
భక్తిహృదయం శతకము
(తే.గీ.)
1*
శ్రీ రమాదేవి సహిత నృసింహు దలతు
వేల్పులకు వేల్పు, మదినేలు వేములాడ-
రాజరాజేశుని, శుభనీరాజనములు!!!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
2*
తలతు తలిదండ్రి, గురుదేవతలను దలతు-
భక్తి దేశ భక్తియె ప్రజా భక్తి యనగ-
సాగిల బడుదు, భారతమాతముందు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
3*
స్వామి సత్యదేవు వ్రతప్రసాద మహిమ!
సాత్వికత భావ సౌందర్య సాధనముగ
భక్తి పొడసూప-సాహిత్య ప్రతిభగలుగ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
4*
మఱ్ఱివిత్తనమైగల్గు మదినిభక్తి!
వృద్ధిజెందు బ్రతుకు వటవృక్షమట్లు-
దనరు-నదియుగల్గుటయంద్రు దైవ ఘటన!
తిరుణహరి మాట విరిమాట తిరము భక్తి!
5*
మైత్రి విశ్వమానవుల సమైక్యపరచు- భక్తి వసుధైక కౌటుంబ బాటజూపు!
ధర్మ సంస్థాపకుని పేర దైవజన్మ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
6*
బాల్య భక్తి బుణ్యాదిగా, భావపూర్ణ-
దేశ భక్తి సౌధము, మదితేజరిల్లు-
గిట్టు దాకను బుణ్యాది గట్టిపడును!
తిరుణహరిమాట విరిబాట తిరము భక్తి!
7*
బాల్య మైత్రియాబాల గోపాలమునకు-
పాప భీతిని గలిగింప భక్తియగును!
పుణ్య ప్రీతిని తరియింప బూను జన్మ!
తిరుణహరిమాట విరిబాట తిరము భక్తి!
8*
చిన్న నాటిమైత్రియె భక్తి చిహ్నమగును,
మనిషి మనిషిని గలిపేది మైత్రి భక్తి!
ఆత్మ పరమాత్మలను గల్పు యాత్ర బ్రతుకు!
తిరుణహరిమాట విరిబాట తిరము భక్తి!
9*
మంచి మనసున మొలకెత్తు మైత్రి మనుజు-
మంచిమార్గాన చిగురించు మైత్రి భక్తి!
వృక్ష శాఖోపశాఖలై వృద్ధి జెందు!
తిరుణహరిమాట విరిబాట తిరము భక్తి!
***
*(నవవిధ భక్తిమార్గాలు×నాలుగు బేధంబుల ముప్పదారు) ***
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
10*
పూర్వ పౌరాణక కథల పూర్వ చరిత-
సూక్తి ముక్తాళి నీతియు,స్ఫూర్తిగాగ-
సాగు సాయుజ్య బాటలో శ్రవణ భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
11*
భువిపురాణ పురుషగాధ-పుణ్యనుతుల-
నృత్య గాన సాహితి కళాకృతుల వెలయు-
బ్రహ్మమోదంబు, కీర్తన భక్తిసాగు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
12*
మనసు నిశ్చలమగుమంచి మార్గమెంచి,
దైవనామమే మారక దలచి నిష్ఠ-
సాగెడు తదేక ధారణ స్మరణ భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
13*
గురుల శుశ్రూష పరమాత్మ గురియు కుదర-దేహయాత్ర సంచారతేజమొసగ-
చేయు దేవదేవునిపాదసేవ భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
14*
చిత్త శుద్ధిగ తదితర చింతవీడి
పూలు పత్రి పూజాద్రవ్యములుగ జేయు-పూజ, దైవార్చన భక్తి దనరు చుండు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
15*
ధీవివేకసంపద చేత జీవులందు-
దేవదేవుని పరికించి దేవళంబు-
జేరి, మ్రొక్క వందనభక్తి చెలగు హృదిని!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
16*
భీతి బేధములను పాప భీతినెంచి-
పుణ్య ప్రీతి చేత ప్రభుని బూనిగొలువ-దాసదాసాన దాసత్వ దాస్య భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
17*
తనువు దూరమైన మనసు దగ్గరగును
మరవకను, మైత్రి భజియించు మార్గమందు!
