top of page

శరణాగతి-2

(ఆ.వె.)

1*

శ్రీలు పొంగు భక్త శ్రేష్ఠ చారిత్రముల్

శ్రేయ నిధులు భారతీయ కథలు!

వేద విధుల దీప్తి వెలయు ధార్మికములు!

స్వామి కొడవటంచవాస శరణు!

2*

సౌష్ఠవాభివృద్ధి సామ్యత సద్భక్తి-

నీతి ధర్మ గతుల నిష్ఠ వెలసె!

పుడమి – మంచి చెడులె పుణ్యపాపములనన్

స్వామి కొడవటంచవాస శరణు!

3*

నీతి లేక జాతి నిర్మాణమే వృధా!

మతపు ధర్మ మార్గ మనుసరించి-

మంచిబెంచు మనిషి మహిలో మహాత్ముడు!

స్వామి కొడవటంచవాస శరణు!

4*

భక్తి నియమ నిష్ఠ భద్రత గౌరవమ్

మూఢ మతియు బ్రహ్మ ముదము గొనదు!

విజ్ఞులందు కపట ప్రజ్ఞ నిరర్థకమ్

స్వామి కొడవటంచవాస శరణు!

5*

నాది – నేను – మరిచి, నయమైన దారిలో

జయముబొందు నరుడు జగతి యందు!

సంఘ జీవి గాన సత్సంగ మేమేలు!

స్వామి కొడవటంచవాస శరణు!

6*

మనము-మనది-యనెడు మానవత్వపు మంచి-

కొంచమైనను చాలు, సంచితార్థ-

పుణ్యనిధులు-ముక్తి పూర్వకంబులుభువిన్

స్వామి కొడవటంచవాస శరణు!

7*

అరయ సైన్సు-జాతియనుభవ జ్ఞానము-

జ్ఞాన మనగ యాత్మ గనెడు దారి-

మాయతెరలు జీల్చు, మార్గమీ ధరలోన!

స్వామి కొడవటంచవాస శరణు!

8*

మంచి నాచరించు, మనిషియాలోచన-

నీతి ధర్మ మార్గ నియతి-భక్తి

సహన బుద్ధి, శాంతి, నిహపర సౌఖ్యముల్

స్వామి కొడవటంచవాస శరణు!

9*

జీవినుద్ధరించు జీవకారుణ్యము

నమ్మకంబు వెంట నలరు వృద్ధి!

ఆత్మ దర్శనంబు నానందదాయకమ్

స్వామి కొడవటంచవాస శరణు!

10*

చేవ గూర్చు నీతి సేవలో నీసేవ!

బలముగూర్చు భక్తి బాట ముక్తి!

సుకృత విత్తగణన సూత్రధారుడ వీవు!

స్వామి కొడవటంచవాస శరణు!

11*

మానవాళి నీదు – మార్గగాములు గాగ

తేజరిల్లు చుంద్రు దేవతలుగ

స్వార్థమార్గ తామసాత్ములు రాక్షసుల్

స్వామి కొడవటంచవాస శరణు!

12*

పేద గొప్ప బేధ ప్రేరణ ధనముదే-

సుకృత ధనపు బుద్ధి సూక్షవృద్ధి!

మానవత్వ విధులు-మంచి తార్కాణముల్

స్వామి కొడవటంచవాస శరణు!

13*

నీపురాణ కథలు నీతి ధర్మ నిధులు

త్రికరణాల శుద్ధి తీరు తెన్ను!

ధన్య కీర్తిదములు – దయయు దాక్షిణ్యముల్

స్వామి కొడవటంచవాస శరణు!

14*

మంచి బెంచి చెడును వంచుట నీపనీ!

పశువు నుండి వేరు పరచి మనిషి-

మానిషిగను మలచు మార్గమే నీభక్తి!

స్వామి కొడవటంచవాస శరణు!

15*

లౌకికంబు భుక్తి లభ్ధితో శక్తియు-

యుక్తియు పెంపొందు నుర్వి వెలయు

భక్తి బాటలెపుడు పారలౌకికములు!

స్వామి కొడవటంచవాస శరణు!

