top of page
శ్రీ భద్రాద్రి శ్రీరామ శతకము
(తే.గీ.)

1*

శ్రీశ!జానకీనాయక! చిద్విలాస!

సత్యవాక్పరిపాలక! సాధు వినుత!

నిన్ను దర్శించి మ్రొక్కిన నిత్యముదము!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

2*

సంపదమరుపులేదు కౌసల్య తనయ!

ఆపదమ్రొక్కులిడవస్తి యాదుకొనుము!

బ్రతుకు నీభక్తిపూర్ణమౌ బాటనడుపు!

స్వామి నరసింహ యాదాద్రి సదన శరణు!

3*

నీదుబ్రహ్మోత్సవముగాంచునిచ్ఛగలిగి-

తీర్థయాత్ర జేయుటమది తీపియాది!

స్వస్థతనుగూర్చగా ప్రాణశక్తి నొసగు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

4*

భద్రగిరిరామదాసుని భక్తిమెచ్చి –

పూని గుడిగట్టియర్చింప, పుణ్యమిచ్చి,

నికషనెగ్గించి మోక్షమునిచ్చినావు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

5*

రాజదశరథపుత్ర శ్రీరాఘవేంద్ర!

సురమునివరార్చితచరణ! సుగుణసాంద్ర!

దుష్టదానవ సంహార! దురితదూర!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

6*

మాయజగతిసంసారమయోమయంబు,

నీదుదయలేక సాగదు నిమిషమైన,

బ్రతుకు సాగింప – నీభక్తి భాగ్యమొసగు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

7*

పుడమి ముగ్గురు తమ్ములు పూనికొలువ,

స్ఫూర్తి నాదర్శసోదర కీర్తిగొన్న,

ధర్మమార్గసంచారి! వేదాంతవేద్య!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

8*

చిత్త శుద్ధిచే నీభక్తి చిగురుదొడుగు –

భక్తిబాటలోదీరును బ్రతుకు భయము!

పుణ్యవిత్తము వైకుంఠ పురము జేర్చు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

9*

నామభజనలోలీనమై రామదాసు,

రాగమాధురి కీర్తింప రక్షనొసగి,

పేరు కీర్తిని గూర్చిన ప్రేమ మూర్తి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

10*

భక్త జనులనాకర్శించు పర్ణశాల,

స్వాగతము బల్కు పరిసర స్థలములన్ని,

దారి తరువులుప్పొంగుగోదారి గంగ!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

11*

నిన్ను భక్తి తోధ్యానింప నిశ్చలముగ,

చిత్తముననాత్మదీపించు,చిన్మయేశ!

ఆత్మదివ్వె నీరూపంబు నలరు చుండు,

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

12*

ధరణి నీనామమే జన్మతారకమ్ము!

పుడమి నీభక్తిజనులకు స్ఫూర్తి నొసగు.

నీదు చేతనత్వము చేత నిలుచు మనసు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

13*

దాసు నిర్దోషియనిదేలు దాక వేచి,

ధనముచెల్లించి, విడిపించి దయనుబ్రోచి,

ముదము గూర్చితివోదేవ! ముక్తినొసగి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

14*

నిజము నిగ్గుదేలగను తానీషబొగడె!

పూర్వజన్మపు ఖైదు పుడమి దొలిగె!

గెలిచె కంచర్ల గోపన్న వెలిగె గుడియు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

15*

గ్రామగ్రామాన నీగుడి గానవచ్చు!

పవనపుత్రుని సాక్షిగా భజన సాగు!

పుడమి నీకీర్తిగానాల పులకరించు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

16*

రామ భక్త కబీరు నీనామ భజన –

చాల కీర్తించె, దోహలో చవులుమీర!

రాజుపేద గ్రోలిరి రమ్యరామ రసము!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

17*

త్యాగరాజు కీర్తన తీపిరాగ ఝరులు,

ద్రవిడ బాషాకుటుంబపు ద్రవ్యనిధులు!

తెలుగు గీతసంగీతాలు వెలుగు నిధులు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

18*

శాంతికోసమై విజ్ఞాన శాస్త్ర గతులు!

భక్తి యాధ్యాత్మికము చేత బలపడంగ,

లోటు దీరగా నిశ్చింత లోకశాంతి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

19*

ఎచట నీనామ భజనయో యచట హనుమ!

