
శ్రీ వావి లాల శ్రీగోపాల బాలకృష్ణ శతకము
(తే.గీ.)
1*
శ్రీ లుజిందు దేవలమందు చిన్మయేశ!
గడపకీవల సాగిల పడుదు సామి!
పూలు ఫలములనిడి భక్తి పులకరింతు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
2*
నీలమేఘ వర్ణుడ! పుల్లనీరజాక్ష!
వేణు గానలోలుడ! వేదవేద్య విష్ణు!
విశ్వరూపుడ! గీతగోవింద శౌరి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
3*
వాసవునిగర్వమణచగా వసుధ జనుల
గాయగాచిటికెన వ్రేళి గట్టునెత్తి
గొడుగు బట్టితివటనీదు గుట్టు దెలుప!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
4*
రాధ రుక్మిణీదేవి నీప్రక్క కొదుగ
నడుమ మురహరీ- నీచేత నాదమురళి!
గానమున సర్వ జనలకు గలుగు మేలు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
5*
శిలను నీరూపు గాంచుచు చిత్త తిరము
నొందియూహించి నీధ్యాస నోమునోచి-
దినము నీక్షణమె గడుపు జీవనము నిమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
6*
గరుడ వాహన సేవ భక్తాళి వెంట
సాగి యూరేగు బాల్యంపు సంయమనము-
మరల పొందజేయుము సామి మనము మురియ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
7*
హనుమవాహనాదుల సేవ-లలరు ఖాది
ఆలయంబులోనలభించు నాత్మ భావ!
సిద్ధి భౌతిక కట్టడి చెందనిమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
8*
కస్తురి తిలకశోభ కౌస్తుభంబు
దరిని లక్ష్మీ నివాసుడ దనుజవైరి!
జీవ జీవాత్మ పరమాత్మ దివ్య మూర్తి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
9*
కలిని మానవరూపివై కలుషముడుప-
కలిగెదవనియు గురుదేవ కథలు దెలుపు!
గీతగురుడవై బోధించు క్రీడి వరద!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
10*
మంచి పున్నెము చెడుపాపమంద్రు బుధులు
చదువు నీపురాణము నీతి పదిలమగును!
భరత సంస్కృతియే విశ్వ భద్రతొసగు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
11*
చిత్తశుద్ధిని సద్భక్తి చిగరువేయ మేలగు
శ్రీహరి! నినుగాంచముదము సిరియు గలుగు!
బాంఢ శుద్ధిలేకను పాక తిండి శుభమ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
12*
భక్తి సద్గురు దయజేసి యుక్తి గాను
మనసు నిలబెట్ట గలుగును మానవాళి!
గురునిచే గురికుదిరేటి గుట్టు దెలుపు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
13*
ధర్మ మేదైన నడుపంగ ధనము వలయు
దానమేదైన చేయగా ధనమె మిన్న
ధనము దానసేవలదారి దయను జూపు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
14*
ధరణి మానవజాతియు ధనవిహీన
మైనవేల ధర్మము సాగు దారదేది!
కలినిదానియవసరము కలుగదాయె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
15*
డబ్బు చేముడ్చి గొట్టేటి డాంబికాలు
లేమినాటసాగుట రద్దు లెక్కదప్పి-
నీదుపాదరజంబుకే నిత్య పరుగు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
16*
కలిమి సాగు కప్పుర హారతులను ఖర్చు
పిదప లేమిని సాగవు ప్రీతిపాట్లు-
అందుకాపద మొక్కుల అవని బతుకు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
17*
సంపదుడుగు గడనలుసాగింప శక్తి
యుక్తులుడుగు, బతుకులాసక్తి వీడు
మది జరాభారమై రుజమార్గ మీడ్చు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
18*
బతుకులాశపెక్కుబమల బాట వైద్య
బిల్లు జూడగ గుండెలు ఝల్లు మనవె!
తన్నుమాలిన ధర్మమా? తగదు దేవ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
19*
దినము పీడించి బాధించు దీర్ఘ రుజలు
మేయు మనిషిని, ఇలుగుల్లజేయు భువిని!
ఎవరికేమి మిగులు నింకనేడు గడగ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
20*
అయ్య గారిగడనలమ్మ గారి పసుపు
కుంకుమగును తాను బతికి నింకముందు
సాగు సంపాదన కరొన సాకు దరిగె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
21*
కోటి పడగలెత్త కోవిదు వదలెనా?