16*

భౌతికాల బ్రతుకు భ్రాంతి తాత్కాలికమ్

ఆత్మ-శాశ్వత పరమాత్మ సొమ్ము!

వట్టి నోటి దురద వాద వివాదాలు!

స్వామి కొడవటంచవాస శరణు!

17*

దైవ ప్రేమ దడిసి ధరజీవ తతులెల్ల-

నీతి ధర్మ వృక్ష నిజఫలాలు-

లక్షణాల మంచి లక్ష్యమే సద్భక్తి!

స్వామి కొడవటంచవాస శరణు!

18*

కర్మ ధర్మ సూత్ర గతజీవనము నీవె-

గమ్యముగను సాగు కలియుగాన-

తదితరాలు ధరణి తాత్కాలికంబులు!

స్వామి కొడవటంచవాస శరణు!

19*

నీదు నీతి గీత నియమ సందేశముల్

అవని మ్రోగు-విధుల సవరణలుగ!

నయజయంబులొసగు, నరలోకమును బ్రోచు!

స్వామి కొడవటంచవాస శరణు!

20*

అహము మనసు గాక, ఆత్మయై తాత్విక-

సహనమొంది, శాంతి సంయమనము-

జరుగు పుణ్య దీప్తి, జయమగు, నయమగున్

స్వామి కొడవటంచవాస శరణు!

21*

బ్రతుకు నెల్ల నీదు భారంబుగా జేసి

నిష్ఠలందు పుణ్య వృష్టి గురియ-

ముగ్ధ భక్తి బాట మురిపాల సంద్రమే

స్వామి కొడవటంచవాస శరణు!

22*

జగతి నాటకంబు ప్రగతి ప్రదర్శన-

పాత్రధారి నడుపు సూత్రధారి!

బ్రతుకు దిద్ధు భక్తి నతికించి శాసించు!

స్వామి కొడవటంచవాస శరణు!

23*

భారతీయ వేషబాషలందున, వేల్పు-

భక్తి చదువు సంధ్య యుక్తమైన-

సాంప్రదాయ వెన్న-సంస్కృతి వెన్నెలల్

స్వామి కొడవటంచవాస శరణు!

24*

భయము భక్తి శ్రద్ధ భావగాంభీర్యముల్

పాడి దప్ప నట్టి బ్రతుకు దెరువు

రీతి, పాపభీతి, నిత్య సుకృత ప్రీతి!

స్వామి కొడవటంచవాస శరణు!

25*

పట్టి విడువరాదు పావన వ్రత దీక్ష

పట్టు దలగ భక్తి మట్టుకేసి-

కట్టవలయు మనసు-గుట్టు దెల్యు పిదప!

స్వామి కొడవటంచవాస శరణు!

26*

పుడమి జీవులందు బుద్ధి జీవి నరుడు

పూనుకొన్న భక్తి పూర్ణుడగును!

తుచ్ఛ భోగములను తూర్పార బట్టును!

స్వామి కొడవటంచవాస శరణు!

27*

విశ్వ రూపు- కనులు వేయైన చాలవు

గనగ పొగడ తలలు గలవె వేయి!

శేషశాయి! నీదు సేవజేయగనిమ్ము!

స్వామి కొడవటంచవాస శరణు!

28*

లోక విద్ధె తో వివేక బుద్ధియు శ్రద్ధ-

పార లౌకికమగు భక్తి గలుగ-

బ్రహ్మ మోదమిచ్చి పరమపదము జేర్చు!

స్వామి కొడవటంచవాస శరణు!

29*

చేయు పనులయందు, చెప్పు మాటల యందు శుద్ధి-

యోచనలను శుద్ధి నోచకున్న-

నీతి ధర్మవిధుల రీతి సాగదు కదా!

స్వామి కొడవటంచవాస శరణు!

30*

శెనగలారగించి చేయి గడిగి నట్లు-

పైపటారపు పని ఫలము నిడదు!

చేయి దాచి పరుల సేవ గోరుట

వృధా!

స్వామి కొడవటంచవాస శరణు!

31*

తాత తండ్రినాటి తరతరాల బ్రతుకు-

మార్పు గారడియని, మనుమడింద్ర-

జాలికుడను పేరు చాల గడించేను!

