
శ్రీ శ్రీ శ్రీ కమనపురపు ఆదివరాహ స్వామి శతకము
(తే.గీ.)
1*
శ్రీలుజిందు నీరూపంబు చిత్తమందు
నిలిపి నీరూపు భావింతు దివ్యతేజ!
నిత్య విద్యుక్త సేవయే నీదు పూజ!
పాహి కమనపురాది వరాహరూప!
2*
శిష్టులను గాచి దుష్టులశిక్ష జేయు
అవని ధర్మంబు నిల్పగా నవతరించు
వివిధ రూపు విహరించు విష్ణుమూర్తి!
పాహి కమనపురాది వరాహ రూప!
3*
మూడుమూర్తుల నీలీల మురియు జగము
ముగ్గురమ్మల దలపోయ ముక్తిదమ్ము!
కాల చక్రంబు ద్రిప్పెడు కర్మ సాక్షి!
పాహి కమనపురాది వరాహ రూప!
4*
పూజ్య పితరులు గురు కవి పుంగవులను
దలచి ప్రార్థించి యిలవేల్పు గొలిచి నీదు
శతకము ను జెప్పబూనితి శక్తి నిమ్ము!
పాహి కమనపురాది వరాహ రూప!
5*
భక్తి భావ సుధాగాన భజన సాగు
సాధు సంఘంబు కీర్తింప సరసిజాక్ష!
సహనమొసగి సంరక్షించు సత్యదేవ!
పాహి కమనపురాది వరాహ రూప!
6*
సాధు సజ్జన మందార! సచ్చరిత్ర!
విశ్వ, విశ్వశాంతాకార! వివిధరూప!
భక్త వైరాగ్యమారోగ్య భాగ్యమొసగు!
పాహి కమనపురాది వరాహరూప!
7*
వావిలాల వాస్తవ్యులై వాసిగాంచు
వెంకటయ్య సీతమ్మల వేడ్క సుతుడ!
తిరుణహరి సత్యనారన చిహ్నితుడను!
పాహి కమనపురాది వరాహరూప!
8*
దేశి చందాన నీదివ్య లీలలొప్ప
శక్తి మేరకు యత్నింతు శతకమలర-
తోచినంతగ నుతియింతు దోషమెఱుగ!
పాహి కమనపురాది వరాహ రూప!
9*
ధర్మ జయశబ్ధముల మధ్య ధర్మరాజు
జయము సూచించె నీగీత జగతి వేద
నిధిని మధియింప నవనీత సుధయె గీత!
పాహి కమనపురాది వరాహరూప!
10*
నిత్య పారాయణము గీత నిన్ను జేర్చు!
జన్మరాహిత్యమిహలో కజనహితమ్ము!
కడుగు కలికాలదోషమ్ము గరుడ గమన!
పాహి కమనపురాది వరాహరూప!
11*
దుష్టదానవ మర్ధన దురితదూర!
శిష్టమానవోద్ధారక! శీఘ్రగమన!
ఇష్ట కామ్యార్థ సిద్ధిని యిమ్ముదేవ!
పాహి కమనపురాది వరాహ రూప!
12*
ఆది మధ్యాంత రహిత విశ్వాత్మ రూప!
సత్య శివ సుందరాకార నిత్యసేవ్య!
జీవ జీవనాధార! రాజీవనేత్ర!
పాహి కమనపురాది వరాహ రూప!
13*
బాల్యమున నీదు భక్తిని”వాసుదేవ”
శతక పద్యంబులల్లితి శక్తిమేర!
సామి నీయాజ్ఞ యత్నింతు శతకశతము!
పాహి కమనపురాది వరాహ రూప!
14*
“పావనీ మంత్రపురిధామ భావి బ్రహ్మ”
కొండ గట్టేశ! మమ్మేలుకో హరీశ!
యనెడు శతకాంజలి దల్చితాంజనేయు!
పాహి కమనపురాది వరాహ రూప!
15*
భక్త జనపోశ! మారేడు బాకవాస!
పాహి నాగుల మల్లేశ! పాపనాశ!
సీసపద్యార్చనయు సాగె శివుని మ్రోల!