ఎచట హనుమయో నీనామ మచటమ్రోగు!

భయము భక్తి శ్రద్ధలు గల్గు బ్రతుకు వెలుగు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

20*

మనిషి తలిదండ్రి భక్తితో మనుట మేలు!

పౌరునిగదేశభక్తుడై బ్రతుకమేలు!

ధర ముముక్షువు దారియే దైవభక్తి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

21*

రామ! కృష్ణ! కృష్ణా హరే! నామజపము ,

వసుధ కలికాలదోష నివారణమ్ము!

విశ్వ భక్తి సంకీర్తనా విషయమిపుడు,

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [21]

 

కోరి పొడగాంచ దూరపు కొండ నునుపు

దగ్గరకుజేర గరుకులే దాని నిండ!

దూరముగనుండ దగ్గరౌ – దుడుకుమనసు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [22]

 

ధర్మ సంస్థాపనార్థమై ధరణి వెలసి,

నీతి దెలిపి గిరిగీసి, గీతమార్చు!

మానవాదర్శ సంసార మార్గదర్శి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [23]

 

తేటభక్తి దర్పణముగా తేటగీతి,

స్వామియర్పింతు-శతగీతి చక్క దిద్ధు,

చిన్నపొరబాట్లు సహించి చిత్తగించు,

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [24]

 

వందవల్లింపులొకమారు వ్రాయమేలు!

వందవ్రాతల శతక కావ్యంబుమేలు!

వేయిసేవల – నీసేవ, జేయమేలు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [25]

 

దానమేమిన్న కలిలోన తపముకన్న,

ధ్యానమేమిన్న నితరవిధానములను,

గానమేమిన్న నీముక్తి గలుమ దాక!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [26]

 

శాంతి రహితజీవనమెట్లు సార్థకంబు ~

దురితకర్మలో బడద్రోయు దురలవాట్లు,

ధనముకన్న నారోగ్యమే దండికలిమి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [27]

 

జన సదాచారమున గల్గు జగతి కీర్తి,

సద్గురుని బోధలను సదాచారమలరు,

సద్గతికి దారిని జూపు సద్గురుండు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [28]

 

భక్తి రహితాత్మునకు సుఖప్రాప్తి లేదు!

నమ్మకముతోనె గల్గును నయజయంబు!

పట్టువీడక ధ్యానింప పరమపథము!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [29]

 

అవసరము గల్గి నప్పుడే యడుగువారు!

నడిగి నప్పుడే వినుశ్రద్ధ యవనియందు!

పిలిచిబోధింప వినువారు ప్రీతి గొనరు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు! [30]

31గీ*

కర్మనిష్కామమైసాగ, కడుముదంబు,

కర్మ ఫలము నీకర్పింప కలుగు శుభము!

నీదు శరణాగతియేమేలు నిశ్చయముగ,

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

32*

వేళ కాకలి – తిండియే మేలుగూర్చు,

నిద్ర భోగములకుతగిన నియమముండు,

ధ్యాన క్రియలు ప్రత్యేకముల్, మానవులకు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

33*

ఊహలే కార్యమైవస్తులుర్వి వెలయు,

మంచి భావనచే సదా మంచి జరుగు!

జతనములేకదొరుకదు సత్ఫలంబు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

34*

ప్రేమపంచితే పొందేవి ప్రేమనిధులె!

ద్వేషమెంచితే ద్వేషమే దేనికదియె!

కోరి విత్తు ధాన్యమే కదా? కోయుపంట!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

35*

జీవి జీవిలో నేకాత్మ భావ పటిమ!

గాంచవలెనన్న సమదృష్టి గలుగవలయు,

వెలయునాత్మలో నీరూపు వెలుగు చుండు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

36*

భక్తి రాజు పేదలనొక్క బాట నడుపు!

రక్తివిషయాలు వేర్వేరు రాహసాగు!

భక్తి యిహపరసుఖలబ్ధి-ముక్తిదంబు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

37*

చెడ్డ వారల స్నేహంబు చేటు గూర్చు!