స్వామి కొడవటంచవాస శరణు!

32*

నాకు సద్ధి నిమ్ము-నీకాకలైనచో

మందుగొనుమటంచు మాత్రజూపు,

మాయికుండు, భువినమాయకు వంచించు

స్వామి కొడవటంచవాస శరణు!

33*

నమ్మియున్న వాని నట్టేట ముంచెడు-

నిపుణుడైన ఖలుడు, నీదు కంట-

వ్రేలు నిడెద, నీదు వ్రేలు నానోటనూ-

స్వామి కొడవటంచవాస శరణు!

34*

సాగినంత సేపు సాగించు సాగని-

నాడు, నాత్మబోధ నాలకించు!

ఆత్మ దెలియగ పరమాత్మ నాలోచించు!

స్వామి కొడవటంచవాస శరణు!

35*

తిరిగి తిరిగి, మిడత దీపంబు దరిజేర,

వేచియున్న నల్లి వెసను మ్రింగె-

ప్రొద్ధు వెలుగు నీడ పొంచుమృత్యువు జాడ!

స్వామి కొడవటంచవాస శరణు!

36*

ఇచ్చి మరచు వాడె యిలవేల్పు సముడనన్

అడుగు వాడు తిరిగి యిడుమలొందు!

పుచ్చుకొన్నవాడె పులియయ్యె! కలిలోన

స్వామి కొడవటంచవాస శరణు!

37*

సాద లేని తల్లి సంతానమును చెత్త

కుండినేయు ప్రాత గొంతు కథయె!

టెస్టు టుయ్బి బేబి హిస్టరీ లేటెస్టు!

స్వామి కొడవటంచవాస శరణు!

38*

మనసు గల్గు వెంట-మార్గంబు గల్గును

మనసులేని తీరు మనిషి రాయి!

అద్దె గర్బ సంచి పద్ధతి తరువాయి!

స్వామి కొడవటంచవాస శరణు!

39*

దెబ్బకు భయపడును దేవుని మన్షియు-

పగను-బట్టుట మది పాము పుట్ట!

కాల్చు నగ్గి పుల్ల కాలిపోవును కదా!

స్వామి కొడవటంచవాస శరణు!

40*

విలువ కట్టలేని, వింతకాలము పెట్టె-

బెట్టి, దాయలేని పెద్ధ నిధియె!

నీతి విలువ కాల రీతిని సవరించు!

స్వామి కొడవటంచవాస శరణు

41*

గుర్తు లేని చరిత, ఎర్తుకేకులపాలు

శిలలు శాసనాలు, శిల్పి, శిల్ప-

కళలు గలియు, కాల గర్భంబు లోపలన్

స్వామి కొడవటంచవాస శరణు!

42*

కాయ గసురు దిన్న కాయంబు బెరుగును

ఊడ్చి పోయ పెంట యునికి బెరుగు

బుద్ధి బెంచు విద్య-సిద్ధించుటే మేలు!

స్వామి కొడవటంచవాస శరణు!

43*

అవని బ్రోవ రాము డాదర్శ మానవు

డగుచు బుట్టి భువిని, తగినయట్టి

కట్టు బాటు సాగె కౌటుంబ జీవనమ్

స్వామి కొడవటంచవాస శరణు!

44*

బిడ్డ యల్లుడట్లు దొడ్డ ప్రేమను, జాన-

పదులు సీత రామ ప్రభువటంచు-

పాటలందు భక్తి భావంబు ప్రకటింత్రు!

స్వామి కొడవటంచవాస శరణు!

45*

విశ్వ జనసుఖార్తి-విశ్వామిత్రుడు యజ్ఞ

దీక్ష నుండి రామ లక్ష్మణులను

రక్షకులుగ నిల్పి రాక్షసాళి నణచె!

స్వామి కొడవటంచవాస శరణు!

46*

శివుని విల్లు నెక్కు పెట్టి నారియు గట్టు

యత్నమందు విరిగె, నంత సంత-

సించె సీత, జనుల చిత్తంబు వికసించె!

స్వామి కొడవటంచవాస శరణు!