పాహి కమనపురాది వరాహ రూప!
16*
భక్తి లౌకిక విజ్ఞాన భావఝరుల
సాగె” సాధుజనతరంగ సత్యగంగ”
గంగయాచారినచ్చుగాగ కాన్క!
పాహి కమనపురాది వరాహరూప!
17*
బడలి శోకాబ్ధి సుడివడు పుడమి జనుల
భక్తి నావలో దరిజేర్చు ముక్తిధాత!
గడువు తీరునందాకేడుగడవు నీవె!
పాహి కమనపురాది వరాహరూప!
18*
జలధి సోమకాసురుజంపి జనులు బొగడ
వేదములనుద్ధరించియు-విధికినిడగ-
మత్స్యరూపంబు దాల్చిన మహిత చరిత!
పాహి కమనపురాది వరాహరూప!
19*
పాల సంద్రాన కవ్వపు పర్వతంబు
కృగి పోకుండ మోసిన కూర్మరూప!
సధలు సురలకే పంచిన సూత్రధారి!
పాహి కమనపురాది వరాహరూప!
20*
పూని క్రూరవిహారాల పుడమిజుట్టి
సాధు జీవుల హింసింప సాగు క్రోధి
కనకనేత్రుని ద్రుంచిన కమలనయన!
పాహి కమనపురాది వరాహరూప!
21*
డింబకుడు తండ్రి జూపు కంబంబు వెడలి
ఉగ్ర నరసింహస్వామివై యుర్వి గనక
కశ్యపుని జీల్చితివి వాని గడపపైనె!
పాహి కమనపురాది వరాహ రూప!
22*
టక్కుడెక్కుల రాజుల తెగటార్చి విధిగ
తండ్రికిచ్చితివి తద్రక్త తర్పణాలు
పరశు రామావతారివై పరగవెలయు
పాహి కమనపురాది వరాహ రూప!
23*
రావణుడు సీత చెఱబట్టె రామబాణ
లక్ష్యమునగూలె రాకాశి లంకబొగడె!
జగమునేలె శ్రీరామ సౌజన్య మూర్తి!
పాహి కమనపురాది వరాహ రూప!
24*
విపుల గీతాప్రబోధార్థ వివరమడిగి
విశ్వరూపు గాంచి నరుడు విజయుడయ్యె!
ధర్మ రక్షక! శ్రీకృష్ణ! ధరణి నాథ!
పాహి కమనపురాది వరాహ రూప!
25*
నాగలినిదాల్చి నదిజీల్చి సాగు నీరు
ప్రజల కిచ్చి గాపాడిన ప్రభుడ! రాచ
మల్లయోధగురు బలరామావ తారమూర్తి
పాహి కమనపురాది వరాహ రూప!
26*
శివుడు త్రిపురాసురలజంపు తీరులరసి
జనుల దారిమల్లించియు జగతి బ్రోవ-
బుద్ధ రూపంబు దాల్చిన బుధవిచార!
పాహి కమనపురాది వరాహరూప!
27*
కలిని నరరూప రాక్షసుల్ కలిగిరవని
కరువు నధిక జనాభతో కలతగలిగె
కట్టడినిజేయగారమ్ము కలికికిరూప!
పాహి కమనపురాది వరాహరూప!
28*
లోక జీవన క్రియల లోపమరసి
శోక హేతుభూతముదెల్ప సుఖము శాంతి!
పుడమి హింసమాన్పిన శాక్యబుద్ధ దేవ!
పాహి కమనపురాది వరాహరూప!
29*
పాలపుంతాబ్ధి గ్రహరాశి ప్రభవ చరిత
కూర్మి లక్ష్మియు నినుగూడె కురిసె సుధలు!
నేల విజ్ఞాన పరిశోధనాలయముగ!
పాహి కమనపురాది వరాహరూప!
30*
ప్రజలు కనకాక్షు వీక్షించి భయముజెంది
చాప జుట్టిన చందాన చావు పరుగు-
లెత్తి మొరవెట్టగా పృథ్వినెత్తినావు!
పాహి కమనపురాది వరాహరూప!
