
గీతామననం-2
(ఆ.వె.)
1*
శ్రీశ!వాసుదేవ! గీతామృతప్రదాత!
భక్త జనప్రసన్న పారిజాత!
బాహిరాంతరముగ బరగు ప్రకృతినేత?
పాలకడలిశయన! పద్మనాభ!
2*
త్రిగుణశుద్ధి భారతీయ కృతుల వర్ణ
నాత్మకంబు ప్రకృతి వాఙ్మయంబు
చెలగు జీవరాశి చేతనాంశను గూర్చు
పరమపుణ్య చరిత ప్రకృతిమాత!
3*
పుడమి పులకలెత్తునుపమ పచ్చిక బీళ్లు
వృక్ష హారతతి సమీక్ష సేయ
వేయునోళ్ళ శేషు వేడుకదీరునే
పరమ పుణ్య చరిత ప్రకృతి మాత!
4*
ఋతువులెల్ల పాఠ్యపుస్తక పాఠముల్
సప్తవర్ణ కిరణ చక్ర గమన
రంగు పొంగులేక రాగంబునదెల్పు
ప్రకరణాల ప్రగతి పాఠశాల!
5*
పైరుపచ్చలందు పచ్చని బతుకులు
వృక్ష జాతిచలువె, దీక్షవృద్ధి
సౌష్ఠవంబు మనసు శారీరకంబుగన్
ప్రకృతి పాఠశాల పఠనలీల!
6*
జీవులెల్ల నాత్మ జిలుగు వెల్గులమించు
సుందరాకృతిగను బుద్ధిజీవి
సవిత కిరణజన్య సంయోగ క్రియ పత్ర
హరితధనము ప్రకృతి భరితవరము!
7*
పచ్చదనము శుచియు పరిశుభ్రమగు పంచ
భూతజగతి సృష్టి-భూరివృష్టి
చేతవెలయు ప్రకృతి - చేతనాంశ పరమ
పురుషు నిలయమనిరి పూర్వమునులు.
8*
పరిసరాలవెలయు పవిత్రజీవనహేల
ప్రకృతి మాతవరమె! పరమపురుషు
నాజ్ఞగ జడ చేతనాంశవెలయు శక్తి
బాహిరంతరముల బరగు చుండు!
9*
భిన్నజీవకోటి ప్రీతిగూర్చు ప్రకృతి
భీతిమాని బుద్ధి జీవిసాగు
ప్రకృతి మాతయొడిని పవిత్ర జీవనకేళి!
సాగునంతదాక సాగిపోవు!
10*
దధిని వెన్నపూస దనరినచందంబు
జగతి ప్రకృతి ప్రేమ జాగృతంబు!
తరచి చూడ లేవు తరతమబేధముల్
చీమ యేన్గునేక చిత్తదృష్టి!
11*
వసుధగల్గు సకల వార్తసాహితిగాగ
ప్రకృతిమాత ప్రగతి ప్రతుల విందు
గ్రంథములను ప్రకృతి చందంబు కావ్యమై
రాయనట్టి కవులరాతలేదు.
12*
హెచ్చు తగ్గు సామ్యతేచ్ఛ వెచ్చనిగది
ప్రకృతియతిథి జీవి పరవసించు
పంట - వంటవార్పులింటింట శోభించు
భిన్నభావమేది విన్నపముల!
13*
ప్రకృతి వొడిని జీవి ప్రగతిగాంచగనేర్చె
జీవిలోని ప్రకృతి చేతనాంశ
జడముమించిపోవ జగతి శ్రేష్ఠతగల్గె
బుద్ధి జీవియయ్యె పుడమినరుడు!
14*
ప్రకృతి మాతయొడిని పావనాత్ములు మునుల్
తపము జపము జేసి దైవదారి
జేరి పరవశింత్రు చేతనాంశను జనుల్
పొందు సూక్తినిధులు పొందుపరచి!
15*
ప్రకృతి శోభ విశ్వ ప్రాభవంబును దెలుపు
పుడమి మెచ్చు పరమ పురుషు లీల!
ప్రకృతి పురుషుల మది ప్రభవించు సత్యమే
శివము సుందరంబు దివిని భువిని!