సాగు చుండును, పరమాత్మ సఖ్య భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
18*
జీవులన్నిట దీపించు దివ్య శక్తి,
రాక పోక జన్మలను, జీవాత్మనెఱిగి
పరగనాత్మ నివేదన భక్తసాగు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
19*
మైత్రి భక్తిపరులు, నవమార్గములను,
నావ సాగింత్రు, సంసారనామ వార్ధి!
ముక్త తీరంబుజేరగా మురియుచుంద్రు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
20*
చెప్పలేనంత ప్రేమతో చెలగు మైత్రి-
మైత్రి భయావృత రూపంబు భక్తి, భాగ-
వతపు విశ్లేషణ గనగ వరుసజెల్లు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
21*
బాషకందని యవ్యాజ భాగవతుల-
సుకృత లౌకికాలౌకిక, సుఖము దాటి-
జన్మరాహిత్యమును గోరు జనుల భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
22*
ధనము గోరు వారలు:-
——————————
ధనము గోరు వారలు భక్తి దనరు చుంద్రు
ధనముచే దాన గుణముచే ధరణి మసలి-
ధాతలై తరింతురు, కీర్తి ధనము వెంట!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
23*
జ్ఞానమును గోరు వారలు:-
————————————
జ్ఞానమును గోరు వారు విజ్ఞానధనులు!
ఆత్మ గీతార్థము దెలిసి యమిత భక్తి-
తత్వ శోధన సాగింత్రు తనివి దీర!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
24*
జిజ్ఞాస దృష్టిపరులు:-
—————————–
ఆత్మ పయనించుటయు పరమాత్మలోన,
లీనమగుదాక, జన్మంబులీదుటయును’
సృష్టి గమనింత్రు- జిజ్ఞాస దృష్టి-భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
25*
ఆర్థజనులు:-
——————
ఆపదల మ్రొక్కి సంపదనాదమరచి-
ఆర్తులిల శరణార్థులై యలమటించి,
భక్తి తారకంబుగ, ముక్తి బడయుచుంద్రు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
(9విధముల భక్తులు×4=36)*
26*
నాల్గు రకముల నవభక్తి నావసాగు-
ముప్పదార్గురు భక్తులు ముక్తిదోవ-
లౌకికాలౌకిక సుఖములందుచుంద్రు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
27*
ఆర్త జనులు, జిజ్ఞాసతో నరయువారు-
ధనమునర్థించువారు, సుజ్ఞానధనులు-
కోరి వర్తించు వారిలో నొప్పు భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
28*
అహము వీడియు, పదిపుట్ల సహనమొప్ప-
ధీవివేకభక్తి ప్రపత్తి, చిత్త శుద్ధి-
కోర్కెరహిత జీవనము యశోకమగును!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
29*
నిత్య సంతోషి సుఖియించు నిశ్చయముగ,
నీర్షరహిత జీవనమున హర్షమెసగు!
కామక్రోధాదుల జయించి, గాంచు కీర్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
30*
మనసు నాపేక్ష సాపేక్ష మార్గమందు-
బ్రతుకు పరుగు పందెపు పోటి బాట సాగు!
మంచి చెడులెంచకను పుట్టిముంచునాశ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
31*
జీవితము గెల్చి-జగతివిజేతయైన,
చిత్త శాంతియు లేకున్న, ఛిధ్రమగుచు-
బ్రతుకు తృప్తినీయదు బాధలతుకు పడగ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
32*
మనసు మాయ తెరలుగప్పి, మరొకదారి-కోర్కెలుప్పెన-శోకాబ్ధిలోనముంచు!
భక్తి నావ జేరగ – ముక్తిబాట దెలియు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
33*
మనసు నిల్పగ, బ్రతుకున మాయ గెలువ-
మార్గమే భగవద్గీత మార్గమయ్యె!
భక్తి చేయూత నిహలోక భ్రమలు దొలగె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
34*
కఠిన సాధన నిష్కామ కర్మ ఫలము!
మనుజు కర్మఫల త్యాగమనుసరింపు!