మంచివారి మైత్రియుమేలు మానవాళి,

ధరపరస్పర ప్రేమలే దరిని జేర్చు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

38*

శక్తులకు మూలమై ప్రేమశక్తి నిండు!

ప్రాణశక్తి బారును సహస్రారమునకు!

విశ్వ సృష్టి యు ప్రేమచే విస్తరించు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

39*

దేహము మారు ,చక్రాలతో తేజరిల్లు,

ప్రాణశక్తి కేంద్రాలుగా పరిఢవిల్లు!

కుండలిని జాగృతముజేయు గురుని కృపయె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

40*

మనసు నిశ్చలమై యాత్మ మార్గమెరుగు,

ఆత్మ నిశ్చలమై పరమాత్మ దెలియు,

దానిసాధింప నీనామ ధ్యానజపము!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

41*

కూటికోసమే బ్రతుకంత కుదువ బడగ

పేదరికమందు సుజ్ఞాన ప్రేరణేది,

ధర్మముగ నర్థమార్జింప దగిన విధియె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

42*

అల్ప పుష్టితుష్టియెగూర్చు నాధునికత!

నాటి దంపుడు పంటలు నాటు సరుకు,

పిల్లి పాలుదాగినతీరు – పిప్పి తిండి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

43*

నాటి సేంద్రియ పంటలో నష్ట మనుచు –

సేద్యమందు రసాయన చోద్యమెసగె!

ముందుబ్రతుకులు మూన్నాళ్ళ ముచ్చటాయె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

44*

మూలికావైద్య నిపుణత మూలబడియె!

కల్తి ప్రాణాంతకౌషద చల్తి సాగె!

బ్రతుకున నడమంత్రపుజరా భారమాయె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

45*

ఇతరదేశ భౌతిక సైన్సు దిగుమతిగను,

ప్రతిగ నాధ్యాత్మికము బంచె భరత మాత!

విశ్వ శాంతికావశ్యక విధులు నెఱపె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

46*

విశ్వశాంతి సమైక్యతా విషయచర్ఛ –

ముఖ్య భూమిక, భారతీ ముందడుగు!

లోక కళ్యాణ కారకాలోచనంబు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

47*

ఆత్మ భావ విచారమాధ్యాత్మికంబు!

భోగి యోగియై తరియించు బోధ గీత!

వెలసె నేకాత్మ భావనా వేదికగను!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

48*

మాట సత్యపూర్వకమైన మన్నికగును,

మందు పథ్యపూర్వక గుణమగును – ధరణి,

భక్తి సుఖశాంతి యానంద సూక్తి ముక్తి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

49*

కలుగు మతమార్గములె వేరు – గమ్యమొకటె!

విశ్వ జీవాత్మ సమదృష్టి – విషయసమత,

భాగవతకథా నీతి స్వభావ గరిమ!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

50*

నీతి ధర్మమే ప్రతిచోట నిగ్గు దేలె!

విశ్వప్రేమ నిస్వార్థమే విశ్వరూపు!

పరుశ వాక్కు వీడియు ప్రేమ బలుక మేలు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

51*

బ్రతుకు భౌతిక దృష్టిచే పరుగులెత్త

మనిషి యంత్రమై యంత్రమే మనిషిగాగ

విత్త భ్రాంతిచే కరువయ్యె విశ్వశాంతి!

పాహి భద్రాద్రి శ్రీ రామ భద్ర శరణు!

52*

భారతీయకుటుంబాల బ్రతుకు బాట

నీకథా ప్రభావితమయ్యె నేటిదాక!

చెక్కు చెదరని నీనీతి చెన్నుమీరె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

53*

ఐకమత్యంబు జీల్చునా కైకవరము?

చూడ రాక్షస సంహార సూత్రమయ్యె!

విశ్వమంతట సజ్జన విలువ మెఱసె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

54*

గురువశిష్ఠ విశ్వామిత్ర గురులు బూని

దివ్య శస్త్రాస్త్ర విద్యల దిద్ది తీర్చి-

ధర్మ సంస్థాపనకు మిమ్ము దరలు మనిరి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

55*

అవని నారవవిష్ణుగా నవతరించి

పరశురామతేజస్సును పరగబూని

విల్లు చేపట్టితివి ధర్మ విస్తరణకు

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

గీ*56

మునుల యజ్ఞరక్షణజేసి-ముదమొసంగి

విల్లువిరిచి, మెచ్చిన సీత పెళ్ళియాడి,

వచ్చితివి తమ్ములనుగూడి-వసుధమెచ్చ

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

57*

నీదు పట్టాభిషేకంబు నిర్ణయించి,

కైక కోరికతో తండ్రి కలతవడియె!