47*

కట్టె పయనము, మునికార్యార్థమై

కట్టె తాళి, జనకు పట్టి మెడను-

కట్టె తిరుగు పయనమట్టె తమ్ములు రాగ!

స్వామి కొడవటంచవాస శరణు!

48*

కట్టె తండ్రి యాజ్ఞ కారడవి వెడల-

కట్టడి గొనె, తగు కైక కోర్కె-

కట్టు వడిన జనకు కట్టడి తలదాల్చె!

స్వామి కొడవటంచవాస శరణు!

49*

కట్టె నారచీర-కాంత వెంటయు రాగ

నట్టె లక్ష్మణుండు, ననుసరింప!

కట్టె గుహుడు, పడవ కఱ్ఱకు తెరచాప!

స్వామి కొడవటంచవాస శరణు!

50*

కట్టె పర్ణ శాల, గట్టు మెట్టుల మీద

మజిలి కొక్క సొంపు మనసు కింపు!

కట్టు బాటు, రక్ష గట్టె ముంగిట తోట!

స్వామి కొడవటంచవాస శరణు!

51*

కట్టు బాటు వ్రతము – కంకణమును గట్టె

కాంత చుప్పనాతి కన్నుగుట్టె

కట్టు జేయ ననుజుకప్పగించెను ప్రభు!

స్వామి కొడవటంచవాస శరణు!

52*

కట్టె కక్ష, దనుజకాంత రాముని సీత

కట్టి తేగను సమకట్టె-కథలు-

గట్టి జెప్పె, నాసికా కర్ణగాయముల్

స్వామి కొడవటంచవాస శరణు!

53*

కట్టె వింటినారి, కనకమృగము దేగ

కదలె, సీత కోర్కె కరుణ దీర్ప-

కనక మృగము మాయ కనుకట్టు జేయగా!

స్వామి కొడవటంచవాస శరణు!

54*

కట్టె వేషము యతిగా రావణుడు తన

చేతను బెకలించె సీతబడిన-

మట్టి పెల్లను రథమందుంచి చెఱబట్టె!

స్వామి కొడవటంచవాస శరణు!

55*

కాల్వ గట్టె మాత కన్నీటి చారలున్

సీత గీత దాటి చింత నొందె!

సీత కనుల వెదకె శ్రీరామ చంద్రుని-

స్వామి కొడవటంచవాస శరణు!

56*

కట్టె పయనమంత కదలె దక్షణ దిశన్

వెదకు వేళ హనుమ యెదురు వచ్చె!

ప్రభువు దెలిసి తాను బంటుగా మారెను!

స్వామి కొడవటంచవాస శరణు!

57*

కట్టె మైత్రియు పురి గట్ఠె సుగ్రీవుడు

భక్తుడయ్యె, వాలి బాధ బాసె!

కట్టె రాఘవుండు కడలి పై వారధీ!

స్వామి కొడవటంచవాస శరణు!

58*

స్వామి గొల్చిరంత శబరిజటాయువుల్

వాలి గూలె జాంబవంతుడాది-

రామదండు సాగె రామదూత వెనుక!

స్వామి కొడవటంచవాస శరణు!

59*

బాల్యమందె గొట్టె పాతకిన్ తాటకిన్

గొట్టె చెడుసుబాహు గొట్టె బెదరి

పారిపోయినట్టి మారీచు మరిగొట్టె!

స్వామి కొడవటంచవాస శరణు!

60*

గొట్టెవిద్యుజింహు గొట్టెకబంధాది

నీచ రక్కసాళి పీచమడచె!

నేక శరపువేటు నేడుతాళ్ళనుగొట్టె!

స్వామి కొడవటంచవాస శరణు!

61*

గోట మీటి యెగుర గొట్టె దుందుభిదేహ-

శల్య గిరిని, భూరి శౌర్యమొప్ప!

వాలిగొట్టె నంత వానితమ్ముని గాచె!

స్వామి కొడవటంచవాస శరణు!

62*

లక్ష్మణుండు గొట్టె లంకేశు తనయుని

మేఘనాథు, మట్టువెట్టె రామ-

విభుడు కుంభకర్ణు, వీరుల, మంత్రులన్

స్వామి కొడవటంచవాస శరణు!