భగవదర్పిత జీవన బాట వెలయు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
35*
ధర్మ బీజమై – అర్థంబు, ధరణి వృక్ష-
రాజమైయొప్పు-కామవిరాజమాన-
పుష్ఫ, ఫల, ధర్మ బీజంబు మోక్ష ప్రదము!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
36*
ఆత్మ దెలిసిన నజ్ఞానమంతరించు!
మనసు నిల్పిన పరమాత్మ మార్గమరయు!
భ్రాంతి వీడిన, సుఖశాంతి బాట, ముక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
37*
ధనము, విద్యాధనము, కీర్తి ధనము-
పుణ్యధనము, మంచితనములు సాధనములైన-
నాల్గు పురుషార్థముల నాత్మ వెల్గు భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
38*
తెలియ-నాత్మకు కులమత బేధమేది?
వేష బాషలు దేశముల్ వేరుగాని-
ఆత్మ సంబంధమున జూడనంతనొకటె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
39*
మంచి నెంచియు చెడును వర్జింపమేలు!
మూఢ విజ్ఞతలను మంచి ముందటడుగు!
రుషుల సూక్తిలో మంచి నిరూపణంబు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
40*
నమ్మకము లేని మతమెట్లు సమ్మతంబు!
మైత్రి బుణ్యాదిగా భక్తిమార్గమందు-
తేజరిల్లు జనుల మైత్రి-దేశభక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
41*
చక్రధారి భక్తియె యయస్కాంతమగును-
లోక భక్తసంఘముబోలు లోహముక్క!
కల్గు నాకర్శణము ముక్తి గలుగుదాక!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
42*
మనసు ప్రకటించు ప్రేమయె మైత్రి రూపు!
మైత్రి తరియించు నిష్ఠయే మహిత-భక్తి!
నరుని భయభక్తి శ్రద్ధలే నయమొసంగు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
43*
పాప సంచితార్థము రూపు మాపు భక్తి!
పూత ముక్తికి బుణ్యాది పుణ్య ధనము!
పుణ్య ధనమును సమకూర్చు పుడమి భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
44*
మంచికిహలోక జల్లెడ-మైత్రిరూపు!
భక్తి పరలోక జల్లెడ పరిధి దాటి-
మంచియే వెంటజను ముక్తిమార్గమందు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
45*
మనసు నిష్కామకర్మలో మాటనిలుప-
ధీ వివేక త్రికరణ శుద్ధిగను భక్తి-
కర్మ ఫలతేగమునగను కడకుముక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
46*
తుచ్ఛ భోగంబులోమున్గిదేలు మదికి-
సూక్ష్మమెటుదోచు ఏది సుఖమనంగ?
ఇచ్ఛ రోగవైరసు యేడ్చు హెచ్చు బాధ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
47*
జన్మకటు- నిటు సాధన పుణ్య ఫలము!
లేదు లేదన్న భక్తియులేమిగాక-
ఉన్న దేమి-పునర్జన్మయున్నవేళ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
48*
ఉండి లేములవాదాలు-నుజ్జగించి-
ధర్మ సంస్థాపకునియాజ్ఞ తలనుదాల్చి-
జీవకారుణ్యమును బూనితేనె ముక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
49*
పుణ్య ఫలబీజ సిరివెంట పుణ్యజన్మ!
తనువునాత్మ వికాసమై తరలు భక్తి!
యోగమున జీవి-తపియించు మోక్షమునకు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
50*
ఆత్మ పరిపక్వతయె-పుణ్యమార్గ నిధిగ-
యుండిలేమియు పుణ్యంపు, హుండి జన్మ!
జనన మరణాలు దప్పిన- జన్మ ముక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
51*
జన్మరాహిత్యమునకె ఈ జపతపాలు!
మరణరాహిత్యముండదు – మైత్రి భక్తి-
మంచి – చెడు, జగన్నాటకమందు నికష!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
52*
ధర్మ మానసమున మంచి, దనరు చుండు- ధర్మ వాక్కున మంచియే ధరణిమ్రోగు!
ధర్మ కర్మసూత్రము మంచిదారి కృషియె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
53*
మనసు మడత దాగును చెడు మాయ తెరలు!
మనసునావరించియు, జగన్మాయ తెరలు!