నీదుదయయులేక నిష్ఫలంబు!
దాచుకొన్న నిధులు ధరణిపాలగుటకె!
వావిలాల గోప బాలకృష్ణ!
22*
ఆరునింట బాలలు వృద్ధులరవదింట
గడపదాటక మాస్కున గడపమేలు!
అడుసు దొక్కికాలు కడుగ పడెడు బాధ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
23*
కలిని కవచమయ్యె కట్టడి నియమాలు
భారతీయతిండి భాగ్యమయ్యె!
మరణ రేటు దరిగె మంచిసంస్కారాల!
వావిలాల గోప బాలకృష్ణ!
24*
ఆర్థిక కుదేలు సరె బలుసాకు నమలి
బతుకవచ్చు తినియు బాగబలువ వచ్చు!
చెట్టు చేమల్లె మాకిమ్ము చేతనమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ?
25* (తే.గీ. పంచపాది)
శత్రులార్గురుచేరిరి సత్రమట్లు
మదియు సందడి శాంతియు మందగించె!
పట్టు పంచేంద్రియంబులు వదలవాయె!
చిత్త చాంచల్యమరికట్టు చిన్మయేశ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
26*
మౌనగతినుందు మరినేను మునిని గాదు!
మందమతిగాను, నీభక్తి మత్త చిత్త
చింతనామృత వైశిష్ట్య సిరులబోధ
వైష్ణవాన్వయ సంబధ తృష్ణ నీదె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
27*
భక్తి సహజాతమైవచ్చె బమ్మ జనక!
యుక్తి పరిసర పోటికి రిక్తమాయె!
నిరత నీనామమేమ్రోగె నిండు గుండె!
దెలప నవ్యక్తభయమాయె! దేవదేవ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
28*
బాల్య మెఱుగని యోచనల్ భక్తి బలము
దినము నీధ్యాసగడచె సందియము లేక!
మారుమాట పరధ్యాన మనిషి వనుచు-
మిత్ర గేళిసైచితి చిత్త చిత్రగతుల-
వావిలాల శ్రీ గోపాలబాల కృష్ణ!
29*
పట్టి పైప్రేమ పితరులు పనుల మునుగ
ప్రాథమికమేగె చదువుల పద్దు మారె!
పిదప గురుడేగ నీతత్వ ప్రీతి దేల్చె!
కుదిరె సఖ్య భక్తికి లెంక గుడియు బడియు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
30*
మంచి వాడను పేరట మందబుద్ధి
వీడని యన్నను మదిసుంత విసుగు గొనక
సాగె బాల్యము లౌక్యంబు సన్నగిల్లె-
కూటి విద్దెలో మొద్దైతి,కుంటువడితి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
31*
పాత క్రొత్త తిండియు నేల పస్తులుండ-
పరగ మేలటంచు గురులు ప్రకటితముగ
చెప్పుచుండిరారోగ్యంపు చేతనత్వ-
ప్రాణ శక్తిసామర్థ్యంబు బడయ మేలు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
32*
ఆవు పెరుగు వెన్నలుదిన్న ఆయువృద్ధి
గోవు పంచకములజర్గు గొప్పమేలు!
కామధేనువు సంతతి కాయరమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
33* తే.గీ(సప్తపాది)
పరగ పాలీషు బియ్యంపు పచనచొప్పె!
చెలగు చేబియ్యములు నేడు చేదునెక్కె!
తీపి కన్నకాకరచేదు తీర్చు రుజలు!
గడుక చిరుధాన్య సిరిదిండి కరువుగాగ
మరల పథ్యమావృత మయ్యె మాయ రుజల!
ఎవరు ఎదిరించి పండింత్రు ఎరుక గల్గి!
మూకరాకాసి కలిబుట్టె ముంచె బతుకు
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
34*
మార్పు తిండినరుగ్మత మందు వెంట
శ్రేష్ఠమయ్యెను ఒకపొద్దు ఏక భుక్త
యోగితిండియే మేలన సాగె భిషకు!
పాతరోతని విజ్ఞాని పంతగించె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
35*
పచ్చికూరగాయలు దిన్న పరగమేలు!
దండి యారోగ్య దాయక తిండి – గతపు
పద్దలును రద్దు వినూత్న పథ్యమందు!
అరగకున్నను పచనాలె- అధిక రుచులు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
36*
భూమియొకపాలు మన్నీరు పూరణాలు
మూడు పాల్లుసు ప్రకృతి విమోదమొసగు!