16*
ప్రకృతి యందచంద ప్రతిభ వర్ణించని
కవియులేడు, వెలయు కావ్య కృతుల
ప్రకృతి వర్ణనంబె ప్రగతి సాహితియని
మెచ్చుకొంద్రు కవులమెచ్చు ప్రజలు.
17*
భారతీయ సామ్యభావబుణ్యాదులన్
క్రమశిక్షణ కొణసాగు విధుల
కాలనిర్ణయ ప్రతి కల్గు ఋతువులందు
బోల్చిచూడ ప్రకృతి మొదటిగురవు!
18*
ఆదినుండి నేటి యాధునికముదాక
ప్రకృతి దలపనట్టి ప్రగతిలేదు
వేదములను నాడు, వెలయుపురాణాల
కావ్యము ప్రబంధ గతుల జూడ!
19*
.ప్రకృతి మానవత్వప్రతిభ శిఖరమట్లు
మనుజుమేథమార్గ బోధ
చేయుగీత తత్వవేదికాకృతి యందు
జూడ ప్రకృతి తత్వజాడగలుగు!
20*
ప్రకృతి వైపరీత్య ప్రక్రియలో లయమ్
సానుకూల గతులసాగు సృష్టి
పరమపురుషు నాజ్ఞ పాలించు సమృద్ధి
సూచి, తుష్టి-పుష్టి తూచు దృష్టి!
*21.
ప్రభుని శాసనంబు ప్రకృతియనుసరించు
కలుషముప్పెనేయ కలుగు విషము
కల్మశహరలీల కాలచక్రగతుల్
ప్రకృతి లయముదెల్పు పత్రికలంద్రు
* 22.
భిన్న దేశ కాల - భిన్న భాషలసాగు
రచనలెల్ల ప్రకృతి రాగఝరులె!
వర్ణనాత్మకమగు వస్తుసాహిత్యముల్
అంచందములు ప్రబంధగతులు.
*23.
విశ్వ ప్రకృతి విద్య విషయ విజ్ఞానమే
శాస్త్ర గతుల సాగు సైన్సుపేర
పరపురుషు జేరు పథముగా జ్ఞానమే
సుందరాకృతిగను విందుజేయు.
*24.
జగతినాటకాన జడచేతనాంశలన్
వెలయు ప్రకృతి హేల విభునిలీల!
సహజ ప్రకృతి శాంతి సహన సమ్మేళనమ్
దివ్య ప్రకృతి నీడ దీప్తి గాంచై!
*25.
నరుని ప్రశ్నవలెనె నవనవలాడెడు
పచ్చదనమె ప్రకృతి వెచ్చదనము
పఠన పాఠ్యకృతుల పవిత్ర ప్రబంధముల్
బ్రతుకుబాట ప్రకృతి పాఠశాల!
*26.
ఋషులు మునులు ప్రకృతి ఋజుమార్గ వర్తనుల్
గీతదాటనట్టి గీతవిధుల
జనపురాణ ప్రకృతి జడచేతనాంశలే
జగతి జీవహేతు ప్రగతి గతులు!
*27.
పూతకాత ఫలము పుడమి వృక్షజాల
బీజమంకురించు ప్రీతి మంచు
సాగు కిరణజన్య సంయోగ క్రియలీల
పత్రహరితవనము చిత్రమెంచు!
*28.
భక్తి పూజలందు పంకజంబు వెలయు
పత్రమంటనట్టి పగిది జలము
చేతనాంశ నరుని శ్రేష్ఠత దీపించు
నలువ సృష్టి వెలయునాత్మ ప్రకృతి!
*29.
తల్లి భారతి తన తనయాలిలాలించు
యొడియె ప్రకృతి పంచభూతముడియె
సత్య వ్రతమహింస, సాగు సౌఖ్యము శాంతి
వేదికయ్యె ప్రకృతి వేయి విధుల!
*30.
నిత్య మార్పు ఋతువు నిర్ణీతమగు తీర్పు
ప్రకృతి మాత ప్రజల బ్రతుకు
నెండవాన చలుల నెత్తిగొడ్గు ప్రకృతి
పచ్చదనము శుభ్రత ఫలము బలము!
*31.
సహజ ప్రేమయట్లు సాగు ప్రకృతి సదా
నిఖిలజగమునేలు నిండుదనము
పఠన పాఠ్యకృతుల పవిత్ర ప్రబంధముల్
బ్రతుకు బాట ప్రకృతి పాఠశాల!