మాయ తెరజీల్చు చురకత్తి, మదిని భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
54*
అంతులేని యాపేక్షచే యంతరంగ-
తృప్తిలేని వారలు-రాచరికము వీడి-
తరలిపోయిరి, పొందిరి తగిన ప్రాప్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
55*
భక్తి నిష్కామ కర్మచే పదిల మగును!
భక్తి పూర్ణసంతృప్తియే ముక్తిదారి-
సఖ్య భక్తియు పరమాత్మ సరసజేర్చు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
56*
వివిధ మతముల నుపకార విహితబోధ-
భక్తి యోగ చింతన పరిపక్వమైన-
ఆత్మ పరమాత్మ గనుజన్మ సార్థకంబు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
57*
రాక పోక జన్మలదారి రాటుదేలి-
జన్మ రాహిత్యమగు పుణ్య జమను-చివరి-
మజిలి మానవ జన్మలో మసలు నాత్మ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
58*
ద్వైతమద్వైత దారుల వైనమెఱుగ-
ఆత్మ పరమాత్మ రూపనిర్ధారణంబు!
పిదప వైశిష్ఠ్యమున నేకరీతి బోధ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
59*
ఆత్మ దర్శింప గీతార్థమరయమేలు!
ఆత్మ మథియింప పరమాత్మయందె దేలు!
వెన్నుడే వెన్నగాదోచ వేడ్కగలుగు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
60*
అన్యము-ననన్యభావన – గణ్యమతుల,
వెలయు దారుల గమ్యంబు వెంట భక్తి-
పుణ్య ధనము వెచ్చించుటే పుడమి ముక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
61*
ఇంద్రియంబులు గెల్చియు, విధిగ మదిని-
భక్తి మట్టుకు త్రికరణ-బంధియగుచు-
శుద్ధి, నాత్మను పరమాత్మ జూచు నికష!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
62*
శోక హేతుర్భూతము, కోర్కె లోకమందు-
కలుగు కోర్కెతురంగాల కళ్ళెమేసి-
జడియకున్నను, శోకంబు జగతి మించు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
63*
మనసు నిశ్చలమైనచో మాయదొలగు-
తేట నిలువనీటను వస్తు తెరువు గాంచు-
విధమునాత్మ దోచగ బుద్ధి విస్తరించు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
64*
రక్తి దారియు, తుదకు విరక్తి గూర్చు!
భక్తి వైరాగ్యముదయింప బ్రహ్మవిద్య-
అర్థ పరమార్థముల దోచు నాత్మ నిలుచు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
65*
అవని-నవవిధ భక్తులునాత్మ దెలసి-
నిహముయోచింప మానియు నిత్యమైన-పరము నాశింప సాగింత్రు భక్తి బ్రతుకు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
66*
పుణ్యమును గూర్చు సూత్రంబు భువిపరోప-
కారమే, సర్వమతధర్మ కర్మ సాగు-
పరగ తలిదండ్రి గురుదైవ – భక్తి వెలయు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
67*
తప్పటడుగు దిద్ధును తల్లి దండ్రి భక్తి-
గురుని భక్తిచే దైవంబు గుట్టు దెలియు!
దేశ భక్తి ప్రజాభక్తి-దేల్చి చూపు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
68*
పుణ్య ప్రీతి, పాప భయము బూని, దోష-
బుద్ధి వీడిన మేలగు భోగి-యోగి,
దోష భీతిమానియు ధర్మ దోవ జనునె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
69*
విశ్వ సింపక సాగదు విశ్వ చరిత!
ధీవివేకముచే భక్తి దీప్తిగాంచు!
మొలక మూఢడు, విజ్ఞుండు మొక్కబోలు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
70*
సగుణ,నిర్గుణోపాసన, సద్భోధ-గీటురాయి!
మంచి చెడు పరీక్షించగా మంచినికష!
సత్య మార్గమన్వేషింప నిత్యముదము!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
71*
గీత సాగిన సద్బోధ గీటురాయి!
మంచి చెడు పరీక్షించగా మంచి నికష!
సత్య మార్గమన్వేషింప నిత్యముదము!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
72*
పుడమి విద్యుక్త ధర్మంబు బూని జేయు
వారు, భక్తిమార్గమువెంట వరలుచుంద్రు!