63*

కొట్టె రామదండు కొదమసింగములట్లు

దనుజ గుంపునెల్ల దునిమె నంత!

మారుతాత్మజుండు మైరావణుని గొట్టె!

స్వామి కొడవటంచవాస శరణు!

64*

కొట్టె రాముడు, పడగొట్టె రావణుతలల్

ఇంటి గుట్టు దెల్పె వెంట నున్న-

రావణానుజుండు రణవిభీషణుడంత!

స్వామి కొడవటంచవాస శరణు!

65*

రామ బాణఘాతి రావణుండును గూలె

లంక బుట్టి నట్టి రాక్షసులను-

పోగ మిగిలియున్న యోధులు శరణనన్

స్వామి కొడవటంచవాస శరణు!

66*

కొట్టె మనసు విరగ గొట్టె నంతట నగ్ని

నికష బెట్టె, సీత నిగ్గుదేల్చి-

జనకరాజు పట్టి జననింద బోగొట్టె

స్వామి కొడవటంచవాస శరణు!

67*

బాణమొకటె గొట్టి బ్రహ్మాండమును గాచె

పరగ నొక్కమాట పాటిగాగ-

నేక పత్ని వ్రతము నేర్పడ సాగించె

స్వామి కొడవటంచవాస శరణు!

68*

కొట్టె బాణమెపుడు కోదండ రాముడు?

ధరణి మానవతను ధరణి నడుప-

ధర్మ సుస్థిరతకె-ధనువెక్కు పెట్టెను!

స్వామి కొడవటంచవాస శరణు!

69*

కలుగు,గర్వమంత ఖర్వంబు జేయగా

భక్తులైన, తనదు బంటులైన,

తనయులైన మాట తప్పడు రామయ్య!

స్వామి కొడవటంచవాస శరణు!

70*

జగతి నవతరించి జనులకు మోదంబు

దెచ్చె, దాశరథి యెదేచ్ఛ బ్రతుకు-

నిచ్చె, నీతి విలువ హెచ్చెను నరులందు!

స్వామి కొడవటంచవాస శరణు!

71*

తెచ్చె చిత్తమునకు ఏకపత్నీ వ్రతమ్

వంశమునకు కీర్తి వన్నె వాసి-

నిచ్చె నీతి విలువ హెచ్చెను నరులందు!

స్వామి కొడవటంచవాస శరణు!

72*

తెచ్చె శాంతి సుఖము నిచ్చె సుభిక్షమున్

త్రికరణాల శుద్ధి తేట పడగ!

హెచ్చె సాంప్రదాయ, తేజంబు జగతిలో

స్వామి కొడవటంచవాస శరణు!

73*

తెచ్చె నొక్కమాట దెల్పి చేతలజూపు

బ్రతుకు బాట పుడమి ప్రజలు మెచ్చు-

సీత దెచ్చె, ప్రభువు శ్రీరామచంద్రుడు!

స్వామి కొడవటంచవాస శరణు!

74*

తెచ్చె రాఘవుండు, తెచ్చె నీతి విలువ-

మేలు నొక్క బాణ మేయు విద్య!

తెచ్ఛె, మానవత్వ తేజంబు హెచ్చించె!

స్వామి కొడవటంచవాస శరణు!

75*

సీత రామ విభుడు నేతెంచె పుష్ఫక

మందు, రామదండు ముందు హనుమ!

తెచ్చె రామవార్త, తేలియాడె నయోధ్య!

స్వామి కొడవటంచవాస శరణు!

76*

వచ్చె భరతుడంత తెచ్చెపాదుకలన్న-

పాదములకు దొడిగె, పడియు మ్రొక్కె!

భక్తి యనుజు మెచ్చె ప్రభువు దీవించెను!

స్వామి కొడవటంచవాస శరణు!

77*

పుణ్యమూర్తి!ప్రభువు పుడమి ధీరోదాత్తు

డయ్యె! లోకులు పొగడంగ సీత-

ధీర నాయికగను, దెచ్చె సాహితి శోభ!

స్వామి కొడవటంచవాస శరణు!

