
శ్రీ ఆంజనేయ స్వామి (పావనీ మంత్రపురిధామ) శతకము
(తే.గీ.)
1*
శ్రీ రఘువరు సద్భక్తి చిత్తమలర
రోమరోమాన శ్రీరామ నామ భజన!
గుండెలోనసీతారాముడుండ జూపు!
పావనీ! మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
2*
రామభక్తాగ్ర గణ్యుడ!రామబంటు!
రమణి సీతమ్మ మెచ్చిన రామ దూత!
రామకార్యసాధన నిత్య రాచ బాట!
పావనీ మంత్రపురిధామ!భావి బ్రహ్మ!
3*
రామవిశ్వాసపాత్రుడ! రామనామ
గానసుధలోన లీనమై గడుపువాడ!
భరత సముడవో శ్రీ రామభక్త! హనుమ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
4*
స్వామి భక్తియే ప్రాణమై సాగునట్టి
ప్రభువు నమ్మిన బంటువో పవనతనయ!
పరమశివునాంశ సంభూత! బ్రహ్మతేజ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
5*
బ్రహ్మ విద్యనార్జించిన బ్రహ్మచారి!
వేదవేదాంగ వేత్త! సువేష! బాష
పండితోత్తమ! ఘనభక్తి బాటసారి!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
6*
భక్త జనులకాదర్శమౌ బాటనీది
బంటులకు మార్గదర్శమౌ పటిమనీదె!
పాటి దప్పని నీమాట పసిడిమూట!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
7*
రామతారక మంత్రమే రమ్యమనుచు
మనసు నిశ్చల ధ్యానమేమారకుండ
పరవచించి స్మరింతువో పరమహంస!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
8*
నిన్ను గనినంత గనుదోయి నిండుముదము
నిన్ను భావింప గుండెలో నిండుధీమ!
దాస! దాసానదాసత్వ దారి నీది!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
9*
నీదుపూజలో పూవునై నిలువచాలు
కోర్కలుప్పొంగు నీభక్తి గ్రోలుచుందు
పాదధూళిలో కణమునై పరవసింతు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
10*
చిత్తముననిల్పి తదితర చింత వీడి
సంతసింతు నీచింతన సౌఖ్యమిడగ
మేరుసమధీర! నీభావమే రుచించు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
11*
పల్లవింపగ మదినిన్ను పదిలపరచి
భక్తి సాగుదు బ్రతుకు విభ్రాంతి వీడి
బాధ మరచి నీకీర్తనల్ పాడుకొందు
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
12*
విరిసి విరియని చందంపు విద్య బాష
వచ్చిరాని కవిత్వంపు వంకదీర్చి
భక్తిభావంబు వివరించు శక్తి నిమ్ము!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
13*
అవధరించుము నామొరలాలకించు
బ్రతుకు సవరించు శాత్రవ బాధలణచు
భక్తి బాటలో నడిపించు భద్రముగను!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
14*
తేటగీతుల నాభక్తి తేటపడగ
దేశిచందంబు నాబాష తేజమెసగ
చిత్తగించుమీ శతకము స్వీకరించు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
15*
విఘ్ననాయకు మ్రొక్కి వగ్దేవి దలచి
సుజన పూర్వాధునిక కవిస్తుతిని జేసి
పుడమి తలిదండ్రి గురువుల పూజజేతు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
16*
మామ శ్రీహరి ప్రోత్సాహమంది తాత
చక్రపాణి కోరికదీర్చ శతకరచన
పట్టుదల తప్ప పదబంధ పటిమదెలియ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
17*
భక్త ఘనకోట పాపన్నపలుకు గొనియు
వాగుగడ్డ జనామోద వాక్కువనియు
శతకమును రాయబూనితి శక్తినిమ్ము!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
18*
బ్రతుకు బాటలో నీభక్తి బాటగలిగె
భక్తి పాటచేమదినిండె బ్రహ్మముదము
బాధగాధలు మాయమై భక్తివెలిగె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
19*
భజనసంఘమిత్రులు భక్త బంధు జనులు
మకుటమునుజూచి మెచ్చిరో మారుతయ్య
వాగు గడ్డన వెలసిన వాయుపుత్ర!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
20*
తిరుణహరి వంశమున నేను తిమ్మదేవ!