దీన మానవోద్ధరణయే, దివ్య వరము!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
73*
బ్రతుకు పోరాటమున భక్తి బాట బలము!
భ్రాంతియారాటమున భక్తి బాట శాంతి! మానవాళి భక్తి మమేకమైన మేలు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
74*
మంచి సామాజికులగూడి మనుట మేలు!
సుజనమైత్రి జీవించగా సుకృతమెసగు!
సుకృతమార్గములిహపర సుఖములిచ్చు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
75*
రాగ విద్వేషముల తాల్మి సాగమేలు!
దలపవలెనొక్కవిధముగా ద్వంద్వములను!
ధర్మ పరిధిలో సద్భక్తి దారివెలయు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
76*
కపట భక్తిచే నిజభక్తి కాటువడును’
కలుగునాటంకముల కలత నొందు!
ధర్మరాహిత్య మైభక్తి దారిమూయు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
77*
జగతి నాటకమున, భక్తి జన్మవరము!
ధర్మ సూక్ష్మంపు దారిలో దనరు భక్తి!
తరచగా జీవి జీవాత్మ తత్వమెఱుగు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
78*
భక్తి భావన మూలంబు బ్రహ్మ మహిమ!
మైత్ర భావన మూలంబు మనుజ ప్రకృతి! మానవత నిల్పి రక్షించు మాధవుండు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
79*
మనసు కోర్కెనియంత్రణ మార్గమందు-వివిధయోగంబులును సాగె-విశ్వశాంతి-
మార్గమయ్యె-నిష్కామ్యకర్మంపు ఫలము!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
80*
మనసు-మోటగిలకయయ్యె-మాటవినదు!
మానవుడుయంత్రమై పోవ మరొకకీడు!
నాల్గు పాదాల ధర్మంబు నడుప మేలు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
81*
శైవమాత్మనివేదన సరణిసాగె!
దాస్య భక్తియు వైష్ణవదారివెంట-
సఖ్య భక్తియు కొనసాగె సామికృపను!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
82*
వేగ మార్పు తీర్పు బ్రతుకు వేగమందు!
దాస దాసాన దాసత్వ దారి ఘనత!
మోక్ష దృష్టి నేటికది నామోషియయ్యె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
83*
తిమ్మి బమ్మి జేయగ భక్తి తీరుతెన్ను!
బమ్మి తిమ్మిగా జూచుట సొమ్ము ఘనత!
పాప బీతిచే రూపొందు భక్తి మదిని!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
84*
సఖ్యమున మానవాళి సమైక్యమైన-
భక్తి చేతనాత్మీయతా భావగరిమ!
సఖ్య భక్తిని పరబ్రహ్మ చాల మెచ్చె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
85*
బాహిరాంతర సంశుద్ధి బ్రహ్మవిద్య-
శ్రవణ భక్తి గీతోక్తుల సారమంత-
నిండు గుండె మ్రోగుటయు త్రిదండి కృషియె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
86*
భక్తి సంఘంబు మైత్రి విరక్తి గూర్చు!
బలిమి-కలిమి జీవనబాట ప్రాభవంబు-
శాశ్వతముగాదు! సత్కీర్తీ శాశ్వతంబు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
87*
రాగి-సిద్ధార్థుడు గని వైరాగ్యమందె!
జనన మరణ హేతువు లెంచె-జగతి బ్రతుకు-
శోకము-నశోకముగ బౌద్ధ శోధ సాగె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
88*
బౌద్ధ మతభక్తి దీనుల బ్రతుకుకొఱకె!
జైన ధర్మంబు నిర్హింస – జైత్ర యాత్ర!
నాల్గు పాదాల ధర్మంబు నడుపు తపన!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
89*
పాప భీతిని గల్గించు భక్తి బాట!
పుణ్య ప్రీతిని పులకించు పుడమి తోట!
ధర్మ బీజమ్ము వృక్షమై దనరు ఫలము!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
90*
కోర్కె వలదన్న విననట్టి కొంటె మనసు! కోర్కె గుఱ్ఱాలపై స్వారి గోరుచుండు!