78*

తెచ్చె సంస్కరణలు, హెచ్చె సంస్కృతి శోభ

పుట్టి నింట మరియు మెట్టి నింట-

ధర్మనిరతి మెచ్చు దాంపత్య బంధము!

స్వామి కొడవటంచవాస శరణు!

79*

అవతరించె హరియెఆదర్శ మానవ –

మూర్తిమత్వమొప్ప, ముదము గూర్చె!

మానవాళి చరిత మార్గదర్శిగ నిల్చె!

స్వామి కొడవటంచవాస శరణు!

80*

చీకు చింత మాన్పి చిత్తంబు దోచిన-

రామచంద్రమూర్తి, రక్షయనగ-

అన్నపూర్ణయయ్యె పున్నెభారతభూమి!

స్వామి కొడవటంచవాస శరణు!

81*

శ్రీలుజిందు తార చిత్త చంద్రుని జేర

చైత్రమాసమనిరి, జనులు చైత్ర-

చేతనంబె ప్రకృతి చేతనాంశను దెల్పు!

స్వామి కొడవటంచవాస శరణు!

82*

క్రొత్త కోర్కె కీర్తి విత్త తాత్విక సంత

సంబు గూర్చు, పుడమి సాగు బ్రతుకు!

మొత్తమునకు బ్రహ్మ మోదమీ యుగాది

స్వామి కొడవటంచవాస శరణు!

83*

క్రొత్త చింతపండు క్రొత్త బెల్లపు ముద్ద

లేతమావికాయ, వేపపువ్వు!

పచ్చి కొబ్బరి ఘన పచ్చడి రుచి వృద్ధి!

స్వామి కొడవటంచవాస శరణు!

84*

లేత వేపపువ్వు రేకులౌషదమగు

భూతహితవు గూర్చు, పుడమి పంచ-

భూత సహిత తనువు, బుద్ధి నాత్మయు దోచు!

స్వామి కొడవటంచవాస శరణు!

85*

తరచి చూడనైదు తత్వరుచులు నొక్క

పచ్చడైన విధము సచ్చరిత్ర!

శుచియు, శుభ్రత నాల్క రుచి మొగ్గలకు నిగ్గు!

స్వామి కొడవటంచవాస శరణు!

86*

బ్రతుకు నైదురుచుల, యతుకు జీవనకేళి

నాత్మ జన్మజన్మ యాత్ర సాగు!

పుణ్యరుచికి, నివియె బుణ్యాది మూలముల్

స్వామి కొడవటంచవాస శరణు!

87*

మంచి చెడుల దెల్పు పంచాంగ పఠనముల్

దనరు జాతకాల ధైర్య మొసగు!

పరమ పురుషు కథలు, పరమార్థ పటిమలున్

స్వామి కొడవటంచవాస శరణు!

88*

చేదు కష్టములను, చెలగు తీపి సుఖము

పులుపు తీరు కోర్కె వలపులూరు!

తీపి వగరు బ్రతుకు తీరు తెన్నులు జూపు!

స్వామి కొడవటంచ వాస శరణు!

89*

ఐదు రుచులు, ప్రజకు నైకమత్యము నేర్పు

బ్రమయు దొలగు, బుద్ధి బలము గలుగు!

బాహిరంతరగత భావసౌందర్యమున్

స్వామి కొడవటంచవాస శరణు!

90*

పల్లె, పట్న వృక్ష పల్లవంబులు మెక్కి

కోకిలమ్మ పాడు- సోకుమూక-

లవని కందము నిడు శ్రవణ పేయము గాను!

స్వామి కొడవటంచవాస శరణు!

91*

కామదహనమాయె, కన్నీట దడసిన

రతియు పతిని గోరె రాగమొప్ప!

కరుణజూపి శివుడు కాముని బ్రతికించె!

స్వామి కొడవటంచవాస శరణు!

92*

కామియైన, ధర్మగామియై సాగిన

కట్టుబాటు జెల్ల-గలుగు శుభము!

ధర్మ రహిత కామ్య కర్మదుష్ఫలహేతు!

స్వామి కొడవటంచవాస శరణు!

93*

ధర్మ, అర్థ, కామ్య కర్మలు ధర్మమై-

మోక్ష మిచ్చు, విడిగ మూఢగతులు!