సత్యనారాయణుడ సామి శరణు శరణు!
సాధు సజ్జనులనుజేర్చి యాదుకొనుము!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
21*
పాప తిమిరంబు హరియించు పవనపుత్ర!
బ్రతుకు తాపంబులను మాన్పు భానుతేజ!
ఆత్మ తత్వంబు బోధించు అజరభూజ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
22*
ఎచట రామకీర్తన సాగు నచట నీవు
ఎచట నీవొరామభజన లచటసాగు!
భజనలీనమై నీవెంట భక్తకోటి!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
23*
బాల్యమున బాలభానుని ఫలమటంచు
సాగి కబలింపబూనిన స్వాతినేత!
ఇంద్రవరము బొందిన వానరేంద్ర హనుమ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
24*
అంజలి ఘటించి భళివీర! ఆంజనేయ!
దిక్కునీవని మ్రొక్కెడు దీనజనుల
కష్టములుబాపి రక్షించు కపివరేణ్య!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
25*
ఆపదను మ్రొక్కి సంపదనాదమరచి
పాడుచింతన జిక్కిన ప్రజలగాచి
భక్తి పథము జూపి – పరమపథముజేర్చు
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
26*
కానికాలాన శరణన్న కరుణజూపి
కార్యభారమును వహింప కదలివచ్చి
కలతబాపు కేసరిపుత్ర! కవివతంస!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
27*
అనుభవ జ్ఞానమే జ్ఞానమనగ మరిగి
విచ్చలవిడి వర్తన సాగి వినరు శాస్త్ర
పూర్వభాగములందె పులకరింత్రు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
28*
నేటి విద్యల నెఱుగరే మేటిమునులు
వాటి పిదపనాధ్యాత్మిక వాదులైరి!
ఆత్మ విభజించి పరమాత్మ నందుకొనిరి!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
29*
ధనమె విజ్ఙానఫలమయ్యె! తనువు తళుకు
బ్రాంతిలోబడి మదిశాంతి బాసి మనిషి
మనిషికి బెదరంగ వలసె మనసుమరచె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
30*
ఆరుగురు శత్రువులదాడి నలసి యాత్మ
నజ్ఞతయు గల్గ కలిమాయ నటన గలుగ
భువిదురాశదు:ఖితమయ్యె బుద్ధిజీవి!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
31*
చపల చిత్తకామాంధుల క్షణిక సుఖము
క్రొత్త రుజగూర్చ నౌషద శోధనంబు!
దాచు దోచు గుణంబు దోబూచులాట!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
32*
లోభమున్న దానము లేదు లోకులెల్ల
భోగరోగంబు దాడిలో బొంకు నేర్చి
భక్తిదారి వైరాగ్యంబు బాసిచనిరి!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
33*
వట్టి డంబాలు గొట్టుచు గట్టిమేలు
నెట్లు తలపెట్టు నుపకారమెట్లు సాగు
పుణ్యమును వీడు పోకడ పుట్టిముంచు
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
34*
కాలసర్పంబు కాటేయు కలత వడగ
కలుష కలిమాయ వాటేయు కడకు బ్రతుకు
గడువులో ముక్తి గననేడుగడవు నీవె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
35*
నేను నేనన్న నేరంబు లెంచు యముడు
నాదినాదన్న శోకంబు నరకమగును
తనువు విడగతానెవ్వరో తలపుగొనరు?
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
36*
చదువు పదవులాస్తియు పాస్తి తదితరంబు
బంధుమిత్ర, దారపుత్రానుబంధ సతము
పుడమి నరజీవితము జూడ బుద్బుదంబు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
37*
జగతి నాటకపాత్రలే జనులు సూత్ర
ధారి వైకుంఠుడే తగు వేషధారు లగుచు
రాకపోకల పుణ్యంపు రాశిగొంద్రు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
38*
ఆత్మ పరమాత్మ దెల్పు గీతార్థబోధ
జన్మ వస్త్రాలు దిగనాడి జనెడునాత్మ
తరలురాక పోకల ముక్తి దనరుదాక!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
39*
గాలిలో దీపమెట్టి దిగాలు పడెడు
తీరుతెన్ను ప్రశ్నలు వేయి తీరులుండు
నాగు జంపి శిలార్చన నడుపు చుంద్రు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
40*
తపముకన్న దానముమిన్న తత్వమరసి
చూడ కాలానుగుణ సూక్తి జూపుత్రోవ!