తిండి- నీటిసేవనలిట్లు దండిమేలు!
ఎవరి తిండిని వారికి యెంచి దెలిపి-
బహ్మ శాసించె ననిధర్మ వ్యాధుడనియె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
37*
ఎవరు జెరిపివేసిరి నాటి వేదతీర్పు
క్రొత్త వింత వైదేశ్యపు రిత్త కథలె
కానవచ్చెను, కొత్త వికాసమేది?
పాత బంగారు సంస్కృతి నీతి నిలిపె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
38*
చాలు తీర్థప్రసాదాలు సాపడంగ
పుష్టిగలధినుసుల వంట సుష్టు గాను
భోజనాలువెసన దారిబోయె నేడు!
ఎంగిలియు మంగలములేని దేమి తిండి!
చేరు వైరి వైరసుమూక దారి బతుకు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
39*
వెన్న మెదడు బెంచగ తెల్వి వేయిరేట్లు
బుద్ధిజీవిగా నాత్మప్ర బోధ తత్వ-
మెరుక గల్గిన బతుకున ఎదిగి నీదు
రాజనీతిధర్మము విశ్వరాజితంబు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
40*
సాగునది తప్పు సరిదిద్ధ- మ్రోగు గీత!
వైద్య నారాయణాఖ్యడా వైరసణచి-
జ్ఞాన అనుభవ జ్ఞాన సైన్సనగ దెలుపు-
మాట సత్యంబు పథ్యంబు మరల నిలుపు!
భజన గోవిందమున మూఢ బాట మలుపు!
జనన మరణాలు దాటించు జగతి గురుడ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
41*
శాంతి సంతానమందురు శత్రు షష్ఠ
కంబు మదిజేరి శాంతిని కాటగలుపు!
ఐదు ఇంద్రియముల రుచి నొదిగి మనసు-
వానిపైస్వారి మదిజేయు వరుస సాగు!
మనసు కట్టడి నీవంతు మాధవుండ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
42*
కోర్కెలైయరి షడ్వర్గ గుఱ్ఱములను
ఎక్కి సంసార సంగర చక్కి సాగు-
మదిని గట్టడి చేసిన మాయదొలగు!
మాయతెరజీల్చ సద్భక్తి మార్గ గతులు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
43*
మనసు గట్టట సాధ్యమా మానవాళి-
చెలగు పంచేంద్రియంబుల చేష్ట లాపి
వేయు శ్రద్ధను, భక్తివివేకమొసగు!
నిశ్చలత్వంబు సమకూర్చి నిలుప రమ్ము!
తృప్తి గలుగుజీవన్ముక్తి ప్రాప్తి నిమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
44*
తేజి పాజియై కలికాల తెరగు సాగె!
మట్టి పాలగు దానికై మనిషి రభస!
దేవ దానవ యుద్ధమే దేవదేవ!
తగినయవతార ధరుడవై తరలి రమ్ము!
వాస్తవముదెల్పు గురుగీత వాక్కులిమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
45*
నేనె మేథావి ననుకొంటి నేరమాయె!
స్వచ్ఛమగుతెల్వి గనక నిప్పచ్చరంబె-
తెలిసె తెలిసిన కొలదేమి తెలియదనుచు!
సంద్ర మునకాకి ఈక, యీ చదువు పదవి-
యనియుతెలిసె,సద్గురువరు నడుగు కొలది!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
46*
నమ్మి గీతార్థముల విన్న నరుని ప్రశ్నె!
ఇమ్ములనుబాపె లోకాన ఇపుడు మరల-
బతుకు జన్మప్రశ్నగమారె బడుగు జరను!
మనిషి యేపరాధీనుడై మసలసాగె!
మెదడు ఖాళిజేసితి దెల్పు మేలు గీత!
మరల బోధింతు శిశువుల మార్చుకొందు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
47*
సాగియాగిన బంధాలు సడలవాయె!
అంటు బాయని యాత్మీయ తంటలాయె!
టాకు ఠీకు నీగీత డిటాచిమెంటు-
విధిగ నేర్పింప జూపించు విశ్వరూపు!
భక్త జనుల జీవన్ముక్తి బాట నడుపు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
48*
ఆశపాశాలు సంతృప్తి నంటనీవు!
తెగని రీలుదారపుటుండ తగని తపన!