నిమిషమైనను నినువీడి నిలువననియె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

58*

పదియు నాల్గేళ్ళ వనవాస బాటసాగి

వెంట సీతయు సౌమిత్రి వెడలిరాగ

తండ్రిమాట పాటించిన ధర్మమూర్తి!

పాహి భద్రాద్రి శ్రీ రామ భద్ర శరణు!

59*

భక్తి నీపాదుకలు గద్దెపైననుంచి,

భరతుడయ్యోధ్య వీడినీబాట వేచె,

గడువు తీరుదాక బ్రతుకు గడుప నెంచె!

పాహి భద్రాద్రి శ్రీ రామ భద్ర శరణు!

60*

తమ్ముడును, సీత నీవెంట దరలిరాగ,

పూనిపాదాలుగడిగి యాపుణ్య గుహుడు

పరగ గోదారి దాటించి భక్తి మ్రొక్కె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

61*

మిగుల భక్తి నీసేవ సౌమిత్రి జేయ,

కష్టమేయిష్టమై పెద్ధకాలమేగె,

దేవి సీతయు నీవెంట దిరిగె యడవి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

62*

రావణుడు సీత చెరబట్టె, కావరమున,

వెదకుచును శీఘ్రగతిమీరు ఋష్య-

మూకమునుజేర – వానరమూక వెరచె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

63*

వాలి దూతలుగానెంచి, వానరాళి,

పంపగా మారుతియువచ్చి, పలుకరించె!

వాస్తవమునెఱిగియు ప్రభువనుచుమ్రొక్కె

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు!

64*

మారుతి వలన సుగ్రీవు మైత్రి గలిగె

చర్ఛజేయ సుగ్రీవుని చరిత దెలిసె!

చెలగు వరగర్వమే వాలి చేష్ట హేతు!

పాహి భద్రాద్రి శ్రీరామభద్ర శరణు!

65*

గీత దాటరు కపులు సుగ్రీవునాజ్ఞ!

పవనపుత్రుడు నమ్మిన బంటుగాగ

మైత్రి కార్యయోచన సాగె మాతవెదక!

పాహి భద్రాద్రి శ్రీరామభద్ర శరణు!

66*

ఏకముగ నేడు తాళ్ళను యేసిగూల్చి

గోట దుందుభి దేహమున్ మీటియంత!

నికషగెలువగ పొగడిరి నీదుమహిమ!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [66]

గీ*

ఓడివచ్చు సుగ్రీవు మరొక్క మారు-

దండ గుర్తుగా వేసియు దాడిజేయ-

బంపి వాలి వధించితో బాణమేసి!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [67]

గీ*

సీతజాడకై వానరుల్ శీఘ్రగతుల

వసుధ శోధించి వచ్చిరి వారిలోన

నాంజనేయుబృందము దక్షిణాది వెదకె!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [68]

గీ*

లంకిణి దునిమి సూక్ష్మ మైలంకదిరిగి

దుష్ట రాకాసి సౌధాలు దూరివెదకె-

సాగె మదినీదు భక్తి నిస్వార్థమొప్ప!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [69]

గీ*

శోక మూర్తియై సీత యశోకవనిని

యుండ గుర్తించె, మారుతి గుండెలవిసె,

ప్రభుని ముద్రికనిచ్చి తాబలుకరించె!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [70]

మిమ్ము వర్ణించి, సందేశమిచ్చి మ్రొక్కి

అంగుళీయకం బిచ్చియు ఆంజనేయు-

డంత నిజరూపుజూపించి వంతదీర్చె!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [71]

గీ*

భక్తితో శిరోమణిగొని భద్రపరచి

కాకికథదెల్పి యాకలిసాకు, లంక-

గాల్చి వచ్చెమారుతి వేగ గగన దారి!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [72]

గీ*

మాత పరమపతివ్రత!మాయలంక,

శోకదేవతయైవేచె – రాకగోరె,

క్షణము నొక్కయుగంబుగా గడుపుచుండె

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [73]

గీ*

ఆనవాలుగ మణినిచ్చి, అమ్మమాట!

