

52*

పోగమిగిలిన వారివి హృది పొగులు కథలె!

ఎవరి యాత్రత వారిదై ఎదురు ఈతె!

నీతొ గాకను-నివేదింప నెవరు గలరు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

53*

మేనమామగ నాత్మీయ మేనమోసి

తండ్రి బాధ్యత నడిపించి దండి కార్య-

ఖర్చు గుప్పించగా పనులుచేకూర్చె కీర్తి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

54*

అమ్మ పనిసేవనాశించి అదనుదప్పి

అద్దెదొరకక నిర్మాణ పద్దు వృధగ

మరలమొదటికి వచ్చితి, మాథవుండ!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

55*

పెద్ధ రికమంద్రు, వృద్ధుల పేరుకీర్తి

తనయు భుజమెక్కినదటంచు-తాతలనగ-

రుద్ధితిని సంతుపై బరువు రూఢిపనుల!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

56*

మంచి చెడుగు పరస్పర మారువేష

దారులనువచ్చె, వైరుద్ధ్య దాడినణగి

సంఘనికష భరించితి, చతికియుంటి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

57*

ఇతరు నమ్మి భావనసేసి పలుకరించి-

నిన్ను నమ్మి కీర్తన సల్పు-నన్ను విడక-

మంచి ప్రాతిపదిక నిల్పు మనుగడంత!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

58*

పోయినది పొల్లు ఉన్నదే పొసగ- గట్టి

మేలు, ఊడిన వెంట్రుక బోలు మేటియాస్తి!

నీదు ప్రేమ శక్తియె నన్ను నెగ్గ జేసె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

59*

మరుపుగొనుట సులభంపు మాటగాదు!

మరుగు జొచ్చినీవాడించు మర్మకేళి-

బ్రహ్మ మోదానుభవమిచ్చి భద్రతొసగు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

60*

మనుజు వెన్నంటి చిటికెడు మట్టి జనదు!

వట్టిచేత జనిరి చక్రవర్తులెల్ల-

అంటు బాసిన జన్మల వెంటనీవె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

61*

ముదము హృదిమూల కొదిగెను,

ముదిమిజడుపు

భక్తి పారవశ్యముడిగె-గీతభావఝరుల-

ప్రేమశక్తికి-మరికొంత ప్రేరణొసగు!

కమనపుర వేదనిధి! వేణు గాన కృష్ణ!

62*

ఇతరజోలిమానితి,మెప్పు హితవటంచు

మేలు బాషించి పొగడితి ప్రేమ శక్తి-

గీతగోవింద హరిహర! కీశగమన!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

63*

త్యాగమూర్తులెవ్వరపేక్షలు సాగు బతుకు!

దీక్ష సత్సంగ సేవల దిద్దు దీవె!

వర్తనము వర్తమానమై వరల నిమ్ము!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

64*

చేతనము గూర్చు నీదివ్య చైత్రరథము!

సృష్టి సాగు వసంతముల్ పుష్టిగూర్చు!

స్థితిలయంబుల హరిహర! చిత్ర సింహ!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

65*

మంచి జీవన సమరాన పెంచకున్న-

చెడుగు పాపమ్ము పేరున చెలగి పుణ్య

గతి మరిదప్పు-నరజాతి కాటగలియు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

66*

డబ్బునగొనెడు,ఆరోగ్య డంబ మణిగె!

ప్రకృతి వైద్యమె పడగెత్తె ప్రస్తుతంబు!

అందుబాటు చేయూతల నడిగి నిలిచె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

67*

అలసి పోలేము నీయాజ్ఞలధిగమించి!

ఆరిపోదు లీనముదాక అంతరాత్మ!

తనువు మనససు తానుగాదనను తరచు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

68*

శాతిరహితజీవనకేళి భ్రాంతి గూలు!

వినదు మదిపోవు పోకల-విశ్వరూప!

భోగరుచిదేలు కుతుకమై పొద్దు మాపు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

69*

దాన తపసిద్ధిని, కలిని -తపసి నరుడు-

పూర్ణుడైపొందు తత్ఫల పుణ్యఫలము!

ముక్తికింధనమదియగు ముందు ముందు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

80*

ఏది గాంచన కొంగ్రొత్త- ఎదురు బెదురె!