*32.
జీవి జీవిలోన దివ్య ప్రకృతి ఠీవి
విత్తనంబు పుణ్యవిత్తతావి
వివిధ జీవరాశి విహరింపయోగ్యమై
తోడునీడ ప్రకృతి తోరణంబు!
*33.
జన్మ జన్మ సాగు జడచేతనాంశలున్
సృష్టి పుష్టి లయము తుష్టి వృష్టి
పచ్చదనము బ్రతుకు వెచ్చధనము సాగు
జగతి ప్రకృతి జీవజాల వృద్ధి!
*34.
సతతహరిత వృక్ష సంతతియుపకార
మితవు తత్వశాస్త్ర విహితబుద్ధి
విత్తనాన దాగు వింత మఱ్ఱినిబోలు
ప్రకృతి జనపురాణ ప్రవచనోక్తి!
*35.
జీవకోటికెల్ల జీవికయె ప్రకృతి
వెలయు భక్తి ముక్తి వేదికగను
ప్రణవ, ప్రణయ, ప్రళయ ప్రకణ సూత్రాల
నిర్వచనము బోలు నిండు ప్రకృతి!
*36.
వైపరీత్య కాలవైరి మైత్రి యునొక్క
మూసవోయు ప్రకృతి పొసగు సృష్టి
మూడు మూర్తులందు మూర్తీభవించిన
ప్రకృతి వేల్పు సేవ ప్రజల సేవ!
*37.
ప్రకృతి మాత సేవ పరపురుషు సేవ
ప్రకృతి భాగమైన ప్రజల సేవ
ప్రజల లాలన భువి ప్రకృతి పొత్తిళ్ళలో
నాత్మ బుట్టి గిట్టు యాత్ర జన్మ!
*38.
ధరణి జీవకోటి దండలో దారమై
ప్రకృతి సాగు - చిత్త ప్రకృతి గాగ
బాహిరంతరాల ప్రకృతి భాండాగార
ముండు, నాడు నేడు నుండురేపు!
*39.
గడనమారి నరుని గమంబుమారినా
కాలచక్ర గతుల కలిమి లేమి
ప్రకృతి సహజగుణము ప్రజలకు ఛత్రమై
బ్రతుకు సాగు గతుకు నతుకులందు!
*40.
బాటపొడవున ఘనపాదపంబులు నాటి
బిరుదులొంది దానవీరులైన
రాజులెల్ల చరిత రాజిల్ల జేసిరి!
ప్రకృతి పూజలింపు ప్రజల పెంపు!
***
*41.
రావి,వేప, తులశి, రాగిల్లు వాకిల్లు
లేమిబాధమరచి లెస్స బ్రతుకు
అధిక తుష్టి పుష్టి ఆరోగ్య భాగ్యము,
ధనము ప్రకృతి పచ్చదనము వృద్ధి!
*42.
పచ్చదనపు వృద్ధి పరిసరాలకుశుద్ధి
బ్రతుకులందు వెలయు పచ్చదనమె!
ప్రజలవృద్ధి ప్రకృతి పరియావరణ శుద్ధి
గలుగు చిత్తశుద్ధి కలిమిలేమి!
*43.
ప్రకృతి మాతయొడిని పల్లవించిన చెట్లు
పుడమి చేతులట్లు పులకరించు!
చెట్టు పూజ ప్రగతిమెట్టు వరంబిచ్చు
ప్రకృతిమాతదయను బ్రతుకువిరియు!
*44.
ఎదుట ప్రకృతిబింబమెదలోన ప్రతిబింబ
ప్రకృతి గల్గి జీవి పరిఢవిల్లు!
జీవశ్రేష్ఠనరుడె జీవకారుణ్యమై
పరిసరాల శుద్ధి పరచ మేలు!
*45.
జీవకోటి సౌఖ్య జీవిక ప్రకృతియే
వెలయు విద్యలకును వేదికయ్యె!
ప్రాణవాయునిధిగ ప్రణయభావ పొదిగ
దేవదేవనాజ్ఞ తేజరిల్లు!
*46.
ధరణి జీవరాశి దాదియైలాలించు
ప్రకృతిమాత భక్తి ఫలముగూర్చు
దైవభక్తి గలుగ ధన్యంబు జన్మము
ప్రకృతి భక్తి చేత బ్రతుకు ముదము!