శోక హేతువు కోరిక లోకమందు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
91*
బ్రహ్మ సృష్టిలో సమదృష్టి బ్రతుకు పుష్టి-
బ్రహ్మ విద్యలో సమభావ భక్తి తుష్టి!
ఆత్మ పరమాత్మ జేర్చు నాధ్యాత్మికోక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
92*
ధరణి మానవ సేవ, మాధవుని సేవ!
మానవోద్ధరణార్థమే మాధవుండు-
పుడమి నవతారమూర్తియై పుట్టుచుండు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
93*
ఊర్థ్వలోకాల పయనించు నుత్తముండు!
అధమలోకాల దిగజారునధమ నరుడు!
లోకు లేడేడు పదునాల్గు లోకచరులు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
94*
ఏడు లోయల జన్మించి ఏడ్చి – నవ్వి,
ఏడుకొండలెక్కియు సామి యేడుగడగ!
నెంచి-దర్శించియు పరవశించునాత్మ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
95*
జగతి నాటకమున శోక జలధినీది-
మోదమునదేలి-తుద ధర్మ మోక్షమెఱిగి-
సూత్రధారి నన్వేషించు పాత్రధారి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
96*
మాతృ భక్తిగలుగ దేశ మాతభక్తి-
గోవు భక్తి గలుగ ధర్మ గోవు భక్తి-
పుట్టుకను బుట్టు-గిట్టగ గిట్టు భక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
97*
విశ్వసించక యుక్తమౌ విధము గనక-
విశ్వ కౌటుంబి కత్వంబు విరియునెట్లు?
ఆత్మ వెల్గులోనేకత్వమావరించు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
98*
నిశ్చలమగు చిత్తమే యాత్మ నిలయమగును!
నిశ్చలాత్మయే పరమాత్మ నిలయమగును!
నిశ్చలానంద బ్రహ్మమే నిజము ముక్తి!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
99*
కోర్కెలుప్పెన వేయగా శోక వరద!
కోట పేటల ముంచెత్తి మేటవేయ-
బ్రతుకు సంద్రంబు దరియింప భక్తినావ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
100*
మాయ బిర్సును, తలబిర్సు, మాట బిర్సు-
గడసరి వర్తన భక్తిమార్గమును బట్ట-
మనసు బిర్సుడుగు-గలుగు మార్ధవంబు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
101*(సంపూర్ణం)
మాయ వీడగ, సున్నితమగును మనసు!
మాయికుడు మాయ వీడి యమాయకునిగ-
శరణుజొచ్చియు, యిలవేల్పు చరణమంటు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
102*
నాశనముజేయు,మతదారి నరులకేది?
యుండెనా! నాస్తికము మేలు-ఉర్వియందు-
ఆస్తికము జీవసుఖశాంతి నరులకొఱకె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
103*
ఇనుపముక్కకయస్కాంత మిమిడినట్లు-
ఆత్మకిడు భక్తి పరమాత్మ యడిగినంత!
భీష్ముడును వివేకానందుడిట్లె పొందె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
104*
ధ్యానమౌషధిగా కోపంబు దరుగ, లోక-
శోకహేతు కోరికలు దాసోహమనగ!
వైరబుద్ధి మాన్పగ భక్తి వైద్య గరిమ!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
105*
భక్తి-రక్తి దోబూచులు పాప పుణ్య-
కుండ టెక్కాటలే, పోటినుండు మనుజు!
రక్తియలసిన సుస్థిర భక్తి వెలయు!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
106*
మంచి చెడులెంచి పరమాత్మ మార్గమనెడు-
మంచి మతదారులేర్పడ-మనసు నిలిపి-
భక్తి సాధనజేయుట వ్యక్తిగతమె!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
107*ఫలశ్రుతి:-
బ్రతుకు నవవిధ భక్తుల బాటలరసి-
కాలమొక్కతీరుగడపి కలియుగాన-
సత్య మార్గ గాములు గాగ నిత్యముదము!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!
108*
శుభము-విశ్వభక్తులకెల్ల సుఖము శాంతి!
శుభము-మానవతా స్ఫూర్తి సూచికలకు!
శుభము గలుగు-భక్తి శతక శ్రోతలకును!
తిరుణహరి మాట విరిబాట తిరము భక్తి!