
దాసభక్తి శతకము
(తే.గీ.)
1*
శ్రీశ! దశవేశధారి! లక్ష్మీ నృసింహ!
మంచి జనుల రక్షించు కోటంచ నిలయ!
కరుణ జూడుము! అర్పింతు కవిత శతుల!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
2*
భక్తి విశ్వాసమును గల్గి బ్రతుకు దారి
వినయము, విధేయతయుగల్గి విధినెఱింగి
సాగుటయె గొప్ప, పుడమి సంసారగతుల!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
3*
భక్తి దాసాన దాసత్వ భావ దీప్తి!
పారమార్థిక సాధన పటిమ వెలయు-
ఇహపు దారిని స్వాతంత్ర్యమింపుగూర్చు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
4*
సేవ పూరిత స్వచ్ఛంద భావదీప్తి-
గురుల కృపచేత తాత్విక గుర్తు దెలియు
విధుల బాధ్యతలో హక్కు విషదమగును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
5*
స్వార్థ గుణ పరిత్యాగమై సాగు భక్తి
తత్వమున దాస్యమే స్వతంత్రమగును!
కడమ బానిస భావంబు గలుగ జేయు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
6*
తాత దాసాన దాసుడే, తండ్రి సామి-
భక్తి పేరొందు- మనుమడు బానిసగును!
ఎవరి దారి వారిదె తృప్తి నెంచి చూడ!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
7*
నీతి పాఠ్యబోధన – లిఖిత రీతి చదువు
సూక్తి ముక్తాళి పఠనము స్ఫూర్తి నిచ్చు!
కూడు గూడు గుడ్డ పిదప గూర్చు శాంతి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
8*
చదువు బోధనాభ్యాసమై సాగు వృత్తి
దైవ భావదాస్యము గల్గ ధన్య జన్మ!
ఇహపు దాస్యముతో బోల్చ హితవు గాదు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
9*
బ్రతుకు వాహిణి యెదురీత బడలి నట్టి-
యాత్మ ప్రశ్నించుకొని పరమాత్మ వెదకు!
బ్రతుకు వాలున లౌకిక భ్రాంతి గడుపు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
10*
స్వార్థమున్నను సాగదు సఖ్య భక్తి!
శ్రద్ధ లేకున్న సాగదు శ్రవణ భక్తి!
అవని తరియింప భక్తులు నవవిధంబు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
11*
సొమ్ము కోర్కె, శోకము వెంట దొమ్మి పోటి-
సాగు గెలుపోటముల నంటగాగునెట్లు?
జన్మ రహిత జీవన ముక్తి సాగునెట్లు?
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
12*
స్వార్థముడుగక నహమెట్లు సమసిపోవు
తానె బ్రహ్మమై తత్వంబు దరచునెట్లు?
పారలౌకిక యోచనల్ బరగునెట్లు?
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
13*
స్వార్థ రహితుడహము వీడి, యాత్మ – తనువు-
బాహిరాంతర ప్రకృతుల పరగ నెరిగి-
వెలుగులందించు విశ్వాత్ము దెలియ మేలు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
14*
ఇహమె సర్వస్వమనుకొన్న నహమె నిండు!
పోటి ప్రతిదానియందున్న పొసగు నెట్లు?
బ్రతుకు-దినదిన గండమై బాధ గ్రుంగు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
15*
కన్న వారును-ధర తాను గన్న వారు!
కొన్న వారును- మది నమ్ముకొన్న వారు!
అందఱకు మేలుగూర్చు నాధ్యాత్మికంబు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
16*
ఏది యెవరిదో? వారిదే చేదు, తీపి-
రుచియభీష్టముల్-పుణ్యపురుషుడు, పుడమి-
మనుజుడై పుట్టి తత్ఫలమనుభవించు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
17*
లేమి యెవరిదో?కలవార లెవరొ భువిని?
లేమి నీదినాదనుచోట లెక్కలేవి?
నేను యెవరినో? తనువులో నెచట గలనొ?