*47.
సృష్టి సుస్థితిలయ దృష్టి వారధిగాగ
ప్రకృతి జీవులెల్ల బ్రతుకు పుడమి
వరము ప్రకృతి శాంతివర్తిని, సంక్షోభ
నర్తిననగజెల్లు కీర్తి జల్లు!
*48.
ధవునియాజ్ఞ తలనుదాల్చి చరాచర
జీవులకును మేలుజేయు ప్రకృతి
కలుగు లయము పుడమి కలుష హరము జూడ
పాత ద్రోసి క్రొత్త పాదుకొల్పు!
*49.
శుభయుగూర్చు ప్రకృతి శుచియు శుభ్రతలందు
జనులు మునులు బ్రతుకు జగతియందు
భువి పురాణకథలు పురుషార్థ సాధనల్
ప్రకృతి నీడలందె ఫలమొసంగు!
*50.
మునులయజ్ఞ ఫలము సురలకానందము
ప్రకృతి శుద్ధి వలన ప్రజకు ముదము
పొసగు వృష్టి పంటపొలము నిండుదనము!
*51.
శ్రేష్ఠ ప్రకృతి యందు చేష్ట నిష్కల్మష
మైన వృద్ధి జెందు మానవాళి
పెరిగి విరుగు గుణము ప్రేమ ప్రకృతి వరం
కాలమొక్కతీరు గడచు పుడమి!
*52.
ప్రకృతి యందు బ్రతుకు వికృతి చేష్ట వలదు
భిన్నమేక దృష్టియున్న మేలు!
ప్రకృతివలెనె జీవి పరమాత్మ లీనమై
సాగిపోవ జగతి సాగు శాంతి!
*53.
ప్రకృతి బుట్టి పెరిగి ప్రకృతి బయట లోన
బరగు విధమునెఱిగి బ్రతుకవలయు
దోష దృష్టి మాని దోవసాగిన మేలు
కలుషరహిత ప్రకృతి కనులవిందు!
*54.
నరుల వికృత క్రియలు నాశనహేతువు
కడలి నిండు నదుల కలుషబురద
మేఘమగుచు తిరిగి మేదిని వర్షించు
కలుషవరద ప్రకృతి కళలుచెదురు!
*55.
పూవు పూవు దిరిగి పుప్పొడి సంపర్క
క్రియను సాగి తేనె ప్రియము గొనుచు
తెచ్చి తెట్టె బెట్టి తేటియానందించు
కలుష విషముగలుగ కలతజెందు!
*56.
తేటి పాట తీపి తేనెయూటయు తీపి
దరుగు కలుష రుచుల సరుకు చేత
నాగరికత కలుష నాల్క రుచించునో?
కల్మశమలవాటు గలుగ కీడు!
*57.
మనుజుకన్న నడవి మాకుమేలందురు
కలుష సొమ్ము నమ్మి కలిమియనుచు
సహజ లేమి ప్రకృతి సకలంబులను గల్గ
బ్రతుకు కొంప కలుష ప్రకృతిగంప!
*58.
నీతిలేనివాడు కోతికంటెను పాడు
సామ్యతొప్పు కలుషకామ్య కర్మ
ఫలము వీడలేక బ్రతుకునాపద పాలు
కలుష నిధుల పరుల కర్మగాలు!
*59.
ఋతుల చక్ర గమన రూపు రేఖలు మార్చు
కలుష భూత క్రియల కాలమయ్యె!
తరతరాల నీతి తారుమారై విద్య
గడన కొఱకు కలుష గతులు వెదకె!
*60.
పుణ్య ధనము గూర్చు బూనిక సాగరు
మరలమరలబుట్టు మానవాళి!
కలుషమాపకున్న గల్లంతె ప్రకృతులు!
స్వార్థ మార్గ కలుష సాగుబాట!
***
*61.
సులభ బ్రతుకు దెరువు సుఖమయ్యె రుజమాన్పు
తీపి యౌషదంబు తినగగోరు
చేదుమందు వలదు చేతగాదందురు.
రుజలనోర్చుకొనెడు రోజులివియు!
*62.