అంచుడాబు నాడంబర మసలు గొడవ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
41*
కలిమి యేరు బారిన కుక్కగతుకునట్లు
కొంచమే యనుభవించు లోభబుద్ధి!
తాను తన వారుపస్తుండ తరలిపోవు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
42*
సజ్జనులజేరి వంచించు దుర్జనుండు
పెట్టెగల పట్టు వస్త్రాలు బట్టికొరుకు
చిమ్మటను బోలు ఫలమేమి చెందు తనకు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
43*
మెప్పుబొందునే నలపాక ముప్పులేక
చప్పిడిగ కూర వడ్డింప చవులు దప్పు!
విద్యలో రసజ్ఞతలేక విలువ లేదు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
44*
మంచివాడు కీడునకోర్చి మంచిజేయు
చేతలెల్ల శ్రీ గంధపు చెక్కబోలు
తానుతరుగు సుగంధ మితరుల కొసగు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
45*
ధనికు కివ్వక నిరుపేద జనుల కిడగ
మేలు-వాన వార్ధినిగాక నేల వాడి
పోవుచేలను కురువగ పొసగు ఫలము!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
46*
నీచు దిక్కారమున కోర్చు నీతిపరుడు
లోప మెంచడు క్షీరాబ్ధి లోన కాకి
రెట్ట వేసి చనిన గల్గు నెట్టి లోటు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
47*
చిత్త శుద్ధి చే తీరును చీకుచింత!
తనువు శుద్ధి యారోగ్య సూత్రంబు గాగ
నాత్మ శుద్ధి చేకురు పరమాత్మ పథము!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
48*
జన్మ తుదిమజ్లి భారత జనని యొడియె!
భిన్నమేకత్వమై సాగు చిన్నె భార-
తీయ తత్వంబు చాటించు దివిని భువిని!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
49*
నాగరికము పల్లీయంబు నడచు సంత
నేక భావంబు నీభక్త లోకమునకు!
భక్తి బాంధవ్యమున సేవ బరగుచుండు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
50*
జగతి కలిమాయ దాటగా జనులకెల్ల
సాగు సంసార సాగర నావ భక్తి-
భజన చుక్కాని రఘురామభద్రు రక్ష!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
51*
ఆత్మ పరమాత్మ శోధనలాగె జనుల
కాస్తి పాస్తివాదన మరి జాస్తియయ్యె!
వమ్ము దొమ్ములే, మదినమ్మకమ్ము దరిగె!
పావనీ మంత్రపురిధామ! భావి బ్రహ్మ!
52*
మొదట తలిదండ్రిపై భక్తి మొలక మొలిచి
దేవదేవుని భక్తిగా తేజరిల్లు!
దేశ భక్తి ప్రజాభక్తి పేరవెలయు!
పావనీ మంత్రపురిధామ! భావి బ్రహ్మ!
53*
వాగు గడ్డన నీదు దేవళము గట్టి
ఘనుడు గనుకోట పాపన్న గణుతికెక్కె!
భజనబృందంబు గొనియాడె ప్రజలుబొగడ!
పావనీ మంత్రపురిధామ! భావి బ్రహ్మ!
54*
పూజ సంతర్పణలు సాగె పుణ్యచరిత!
ప్రజలు దీక్షబూనియు భక్తి పరులుగాగ!
వేయి భోజనాలర్పించి వేడుకొనిరి!
పావనీ మంత్రపురిధామ! భావి బ్రహ్మ!
55*
బ్రతుకు భారంబు నీది నిర్భయము మాది
కేసరీపుత్ర!హనుమంత! కీర్తిమంత!