మిగుల పక్షదోష కారియె! మ్రింగుమందు-

త్వరిత గుణకారిగా విషతత్వమణచు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

***

71*

శ్రీద!శ్రీశ!సీతామనోహర!చేతనాంశ!

వరద!వరవెంకటాద్రీశ!పరమ పురుష!

విశ్వ శ్రీకృష్ణ చైతన్య! విజయమిత్ర!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

72*

ఆత్మ దర్శింప లేదింక ఆదరించు!

అందు నిను గాంచు సత్చిత్త చందమొసగు!

తనువు మనసు మరచు తత్వమొసగు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

73*

ఆత్మనేనైతె గతమేల ఆత్రమేల?

నీదు భాగమైతేయూహ నికరమేల!

వర్తమానమీక్షణ సుఖ వరమునొసగు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

74*

సంతసమునుండి యానందసదన వార్థి

మొదటి మునకేసి సంసారి మోదమొందు!

వెన్నుడా! మరిపడ నీకు వెనకటడుగు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

75*

శోకమేనరక ప్రాయ లోక చరిత-

సుఖమె సొరగము, నీతత్వ శోధలెరుగ-

తుచ్ఛములుబాయు బతుకున స్వేచ్ఛ వెలయు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

76*

మహిని కలిమాయలోబుట్టి మాయజీల్చు

భక్తియోగమ్ము నటియించి శక్తిమేర

మరల మాయార్థికము గూర్చు మనగడేల!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

77*

వివిధమార్గాల సత్యంబు విస్తరించి

తరచు తలబొప్పికట్టించె తాత్వికాలు!

భక్త సులభనిన్ ప్రకటించె భాగవతము!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

78*

కొండ గోరంత దీపాన కొసరివెలుగు!

తోట చిగురించు చైతన్య కోటనీవె!

గుండె వెలిగించి నరజాతి గూర్చు శాంతి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

79*

బాదలన్ ద్రోతు బంగాల ఖాతమందు!

మోదమునుగొందు హిందూసముద్రమందు!

జాగృతిన్ పొందుదరెబియా జలధి గాంచి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

80*

మరుపు సాధించు గతచెత్త మాయబతుకు!

మనిషిగానుందు నీనిష్ఠ మరలనతుకు!

నీదు సేవమానవసేవ నియతి నడుపు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

81*

 యుక్తి యిహసుఖార్తి పాలి యున్నతంబు!

భక్తి పరలోక సుఖతత్వ ముక్తిదంబు!

ప్రేమశక్తిగ ప్రేరణాసక్తి నీది!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ?

82*

బట్ట తలనుమోకాలికి గట్టు వాదు

తలకు బొప్పిగట్టించెడు తళుకు బెళుకు!

స్పష్టమగు బోధ పరతత్వసారమదియె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

83*

తెలియకున్నవాదించేటి తీరుతెన్ను

అర్థమేగాదు, వేదపురాణ దోవ

ఉపనిషత్తు సారముగీత ఉర్వి మోగె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

84*

నరుని ప్రశ్న – సమాధాన నాణ్యతొసగె

సమతయోగంబు భాసించె సామి సూక్తి!

నీదు శరణాగతిబొందు నిష్ఠ వెలసె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

85*

నేటి జన్మకర్తవ్యంబు నెఱిగి నరుడు

 త్రికరణవిశుద్ధి మెదులుచు తినుచు తిరిగి-

మంచిచెడు విభజించి మనుట గలిగె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

86*

మాటచేతల మంచియే మూటగాగ

భువిపరోపకారపు పుణ్య భూమికగుచు

ఆచి తూచిసాగిన నీతియధిగమించు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

87*

యోచనలు సాగె నీగీత యోగ్యగతుల

సూచనలుసాగె పండిత సూక్తి వెడలె!

సమయమును లేదు! బతుకుకై సాగె మనిషి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

88*

భక్తి యోగాన దానంబు బలమొసంగు!

దానమె తపము తపసిగా దనరు నరుడు!

దానికై ధ్యాని గావలె- దక్కు సిరులు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

89*

భక్తియోగియై కలిమాయ శక్తిగెలిచి

భక్తి దాన నిధానంపు బాటనడిచి-

పుణ్యమనుమంచి బెంచగా బూనవలయు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

90*

దండిమిడుకుడే పరకూటి తిండిపోటి-

వెసన సంతులనాథలే! వెసగవారి-

యుద్ధ ప్రాతిపదికముగాగనుద్ధరించు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

91*

భక్తి నవరీతులను దెల్పె భాగవతము!