పులిని జూచి పులియు పులకించు బెదరదు
మేక జూచి మేక చేరుదరికి
నరుని జూచి నరుడు నదరు బెదురు చుండు
లోని ప్రకృతి వికృతి లోకమెరుగు!
*63.
సొమ్ము గూర్ప కలుష సొమ్మయ్యె ప్రకృతియు
కృత్రిమాలె మెచ్చు కృతులు గలిగె
సహజ ప్రకృతి మెచ్చు సహనమ్ము గోల్పోయి
కల్తిమెచ్చు మాట చల్తి సాగె!
*64.
అధిక సంతు, నిత్యమాక్సీజను కొఱత
కల్తి సరుకు చురక కలుషమహిమ
పంచభూత కలుష ప్రకృతి సమాంతర
జనసమస్య కీడు జరుగనుండె!
*65.
భూమిపుండు, బొగ్గుపులుసుగాలియు మించె
నూష్ణ నీలలోహితోష్ణ కిరణి
ప్రాభవంబు దెబ్బ ప్రాకటంబుగనో
జోను పొరను జీల్ఛునోయనంగ!
*66.
మాయపొరలు జీల్చు మార్గంబు మానియు
గీతసూక్తిమరచి గీత దాటి
గడుపువారు గడన గణనలో బడిభువి
సహజ ప్రకృతి జీల్చ సాగుచుంద్రు!
*67.
పచ్చడి రుచిలేదు పండువెన్నలలేదు
బ్రతుకు పసయు లేని పండుగంద్రు
యాత్ర యాంత్రికమగు జాత్రరసాయన
క్రియల కల్తి చాపక్రిందనీరు!
*68.
సహజ ప్రకృతి సౌరు సాహిత్యమున దాగె
నిత్య బ్రతుకు కలుష మిత్తికడకు
జేర్చు భయము వెంట జేరు నిర్లక్ష్యము
కల్గకుండనేది కట్టుబాటు!
*69.
ప్రకృతి జీవకోటి ప్రాకారవలయంబు
లోని పరిసరాల కల్మశంబు
చేటుగూర్చునన్న చెవిబెట్టువారేరి?
కలుష విషము చేత కలుగు హాని!
*70.
ప్రకృతి జదువువారు పరిసరాల కలుష
భూతమనక నిరత భూతవైద్య
గడనజేయనెంచి గడపగడపదిర్గు
కోర్కె పాతవింత క్రొత్తరోత!
*71.
కలుష భూతమాట కట్టించు వైద్యులు
పట్టి పట్టనట్టు చెట్టు బెట్టి
నీరుబోయమరచి తీరుతెన్నులుజూఢ
విర్గుడుగని పెట్టు విద్యలేదు!
*72.
జీవనదుల ప్రకృతి దేశంబు భారతం
బాహిరంతరాల ప్రకృతి దెలుపు
వేదవిద్య వెలయు వేదిక కల్మషం
కల్గుకొలది కానికాలమిదియె!
*73.
స్వామి భక్తి నిష్ఠ సర్వోపగతు పూజ
ప్రకృతి పూజపేర భక్తి గలిగి
దేవదేవుగొలుచు దేశంబు భారతం
కలుషమైన చేటుకాలమిదియె!
*74.
శుచియు శుభ్రత నేర్పు సూత్రాలు వల్లించు
సూక్తులందు నీతిసూచివెంట
సామ్యతలను బాష సాహితి వెలయించు
చోట కలుషమెట్లు జొచ్చుచుండె!
*75.
చెట్టు దైవమట్లు చేరిపూజింపగా
మూఢనమ్మకమయ్యె ముందువెనుక
చెట్టుగొట్టి సొమ్ము జేసుకోజూచెడు
నాగరికము విజ్ఞనమ్మకంబు!
*76.
చెట్టు పుట్ట పూజజేసె శ్రీరాముడు
చెట్టు గొట్టి పదియు చెట్లుబెట్టి
రాజులేలినట్టి రోజులు కరువాయె
ప్రకృతి పచ్చదనము బరగునెట్లు?
*77.
పెరిగి విరిగి జీవివెంట నిర్జీవులున్
తరిగిపోయె ప్రకృతి తిరిగిపుట్టె
చెట్టు చిగురు తొడిగి మొట్టు చెట్టుగ మారె
కొట్టివేయుదెబ్బ కొలది పెరిగె!