యనుచు భక్తులు నీబాట ననుసరింత్రు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
56*
చెఱుకు దరికి చీమలుతామె చేరినట్లు
భక్తజనులు జేరిరి పుణ్య ఫలముగోరి
దానధర్మంబు లొనరింప దలచినారు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
57*
నుదుట సిందూరమును దాల్చి హృదయమెల్ల
భక్తి బంధురమై పోవ భజనయందు
నిన్ను మెప్పింప బూనేరు నియమనిష్ఠ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
58*
రాక పోక భక్తుల నోట రామచరిత
సుందరాకాండ ఘట్టంపు సూక్తిరాగ
మాలికలు జేసి పాడేరు రామదూత!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
59*
రామసుగ్రీవులను గల్పి – రణము నందు
వాలి గూలగ జేసిన వాయుపుత్ర!
సీత నగలు జూచియు రామచింత దొలగె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
60*
స్వామి భక్తియే శ్వాసనిశ్వాసగాగ
ప్రభువు సేవయే నీపంచప్రాణమయ్యె!
కీర్తి కాంక్ష లేనట్టి సుగ్రీవమిత్ర!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
61*
వానరులు సీత జాడకై వసుధ దిరుగ
వరుసగాబంపు బృదంపు వరుసలోన
రామముద్రిక గైకొన్న రామదూత!
పావనీ మంత్రపురిధామ! బావి బ్రహ్మ!
62*
మొదట సామాన్యతయె నీకు మోదమిచ్చు
పొగడగా నిన్నుమించెడు యోధులెవరు?
జాంబవంతాది వనచర జాతినేత!
పావనీ మంత్రపురిధామ! భావి బ్రహ్మ!
63*
దక్షణాదిగా మాల్యవంతంబు జేరి
మేరుగిరిమించి వింతగా మేనుబెంచి
వార్ధిలంఘించితివి గంధవాహ పుత్ర!
పావనీ మంత్రపురిధామ! బావి బ్రహ్మ!
64*
లంకిణి దునిమి, వరమొంది లంకజొచ్చి
మాయరాకాసి మూకల మట్టుబెట్టీ
సూక్ష్మ రూపివై వెదకిన సూర్య మిత్ర!
పావనీ మంత్రపురిధామ! బావి బ్రహ్మ!
65*
శోకమూర్తియై సీత యశోకవనిని
మూర్ఖులైనట్టి రాకాసి మూకనడుమ
తల్లి గుర్తించి శ్రీరాము దలచినావు!
పావనీ మంత్రపురిధామ! బావి బ్రహ్మ!
66*
రామ చరితమాలించి యారమణి సీత
విశ్వసించె ముద్రికగొని విశ్వరూపు
జూచి రామదండు బలము బోల్చి దెలుప!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
67*
గుర్తుగా శిరోమణినిచ్చె గుట్టుగాను
దెలిపె కాకాసుర కథ దీవెనలు నిచ్చె
కాలహరణంబు చేయక కదలు మనియె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
68*
ఆకలను సాకు! వనమెల్ల శోకమయ్యె!
రక్షకులు రాక్షసుల మూక రయముగాగ
నంత నక్షకుమారుండు నంతమయ్యె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
69*
మేఘనాథు బ్రహ్మాస్త్రంబు మీది భక్తి
నేడు గడియలు లొంగగా నెదుటి వారు
గెలుపు గంతుల బంధింప గేళి సాగె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
70*
ఏడు గడియలు గడిపియు నేగి రావ
ణాసురు సభకు తరలింప, నావిభీష
ణుండు మర్యాద బోధింపనుచిత రీతి
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
71*
పెద్ధగను వాలమును బెంచి గద్దెజుట్టి
ఎగిరి కూర్చుండ, రావణుండెగిరి పడగ
రాయభారంబు నెరపిన రామదూత!
పావనీ మంత్రపురిధామ! బావి బ్రహ్మ!
72*
శ్రీపతే రామచంద్రుడు సీత లక్ష్మి!
మానవులుగారు దశకంఠ మంకు విడువు!
దాశరథి జేరి శరణన్న దక్కు బ్రతుకు-
పావనీ మంత్రపురిధామ భావి బ్రహ్మ!