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
18*
బాల్య-యవ్వన-జరముల బడియు బ్రతుకు-
చైత్య రథము సాగును చైత్య జీవనాంశ-
వెలిగినంత కాలము భక్తి వెలయునంద్రు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
19*
తూర్పు పడమర నొకమిత్రు తూచ త్రాసు!
తూనికను పవిత్రత జూపు తుల్య వస్తు-
పుణ్యమేయగు, భువి జన్మ ధన్యమగును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
20*
ఎదురెదురు దిక్కులసాగు నెపుడు యాత్ర-
చేదు బ్రతుకునీడ్వగ నుంటి, చేదుకొనుము!
నేస్తమా నిన్ను జూడగా వేచియుందు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
21*
కార్మికుడు జీవి పరమాత్మ కర్మసాక్షి!
వెన్ను గనని జీవిగదెల్య నన్ను నేను!
చూడ నద్ధంబుగావలె సూర్యతేజ!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
22*
మహిని వృక్షమై రూపించి మైత్రి మొలక,
బ్రతుకు సంద్రంబు తరియింప భక్తి నావ!
మంచి చెడు మిత్ర సంచారమైన జగతి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
23*
మంచి చెడు మైత్రి ప్రకరణ మెంచి, యెదను
తట్టి చిత్రంపుటాల్బమున్ పెట్టి చూడ!
మిత్ర రశ్మియాత్మను సోకి మించుయాది!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
24*
కలత జెందినా హర్షంబు గమ్ముకొన్న-
మాయ జుట్టియాందోళన మార్గమైన-
మిత్ర రశ్మి సోకిన యాది మించు చుండు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
25*
మనిషి దూరమైనను మైత్రి మరపురాదు!
మనసు కోశాన మైత్రియే మసలుచుండు-
మంచియావరించగ మాయ కంచె దొలగు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
26*
మైత్రి సాటియు మైత్రియే మనుజులందు!
ఏండ్లు పూండ్లు గుండెను సందడించు! మనుజు-
పదవి హోదాల నతులిత ప్రాపు దాపు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
27*
మనసు నింగిలో జ్ఞాపక ధినుసు నిండి-
మెరయు పరమాత్మ మేఘాన మెరుపు తీరు!
వేరు వేరైన నేకమై వెలయు మైత్రి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
28*
కాలములు-మూట,ధనలేమి గలుగుచుండు!
ఆరు రుతువుల కల్మిడినలరు మైత్రి!
వేడ్కలోనింద్ర ధనుసుగా వెలుగుచుండు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
29*
ఒక్క మాటలో జెప్పగా నొక్కనట్టి-
చొక్కమైనది మైత్రియె చూడ జగతి-
దూర భార విచారము నోర్పు నేర్పు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
30*
పనులవొత్తిడి బేపార పద్ధులున్న
లాభ నష్ట ఖాతాలున్న లబ్ధి నిలువ-
పదిలమైనట్లు సుహృదయ బాల్య మైత్రి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
31*
బాల్య యవ్వనముల మార్పు బరగు నడిమి-
వయసు, పరిణామక్రమమందు వన్నె వాసి-
తరుగు లేని మేలిమి మైత్రి తరతరాల!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
32*
కర్మ వీడినా, చెదరదు-ధర్మలిపిగ
మనసు పుటనుండు వెసనాల మలిగిపోదు!
అలసి పోయినా వాడని దసలు మైత్రి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
33*
మాట – గాల్చిన వడివోని మైత్రి నులుక!
మనసు నిలిపిన పౌష్టిక ధినుసు మైత్రి!
తనువు దూరమున్నను మది తలపు గొనును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
34*
మైత్రి సాగిన జీవన చైత్ర రథము
మెఱుగులీను నింగిని చుక్క మేళనంబు!
మైత్రి-సంక్రాంతి – జీవనమార్గ దీప్తి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
35*
బ్రతుకు రాపిడి నలిగిన బాటలందు
వెసన దాడిని శిథిలమౌ వెతలయందు
మంచి సేదదీర్చగ నిల్చు మైత్రి గొడుగు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
36*
మైత్రి పుణ్యాది-చెడుగైన మదిని విరుచు!