తృప్తి జెంది చక్కబడగ దెలుపు మరల!
చక్కజేసిశాంతిని గూర్చు సామి శరణు!
వసుధ జన శరణాగత వత్సలుడవు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
49*
శాంతిలేక నాధ్యాత్మికం సాగుటెట్లు?
వేద విజ్ఞానమిక విశ్వ వేదికెట్లు!
నాణ్యమగునీతి నుడువు పౌరాణికాల-
భక్తిగుదరక గీతార్థ బాటబట్టు-
సమత శరణాగతీయోగ సాధనెట్లు!
కల్కివైవచ్చి కావుమా కలిని జనుల!
సరళ శైలిగీతను దెల్పు సద్గురుండ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
50*
అదరించుము హరిహరనాథ బ్రహ్మ!
ముగ్గురమ్మల నీశక్తి మూల పుటము-
అణువు నణువున వెలసిన ఆదిదేవ!
నిత్య నూత్నము విశ్వాన నీదు లీల-
చిత్రమో జగన్నాటక సూత్రధారి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
51*
మంచిసేవను సాగి సామాజికముగ!
నెగిలి జాతీయ పథకాల నెగ్గి వస్తి!
మళ్ళి సున్నకు సన్ననాయె హళ్లి కళ్ళి!
గడచె, గతముగతమెకదా? కాలచక్ర-
ధారి వర్తమాన బతుకు దారి నడుపు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
52*
ఆశవలదన్న పిదపింక కోశమేల?
కోశములునిండ నాపేక్ష కోర్కెలేల?
బరువు బాధ్యతదింపిచు బమ్మజనక!
జర రుజాభార వృద్ధాప్య జాగృతెట్లు!
ప్రశ్న వేదించకుండ నీ ప్రాపు మెట్టు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
53*
సానుకూలపత్నినొసంగి సంస్కరించి-
ప్రేమ సత్సంతు వరమిచ్చి పెంచి విద్య-
కేజి పీజిబోధకు జేసి ఏలినావు!
అందుకేశతకాళి నీకర్పణమ్ము-
భక్తి విశ్రాంత అధ్యాపకోక్తి వినుము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
54*
జగ్గి వాసుదేవులమాట జాగృతింప-
సాగిపోయెద స్వస్థత సాధకునిగ!
చరమ జీవన సంతృప్తి చాల నొసగు!
ధ్యాన లింగాఖ్య హరిహర! దయను బ్రోవు!
గతము-భవితలను మరచి గడపనిమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
55*
కోటి విద్దెలు బుద్ధులు కూటికొఱకు!
కూటి విద్దెలు నేడాయె కోటి కొఱకు!
శాంతినియ్యవు-సుఖపు విభ్రాంతిదములు!
అరయనాధ్యాత్మికమె పూర్ణమైనవిద్య-
వర్ణమాలదిద్దితి వయ్యాకరార్ణవమున!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
56*
విజ్ఞతకు సైన్సు సుజ్ఞానవిధుల సాధ-
నలకు నాధ్యాత్మికతయేగ నాణ్యమైన-
జనుల శాంతి ప్రశాంతిని సాగ జేయు!
మానవత, శాంతి, పుణ్యాత్మ మార్గ ముక్తి!
దానవులకన్న పైమెట్టు మానవులది-
మానవాళిసేవయె నీది మాథవుండ!
ఉభయ సేవ పరస్పరముక్తిదంబు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
57*
ఏది ఎవరికితగినదో నదియువారి
కేర్పడింతువు దుస్తార గేహజలధి!
పరగ దాటజేతువు దయాపార!జనుల- భక్తి యోగసాధకులను మెచ్చి యోగ్యతలర-
సన్నిధినిజేర్చి దీవించు సామి శరణు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
58*
లోలకమె నాత్మ – జేరుగోలోకమందు
జననమరణ కంపన పుణ్య జతన నిధుల-
జేసి నీయాజ్ఞ పాలించి జెందు ముక్తి!
నీదు చేయూత లేకున్న చేదు జన్మ-
కర్మకరిగింప కున్నను కఠిన గతుల-
మరల సంసారవార్ధికి మరలు నంట!
బావి గిలకాత్మ బాధలు బాపరమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
59*
ప్రభు! ముకుంద!మురహరిపాహి నృహరి!
రామ భూవర! కృష్ణ సుధామ మిత్ర!
దాస దాసాన పోష! దశావతార!