31*
తత్వమరయ నీదు దశావతారలీల
సృష్టి పరిణామక్రమమందు స్పష్టమంద్రు
నూత్న జీవశాస్త్రపు గుప్త సూత్రనిధియె!
పాహి కమనపురాది వరాహ రూప!
32*
స్వామివేణు గోపాల దేవాలయంపు
పూర్వ దిశ నీవు నెలకొన్న పూతశిలను
వెలిగె నీభక్తి దీపమ్ము వేడ్క గూర్చె!
పాహి కమనపురాది వరాహ రూప!
33*
అరయ పడమర శిలపీఠి కమరె మెట్లు
నిండు గొడుగులై చెట్లుండె నీదురూపు
కనగ వినగ నీభక్తుల కనులు చెమరె!
పాహి కమనపురాది వరాహ రూప!
34*
ఊరి జనులంత యింటింట పేరుదాల్చి
తలచినట్లుగా బిలుతురు తరతరాలు
కోరి యిలవేల్పుగా నిన్ను గొలిచిరంత!
పాహి కమనపురాది వరాహ రూప!
35*
చిత్రము శిల్పమయ్యెనట విచిత్రచరిత
చెదరి కేశముల్ మృదువుగా చెదరి తాకె
ననిరి తాతలు నీభక్తి జనిరి దివికి
పాహి కమనపురాది వరాహ రూప!
36*
జమ్మి మొక్కలు పొదలపై జడలతీగ
నడువ దారియేర్పడెనొక్కయడుగు మేర!
నీదు భక్త ప్రదక్షణ నిష్ఠవెలసె!
పాహి కమనపురాది వరాహరూప!
37*
స్వప్నమున నూరు పెద్దకు సమ్మతముగ
మందిరము లేక మండపమచటనిలుప
కోరితివటంచు వేడ్క నీకోర్కెదెలిపె!
పాహి కమనపురాది వరాహరూప!
38*
మాట నిలబెట్టుకొనెనేమొ మండపంబు
పూజ పునరుద్ధరించెనో పున్నెమొప్ప!
కొన్ని నాళ్ళుండి దీపమై కొండకెక్కె!
పాహి కమనపురాది వరాహరూప!
39*
నాటి వైభవములగుర్తు నాల్క పైన-
మాత్రమే మరినేటికి మండపంబు
వెలయుమార్గాన నభివృద్ధి విస్తరించె!
పాహి కమనపురాది వరాహరూప!
40*
వత్తురనుకోని భక్తులు వచ్చి పోవ!
చేతురనుకోని సేవలు చేసిరనగ!
పరిసరాకృతి మారె శ్రీపాద మహిమ!
పాహి కమనపురాది వరాహరూప!
41*
పూలు, నైవేద్యముల నీదు పూజేసి
మేటి భక్తి ప్రపత్తుల నేటి తరము
భక్తి పర్యాటనలు సల్పి భజనజేయు!
పాహి కమనపురాది వరాహ రూప!
పాహి కమనపురాది వరాహ రూప!
42*
గ్రుడ్డివాడు జూసె నడిచె కుంటి వాడు
మూగమాటాడె నినుజేరిమూఢ జనుడు
నీదు కృపచేత ఘనడయ్యె నిండు భక్తి!
పాహి కమనపురాది వరాహ రూప!
43*
అవని తలిదండ్రి గరుపెద్దలతిథి సేవ!
ధర్మ సూక్ష్మ మెఱుంగగా దారులనిరి!
వెలయు పత్రియె కొండంత వేల్పుకైన!
పాహి కమనపురాది వరాహ రూప!
*(మంచి చెడుప్రస్తావన గీతులు)
44*
కూడు గూడు గుడ్డయు తోడు నీడ
ఉండి లేముల కలబోత గుండె దిగులు
దీర్చు దివ్యౌషధము భక్తి దివిజ వరము!
పాహి కమనపురాది వరాహ రూప!
45*
మనిషి వాచికాద్యభినయ మనుకరించు
మంచి నటుడై జనావళి మనసు గెలుచు
బుద్ధి ననుకరించియు మార్పు బూను కొనడు!
పాహి కమనపురాది వరాహ రూప!