వెసన దోపిడీ బ్రతుకును వెసను ముంచు!
చెడుగు మళ్ళించుటకు మైత్రి చేతి దుడ్డు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
37*
పేదలకు మైత్రికన్న పెంపేది పుడమి
పేద మైత్రియే త్యాగికి పెద్దపీట!
వెసన పరుమైత్రి నిప్పుల వేదికగును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
38*
రాను-పోను బ్రతుకులదాడి, రాటు దేలి
సాగు భక్తియే – ముక్తికై శ్రద్ధ, – జన్మ-
రాక-పోక పుణ్యపుదారి రాని జన్మ!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
39*
మంచి మైత్రినార్జింపక-మనుగడేల?
చెడును వర్జింపకున్నను చెందు నేమి? జన్మ ముడులువీడనియాత్మ ధన్యమగునె!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
40*
కోర్కెలుప్పెనవేయగా కొంప మునుగు?!
బ్రతుకు శోకసంద్ర తుఫాను బారివడును!
మునిగి తేలగ మరుజన్మ ముడియు సాగు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
41*
కోర్కెలుడిగిన గలుగదు, కొంటె మైత్రి!
శోకముడిగిన శాంతి సుఖము జగతి!
భక్తి త్రికరణ శుద్దిని ముక్తి నిజము!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
42*
మంచి సకలయోగులకు, మంచిగూర్చు-
చెడును వర్జింప జేయును! చేష్ట ఫలము-
మాధవార్పణముగ జేయు మైత్రి భక్తి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
43*
మనసు కోర్కె నియంత్రణ, మహిమ గనక-
తదితరాల నియంత్రణ తగనిపనియె!
గోటితో బోవు దానికి గొడ్డలేల!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
44*
మనసు కోర్కె నియంత్రించి మానవతను-
నిల్పగా విశ్వశాంతియు నిక్కమగును!
శోక రహితమై బ్రతుకు విశుద్ధమగును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
45*
మంచి మైత్రి భావనజేయు మనసు శుద్ధి!
మాట పనులందు దీపించు-బాటసాగు!
జనులకాదర్శ జీవనమ్ జగతి కీర్తి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
46*
సుజన మైత్రిచే భువిధర్మ సూక్ష్మమెరిగి-
భూత హితవు సాగిన చోట పుణ్యమెసగు
సుజన మైత్రిచే సర్వత్ర సుఖము శాంతి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
47*
ధనమునార్జింపవలె, మంచితనము వెలయ!
దాన ధర్మంబులకు కొంత ధనము నిచ్చి-
సద్వినిమయముగావించ- చాల మేలు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
48*
తరచి చూడ సంపద, శాశ్వతంబుగాదు!
నాల్గు విధముల సిరిసాగునంద్రు బుధులు!
ధర్మ భూపాగ్ని తస్కర దారులవియె!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
49*
మిత్రమా!జమా ఖర్చులు మితము దప్పి-
మేలు గూర్చవు-దానమై మేలు గూర్చు!
భువి పరోపకారమె కీర్తి పూర్వకంబు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
50*
మనుజుడుపకారియై,మంచి బూని-
సంపదలు గూర్చి, విధిగ దానంబు జేయు-
పుణ్యమే-జన్మరహితమౌ ముక్తినొసగు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
51*
బంధువులకన్న-మిత్రుడె పదిలమంద్రు
బల్లిదుండైన నందరు బలమునిచ్చి-
బలగమైయుందురు-జగతి బ్రతుకుబాట!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
52*
కల్మిడి మొదలు దూరంబు గాని మైత్రి!
కాని వేళల దైవమై కానవచ్చు!
వెళ్ళి చనుదాక విడవక వెంటనంటు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
53*
ఆత్మ కీజన్మమున తనువద్దె యిల్లు!
దైవమే యజమానిగా దానియిచ్చు-
కాల ధర్మంబు చేనదీ ఖాళియగును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
54*
పూట పూటకు తినుతిండి, పొసగు నద్దె!
చెల్లుటయు చిత్రమగు దైవ చేష్టలందు!