కీర్తనాభక్తి వైశిష్ట్య క్రియలు నెఱపె!

హితవు సామాజికముగ సాహితియు వెలసె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

92*

పద్య పఠనకీర్తన సాగె – ప్రముఖకవులు

రామవారథులై పాడి రాణకెక్క-

భక్తి వికసన బ్రహ్మమై భవిత మురిసె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

93*

గలుమ గలుమన వినిపించె గానఝరులె!

తనువు పరవశించియునాడె! దాసజగతి-

రాజు పేద సత్సంగ విరాజులైరి!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

94*

శైవ సాహితి వెలయించె సజ్జనాళి-

వైష్ణ వాఙ్మయముప్పొంగె వరుససాగె!

బ్రహ్మ భావనలొక్కటై ప్రజల బ్రోచె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

95*

అవనిగావలె నన్నియు అవసరముగ-

ఎట్లు తరియింత్రు కోటాను కోట్ల జనులు!

ఒక్క మాటయే చొక్కమై నొక్కదెందు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

96*

మౌన శాంతిసుఖము భక్తి మార్గమయ్యె!

సమ్మతియె మతమార్గాన సాగిపోయె-

భక్తి వెక్తిగతముగాగ ముక్తినొసగె!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

97*

అభయ హస్తమై తృప్తియే శుభమొసంగు!

శక్తి సానుకూల ప్రేమ సాగుచుండు!

ప్రేమ శక్త్యాత్మలో నీవు ప్రేరణొసగు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

98*

శుభము విజ్ఞనూతన పరిశోధనలకు!

పాతకొత్తల కలయిక పాటవంబు-

శుభము, సుఖశాంతి కరమగు-సూక్తి నడుపు!

కమనపుర వేదనిధి! వేణుగాన కృష్ణ!

99*

జరిగె హరెరామ కీర్తనల్ పరమనిష్ఠ

జగతి నీసేవ చైతన్య నివహమెగిసె!

ఆత్మదృష్టిని ఊర్థ్వమై అధిగమించె!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

100*

త్రికరణపు శుద్ధి తిరుగాడె తీపి చేదు

మంచిచెడులను మరినీదు మార్గమందె!

భక్తి యోగిగా కలిమాయలధిగమించె!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

101*(సంపూర్ణం)

భక్తి నవరీతులను దెల్పె భాగవతము!

కీర్తనాభక్తి జగమందు కీర్తిగాంచె!

హితవు సామాజికముగ సాహితియు వెలసె!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

102*

పద్య పఠనకీర్తన సాగె వాద్యఝరులు-

వారదులుగాగ వసుధపై వాసిగాంచె!

భక్తి వికసన మధురమై బ్రహ్మ మురిసె!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

103*

పద్యమో పాటయో గాన భజనసాగె

తనువు పరవశించగనాడె దాసజగతి

రాజుపేద సత్సంగవిరాజులైరి!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

104*

విష్ణు, శైవసాహితి పొంగె విస్తృతముగ

బ్రహ్మ మతమయ్యె నేకాత్మ భావపటిమ!

మానవత్వపునాదుల మంచివెలసె!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

105*

అవనిగావలె నన్నియు అందరెట్లు-

ఎట్లు తరియింత్రు కోటాను కోట్ల మంది

ఒక్కమాటయే చొక్కమై నొక్కదెందు!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

106*

మౌన శాంతి సుఖము భక్తమదినికోర్కె

సమ్మతిగ మతముగ దారిసాగె! భక్తి-

వ్యక్తి గతమయ్యె తత్ఫలాసక్తి-ముక్తి!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

107*

భక్తిలోసొంతయత్నమే బలమొసంగు-

ప్రేమశక్తి సామిగ గల్గి ప్రీతిగొల్పు!

జగతిగావలె మానవ జతనదీక్ష!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

108*

శుభము-కొత్తపాతలగల్పు సూత్రతతికి-

శుభము నూత్ననాగరికత-శోధనలకు-

శుభము-సకలజనాళికి-శుభము శుభము!

కమనపుర వేదనిధి వేణు గాన కృష్ణ!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page