మోకరిల్లియు కరములుమోడ్చి దెలిపె,

సామి దు:ఖముగని యోర్వజాలడయ్యె!

పాహి భద్రాద్రి శ్రీరామభద్ర శరణు! [74]

గీ*

హనుమనెదజేర్చి భరతసమానయనుచు

మెచ్చి సంద్రంబుదరిజేర వచ్చి కరుణ-

గాంచి కపిసైన్యవార్ధితో కదలినావు!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు! [75]

76*

ఆగ్రహించి కడలి నియనుగ్రహించి,

సేతువును గట్ట సమకట్ట జేరి కపులు

నీట బరచురాళ్ళునుదేలె, నీదుమహిమ!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

77*

శరణు వేడగ వచ్చిన – కరుణ జూపి,

యభయమిచ్చి విభీషణునాదరించి,

రాజు జేసితివాయుద్ధ రంగమందె!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు!

78*

వివిధ జీవజాతులు సైన్యవిధులునెరప

అంగదుని దూతగా బంపి సంగతెరిగి,

రణముసాగింప బెదరెను, రాక్షసాళి!

పాహి భద్రాద్రి శ్రీరామభద్ర శరణు!

79

లంకహడలెత్తె, రాకాసిబింకమణగె,

మాయమర్మంబు సాగక మడిసిరంత

రావణుడు నీదు బాణాగ్ని రయముజెందె

పాహి భద్రాద్రి శ్రీరామభద్ర శరణు!

80*

సకలభువనాలు కీర్తించె జయమటంచు

అగ్గి నికషలో భూజాత నిగ్గు దేలె!

ప్రజలుమెచ్చ పాలించిన ప్రభుడ వీవు!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు!

81*

అవనిజాత పవిత్రురాలనియె శివుడు

అగ్నిదేవుడు స్తుతియించె, నంతకపుల

సంబరాలతో పులకించె నంబరంబు!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు!

82*

తిరిగి వచ్చుదారి సముద్ర తీర మందు

సమరదోషంబు హరియింప సాంబశివుని

నిల్పి, గొల్వరామేశ్వర నిలయ మలరె!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు!

83*

భువిశివాంశసంభూతుడై పుట్టె హనుమ!

దాసుడైగొల్చె నీవు సదాశివున్ని,

భక్తి నర్చింప నానంద బ్రహ్మమయ్యె!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు!

84*

పుష్ఫకంబెక్కియునయోధ్యపురముజేరి

భరతుగాపాడి రాజ్యంబు పదిలపరచు,

ప్రజలు మెచ్చ పాలించిన ప్రభుడ వీవు!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు!

85*

జనులు పట్టాభిషేకంబు జరుగ జూచి,

మిగుల సంతోషమందిరి మిథిలజనులు

ధరణి పాడిపంటలు హెచ్చె, ధర్మమూర్తి!

పాహి భద్రాద్రి శ్రీరామభద్ర శరణు!

86*

దొంగసోమకుడు చదువు దొంగిలింప

మత్స్య రూపెత్తి వానిని మట్టుబెట్టి

విద్యలను బ్రహ్మకిచ్చిన వేదవేద్య!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

87*

సురలు పాలకడలి జిల్కి సుధను పొంద

మంధరము కవ్వమైమున్గె మథనక్రియకు

దాని నెత్తిన కూర్మావతారమూర్తి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

88*

దుష్టబుద్ధి హిరణ్యాక్షు ద్రుంచి పృథ్వి

పీడవదలించి, జనులను ప్రీతిబ్రోవ

వేడ్క నాదివరాహమై వెలసినావు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

90*

తనకె పూజాధికములను దైత్య కశిపు

సంహరింప విచిత్ర నరసింహ రూపు –

దాల్చి ప్రహ్లాదు గాచిన ధర్మతేజ!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

91*

భువిని దివిని త్రివిక్రమ స్ఫూర్తి నిండి

దాన గుణశీలి బలిని పాతాళమంపి

అసుర హింసమాన్పిన వామనావతార!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

92

మూర్ఖనృపుల జంపుచు నిర్వదొక్కమార్లు

తండ్రికిని జేసితివి రక్తతర్పణంబు!