తనువు నాదను మురిపెంబు దనర జేయు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
55*
శ్రీనివాస నివాసమై స్థిమితమొంద
భక్తి పూర్ణమై చిత్తంబు పరమపురుషు-
సమత యోగమభ్యాసించు సరణిమెచ్చు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
56*
శ్రవణ, కీర్తన, స్మరణ, దాస్య, సఖ్య,
వందనాత్మ నివేదన, పాదసేవ!
అర్చన, నవవిధంబుల-అవని భక్తి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
57*
ఆర్తులు, శరణార్థులును, జిజ్ఞాస పరులు
అర్థము జ్ఞానమర్థించు నాల్గు తీర్ల-
నొప్పు తొమ్మండుగురి సంఖ్య ముప్పదారు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
58*
భక్తి యేదైన, మది మైత్రి భావదృష్టి!
ఆత్మ సంస్మరణగ దెల్పె నారదుండు!
భక్తి విశ్లేషణలు జేసె భాగవతము!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
59*
యెదను సద్భావముదయింప యెదుగు నీతి
వెలయు, ధీవివేకము నాత్మ వెలుగ మదిని,
శత్రులార్గుర గెల్చిన సాగు భక్తి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
60*
సఖ్య భక్తి కుచేలుండు సాగె, నంత-
కుబ్జ భక్తి సౌందర్యంబు-రూపు దాల్చె!
సిరులు వేరు దైవీ గుణసిరులు వేరు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
61*
భయము భక్తి గూర్చును, శ్రద్ధ పటిమ బెంచు!
భక్తి విశ్వాసమును గూర్చు, బహువిధాల!
బ్రతుకు సద్భావనాయాత్ర భద్రతెసగు!
తిరుణాహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
62*
అవసరార్థము నటియించు, ననుకరించు
భక్తి నవకాశవాదమై-ప్రాకటముగ-
అవసరముదీర నగుపించ దవనియందు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
63*
నటన యభ్యాసమై భక్తినందు తుదకు
ప్రకట తేజంబుచేనాత్మ పట్టువడును
మాయ తెరదొల్గి మది పరమాత్మ వెలుగు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
64*
తనువు నాత్మ, బుద్ధి వివేక తత్వ సిద్ధి-
గలుగ తనవారి కందించు కర్మ ఫలము-
తేగమే గీత-శరణాగతిగను దెలుపు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
65*
తనువు వికసింపగా జేయు, తల్లి దండ్రి!
సద్గురుడు బుద్ధి వికసింప సహకరించు!
ఆత్మనెఱిగిన మదిపరమాత్మ వెలుగు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
66*
మనసు చాపల్యమున నాత్మ మరచు మనిషి
జిహ్వ చాపల్యరుచి తీపి జీవితాన-
ఆత్మయొంటరిగా పరమాత్మ వెదకు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
67*
బుద్ధియు, వివేక తేజంబువృద్ధిగనక-
అంతు జిక్కదు తనయంతరాత్మ మొదట!
కాని తీరు తెన్ను శరణాగతియె మేలు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
68*
మదిని గప్పిన విషయాల-మాయ తెరలు-
ఆత్మ దర్శింప నీయవు – ఆత్మనెఱుగ-
నందు పరమాత్మ దీపింప నలరు ముదము!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
69*
అణువు పరమాణువులబోలు నాత్మ తత్వ-
మాత్మ పరమాత్మ త్రైమూర్తులగుచు విశ్వ-
విధుల జీనోము తత్వంబు వెల్లడగును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
70*
సేవ సాగిన – మానవ సేవ ఫలము-పుణ్యమే-మాధవుని భక్తి బూని సేవ
జేయగా వచ్చునదియదే! చెలగు మంచి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
71*
సేవ మానవ-మాధవ సేవలందు
దాస్య భక్తి విశ్వామె దనరు చుండు!
మంచి బెంచుట దాసుల మార్గమయ్యె!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
72*
దాస్య భక్తి గల్గదు, గురు దయను లేక!
కల్గినా – గర్వమున దాస్య కర్మ సాగు!