46*
మంచిపని పుణ్యమగు పాపమగును చెడుగు
స్వర్గ నరక నిర్ణయ తీర్పు సాక్షులివియె!
నరుడు చెడుగైన నిహలోక నరకమగును!
పాహి కమనపురాది వరాహరూప!
47*
ఖలుడు తనదాక వస్తెనే తలను వంచు
నడుమ తలదాకీవస్తెనే నడుము వంచు
చివర కాలుకాటికిజాచు చితి దహించు!
పాహి కమనపురాది వరాహరూప!
48*
తప్పు తప్పే చెడినఫలితమ్ము ముప్పు!
ముందె తనతప్పునెఱిగిన ముప్పు దప్పు!
తెలిసి తెలియనిదగుమాట దేల్చ వృధయె!
పాహి కమనపురాది వరాహరూప!
49*
విహిత రహితుండు వేదించు వీలువెంట
మార్పు నెదిరించి వాదించు నేర్పుకొలది
తరతరాల రాగింగొక టర్మిదనును!
పాహి కమనపురాది వరాహరూప!
50*
ఎదుటి గనినవ్వు హేళన బెదరగొట్టు
వెక్కిరింపుల తిమ్మడై ఎక్కి దూకు!
తోకబోయినా-బుద్ది బోనీక నరుడు!
పాహి కమనపురాది వరాహరూప!
51*
తోటివాని త్రోసి, బతుకు త్రోవ మార్చి
సాటివాని సాధించియు చట్ట పరిధి!
పోటి యీటె గాడటు నొక పోటు వేయు!
పాహి కమనపురాది వరాహ రూప!
52*
నీతి నియమనిబంధన రీతులన్ని
పరువు నిలబెట్టు, భువి ప్రజా ప్రగతి మెట్లు
యుద్ధ విశ్రాంతి సంక్రాంతి యుర్విశాంతి!
పాహి కమనపురాది వరాహ రూప!
53*
చపల చిత్తము ప్రవహించు జలమబోలు
నడుగు వస్తువు జూడ నలవిగాదు!
చిత్రపటములాగ స్థిరచిత్తమొప్పు!
పాహి కమనపురాది వరాహ రూప!
54*
ఎదుటిగన నీర్ష మది నేకుమేకుగాగ
యెదను నాటు-రుధిర పోటు మెదడు దొలుచు
మోయభారము మొదటికే మోసమొచ్చు!
పాహి కమనపురాది వరాహ రూప!
55*
మనసులేని వాని మంచివాడనలేము
మనిషి మనిషిగలుపు మంచి మనసు!
మనసు గెచిచి మనిషి మారుమనీషిగా
పాహి కమనపురివరాహ రూప!
56*
హామి పేదకభయ హస్తంబు నార్థిక
హామి రాచకీయ శస్త్రమంద్రు!
హామి-లేమి- జనుల కాత్మసౌఖ్యము గూర్చు!
పాహి కమనపురి వరాహరూప!
57*
తల్లిదండ్రి సాక్షి తప్పఁ దేహము వృధా
గురుని సాక్షి దప్పఁ గుండె గుబులు
దైవ సాక్షి దప్ప ధర్మంబు పడిపోవు!
పాహి కమనపురి వరాహరూప!
58*
కాని కాలపు కొఱగాని కార్యంబులు
కర్త జెరచు పిదప కర్మ జెరచు!
బ్రతుకు జెరచు కడకు కథ కంచికేగగా
పాహి కమనపురి వరాహరూప!
59*
మంచి చెడులె జన్మ సంచితార్థములంద్రు
కర్మనుసరించి కలుగు జన్మ
నీదు కల్పనలకు నిర్ధేశ్యమీసృష్టి!
పాహి కమనపురి వరాహరూప!
60*
కర్మ మర్మ మెఱుగు కాలజ్ఞుడవు నీవు
పాప పుణ్య గతుల ప్రాపు నీది!
మాయ తెరలుజీల్చు మార్గమే నీభక్తి!
పాహి కమనపురి వరాహరూప!