73*
తరలు నామాట పాటించి తల్లి విడువు
తండ్రి రామయ్య దరిజేర్చి తప్పుదెలిసి
బ్రతికి పొమ్మని హితవును బలికినావు!
పావనీ మంత్రపురిధామ! భావి బ్రహ్మ!
74*
కలికిశోకాగ్ని నీలంక గాల్చుననుచు
విను విభీషణు మాటల వివరమనుచు
బుద్ధిజెప్పిన హనుమంత! బుద్ధిమంత!
పావనీ మంత్రపురిధామ! భావి బ్రహ్మ!
75*
రామ నామమే ముక్తి కి రాచబాట!
మానవుని మాధవునిగాగ మలచు మాట!
రామబాణ మహిమె, ధర్మరక్షగాగ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
76*
కోతినీతులు చాలని కోపగించె
చేయుహితబోధలను పెడచెవిని బెట్టె!
నిన్నె శిక్షింప శాసించె నీచబుద్ధి!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
77*
కోక తైలంబులో ముంచి తోకజుట్టి
కాల్చగా నగ్నిగానిడెను రాకాసిమూక!
జూడగా రావణుని లంక బూడిదయ్యె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
78*
అంగదుని బంపి – తుద మహాసంగరంబు
జేయ సేతుబంధన సాగె – మేఘనాథు
యుద్ధమాయలు కొనసాగె నుధృతముగ
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
79*
శీఘ్రమే ద్రోణగిరితొ సంజీవిదెచ్చి
లక్ష్మణుని మూర్చ బాపగా తక్షణంబె
గారవంబున రామయ్య గౌగిలించె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
80*
బాహువుల జేర్చి, లక్ష్మణ ప్రాణదాత!
భరత సమయన్న శ్రీ రామభద్రుమాట
తోటివారిలో సత్కీర్తి తోరణంబు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
81*
మాయ మహిరావణుని ద్రుంచి మహిమ వెలయ
కాంతులీనెడు నీభుజస్కంధమందు
ప్రభువులనుదెచ్చి యిచ్చిన పవన పుత్ర!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
82*
డాబు జూపు ధూమ్రాక్షుని డాసి యణచి
ప్రళయకాలరుద్రుడవయ్యు బవరమందు
రక్కసుల మట్టువెట్టిన రామబంటు!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
83*
కుంభ కర్ణాది వీరులు గూలుదాక
రామ రావణ సంగ్రామ రచనజేసి
రామ దండు సాగించిన రక్షకుడవు!
పావనీ మంత్రపురిధామ! భావి బ్రహ్మ!
84*
సూక్మ బుద్ధిని నీప్రేమ చూఱగొన్న
యా విభీషణుడరుదెంచి యభయమడుగ
సామి సన్నిధి జేర్చిన స్వాతి హనుమ!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
85*
నీదు మాటగైసేయక నిక్కి నీల్గి-
రామ బాణాగ్నికెరయయ్యె రావణుండు!
అగ్గి దూకియు జానకి నిగ్గుదేలె!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
86*
పుష్ఫకమునెక్కి యయ్యోధ్యపురము జేరి
సామి పట్టాభిషేకపు సంబరమున
పరవశించి పాడితివహో! పరమభక్త!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
87*
తల్లి సీత హారమున ముత్యాలు గొరికి
చూచి యందు రామువెదకి చూచిపార
వేసితివట సీతాదేవి మెచ్చు కొనగ
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
88*
నవనిధులు – అష్ట సిద్ధుల కవనిజాత
దాతగా నిన్ను దీవించె, ధన్యమనుచు
నిఖిలలోకాలు కీర్తించె – నీదు మహిమ!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
89*
భావి సృష్టికీవె నవమబ్రహ్మ వనుచు
నభయ హస్తంబు తలనుంచె, ప్రభుడు వరము
నిచ్చె, దేవదుందుభులంత నింగిమ్రోగె!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
90*
అభయమొంది యయాతి నీప్రభువు తోనె
వైరమును బెట్టె – విధిలీల వైనమెరిగి
పరితపించితివో-జగత్ర్పాణపుత్ర!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
91*
రామ బాణంబునకు దీటు రామనామ
భజన సాగించితో స్వామి భక్తి మెఱయ
ప్రతిన దప్పని ప్రభువంత బంటువీవు!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
92*
ఆది దంపతులరుదెంచి యాలమాప
శరము విరమించె శ్రీరామ చంద్ర విభుడు!