తలపు గుర్తించి రక్షించి ధార్మకాళి-
పిలుపు నిచ్చిరప్పింపవే ప్రీతి వెంట-
నవవిధంబుల సద్భక్తి నాణ్యతెసగ-
ధన్య వాదోక్తి రాగిల్ల జన్మముక్తి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
60*
విదురు నాథిత్యమున నేమి విందు జరిగె
ఆరగింపాయెను భక్తుచే అరటి తొక్క!
శబరి రుచిజూచియిచ్చెగా స్వాదు ఫలము!
ద్రుపద పుత్రియక్షయపాత్ర దులిపె మెతుకు-
మునుల మృష్టాన్న భోజనములను నెరపె!
ఉచితమగుదృష్టి మాకిమ్ము ఊర్ధ్వ దృష్టి!
ఆత్మ సమదృష్టిగను పరమాత్మ శరణు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
61* తే.గీ( బహుపాది)
శ్రేష్ఠ మానవాకృతికె విశిష్ట శుద్ధి!
దాని పర్యవసానమే జ్ఞానరక్ష!
వెంట శుచిశుభ్రతలు నేర్పు వేద దీక్ష!
శాస్త్ర విజ్ఞాన సాహితి సైన్సు ఈక్ష-
తల్లి వేరైన వాస్తవం తలవమేలు!
పాత రోతని కొత్తన పంతగించె-
వెసన పుట్టజేరిన బతుకు వెసగ మునిగె!
తప్పు మన్నించి శుచిశుభ్రతలను నేర్పు!
క్లిష్ట కరొనకణజమునార్పి పుష్టిగూర్చు-
ధర్మ సాధనమగు నరు తనువు నిలుపు!
ఆత్మ పుణ్యంబుగొనుదాక ఆదరించు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
62*
టీక రానిరోగాలెన్నొ లేక గాదు-
నరుల లోప దారినివచ్చె నాసి కణము!
పికిలె నూపిరి తిత్తియె! ప్లేగు వలెను-
గతపుచరితయే-కోవిదు కట్టడాయె!
వచ్చు వైరసాసురులను వంచి పంపు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
63*
ఈతి బాధలు మరితోడు నీతిలేని
వ్యక్తి గతబాధ దగ్గించు భక్తియూత!
వెలయు నిశ్చల తత్వంబు వెలుగు గురుని-
బోధల ముక్తి సాగగ జన్మ పూర్ణ ముక్తి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
64*
శాంతియేప్రశాంతికి పీట సత్యగతుల
దాన తపములేకను కల్మి దారియేది?
వ్యక్తి శాంతిచేదేశమ్ము శక్తియుతము!
దేశ శాంతి, విశ్వపుశాంతి తేజరిల్లు!
విస్తరించుము నీప్రేమ విశ్వరూప!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
65*
పూర్వ పౌరాణికముదేనిబూనిదెలిపె!
ఊర్ధ్వ సమదృష్టి సమనీతి నుండుమనగ-
గానుగెద్దులాయవినీతి గమనమాయె!
స్వీయ గొప్పల పరనింద చిత్త వృత్తి-
ఐక్యతను జీల్చె జాతిసమైక్య గతుల-
స్వార్థముప్పొంగె రావయ్య సామి శరణు!
కరుణ కిరణాలు వర్షించి కావవయ్య!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
66*
వదులు కున్నది నీతియే తదువిరుద్ధ,
పనులనలుముకొన్నది ఈసు మదిని-
కుదురు కొన్నదియవినీతి ముదిరి కరొన- మూక లిచ్చె షాకు! నరు నేకాకి జేసె-
కానవచ్చెను కలికాల కలుష మాయ!
చల్తి సాగెను కల్తీల చాటు దాగె
సమ్మతించని జనబుద్ధి సంస్కరించు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
67*
సృష్టి పుష్టిని కల్మశ స్థితులు బెరుగ
లయములోవిర్గు నద్దాన లబ్ధి శుద్ధి-
తనువు మనసుల కలుషాలు తరిగినంత- మదికి పరిశుద్ధి నీదయా మయమె జన్మ!
గాక నేకాల మేగిన గాసి గతులె-
గతపు రాణాలు విని గెల్వ గలుగు వృద్ధి!
కాలము మిగులు సత్కర్మ జాలమునకు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
68*
బట్ట తలకు మోకాలికి కట్టియాడు
మాట మాయల నెగ్గుటే మనిషి ప్రజ్ఞ!