61*
నిత్యధర్మమొప్పు నిష్కామ కర్మలో
పక్షపాత రహిత పథము నందు
ధర్మమునకు సాటి ధర్మమే భువిలోన
పాహి కమనపురి వరాహ రూప!
62*
కర్మమార్గమందు కర్తవ్యపాలనే
ధర్మమగును నితర ధర్మమరయ
భయముగూర్చు, నహపు భ్రమలందు బడవేయు
పాహి కమనపురి వరాహ రూప!
63*
మనసు శుద్ధి నరుడు, ఘనత వహించును
మాట శుద్ధి లోకమాన్యుజేయు
కర్మ శుద్ధి గలుగ కార్యశూరుండగు
పాహి కమనపురి వరాహ రూప!
64*
తీర్చి దిద్ధునరుని త్రికరణ శుద్ధియే
కానివేళ బ్రతుకు కఠినమైన
సాధువర్తనంబె సాధించు సకలమ్ము
పాహి కమనపురి వరాహ రూప!
65*
మనసు లేనివాడె మానవాధముడయ్యె
పలికి బొంకువాడె పరమపాపి
దుష్టకర్ముడవని దుర్మార్గుడైచను
పాహి కమనపురి వరాహ రూప!
66*
మనసుననుసరించి మనువు సంప్రాప్తించు
మాటననుసరించి మనుగడెసగు!
కర్మననుసరించి కలుగు జీవనయాత్ర!
పాహి కమనపురి వరాహరూప!
67*
మంచి మనసు మనిషి మహనీయుగాజేయు
మంచిమాట భువి మహాత్ము జేయు
మంచి కర్మ ఫలమె మానవోత్తము జేయు
పాహి కమనపురి వరాహ రూప!
68*
మనిషి బుద్ధి కర్మననుసరించు నవని
కర్మఫలమె బ్రతుకు కారకమ్ము!
మంచిచెడుల, మంచి, సంచరించగ మేలు!
పాహి కమనపురి వరాహ రూప!
69*
మనసు విప్పి భక్తి మార్గమన్వేషించు
మాటగుప్పి భక్తి బాటవేయు
కర్మయోగి భక్తి కలిమి లేమి మరచు!
పాహి కమనపురి వరాహ రూప!
70*
మంచి మనసునిచ్చి మన్నించుమో స్వామి!
మాట పలుకుబడుల మంచి గూర్చు!
మంచి కర్మ లందు మళ్ళించి దీవించు!
పాహి కమనపురి వరాహ రూప!
71*
అదుపు జేయు వలయు నైదింద్రయమ్ముల
నంతరింద్రియమది యణచ సుళువు!
నపుడు నంతరాత్మ నరయనానందమౌ!
పాహి కమనపురి వరాహ రూప!
72*
ఆత్మ వృత్తము పరమాత్మవృత్తముజుట్టి
యుండు మాయతెరల నిండు ముసుగు
గురుని కృపయుగల్గ, గుర్తుదెల్యగ వీలు!
పాహి కమనపురి వరాహ రూప!
73*
ద్వైతమయ్యె పిదప నద్వైత శ్రేష్ఠమై
తనువు ప్రాణ శక్తి తళుకు దెలుపు
ఆత్మయు-పరమాత్మ లాచార్యత్రయసూక్తి
పాహి కమనపురి వరాహ రూప!
74*
అన్నిజీవులందు నాత్మ దీపించును
ఆత్నలేని జీవియ యవనిగలదె?
ఎంచిచూడ గలుగు నేకాత్మ భావమ్ము!
పాహి కమనపురి వరాహ రూప!
75*
మాయ గతుల కీడ్చు మార్గపు ద్వంద్వముల్
వెన్నుజరచి వెంట వెఱగు పరచు!
చితికి జేర్చు చివర శీతోష్ణ ప్రకృతుల్
పాహి కమనపురి వరాహ రూప!
76*
పట్టి విడుచువాడు పరమాత్మ నెఱుగడు
పట్టు పురుగులాగ పట్టువడడె!
కాయలోనె తనదు కాయమ్ము వీడడా!
పాహి కమనపురి వరాహరూప!