ధరణి దానంబు నిచ్చిన పరశురామ!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

92*

అన్నదాతలే పౌరులు – ఆకలెచట?

అన్నమో రామ చంద్రన్న యంతదొరుకు,

రాజ్య ప్రజకు నిరతమునీ రక్షబిక్ష!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

93*

రావణాదుల ద్రుంచి ధర్మంబు నిలిపి

సకల ధర్మాలు తగురీతి సంస్కరించి,

విధిగ సామాన్యు మాటకే విలువ నిడిన,

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

94*

శత్రు సోదరుల్ నినుజేరి శరణువేడ,

నీదు సోదరుల్ నీవెంట నిల్చిరంత!

విశ్వ సౌజన్య మూర్తివో, విజిత దనుజ!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

95*

గరుడ గమన సర్వేశ్వరా! కరుణసాంద్ర!

పతితపావన! పరబ్రహ్మ! పరమపురుష!

నిత్య మంగళదాయక! నీరజాక్ష!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

96*

తొలుత భద్రుండు నినుభక్తితోజపించి

కోరివిష్ణురూపునగాంచి కొండపైన

వెలసి జనుల రక్షింపగా వేడుకొనియె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

97*

భద్రు పేరప్రఖ్యాత భద్రాద్రియయ్యె!

పుణ్య తీర్థమై-క్షేత్రమై పుడమి యందు

భక్త జనసుఖ శాంతికి బాటయయ్యె!

పాహి భద్రాద్రి శ్రీ రామభద్ర శరణు!

98*

దేవి వామాంకముననుండ దేవదేవ!

నాల్గు చేతుల నీరూపు నలరు చుండు!

దినము నీవైభవము భువి దివ్యదీప్తి!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు

99*

తాళ్లపాక దమ్మక్కను భక్తురాలు –

స్వప్నమునగాంచి నినుజేరి సంతసించె

అపర శబరిగా నీభక్తియందుదేలె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

100*

తృప్తి గామ్రొక్కి యర్పించె తులసి దళము

ప్రథమ నైవేద్యముగ తాళఫలమొసంగె

యిప్పపూప్రసాదము బంచె మెప్పుబొందె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

101*

దాపునేపారు పుణ్య గోదారిగంగ

భక్తితో స్నానమీజన్మ పావనమ్ము

పుణ్య ప్రకృతి యందించు పూజనిధులు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు

102*

తీర్థయాత్రసాగెను జన్మ సార్థకముగ

తరలివచ్చి గోపన్న నీదాసుడగుచు

యిచ్ఛ గుడిగట్టి నైవేద్యమిచ్చి మ్రొక్కె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

103

రామదాసు గట్టిన మందిరంబు నగలు

నేటి సకలోత్సవాలకు నేడుగడగ –

వెలసె నీజ్ఞానమందిరమ్, వేడ్కనొసగె!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

104*

జగతి కళ్యాణ వైభవ ప్రగతి గాంచి-

ప్రభుత సదుపాయముల నూత్న పథక రచన

నిత్య కైంకర్యములు సాగె, నిండు భక్తి

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

105*

రామదాసుని సాహితీ నామకీర్తి

పాట, పద్యంబుల మిగుల ప్రస్తుతించి,

పూర్ణ భక్తి పరీక్ష నుత్తీర్ణుడయ్యె

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

106*

తీపి తెలుగు బోధకుడ తిరుణహరి,

సత్య నారాయణుడ భక్తి శతకమిచ్చి

పూజ జేసిమ్రొక్కితి పూర్వ పుణ్యముగను

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

107*

దయను జూపు విశ్రాంతయధ్యాపకుడను

నాల్గుపదుల కృతులనిస్తి నమ్రతెసగ

విఘ్న దోషాదలెడబాపు విజయమిత్ర!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

108*

శుభము శతకపాఠకులకు శుభప్రదంబు!

శుభము నీభక్త జనులకు సుఖము శాంతి!

శుభము భారత జాతికి శుభయశంబు!

పాహి భద్రాద్రి శ్రీరామ భద్ర శరణు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page