పరిసరాలు తోడ్పడవాత్మ పావనముగ!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
73*
మోదమును గూర్చు భక్తి నామోషిగాదు!
కష్టమే గొప్పయోగము కర్మ ఫలము-
భగవదర్పణ జేయుటే బ్రహ్మముదము!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
74*
సఖ్యతయు గల్గ దాస దాసత్వభావ-
మెంత మాత్రమల్పముగాదు యెంచి చూడ!
దానిలో త్యాగమై సేవ దనరు చుండు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
75*
మంచి చెడు శత్రు మిత్రుల నెంచు వేళ-
సామ్య దృష్టిని మదియందు సమత వెలుగ-
ఆత్మ తత్వతీరము వెంట నలరు ముక్తి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
76*
బాహిరాంతరమున నిండు బ్రహ్మమెల్ల-
తానె సర్వస్వమను గర్వ తత్వమెసగు-
విషయ సంయమనంబుచే వెలయు భక్తి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
77*
భర్తృహరి సుభాషిత నీతి బ్రతుకు మైత్రి!
భక్తి సహితము ‘సద్భావ పథము మైత్రి!
సాగు మైత్రియే సద్భక్తి యోగమగును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
78*
నీతి నియమ నిష్టయు మది నివ్వటిలగ-
సాగు సామాజికము మెచ్చు సత్యవ్రతము!
గీత ప్రామాణికత దేల్చు నీతి విద్య!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
79*
ప్రకృతి, జడ, చేతనాంశల బరగుసృష్టి-
చేతనాంశలో సద్భక్తి చెన్నుమీరు!
ప్రకృతి జడమున స్వార్థమే బరగు జగతి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
80*
దైవములకెల్ల దైవమై, ధరణి బుట్టి
యాదవుల యందు బెరిగెను-మాధవుండు!
నూరు తప్పులు మన్నించు నోర్పుజూపె!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
81*
నూత్న వైజ్ఞానికము-నాడు నుడివి నట్టి
సూత్ర శోధన, విజ్ఞత సూచి జగతి!
అనుభవజ్ఞానమగు సైన్సు – అతిశయించు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
82*
రాగ వైరాగ్యములు, మది రంగు బ్రతుకు
బరువు బాధ్యత, లౌకిక పరువు కీర్తి!
ఆశ కన్న సదాశయ మదియె మేలు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
83*
భక్తి యాశ నిరాశల నధిగమించు-
పారలౌకిక మార్గాన ప్రతిఫలించు!
భక్తి గుదరక బ్రహ్మంబు పట్టువడదు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
84*
వెన్నెలమవాస్య సుఖ దు:ఖ వేదికలుగ
బ్రహ్మమెఱుగక-రక్తి విరక్తి గాదు!
ఆశవీడిన సంసారి దాత్మ దారి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
85*
జన్మ తరియింప జేయు సజ్జనుల మైత్రి!
దారి సుగమంబు జేయు సద్గ్రంధ పఠన-
అమృత ఫలములివియు రెండు-నాత్మదెలుపు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
86*
భక్తి వేదాంత విద్యల పటిమ వెంట-
ఆత్మ విద్యార్థిగను పరమాత్మ రూపు!
దేవదేవుని తేజంబు, దేల్చిచూపు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
87*
కాని వేళల యోగ్యత గలుగ కున్న
బ్రతుకు శరణాగతిని బొందు బాట జూపె!
కర్మ ఫలసమర్పణ జేయు కళనొసంగె!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
88*
నవత,దాస్య భక్తియె మానవతను బొందు!
పాప భీతి పుణ్యపు ప్రీతి బరగు యువత-
భక్తి – రక్తి దోబూచుల బడక నిలుచు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
89*
కృష్ణ పార్థుల మైత్రి చేకూర్చె జయము
చెన్ను మీరె శ్రీ కృష్ణ – కుచేల మైత్రి!