పుడమి వెలసె నాల్గు పురుషార్థ సాధనల్

స్వామి కొడవటంచవాస శరణు!

94*

పల్లె పత్తనాల, పల్లవించెడు హోలి-

సుతియు మించకున్న సుఖము గూర్చు!

మోదమెసగ, మనసుమోడు పచ్చని చెట్టు!

స్వామి కొడవటంచవాస శరణు!

95*

కల్తి రంగు, కృత్రిమ కలుషపదార్థముల్,

గాక సహజ రంగు గలుగ, కులము

మతములట్లు నేక మైన యధార్థముల్

స్వామి కొడవటంచవాస శరణు!

96*

భక్తి రాగమొప్ప బ్రతుకమ్మ పండుగల్

సద్ధుల బ్రతుకమ్మ సత్తు పిండ్లు!

పలురకాలు ప్రజలు, పౌష్టికాహారముల్

స్వామి కొడవటంచవాస శరణు!

97*

ఓలి పండుగట్లె నొనరు రంగులచేత-

సద్ధుల బ్రతుకమ్మ-సంకురాత్రి-

పండుగలను, ముగ్గు నిండు రంగోలియున్

స్వామి కొడవటంచవాస శరణు!

98*

తేజ మొప్పు దసర, దేవిపూజలు, నవ-

రాత్రియుత్సవాలు-రంగులీను!

వస్త్రశోభదనరు, వరుసదీపావళుల్

స్వామి కొడవటంచవాస శరణు!

99*

సర్వ జనుల సుఖమె, పర్వప్రయోజనమ్

అందరొక్కటియగు, ఇంద్ర ధనుసు!

నిండు మనసు తృప్తి, పండుగు పబ్బముల్

స్వామి కొడవటంచవాస శరణు!

100*

రంగురంగు గలుపు రంగోలి పండుగల్

వరుస రుచుల గలుపు వత్సరాది!

వయసు మరచి, జనుల మనసు పరిమళించు!

స్వామి కొడవటంచవాస శరణు!

101*

సాగె రచ్చబండ, చదువుల సంక్రాంతి

అక్షరాల చకినమచ్చు దిద్ధ-

సాగు చదువు సంధ్య – సత్కార సంస్కృతుల్

స్వామి కొడవటంచవాస శరణు!

102*

ఊరడిల్లు బ్రతుకునున్నంతలో తృప్తి

పల్లె పత్తనాల ప్రజలు గుండె-

నుప్పతిల్లు ప్రేమలుపకార పుణ్యముల్

స్వామి కొడవటంచవాస శరణు!

103*

బయటి దేశములకు బ్రహ్మవిద్యను నేర్పి

విజ్ఞ విద్య దిగుమతింపు గూర్ప-

నేర్చె భారతీయ నేర్పరి నేటికిన్

స్వామి కొడవటంచవాస శరణు!

104*

భోగి మంటల చలి పొలిమేర దాటించు-

భారతీయులెరుగు బాటలందె-

రోగ దారి క్రిమి నిరోధించు కట్టడి!

స్వామి కొడవటంచవాస శరణు!

105*

వెసన సప్తకంబు వెస నణచు విధులెల్ల

బహుపురాణ నీతి భక్తి రీతి!

మొదలు బెట్ట కున్న మోసమీ కలిలోన

స్వామి కొడవటంచవాస శరణు!

106*

పల్లె మోకరిల్లె పట్నంపు మోజుకై

పట్టణంబు మెచ్చె పల్లె సరుకు!

పట్నసౌధ శోభ పల్లె కొంప డిజైను

స్వామి కొడవటంచవాస శరణు!

107*

భారతీయ నీతి బహుళార్థ సంస్కృతీ

తరచి చూడ మేలు తగిన రీతి-

చేతనత్వ శాస్త్ర చేయూత మంచిదీ!

స్వామి కొడవటంచవాస శరణు!

108*

జగతి భారతీయ జాతీయతకు శుభమ్

నాకు నేను గాక- నీకు నేను-

బ్రతికియుంటి ననెడు భావశుద్ధికి శుభమ్

స్వామి కొడవటంచవాస శరణు!

 

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page