77*
పట్టుకారు బట్టు గట్టిగా వస్తువుల్
పట్టుకొన్న చేయి బట్టుకొనునె!
పట్టి విడనివాడె పరమాత్మ మదినమ్ము!
పాహి కమనపురి వరాహరూప!
78*
శుష్క ప్రియములాడి శూన్య హస్తాలతో
సోమరి నరుడింక సొమ్ము లాగు!
సోకు గాడు జాస్తి సోకోర్చ నేరునా?
పాహి కమనపురి వరాహరూప!
79*
తగిన సాక్షి నమ్ము తగవు నిరూపణ
న్యాయవాదినమ్ము నయజయమ్ము!
ధర్మ రక్షకొఱకె ధరణి నేరము-శిక్ష!
పాహి కమనపురి వరాహరూప!
80*
జీవతారకమ్ము గీతార్థ సారము
త్యాగమొప్పు నరుడు తాత్వికుండు!
విశ్వ సూత్రధారి విశ్వాస పాత్రుడు!
పాహి కమనపురి వరాహరూప!
81*
కలిమి నాడుగన్న కలవారి కలలన్ని-
లేమినాటికన్ని లేనివయ్యె!
కలిమి లేములెపుడు కావడికుండలే!
పాహి కమనపురి వరాహ రూప!
82*
సొమ్మునీది నాది సోకుమరొకరిదీ-
నమ్ముకొన్న జూపు నరకదారి!
మాయకుండు భువినమాయకు వంచించు!
పాహి కమనపురి వరాహ రూప!
83*
డబ్బువలన డాబు డబ్బువలన జబ్బు
డబ్బుమేర వెసన మబ్బునేడు
డబ్బులేని వాడు డుబ్బుకు కొఱగాడు
పాహి కమనపురి వరాహ రూప!
84*
ధనము కన్న మానధనముచే మరియాద
ధరను సుస్థిరమ్ము దరచి చూడ
మంచి వారికెల్ల మానమే ప్రాణము
పాహి కమనపురి వరాహ రూప!
85*
కలిమిచేత బలము బలముచే బలగమ్ము
కలుగు లేమినాడు కరిగి పోవు
కర్మ కాటు కాలఖర్మగా రూపొందు!
పాహి కమనపురి వరాహ రూప!
86*
నమ్ముకొన్నవాని నట్టేటముంచెడు
అరువు కన్న నగదు యవనిమేలు!
పరువుగోరువారి కరువు బరువు చేటు!
పాహి కమనపురి వరాహరూప!
87*
నమ్మకంబు మంచి నడవడి తోబుట్టు
సేవ భావములకు జీవనాడి! విశ్వ నరుని నడుపు విశ్వాసమే సదా!
పాహి కమనపురి వరాహరూప!
88*
ఇచ్చి పుచ్చుకొనుట యిహలోక మర్యాద
తప్పు నడక బ్రతుకు తప్పు తడక!
వాస్తవమ్ములెపుడు వాదులాటలె కదా!
పాహి కమనపురి వరాహరూప!
89*
మాట విలువదెలుపు మనపురాణములన్ని
నీతి లేని మాట నీటిమూట!
జిహ్వజారి నరుడు జిమ్మెదారిగ మారు!
పాహి కమనపురి వరాహరూప!
90*
గృహములందు సాధు మృగము విలువ బెరిగె
మనిషి విలువదరిగె – మనసు విరిగె!
బేధమరయ గొప్పఖేదమ్ము తలజూపె!
పాహి కమనపురి వరాహరూప!
91*
శ్రద్ధ వలనవిద్య వర్ధిల్లు వసుధలో
శక్తి యుక్తి భుక్తి రక్తి బ్రతుకు
భక్తి వలన ముక్తి బ్రహ్మమోదము గల్గు
పాహి కమనపురి వరాహరూప!
92*
పరగనండ పిండ బ్రహ్మాండముల నిండు
ప్రణవ శబ్ధబ్రహ్మ! ప్రణయరూప!
ప్రళయకాల రుద్ర! పరమపితవునీవె!
పాహి కమనపురి వరాహ రూప!