వేదమందు విజ్ఞానము వెలుగు పంచె!
ఉపని షత్తులో జ్ఞానముప్పతిల్లె-
గీతయైలలాటపు- బ్రహ్మ గీత మార్చె!
నాటి పెద్దక్ష రాలెగా నేటి చదువు-
చిన్న అక్షర తాత్త్వికం చెలగ దెలుపు?
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
69*
జానపదులకై పౌరాణి కాన పీఠ!
జ్ఞానపరులకై శిష్టమార్గాన కోట!
జనులకెల్లను సద్భక్తి జన్మ తోట!
పండితులు ఘనాపాఠకల్ దండి వేద-
సాహితీ నీదు గీతార్థ సారమయ్యె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
70*
పిల్లకాయచేష్ట విమర్శ పెద్దకేల?
సానుకూలమే ప్రేమకు సాక్ష్యమనగ-
వెరసి నిపుణత ఫలమేమి? వెకిలి రభస-
చేరి బతుకున ప్రతికూల చేష్టలేల?
వద్దు వద్దన్న నాబుద్ధి వక్రమగును!
నీదు శరణాగతి బొందిన నిత్య సుఖము!
రోదనముదగ్గు దెలియు కరోన గుట్టు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
71*
సూర్య శశినేత్ర! నీగీత సుధలుగురిసె!
వేద వేదాంతమూలంబు వెల్గుజూచె!
మంచి కాలానుగుణమైన మార్పు చేర్పు-
అవసరమ్మని తెలిపితో ఆత్మ బంధు!
నాటి ధర్మాలు జల్లించి పాటిజేసి-
శాస్త్ర సంధాన మొసగు కుశాగ్రబుద్ధి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
72*
ఉపనిశత్సారమును వెన్న ముద్దజేసి
నరుని నోటికందించిన నారణాఖ్య!
దోగ్ధవేనీవు గోవు వేదోక్తి గాగ-
దుగ్ధము గ్రోలె నరుడు గీతోక్తిరుచుల!
జగతి వాసుదేవానీవె! జనులునీవె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
73*
భాగవత కథాసారము సాగరముగ
భక్తిగిరి దరచిన నీదు శక్తి సుధలు-
ప్రాణ శక్తిగ దూరేను పద్మనాభ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
74*
మంచికేరక్ష, చెడుగైన మడియజేయు
దీక్ష నీదశ వేశాల వీక్ష సాగె!
తెలిసి రాదాయె మంచిని దేల్చి బతుక!
చెడియు మిడుకుటకలవడె చిలిపి మనసు!
ఎడమ చేతివాటపు బుద్ధి లేమికర్మ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
75*
వేయి చేతుల దోచుచు వెలుగ వృధయె!
పుణ్య మిడునొక్క చేతను బూను ఈవి!
ఎడమ కుడికిదెల్యని దానమే నయంబు!
యాచకులె సర్వులిల నోము నోచుకొలది!
చేయి జాచక వరమెట్లు జెందవచ్చు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
76*
మొదట బుసగొట్టెనార్భాట ముడిగెనంత
సంతసాగించి దుర్గతి గంతు లేసె- ఫలతమేమి నీపేరట పప్పు అప్పె-
చొప్పయన శూన్య పుష్టిని చెప్పు పదమె!
చొప్ప దంటుప్రశ్నలు బాలచోద్య గతులు!
ఉప్పు లెక్కువతక్కువల్ ముప్పు గూర్చు!
దాని మన్నించి తద్ధర్మ కర్త బ్రోవు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
77*
ఎవరు మిగిలిరింకను ఏడుగడగ-
పోగ నున్నవారలగతి పొగను చూరె!
నీదు పదధూళి దాల్చితే నిండు తృప్తి!
అస్తికలు బూది గంగకాసక్తి గలుపి-
ఆస్తి దిగమింగి మరిచేరు ఆత్ములిపుడె!
తెలివి తెల్లవారె పితరుల దిట్టు బతుకు-
వారు సోమకాసురులైరి మత్స్యరూప!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
78*
లీల మెరిపించు శింగోట లింగరూప!
నరుల సంస్కరించగరమ్ము నారసింహ!
ధన్య సద్గురు నిల్పిన ధ్యానలింగ!
జీవజీవన కారణా! దేవదేవ!