*78.
పూజజేయబూను పూర్వరంగము శుద్ధి
పరిసరాల శుద్ధి ప్రకృతి పూజ
ద్రవ్యరాశి శుద్ధి దారి శుద్ధియు నింటి
గలుమ శుద్ధి దైవ గద్దె శుద్ధి!
*79.
తాను ప్రకృతిలో తగుభాగమని మర్చి
సహజ ప్రకృతి కల్మశాలుజేర్చి
ప్రాణవాయు చెడగ పాడుబడు బ్రతుకు
పరిసరాల శుద్ధి బరచకున్న!
*80.
కలుషరహిత జగతి గలుగు సంక్షేమంబు
మార్గదర్శి గీత మాట దెలిసిమరల బూనకున్న మార్గాంతరములేదు
చెట్లు బెంచకున్న చేటుగలుగు!
*81.
ఏరుదాటి తెప్ప నేకంగ తగలేసి
తిరుగు పయనమందు తిప్పలనెడు
వారు మిడుకుచుండ వారించు వారేరి?
రాయివేసి బురదదాటు వారె!
*82.
ఇచ్చి పుచ్చుకొనెడు యింపు మర్యాదలు
సహజ ప్రకృతి నిండ చాల గలవు
మేలు మరచి కలుషమేనింపు నాగరి
కతలు ప్రకృతి కలుష కథలు నడిపె!
*83.
పాలు ద్రాగి పటువ పగులగొట్టినయట్లు
ప్రకృతి మాత గుండె పగుల గొట్టి
వెళ్లి పోవు ఖలుడు పల్లె వారిని జూచి
నవ్వి గేలి సేయు రువ్వు రాళ్ళు!
*84.
కలుష బుద్ధి గీత గడిగి శుద్ధిని జేసి
నరుని మార్చకున్న నలుగు ప్రకృతి
వికృత రూపమొంది విహరించు నరజాతి
మ్రింగివేయ క్రుంగు మిత్తి గుహగ!
*85.
తేనెనీటి బొట్టుచేత చెడినయట్లు
పాలలోన విషము బరగినట్లు
ప్రకృతియందు కల్మశాకృతుల్ స్థాపింప
రూపుమారి ప్రకృతి చూపు శగలు!
*86.
కళలు తోరణాలు కమనీయ గోపుర
శిఖర శంఖచక్ర శ్రీలు కలుష
దిష్టి కందెనట్లు-దృష్టి కానవు నేడు
మసియు బారె దైవ మందిరాలు!
*87.
పట్టు పురుగులట్లు జుట్టుకొను నరుడు
బ్రతుకు తెల్లవార్లు బయట పడక
ప్రకృతి కలుషమందె బ్రతుకు చాలించెను
కలుషకాల గతియె కలియుగాన!
*88.
మనసుబెట్టీ పట్న మానిసి నింగిని
జూచు తీరికేది, జూచు బట్ట
పొట్ట నింపుగడన పొద్దస్తమానము
కృత్రిమాల నడుమ చిత్రమట్లు!
*89.
పందె మేసి చేయు విందు వినోదాలు
శుద్ధి సేవజేయు పద్దతేది?
భారి పరిశ్రమల బారించు వ్యర్థముల్
చెట్టు పుట్టజేరి మట్టు బెట్టె!
*90.
ఈగె గెలిచె తేనె తీగదాగెను తెట్టె
మూగవోయె పెంట మురుగు వీధి
నంటు రుజలు పల్లె నగరాలు ముంచెత్తె
కాటువడియె ప్రకృతి కలుషమందు!
*91.
గీత దెలిసి మరిచి గీతదాటి ప్రకృతి
కలుష హేతుభూత గడనచేత
పేదవలెనె ప్రకృతి ఖేద దారిద్య్రముల్
మానవాళి కలుషమావరించె!
*92.
శాశ్వతంబు గీత సారాంశమైయుండ
లాభ దృష్టి కలుషలావ జిమ్మె
నిగ్గు దరిగి ప్రకృతి యగ్ని పర్వతమయ్యె
ననుటెగాని గీత వినుట మానె!
*93.
యాంత్రికంపు బ్రతుకు మాంత్రికార్జనలోక
హితవు మరచి నరుడు విశ్వ రూపు
నాజ్ఞ మీరిమూఢ విజ్ఞ భక్తుల వేష
బాషలమ్ము సంత ఘోషబెట్టె!