భక్తియేగెల్చునని యాదిశక్తి బొగడె!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
93*
జయము గూర్ప ధనుంజయు జండ పైన
చిహ్నమైనిల్చి కామ్యార్థ సిద్ధినొసగ
ధరణి పాండు పుత్రులకీర్తి దనరెనండ్రు!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
94*
తంబురలు వీడి నారద తుంబురులును
గానమున నీవె లోకైక ఘనుడవనగ
రామనామగానము జేయ రాళ్ళుకరిగె!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
95*
సీత, రాముల-నీయెద జీల్చి చూపి
రామచరితగానముజేసీ, రామనామ
జపము తపము సాగించేవు తరుచరేంద్ర!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
96*
పురహరుని యంశ బుట్టిన పుణ్య చరిత!
హరిని సేవించి కీర్తించు హనుమ! పుడమి
జాతిబేధము లెంచని సహనమూర్తి!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
97*
నీదు నామంబు నినదింప నిత్యశాంతి
పుడమి చెడు భూతపీడలు బుగ్గియగును
నిన్ను శరణన్న శ్రీ రాముడన్ని యిచ్చు!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
98*
దుర్జనులు భక్తి నినువేడ గుణము మారి
దురిత సంచితార్థము పుణ్యభరిత మగును
రఘు కులేశుని దయ జన్మ రహితమగును
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
99*
మంత్రపురి, మంత్రకూటమి, మంథనిగను
మారి మంతెన్న యనిబిల్వ మహిమవెలయ
గౌతమేశుని క్షేత్రమై గాంచె కీర్తి!
పావనీ మంత్రపురిధామ! బావిబ్రహ్మ!
100*
తారుమారయ్యె జీవనదారులందు
క్రొత్త వింత పాతయు రోత సొత్తుకొరకు
భరత విద్యయు పరదేశ భ్రమనుసాగె!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
101*
నామమేదైన – ఆపరంధాముడొకడె!
పూలు వేరైన భక్తుల పూజయొకటె!
యనుచు కృష్ణు కీర్తించిన గుణనిధాన!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
102*
పరగ రామాలయద్వార పాలకుడవు
వైష్ణవాలయముల నుత్సవముల యందు
గరుడ, హనుమవాహన సేవ ఘనతకెక్కె!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
103*
దేవుని వీడి జీవుడునుండలేడనంద్రు!
భక్తి లేకముక్తినిబొందు బాటగనము!
నిర్మలాత్మయే నిఖిలేశు నిలయమగును!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
104*
చెడ్డ వారికాత్మీయులే శత్రు సములు!
మంచి వారికందరితోడ మైత్రిపొసగు!
అల్పులను దయ మన్నించుటాత్మ దృష్టి!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
105*
కలిని ఆకలి-అజీర్ణ కాలకూట
కీల చల్లార్చు పరిశ్రమ క్రియలు సాగె!
తినుటకై పుట్టినట్లు మా తీరుతెన్ను!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
106*
చిన్న వాడ నజ్ఞానంపు తిమిర సంధ్య
తెలిసి తెలియని భావముల్ దెలుపు చుంటి!
చెఱుకునకువంక బోయిన చెడదు తీపి!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
107*
బ్రతికి చెడినయూరున భక్తి భావమొలక
తాత గృహమందు పెంపొందె తాత్వికముగ
కష్టమే సుఖమయ్యె! నీ కరుణ గలిగె!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!
108*
అంకితము గొను శతకంబు నాంజనేయ!
చదివినను, విన్నను సుఖము శాంతినిమ్ము!
వేయి శుభములొనగూడగా వేడ్కనిమ్ము!
పావనీ మంత్రపురిధామ! భావిబ్రహ్మ!