అవని హరిహరనాథ శ్రీ ఆదియోగి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
79*
మనసు తట్టలో చెత్తగా మదుగు పాత
తలపు మాన్పించి వాస్తవ తత్వ మొసగి-
ఈక్షణపుయోచనలు సాగ దీక్ష నిలిపి-
తలకు దగిలించు తళుకుల తారకమ్ము!
ఖాది రామేశ్వరా శివ! ఆంజనేయ!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
80*
ఖాది రాముని దయవల్ల కర్మదెలిసె
కన్నయా! నీదు పదధూళి కర్మ గరిగె
మరలెదను, గురు తంత్రజ్ఞ మార్గగతుల-
దొరుకు నారోగ్య భాగ్యాళి దోవ భక్తి-
యోగ సాధన వీడను నాగశయన!
ధ్యాన నిష్ఠగూర్చుసమాధి దారి నడిపి-
దానిలో కృతార్థుని జేసి దయను జూపు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
81*
ఎక్కడుంటేమి దేవడే ఒక్కడనగ-
ప్రక్క పల్లెదారిని యార్గు రక్కలుండి!
దుష్ట వైరసుగట్టియభీష్టమొసగి-
పిల్లి గుండ్లలో దేవళం ప్రీతిమెఱయ!
జాన పదభక్తి సాగదా గానవిధుల!
నీతిగా సాగితేయలవడు నియమ నిష్ఠ!
నీదు పూజచే శుచిశుభ్ర దారి వెలయు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
82*
మంచి చేయున దేదైన మందుగాద!
బ్రతుకు నిల్పునదేకదా! బ్రహ్మవరము!
భక్తి సరిహద్దులో దుష్ట పనులు రద్దు-
కాదు పోదన్న నారోగ్య పాదు గదులు!
మంచిగొని చెడు విదలించు మార్గమొసగు!
అంచ పాలనాయముగాగ నాదరించు
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
83*
కోరి ఫలియించుననుకొన్న కోర్కెజాల
మంత నిజమైన జీవిత మరయ వశమె!
కొన్ని నెరవేర్చి బతికించు కోర్కె నీది!
వాపు బలుపెరుంగము తండ్రి వాసుదేవ!
చక్క బడుదుమో జత్తుమో చక్రధారి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
84*
ఏది ఎవరికి నప్పునో? వేడుకేదొ?
ఎపుడు నెవ్వరు దీపింప నెదుగు నీతి!
అపుడు దానినే కోర్కెగా నడుగజేసి-
లోక కళ్యాణ కారకా లోచనముగ-
లోక కంఠకులను వంచి లోక నాథ!
సకల జనసుఖ మందించు సత్య కీర్తి!
తీర్చి దిద్ధింతు వీధరన్! తీను మూర్తి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
85*
జరుగ లేదన్న బాధేల జగతి యందు
జరుగనున్నది జరుగును జరుగ కున్న
జరుగ వలసిన దదిగాదు జనులగావ
నీవెగా జనార్థన! హరి! నీరజాక్ష!
నిత్య సంతోషదాయక! నిగమ వేద్య!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
86*
భారయోచన చెత్తయ్యె! బరువునెక్కె
తలను పోటయ్యె తోడురక్తంపు పోటు!
నరుల కీబాధ లెందుకో! అనవసరము!
అవసరార్థము బతుకుటే ఆత్మ తపన!
ముక్తి మార్గము బట్టుటే ముందటడుగు!
నీక్షణమునందు జీవించు దీక్ష మేలు!
87*
ఈక్షణపుజీవనకేళి హితవుగూర్చు!
రూఢిగానుందుమో లేదోమరుక్షణంబు!
ఇంతమాత్రానికే గప్ప గంతులేల?
శాశ్వతముగాని దానికై తంతు వలదు!
నిశ్చలత్వమ్ము నీదు సన్నిధిని దొరుకు-
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
88*
తేజి పాజి తింగరితిక్క తేజమగున?
పుట్టు ప్రతిజీవి సౌఖ్యమే పూని సాగు!
జీవకారుణ్య గుణమిమ్ము చీమ హస్తి-
ఆత్మ లోపర మాత్మవై యలరు దేవ!
అందరికి మంచి బతికిమ్ము అందు నేను-
ఉందునంటిని శతకాళి ఊర్థ్వదృష్టి-
నొప్ప కృతిసేయ మన్నించు తప్పులన్ని!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
89*
ఒక్కకాలివాపున బోదెనొనరు రుజగ!