93*
నలువ నాల్క నుండు నళినాక్షి వాగ్దేవి
శివునిలోన సగము శివభవాని
నీదు వక్షమందు నివసించు శ్రీదేవి
పాహి కమనపుర వరాహ రూప!
94*
జనుల – మరణభీతి జడిపించు నిరతమ్ము
ప్రాణతీపి మరిగె ప్రాణికోటి!
విత్తకాంక్ష బెరుగ విశ్వ శాంతిని మరచె!
పాహి కమనపుర వరాహ రూప!
95*
భక్తి భావఝరుల బ్రమవీడి పోవగా
స్థిమిత మిచ్చిబ్రోవు చిద్విలాస!
మానవాళి సేవ! మాధవా! నీసేవ!
పాహి కమనపురి వరాహ రూప!
96*
కర్మయోగి లోక కళ్యాణ కర్తవై
కదలిరమ్ము మమ్ము వదలబోకు!
తేజమొసగు బ్రతుకు తెల్లారు లోపలే!
పాహి కమనపురి వరాహరూప!
97*
భిన్న జాతి మత విభిన్న జీవనదారి
గమ్యమీవె! – తారతమ్యమీవె!
ధర్మవృత్తకేంద్ర దత్తబిందువు నీవె!
పాహి కమనపురి వరాహరూప!
98*
నీతి సూక్తపు నవనీత చోరుడవీవు!
పెరుగు చల్లలుంచి పెరుగు పాప
వ్యాధి మాన్పు వైద్య వాసుదేవుడ వీవు!
పాహి కమనపురి వరాహరూప!
99*
గోప్య గతులు నీవి-గోపికా వల్లభా
చోద్యమొప్పు చిత్తచోర కథలు!
భావరుగ్మతలకు భారి చికిత్సలు!
పాహి కమనపురి వరాహరూప!
100*
కొడుకు కొఱకు తండ్రినోడించు రాజులు-
తండ్రికొఱకు కొడుకు దరుము నృపులు-
కడకు నేమి? బ్రతుకు కడతేరి పోయిరి!
పాహి కమనపురి వరాహరూప!
101*
భక్తి గలుగ చిత్త బాధలుడుగ ముక్తి
నీదు నిలయమగును నిశ్చలాత్మ!
త్యాగ బుద్ధికి నిజ తత్వగోచరమగు!
పాహి కమనపురి వరాహ రూప!
102*
దేవ!నిన్నుమరచి దేహమే స్థిరమని
మాయజన్మనెత్త- మరల నాత్మ
తనకుతానె జిక్కి తరలు జన్మింపగన్
పాహి కమనపురి వరాహ రూప!
103*
మనసు మర్మ మెఱుగ మనిషికి సాధ్యమా?
తనరు నీదుశక్తి – తనువు మనసు
సూత్రమీవె! నీతి సూక్తి ముక్తావళిన్
పాహి కమనపురి వరాహ రూప!
104*
చిత్త మందు చింత – విత్తమందాపేక్ష
ఈగకన్న తేనెటీగ మేలు!
క్రొత్తబ్రతుకు తెట్టె కొండెక్కిగట్టును
పాహి కమనపురి వరాహ రూప!
105*
నిన్న నేడు రేపు లున్నదాకను సృష్టి
కర్త కర్మ క్రియలు కల్పమనగ
సాగుచుండు ప్రళయకాలంబు దాకను!
పాహి కమనపురి వరాహ రూప!
106*
అద్భుతమగు బ్రతుకు బుద్భుదంబును బోలు
విద్యచేత బుద్ధి విస్తరించు!
తాత్వికుండు భక్తి తరియించు ముక్తుడై
పాహి కమనపురి వరాహ రూప!
107*
నీదురూపు గన్న నిరతమోదము గల్గు!
నామజపము గూర్చు నయముజయము
నీదుభక్తి భువిని నిఖిలకీర్తి కరము!
పాహి కమనపురి వరాహ రూప!
108*
శుభము నిచ్చు రూపు! సుఖజీవనము జూపు!
శుభము నీదు భక్తి సూక్తి శుభము!
శతక పఠన చేత సంతృప్తి సమకూర్చు
పాహి కమనపురి వరాహ రూప!