*94.
వెసన సరుకు గొనగ వేలమువెఱ్ఱిగా
వచ్చువారు సహజ వస్తు ప్రకృతి
మెచ్చుకోక కృత్రిమ మచ్చు వస్తువుగొన
సహజ వస్తు సంత సాగదాయె!
*95.
అడగక వరమిచ్చి, ఆవాస సుఖమిచ్చి
బ్రతుకు దెరువు జూపు ప్రకృతి మాత
కృత్రిమాల దాడి గూలిపోవుచునుండె
ప్రకృతి జీవరాశి వికృతమొందె!
*96.
జరుగ నున్నది భువిజరిగి తీరును కలి
కాలమహిమ వెంట కలుష హాని
కానికాలమందు కలుషంబె ముంచెత్తు
కాని పనులు కానె కావు భువిని!
*97.
పరులకాశ్రయముగ పరమత సహనంబు
జూపె భరతమాత చుట్టు ముట్టి
రాయి రువ్వ ఫలము రాల్చి సంభావించె
పరుల బరువుమోసె భరతమాత!
*98.
భూత హితవె సత్య భూమికగానెంచు
భరతమాత చరిత పసిడి రాత!
కలుష బాధనోర్చు కవచ రక్షణగూర్చు
శోధనంబు ప్రకృతి శోభ మేలు!
*99.
కలుష ప్రకృతి తోట కలిపురుషుని వేట
నాడె వెడలె, తీర్థమాడు జలము
కలుష తీర్థయాత్ర పలు జాగ్రతలుగొను
చర్ఛసాగె తగిన చర్యలందు!
*100.
ప్రకృతి కలుష గ్రంధ ప్రచురణ ప్రతులెల్ల
కట్టుబాటుజేయు కథలు సాగె
గిట్టుబాటులేక, క్రియరూపమొందక
చాప క్రింద నీట సగము దడిసె!
***
*101.(శతి పూర్ణం)
శుక్ర వక్రనీతిసూత్రంబులోనైన
బరగు భూతహితవు ప్రకృతి హితవె!
దురిత గతులు ప్రకృతి దూరి కాలుష్యముల్
విరగబారె కలుష విషము చేత!
*102.
కరువు రక్కసి చెడు కల్తిచే సర్వత్ర
కల్మశంబు సాగె కల్ల నిజము
దెలియ వీలుగలుగు దెరువును గనిపెట్ట
పరు బరువు, బతుకు బారమయ్యె!
*103.
పుడమి ఋతువు మారు పులుగు పుట్టలుమారు
ఆకురాలు చిగురుటాకు నవ్వు!
తిమ్మి బమ్మి జేయు తిరకాసులను జూడ
సహజ ప్రకృతి గూర్చు సహనగుణము!
*104.
భక్తి పరుడె గురువు భావమూహింపగ
నిష్ఠగలుగు శక్తి నిగ్గు దేలు!
దేశ కాల పాత్ర తేజము, వ్యవహార
దక్షుడెరుగు కర్మ సాక్షిదోవ!
*105.
ఇహమునందు మైత్రి సహనసంపద వెంట
మనసుకింపుగూర్చు మార్గమగును
పరముగోరు భక్తిపథమాత్మగను పూర్వ
పుణ్య సహిత జన్మ రహిత ముక్తి!
*106.
జనులుగోరు కోర్కె జన్మరహిత ముక్తి
పారలౌకికంబు భక్తిబాట
ఇహమునందు సుఖమునింపొంద గోరగా
పూను ప్రకృతి మాత పూజమేలు!
*107.
పుట్టిన ప్రతి జీవి పుడమి సుఖముగోరు
పోరు బాటనెంచి పోటిబడును
పొందుదాక వేచు పోవునాటి నిధుల
సేవ యెదుటి సుఖముజెంద మేలు!
*108.
ఫలశ్రుతి తేటగీతి.
శుభము ప్రకృతి పురుషులీల సుఖము శాంతి
అక్షరబ్రహ్మ! యవినాశినరయు దోవ!
శుభము గీతమాతార్చన నభయ ప్రదము
శుభము ప్రకృతి మాతను గొల్వ శుభము శుభము!
***