సౌష్ఠవములేక నందపు చందమేది?
ఏక విషయాన సర్వజ్ఞ తెట్లు గలిగె!
వస్తు విభజన శాస్త్రార్థ వన్నె వాసి-
వస్తు మూలక సృష్టిని వసుధ మరచె!
అందుకాధ్యాత్మికము సైన్సు నతుక పడక-
భువిసమగ్రమై పోవుట బుద్ధి లోప
బాటయే! శాస్త్ర పరిపూర్ణ పాటవంబు-
నొసగి శాంతిజీవనమిమ్ము! సారసాక్ష!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
90*
అణువునణువున నీవననంగ యింక-
జీను జీనున జీనోము జిందులేయ-
సైన్సు నినుగానకుండెనా సహిగ లిఖిత
పత్రమదిగాక పోయెనా పాడు తలపె!
లేదు లేదన్న దేగదా లేకి తనము-
ఉన్న దానిలో విజ్ఞానముప్పతిల్లు!
అన్ని మరిపించి సద్గతి నందుజేయు-
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
91*(సంపూర్ణం)
“వావి లాల శ్రీ వేణుగో పాలకృష్ణ!”
హే పరబ్రహ్మ! రత్నావళీప్రసన్న!
సాధు సత్సంగులడిగిన సంపుటిగను-
నవశతక కృతినిజేయనానతిమ్ము!
కన్న ఊరున వెలసిన కన్నయాఖ్య!
వసుధ వసుదేవ నందన వాసుదేవ!
నంద నందన కంసారి నందబాల!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
92 *
భక్తి శ్రద్ధలు నీదయా భాగ్య వరమె!
నీదు భయమెనా జీవిత నిగ్రహంబు!
గూర్చి భయభక్తి మార్గాన బాగుజేసె!
వెసనకాటును దప్పించె వేదవేద్య!
కదలు జలమైతి నాచును వదలుకొంటి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
93*
మంచియాడితే నిష్టూరమనిరి నృపులు
నిజము బల్కుట వలదనె నిల్చు పెద్ద!
చెప్పినదివింటు తొంగుండు చేష్ట బెదిరి-
ఊసరపువెళ్ళిగాలేక ఊరువదలి-
తగిన ఉద్యోగ సద్యోగ తపన వెంట-
కమన పురమందు నీసేవ గాంచి యుంటి!
మంత్ర పురపు గోదారిని మరవకుంటి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
94*
ఐదు ఏడుల బదిలిలెన్మిదియునూళ్ళు
కేజి పీజీల బోధనజేసి కాలేజి విద్య-
తెలుగు గురుడనై సర్వత్ర తేజమొంది-
మంచి పేరు నమాయక మార్గినైతి!
శతక రచన విరామంపు సమయమేగె!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
95*
పాత బడిపంతులే తాత తరతరాల
పంతులనుమాట దక్కెను త్వరితగతినె
చిన్న పంతులై పెరిగితి కన్న నీదు
దయయె! తిండితిప్పలు సుఖమయమె తండ్రి!
ఎడదశాంతి ప్రశాంతియే ఎదగ నిమ్ము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
96*
వెంకటయ్య సీతమ్మల వేడ్క పెద్ద
కొడుకునైయనుభవ సిద్ధి ముడుచుకుంటి!
రంగ కవి పౌత్ర సత్యనా రాయణనగ-
చంద్రునకు నూలు పోగట్లు శతక కృతుల-
వంశ గౌరవార్థము తగన్ వ్రాయుచుంటి!
దాసు దోషమ్ము దండము తోసరిగను-
దండనము సేయ నాయమా దనుజ వైరి!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
*
97*
మంగళము మాధవా దివ్య మంగళాంగ!
రామనరసింహ! హరి ఖగరాట్తురంగ!
శూర వరగర్వ దుర్మార్గ శృంగ భంగ!
వీర ధర్మాలు నిల్పిన విభుడ! శరణు!
దీనజన పోష! నీవెమా దిక్కుమొక్కు!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!
98*
శుభము సద్గురు వాక్శుద్ధి సూచనలకు!
శుభముగురు శిష్య జనబుద్ధి సూక్ష్మతలకు!
శుభము సుకవివరులకెల్ల !శుభము గలుగ-
శుభము శ్రోతపాఠకులకు నభయ ప్రదము!
వావిలాల శ్రీగోపాల బాలకృష్ణ!