కర్ణ దర్యోధనుల మైత్రి కఠిన హింస!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
90*
పుఱ్ఱె కోగుణముండు-పుడమి నరుల-
జిహ్వ జిహ్వకో రుచియంద్రు – చిత్తమొక్క
త్రాట నడుపు, గీత సుధలాధ్యాత్మికములు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
91*
భువి పరోపకారమె ముఖ్య భూమికగను-
ఫలములందింప సమకట్టె పలుమతాలు!
పారలౌకిక సుఖశాంతి పథములయ్యె!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
92*
ఆశ సాలీనిగూటిలో, ఆత్మ జిక్కు-
పడని – తీరుగ వేదాంత భక్తిబాట-
మైత్రి విశ్వరూపమె భక్తి మార్గమనగ!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
93*
సఖ్యతయు లేని జీవన చట్రమేది?
భక్త తత్పరతయు లేక భద్రతేది?
మైత్రి భక్తియే తగు మార్గమగును జగతి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
94*
ధర్మ సుస్థిరతయె కదా దైవలీల!
ఆత్మనున్న దైవాజ్ఞయే – అవని ధాత-
పనుల-కన్నను కారుణ్య భావమేది!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
95*
దైవ దాసాన దాసత్వ దారి వేరు-
నీచ మానవ దాస్యంబు నిందితంబు!
దాస్య భక్తియే శరణార్థి దారియయ్యె!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
96*
మైత్రి గనకున్న మాయికామాయికతయు-
శత్రు తత్వంబుచే, క్షతగాత్రమగును!
ధర్మమును వీడి వర్తించు దారి వెడలు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
97*
ఈసు,పరనింద,వెసనాల నింపు గూర్చ-
గుప్త రాత్రించరుల జేరు-‘ గురుని బోధ-
మరచి వర్తించు మరుజన్మ మార్గమందు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
98*
ధర్మ వర్తనమే మెచ్చు కర్మ సాక్షి!
ధర్మ సంస్థాపనకు బూను కర్మ యోగి!
గీత పరిధి లో నవవిధ భక్తి వెలయు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
99*
ధనము-విద్యాధనము మించు ధనముగాదు!
పుణ్య ధనముచే, కీర్తియు- ముక్తి గలుగు!
మానధనముచే నిహలోక మాన్యుడగును!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
100*
మనసు మడతలో స్వార్థమై మాయజేరు!
బాష వేషమాడంబర వసన భక్తి-
మాయ విడకున్న-పరమాత్మ డాయ వశమె?
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
101*
జీవ శ్రేష్ఠుగా నరుని దీవించె ప్రభుడు
విస్వ జీవ సంరక్షణా విధులనుంచె!
జీవి జీవి పరస్పర దివ్య ప్రేమ!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
102*
వేద పాఠాలు గుణపాఠ్య వేదికలుగ
మంచి చెడు విచక్షణ సాగు మార్గగతులు-
మాయ దొలగించు మంత్ర ప్రామాణికములు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
103*
ఆత్మ-పరమాత్మ సంయోగ యాత్ర బ్రతుకు!
ఆశయమ్మాత్మ సంశయమైన ప్రశ్న-
ప్రభుని గీత సమాధాన పరచు రీతి!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
105*
రాజు-ప్రజలు పరస్పర భావస్వామ్య
గతిని సేవకు బూనగా హితము గూర్చ-
జాతి సేవలో దాసదాసత్వమలరె!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
106*
పదము వెంట పరుగునాపి భావమెరిగి-
పనులవెంట ప్రదర్శించి బ్రతుకు విధము-
గలిగి నప్పుడే ప్రజకెల్ల గట్టి మేలు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
107*
లాక్షణికులెల్ల కలిధర్మ సూక్ష్మమెఱిగి-
పట్టు సడలింపవలె-వాక్య గుట్టు దేల్చ-
గలమె? భావ-బాషాంతరీకరణమందు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!
108*
శుభము-మిత్రకోటికి దైవమభయమిడగ!
శుభము-శతకలహరి మెచ్చు – శ్రోతలకును!
శుభము – సర్వేజనాస్సుఖినోభవంతు!
తిరుణహరి దాసభక్తి తద్వినుత సూక్తి!